కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“క్రీస్తు మనస్సు”ను తెలుసుకోవటం

“క్రీస్తు మనస్సు”ను తెలుసుకోవటం

“క్రీస్తు మనస్సు”ను తెలుసుకోవటం

“ప్రభువు [“యెహోవా,” NW] మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.”—1 కొరింథీయులు 2:16.

1, 2. యెహోవా తన వాక్యంలో యేసు గురించి ఏమి తెలియజేయడం యుక్తమని తలంచాడు?

యేసు రూపం ఎలా ఉండేది? ఆయన జుట్టు, చర్మం, కళ్లు ఏ రంగులో ఉండేవి? ఆయన ఎంత ఎత్తుండే వాడు? ఎంత లావుండేవాడు? శతాబ్దాల కాలంలో యేసు చిత్రాలు, బొమ్మలు విభిన్నంగా ఉండి కొన్ని యుక్తంగా ఉంటే కొన్ని మరీ విపరీతంగా ఉన్నాయి. కొందరు ఆయన్ను ధైర్యసాహసాలు గలవానిగా, దృఢకాయునిగా చిత్రిస్తే, మరితరులు ఆయన్ను బలహీనుడిగా నిస్తేజమైన వ్యక్తిగా చిత్రించారు.

2 అయితే బైబిలు, యేసు రూపంపై అవధానాన్ని నిలపటం లేదు. బదులుగా, యేసు రూపంకంటే విశేషమైనదే తెలియజేయడం యుక్తమని యెహోవా తలంచాడు, అదేమిటంటే, ఆయన ఎలాంటి వ్యక్తి అన్నదే. సువార్త వృత్తాంతాలు యేసు ఏమి చెప్పాడు, ఏమి చేశాడు అన్నవి మాత్రమే కాదుగానీ, ఆయన మాటల వెనుకా, చేతల వెనుకా ఉన్న అనుభూతుల లోతునూ, ఆలోచనా విధానాన్నీ తెలియజేస్తున్నాయి. అపొస్తలుడైన పౌలు “క్రీస్తు మనస్సు” అని పిలిచిన దానిలోకి తొంగి చూడటానికి ఈ నాలుగు ప్రేరేపిత వృత్తాంతాలు మనకు సహాయం చేస్తాయి. (1 కొరింథీయులు 2:16) మనం యేసు తలంపులతోనూ, భావాలతోనూ, వ్యక్తిత్వంతోనూ పరిచయం ఏర్పరచుకోవడం ప్రాముఖ్యం. ఎందుకు? దానికి కనీసం రెండు కారణాలున్నాయి.

3. మనం క్రీస్తు మనస్సుతో పరిచయం ఏర్పరచుకోవడం, మనకు ఏ అంతర్దృష్టినివ్వగలదు?

3 మొదటిగా, క్రీస్తు మనస్సు, యెహోవా దేవుని మనస్సు ఎలా ఉంటుందో మనకు చూపిస్తుంది. యేసుకు తన తండ్రితో ఎంత సాన్నిహిత్యం ఉందంటే ఆయన, “కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరుగడని” చెప్పగలిగాడు. (లూకా 10:22) ‘యెహోవా ఎలా ఉంటాడో మీరు తెలుసుకోవాలనుకుంటే, నావైపు చూడండి’ అని యేసు చెప్తున్నట్లుగా ఉంది. (యోహాను 14:9) కాబట్టి, యేసు ఎలా తలంచాడు, ఎలా భావించాడు అనే వాటి గురించి సువార్తలు తెలియజేస్తున్నదాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు, యెహోవా ఎలా ఆలోచిస్తాడు, ఎలా భావిస్తాడు అన్నది మనం తెలుసుకుంటున్నట్లే. అలాంటి జ్ఞానం మనం దేవునికి దగ్గరయ్యేలా చేస్తుంది.—యాకోబు 4:8.

4. మనం నిజంగా క్రీస్తులా ప్రవర్తించాలంటే, మొదట మనం ఏమి నేర్చుకోవాలి, ఎందుకు?

