కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గౌరవం ఇవ్వడం—క్రైస్తవ ఆవశ్యకత

గౌరవం ఇవ్వడం—క్రైస్తవ ఆవశ్యకత

గౌరవం ఇవ్వడం—క్రైస్తవ ఆవశ్యకత

గౌరవం ఇవ్వడంలో, గౌరవించదగిన వ్యక్తి అని ఎంచబడిన వ్యక్తికి ప్రత్యేక అవధానాన్ని ఇవ్వడం లేదా లోబడడం, ఆ వ్యక్తినీ, ఆ వ్యక్తి గుణాలనూ, ఆ వ్యక్తి సాధించిన విషయాలనూ, ఆ వ్యక్తి స్థానాన్నీ, పదవినీ లేదా అధికారాన్నీ గుర్తించడం లేదా లక్ష్యపెట్టడం, ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. బైబిలు వ్రాయబడిన మూల భాషల్లో కూడా, దీనికి సంబంధించి ఉపయోగించబడిన మాటలు, ఘనతనివ్వడం, సన్మానించడం, లేదా ఆరోగ్యకరమైన భయాన్ని కలిగివుండడం అనే భావాన్ని సూచిస్తున్నాయి. క్రైస్తవులు గౌరవం చూప బద్ధులై ఉన్నారు అని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఎవరికి గౌరవం చూపవలసి ఉంది?

యెహోవాకు గౌరవం చూపడం

యెహోవా దేవుడు సృష్టికర్త కనుక, బుద్ధిసూక్ష్మతగల జీవులన్నింటి నుండీ అత్యంత ఘనతనూ, ప్రగాఢమైన గౌరవాన్నీ పొందడానికి యోగ్యుడు. (ప్రకటన 4:11) ఆయన మీది ప్రేమను బట్టి, తమ కోసం ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనకు వ్యక్తిగతంగా నమ్మకంగా విధేయత చూపవలసి ఉంది. (1 యోహాను 5:3) “నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు?” అని ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోవా అడిగాడు. గౌరవభావంతో, యెహోవాకు ఘనతను చూపించడంలో, ఆయనకు అప్రీతి కలుగుతుందేమోనన్న దైవికమైన భక్తిపూర్వకమైన భయాన్ని కలిగివుండడం కూడా ఇమిడి ఉంది.—మలాకీ 1:6.

ప్రధాన యాజకుడైన ఏలీ కుమారులైన హోఫ్నీ ఫీనెహాసులు అలాంటి దైవిక భయాన్ని కనబరచలేదు. వాళ్ళు, తమ మహా గొప్ప యజమానుడైన యెహోవా ధర్మశాస్త్రానికి అవిధేయత చూపిస్తూ, దేవుని ఆరాధన మందసం దగ్గర దేవునికి అర్పించబడిన ప్రతి నైవేద్యం నుండీ శ్రేష్ఠమైన భాగములను పట్టుకున్నారు. సృష్టికర్తకు చెందవలసిన వాటిని ఎవరైనా తమ కోసం తీసుకుంటున్నట్లయితే, వాళ్ళు నిశ్చయముగా పవిత్ర కార్యాల విషయమై అగౌరవాన్ని చూపిస్తున్నట్లే. తన కుమారులు ఈ విధంగా చేస్తున్నందుకు ఏలీ గట్టి చర్యలు తీసుకోకుండా, యెహోవా కన్నా తన కుమారులకే ఎక్కువ ఘనతనిచ్చాడు. యెహోవాకు చెందవలసిన ఘనతను ఇవ్వడంలో విఫలులైనందువల్ల, ఏలీ కుటుంబం తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వచ్చింది.—1 సమూయేలు 2:12-17, 27-29; 4:11, 18-21.

