కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన రక్షణకర్తయైన దేవునియందు సంతోషించడం

మన రక్షణకర్తయైన దేవునియందు సంతోషించడం

మన రక్షణకర్తయైన దేవునియందు సంతోషించడం

“నేను యెహోవాయందు ఆనందించెదను; నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.”—హబక్కూకు 3:18.

1. సా.శ.పూ. 539 లో బబులోను కూలిపోవడానికి ముందు దేనికి సంబంధించిన దర్శనాన్ని దానియేలు చూశాడు?

బబులోను సా.శ.పూ. 539 లో కూలిపోవడానికి దాదాపు ఒక దశాబ్దంకంటే ఎక్కువకాలం క్రితమే, వృద్ధుడైన దానియేలు ప్రవక్త ఉత్తేజకరమైన దర్శనాన్ని చూశాడు. యెహోవా శత్రువులకూ, ఆయన నియమిత రాజైన యేసుక్రీస్తుకూ మధ్య జరిగే అంతిమ యుద్ధం వైపుకు నడిపించే ప్రపంచ సంఘటనలను గురించి అది ముందుగానే చెప్పింది. దానియేలు ప్రతిస్పందన ఏమిటి? ఆయనిలా చెప్పాడు: ‘ఈ దర్శనము కలుగగా నేను మూర్ఛిల్లి, [దాన్ని] గూర్చి విస్మయముగలవాడనైతిని.’—దానియేలు 8:27.

2. దర్శనంలో దానియేలు ఏ యుద్ధాన్ని చూశాడు, అది ఆసన్నమవటాన్ని గురించి మీరెలా భావిస్తారు?

2 మన సంగతేంటి? అప్పటి నుంచీ మనం జీవిస్తున్న ఈ కాలంనాటికి, కాల ప్రవాహంలో ఎంతో కాలం గడిచిపోయింది. దానియేలు దర్శనంలో చూసిన యుద్ధం—దేవుని యుద్ధమైన అర్మగిద్దోను—ఆసన్నమైందన్న విషయాన్ని మనం గుర్తించినప్పుడు మనమెలా ప్రతిస్పందిస్తాము? హబక్కూకు ప్రవచనంలో బహిర్గతం చేయబడిన దుష్టత్వం, దేవుని శత్రువులు నాశనాన్ని తప్పించుకోలేనంత తీవ్రమైనదని మనం గ్రహించినప్పుడు, మనమెలా ప్రతిస్పందిస్తాం? బహుశా, మన భావాలు, హబక్కూకు ప్రవచన పుస్తకంలోని 3వ అధ్యాయంలో వర్ణించబడిన హబక్కూకు భావాల్లానే ఉండవచ్చు.

హబక్కూకు దేవుని కనికరంకోసం ప్రార్థిస్తాడు

3. హబక్కూకు ఎవరి తరపున ప్రార్థన చేశాడు, అతని మాటలు మనపై ఎలా ప్రభావం చూపించవచ్చు?

3 హబక్కూకు పుస్తకంలోని 3వ అధ్యాయం ఒక ప్రార్థన. మొదటి వచనం ప్రకారం, అది శోకగీతాల్లో వ్యక్తపర్చబడింది, అంటే దుఃఖగీతాల్లో లేదా విలాపగీతాల్లో వ్యక్తపర్చబడింది. ఆ ప్రవక్త చేసిన ప్రార్థనలోని మాటలు, ఆయన ఏదో తన కోసమే మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నాయి. అయితే నిజానికి హబక్కూకు మాట్లాడుతున్నది, దేవుడు ఎంపికచేసుకున్న జనాంగం తరపున. నేడు, ఆయన ప్రార్థన, ప్రకటనాపనిలో నాయకత్వం వహిస్తున్న అభిషిక్త శేషానికి అన్వయిస్తుంది. మనం దాన్ని మనస్సులో పెట్టుకొని హబక్కూకు 3వ అధ్యాయాన్ని చదివితే, ఆ ప్రార్థనలోని పదాలు, మనల్ని భీతితో నింపినా, మనల్ని ఆనందంతో కూడా నింపుతాయి. హబక్కూకు ప్రార్థన లేక విలాపనం, మన రక్షణకర్తయైన దేవునియందు సంతోషించడానికి బలమైన కారణాన్ని ఇస్తుంది.