4 రెండవదిగా, క్రీస్తు మనస్సును తెలుసుకోవడం మనం ఆయన ‘అడుగుజాడల్లో’ నడిచేలా చేస్తుంది. (1 పేతురు 2:21) యేసును అనుసరించడమంటే ఆయనన్న మాటలను పలకడం, ఆయన చేసిన పనులను చేయడం మాత్రమే కాదు. తలంపులూ భావాల మూలంగా మాటలూ చర్యలూ ప్రభావితమౌతాయి గనుక, మనం క్రీస్తును అనుసరించాలంటే, ఆయనకున్న “మనస్సు”ను మనం అలవర్చుకోవాలి. (ఫిలిప్పీయులు 2:5) వేరే మాటల్లో చెప్పాలంటే, మనం నిజంగా క్రీస్తులా ప్రవర్తించడానికి, అపరిపూర్ణ మానవులముగా మనకు సాధ్యమైనంత మేరకు ముందు, మనం ఆయనలా ఆలోచించడం, భావించడం నేర్చుకోవాలి. కాబట్టి, మనం సువార్త రచయితల సహాయంతో క్రీస్తు మనస్సులోకి తొంగి చూద్దాము. యేసు ఆలోచనలను, భావాలను ప్రభావితం చేసిన కారకాలను ముందు మనం చర్చిద్దాము.

ఆయన మానవపూర్వపు ఉనికి

5, 6. (ఎ) మన సహచరులు మనపై ఏ ప్రభావాన్ని చూపగలరు? (బి) భూమి మీదికి రాకముందు దేవుని జ్యేష్ఠ కుమారునికి పరలోకంలో ఎటువంటి సాహచర్యం లభించింది, అది ఆయనపై ఏ ప్రభావాన్ని చూపించింది?

5 మన సన్నిహిత సహచరులు మన తలంపులను, భావాలను, చర్యలను ప్రభావితం చేస్తూ, మనపై మంచి ప్రభావాన్నైనా లేదా చెడు ప్రభావాన్నైనా చూపించగలరు. * (సామెతలు 13:20) భూమి మీదికి రాక ముందు పరలోకంలో యేసుకు ఎటువంటి సాహచర్యం ఉండేదో ఒకసారి పరిశీలించండి. యోహాను సువార్త, యేసు మానవ పూర్వపు ఉనికిని “వాక్యము” లేక దేవుని వాగ్దూత అని సూచిస్తుంది. “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము [“ఒక,” NW] దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను” అని యోహాను చెప్తున్నాడు. (యోహాను 1:1, 2) యెహోవాకు “ఆది” లేదు గనుక, వాక్యము “ఆది” యందు దేవుని యొద్ద ఉండటమంటే, అది దేవుని సృష్టికార్యాల ప్రారంభాన్ని సూచిస్తుండాలి. (కీర్తన 90:2) యేసు “సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.” కాబట్టి, ఇతర ఆత్మ ప్రాణులూ, భౌతిక విశ్వమూ సృష్టించబడక మునుపే ఆయన ఉన్నాడు.—కొలొస్సయులు 1:15; ప్రకటన 3:14.

6 కొన్ని వైజ్ఞానిక అంచనాల ప్రకారం, భౌతిక విశ్వం కనీసం 12 బిలియన్ల సంవత్సరాల నుండి ఉనికిలో ఉంది. ఆ అంచనాలు ఏమాత్రం సరైనవైనా, దాని అర్థం ఆదాము సృష్టించబడక ముందు, దేవుని జ్యేష్ఠ కుమారుడు యుగాలపాటు తన తండ్రితో సన్నిహిత సాహచర్యాన్ని ఆనందించాడు. (పోల్చండి మీకా 5:2.) కాబట్టి వాళ్లిద్దరి మధ్యా ఒక సున్నితమైన, ప్రగాఢమైన అనుబంధం ఏర్పడింది. మూర్తీభవించిన జ్ఞానముగా, ఈ జ్యేష్ఠ కుమారుడు తన మానవపూర్వపు ఉనికిలో, ఇలా చెప్తున్నట్లుగా అభివర్ణించబడుతున్నాడు: “నేను . . . అనుదినము సంతోషించుచు నిత్యము [యెహోవా] సన్నిధిని ఆనందించుచునుంటిని.” (సామెతలు 8:30) ప్రేమకే మూలమైన దేవునితో లెక్కలేనన్ని యుగాలు సన్నిహిత సాహచర్యం చేయడం నిస్సందేహంగా ఆయన కుమారునిపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపింది! (1 యోహాను 4:8) ఈ కుమారుడు, మరెవ్వరూ చేయలేని విధంగా, తన తండ్రి తలంపులను, భావాలను, మార్గాలను తెలుసుకుని వాటిని ప్రతిబింబించడం నేర్చుకున్నాడు.—మత్తయి 11:27.