నమ్మకమైన విధేయతతో యెహోవాకు చూపవలసిన గౌరవం ఎంత విస్తృతమైనదంటే, అందులో సొంత ఆస్తులను ఉపయోగించడం కూడా ఇమిడి ఉంది. “నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము” అని సామెతలు 3:9 లో చదువుతాం. ఒక వ్యక్తి యొక్క సమయాన్నీ, శక్తినీ, వస్తు సంపదలనూ, యెహోవా ఆరాధనా సంబంధమైన ఆసక్తుల అభివృద్ధి కోసం ఉపయోగించవచ్చు.

దేవుని ప్రాచీన, ఆధునిక ప్రతినిధుల మీద గౌరవం

యెహోవా పక్షాన మాట్లాడే ప్రతినిధులుగా ప్రవక్తలు గౌరవానికి అర్హులు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రవక్తలకు అలాంటి గౌరవాన్ని చూపించే బదులు, తరచూ వారిని మాటలతో హింసించారు, శారీరకంగాను హింసించారు, వారిని చంపేశారు కూడా. యెహోవా ప్రతినిధులకు గౌరవం చూపించని ఇశ్రాయేలు జనాంగపు వైఖరి దేవుని కుమారుడ్ని చంపడంతో పరాకాష్ఠకు చేరుకుంది. “కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు” అని యేసు అన్నాడు. (యోహాను 5:23) వాళ్ళు అపనమ్మకస్థులుగా ఉంటూ యెహోవాను అంతగా అవమానించినందువల్ల, యెరూషలేముపై సా.శ. 70 లో యెహోవా ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు.—మార్కు 12:1-9.

క్రైస్తవ సంఘంలో, బోధకులుగా ప్రత్యేక బాధ్యతలు ఉన్నవారు తోటి విశ్వాసుల నుండి మద్దతునూ గౌరవాన్నీ పొందనర్హులు. (హెబ్రీయులు 13:7, 17) అపొస్తలుడైన పౌలు, తిమోతికి వ్రాస్తూ, ఈ పైవిచారణకర్తలు ‘రెట్టింపు సన్మానమునకు పాత్రులు’ అని చెప్పాడు. వాళ్ళను సన్మానించడంలో, వాళ్ళు సంఘం కోసం చేసే కష్టానికి తోడ్పాటుగా వాళ్ళకు వస్తుపరంగా లేక డబ్బుపరంగా స్వచ్ఛందంగా సహాయం చేయడం కూడా ఇమిడి ఉండవచ్చు. (1 తిమోతి 5:17, 18) అయితే, క్రైస్తవులందరూ, తమ తోటి విశ్వాసుల నుండి ఘనతను పొందేందుకు అర్హులు. పౌలు, “ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి” అని కూడా ఉపదేశిస్తున్నాడు. (రోమీయులు 12:10) ప్రతి క్రైస్తవునికీ/క్రైస్తవురాలికీ తన సొంత వైఫల్యాల గురించి తోటి క్రైస్తవుల కన్నా తనకే బాగా తెలుసు కనుక, ఆయన/ఆమె, తన కన్నా తోటి క్రైస్తవులకు ఎంతో విలువ ఇస్తూ, వాళ్ళకు అన్నివేళలా గౌరవాన్నిస్తూ, వాళ్ళకు ప్రథమ స్థానం ఇవ్వడం సరైనది.—ఫిలిప్పీయులు 2:1-4.

కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకుంటారు

భార్య, తన భర్తకు, కుటుంబ శిరస్సుగా ఆరోగ్యకరమైన భయాన్ని లేదా ప్రగాఢమైన గౌరవాన్ని చూపించడం సరైనది. (ఎఫెసీయులు 5:33) ఇది దేవుని ఏర్పాటులో పురుషుడికి దేవుడు ఇచ్చిన మొదటి స్థానానికి అనుగుణ్యంగా ఉంటుంది. దేవుడు మొదట సృష్టించింది, పురుషుడ్నే కానీ, స్త్రీని కాదు. “పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు.” (1 కొరింథీయులు 11:7-9; 1 తిమోతి 2:11-13) తన భర్త మీద ప్రగాఢమైన గౌరవంగల స్త్రీగా శారా గమనించదగిన మాదిరిగా ఉంది. ఆమెకు ఆయన మీద గౌరవం అన్నది హృదయాంతరం నుండే ఉన్నది. ఆమె తన భర్త గురించి “యజమానుడు” అని ఇతరులు ఉన్నప్పుడు అనడమే కాక, “తనలో” తాను కూడా అలాగే అనుకునేది.—1 పేతురు 3:1, 2, 5, 6; ఆదికాండము 18:12.

