కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రమాదప్రాంతం నుండి దూరంగా ఉండండి!

ప్రమాదప్రాంతం నుండి దూరంగా ఉండండి!

ప్రమాదప్రాంతం నుండి దూరంగా ఉండండి!

విషయాలను గమనించి, సూచనలను పరిశీలించి, సంభవించగల అగ్నిపర్వత విస్ఫోటనాల గురించి హెచ్చరించడం అగ్నిపర్వత నిపుణుల విధి. (ఫూజెన్‌ పర్వతం పేలడంతో, పోలీసులు ప్రజలను ప్రమాదప్రాంతం నుండి దూరంగా ఉంచవలసి వచ్చింది.) అలాగే, బైబిలు విద్యార్థులు “యుగసమాప్తి” సూచనను గమనించి, రానున్న ప్రమాదం గురించి ఇతరులను అప్రమత్తులను చేస్తారు.—మత్తయి 24:3.

రానున్న భూగోళవ్యాప్త విపత్తును గురించి హెచ్చరిస్తున్న బైబిలులోని అదే అధ్యాయంలో, తొలుత జరిగే వాటి గురించిన ఈ వర్ణనను మనం చదవవచ్చు: “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; . . . అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. . . . మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:7-14.

ఈ ప్రవచనపు ప్రస్తుత నెరవేర్పును గ్రహించడానికి మనం వార్తా విశ్లేషకులం కానవసరం లేదు. ప్రాముఖ్యంగా మనం 1914 నుండి దీన్ని అనుభవిస్తున్నాము. ఈ శతాబ్దం రెండు ప్రపంచ యుద్ధాలను, అనేకానేకమైన అంతర్యుద్ధాలను, స్థానిక పోరాటాలను, జాతి మత సంఘర్షణలను చూసింది. అలాంటి యుద్ధాల మూలంగా మానవజాతి ఆహార కొరతలను, దానికి తోడు ప్రకృతి వైపరీత్యాల వల్ల కల్గిన కరవుల్నీ అనుభవించింది. భూకంపాల్లో అనేకులు తమ ప్రాణాల్ని కోల్పోయారు. సందేహాస్పదమైన నాయకులూ, వెర్రి అనుచరులూ ఉన్న తెగలు తలెత్తాయి. “అక్రమము విస్తరించ”డం మూలంగా ప్రజలు ప్రేమ చూపించడం మానుకుంటున్నారు, పొరుగువారిపట్ల ప్రేమ ఇక ఎంతమాత్రం ఒక ప్రమాణంగా లేదు.

సూచనలో మరో అంశమైన, ప్రపంచవ్యాప్త ప్రకటనా పని కచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఈ పత్రిక ముఖపత్రానికి త్రిప్పండి, అక్కడ మీరు పత్రిక పేరులో భాగంగా, “యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది” అనే మాటలను చూస్తారు. 132 భాషల్లో ప్రచురించబడుతున్న, 2 కోట్ల 20 లక్షలకన్నా ఎక్కువగా పంపిణీ అవుతున్న కావలికోట, భూవ్యాప్తంగా “ఈ రాజ్య సువార్త”ను ప్రకటించే వారికి ముఖ్య ఉపకరణంగా ఉంది. ఆ సువార్తలో, ఈ విశ్వ సృష్టికర్త అయిన యెహోవా దేవుడు దుష్ట విధానాన్ని నాశనం చేసి భూమిపై పరదైసును తీసుకువచ్చే పరలోక రాజ్యాన్ని స్థాపించాడన్న విషయం కూడా ఇమిడి ఉంది. నిజానికి, దేవుడు త్వరలోనే చర్య తీసుకుంటాడన్న దాని సూచన ఇప్పుడు గమనించవీలవుతుంది, ఈ విధానంలోవున్న ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని ఇది సూచిస్తుంది.—పోల్చండి 2 తిమోతి 3:1-5; 2 పేతురు 3:3, 4; ప్రకటన 6:1-8.