4. హబక్కూకు ఎందుకు భయపడ్డాడు, దేవుడు తన శక్తిని ప్రదర్శించే ఏ చర్య విషయమై మనం నిశ్చయత కల్గివుండవచ్చు?

4 ఇంతకు ముందు రెండు శీర్షికల్లో మనం గమనించినట్లుగా, హబక్కూకు కాలంలో యూదా దేశంలో పరిస్థితులు చెడుగా ఉన్నాయి. కానీ ఆ పరిస్థితి అలానే కొనసాగటానికి దేవుడు అనుమతించడు. గతంలో చేసినట్లుగానే, యెహోవా చర్యతీసుకుంటాడు. ప్రవక్త ఇలా విలపించడంలో ఆశ్చర్యమేమీ లేదు: “యెహోవా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను.” ఆయన భావమేమైవుంది? ‘యెహోవాను గూర్చిన వార్త’ అంటే, ఎర్ర సముద్రం వద్దా, అరణ్యంలోనూ, యెరికో పట్టణం దగ్గరా జరిగిన దేవుని శక్తివంతమైన కార్యాలను గూర్చి నమోదు చేయబడిన చరిత్రే. ఆ కార్యాలు, హబక్కూకునకు బాగా తెలిసినవే, యెహోవా తన శత్రువులకు విరుద్ధంగా తన మహా శక్తిని మళ్లీ ఉపయోగిస్తాడన్న విషయం ఆయనకు తెలుసు గనుక, ఆ కార్యాలు ఆయన్ను భయభ్రాంతుడ్ని చేశాయి. నేటి మానవజాతి దుష్టత్వాన్ని మనం చూసినప్పుడు, యెహోవా ప్రాచీన కాలాల్లో చేసినట్లుగానే చర్య తీసుకుంటాడని మనకు కూడా తెలుసు. అది మనకు భయాన్ని పుట్టిస్తుందా? తప్పకుండా! అయినప్పటికీ, మనం కూడా హబక్కూకులా ప్రార్థిస్తాము: “సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.” (హబక్కూకు 3:2) దేవుని యుక్త కాలంలో అంటే, “సంవత్సరములు జరుగుచుండగా” ఆయన, తన అద్భుతమైన శక్తిని కార్య రూపంలో పెట్టుగాక. ఆ సమయంలో, తనను ప్రేమించే వారికి కనికరం చూపించాలని ఆయన జ్ఞాపకం తెచ్చుకొనుగాక!

యెహోవా సంచరిస్తున్నాడు!

5. దేవుడు ‘తేమానులోనుండి ఎలా బయలుదేరాడు,’ అర్మగిద్దోనుకు సంబంధించి అది ఏమి సూచిస్తుంది?

5 కనికరం కోసమైన మన ప్రార్థనను యెహోవా విన్నప్పుడు, ఏమి జరుగుతుంది? హబక్కూకు 3:3-5 వచనాల్లో మనం సమాధానాన్ని చూస్తాము. మొదటిగా, ఆ ప్రవక్త ఇలా అంటున్నాడు: “దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయుచున్నాడు.” పూర్వం ప్రవక్తయైన మోషే దినాల్లో, ఇశ్రాయేలీయులు అరణ్యంగుండా కనానుకు పోయే మార్గంలో తేమాను, పారానులు ఉండేవి. ఇశ్రాయేలీయుల పెద్ద జనాంగం తరలి వెళ్తుండగా, యెహోవాయే తరలివెళ్తున్నట్టు అన్పించింది, ఆయన్నేదీ ఆపలేకపోయింది. మోషే చనిపోవడానికి కొంచెం ముందు ఇలా అన్నాడు: “యెహోవా సీనాయనుండి వచ్చెను. శేయూరులోనుండి వారికి ఉదయంచెను. ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను. [దేవదూతల] వేవేల పరిశుద్ధ సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను.” (ద్వితీయోపదేశకాండము 33:2) అర్మగిద్దోను యుద్ధంలో యెహోవా తన శత్రువులకు విరుద్ధంగా చర్య తీసుకున్నప్పుడు, అడ్డగించలేని ఆయన శక్తి అదే విధంగా ప్రదర్శించబడుతుంది.

