కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు “క్రీస్తు మనస్సు” ఉందా?

మీకు “క్రీస్తు మనస్సు” ఉందా?

మీకు “క్రీస్తు మనస్సు” ఉందా?

“క్రీస్తు యేసుకు అనుగుణమైన ఏక మనసును ఓర్పుకూ ప్రోత్సాహానికీ కర్త అయిన దేవుడు అనుగ్రహిస్తాడు గాక!—రోమీయులు 15:5, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

1. క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేక వర్ణచిత్రాల్లో యేసు ఎలా చిత్రీకరించబడ్డాడు, ఇది యేసును గురించిన న్యాయమైన చిత్రీకరణ ఎందుకు కాదు?

“ఆయన నవ్వటం ఎవరూ ఒక్కసారైనా చూసి ఎరుగరు.” ప్రాచీన రోమా అధికారినని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి వ్రాసిన ఒక డాక్యుమెంటు యేసును అలా వర్ణించింది. ఈ డాక్యుమెంటు దాదాపు 11వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది, ఇది ఎంతోమంది చిత్రకారులను ప్రభావితం చేసిందని చెబుతారు. * అనేక వర్ణచిత్రాల్లో యేసు విషణ్ణ వదనంతో ఎప్పుడూ నవ్వి ఎరుగని వ్యక్తిగా కన్పిస్తాడు. కానీ యేసును ఈ విధంగా చిత్రించడం ఏమాత్రం న్యాయం కాదు, బైబిల్లోని సువార్తల్లో ఆయన హృదయాల్ని రంజింపజేసే వ్యక్తిగా, దయార్ద్రహృదయునిగా లోతైన భావావేశాలు గలవ్యక్తిగా కన్పిస్తాడు.

2. “క్రీస్తు యేసుకు అనుగుణమైన ఏక మనసును” మనం ఎలా పెంపొందించుకోవచ్చు, అది మనం ఏమి చేయటాన్ని సాధ్యపరుస్తుంది?

2 అసలైన యేసును తెలుసుకోవాలంటే, ఆయన భూమ్మీద ఉన్నప్పుడు ఎటువంటి వ్యక్తిగా ఉండేవాడన్న దాన్ని గురించిన అసలైన జ్ఞానంతో మన మనస్సుల్నీ హృదయాల్నీ నింపుకోవాలన్నది స్పష్టం. అందుకని “క్రీస్తు మనస్సు”లోకి, అంటే ఆయన మనోభావాలు, స్పందనలు, ఆలోచనలు, తర్కనలపై అంతర్దృష్టిని కలుగజేసే కొన్ని సువార్త వృత్తాంతాల్ని మనం పరిశీలిద్దాము. (1 కొరింథీయులు 2:16) మనం అలా పరిశీలిస్తుండగా, “క్రీస్తు యేసుకు అనుగుణమైన ఏక మనసును” ఎలా పెంపొందించుకోవచ్చో చూద్దాము. (రోమీయులు 15:5, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.) ఆ విధంగా చేసినట్లైతే మనం మన జీవితాల్లోనూ, ఇతరులతో వ్యవహరించేటప్పుడూ ఆయన ఉంచిన మాదిరిని అనుసరించటానికి మరింత సంసిద్ధులమై ఉంటాము.—యోహాను 13:15.

సమీపించదగ్గవాడు

3, 4. (ఎ) మార్కు 10:13-16 లో నమోదు చేయబడిన వృత్తాంత నేపథ్యం ఏమిటి? (బి) తన శిష్యులు చిన్న పిల్లల్ని తన దగ్గరికి రాకుండా చేయటానికి ప్రయత్నించినప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడు?

3 ప్రజలు యేసు వైపుకి ఆకర్షితులయ్యారు. అనేక సందర్భాల్లో వివిధ వయస్సులవారు వివిధ నేపథ్యాలవారు ఆయన్ను నిస్సంకోచంగా సమీపించారు. మార్కు 10:13-16 లో నమోదు చేయబడిన సంఘటనను పరిశీలించండి. ఈ సంఘటన ఆయన పరిచర్యకాల ముగింపులో ఆయన వేదనభరితమైన మృత్యువును ఎదుర్కోవటానికి యెరూషలేముకు చివరిసారిగా వెళ్తుండగా జరిగింది.—మార్కు 10:32-34.