యెహోవా భయంకరమైన మహాదినము

యెహోవా తన తీర్పును అమలుపర్చే సమయం ఆసన్నమైనప్పుడు ఏమి జరుగుతుంది? అప్పుడు ఏమి జరుగుతుందనే దాని గురించి ఆయనే స్వయంగా ఇస్తున్న సుస్పష్టమైన వివరణను వినండి: “ఆకాశమందును భూమియందును మహాత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను. యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.”—యోవేలు 2:30, 31.

స్థానిక అగ్నిపర్వతం బ్రద్ధలవ్వడం కంటే, భూకంపం కంటే మరింత భయంకరమైనదిగా, నాశనకరమైనదిగా ఉండే ఆ దినం త్వరలో రానైయుంది. ప్రవక్తయైన జెఫన్యా ఇలా చెప్తున్నాడు: “యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది. . . . రోషాగ్నిచేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశము చేయబోవుచున్నాడు.” “యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేక”పోయినప్పటికీ, ఆ భయంకరమైన దినమును తప్పించుకునే మార్గం ఒకటుంది.—జెఫన్యా 1:14-18.

తప్పించుకోవడం ఎలాగో చూపిస్తూ, జెఫన్యా ఇలా చెప్తున్నాడు: “యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.” (జెఫన్యా 2:2, 3) ‘యెహోవాను, నీతిని, వినయమును వెదకడం’ ద్వారా మనం ఆశ్రయం పొందవచ్చు. ఈనాడు ఎవరు యెహోవాను వెదుకుతున్నారు?

మీరు “యెహోవా” అనే పదాన్ని, యెహోవాసాక్షులు చేస్తున్న ప్రకటనా పని మూలంగా, వారితో ముడిపెడతారనడంలో సందేహం లేదు. మీరు ఈ పత్రికను వారి నుండే అందుకుని ఉండవచ్చు. వాళ్లు నీతియుక్తమైన జీవితాలను గడిపే నైతిక పౌరులుగా పేరు పొందారు. వారు “నవీనస్వభావమును” ధరించుకోవడానికి కృషి చేస్తున్నారు, దానిలో వినయాన్ని పెంపొందింపజేసుకోవడం కూడా ఇమిడి ఉంది. (కొలొస్సయులు 3:8-10) ఇది, యెహోవా దృశ్య సంస్థ నుండి విద్యనభ్యసించడం ద్వారా సాధ్యమౌతుందని వాళ్లు అంగీకరిస్తారు, భూవ్యాప్తంగావున్న యెహోవాసాక్షుల సంఘాలు ఈ దృశ్య సంస్థకు స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అవును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా సాక్షులైన “సహోదరుల” సహవాసంలో మీరు ఆశ్రయాన్ని పొందవచ్చు.—1 పేతురు 5:9.

ఇప్పుడే ఆశ్రయం పొందండి

యెహోవాను వెదకడం ద్వారా ఆశ్రయం పొందేందుకు మనం ఆయన స్నేహితులమై ఉండాలి. దానిలో ఏమి ఇమిడివుంది? బైబిలు ఇలా సమాధానమిస్తుంది: “యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.” (యాకోబు 4:4) దేవుని స్నేహితులై ఉండాలంటే, దేవునిపట్ల తిరుగుబాటు దృక్పథంతో నిండివున్న ప్రస్తుత దుష్ట లోకంతో ఏవిధమైన మానసిక సంబంధాన్ని ఉంచుకోకూడదు.

బైబిలు మనకిలా ఉపదేశిస్తుంది: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:15-17) ఈనాడు అనేకమంది ప్రజలు నియంత్రణలేని లైంగిక కోరికలు, డబ్బుకోసం అత్యాశతో వెంపర్లాడడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం వంటి భౌతికపరమైన కోరికలతో ప్రేరేపించబడుతున్నారు. కాని యెహోవా వైపు ఉండాలంటే, అలాంటి కోరికలను అధిగమించాలి.—కొలొస్సయులు 3:5-8.