6. వివేచనగల క్రైస్తవులు, దేవుని మహిమనేగాక ఇంకా దేనిని చూస్తారు?

6 హబక్కూకు ఇంకా ఇలా అంటున్నాడు: “[యెహోవా] మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది; భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది.” ఎంత మహత్తరమైన దృశ్యమో గదా! నిజమే, నరులు యెహోవాను చూసి బ్రదుకలేరు. (నిర్గమకాండము 33:20) అయితే, దేవుని నమ్మకమైన సేవకుల విషయానికొస్తే, వారు ఆయన మహిమను తలపోసినంత మాత్రానే వారి మనోనేత్రాలు మిరుమిట్లు గొలుపుతాయి. (ఎఫెసీయులు 1:17) వివేచనగల క్రైస్తవులు, యెహోవా మహిమతోపాటు మరోదాన్ని కూడా చూస్తారు. హబక్కూకు 3:4 ఇలా ముగుస్తుంది: “ఆయన హస్తములనుండి కిరణములు బయలువెళ్లుచున్నవి, అచ్చట ఆయన బలము దాగియున్నది.” అవును, యెహోవా తన కుడిచేతి బలాన్నీ, శక్తినీ ఉపయోగిస్తూ, చర్య తీసుకోడానికి సంసిద్ధంగా ఉండటాన్ని మనం చూస్తాము.

7. దేవుని జైత్రయాత్ర, ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారికి ఏ భావాన్ని కల్గివుంది?

7 దేవుని జైత్రయాత్ర అంటే, తిరుగుబాటు దారులకు విపత్తనే అర్థం. హబక్కూకు 3:5 ఇలా చెబుతోంది: “ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి.” సా.శ.పూ. 1473 లో, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశ సరిహద్దులను సమీపించినప్పుడు, వారిలో అనేకులు అనైతికతకు పాల్పడి, విగ్రహారాధన చేసి, తిరుగుబాటు చేశారు. ఫలితంగా, దేవుడు పంపిన తెగులు మూలంగా 20,000 కంటే ఎక్కువమంది హతులయ్యారు. (సంఖ్యాకాండము 25:1-9) సమీప భవిష్యత్తులో యెహోవా, “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు” బయల్దేరినప్పుడు, ఆయనపై తిరుగుబాటు చేసేవాళ్లంతా అదే విధంగా తమ పాపానికి శిక్షను అనుభవిస్తారు. బహుశా కొందరు, అక్షరార్థమైన తెగుళ్ల మూలంగా మరణించవచ్చు.—ప్రకటన 16:14, 16.

8. హబక్కూకు 3:6 ప్రకారంగా, దేవుని శత్రువుల కోసం ఏమి వేచివుంది?

8 చర్య తీసుకుంటున్న సైన్యములకధిపతియగు యెహోవాను గూర్చి ప్రవక్త వర్ణించిన స్పష్టమైన వర్ణనను ఇప్పుడు వినండి. హబక్కూకు 3:6 లో మనం ఇలా చదువుతాము: “ఆయన [యెహోవా దేవుడు] నిలువబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును. పురాతన గిరులు అణగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు.” యుద్ధ క్షేత్రాలను సర్వే చేస్తున్న సైనికాధికారి వలే యెహోవా మొదట ‘నిలువబడతాడు.’ ఆయన శత్రువులు భయంతో కంపిస్తారు. తమ ప్రత్యర్థిని చూసి వాళ్లు, దిగ్భ్రాంతికి గురై, కలతచెందిన వాళ్లై ఇటు అటు తొలగుతారు. యేసు, ‘భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకునే’ సమయం గురించి చెప్పాడు. (మత్తయి 24:30) యెహోవాకు విరుద్ధంగా ఎవరూ నిలువలేరన్న విషయాన్ని వాళ్లు చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. ‘ఆదికాల పర్వతాలూ,’ ‘పురాతన గిరులూ’ ఎంత శాశ్వతమైనవో అంత శాశ్వతమైనవిగా అనిపించే మానవ సంస్థలు కూడా కుప్పకూలిపోతాయి. అది, ‘పూర్వకాలము మొదలుకొని దేవుడు జరిగించిన’ విధంగానే అంటే ప్రాచీన కాలాల్లో ఆయన చర్య తీసుకున్న విధంగానే ఉంటుంది.