4 ఈ దృశ్యాన్ని మనస్సులో ఊహించుకోండి. యేసు ఆశీర్వాదాల కోసం ప్రజలు పిల్లల్నీ శిశువుల్నీ తీసుకువస్తున్నారు. * అయితే పిల్లలను యేసు దగ్గరికి రాకుండా ఆపడానికి శిష్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ కీలకమైన వారాల్లో పిల్లలు తనకు చికాకు కల్గించడం యేసుకు ఇష్టం ఉండదని బహుశ శిష్యులు భావిస్తుండవచ్చు. కానీ వారి తలంపు తప్పు. శిష్యులు ఏమి చేస్తున్నారో యేసు చూసినప్పుడు ఆయనకు అది నచ్చలేదు. యేసు ఇలా చెబుతూ పిల్లల్ని తన దగ్గరికి పిలిచాడు: “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు” (మార్కు 10:14) తర్వాత ఆయన చేసింది, ఆయన నిజంగా సున్నితమైన మనస్సుగలవాడనీ ప్రేమగలవాడనీ వెల్లడిచేస్తుంది. అక్కడి వృత్తాంతం ఇలా ఉంది: “ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.” (మార్కు 10:16) యేసు తన చేతుల్లోనికి తీసుకుంటుండగా ఆ పిల్లలు ఎంతో శాంతంగా ఉన్నారన్నది స్పష్టంగా కనబడుతుంది.

5. యేసు ఎటువంటి వ్యక్తియని మార్కు 10:13-16 లోని వృత్తాంతం మనకు తెలుపుతుంది?

5 ఈ క్లుప్త వృత్తాంతం యేసు ఎటువంటి వ్యక్తి అన్నదాన్ని గురించి మనకు ఎంతో చెబుతుంది. ఆయన సమీపించదగ్గ వ్యక్తియని గమనించండి. పరలోకంలో ఆయన ఎంతో సమున్నతమైన స్థానాన్ని కలిగివున్నప్పటికీ, అపరిపూర్ణ మానవుల దృష్టికి ఆయన భయపెట్టేవ్యక్తిగానో తమను చులకనచేసే వ్యక్తిగానో లేడు. (యోహాను 17:5) పిల్లలు కూడా ఆయన్ను నిస్సంకోచంగా సమీపించారన్నది గమనార్హమైన విషయం కాదా? ఎప్పుడూ నవ్వి ఎరుగని, కనీసం పెదవులపై చిరునవ్వు కూడా మెరవని ఆనందరహితునివైపు వారు ఏమాత్రం ఆకర్షితులు కారు కదా! కానీ అన్ని వయస్సుల వారూ యేసును సమీపించారు, ఎందుకంటే ఆయన హృదయాల్ని ఉత్తేజపర్చే వ్యక్తియని, శ్రద్ధచూపించే వ్యక్తియని వారు గ్రహించారు. తమను నిరాశపర్చడని వారు నమ్మకంతో ఉన్నారు.

6. పెద్దలు మరింత సమీపించదగ్గవారిగా ఉండటానికి ఎలా ప్రయత్నించగలరు?

6 ఈ వృత్తాంతంపై ధ్యానిస్తూ మనల్ని మనం, ‘నాకు క్రీస్తు మనస్సు ఉందా? నేను సమీపించదగ్గ వ్యక్తినేనా?’ అని ప్రశ్నించుకోవాలి. ఈ సంక్షుభిత కాలాల్లో దేవుని గొఱ్ఱెలకు, “గాలివానకు చాటైన చోటువలె” ఉండే పురుషులు, సమీపించదగ్గ కాపరులు అవసరం. (యెషయా 32:1, 2; 2 తిమోతి 3:1) పెద్దలారా, మీరు మీ సహోదరుల పట్ల నిజమైన హృదయపూర్వకమైన ఆసక్తిని పెంపొందించుకున్నట్లైతే, వారి కోసం మిమ్మల్ని మీరు త్యజించుకున్నట్లైతే అప్పుడు తమపట్ల మీరు చూపించే శ్రద్ధను వారు గ్రహిస్తారు. ఇది మీ ముఖ కవళికల్లో వారికి కన్పిస్తుంది, మీ స్వరంలో వారికి వినిపిస్తుంది, దయాపూర్వకమైన మీ ప్రవర్తనలో వారికి ప్రస్ఫుటమౌతుంది. అటువంటి నిజమైన ప్రేమ, నిజమైన శ్రద్ధ ఒకరి పట్ల మరొకరికి నమ్మకం ఉండే వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాంటి వాతావరణం ఉన్నప్పుడే ఇతరులు—పిల్లలు కూడా—మిమ్మల్ని సమీపించటం సుళువుగా ఉంటుంది. ఒక క్రైస్తవ స్త్రీ తన సంఘంలోని ఒక పెద్ద దగ్గర ఎందుకు మనసువిప్పి మాట్లాడగలిగిందో చెబుతూ ఇలా అంటుంది: “ఆయన నాతో ఎంతో మృదువుగా వాత్సల్యపూరితంగా మాట్లాడారు. ఆయనలా ఉండకపోయుంటే నేనసలు ఒక్క మాట కూడా మాట్లాడకపోయి ఉందును. నేను ఎంతో భద్రంగా ఉన్నట్లు భావించేలా చేశారాయన.”

