కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సాఫల్యానికి కీలకమేమిటి?

సాఫల్యానికి కీలకమేమిటి?

సాఫల్యానికి కీలకమేమిటి?

ఔత్సాహికులైన ఇద్దరు యువకులు వింతగా కనిపించే ఒక యంత్రాన్ని ఒక నిర్ణాయక పరీక్ష కోసం చాలా జాగ్రత్తగా పద్ధతి ప్రకారం సిద్ధం చేస్తున్నారు. అకస్మాత్తుగా, పెనుగాలి వచ్చి సున్నితమైన ఆ యంత్రాన్ని పైకెత్తి, తిరిగి నేల మీదికి విసిరి కొట్టడంతో, అది ధడ్‌మన్న చప్పుడుతో తునాతునకలైంది. ఆ యువకులు నిశ్శబ్దంగా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు జాగ్రత్తగా కష్టపడి చేసిన పని కలప ముక్కల, లోహ ముక్కల కుప్పగా మారిపోయింది.

1900వ సంవత్సరం అక్టోబర్‌లో అది జరిగింది. గాలికన్నా బరువైన లోహవిహంగాన్ని నిర్మించే ప్రయత్నంలో, ఆర్‌వల్‌, విల్‌బర్‌ రైట్‌లు నిరాశాజనకమైన పరాజయాన్ని ఎదుర్కోవడం అది మొదటి సారేమీ కాదు. వాళ్ళు ప్రయోగం చేయడంలో అప్పటికే కొన్ని సంవత్సరాలనూ కొంత డబ్బునూ వెచ్చించారు.

ఎలాగైతేనేం, వాళ్ళ పట్టుదల చివరికి ఫలించింది. 1903 డిసెంబర్‌ 17న, అమెరికాలోని, నార్త్‌ కరోలినాలోని కిట్టీ హాక్‌లో రైట్‌ సహోదరులు మోటారుతో నడిచే విమాన నమూనాను పైకి పంపించగల్గారు. అది 12 సెకండ్లు ఎగిరింది. అది నేటి విమానాలతో పోల్చితే చాలా తక్కువ సమయమే అయినా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చివేయగలిగింది !

ఒక లక్ష్యం కోసం శ్రమించే అనేకులు సఫలులవ్వడానికి ముఖ్య కారణం, వాళ్ళు ఓపికతో పట్టుదలతో కృషి చేయడమే. లక్ష్యం క్రొత్త భాషపై పట్టు సాధించాలన్నదే కావచ్చు, ఏదైనా ఒక వృత్తిని నేర్చుకోవాలన్నదే కావచ్చు, లేదా మంచి స్నేహాన్ని పెంపొందించుకోవాలన్నదే కావచ్చు. విలువైన విషయాలను చాలామటుకు నిర్విరామమైన కృషి ద్వారా మాత్రమే సాధించవచ్చు. “సాఫల్యాన్ని పదింట ఒకవంతు ఒక కారకానికి ఆపాదించవచ్చు, అంటే కష్టపడి పనిచేయడానికే ఆపాదించవచ్చు” అని రచయితయైన చాల్స్‌ టెంపుల్‌టన్‌ అంటున్నారు. “మనం వరాలను గురించి మాట్లాడుతాం, అదృష్టమంటే తల ఊపుతాం, కాని తరచూ చాలా ప్రాముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తాం. శ్రమ తీసుకోవడాన్ని, అనేక వైఫల్యాలను ఎదుర్కోవలసి రావడాన్ని, త్వరగా మొదలుపెట్టడాన్ని, ఎక్కువ సేపు పనిచేయడాన్ని నిర్లక్ష్యం చేస్తాం” అని కాలమిస్ట్‌ అయిన లెనర్డ్‌ పిట్స్‌ జూనియర్‌ పేర్కొంటున్నారు.

“శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు” అని ఎంతోకాలం క్రితం బైబిలు చెప్పిన విషయాన్ని ఇది ధృవీకరిస్తుంది. (సామెతలు 12:24) మనం శ్రద్ధగా పనిచేస్తున్నామంటే, పట్టుదల చూపిస్తున్నామన్నమాట. మనం పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పట్టుదల అవసరం. పట్టుదల అంటే ఏమిటి? మనం, లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో పట్టుదలను ఎలా చూపించగలం? ఏ విషయాల్లో మనం పట్టుదల చూపించాలి? ఈ ప్రశ్నలకు జవాబులు తర్వాతి శీర్షికలో కనిపిస్తాయి.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

U.S. National Archives photo