కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పట్టుదల ద్వారా సాఫల్యం

పట్టుదల ద్వారా సాఫల్యం

పట్టుదల ద్వారా సాఫల్యం

ఈ ఆధునిక కాలాల్లో, పట్టుదల అనేది అరుదైన విషయంగా మారింది. ఒక వ్యక్తి యొక్క సాఫల్యం అనేది ఆ వ్యక్తి పట్టుదల చూపించడం మీద కాదు కానీ, ఆ వ్యక్తి సరైన చోట, సరైన సమయంలో ఉండడంపైనే ఆధారపడి ఉంటుందని చాలామంది ప్రజలు నమ్ముతారు. వాళ్ళను ఎవరు తప్పుపట్టగలరు? మీకు కావలసినది ఏదైనా సరే అతి తక్కువ ప్రయత్నంతో, ఇంకా కొంత డబ్బుతో సాధించుకోవచ్చు అనే సందేశాన్ని వాణిజ్య ప్రకటనల స్లోగన్‌లతో నిండిన వార్తామాధ్యమాలు మనకు తెలియకుండానే మన ఇంటికి చేరవేస్తున్నాయి. ఒక్క రాత్రిలో సఫలులైనవారి గురించిన కథలనూ, చదువైన వెంటనే వాణిజ్యంలో సఫలులై లక్షలను ఆర్జిస్తున్నవారి గురించిన కథలనూ వార్తాపత్రికలు ఎడతెగక విస్తృతంగా ప్రచురిస్తున్నాయి.

“ఇలాంటి తలంపులను అంటిపెట్టుకుని ఉన్న ఒక సమాజంలో, గొప్ప కార్యాలను సాధించడం చాలా సులభమన్నట్లుగా అనిపిస్తుంది. . . . దాని కిటుకు ఏమిటో తెలిస్తే, దానికి కావలసిన సామర్థ్యం ఉంటే, దైవిక సహాయముంటే చాలా సులభం అన్నట్లు కనిపిస్తుంది” అని అంటూ కాలమిస్ట్‌ అయిన లెనర్డ్‌ పిట్స్‌ తన బాధను వ్యక్తం చేశారు.

పట్టుదల అంటే ఏమిటి?

పట్టుదల అంటే, ‘ఆటంకాలూ అపజయాలూ ఎదురైనా సరే, ఒక ఉద్దేశాన్ని, ఒక స్థితిని స్థిరంగా అంటిపెట్టుకుని ఉండడం, లేదా ప్రయత్నాన్ని వదులుకోకుండా స్థిరంగా ఉండడం’ అని అర్థం. పట్టుదల అనే మాట ప్రతికూల పరిస్థితుల్లో కూడా కృతనిశ్చయంతో కొనసాగడాన్ని, వదిలిపెట్టకుండా స్థిరంగా ఉండడాన్ని సూచిస్తుంది. బైబిలు ఈ గుణం యొక్క ప్రాముఖ్యతను ఉన్నతపరుస్తుంది. ఉదాహరణకు, ‘ఆయన రాజ్యమును వెదకుతూ ఉండండి,’ “తడుతూ ఉండండి, మీకు తెరువబడుతుంది,” “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి,” “మంచిని విడువకండి” అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది.—మత్తయి 6:33, NW; లూకా 11:9, NW; రోమీయులు 12:12; 1 థెస్సలొనీకయులు 5:21, పరిశుద్ధ బైబల్‌.

పట్టుదలలో ముఖ్యమైన భాగం అనివార్యమైన వైఫల్యాలను భరించడమే. “నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును” అని సామెతలు 24:16 చెబుతుంది. (ఇటాలిక్కులు మావి.) క్లిష్టమైన పరిస్థితులు, లేదా పరాజయాలు ఎదురైనప్పుడు, పట్టుదల గల వ్యక్తి తన ప్రయత్నాలను ‘వదిలిపెట్టే’ బదులు ‘తిరిగి లేస్తాడు,’ ‘తడుతూనే ఉంటాడు,’ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాడు.

అయితే, చాలామంది, తమకు ఎదురు కాగల క్లిష్టమైన పరిస్థితులకూ, పరాజయాలకూ మానసికంగా సిద్ధపడరు. వాళ్ళు పట్టువిడువకుండా చేయాలన్న కోరికను పెంచుకోనందువల్ల తమ లక్ష్యాన్ని త్వరగా వదిలిపెట్టేస్తారు. “చాలా మంది ప్రజలు, పరాజయం ఎదురైనప్పుడు, తమకే హాని కలిగేలా ప్రవర్తిస్తుంటారు. తమపై తాము జాలిపడుతూ, ప్రతి ఒక్కరినీ నిందిస్తూ, కోపంగా ఉంటారు . . . [తమ లక్ష్యాన్ని] వదులుకుంటారు” అని మోర్‌లీ కాలాఘాన్‌ అనే రచయిత అంటున్నారు.