ఇతరుల పట్ల శ్రద్ధ

7. (ఎ) తాను ఇతరుల పట్ల శ్రద్ధగల వ్యక్తి అని యేసు ఎలా ప్రదర్శించాడు? (బి) యేసు ఒక గ్రుడ్డివాణ్ని ఎందుకు క్రమేణా స్వస్థపర్చివుంటాడు?

7 యేసు ఇతరుల పట్ల శ్రద్ధగల వ్యక్తి. ఆయన ఇతరుల మనోభావాలకు స్పందించాడు. బాధల్ని అనుభవిస్తున్న వారు అల్లంత దూరాన కన్పిస్తేనే ఆయన ఎంతగా కదిలిపోయేవాడంటే, వారి బాధల్ని తీసేయటానికి చర్య తీసుకునేవాడు. (మత్తయి 14:14) ఇతరుల పరిమితులను వారి అవసరాలను కూడా ఆయన పరిగణనలోనికి తీసుకునేవాడు. (యోహాను 16:12) ఒకసారి ప్రజలు ఆయన దగ్గరకు ఒక గ్రుడ్డివాణ్ని తీసుకువచ్చి స్వస్థపర్చమని వేడుకున్నారు. యేసు ఆ వ్యక్తికి చూపునిచ్చాడు, కానీ అకస్మాత్తుగా కాక క్రమేణా దృష్టికలిగేలా చేశాడు. మొదట, ఆ వ్యక్తి ఇతరుల్ని అస్పష్టంగా చూశాడు—వారు ఆయనకు “చెట్లవలెనుండి నడుచుచున్నట్లుగా” కనబడ్డారు. తర్వాత, యేసు ఆయన దృష్టిని పూర్తిగా రప్పించాడు. యేసు ఆ వ్యక్తిని ఎందుకు అలా క్రమేణా స్వస్థపర్చాడు? బహుశ, అంధకారానికి పూర్తిగా అలవాటు పడిపోయిన ఆ వ్యక్తి సూర్యకాంతితో ప్రకాశిస్తున్న తన చుట్టూవున్న ప్రపంచాన్ని అకస్మాత్తుగా చూసి దిగ్భ్రాంతి చెందకుండా ఉండేందుకు యేసు అలా చేసివుండవచ్చు.—మార్కు 8:22-26.

8, 9. (ఎ) యేసు ఆయన శిష్యులు దెకపొలి ప్రాంతంలోకి ప్రవేశించిన కొంతసేపటికి ఏమి జరిగింది? (బి) యేసు చెవుడు ఉన్న వ్యక్తిని స్వస్థపర్చిన విధానాన్ని వివరించండి.

8 సా.శ. 32వ సంవత్సరం పస్కా తర్వాత జరిగిన ఒక సంఘటనను కూడా పరిశీలించండి. యేసు ఆయన శిష్యులూ గలిలయ సముద్రానికి తూర్పున ఉన్న దెకపొలి ప్రాంతంలోనికి ప్రవేశించారు. అక్కడ గొప్ప జనసమూహం వారిని కనుగొని, యేసు దగ్గరికి అనేకమంది అనారోగ్యం గలవారిని, వికలాంగుల్ని తీసుకువచ్చారు. యేసు వారినందర్నీ స్వస్థపర్చాడు. (మత్తయి 15:29, 30) ఆసక్తికరంగా, యేసు ఒక వ్యక్తిని వేరుచేసి ఆయనకు ప్రత్యేక అవధానాన్ని ఇచ్చాడు. ఈ సంఘటన గురించి వ్రాసిన ఒకే ఒక్క సువార్త రచయిత అయిన మార్కు ఏమి జరిగిందో నివేదిస్తున్నాడు.—మార్కు 7:31-35.

