కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సిరిల్‌ లూకారిస్‌—బైబిలుకు విలువిచ్చిన వ్యక్తి

సిరిల్‌ లూకారిస్‌—బైబిలుకు విలువిచ్చిన వ్యక్తి

సిరిల్‌ లూకారిస్‌బైబిలుకు విలువిచ్చిన వ్యక్తి

అది 1638వ సంవత్సరం. వేసవి కాలం. పగటి సమయం. ఆటోమన్‌ సామ్రాజ్యానికి రాజధానియైన కాన్‌స్టాంటినోపుల్‌ (ఆధునిక ఇస్తాంబుల్‌)కు సమీపాన ఉన్న మార్మారా సముద్రంపై తేలుతున్న శవాన్ని చూసి జాలరులు నిర్ఘాంతపోయారు. నిశితంగా పరిశీలించినప్పుడు, గొంతు నులిమి చంపబడిన ఆ భౌతిక కాయం ఆర్థడాక్స్‌ చర్చి అధిపతియైన ఎక్యూమెనికల్‌ పాట్రియార్క్‌ది అని గుర్తించారు. 17వ శతాబ్దంలో ప్రముఖ మతాచార్యుడైన సిరిల్‌ లూకారిస్‌ జీవితం అలా విషాదకరంగా ముగిసింది.

వ్యావహారిక గ్రీక్‌ భాషలో క్రైస్తవ గ్రీక్‌ లేఖనాల అనువాదాన్ని విడుదల చేయాలన్న ఆయన కల నిజమయ్యేంత వరకు ఆయన జీవించలేకపోయాడు. ఆయన కన్న మరొక కల అసలు నెరవేరనే లేదు. ఆర్థడాక్స్‌ చర్చి “సరళమైన సువార్త బోధల”వైపుకు మళ్ళడాన్ని చూడాలన్నది ఆయన రెండవ కల. ఎవరీ వ్యక్తి? ఆయన తన ప్రయత్నాల్లో ఏయే అడ్డంకులను ఎదుర్కున్నాడు?

బైబిలు జ్ఞానం లేకపోవడం చూసి నిర్ఘాంతపోయాడు

సిరిల్‌ లూకారిస్‌ 1572 లో, క్రీట్‌లో వెనిస్‌ వాసులు ఆక్రమించుకున్న కాన్‌డియా (ఇప్పుడు అది ఈరాక్లీయో)లో జన్మించాడు. ఆయనకు మంచి సామర్థ్యాలు ఉన్నాయి. ఆయన ఇటలీలోని వెనిస్‌లోను, పాడువాలోను చదువుకున్నాడు, ఆ తర్వాత, ఇటలీలోను, మరితర దేశాల్లోను అన్నిచోట్లా సంచారం చేశాడు. చర్చిలోని భేదాభిప్రాయాలను, దెబ్బలాటలను చూసి చాలా కలతచెందాడు. ఆయన, యూరప్‌లోని సంస్కరణోద్యమాలకు ఆకర్షితుడై జెనీవను సందర్శించి ఉండవచ్చు. అప్పట్లో జెనీవ కాల్వినిజమ్‌ ప్రభావంలో ఉండేది.

పోలండ్‌ను సందర్శించినప్పుడు, అక్కడి ఆర్థడాక్స్‌ చర్చిలోని ప్రీస్టులూ సామాన్యులూ బైబిలు జ్ఞానం లేక ఆధ్యాత్మికంగా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండడాన్ని ఆయన చూశాడు. అలెక్సాండ్రియాలోని, అలాగే కాన్‌స్టాంటినోపుల్‌లోని కొన్ని చర్చీల్లో బైబిలు లేఖనాలను చదివే వేదికలను కూడా తీసివేయబడ్డాయని చూసి చాలా కలతచెందాడు!