9, 10. హబక్కూకు 3:7-11 ద్వారా మనకు ఏమి గుర్తుచేయబడుతుంది?

9 యెహోవాకు తన శత్రువులపై ‘కోపము కలిగింది.’ అయితే ఆయన తన గొప్ప యుద్ధంలో ఏ ఆయుధాలను ఉపయోగిస్తాడు? ప్రవక్త ఆ ఆయుధాలను ఇలా వర్ణిస్తుండగా వినండి: “విల్లు వరలోనుండి తీయబడియున్నది. నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచియున్నావు, భూమిని బద్దలుచేసి నదులను కలుగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు.”—హబక్కూకు 3:7-11.

10 యెహోషువ దినాల్లో, యెహోవా తన శక్తిని ఆశ్చర్యకరమైన రీతిలో ప్రదర్శిస్తూ సూర్య చంద్రులు ఆకాశంలో నిలిచిపోయేలా చేశాడు. (యెహోషువ 10:12-14) అర్మగిద్దోనులో యెహోవా అదే శక్తిని ఉపయోగిస్తాడని హబక్కూకు ప్రవచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. సా.శ.పూ. 1513 లో, ఫరో సైన్యాలను నాశనం చేయడానికి యెహోవా ఎర్ర సముద్రాన్ని ఉపయోగించినప్పుడు, సముద్రాగాధాలపై తనకున్న అధికారాన్ని ఆయన చూపించాడు. నలభై ఏళ్ల తర్వాత, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి చేస్తున్న జైత్రయాత్రను నిండుగా పొంగి ప్రవహిస్తున్న యొర్దాను నది ఆపలేకపోయింది. (యెహోషువ 3:15-17) ప్రవక్త్రిని దెబోరా దినాల్లో, ఇశ్రాయేలు శత్రువైన సీసెరా రథాలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. (న్యాయాధిపతులు 5:21) నీటి వెల్లువలకు మూలమైన వర్షపు నీరు, సముద్రాగాధాలు వంటి శక్తులు అర్మగిద్దోనులో యెహోవా ఉపయోగించడానికి సంసిద్ధంగా ఉంటాయి. బల్లెంలా లేక అంబులపొదిలా, ఉరుములూ మెరుపులూ యెహోవా దేవుని చేతిలో ఉన్నాయి.

11. యెహోవా తన గొప్ప శక్తిని పూర్తిస్థాయిలో విడుదల చేసినప్పుడు ఏమి జరుగుతుంది?

11 యెహోవా తన గొప్ప శక్తిని పూర్తిస్థాయిలో విడుదల చేసినప్పుడు, నిజంగా అదెంతో భయానకంగా ఉంటుంది. రాత్రి పట్టపగల్లాగానూ, పగలు సూర్యుడు క్రితమెన్నడూ లేనంత తీక్షణంగానూ మారబోతున్నాయని హబక్కూకు మాటలు సూచిస్తున్నాయి. అర్మగిద్దోనును గూర్చిన ఈ ప్రవచనాత్మక వర్ణన అక్షరార్థమైనదైనా, లేక సూచనార్థకమైనదైనా సరే, ఒక్కటి మాత్రం కచ్చితం—యెహోవాదే విజయం, శత్రువుల్లో ఒక్కడు కూడా తప్పించుకోలేడు.

దేవుని ప్రజలకు రక్షణ నిశ్చయం!

12. దేవుడు తన శత్రువులకు ఏమి చేస్తాడు, కానీ ఎవరు రక్షించబడతారు?