9 ఆ వ్యక్తికి చెవుడు ఉంది, మాటలు కూడా సరిగా రావటం లేదు. ఆ వ్యక్తి అనుభవిస్తున్న కంగారును లేక ఇబ్బందిని యేసు గమనించి ఉంటాడు. అందుకని యేసు అసాధారణంగా కన్పించే ఒక పనిచేస్తాడు. యేసు ఆ వ్యక్తిని జనానికి దూరంగా ఏకాంత స్థలానికి తీసుకువెళ్తాడు. తర్వాత యేసు తాను ఏమి చేయబోతున్నాడన్నదాన్ని వివరించటానికి కొన్ని సైగలు చేస్తాడు. యేసు ‘వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుకను ముట్టాడు.’ (మార్కు 7:33) తర్వాత, యేసు ఆకాశంవైపు కన్నులెత్తి, మనస్సులో ప్రార్థిస్తూ నిట్టూర్పు విడుస్తాడు. ఈ చర్యలు, ‘నేను చేస్తున్నది దేవుని శక్తి మూలంగానే’ అన్న తలంపుని ఆ వ్యక్తికి అందజేస్తాయి. చివరిగా, యేసు ‘తెరవబడుము’ అని అంటాడు. (మార్కు 7:34) దానితో ఆ వ్యక్తికి తన వినికిడి శక్తి తిరిగి వస్తుంది, తేటగా మాట్లాడనారంభిస్తాడు.

10, 11. సంఘంలోను, స్వంత కుటుంబంలోను ఇతరుల మనోభావాల పట్ల మనకు పరిగణన ఉందని ఎలా చూపించగలము?

10 యేసు ఇతరుల పట్ల ఎంత శ్రద్ధగల వ్యక్తి! ఆయన వారి మనోభావాలకు స్పందించాడు. తదనుభూతితో కూడిన ఈ పరిగణన వారి మనోభావాలకు అనుగుణంగా చర్య తీసుకునేందుకు నడిపించింది. క్రైస్తవులముగా, మనం ఈ విషయంలో క్రీస్తు మనస్సును పెంపొందించుకుని దాన్ని ప్రదర్శించటం మంచిది. బైబిలు మనకు ఇలా ఉద్బోధిస్తుంది: “మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.” (1 పేతురు 3:8) దీనికి, మనం ఇతరుల మనోభావాలను పరిగణనలోనికి తీసుకునే విధంగా మాట్లాడటం, ప్రవర్తించటం అవసరం.

11 సంఘంలో, మనం ఇతరులకు మర్యాదనిస్తూ ఉండటం ద్వారా, ఇతరులు మనతో ఎలా వ్యవహరించాలని మనం కోరుకుంటామో మనమూ వారితో అలానే వ్యవహరిస్తూ ఉండటం ద్వారా మనం వారి పట్ల ఆలోచనగల వారమని చూపించవచ్చు. (మత్తయి 7:12) ఇందులో, మనం ఏమి మాట్లాడతాము, ఎలా మాట్లాడతాము అన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండటం కూడా ఇమిడివుంటుంది. (కొలొస్సయులు 4:6) “కత్తిపోటువంటి మాటలు” కూడా ఉంటాయని గుర్తుంచుకోండి. (సామెతలు 12:18) స్వంత కుటుంబం సంగతేమిటి? నిజంగా ఒకరినొకరు ప్రేమించుకునే భార్యాభర్తలు, అవతలి వ్యక్తి మనోభావాలకు స్పందిస్తారు. (ఎఫెసీయులు 5:33) కటువైన మాటలు, అంతంలేని విమర్శలు, దెప్పిపొడుపులు—ఇవన్నీ మనస్సుల్ని గాయపరుస్తాయి, ఈ గాయాలు మానటం అంత సులభం కాదు. పిల్లలకు కూడా భావోద్వేగాలుంటాయి, ప్రేమగల తల్లిదండ్రులు వాటిని పరిగణనలోనికి తీసుకుంటారు. దిద్దుబాటు అవసరం అయినప్పుడు, అటువంటి తల్లిదండ్రులు వారి గౌరవానికి భంగం కల్గించకుండానే వారిని సరిదిద్దుతారు. వారికి అనవసరమైన ఇబ్బందిని కూడా కల్గించరు. * (కొలొస్సయులు 3:21) మనం ఈ మార్గాల్లో ఇతరుల గురించి శ్రద్ధగల వారమని చూపించినప్పుడు మనకు క్రీస్తు మనస్సు ఉందని ప్రదర్శిస్తాము.