ఇది విచారకరమైన విషయం. “పరీక్షలను ఎదుర్కోవడానికి ఒక కారణం ఉంది, ప్రతికూల పరిస్థితిలో ఉండడానికి కూడా కొంత విలువ ఉంది అన్న విషయాన్ని మరిచిపోతుంటాం” అని పిట్స్‌ అంటున్నారు. ఏమిటా విలువ? అదేమిటంటే, “వైఫల్యం విధి లిఖితమూ కాదు, పరాజయం శాశ్వతమూ కాదు అని గ్రహిస్తారు. లోతైన అవగాహనను పొందుతారు. మానసికంగా సిద్ధమౌతారు” అనే నిర్ధారణకు ఆయన వచ్చారు. బైబిలు సరళంగా ఇలా చెబుతుంది: “ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు.”—సామెతలు 14:23.

నిజమే, ఒకసారి పరిస్థితి తిరగబడిన తర్వాత, మళ్ళీ ఆ పనిచేయబూనడం అనేది అన్నివేళలా అంత సులభం కాదు. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే సవాళ్ళు మనం అన్ని విధాలా ప్రయత్నం చేసినా అధిగమించలేమన్నట్లు అనిపించవచ్చు. మనం గమ్యానికి దగ్గరయ్యే బదులు మరింత దూరమవుతున్నట్లు అనిపించవచ్చు. మనం నిస్సహాయులమనీ, చేతకానివాళ్ళమనీ అనిపించవచ్చు, నిరుత్సాహం చెందవచ్చు, చివరికి మానసికంగా కృంగిపోవచ్చు కూడా. (సామెతలు 24:10) “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము” అని బైబిలు మనలను ప్రోత్సహిస్తుంది. (ఇటాలిక్కులు మావి.)—గలతీయులు 6:9.

మనం పట్టుదలతో ఉండడానికి ఏమి సహాయపడగలదు?

మనం మన గమ్యంలో పట్టుదలగా ఉండడానికి మొదటి మెట్టు ఏంటంటే, మనం యుక్తమైన చేరుకోగల లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని గ్రహించాడనడంలో సందేహం లేదు. “నేను గురి చూడనివానివలె పరిగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు” అని కొరింథీయులతో ఆయన అన్నాడు. తను తన ప్రయత్నాల్లో సఫలుడవ్వాలంటే, తన దృష్టిని లక్ష్య రేఖపైనే నిలుపుకుని తన శక్తినంతా ఉపయోగిస్తూ పందెంలో పరుగెత్తే వ్యక్తిలా, తన లక్ష్యాలు ఏమిటో తనకు స్పష్టంగా ఉండాలని పౌలుకు తెలుసు. “పందెపు రంగమందు పరుగెత్తు వారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి” అని పౌలు వారిని ఉద్బోధించాడు. (1 కొరింథీయులు 9:24, 26, 27) మనం లక్ష్యాన్ని చేరుకునేలా ఎలా పరుగెట్టవచ్చు?

“వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును” అని సామెతలు 14:15 చెబుతుంది. మనం ఎటువైపుగా పయనిస్తున్నాం, ఏమైన సవరింపులు చేసుకోవలసిన అవసరముందా అని ప్రశ్నించుకుంటూ మనం మన జీవితంలోని పథకాలను అప్పుడప్పుడు మదింపు చేసుకుంటూ ఉండడం వివేకం. మనం ఏ కార్యాలను ఎందుకు సాధించాలనుకుంటున్నాం అన్న విషయం మనస్సులో స్పష్టంగా ఉండడం ప్రాముఖ్యం. మన చివరి లక్ష్యం ఏమిటన్నది మన మనస్సులో స్థిరంగా ఉంటే, మనం దాన్ని వదిలిపెట్టడానికి చాలా తక్కువగా మ్రొగ్గు చూపుతాం. “నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా. . . చూడవలెను. . . . అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును” అని ప్రేరేపిత సామెత చెబుతోంది.—సామెతలు 4:25, 26.