భూ జీవితం, ప్రభావాలు

7. దేవుని జ్యేష్ఠ కుమారుడు భూమి మీదికి రావడానికి గల కారణాల్లో ఒకటేమిటి?

7 దేవుని కుమారుడు ఇంకా ఎంతో నేర్చుకోవలసి ఉంది, ఎందుకంటే యెహోవా తన కుమారుడ్ని, “మన బలహీనతలయందు మనతో సహానుభవము” కల్గివుండగల ప్రేమగల ప్రధాన యాజకునిగా ఆయత్తపర్చాలని సంకల్పించాడు. (హెబ్రీయులు 4:15) కుమారుడు మానవునిగా భూమిమీదికి రావడానికి గల కారణాల్లో ఒకటి, ప్రధాన యాజకుని పాత్రకు అవసరమైన అర్హతలను సంపాదించడం. యేసు మునుపు తాను పరలోకం నుండి కేవలం గమనించిన పరిస్థితులనూ, ప్రభావాలనూ, రక్తమాంసాలుగల మానవునిగా ఈ భూమ్మీదికి వచ్చి స్వయంగా అనుభవించాడు. ఇప్పుడాయన మానవ భావాలను, భావోద్రేకాలను ప్రత్యక్షంగా అనుభవించగలిగాడు. కొన్నిసార్లు ఆయన అలసిపోయాడు, ఆకలిగొన్నాడు, దప్పిగొన్నాడు. (మత్తయి 4:2; యోహాను 4:6, 7) అంతకంటే ఎక్కువగా, ఆయన అన్ని రకాలైన కష్టాలను, బాధలను సహించాడు. అలా ఆయన “విధేయతను నేర్చుకొ[ని],” ప్రధాన యాజకునిగా తన పాత్రకు సంపూర్ణంగా అర్హుడయ్యాడు.—హెబ్రీయులు 5:8-10.

8. యేసు భూమి మీద గడిపిన జీవితపు తొలి భాగం గురించి మనకేమి తెలుసు?

8 యేసు భూమి మీద గడిపిన జీవితపు తొలి భాగంలోని అనుభవాల మాటేమిటి? ఆయన బాల్యాన్ని గురించిన వృత్తాంతం చాలా క్లుప్తంగా ఉంది. వాస్తవానికి, ఆయన జననానికి సంబంధించిన సంఘటనలను కేవలం మత్తయి, లూకా మాత్రమే నివేదించారు. భూమి మీదికి రాకముందు యేసు పరలోకంలో జీవించాడని సువార్త రచయితలకు తెలుసు. మరి దేనికన్నా కూడా ఎక్కువగా, ఆ మానవ పూర్వపు ఉనికే ఆయన ఎలాంటి వ్యక్తి అయ్యాడనే దానికి ఆధారమై ఉంది. ఏదేమైనప్పటికీ, యేసు సంపూర్ణంగా మానవుడే. పరిపూర్ణుడే అయినప్పటికీ, ఆయన శైశవ దశ నుండి బాల్య దశకు, కౌమార ప్రాయం నుండి యౌవన దశకు చేరుకోవలసి వచ్చింది, ఆ దశలన్నింట్లో ఆయన విషయాల్ని నేర్చుకుంటూనే ఉన్నాడు. (లూకా 2:51, 52) యేసును నిస్సందేహంగా ప్రభావితం చేసిన ఆయన జీవితపు తొలికాలంలోని కొన్ని విషయాల గురించి బైబిలు తెలియజేస్తుంది.

9. (ఎ) యేసు పేద కుటుంబంలో జన్మించాడనటానికి ఏ సూచన ఉంది? (బి) యేసు ఏ విధమైన పరిస్థితుల్లో పెరిగి ఉండవచ్చు?