1602 లో, లూకారిస్‌ అలెక్సాండ్రియాకు వెళ్ళాడు. అక్కడ ఆయన బంధువు, పాట్రియార్క్‌ అయిన మీలీటీయాస్‌ తర్వాత, ఆ స్థానానికి వారసత్వంగా వచ్చాడు. యూరప్‌లో, సంస్కరణా స్ఫూర్తిగల వివిధ దైవశాస్త్రజ్ఞులతో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం మొదలుపెట్టాడు. ఆయన వ్రాసిన ఒక ఉత్తరంలో, ఆర్థడాక్స్‌ చర్చి అనేక తప్పుడు సాంప్రదాయాలను పాటిస్తోందని పేర్కొన్నాడు. అంధవిశ్వాసాల స్థానంలో “సరళమైన సువార్త బోధలు” ఉండాలనీ, లేఖనాల ప్రామాణికతపై ఆధారపడాలనీ మిగతా ఉత్తరాల్లో ఆయన నొక్కిచెప్పాడు.

యేసు మాటలకూ అపొస్తలుల మాటలకూ ఎంత ఆధ్యాత్మిక అధికారం ఉందో అంతే ఆధ్యాత్మిక అధికారం చర్చి పాదిరీలకు కూడా ఉన్నట్లు ఎంచడాన్ని చూసినప్పుడు కూడా లూకారిస్‌ చాలా బాధపడ్డాడు. “లేఖనాలకున్నంత విలువ మానవ సాంప్రదాయాలను గురించిన వ్యాఖ్యలకు ఉంది అని ప్రజలు చెబుతుంటే వినడాన్ని ఇక భరించలేను” అని ఆయన వ్రాశాడు. (మత్తయి 15:6) తన అభిప్రాయం ప్రకారం, విగ్రహారాధన నాశనాన్ని తెస్తుంది అని కూడా అన్నాడు. “పరిశుద్ధుల”కు విజ్ఞాపనలు చేసుకోవడమంటే, మధ్యవర్తియైన యేసును అవమానించడమే అని ఆయన అన్నాడు.—1 తిమోతి 2:5.

అంగట్లో పాట్రియార్క్‌ పదవి

లూకారిస్‌కున్న ఈ తలంపుల మూలంగా, అలాగే రోమన్‌ క్యాథలిక్‌ చర్చి అంటే లూకారిస్‌కున్న అసహ్య భావం మూలంగా, జెస్యూట్‌లూ, ఆర్థడాక్స్‌ చర్చి క్యాథలిక్కులతో ఐక్యం కావాలని ఇష్టపడే ఆర్థడాక్స్‌ సభ్యులూ లూకారిస్‌ను ద్వేషించారు, వేధించారు. ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, 1620 లో, కాన్‌స్టాంటినోపుల్‌ పాట్రియార్క్‌గా లూకారిస్‌ ఎంపిక చేయబడ్డాడు. అప్పట్లో, ఆర్థడాక్స్‌ చర్చి పాట్రియార్క్‌ పదవి ఆటోమన్‌ సామ్రాజ్యపు అధికారం క్రింద ఉండేది. ఆటోమన్‌ ప్రభుత్వం డబ్బుకోసం ఒక పాట్రియార్క్‌ని తొలగించి, మరొక పాట్రియార్క్‌ని నియమించేది.

లూకారిస్‌ శత్రువులు, ముఖ్యంగా పోప్‌ రూపొందించిన ఎంతో శక్తివంతమైన, భయంకరమైన కాంగ్రిగేషియో డే ప్రోపగాండా ఫీడే (విశ్వాసాన్ని ప్రచారము చేసే సంఘము)కి చెందినవారూ, జెస్యూట్‌లూ లూకారిస్‌ను నిందించడమూ ఆయనకు వ్యతిరేకంగా పన్నుగడలు వేయడమూ మొదలుపెట్టారు. “ఈ లక్ష్యాన్ని చేరే ప్రయత్నంలో, జెస్యూట్‌లు ప్రతి మార్గాన్నీ, అంటే కుయుక్తినీ అబద్ధారోపణలనూ ముఖస్తుతినీ అన్నింటికన్నా ముఖ్యంగా [ఆటోమన్‌] ప్రభుత్వాధికారుల మద్దతును సంపాదించేందుకు అత్యంత ప్రభావవంతమైన ఆయుధమైన లంచాన్నీ ఉపయోగించారు” అని కీయీరీలోస్‌ లూకారీస్‌ అనే పుస్తకం పేర్కొంటోంది. దాని ఫలితంగా, 1622 లో, రోడ్స్‌ దీవిలో లూకారిస్‌కి ప్రవాసశిక్ష విధించారు. ఆమాస్యాలోని గ్రెగరీ అనే వ్యక్తి, ఆ పదవిని 20,000 వెండి నాణెములకు కొనుక్కున్నాడు. అయితే, గ్రెగరీ అంత డబ్బును ఇవ్వలేకపోవడంతో, ఏడ్రియానోపల్‌కు చెందిన ఆన్తమస్‌ ఆ పదవిని కొనుక్కున్నాడు, కానీ తర్వాత రాజీనామా ఇవ్వాల్సివచ్చింది. ఆశ్చర్యకరంగా, లూకారిస్‌కి పాట్రియార్క్‌ పదవి తిరిగి ఇవ్వబడింది.