మీ గమ్యాలు ఏమిటో గుర్తించాక, వాటిని చేరుకోవడం ఎలా అన్నది విశ్లేషించడమే రెండవ మెట్టు. “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?” అని యేసు ప్రశ్నించాడు. (లూకా 14:28) ఒక మానసిక ఆరోగ్య నిపుణుడు అన్న మాటలు ఈ సూత్రానికి అనుగుణ్యంగా ఉన్నాయి. “సఫలీకృతులైన వ్యక్తుల్లో నేను గమనించిన ఒక విషయమేమిటంటే, సాఫల్యానికి ఏది దారితీస్తుంది, తమ జీవితాల్లో అది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే దాన్ని గురించి వాళ్లకు స్పష్టమైన అవగాహన ఉంది. తమకు ఏమైన కావాలంటే, వాటిని సాధించుకునేందుకు అవసరమైన వాటినన్నింటినీ చేయాలి అని సఫలులయ్యే ప్రజలకు తెలుసు” అని ఆయన అన్నారు. మనకు కావలసిన దాన్ని సాధించేందుకు కావలసిన మెట్లు ఏమిటన్న దాని గురించి స్పష్టమైన అవగాహన ఉండడం, మనం ఆ కార్యంపై దృష్టి నిలిపేందుకు సహాయపడుతుంది. ఒకవేళ పరిస్థితి తిరగబడినా, కార్యాలను తిరిగి సంస్థీకరించుకోవడం సులభమౌతుంది. అలాంటి విశ్లేషణ ఆర్‌వల్‌, విల్‌బర్‌ రైట్‌ల సాఫల్యానికి పునాదిరాయిగా పని చేసింది.

కనుక, పరిస్థితులు తిరగబడినప్పుడు, వాటిని అనుకూల దృక్కోణంతో దృష్టిస్తూ, ఇలా జరిగినప్పుడు అనుభవాన్ని గడిస్తున్నట్లుగా భావించేందుకు మీ శాయశక్తులా ప్రయత్నించండి. పరిస్థితిని విశ్లేషించండి, మీరు ఎక్కడ తప్పటడుగు వేశారో గ్రహించి, ఆ తప్పును సరిదిద్దుకోండి, లేదా ఆ బలహీనతను అధిగమించండి. “ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును” గనుక, ఇతరులతో మాట్లాడడం సహాయకరంగా ఉంటుంది. (సామెతలు 20:18) సహజంగానే, ఒక్కో ప్రయత్నంతో, మీరు మరింత నైపుణ్యాన్ని ప్రావీణ్యాన్నీ సంపాదించుకుంటారు, చివరికి అవి మీరు సఫలీకృతులయ్యేందుకు దారితీస్తాయి.

ఎడతెగక కృషి చేయడమే, పట్టుదలలోని ప్రాముఖ్యమైన మూడవ అంశం. “ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము [“నడుచుకుంటూ ఉందాం,” NW]” అని పౌలు మనకు బోధిస్తున్నాడు. (ఫిలిప్పీయులు 3:16) ఒక విద్యావేత్త చెబుతున్నట్లు, “మితంగా ఉంటూ, నిర్విరామంగా కృషి చేయడం ద్వారా కాలక్రమేణా గొప్ప ఫలితాలను పొందవచ్చు.” అందరికీ తెలిసిన కుందేలూ తాబేలును గురించిన కథ ఈ విషయాన్ని సోదాహరణగా తెలియజేస్తుంది. తాబేలుకు కుందేలు కన్నా వేగం తక్కువే అయినా, పందెంలో అదే గెలిచింది. ఎందుకని? తాబేలు, స్థిరంగా, పద్ధతి ప్రకారం వ్యవహరించింది. అది వదిలిపెట్టలేదు కానీ, వాస్తవికంగా తను ఎంత వేగంగా వెళ్ళగలదో అంత వేగంలో వెళ్ళాలని నిర్ణయించుకుని, లక్ష్య రేఖను చేరే వరకూ అదే వేగంలో వెళ్ళింది. కార్యాలను సంస్థీకరించుకుని, స్థిరంగా ప్రవర్తించే వ్యక్తి పురోభివృద్ధి సాధిస్తూనే ఉంటాడు కనుక, అతనికి ఎల్లప్పుడూ పురికొల్పు ఉంటుంది. అతడు ఆ విధంగా చేస్తాడు కనుక అటు తన లక్ష్యాన్ని వదిలిపెట్టే సాధ్యత చాలా తక్కువ, ఇటు పందెం నుండి తొలగించబడడు కూడా. అవును, మీరు మీ లక్ష్యాన్ని “పొందునట్లుగా పరుగెత్తుడి.”