9 యేసు పేద కుటుంబంలో జన్మించాడన్నది స్పష్టం. ఆయన జన్మించిన 40 దినాల తర్వాత యోసేపు మరియలు ఆలయంలోకి తీసుకువచ్చిన అర్పణను బట్టి ఆ విషయం వెల్లడౌతుంది. దహనబలిగా గొఱ్ఱెపిల్లనూ, దానితోపాటే పాపపరిహారార్థబలిగా పావురం పిల్లనుగానీ తెల్లగువ్వనుగానీ తెచ్చే బదులు, వాళ్లు కేవలం ‘గువ్వల జతనో రెండు పావురపు పిల్లలనో’ మాత్రమే తెచ్చారు. (లూకా 2:24) మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ అర్పణ పేదవారి కోసం చేయబడిన ఏర్పాటు. (లేవీయకాండము 12:6-8) కొంతకాలానికి, ఈ నిరాడంబరమైన కుటుంబం పెరిగింది. యేసు అద్భుత జననం తర్వాత, యోసేపు మరియలకు ప్రకృతి సిద్ధంగానే కనీసం మరో ఆరుగురు పిల్లలు కలిగారు. (మత్తయి 13:55, 56) కాబట్టి, యేసు ఒక పెద్ద కుటుంబంలో, అదీ చాలా సాధారణమైన పరిస్థితుల్లో పెరిగాడు.

10. యోసేపు మరియలు దైవభయంగల వారని ఏది చూపిస్తుంది?

10 యేసు దైవభయంగల తల్లిదండ్రుల చేతుల్లో పెరిగాడు, వాళ్లు ఆయన గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఆయన తల్లియైన మరియ, ఎంతో ప్రత్యేకమైన స్త్రీ. ఆమెను పలుకరిస్తూ, గబ్రియేలు దూత, “దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని” చెప్పాడని జ్ఞాపకం చేసుకోండి. (లూకా 1:28) యోసేపు కూడా భక్తిగలవాడే. పస్కా ఆచరణ కోసం ఆయన ప్రతి సంవత్సరం నమ్మకంగా యెరూషలేముకు 150 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. కేవలం పురుషులే అలా వెళ్లాల్సివున్నప్పటికీ, మరియ కూడా హాజరయ్యేది. (నిర్గమకాండము 23:17; లూకా 2:41) అలాంటి ఒక సందర్భంలో, యోసేపు మరియలు పన్నెండేళ్ల యేసు కోసం తీవ్రంగా గాలించిన తర్వాత ఆయన ఆలయంలో బోధకుల మధ్యన కూర్చుని ఉండగా కనుగొన్నారు. కలత చెందిన తన తల్లిదండ్రులతో యేసు ఇలా అన్నాడు: “నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా?” (లూకా 2:49) “తండ్రి” అనే ఆ మాట యౌవనుడైన యేసుకు ఎంతో ఆప్యాయమైన, అనుకూలమైన భావాన్ని కల్గించి ఉండవచ్చు. ఒక విషయం ఏమిటంటే, ఆయన నిజమైన తండ్రి యెహోవా అని ఆయనకు చెప్పబడిందని స్పష్టమౌతుంది. అంతేగాక, యోసేపు యేసుకు మంచి పెంపుడు తండ్రిగా ఉండివుంటాడు. యెహోవా కచ్చితంగా, తన ప్రియ కుమారుడ్ని పెంచడానికి కఠినుడైన లేక క్రూరుడైన వ్యక్తిని ఎంపిక చేసుకుని ఉండడు!

11. యేసు ఏ వృత్తిని నేర్చుకున్నాడు, బైబిలు కాలాల్లో ఈ విధమైన పనిచేయడంలో ఏమి ఇమిడి ఉండేది?