12 యెహోవా తన శత్రువులను నాశనం చేసే చర్యలను గురించి ప్రవక్త వర్ణిస్తూ ఉన్నాడు. హబక్కూకు 3:12 లో మనం ఇలా చదువుతాము: “బహు రౌద్రముకలిగి నీవు భూమిమీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు.” అయినప్పటికీ, యెహోవా గుడ్డిగా నాశనం చేయడు. కొందరు మానవులు రక్షించబడతారు. హబక్కూకు 3:13వ వచనం ఇలా చెబుతోంది: “నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు.” అవును, యెహోవా తన నమ్మకమైన సేవకులను రక్షిస్తాడు. అప్పుడు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోను సంపూర్ణంగా నాశనం అవుతుంది. అయితే, నేడు జనాంగాలు, పవిత్రారాధనను పూర్తిగా తుడిచి వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. త్వరలోనే దేవుని సేవకులపై, గోగు మాగోగు శక్తులు దాడి చేస్తాయి. (యెహెజ్కేలు 38:1–39:13; ప్రకటన 17:1-5, 16-18) ఆ పైశాచిక దాడి సఫలమౌతుందా? ఎంతమాత్రం కాదు! కళ్లెంలో ధాన్యాన్ని వేసి కాళ్లతో తొక్కినట్టుగా యెహోవా అప్పుడు, తన శత్రువులను మహోద్రేకంతో తొక్కుతాడు. అయితే ఆయన, తనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వాళ్లను రక్షిస్తాడు.—యోహాను 4:24.

13. హబక్కూకు 3:13 ఎలా నెరవేరుతుంది?

13 దుష్టులు సంపూర్ణంగా నాశనం చేయబడటాన్ని గురించి ఈ మాటల్లో ప్రవచించబడింది: “దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండ వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు.” (హబక్కూకు 3:13) అపవాదియగు సాతాను ప్రభావం క్రింద వృద్ధి చెందిన దుష్ట వ్యవస్థే, ఆ ‘కుటుంబం.’ అది కూల్చి వేయబడుతుంది. ‘ప్రధానుడు’ లేక దైవ వ్యతిరేక నాయకులు చితకకొట్టబడతారు. సమస్త దుష్ట వ్యవస్థ దాని పునాదులతోపాటు సమూలంగా నాశనం చేయబడుతుంది. అది ఇక ఎంతమాత్రం ఉనికిలో ఉండదు. అదెంత గొప్ప ఉపశమనమో కదా!

14-16. హబక్కూకు 3:14, 15 ప్రకారంగా, యెహోవా ప్రజలకు ఏమి జరుగుతుంది, వారి శత్రువులకు ఏమి జరుగుతుంది?

14 అర్మగిద్దోనులో, యెహోవా దేవుని ‘అభిషిక్తుడ్ని’ నాశనం చేయడానికి ప్రయత్నించే వాళ్లంతా గందరగోళానికి గురిచేయబడతారు. హబక్కూకు 3:14, 15 ప్రకారంగా, “బీదలను రహస్యముగా మ్రింగివేయవలెనని ఉప్పొంగుచు నన్ను పొడిచేయుటకై తుపానువలె వచ్చు యోధుల తలలలో రాజుయొక్క ఈటెలను నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచునున్నావు నీ గుఱ్ఱములు మహాసముద్ర జలరాసులను త్రొక్కును” అని అంటూ ప్రవక్త దేవునితో మాట్లాడతాడు.

15 యోధులు “నన్ను పొడిచేయుటకై తుపానువలె” వచ్చారని హబక్కూకు చెబుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నది, యెహోవా అభిషిక్త సేవకులను గురించే. పొంచివున్న రహదారి దొంగల్లా ఆ జనాంగాలు, యెహోవా ఆరాధకులను నాశనం చేయడానికి వారిపైకి ఆకస్మికంగా దాడిచేస్తాయి. విజయాన్ని సాధిస్తామన్న నమ్మకంతో దేవుని శత్రువులు, ఆయన ప్రజల శత్రువులు అయిన వీళ్లు, ‘ఉప్పొంగుతారు.’ విశ్వాసులైన క్రైస్తవులు, వాళ్లకు “బీద” బాధితుల్లా బలహీనంగా కనబడతారు. కానీ దైవ వ్యతిరేక శక్తులు తమ దాడిని ప్రారంభించినప్పుడు, యెహోవా వారు తమ ఆయుధాల్ని తమపైనే ప్రయోగించుకునేలా చేస్తాడు. వాళ్లు తమ ఆయుధాల్ని లేక “ఈటెలను” తమ సొంత యోధులపైకే ఉపయోగిస్తారు.