మీరు ఈ పత్రికను అప్పుడప్పుడు చదివి ఉండవచ్చు, బైబిలు ప్రవచనాల దాని అన్వయింపుతో మీరు ఏకీభవిస్తుండవచ్చు. అయినప్పటికీ, యెహోవాసాక్షులతో సహవసించడమనే తర్వాతి చర్యను తీసుకోవడానికి మీరు సంకోచిస్తుండవచ్చు. అయితే, మనం ఏదైనా విపత్తును ఎదుర్కున్నప్పుడు, కేవలం హెచ్చరికను వినడం మాత్రం సరిపోతుందా? ఫూజెన్‌ పర్వతం బ్రద్ధలైన సంఘటనలో చూసినట్లుగా, మనం హెచ్చరికకు తగినట్లు చర్య తీసుకోవలసిన అవసరం ఉంది. మరిన్ని వివరాలను సేకరించాలని ఉద్దేశించిన కనీసం 15 మంది రిపోర్టర్‌లు, కెమెరామాన్‌లు తమ జీవితాలను కోల్పోయారని గుర్తుంచుకోండి. నిజానికి ఒక ఫోటోగ్రాఫర్‌ తన కెమెరా బటన్‌ మీద వేలు ఉంచి అలాగే చనిపోయాడు. “నేను చనిపోవలసి వస్తే, అగ్నిపర్వతం దగ్గరే చనిపోవాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్న ఒక అగ్నిపర్వత నిపుణుడు తాను కోరుకున్నట్లే చనిపోయాడు. వాళ్లంతా తమ పనికి, తమ ప్రయాసలకూ తమను తాము అంకితం చేసుకున్నారు. అయినప్పటికీ, హెచ్చరికా సందేశాన్ని అలక్ష్యం చేసినందుకు వారు తమ ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది.

ఈనాడు అనేకులు, దుష్టవిధానాన్ని నాశనం చేయాలని దేవుడు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన సమాచారం గురించి వింటారు, ఆ హెచ్చరికకున్న విలువను కొంతమేరకు గ్రహిస్తారు. ‘బహుశా అది చివరికి రావచ్చు, కానీ ఈరోజే రాకపోవచ్చు,’ అని వాళ్లు తర్కిస్తారు. ప్రస్తుతం తమకు ప్రాముఖ్యమైనదిగా అనిపిస్తున్న దాని నుండి ప్రక్కకు మళ్లకుండా ఉండేలా వాళ్లు యెహోవా దినాన్ని చక్కగా వాయిదా వేసుకుంటారు.

బారూకుకు అలాంటి సమస్యే ఉండింది. ప్రాచీన ప్రవక్తయైన యిర్మీయా దగ్గర లేఖికునిగా పనిచేస్తున్నందున బారూకు, యెరూషలేముపైకి రానైయున్న నాశనాన్ని గురించి ఇశ్రాయేలీయులను ధైర్యంగా హెచ్చరించాడు. అయినప్పటికీ, ఆయన తన నియామకం విషయమై ఒకసారి చాలా నిరుత్సాహపడ్డాడు. అప్పుడు, యెహోవా ఆయనను సరిచేశాడు: “నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు.” అది సంపదేగానీ, ఉన్నత స్థానమేగానీ, లేక వస్తుపరమైన భద్రతేగానీ, బారూకు ‘తనకోసం తాను గొప్పవాటిని వెదకకూడదు.’ ఆయన ఒక్క విషయంలో ఆసక్తి ఉండాలి, అదేమిటంటే ప్రజలు దేవుని వైపు నిలబడేలా వారికి సహాయం చేసేందుకు దేవుని చిత్తాన్ని చేయడమే. ఫలితంగా, ఆయన ‘తన ప్రాణాన్ని దోపుడుసొమ్ముగా’ పొందుతాడు. (యిర్మీయా 45:1-5) అదే విధంగా, ‘మన కోసం మనం గొప్పవాటిని వెదికే’ బదులు, యెహోవాను వెదకాలి, అది మన స్వంత జీవితాలను కాపాడుకోవడానికి నడిపిస్తుంది.