ఈ క్రొత్త అవకాశాన్ని ఉపయోగించి, బైబిలు అనువాదాన్నీ, వేదాంత సంబంధమైన కరపత్రాలనూ ప్రచురించడం ద్వారా ఆర్థడాక్స్‌ పాదిరీలకు, సామాన్యులకు బైబిలు విద్యాభ్యాసం చేయించాలని లూకారిస్‌ నిర్ణయించుకున్నాడు. ఈ కార్యాన్ని సాధించేందుకు, ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌ని ఇంగ్లీష్‌ రాయబారి సంరక్షణలో కాన్‌స్టాంటినోపుల్‌కి తీసుకువచ్చే ఏర్పాటును ఆయన చేశాడు. అయితే, 1627 జూన్‌లో, ప్రెస్‌ వచ్చినప్పుడు, లూకారిస్‌ దాన్ని రాజకీయ ఉద్దేశాలకు ఉపయోగిస్తున్నాడని ఆయన శత్రువులు ఆరోపించారు, చివరికి వాళ్ళు దాన్ని నాశనం చేయించారు. లూకారిస్‌, ఆ తర్వాత జెనీవాలోని ప్రింటింగ్‌ ప్రెస్‌లను ఉపయోగించవలసి వచ్చింది.

క్రైస్తవ లేఖనాల అనువాదం

బైబిలన్నా, ప్రజలకు జ్ఞానోదయాన్ని కలిగించడంలో దానికున్న శక్తన్నా లూకారిస్‌కున్న అత్యంత గౌరవం, బైబిలు మాటలను సామాన్యులకు మరింత సులభంగా లభించేలా చేయాలన్న ఆయన కోరికను బలపరచింది. దైవ ప్రేరేపిత గ్రీక్‌ బైబిలు వ్రాతప్రతిలో మొదట ఉపయోగించబడిన భాష, తన కాలం నాటి సగటు మానవునికి అర్థం కాదు అన్న విషయాన్ని ఆయన గ్రహించాడు. కనుక, క్రైస్తవ గ్రీక్‌ లేఖనాలను, తన కాలంనాటి గ్రీక్‌లోకి అనువదించడమే లూకారిస్‌ మొదట నియమించిన పని. బాగా చదువుకున్న సన్యాసియైన మాక్సమస్‌ కాలీపోలీటీస్‌ 1629 మార్చిలో ఆ పని చేయడం మొదలుపెట్టాడు. లేఖనాలు పాఠకులకు ఎంత అర్థంకాకుండా ఉన్నా కూడా, వాటిని అనువదించడం హద్దుమీరడమేనని చాలా మంది ఆర్థడాక్సులు భావించారు. లూకారిస్‌ వాళ్ళను శాంతింపజేసేందుకు, ఆ అనువాదంలో, మూలమూ, అనువాదమూ ప్రక్కప్రక్కన ఉండేలా ముద్రించాడు, కేవలం కొన్ని టిప్పణులను జత చేశాడు. కాలీపోలీటిస్‌, అనువాదాన్ని పూర్తి చేసి ఎంతో కాలం గడవక ముందే మరణించాడు. కనుక, ఆ అనువాదపు వ్రాత ప్రతిని లూకారసే చదివి, తప్పులు దిద్దాడు. ఆ అనువాదం, 1638 లో లూకారిస్‌ మరణించిన కొంత కాలం తర్వాత ముద్రించబడింది.