16 అంతకన్నా ఎక్కువే జరగనైవుంది. తన శత్రువులను సంపూర్ణంగా నాశనం చేయడానికి యెహోవా అప్పుడు, మానవాతీత ఆత్మ శక్తులను ఉపయోగిస్తాడు. యేసుక్రీస్తు నేతృత్వంలోని తన పరలోక సైన్యాలు అధిరోహించి వస్తున్న ‘గుఱ్ఱాలతో’ ఆయన, ‘సముద్రం’ గుండా, ‘మహాసముద్ర జలరాసుల’ గుండా అంటే, ఉప్పొంగుతున్న శత్రువులైన మానవ సమూహం గుండా విజయవంతంగా దూసుకుపోతాడు. (ప్రకటన 19:11-21) అప్పుడు దుష్టులు, భూమిపై నుంచి తీసివేయబడతారు. దైవిక న్యాయమూ, బలమూ ఎంత శక్తివంతంగా ప్రదర్శించబడుతున్నాయో గదా!

యెహోవా దినము వస్తోంది!

17. (ఎ) హబక్కూకు మాటలు నెరవేరుతాయని మనం ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు? (బి) యెహోవా మహాదినం కోసం వేచిచూస్తూ మనం ఎలా హబక్కూకులా ఉండగలం?

17 హబక్కూకు మాటలు త్వరలోనే నెరవేరతాయన్న నిశ్చయతను మనం కలిగివుండవచ్చు. అవి జాగుచేయవు. ఈ భావి జ్ఞానానికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? హబక్కూకు దైవ ప్రేరేపితుడై వ్రాశాడన్న విషయాన్ని గుర్తుంచుకోండి. యెహోవా చర్య తీసుకుంటాడు, అది జరిగినప్పుడు భూమిపై సర్వనాశనం జరుగుతుంది. ఆ ప్రవక్త ఇలా వ్రాయడంలో ఆశ్చర్యమేమీ లేదు: “నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి యున్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి, నా యెముకలు కుళ్లిపోవుచున్నవి, నా కాళ్లు వణకుచున్నవి.” (హబక్కూకు 3:16) హబక్కూకు అంతగా కలత చెందడం అర్థం చేసుకోదగ్గ విషయమే. అయితే ఆయన విశ్వాసం సడలిపోయిందంటారా? ఎంత మాత్రం కాదు! ఆయన యెహోవా దినం వచ్చేంత వరకూ ఊరకొని వేచి ఉండటానికి సుముఖతను చూపించాడు. (2 పేతురు 3:11, 12) మన దృక్పథం కూడా అదే కాదంటారా? అవును, అదే! హబక్కూకు ప్రవచనం నెరవేరుతుందని మనకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే అప్పటి వరకూ, మనం సహనంతో వేచి ఉందాము.

18. కష్టాలు వస్తాయని హబక్కూకు ఎదురు చూసినప్పటికీ, అతని దృక్పథం ఎలావుంది?

18 యుద్ధాలు తెచ్చిపెట్టేవి కష్టాలే, వాటికి విజేతలు కూడా మినహాయింపు కాదు. ఆహార కొరత ఏర్పడవచ్చు. ఆస్తులకు ముప్పువాటిల్లవచ్చు. జీవన ప్రమాణాలు దిగజారి పోవచ్చు. అదే గనుక మనకు జరిగితే, మనమెలా ప్రతిస్పందిస్తాము? హబక్కూకు మాదిరికరమైన దృక్పథాన్ని కల్గివున్నాడు, అందుకే ఆయనిలా చెప్పాడు: “అంజారపుచెట్లు పూయకుండినను, ద్రాక్షచెట్లు ఫలింపకపోయనను ఒలీవచెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయనను, గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయనను, సాలలో పశువులు లేకపోయనను, నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.” (హబక్కూకు 3:17, 18) కష్టాలు వస్తాయని, బహుశ క్షామం ఏర్పడుతుందని హబక్కూకు వాస్తవిక దృష్టితో ఎదురు చూశాడు. అయినప్పటికీ, ఆయన యెహోవాయందు తన ఆనందాన్ని ఎన్నడూ కోల్పోలేదు, యెహోవా నుండే ఆయనకు రక్షణ వచ్చింది.

19. అనేకమంది క్రైస్తవులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు, కానీ మనం మన జీవితాల్లో యెహోవాకు మొదటి స్థానాన్ని ఇస్తే మనం దేని గురించి నిశ్చయత కల్గివుండగలం?