యుక్తమైన లక్ష్యాలను ఎంపిక చేసుకోవడం

మనం చూపించే పట్టుదలకు విలువ ఉండాలంటే, మనం యుక్తమైన లక్ష్యాలను పెట్టుకోవడం అవసరం. సంతోషాన్నివ్వలేని అనేక విషయాల కోసం అనేకులు శ్రమపడతారు. అయతే, “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు . . . క్రియలో ధన్యుడగును” అని బైబిలు చెబుతుంది. (యాకోబు 1:25) అవును, బైబిలులో ఇవ్వబడిన దేవుని ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకునేందుకు బైబిలును అధ్యయనం చేయడమనేది చాలా యుక్తమైన లక్ష్యం. ఎందుకు? ముఖ్యంగా, దేవుని ప్రమాణాలు పరిపూర్ణతగలవి, నీతిమంతమైనవి. వాటిపై ఆయన ధర్మశాస్త్రం ఆధారపడి ఉంది. సృష్టికర్తగా, తన సృష్టికి మేలైనది ఏమిటో ఆయనకు తెలుసు. కనుక, దేవుని నిర్దేశాలను నేర్చుకోవడంలోను, వాటిని మన జీవితాల్లో అన్వయించుకోవడంలోను మనం పట్టుదల చూపిస్తే తప్పకుండా సంతోషాన్ని పొందగలము. “పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని సామెతలు 3:5, 6 వచనాలు వాగ్దానం చేస్తున్నాయి.

అంతేకాకుండా, దేవుడ్ని గురించిన యేసును గురించిన జ్ఞానాన్ని హృదయంలోకి తీసుకోవడమే “నిత్యజీవము.” (యోహాను 17:3) మనం, ఈ విధానపు “అంత్యదినములలో” జీవిస్తున్నామని బైబిలు ప్రవచనం సూచిస్తుంది. (2 తిమోతి 3:1-5; మత్తయి 24:3-13) త్వరలో, ఆయన రాజ్యము, అంటే నీతిమంతమైన ఆయన ప్రభుత్వం భూ నివాసులపై తన పరిపాలనను స్పష్టం చేస్తుంది. (దానియేలు 2:44; మత్తయి 6:10) విధేయతగల మానవజాతి మునుపెన్నడూ లేనంత శాంతిగా, సమృద్ధిగా, సుఖంగా ఉండే యుగాన్ని ఈ ప్రభుత్వం ప్రారంభిస్తుంది. (కీర్తన 37:10, 11; ప్రకటన 21:4) “దేవుడు పక్షపాతి కాడని” అపొస్తలుల కార్యములు 10:34 చెబుతుంది. అవును, ఆ ప్రయోజనాలను పొందండి అని ప్రతి ఒక్కరూ ఆహ్వానించబడుతున్నారు!

బైబిలు, వివేకముతో నిండిన అర్థవంతమైన ప్రాచీన పుస్తకం. దాన్ని గ్రహించడానికి సమయాన్ని తీసుకుని ప్రయత్నం చేయడం అవసరం. కానీ దేవుని సహాయంతో, మనం బైబిలులోని జ్ఞానాన్ని పొందడంలో పట్టుదలగా ప్రవర్తించినప్పుడు, అర్థం చేసుకోగలుగుతాం. (సామెతలు 2:4, 5; యాకోబు 1:5) నిజమే, మనం నేర్చుకునేవాటిని అన్వయించుకోవడం సవాలుగానే ఉండవచ్చు. మనం మన ఆలోచనా సరళిలో లేక అలవాట్లలో సవరింపులు చేసుకోవలసిన అవసరం ఉండవచ్చు. సదుద్దేశంగల స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మనం బైబిలు అధ్యయనం చేయడాన్ని వ్యతిరేకిస్తుండవచ్చు కూడా. కనుక పట్టుదలగా ఉండడం ప్రాముఖ్యం. “సత్‌ క్రియను ఓపికగా చేయుచు” ఉండేవారికి దేవుడు నిత్యజీవమును ఇస్తాడని అపొస్తలుడైన పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు. (రోమీయులు 2:7) ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు సహాయం చేసేందుకు యెహోవాసాక్షులు సంతోషిస్తారు.

మీరు దేవుడ్ని గురించీ, ఆయన చిత్తాన్ని గురించీ నేర్చుకోవడంలోను నేర్చుకుంటున్న వాటిని అన్వయించుకోవడంలోను పట్టుదలగా ఉంటే సఫలులౌతారన్నది నిశ్చయం.—కీర్తన 1:1-3.

[6వ పేజీలోని చిత్రం]

మీరు దేవుడ్ని గురించీ, ఆయన చిత్తాన్ని గురించీ నేర్చుకోవడంలో పట్టుదలగా ఉంటే సాఫల్యాన్ని పొందుతారు

[4వ పేజీలోని చిత్రసౌజన్యం]

Culver Pictures