11 యేసు తాను నజరేతులో ఉన్న సంవత్సరాల్లో, బహుశ తన పెంపుడు తండ్రియైన యోసేపు దగ్గర వడ్రంగం నేర్చుకున్నాడు. యేసు ఆ వృత్తిలో ఎంత నైపుణ్యం సంపాదించాడంటే ఆయన స్వయంగా “వడ్లవాడు” అని పిలువబడ్డాడు. (మార్కు 6:3) బైబిలు కాలాల్లో, వడ్రంగివాళ్లు ఇళ్లు నిర్మించేవారు, (బల్లలు, ముక్కాలి పీటలు, బెంచీలు వంటివాటితో సహా) కలప వస్తువులను, వ్యవసాయ ఉపకరణాలను తయారు చేసేవారు. సా.శ. రెండవ శతాబ్దానికి చెందిన జస్టిన్‌ మార్టిర్‌ డైలాగ్‌ విత్‌ ట్రైఫో అనే తన పుస్తకంలో, యేసు గురించి ఇలా వ్రాశాడు: “ఆయన భూమిపైనున్నప్పుడు నాగలి, ఎడ్లకాడి వంటివి తయారు చేస్తూ వడ్రంగివానిగా పనిచేసే వాడు.” అలాంటి పని సులభమేమీ కాదు, ఎందుకంటే ప్రాచీన కాలానికి చెందిన వడ్రంగి తనకు కావలసిన కలపను కొనడం బహుశ సాధ్యమయ్యేది కాదు. ఆయన బయటికి వెళ్లి ఒక చెట్టును ఎంపిక చేసుకుని, దాన్ని నరికి, ఆ కలపను ఇంటికి మోసుకువచ్చేవాడు. కాబట్టి జీవనోపాధి సంపాదించుకోవడం, వినియోగదారులతో వ్యవహరించడం, కుటుంబాన్ని ఆర్థికంగా నడిపించడం వంటి విషయాల్లో ఇమిడివున్న సవాళ్లు యేసుకు తెలిసే ఉండవచ్చు.

12. యోసేపు యేసు కన్నా ముందే చనిపోయి ఉండవచ్చని ఏది సూచిస్తుంది, అలా జరగడం యేసుపై ఏ భారాన్ని మోపి ఉండవచ్చు?

12 ప్రాముఖ్యంగా, యేసు కంటే ముందే యోసేపు చనిపోయినట్లు అనిపిస్తుంది గనుక పెద్ద కుమారునిగా యేసు బహుశ కుటుంబ బాధ్యతల్లో చేదోడు వాదోడుగా ఉండి ఉంటాడు. * జనవరి 1, 1900 నాటి జాయన్స్‌ వాచ్‌ టవర్‌ ఇలా తెలియజేసింది: “యేసు ఇంకా యౌవనునిగా ఉన్నప్పుడే యోసేపు మరణించాడనీ, యేసు వడ్రంగం వృత్తిని చేపట్టి కుటుంబాన్ని పోషించేవాడయ్యాడనీ సాంప్రదాయకంగా నమ్మడం జరుగుతుంది. దీనికి, యేసు స్వయంగా వడ్లవాడని పిలువబడటం, ఆయన తల్లి సహోదరసహోదరీల గురించి ప్రస్తావించబడి, యోసేపు గురించిన ప్రస్తావన లేకపోవడం వంటి లేఖనాధార సాక్ష్యపు మద్దతు కొంత ఉంది. (మార్కు 6:3) . . . కాబట్టి మన ప్రభువు జీవితంలోని 18 సంవత్సరాల దీర్ఘకాలం, అంటే [లూకా 2:41-49 నందు వ్రాయబడివున్న] సంఘటన జరిగిన కాలం నుండి ఆయన బాప్తిస్మం వరకున్న కాలం, జీవితపు సాధారణ విధులను నిర్వర్తించడంలో గడిచి ఉండవచ్చు.” మరియకు, యేసుతో సహా ఆమె పిల్లలకు, ప్రియమైన భర్తా, తండ్రీ మరణిస్తే కలిగే బాధ బహుశా తెలిసే ఉండవచ్చు.

13. యేసు తన పరిచర్యను ఏ మానవుడూ కలిగి ఉండలేనంతటి జ్ఞానము, అంతర్దృష్టి, ప్రగాఢమైన భావాలతో ఎందుకు ప్రారంభించగలిగాడు?

