కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మిమ్మల్ని ఎలా జ్ఞాపకముంచుకుంటాడు?

యెహోవా మిమ్మల్ని ఎలా జ్ఞాపకముంచుకుంటాడు?

యెహోవా మిమ్మల్ని ఎలా జ్ఞాపకముంచుకుంటాడు?

“నాదేవా, . . . నన్ను జ్ఞాపకముంచుకొనుము” అని నెహెమ్యా అనేక సార్లు దేవునికి విజ్ఞప్తి చేసుకున్నాడు. (నెహెమ్యా 5:19; 13:14, 31) ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుని వైపుకు మళ్ళి ఇలా అంటూ విజ్ఞప్తి చేసుకోవడం సహజమే.

అయితే, తమను జ్ఞాపకముంచుకోమని ప్రజలు దేవుడ్ని అడిగేటప్పుడు వాళ్ళ మనస్సులో ఏముంటుంది? దేవుడు తమ పేరును గుర్తుంచుకోవడం కన్నా ఎక్కువే వాళ్ళు ఆశిస్తారన్నది స్పష్టం. యేసుకు ఇరువైపుల మ్రానున వ్రేలాడదీయబడిన నేరస్థుల్లో ఒకరు ఆశించినట్లే, వాళ్ళూ ఆశిస్తారనేందుకు సందేహం లేదు. అవతలి నేరస్థునిలా కాక, ఈ నేరస్థుడు, “నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొను”ము అని యేసును వేడుకున్నాడు. తను ఎవరో యేసు గుర్తుంచుకోవడమే కాక, తన కోసం ఏమైన చేయాలని—తనను పునరుత్థానం చేయాలని—కూడా ఆయన కోరుకున్నాడు.—లూకా 23:42.

దేవుడు ‘జ్ఞాపకముంచుకోవడం’ అంటే అనుకూలమైన ఒక చర్యను తీసుకోవడం అని బైబిలు తరచూ చూపిస్తుంది. ఉదాహరణకు, భూమి జలప్రళయంలో 150 రోజులు మునిగి ఉన్న తర్వాత, “దేవుడు నోవహును . . . జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.” (ఆదికాండము 8:1) శతాబ్దాల తర్వాత, ఫిలిష్తీయులు సమ్సోనును అంధుడిగా చేసి, గొలుసులతో బంధించారు. అప్పుడు, “యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బలపరచుము” అని సమ్సోను ప్రార్థించాడు. యెహోవా సమ్సోనును జ్ఞాపకం చేసుకుని, దేవుని శత్రువులపై సమ్సోనే ప్రతీకారం తీర్చుకునేలా సమ్సోనుకు మానవాతీత బలాన్నిచ్చాడు. (న్యాయాధిపతులు 16:28-30) నెహెమ్యా విషయానికి వస్తే, యెహోవా ఆయన ప్రయత్నాలను ఆశీర్వదించాడు, అలా యెరూషలేములో సత్యారాధన పునఃస్థాపించబడింది.

“ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 15:4) గతంలో యెహోవా యొక్క నమ్మకమైన సేవకులు చేసినట్లుగానే, మనం కూడా యెహోవాను జ్ఞాపకముంచుకుని, ఆయన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తే, యెహోవా కూడా మనలను జ్ఞాపకముంచుకుని, దైనందిన అవసరాలను తీర్చుకునేందుకు మనకు సహాయం చేస్తాడనీ, మన పరీక్షల్లో మనకు ఆలంబనగా ఉంటాడనీ, దైవభక్తిలేనివారికి తీర్పు తీర్చేటప్పుడు మనలను తప్పిస్తాడనీ మనం నమ్మకం కలిగి ఉండగలం.—మత్తయి 6:33; 2 పేతురు 2:9.