లూకారిస్‌ ముందుజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఆ అనువాదం విషయమై చాలా మంది బిషప్‌లు అసమ్మతిని తెలిపారు. ఆ బైబిలు అనువాదపు ముందు మాటలో, దేవుని వాక్యం మీద లూకారిస్‌కున్న ప్రేమ స్పష్టంగా రుజువవుతుంది. ప్రజలు మాట్లాడే భాషలో అందించబడిన లేఖనాల్లో ఉన్నది “పరలోకం నుండి మనకు ఇవ్వబడిన తీయని సందేశం” అని ఆయన వ్రాశాడు. “బైబిలును తెలుసుకోమని, దానిలో ఉన్న విషయాలన్నింటితో మంచి పరిచయం కలిగివుండమనీ” ప్రజలకు ఆయన బోధించాడు. “విశ్వాసానికి సంబంధించిన విషయాలను” తెలుసుకునేందుకు, “దైవికమైన పరిశుద్ధమైన సువార్త ద్వారా రక్షించబడేందుకు” ఇంత కన్నా వేరే మార్గం లేదు అని ఆయన అన్నాడు.—ఫిలిప్పీయులు 1:9, 10.

బైబిలును అధ్యయనం చేయడాన్ని నిషేధించినవారినీ, మూల పాఠానికి అనువాదాన్ని తిరస్కరించినవారినీ ఖండిస్తూ, “మనం అర్థం చేసుకోకుండానే మాట్లాడడమో, చదవడమో చేస్తే, అది గాలితో మాట్లాడడం లాంటిదే” అని లూకారిస్‌ అన్నాడు. (పోల్చండి 1 కొరింథీయులు 14:7-9.) “మీరు ఈ దైవికమైన పరిశుద్ధమైన సువార్తను మీ సొంత భాషలో చదువుతుండగా, దీన్ని చదవడం వల్ల కలిగే లాభాలను గ్రహించండి . . . మంచి వైపుకు దారితీస్తున్న మీ త్రోవను దేవుడు మరింత ప్రకాశవంతముగా చేయును గాక” అని అంటూ ముందు మాటను ఆయన ముగించాడు.—సామెతలు 4:18.

విశ్వాసాన్ని ఒప్పుకోవడం

లూకారిస్‌ బైబిలు అనువాదాన్ని మొదలుపెట్టిన తర్వాత, ధైర్యంగా మరో అడుగు ముందుకు వేశాడు. 1629 లో, జెనీవాలో, విశ్వాసాన్ని ఒప్పుకోవడం అనే పుస్తకాన్ని ఆయన ప్రచురించాడు. నమ్మకాలను గురించిన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని అందులో తెలియజేశాడు, ఆర్థడాక్స్‌ చర్చి దాన్ని స్వీకరిస్తుందని ఆయన ఆశించాడు. ది ఆర్థడాక్స్‌ చర్చ్‌ అనే పుస్తకం ప్రకారం, ఆ పుస్తకం, “యాజకత్వాన్ని గురించిన ఆర్థడాక్స్‌ సిద్ధాంతాన్ని నిరర్థకం చేస్తుంది, పవిత్ర సంఘాలు అర్థరహితమైనవి అన్నట్లుగా మాట్లాడుతుంది, ప్రతిరూపాలను ఆరాధించడమైనా పరిశుద్ధులకు విజ్ఞాపనలు చేయడమైనా విగ్రహారాధనే అన్నట్లుగా ఖండిస్తుంది.”

విశ్వాసాన్ని ఒప్పుకోవడం అనే ఈ పుస్తకంలో 18 ఖండికలు ఉన్నాయి. లేఖనాలు దైవప్రేరేపితమనీ, వాటికున్న అధికారం, చర్చి అధికారానికి మించినదనీ రెండవ ఖండిక ప్రకటిస్తుంది. అది ఇలా చెబుతుంది: “పరిశుద్ధ లేఖనాలను దేవుడే ఇస్తాడని మనం నమ్ముతాం . . . పరిశుద్ధ లేఖనాలకున్న అధికారం చర్చి అధికారాన్ని మించినది అని మనం నమ్ముతాం. పరిశుద్ధాత్మ బోధించడానికీ, మానవుడు బోధించడానికీ చాలా తేడా ఉంది.”—2 తిమోతి 3:16.