మరొకవైపు, “పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి” అని భర్తలకు బోధించబడుతుంది. (1 పేతురు 3:7) కనుక, ఆత్మాభిషిక్త క్రైస్తవ భర్తలు, క్రీస్తు తోడి వారసులుగా తమతోపాటు, తమ భార్యలకు సమానమైన స్థానముందన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవలసి ఉండింది, వారు పురుషుల కన్నా తక్కువ బలవంతులు అని గుర్తిస్తూ, వారిని సన్మానించవలసి ఉండింది.—గలతీయులు 3:28.

ఇక పిల్లల విషయానికి వస్తే, తల్లిదండ్రులు దేవుని ప్రతినిధులు, పిల్లలకు తర్ఫీదునిచ్చే శిక్షణనిచ్చే నడిపింపునిచ్చే అధికారం వారికి ఉంది. కనుక తల్లిదండ్రులు, సన్మానానికి లేదా గౌరవానికి అర్హులు. (ఎఫెసీయులు 6:1-3) ఇది, బాల్యంలో తమ తల్లిదండ్రులకు విధేయత చూపడం వరకే, తల్లిదండ్రులంటే గౌరవం ఉండడం వరకే పరిమితం కావడంలేదు. తల్లిదండ్రులను వారి శేష జీవితంలో, అవసరమైనప్పుడు ప్రేమపూర్వకంగా చూసుకోవడం కూడా ఇందులో ఇమిడి ఉంది. వృద్ధులైన, అవసరంలో ఉన్న తమ తల్లిదండ్రులను సంరక్షిస్తూ గౌరవాన్ని చూపించడంలో విఫలులైనవారిని విశ్వాసం లేని వ్యక్తికన్నా చెడ్డవారిగా క్రైస్తవ సంఘంలోనివారు ఎంచేవారు. (1 తిమోతి 5:8) అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినట్లే, భౌతికంగా సహాయం చేయగల పిల్లలూ, మనవళ్ళూ ఉన్న విధవరాండ్రను సంరక్షించే బాధ్యతను సంఘం తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు.—1 తిమోతి 5:4.

పరిపాలకులపైనా, సంఘానికి వెలుపల ఉన్నవారిపైనా గౌరవం

ఉన్నత ప్రభుత్వాధికారులను కూడా సన్మానించాలి, లేదా గౌరవించాలి. ఒక క్రైస్తవుడు అలాంటి గౌరవాన్ని చూపించేది అది దేవుని చిత్తమైనందువల్లే గానీ, వాళ్ళ ప్రీతిని సంపాదించాలనే ఉద్దేశంతో మాత్రం కాదు. వ్యక్తిగతంగా ఈ అధికారులు అవినీతిపరులు కావచ్చు. (పోల్చండి అపొస్తలుల కార్యములు 24:24-27.) వాళ్ళున్న ఆ పదవిలో వాళ్ళకున్న బాధ్యతాయుతమైన స్థానాన్ని బట్టి వారికి గౌరవం ఇస్తారు. (రోమీయులు 13:1, 2, 7; 1 పేతురు 2:13, 14) అలాగే, దాసులు తమ యజమానులను పూర్తి సన్మానానికి యోగ్యులని ఎంచుతూ, దేవుని నామంపై నింద రాకుండా తమకు ఇవ్వబడిన పనిని గౌరవపూర్వకంగా చేయవలసి ఉండింది.—1 తిమోతి 6:1.