ఇతరులపై నమ్మకాన్ని ఉంచటం

12. యేసుకు తన శిష్యులపట్ల ఎటువంటి సమతుల్యమైన, వాస్తవికమైన దృక్కోణం ఉంది?

12 యేసుకు తన శిష్యులను గురించిన సమతుల్యమైన వాస్తవికమైన దృక్కోణం ఉంది. వారు పరిపూర్ణులు కారని ఆయనకు బాగా తెలుసు. ఎంతైనా ఆయన మానవ హృదయాల్ని చదువగలడు గదా. (యోహాను 2:24, 25) అయినప్పటికీ, కేవలం వారు అపరిపూర్ణులన్న భావంతోనే వారిని దృష్టించక, వారిలో మంచి లక్షణాలు ఉన్నాయన్న భావంతో వారిని దృష్టించాడు. యెహోవా ఆకర్షించిన ఈ మనుష్యుల్లోవున్న సామర్థ్యాన్ని కూడా యేసు చూశాడు. (యోహాను 6:44) తన శిష్యులను అనుకూల దృక్పథంతో దృష్టించాడన్న విషయం ఆయన వారితో వ్యవహరించిన విధానంలో, వారితో ప్రవర్తించిన విధానంలో ప్రస్ఫుటమౌతుంది. ఒక విషయం ఏమిటంటే, ఆయన వారిపై నమ్మకం ఉంచటానికి సుముఖత చూపించాడు.

13. తాను తన శిష్యులపై నమ్మకాన్ని ఉంచినట్లు యేసు ఎలా ప్రదర్శించాడు?

13 యేసు ఆ నమ్మకాన్ని ఎలా ప్రదర్శించాడు? తాను ఈ భూమిని విడిచివెళ్తున్నప్పుడు యేసు తన అభిషిక్త శిష్యులకు ఒక భారమైన బాధ్యతను అప్పగించాడు. ప్రపంచవ్యాప్తంగా తన రాజ్యాసక్తుల పట్ల శ్రద్ధ వహించే బాధ్యతను ఆయన వారి భుజాలపై ఉంచాడు. (మత్తయి 25:14, 15; లూకా 12:42-44) తన పరిచర్య కాలంలో, చిన్న విషయాల్లోనూ ప్రస్ఫుటంగా కన్పించని విధాల్లోనూ తాను వారిపై నమ్మకాన్ని ఉంచినట్లు యేసు చూపించాడు. పెద్ద జనసమూహాల ఆకలిని తీర్చటానికి ఆయన ఆహారాన్ని అద్భుతరీతిన ఎన్నోరెట్లు ఎక్కువ చేసినప్పుడు, దాన్ని పంచిపెట్టే బాధ్యతను తన శిష్యులకు అప్పగించాడు.—మత్తయి 14:15-21; 15:32-37.

14. మార్కు 4:35-41 లో నమోదు చేయబడిన వృత్తాంతాన్ని మీరు క్లుప్తంగా ఎలా చెబుతారు?

14మార్కు 4:35-41 లో నమోదు చేయబడిన వృత్తాంతాన్ని కూడా పరిశీలించండి. ఈ సందర్భంలో యేసూ ఆయన శిష్యులూ ఒక దోనె ఎక్కి గలిలయ సముద్రం ఆవలివైపుకి అంటే తూర్పువైపుకి ప్రయాణం చేయసాగారు. తీరం నుండి కాస్త దూరం వెళ్లిన తర్వాత యేసు దోనె వెనుకభాగంలో తలవాల్చుకుని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అయితే కొంతసేపటికే “పెద్ద తుపాను రేగిం[ది].” అటువంటి తుపానులు గలిలయ సముద్రంలో సర్వసాధారణం. అది చాలా దిగువన (సముద్ర మట్టానికి దాదాపు 200 మీటర్ల దిగువన) ఉండటంతో దాని ఉపరితలంపై ఉండే గాలి చుట్టుప్రక్కల కన్నా చాలా వెచ్చగా ఉంటుంది. దీనిమూలంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. దీనికి తోడు, ఉత్తరాన ఉన్న హెర్మోను పర్వతం నుండి ప్రారంభమై యొర్దాను లోయ గుండా బలమైన గాలులు వీస్తాయి. వాతావరణం ఒక క్షణంలో ప్రశాంతంగా ఉండి మరో క్షణంలో తుపానుగా మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి: యేసు గలిలయ ప్రాంతంలోనే పెరిగాడు తుపానులు సాధారణంగా వస్తూనే ఉంటాయని ఆయనకు తెలుసు. అయినా, తన శిష్యుల్లో కొందరు జాలర్లు కూడా కాబట్టి, ఆయన వారి నైపుణ్యాలపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా నిద్రపోయాడు.—మత్తయి 4:18, 19.