19 నేడు కూడా, దుష్టులకు వ్యతిరేకంగా జరిగే యెహోవా యుద్ధానికి ముందు అనేకమంది తీవ్రమైన కష్టాలను అనుభవిస్తారు. యుద్ధాలూ, క్షామం, భూకంపాలూ, తెగుళ్లూ వంటివి, రాచరిక శక్తితో కూడిన తన ప్రత్యక్షతను గూర్చిన సూచనలో భాగమౌతాయని యేసు ముందుగానే చెప్పాడు. (మత్తయి 24:3-14; లూకా 21:10, 11) మన తోటి విశ్వాసుల్లో అనేకమంది, ఆయన మాటలు నెరవేరడం మూలంగా తీవ్రంగా పీడించబడుతున్న దేశాల్లో నివసిస్తున్నారు, ఫలితంగా వాళ్లు తీవ్రమైన కష్టాలను అనుభవిస్తున్నారు. ఇతరులు భవిష్యత్తులో అదే విధంగా కష్టాలను అనుభవించవచ్చు. అంతం రావడానికి ముందుగా, మనలో అనేకుల విషయంలో ‘అంజారపుచెట్టు పూయకపోవచ్చు.’ అయినప్పటికీ, ఇవి ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలుసు, అదే మనకు బలాన్నిస్తుంది. అంతేగాక, మనకు మద్దతుంది. యేసు ఇలా వాగ్దానం చేశాడు: “మీరు ఆయన [దేవుని] రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:33) అది, సుఖప్రదమైన జీవితం లభిస్తుందన్న హామీని ఇవ్వడంలేదు. కానీ అది, మనం యెహోవాకు మొదటి స్థానాన్ని ఇస్తే, ఆయన మనకు కాపుదలనిస్తాడన్న అభయానిస్తుంది.—కీర్తన 37:25.

20. తాత్కాలికమైన కష్టాలు ఉన్నప్పటికీ, మనం ఏమి చేయటానికి నిశ్చయించుకోవాలి?

20 మనం ఎలాంటి తాత్కాలికమైన కష్టాలను అనుభవించాల్సి వచ్చినా సరే, మనం యెహోవా రక్షణశక్తిపై గల విశ్వాసాన్ని కోల్పోము. ఆఫ్రికా, తూర్పు యూరప్‌, ఇతర స్థలాల్లోని మన సహోదర సహోదరీలలో అనేకమంది తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన వలసి ఉన్నప్పటికీ, వారు ‘యెహోవాయందు ఆనందిస్తూ’ ఉంటారు. మనం కూడా, వారిలాగే చేయడాన్ని ఎన్నటికీ విరమించకుండా ఉందాం. సర్వోన్నతమైన ప్రభువగు యెహోవాయే మన ‘బలముకు’ మూలమని జ్ఞాపకముంచుకోండి. (హబక్కూకు 3:19) ఆయన మనల్ని ఎన్నడూ విఫలులను చేయడు. అర్మగిద్దోను తప్పకుండా వస్తుంది, దాని తర్వాత, దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకం కూడా తప్పకుండా వస్తుంది. (2 పేతురు 3:13) అప్పుడు, “సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మాహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును.” (హబక్కూకు 2:14) ఆ అద్భుతమైన సమయం వచ్చేంత వరకూ, హబక్కూకు ఉంచిన చక్కని మాదిరిని మనం అనుసరిద్దాం. మనం ఎల్లప్పుడూ ‘యెహోవాయందు ఆనందిస్తూ, మన రక్షణకర్తయైన దేవునియందు సంతోషిస్తూ’ ఉందాము.

మీకు జ్ఞాపకమున్నాయా?

• హబక్కూకు ప్రార్థన మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

• ఎందుకని యెహోవా సంచరిస్తున్నాడు?

• రక్షణను గురించి హబక్కూకు ప్రవచనం ఏమి చెబుతుంది?

• యెహోవా మహాదినము కోసం మనం ఏ దృక్పథంతో వేచి ఉండాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[23వ పేజీలోని చిత్రం]

అర్మగిద్దోనులో దేవుడు దుష్టులపై ఏ శక్తులను ఉపయోగిస్తాడో మీకు తెలుసా?