13 యేసు కులాసా జీవితాన్నేమీ గడపలేదని స్పష్టమౌతుంది. ఆయన సామాన్య జీవితాన్ని స్వయంగా అనుభవించాడు. తర్వాత, సా.శ. 29కల్లా, యేసు తన కోసం వేచివున్న దైవిక నియామకాన్ని చేపట్టే సమయం ఆసన్నమైంది. ఆ సంవత్సరం శరదృతువులో, ఆయన నీటిలో బాప్తిస్మం తీసుకుని దేవుని ఆత్మ కుమారునిగా జన్మించాడు. ‘ఆకాశము తెరవబడింది’ అన్న విషయం, ఆయన పరలోకంలో తాను కలిగివున్నప్పటి మానవపూర్వపు ఉనికి, దానికి సంబంధించిన తలంపులు భావాలతో సహా ఆయనకు తిరిగి జ్ఞాపకం రావడాన్ని సూచిస్తుందని స్పష్టమౌతుంది. (లూకా 3:21, 22) కాబట్టి యేసు తన పరిచర్యను, ఏ మానవుడూ కలిగి ఉండలేనంతటి జ్ఞానము, అంతర్దృష్టి, ప్రగాఢమైన భావాలతో ప్రారంభించాడు. సరైన కారణంతోనే, సువార్త రచయితలు తమ రచనల్లో యేసు పరిచర్యలోని సంఘటనలనే ఎక్కువగా ప్రస్తావించారు. అయినప్పటికీ, వాళ్లు ఆయన చెప్పినవీ, చేసినవీ అన్నీ వ్రాయలేకపోయారు. (యోహాను 21:25) కానీ వాళ్లు ఏమి వ్రాసేందుకు ప్రేరేపించబడ్డారో అది, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అయిన ఆయన మనస్సులోకి తొంగి చూడటానికి మనకు సహాయం చేస్తుంది.

ఒక వ్యక్తిగా యేసు

14. సువార్తలు యేసును, సున్నితమైన ప్రేమా, లోతైన భావాలూ గల వ్యక్తిగా ఎలా చూపిస్తున్నాయి?

14 సువార్తల నుండి తెలియవచ్చే యేసు వ్యక్తిత్వం, ప్రేమాభిమానాలు గల వ్యక్తిని సూచిస్తుంది. ఆయన అనేక రకాలైన భావోద్వేగ ప్రతిస్పందనలను ప్రదర్శించాడు: కుష్ఠురోగిపట్ల కనికరం (మార్కు 1:40, 41); స్పందనలేని ప్రజలను గూర్చి సంతాపం (లూకా 19:41, 42); దురాశాపరులైన రూకలుమార్చేవారి పట్ల నీతియుక్తమైన ఆగ్రహం (యోహాను 2:13-17). తదనుభూతిగల యేసు, కన్నీళ్లు కార్చాడు, ఆయన తన భావోద్రేకాలను ఎంతమాత్రం దాచుకోలేదు. తన ప్రియ స్నేహితుడైన లాజరు మరణించినప్పుడు, లాజరు సహోదరియైన మరియ ఏడ్వడం యేసును ఎంత లోతుగా కదిలించిందంటే, ఆయన కన్నీళ్లు కార్చాడు, అదీ అందరి ముందూ.—యోహాను 11:32-36.

15. ఇతరులను దృష్టించడంలోనూ, వారితో వ్యవహరించడంలోనూ యేసుకున్న సున్నితమైన భావాలు ఎలా ప్రస్ఫుటమయ్యాయి?

15 యేసు ఇతరులను దృష్టించడంలోనూ, వారితో వ్యవహరించడంలోనూ ఆయనకున్న సున్నితమైన భావాలు ప్రత్యేకంగా ప్రస్ఫుటమయ్యాయి. ఆయన బీదల వద్దకు, అణచివేయబడినవారి వద్దకు వెళ్లి వారి ‘ప్రాణములకు విశ్రాంతి కలుగజేశాడు.’ (మత్తయి 11:4, 5, 28-30) ఆయన బాధింపబడుతున్న వారి అవసరాలను పట్టించుకోలేనంత బిజీగా ఉండేవాడుకాదు, అది మెల్లిగా తన వస్త్రాన్ని ముట్టిన రక్తస్రావరోగంగల స్త్రీపట్లనైనా కానీ, ఊరుకోమని చెప్పినా ఊరుకోని గ్రుడ్డి భిక్షకునిపట్లనైనా కానీ. (మత్తయి 9:20-22; మార్కు 10:46-52) యేసు ఇతరుల్లో ఉన్న మంచిని చూసి, వారిని మెచ్చుకునేవాడు; అయినప్పటికీ అవసరమైనప్పుడు గద్దించాడు కూడా. (మత్తయి 16:23; యోహాను 1:47; 8:44) స్త్రీలకు నామమాత్రపు హక్కులు ఉన్న కాలంలో, యేసు స్త్రీలతో తగినంత ఘనతా గౌరవాలతో వ్యవహరించాడు. (యోహాను 4:9, 27) కొంతమంది స్త్రీలు తమ స్వంత ఖర్చులతో ఆయనకు పరిచర్య చేయడానికి ఇష్టపడ్డారంటే అది అర్థం చేసుకోదగినదే.—లూకా 8:3.