యేసు మాత్రమే మధ్యవర్తియనీ, ప్రధాన యాజకుడనీ, సంఘానికి శిరస్సు అనీ ఎనిమిదీ పదీ ఖండికలు చెబుతున్నాయి. “మన ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి కుడివైపున కూర్చుని ఉన్నాడనీ, ఆయన మన కోసం మధ్యవర్తిగా పనిచేస్తున్నాడనీ, నిజమైన, చట్టబద్దమైన ప్రధాన యాజకుడు, మధ్యవర్తి అనే స్థానంలో తాను మాత్రమే ఉన్నాడనీ మనం నమ్ముతాం” అని లూకారిస్‌ వ్రాశాడు.—మత్తయి 23:10.

చర్చి, అసత్యాన్ని సత్యముగా అర్థం చేసుకుని దారితప్పగలదనీ, కానీ పరిశుద్ధాత్మ వెలుగులో నమ్మకస్థులైన పరిచారకుల ప్రయాస ద్వారా అది రక్షించబడవచ్చు అనీ 12వ ఖండిక ప్రకటిస్తుంది. “పాపవిమోచన లోకం అనే కల్పితాన్ని ఒప్పుకోకూడదు అన్నది స్పష్టం” అని 18వ ఖండికలో వ్రాస్తూ, పాపవిమోచన లోకం అనే తలంపు కేవలం కల్పనేనన్న విషయాన్ని లూకారిస్‌ నొక్కి చెప్పాడు.

విశ్వాసము అనే పుస్తక అనుబంధంలో, అనేక ప్రశ్నలూ సమాధానాలు ఉన్నాయి. మొదటిగా, విశ్వాసులైన ప్రతి ఒక్కరూ లేఖనాలు చదవాలి, క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని చదవకుండా ఉండడం హానికరం అని లూకారిస్‌ నొక్కిచెబుతున్నాడు. ప్రామాణికత లేని పుస్తకాలను వదిలిపెట్టాలి అని కూడా ఆయన అన్నాడు.—ప్రకటన 22:18, 19.

“ప్రతిరూపాలను గురించి మనం ఏమని అనుకోవాలి?” అన్నది నాల్గవ ప్రశ్న. లూకారిస్‌ ఇచ్చిన సమాధానం ఇలా ఉంది: “‘పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు [నిర్గమకాండము 20:4, 5]’ అని దైవికమైన పరిశుద్ధ లేఖనాలు మనకు సరళంగా బోధించాయి. కనుక, సృష్టిని కాదు గానీ, భూమ్యాకాశములను తయారు చేసిన సృష్టికర్తనే మనం ఆరాధించవలసింది, ఆయననే పూజించాలి. . . . పరిశుద్ధ లేఖనంలో . . . నిషేధించబడినట్లు, [ప్రతిరూపాలను] ఆరాధించడాన్ని గానీ, పూజించడాన్ని గానీ మనం తిరస్కరిస్తాం, అలా తిరస్కరించకపోతే, మనం [ఆ విషయాన్ని] పూర్తిగా మరిచిపోయి, సృష్టికర్తకు బదులు, వర్ణాలను, కళను, సృష్టినీ ఆరాధించినవారమౌతాం.”—అపొస్తలుల కార్యములు 17:29.

తాను జీవించిన యుగంలో, ఆధ్యాత్మికంగా అంధకారమైన యుగంలో లూకారిస్‌ అన్ని తప్పులనూ పూర్తిగా వివేచించలేకపోయినప్పటికీ, * చర్చి సిద్ధాంతాల కన్నా బైబిలే ఆధికారికమైనదిగా ఉండడానికి, బైబిలు బోధలను గురించి ప్రజలకు నేర్పించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ప్రశంసార్హమైనవి.