15. యేసు తన శిష్యులపై నమ్మకం ఉంచటానికి చూపిన సుముఖతను మనం ఎలా అనుకరించగలము?

15 యేసు తన శిష్యులపై నమ్మకం ఉంచటానికి చూపిన సుముఖతను మనం అనుకరించగలమా? ఇతరులకు బాధ్యతల్ని అప్పజెప్పడం కొందరికి కష్టంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడూ వారే అజమాయిషీ చేయాలనుకుంటారు. బహుశ వారు, ‘ఏదైనా పని చక్కగా జరగాలంటే, ఆ పని నేను చేయాల్సిందే!’ అని తలస్తుండవచ్చు. కానీ ప్రతీదీ మనమే చెయ్యాల్సివస్తే, మనం పూర్తిగా అలసిపోయే ప్రమాదం ఉంది, బహుశ మన స్వంత కుటుంబాలకు చెందాల్సిన సమయాన్ని కూడా వారికి ఇవ్వలేకపోతాము. దానికితోడు, మనం యుక్తమైన పనుల్నీ బాధ్యతల్నీ ఇతరులకు అప్పగించకపోతే వారు పొందాల్సిన అనుభవమూ శిక్షణా వారికి దక్కకుండా చేసినవారమౌతాము. వివిధ పనుల్ని ఇతరులకు అప్పగిస్తూ వారిపై నమ్మకం ఉంచటాన్ని అలవర్చుకోవటం జ్ఞానయుక్తం. మనల్ని మనం నిజాయితీగా ఇలా ప్రశ్నించుకోవడం మంచిది, ‘నాకు ఈ విషయంలో క్రీస్తు మనస్సు ఉందా? నేను కొన్ని పనుల్ని ఇతరులకు ఇష్టపూర్వకంగా అప్పగిస్తానా, వారు తమకు చేతనైనంతా చేస్తారని నేను వారిని నమ్ముతానా?’

ఆయన తన శిష్యులపై విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు

16, 17. తన భూ జీవితపు చివరి రాత్రి యేసు తన అపొస్తలులకు, వారు తనను విడనాడతారని తెలిసినా వారికి ఏమని అభయాన్నిచ్చాడు?

16 యేసు మరో ప్రాముఖ్యమైన మార్గంలో తన శిష్యులపట్ల అనుకూల దృక్పథాన్ని ప్రదర్శించాడు. తాను వారిపై విశ్వాసాన్ని ఉంచుతున్నట్లు వారు గ్రహించేలా చేశాడు. ఇది, ఆయన తన భూ జీవితపు చివరి రాత్రి అపొస్తలులతో అభయపూర్వకంగా మాట్లాడినప్పుడు స్పష్టంగా కన్పించింది. ఏం జరిగిందో చూడండి.