ఫూజెన్‌ పర్వతం వద్ద, లావా పైకెగసి తమమీద పడినప్పుడు దాదాపు ఒక డజనుమంది పోలీసులు, అగ్నిమాపకదళ స్వచ్ఛంద సేవకులు తమ విధి నిర్వహణలో ఉన్నారు. వాళ్లు ప్రమాదంలో ఉన్న ప్రజలకు సహాయం చేయటానికీ, వారిని కాపాడడానికీ ప్రయత్నిస్తున్నారు. వాళ్లు, ఈ ప్రపంచాన్ని మెరుగుపర్చడంలో నిమగ్నమైయున్న మంచి ఉద్దేశంగల స్త్రీ పురుషుల వంటి వారే. వాళ్ల ఉద్దేశాలు ఎంత ఉన్నతమైనవైనప్పటికీ, “వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు.” (ప్రసంగి 1:15) వంకరగావున్న విధానాన్ని చక్కపరచలేము. దేవుడు నాశనం చేయాలని నిశ్చయించుకున్న లోక విధానాన్ని రక్షించడానికి ప్రయత్నించడం ద్వారా తమను తాము ‘లోక స్నేహితులను’ చేసుకోవడం సహేతుకమైనదేనా?

ఒకసారి పారిపోయిన తర్వాత, దూరంగానే ఉండండి

ప్రమాదంలోవున్న విధానం నుండి పారిపోవడం ఒక విషయమైతే, “సహోదరుల” సహవాసపు సురక్షితమైన కాపుదల క్రిందే ఉండడం పూర్తిగా మరో విషయం. (1 పేతురు 2:17) ఫూజెన్‌ పర్వతం వద్ద తమ ఇళ్లను ఖాళీ చేసిన తర్వాత మళ్లీ తమ పొలాలను చూసుకోవడానికి వెళ్లిన రైతులను మనం మరిచిపోకూడదు. బహుశా, వాళ్లు తాము గడుపుతుండిన “సాధారణ” జీవితాలను పునఃప్రారంభించాలని ఆత్రపడి ఉండవచ్చు. కానీ వెనక్కు వెళ్లాలని వాళ్లు తీసుకున్న నిర్ణయం జ్ఞానయుక్తమైనది కాదని మీరు గుర్తిస్తుండవచ్చు. వాళ్లు ప్రమాదప్రాంతంలోకి ప్రవేశించడం బహుశా అదే మొదటిసారి కాకపోవచ్చు. మొదటిసారి వాళ్లు కేవలం కొద్దిసేపటి కోసం ప్రమాద ప్రాంతంలోకి వెళ్లివుంటారు, అప్పుడు ఏమీ జరిగి ఉండకపోవచ్చు. మరోసారి, వాళ్లు ఇంకాస్త ఎక్కువసేపు అక్కడే ఉండి ఉంటారు, అయినా ఏమీ జరిగి ఉండకపోవచ్చు. బహుశా త్వరలోనే వాళ్లు ప్రమాద ప్రాంతంలో తిరుగాడడానికి ధైర్యంగా వెళ్తూ, ప్రమాదరేఖను దాటడానికి అలవాటుపడి ఉండవచ్చు.

“విధానాంతం”లో ఉండే అదే విధమైన పరిస్థితి గురించి యేసుక్రీస్తు ప్రస్తావించాడు. ఆయనిలా చెప్పాడు: “నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి [“అవధానాన్ని ఇవ్వలేదు,” NW]; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.”—మత్తయి 24:3, 38, 39.