ఈ పుస్తకాన్ని విడుదల చేసిన వెంటనే, లూకారిస్‌కు మరో క్రొత్త వ్యతిరేకత వచ్చింది. బెరోవా (ఇప్పుడు ఆలెప్పో) మెట్రోపాలిటన్‌ అయిన సిరిల్‌ కోన్‌టారీ, లూకారిస్‌కు వ్యక్తిగత శత్రువు. ఆయన 1633 లో, జెస్యూట్‌ల మద్దతుతో, పాట్రియార్క్‌ పదవిని కొనడానికి ఆటోమన్‌లతో బేరమాడడానికి ప్రయత్నించాడు. అయితే, కోన్‌టారీ బేరమాడినంత డబ్బు చెల్లించలేకపోయే సరికి ఆ పథకం విఫలమైంది. చివరికి ఆ స్థానం లూకారిస్‌కే ఉండిపోయింది. ఆ మరుసటి సంవత్సరం, థెస్సలోనీకకు చెందిన అథనేషియస్‌ ఆ స్థానం కోసం దాదాపు 60,000 వెండి నాణెములను చెల్లించాడు. లూకారిస్‌ను ఆ స్థానం నుండి మళ్ళీ తొలగించారు. కానీ, ఒక్క నెలలోనే లూకారిస్‌ను పిలిపించి, ఆ స్థానాన్ని తిరిగి ఇచ్చారు. కానీ అప్పటికెల్లా, సిరిల్‌ కోన్‌టారీ 50,000 వెండి నాణెములను సంపాదించి, ఆ స్థానాన్ని కొనుక్కోగలిగాడు. ఈ సారి కూడా లూకారిస్‌ను రోడ్స్‌కు ప్రవాసిగా పంపించారు. ఆయన స్నేహితులు ఆరు నెలల తర్వాత, ఆయన స్థానాన్ని ఆయనకు తిరిగి సంపాదించిపెట్టగల్గారు.

ఆటోమన్‌ సామ్రాజ్యాన్ని కూలద్రోయాలని లూకారిస్‌ చూస్తున్నాడని 1638 లో, జెస్యూట్‌లూ, వాళ్ళ ఆర్థడాక్స్‌ సహాయకులూ ఆరోపించారు. లూకారిస్‌కి సుల్తాన్‌ ఈసారి మరణ శిక్ష విధించాడు. లూకారిస్‌ని అరెస్ట్‌ చేశారు, 1638 జూలై 27న, ఆయనను ఒక చిన్న పడవలో ఎక్కించుకుని, ప్రవాసశిక్షకు తీసుకువెళ్తున్నట్లుగా తీసుకువెళ్ళారు. ఆ పడవ సముద్రంలోకి వెళ్ళాక, అక్కడ ఆయనను గొంతు నులిమి చంపారు. ఆయన శరీరాన్ని సముద్ర తీరానికి సమీపాన పాతిపెట్టారు. తర్వాత దాన్ని అక్కడ నుండి తీసి సముద్రంలోకి విసిరేశారు. తర్వాత, అది జాలరులకు కనబడింది, ఆ తర్వాత ఆయన స్నేహితులు దాన్ని తీసుకువచ్చి సమాధి చేశారు.

మనకు పాఠాలు

“చర్చి పాదిరీలకూ మందకూ జ్ఞానోదయాన్ని కలిగించి, వారికున్న బైబిలు పరిజ్ఞానాన్ని పెంచాలి అన్నదే [లూకారిస్‌కున్న] ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి అనీ, ఆ లక్ష్యంతో ఆయన ఆ ప్రయత్నం చేసినది బైబిలు పరిజ్ఞానం ఎంతో అథమ స్థాయిలో ఉన్న కాలాల్లోనే, అంటే 16వ శతాబ్దం నుండి 17వ శతాబ్దపు తొలిభాగం వరకున్న కాలవ్యవధిలోనే అనీ మనం విస్మరించకూడదు” అని ఒక పండితుడు అంటున్నాడు. లూకారిస్‌ తన లక్ష్యాన్ని చేరుకోకుండా అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఆయన పాట్రియార్క్‌ స్థానం నుండి ఐదు సార్లు తొలగించబడ్డాడు. ఆయన నమ్మకాలు చర్చివ్యతిరేకమైనవని ఆయన చనిపోయి ముప్పైనాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత యెరూషలేములోని క్రైస్తవ మత గురువుల సభ ప్రకటించింది. లేఖనాలను “ప్రతి ఒక్కరూ చదవకూడదు, సరైన పరిశోధనలు జరిపిన తర్వాత, లోతైన ఆధ్యాత్మిక విషయములలోకి చూసేవారు మాత్రమే చదవాలి” అని వాళ్ళు ప్రకటించారు. అంటే విద్యాసంపన్నులైన పాదిరీలు మాత్రమే చదవాలి.