17 ఆ సాయంకాలం యేసుకు ఏమాత్రం తీరిక లేదు. ఆయన తన అపొస్తలుల పాదాలు కడిగి వారికి వినయాన్ని గురించి సోదాహరణంగా ఒక పాఠాన్ని బోధించాడు. అటుతర్వాత, ఆయన సాయంకాలపు భోజనాన్ని ఏర్పర్చాడు, ఇది తన మరణానికి జ్ఞాపకార్థంగా ఆచరించవలసివుంది. తర్వాత, తమలో ఎవరు గొప్ప అన్న వివాదం ఇంకోసారి అపొస్తలుల మధ్య చెలరేగింది. యేసు ఎప్పటిలానే ఓర్పుతో, వారిపై ఆగ్రహం చెందక వారితో చక్కగా తర్కించాడు. మున్ముందు ఏమి జరుగనైయుందో యేసు వారికి చెప్పాడు: “ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా—గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది.” (మత్తయి 26:31; జెకర్యా 13:7) ఆంతరంగిక స్నేహితుల అవసరం అత్యంత ఎక్కువగా ఉన్న ఆ సమయంలో వారు తనను విడనాడతారని ఆయనకు తెలుసు. అయినా ఆయన వారిని నిందించలేదు. అందుకు భిన్నంగా ఆయన వారికిలా చెప్పాడు: “నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెద[ను].” (మత్తయి 26:32) అవును, వారు తనను విడనాడినప్పటికీ తాను వారిని విడనాడనని ఆయన వారికి అభయాన్నిచ్చాడు. ఈ భయంకరమైన అనుభవం తర్వాత ఆయన మళ్లీ వారిని కలవనైయున్నాడు.

18. గలిలయలో యేసు తన శిష్యులకు ఏ భారమైన నియామకాన్ని ఇచ్చాడు, అపొస్తలులు దాన్ని ఎలా నిర్వర్తించారు?

18 యేసు తన మాట నిలుపుకున్నాడు. తర్వాత గలిలయలో పునరుత్థానుడైన యేసు విశ్వసనీయంగా నిలిచిన 11 మంది శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, వారితోపాటు అనేకమంది ఇతరులు కూడా ఉన్నట్లు కనబడుతుంది. (మత్తయి 28:16, 17; 1 కొరింథీయులు 15:6) అక్కడ యేసు వారికి ఒక భారమైన నియామకాన్ని అప్పగించాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) ఈ నియామకాన్ని అపొస్తలులు నిర్వర్తించారని అపొస్తలుల కార్యముల పుస్తకం స్పష్టమైన సాక్ష్యాధారాల్ని ఇస్తుంది. వారు మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటనా పనిని విశ్వసనీయంగా ప్రారంభించి కొనసాగించారు.—అపొస్తలుల కార్యములు 2:41, 42; 4:33; 5:27-32.

19. యేసు తన పునరుత్థానం తర్వాత వ్యవహరించిన విధానం మనకు క్రీస్తు మనస్సును గురించి ఏమి బోధిస్తాయి?

19 ఈ వివరణాత్మకమైన వృత్తాంతం క్రీస్తు మనస్సును గురించి మనకు ఏమి బోధిస్తుంది? యేసు తన అపొస్తలుల్లో ఘోరమైన లక్షణాల్ని చూశాడు, అయినా ఆయన “వారిని అంతమువరకు ప్రేమించెను.” (యోహాను 13:1) వారిలో లోపాలున్నప్పటికీ తాను వారిపై నమ్మకం ఉంచినట్లు వారు గ్రహించేలా చేశాడు. అయితే ఆయన విశ్వాసం వమ్ము కాలేదని గమనించండి. ఆయన వారి విషయంలో వ్యక్తం చేసిన నమ్మకం, విశ్వాసం, ఆయన తమకు ఆజ్ఞాపించిన పనిని నెరవేర్చాలని వారు తమ హృదయాల్లో తీర్మానం చేసుకునేందుకు సహాయపడ్డాయనడంలో సందేహం లేదు.

20, 21. మనం మన తోటి విశ్వాసుల గురించి అనుకూల దృక్పథాన్ని కలిగివున్నామని ఎలా ప్రదర్శించగలము?

20 ఈ విషయంలో మనకు క్రీస్తు మనస్సు ఉందని ఎలా ప్రదర్శించగలము? తోటి విశ్వాసుల విషయంలో నిరాశాజనకంగా ఉండకండి. వారి గురించి మీలో ఘోరమైన తలంపులు ఉంటే, మీ మాటలూ చర్యలూ వాటిని బహుశ వెల్లడి చేస్తుండవచ్చు. (లూకా 6:45) అయితే ప్రేమ “అన్నిటిని నమ్మును” అని బైబిలు మనకు చెబుతుంది. (1 కొరింథీయులు 13:7) ప్రేమ అనుకూలమైన లక్షణం, ప్రతికూలమైనది కాదు. అది క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది గానీ పడద్రోయదు. భయపెట్టడానికి ప్రయత్నించినప్పుడు కన్నా, ప్రేమకూ ప్రోత్సాహానికీ ప్రజలు ఎక్కువగా ప్రతిస్పందిస్తారు. మనం ఇతరులపై నమ్మకాన్ని వ్యక్తం చేయటం ద్వారా వారికి క్షేమాభివృద్ధి కలుగజేయగలము, వారిని ప్రోత్సహించగలము. (1 థెస్సలొనీకయులు 5:11) ఒకవేళ మనం క్రీస్తు వలె మన సహోదరుల పట్ల అనుకూల దృక్పథాన్ని కలిగివుంటే మనం వారికి క్షేమాభివృద్ధి కలుగజేసే విధానాల్లో వారితో వ్యవహరిస్తాము, అలాగే వారిలోని మంచి లక్షణాల్ని వెలికితీస్తాము.