16. యేసుకు జీవితం గురించి, వస్తుసంపదల గురించి సమతూకమైన దృక్పథం ఉండేదని ఏది చూపిస్తుంది?

16 యేసుకు జీవితం గురించి సమతుల్యమైన దృక్కోణం ఉంది. వస్తుసంపదలు ఆయనకు ప్రధానమైనవి కాదు. వస్తుపరంగా ఆయనకు ఎక్కువేమీ లేదనిపిస్తుంది. తనకు “తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని” ఆయన చెప్పాడు. (మత్తయి 8:20) అదే సమయంలో, యేసు ఇతరుల సంతోషానికి దోహదపడ్డాడు. సాధారణంగా గానప్రతిగానాలూ, ఆనందోత్సాహాలు ఉండే సమయమైన వివాహ వేడుకకు ఆయనొకసారి హాజరైనప్పుడు, ఆయన ఆ సందర్భాన్ని నీరుగార్చడానికి అక్కడికి రాలేదని స్పష్టమైంది. నిజానికి, యేసు అక్కడ తన మొదటి అద్భుతాన్ని చేశాడు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు, ఆయన నీటిని, “నరుల హృదయమును సంతోషపెట్టు” చక్కని ద్రాక్షారసంగా మార్చాడు. (కీర్తన 104:15; యోహాను 2:1-11) అలా ఆ వేడుకలు కొనసాగాయి, పెండ్లి కుమారునికి, పెండ్లి కుమార్తెకు అవమానం తప్పింది. యేసు తన పరిచర్యలో ఎంతో సమయంపాటు, ఎంతో కష్టపడి పనిచేసిన అనేకానేక సందర్భాల ప్రస్తావనలో, ఆయనకున్న సమతూకం స్పష్టమౌతుంది.—యోహాను 4:34.

17. యేసు నేర్పరియైన బోధకుడై ఉన్నాడంటే ఎందుకు ఆశ్చర్యపోనవసరం లేదు, ఆయన బోధలు దేన్ని ప్రతిబింబించాయి?

17 యేసు నేర్పుగల బోధకుడు. ఆయన చేసిన బోధలో అధికభాగం, ఆయనకు సుపరిచితమైయున్న అనుదిన జీవిత వాస్తవాలను ప్రతిబింబించేది. (మత్తయి 13:33; లూకా 15:8) ఆయన బోధనా విధానం అపూర్వం—సుస్పష్టం, సుబోధకం, ఆచరణీయం. ఆయన బోధించినది మరింత గమనార్హమైనది. ఆయన చేసిన బోధలు, తన శ్రోతలకు యెహోవా తలంపుల గురించి, భావాల గురించి, మార్గాల గురించి పరిచయం చేయాలన్న ఆయన హృదయపూర్వక కోరికను ప్రతిబింబించాయి.—యోహాను 17:6-8.

18, 19. (ఎ) యేసు తన తండ్రిని ఏ స్పష్టమైన పదోపమానాలతో అభివర్ణించాడు? (బి) తర్వాతి శీర్షికలో ఏమి చర్చించబడుతుంది?

