కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నెదర్లాండ్స్‌లోని అన్ని రకాల ప్రజలకు సహాయం చేయటం

నెదర్లాండ్స్‌లోని అన్ని రకాల ప్రజలకు సహాయం చేయటం

రాజ్య ప్రచారకుల నివేదిక

నెదర్లాండ్స్‌లోని అన్ని రకాల ప్రజలకు సహాయం చేయటం

అబ్రాహాము అసాధారణమైన విశ్వాసం ఉన్న వ్యక్తి. “అబ్రాహాము పిలువబడినప్పుడు” ఆయన దేవుని మాటకు విధేయత చూపుతూ, “ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. తన కుటుంబాన్నంతటినీ తరలించిన తర్వాత అబ్రాహాము తన జీవితంలోని మిగిలిన వంద సంవత్సరాలు, “అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పర[వాసిగా]” జీవించాడు.—హెబ్రీయులు 11:8, 9.

అదే విధంగా నేడు యెహోవాసాక్షుల్లో అనేకమంది అవసరం ఎక్కువగా ఉన్న చోట్ల సేవ చేయడానికి వేరే దేశానికి వెళ్లడం అనే సవాలును స్వీకరించారు. మరితరులు తమ దేశంలోనికి వలసవచ్చిన విదేశీయులకు సాక్ష్యం ఇవ్వడం కోసం వేరే భాషను నేర్చుకున్నారు. ఈ క్రింది ఉదాహరణలు చూపిస్తున్నట్లుగా, నెదర్లాండ్స్‌లో “కార్యకలాపానికి నడిపించే పెద్ద ద్వారము” తెరువబడింది, అక్కడ ఉన్న కోటీ యాభై లక్షల మంది జనాభాలో దాదాపు పది లక్షల మంది వేరే ప్రాంతాల నుండి వచ్చినవారే.—1 కొరింథీయులు 16:9, NW.

◻ బారామ్‌ అనే పేరుగల ఒక మాజీ కుంగ్‌ ఫూ ఇన్‌స్ట్రక్టర్‌ మధ్యప్రాచ్యంలోని ఒక దేశం నుండి వచ్చాడు. ఆయన బైబిలునూ కొన్ని వాచ్‌ టవర్‌ ప్రచురణలనూ తీసుకున్నాడు. ఒక నెలలోనే, తాను సత్యాన్ని కనుగొన్నానని బారామ్‌ గ్రహించాడు. ఆయనతోను ఆయన భార్యతోను బైబిలు పఠనం ప్రారంభించబడింది, కానీ ఒక సమస్య—వారికి బైబిలును బోధిస్తున్న వ్యక్తికి వారి భాష రాదు. వారు సంజ్ఞలతో మాట్లాడుకున్నారు, దాన్ని గుర్తు చేసుకుంటూ, తాము “చేతులతోను, కాళ్ళతోను” మాట్లాడుకున్నామని వాళ్లు చెబుతున్నారు. కొంతకాలానికి, బారామ్‌, ఆయన భార్య తమ మాతృభాష మాట్లాడేవారున్న సంఘాన్ని కనుగొన్నారు, తర్వాత వారు త్వరితగతిన అభివృద్ధి సాధించారు. బారామ్‌ ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న సాక్షి.

◻ పయినీర్లైన డచ్‌ దంపతులు ఒక సూపర్‌మార్కెట్‌ ఎదురుగా నిల్చున్న ఒక ఇండోనేషియా వ్యక్తిని సమీపించారు. వీరు ఆయనతో తన భాషలో మాట్లాడటం చూసి ఆయనకు ఆశ్చర్యానందాలు కలిగాయి. ఆయన్ను ఆయన ఇంటివద్ద కలవడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆయన రష్యాలో 20 సంవత్సరాలకుపైగానే నివసించాడనీ ఆ కాలంలోనే ఆయన గైనకాలజిస్టు అయ్యాడనీ తెలిసింది. తాను నాస్తికుడనని చెప్పుకుంటున్నప్పటికీ, తాను ప్రసవం సమయంలో సహాయం చేసిన ప్రతీసారీ, “మానవ శరీరం ఎంత పరిపూర్ణంగా ఉంది కదా! ఎంతటి అద్భుతమిది!” అనుకోకుండా ఉండలేకపోయానని ఆయన ఒప్పుకున్నాడు. బైబిలును పఠించడానికి ఆయన ఒప్పుకున్నాడు, మానవజాతిపట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడని ఆయన త్వరలోనే నమ్మడం ప్రారంభించాడు. (1 పేతురు 5:6, 7) ఇప్పుడాయన బాప్తిస్మం పొందిన సహోదరుడు, ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఇండోనేషియన్‌ సంఘంలో సేవచేస్తున్నాడు.

◻ ప్రపంచంలోని అత్యంత పెద్ద ఓడరేవుల్లో ఒకటైన రాటర్‌డామ్‌లో కొంతమంది పయినీర్లు రేవులోనికి ప్రతిరోజు వచ్చే వేర్వేరు భాషలవారికి ప్రకటించటంలో ప్రవీణులయ్యారు. ఈ ఔత్సాహిక గుంపు కార్యకలాపాల ఫలితంగా ఒక కెప్టెన్‌, ఒక సముద్ర అధికారి, ఒక మాజీ బాడీగార్డ్‌తో సహా, సముద్రాలపై పనిచేసే వారనేకమంది సత్యాన్ని స్వీకరించారు. ఇప్పుడు వారు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి సహాయం చేస్తున్నారు.—మత్తయి 24:14.

ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోలానే నెదర్లాండ్స్‌లోని యెహోవాసాక్షులు ప్రతి జనముకూ, ప్రతి వంశానికీ, ఆయా భాషలు మాట్లాడేవారికీ, ప్రతి ప్రజకీ నిత్యసువార్తను ప్రకటించడంలో తమ వంతును తాము నిర్వర్తించటానికి కృతనిశ్చయం చేసుకున్నారు.—ప్రకటన 14:6.