21 క్రీస్తు మనస్సును పెంపొందించుకుంటూ దాన్ని ప్రదర్శిస్తూ ఉండటం అంటే కేవలం యేసు చేసిన కొన్ని పనుల్ని అనుకరించటం మాత్రమే కాదు. ముందటి శీర్షికలో పేర్కొన్నట్లుగా మనం నిజంగా యేసు వలె ప్రవర్తించాలంటే మనం ముందుగా విషయాల్ని ఆయన దృష్టించినట్లు దృష్టించటం నేర్చుకోవాలి. నాలుగు సువార్తలు ఆయన వ్యక్తిత్వంలోని మరో అంశాన్ని—తనకు నియమించబడిన పని పట్ల ఆయన తలంపుల్ని మనోభావాల్ని చూడటానికి సహాయం చేస్తాయి. దీన్ని తర్వాతి శీర్షిక చర్చిస్తుంది.

[అధస్సూచీలు]

^ పేరా 1 ఈ తప్పుడు డాక్యుమెంటును వ్రాసిన వ్యక్తి, యేసు జుట్టు, గెడ్డం, కళ్ళు ఏ రంగులో ఉంటాయో, ఆయన ఎలా కన్పిస్తాడో కూడా దాన్లో వివరిస్తాడు. “యేసు ఎలా ఉంటాడనేది వర్ణిస్తున్న అప్పటి చిత్రకారుల మాన్యువల్‌లకు ప్రజలలో ఆదరణ పెంచటానికి” ఈ దొంగ డాక్యుమెంటు సృష్టించబడిందని బైబిలు అనువాదకుడైన ఎడ్గార్‌ జె. గుడ్‌స్పీడ్‌ వివరిస్తున్నాడు.

^ పేరా 4 బహుశ ఈ పిల్లలు వేర్వేరు వయస్సుల వారై ఉండవచ్చు. ‘చిన్నబిడ్డలు’ అని ఇక్కడ అనువదించబడిన పదం పన్నెండేళ్ళ యాయీరు కుమార్తెకు కూడా ఉపయోగించబడింది. (మార్కు 5:39, 42; 10:13) అయితే, లూకా ఇదే సంఘటనను గురించి వ్రాస్తున్నప్పుడు శిశువులకు కూడా ఉపయోగించబడే పదాన్ని ఉపయోగిస్తున్నాడు.—లూకా 1:41; 2:12; 18:15.

^ పేరా 11 ఏప్రిల్‌ 1, 1998, కావలికోట సంచికలోని “మీరు వాళ్ళకు తగిన గౌరవాన్నిస్తారా?” అనే శీర్షిక చూడండి.

మీరు వివరించగలరా?

• తన శిష్యులు చిన్న పిల్లల్ని తన దగ్గరికి రాకుండా చేయటానికి ప్రయత్నించినప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడు?

• యేసు ఇతరుల పట్ల ఎలా పరిగణన చూపించాడు?

• యేసు తన శిష్యులపై నమ్మకం ఉంచటానికి చూపిన సుముఖతను మనం ఎలా అనుకరించగలము?

• యేసు తన అపొస్తలులపై విశ్వాసాన్ని వ్యక్తం చేయటాన్ని మనం ఎలా అనుకరించగలము?

[అధ్యయన ప్రశ్నలు]

[16వ పేజీలోని చిత్రం]

పిల్లలు యేసు దగ్గరున్నప్పుడు శాంతంగా ఉన్నారు

[17వ పేజీలోని చిత్రం]

యేసు ఇతరులపట్ల సానుభూతితో వ్యవహరించాడు

[18వ పేజీలోని చిత్రం]

సమీపించదగ్గ పెద్దలు ఒక ఆశీర్వాదం