తినడం, త్రాగడం, పెండ్లి చేసుకోవడం వంటివాటి గురించి యేసు ప్రస్తావించాడని గమనించండి. అవన్నీ యెహోవా దృష్టిలో తప్పు పనులేమీ కాదు. మరి తప్పేమిటి? నోవహు కాలంనాటి ప్రజలు తమ అనుదిన కార్యకలాపాల చుట్టూ పరిభ్రమించే జీవితాలను గడుపుతూ, “అవధానాన్ని ఇవ్వలేదు.” అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు “సాధారణ” జీవితాన్ని గడపడం జ్ఞానయుక్తంకాదు. వినాశనం వైపు పయనిస్తున్న ప్రస్తుత లోకం నుండి మీరు ఒకసారి పారిపోయిన తర్వాత, లేక మిమ్మల్ని మీరు వేరు చేసుకున్న తర్వాత, దాని నుండి పొందాలనుకున్న ఏ చిన్న ప్రయోజనం నిమిత్తమైనా వెనక్కి వెళ్లాలనే ఏ కోరికనైనా మీరు అధిగమించాలి. (1 కొరింథీయులు 7:31) ఆధ్యాత్మిక సురక్షిత పరిధిని దాటి బయటికి వెళ్లి ఏ హానీ జరుగకుండా, చివరికి ఎవరి కంటా పడకుండా బహుశ మీరు తిరిగి వెనక్కి వచ్చేయవచ్చు. అయితే, అది మీకు ధైర్యాన్నిచ్చి, మళ్లీ లోకంలోకి వెళ్లి, ఈసారి మరింత ఎక్కువ సేపు అక్కడే ఉండిపోవడానికి నడిపించవచ్చు. త్వరలోనే, “అంతం ఈరోజేమీ రాదులే” అనే దృక్పథం పెంపొందవచ్చు.

లావా ఉప్పొంగినప్పుడు, రిపోర్టర్లు, కెమెరామాన్‌ల రాకకోసం వేచి చూస్తూ తమ జీవితాలను కోల్పోయిన ముగ్గురు టాక్సీ డ్రైవర్ల గురించి కూడా ఆలోచించండి. ఈనాడు కూడా కొంతమంది, ఈలోకంలోకి వెళ్లడానికి ధైర్యం చేసిన ఇతరులతోపాటు వెళ్లవచ్చు. కారణం ఏదైనప్పటికీ, ప్రమాదకరమైన ప్రాంతంలోకి తిరిగి వెళ్ళాలన్న మాయలో పడడం మూలంగా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందన్న విషయం స్పష్టం.

ఫూజెన్‌ పర్వత ప్రేలుడు బాధితులందరూ సురక్షిత రేఖను దాటి, ప్రమాద ప్రాంతంలోకి వెళ్ళినవారే. పర్వతం ఏదో ఒక రోజు పేలుతుందని వాళ్ళకు తెలిసివున్నప్పటికీ, ఆ రోజున పేలుతుందని ఎవ్వరూ తలంచలేదు. ఈ విధానాంతపు సూచనను గమనించడం ద్వారా, యెహోవా దినం ఎప్పుడో ఒకసారి వస్తుంది కానీ ఇంత త్వరలో కాదులే అని చాలామంది అనుకుంటారు. ఆ దినం “ఈరోజే” ఎన్నటికీ కాదు అని కూడా కొందరు భావిస్తారు. అలాంటి దృక్పథం నిజంగా ప్రమాదకరమైనది.

“ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును,” అని అపొస్తలుడైన పేతురు హెచ్చరించాడు. “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు,” ‘శాంతముగలవారమై, ఆయన దృష్టికి నిష్కళంకులముగాను నిందారహితులముగాను కనబడునట్లు’ మనకు సాధ్యమైనదంతా చేస్తూ మనం మెలకువ కల్గివుండడం అవసరం. (2 పేతురు 3:10-14) ప్రస్తుత దుష్ట విధానం నాశనమైన తర్వాత, దేవుని రాజ్యం క్రింద పరదైసు భూమి స్థాపించబడుతుంది. మన మనస్సు చూపించే ఏ కారణం మూలంగానైనప్పటికీ మనం ప్రమాద ప్రాంతంలోకి వెళ్లాలని ఎన్నడూ శోధింపబడకుందాము, ఎందుకంటే మనం లోకంలోకి వెళ్లడానికి ఆ రేఖను దాటే దినమే యెహోవా దినము కావచ్చు.

యెహోవా ప్రజల వద్ద ఆశ్రయం పొంది, వారితోనే ఉండండి.

[7వ పేజీలోని చిత్రాలు]

యెహోవా ప్రజల వద్ద ఆశ్రయం పొంది, వారితోనే ఉండండి

[4వ పేజీలోని చిత్రసౌజన్యం]

Iwasa/Sipa Press