18 తరచూ దృష్టాంతాలను ఉపయోగిస్తూ, యేసు తన తండ్రిని, అంత సులభంగా మరిచిపోలేని సుస్పష్టమైన పదోపమానాలతో వ్యక్తపర్చాడు. దేవుడు చూపించే కనికరం గురించి సాధారణంగా మాట్లాడటం సులభమే. అయితే, తిరిగి వస్తున్న తన కుమారుడ్ని చూసి లోతుగా చలించిపోయి “పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టు”కునే క్షమాగుణం గల తండ్రితో యెహోవాను పోల్చడం అంత సులభమైన విషయం కాదు. (లూకా 15:11-24) మతనాయకులు సామాన్య ప్రజలను చిన్న చూపు చూసే కఠినమైన సంప్రదాయాన్ని తృణీకరిస్తూ యేసు, తన తండ్రి, వేషధారణతో కూడిన పరిసయ్యుని ప్రార్థన కంటే వినయస్థుడైన సుంకరి చేసిన విన్నపాలను వినడానికి సుముఖత చూపించిన సమీపించదగిన దేవుడని వివరించాడు. (లూకా 18:9-14) యేసు, చిన్ని పిచ్చుక ఎప్పుడు భూమి మీదికి పడిపోతుందో తెలిసిన శ్రద్ధగల దేవునిగా యెహోవాను అభివర్ణించాడు. “భయపడకుడి” అని అభయాన్నిస్తూ, “మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు” అని యేసు తన శిష్యులతో అన్నాడు. (మత్తయి 10:29, 31) ప్రజలు యేసు “బోధకు” ఆశ్చర్యపోతూ ఆయనవైపు ఆకర్షించబడ్డారంటే అది అర్థం చేసుకొనదగినదే. (మత్తయి 7:28, 29) అంతెందుకు, ఒక సందర్భంలో “బహు జనులు” కనీసం తిండి కూడా తినకుండా ఆయన దగ్గరే మూడు రోజుల పాటు ఉండిపోయారు.—మార్కు 8:1, 2.

19 యెహోవా తన వాక్యంలో క్రీస్తు మనస్సును బయల్పర్చినందుకు మనం కృతజ్ఞత కల్గివుండాలి! అయితే మనం క్రీస్తు మనస్సును ఎలా అలవర్చుకోగలము, ఇతరులతో వ్యవహరించేటప్పుడు దాన్నెలా ప్రదర్శించగలము? ఇది తరువాతి శీర్షికలో చర్చించబడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 5 ఆత్మ ప్రాణులు తమ సహవాసం మూలంగా ప్రభావితం కాగలరన్నది ప్రకటన 12:3, 4 నందు సూచించబడింది. అక్కడ, ఇతర “నక్షత్రము”లు అంటే ఆత్మ కుమారులు తనతోపాటు తిరుగుబాటు చేసేలా తన ప్రభావాన్ని ఉపయోగించగలిగిన “ఘటసర్పము”గా సాతాను వర్ణించబడ్డాడు.—పోల్చండి యోబు 38:7.

^ పేరా 12 పన్నెండేళ్ల యేసు ఆలయంలో కనుగొనబడినప్పుడు మాత్రమే యోసేపు గురించి చివరిసారిగా, సూటిగా ప్రస్తావించబడింది. యేసు పరిచర్యారంభంలో, కానాలో జరిగిన వివాహ వేడుకకు యోసేపు హాజరైన సూచనేమీ లేదు. (యోహాను 2:1-3) సా.శ. 33 లో మ్రానున వ్రేలాడదీయబడిన యేసు, మరియను తన ప్రియ అపొస్తలుడైన యోహానుకు అప్పగించాడు. యోసేపు సజీవంగానే ఉండివుంటే యేసు బహుశ అలా చేసి ఉండేవాడు కాదు.—యోహాను 19:26, 27.

మీకు జ్ఞాపకమున్నాయా?

• మనం “క్రీస్తు మనస్సు”తో పరిచయం ఏర్పరచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

• యేసుకు తన మానవ పూర్వపు ఉనికిలో ఎలాంటి సాహచర్యం లభించింది?

• యేసు తన భూజీవిత కాలంలో, ఎటువంటి పరిస్థితులను, ప్రభావాలను స్వయంగా అనుభవించాడు?

• యేసు వ్యక్తిత్వం గురించి సువార్తలు ఏమి బయల్పరుస్తున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రం]

యేసు ఒక పెద్ద కుటుంబంలో, బహుశ సాధారణమైన పరిస్థితుల్లో పెరిగాడు

[12వ పేజీలోని చిత్రాలు]

పన్నెండేళ్ల యేసులోని అవగాహనను, ఆయనిచ్చిన సమాధానాలను చూసి బోధకులు అబ్బురపడ్డారు