తన నిరీక్షణకు కారణాన్ని తెలపమని ఒక క్రైస్తవుడ్ని ఎవరైనా అడిగినప్పుడు, “సాత్వికముతోను భయముతోను [“ప్రగాఢమైన గౌరవముతోను,” NW]” సమాధానమిస్తాడు. అవమానించే విధంగా ప్రశ్నలను వేసినప్పటికీ, క్రైస్తవుడు చికాకుపడుతూనో, కోపంగానో, క్రోధంగానో కాక, ప్రశాంతంగా తన కారణాలను తెలియజేస్తాడు. మానవుల బెదిరింపులకు భయపడకపోయినప్పటికీ, యెహోవా దేవుని యొక్క, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సాన్నిధ్యంలో మాట్లాడుతున్నట్లుగా ప్రగాఢమైన గౌరవాన్ని చూపుతాడు.—1 పేతురు 3:14, 15.

గౌరవాన్ని చూపించడం వల్ల ప్రతిఫలాలుంటాయి

యెహోవా దేవుడు దైవిక భక్తిని చూపించేవారిని గుర్తిస్తూ, ప్రశంసిస్తూ, వారికి ఆశీర్వాదాలను ప్రతిఫలాలను ఇచ్చి వారిని ఘనపరుస్తాడు. “నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును” అని ఆయన అంటున్నాడు. (1 సమూయేలు 2:30) రాజైన దావీదు నమ్మకంగా యెహోవాకు సేవ చేశాడు, సత్యారాధన కోసం తన విలువైన వస్తువులను ఉపయోగించడమే కాక, తన జీవితాన్ని, బలాన్నీ ఆయనకు అర్పిస్తూ ఆయనకు నిజంగా ఘనతనిచ్చాడు. యెహోవా, దావీదు యొక్క నమ్మకమైన జీవన విధానాన్ని గౌరవించి ఆయనతో రాజ్య నిబంధనను చేస్తూ ఆయనకు ప్రతిఫలమిచ్చాడు.—2 సమూయేలు 7:1-16.

క్రైస్తవ సంఘంలో, దేవుని ప్రతినిధులకు గౌరవమిచ్చేవారు ప్రేమపూర్వకమైన కాపరిపని నుండి ప్రయోజనం పొందుతారు, ఈ పైవిచారణకర్తలు, తమ విషయంలో, ‘ఆనందముతో లెక్క ఒప్పచెబుతారు’ అనే నమ్మకాన్ని కలిగి ఉండగలరు. (హెబ్రీయులు 13:17) యెహోవాకు నమ్మకంగా సేవచేసిన, అవసరంలో ఉన్న విధవరాండ్రు సంఘంలో సన్మానించబడతారు, అవసరమైతే, భౌతికమైన తోడ్పాటును పొందేవారి లెక్కలో తమను చేర్చుకుంటారు. (1 తిమోతి 5:3, 9, 10) ఒకరినొకరు గౌరవించుకునే భార్యాభర్తలు సంతోషకరమైన, ఫలవంతమైన వివాహ జీవితాన్ని గడుపుతారు, గౌరవభావంగల వారి పిల్లలు దేవుని ప్రీతినీ, మానవుల ప్రీతినీ పొందుతారు. (లూకా 2:51, 52) క్రైస్తవులు, అధికారులకూ వ్యతిరేకులైన వారికీ గౌరవం చూపించినప్పుడు వాళ్ళ మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది, అలా చేయడం యెహోవా నామానికి ఘనతను తెస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా, తమ గొప్ప సృష్టికర్త యొక్క చిత్తానికీ, ఉద్దేశాలకూ విధేయతాపూర్వకంగా ప్రగాఢమైన గౌరవాన్ని చూపే వారందరికీ, పరిపూర్ణమైన పరిస్థితుల్లో యెహోవాకు శాశ్వతకాలం సేవచేసే అవకాశం వేచి ఉంది.