మందకు దేవుని వాక్యాన్ని అందజేయాలని జరిగిన ప్రయత్నాలను అధికారంలో ఉన్న మతనాయకులు మరొకసారి అణచివేశారు. బైబిలు ఆధారము లేని తమ విశ్వాసాల్లోని తప్పులను ఎత్తి చూపించిన స్వరాన్ని వాళ్ళు క్రూరంగా నొక్కేశారు. మతస్వాతంత్ర్యానికీ, సత్యానికీ బద్ధ శత్రువులమని నిరూపించుకున్నారు. విచారకరంగా, ఈ దృక్పథం నేడు కూడా వివిధ రూపాల్లో ప్రబలి ఉంది. ప్రజలు తమ తలంపులను అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వాతంత్ర్యానికి మతనాయకులు పురికొల్పిన పన్నుగడలు అడ్డొచ్చినప్పుడు ఏమి జరుగుతుందో అన్నదానికి ఇది దుఃఖకరమైన జ్ఞాపికగా ఉంది.

[అధస్సూచీలు]

^ పేరా 24 విశ్వాసాన్ని ఒప్పుకోవడం అనే తన పుస్తకంలో, బైబిలేతర సిద్ధాంతాలైన త్రిత్వ సిద్ధాంతాన్నీ, విధి, అమర్త్య ఆత్మ అనే సిద్ధాంతాలనూ లూకారిస్‌ సమర్థించాడు.

[29వ పేజీలోని బ్లర్బ్‌]

బైబిలుకు చర్చి సిద్ధాంతాలపై అధికారం ఉండాలనీ, బైబిలు బోధలను ప్రజలకు నేర్పాలనీ లూకారిస్‌ చేసిన ప్రయత్నాలు ప్రశంసించదగినవి

[28వ పేజీలోని బాక్సు/చిత్రం]

లూకారిస్‌, కోడెక్స్‌ అలెక్సాండ్రినస్‌

బ్రిటీష్‌ లైబ్రరీలో ఉన్న రత్నాల్లాంటి పుస్తకాల్లో, సా.శ. ఐదవ శతాబ్దానికి చెందిన కోడెక్స్‌ అలెక్సాండ్రినస్‌ ఒకటి. మొదట్లో దానికి 820 పేజీలు ఉండి ఉండవచ్చు. ఇప్పుడు 773 పేజీలు ఉన్నాయి.

ఈజిప్ట్‌లోని అలెక్సాండ్రియాలో లూకారిస్‌ పాట్రియార్క్‌గా ఉన్నప్పుడు, ఆయన దగ్గర చాలా పుస్తకాలుండేవి. ఆయన కాన్‌స్టాంటినోపుల్‌లో పాట్రియార్క్‌ అయినప్పుడు, కోడెక్స్‌ అలెక్సాండ్రినస్‌ను తనతో తీసుకువెళ్ళాడు. 1624 లో, ఆయన దాన్ని ఇంగ్లండ్‌ రాజైన, జేమ్స్‌ I కి బహుమతిగా అందించమని టర్కీలోని బ్రిటీష్‌ రాయబారి చేతికి ఇచ్చాడు. అది మూడు సంవత్సరాల తర్వాత, ఆయన తర్వాతి వ్యక్తికి, అంటే చాల్స్‌ Iకి ఇవ్వబడింది.

1757 లో, ఆ రాజుగారి రాయల్‌ లైబ్రరీ, బ్రిటీష్‌ దేశానికి ఇవ్వబడింది. అమోఘమైన ఈ కోడెక్స్‌, ఇప్పుడు బ్రిటీష్‌ లైబ్రరీలోని జాన్‌ రిట్‌బ్లాట్‌ గ్యాలరీలో ప్రదర్శించబడుతుంది.

[చిత్రసౌజన్యం]

Gewerbehalle, Vol. 10

From The Codex Alexandrinus in Reduced Photographic Facsimile, 1909

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

Bib. Publ. Univ. de Genève