కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రార్థనా శక్తి

ప్రార్థనా శక్తి

ప్రార్థనా శక్తి

అది మధ్యప్రాచ్యంలోని నాహోరు అనే పట్టణం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సిరియా వాడైన ఎలియాజరు తన పది ఒంటెల పరివారంతో ఆ పట్టణ శివార్లలో ఉన్న బావి దగ్గరకు చేరుకున్నాడు. అలసిపోయి దప్పికతో ఉన్నప్పటికీ ఎలియాజరు ఇతరుల అవసరాలపట్ల ఎక్కువ శ్రద్ధ కల్గివున్నాడు. ఆయన తన యాజమాని కుమారునికోసం వధువును వెదకటానికి పరదేశం నుండి వచ్చాడు. పైగా ఆయన తన యజమానుని బంధువుల్లోనే అమ్మాయిని వెదకాల్సి ఉంది. కష్టమైన ఈ కార్యాన్ని ఆయనెలా నెరవేరుస్తాడు?

ప్రార్థనా శక్తిలో ఎలియాజరుకు విశ్వాసం ఉంది. చిన్నపిల్లవాడిలాంటి అసాధారణమైన విశ్వాసంతో ఆయన వినయంగా ఇలా అభ్యర్థిస్తాడు: “నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచుచున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి—నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా—నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండునుగాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు[ను].”—ఆదికాండము 24:12-14.

ప్రార్థనా శక్తిపై ఎలియాజరుకున్న నమ్మకం నిరర్థకం కాలేదు. అంతెందుకు, ఆ బావి దగ్గరకు వచ్చిన మొట్టమొదటి స్త్రీ అబ్రాహాము సహోదరుని మనవరాలే! ఆమె పేరు రిబ్కా, గుణవంతురాలైన చక్కని కన్య. ఆమె ఎలియాజరుకు త్రాగటానికి నీళ్లివ్వటం మాత్రమే కాదు ఆయన ఒంటెలన్నిటి దాహార్తినీ తీరుస్తానంటుంది. కుటుంబమంతా చర్చించుకున్న తర్వాత, రిబ్కా ఎలియాజరుతో పాటు దూరదేశానికి వెళ్లి అబ్రాహాము కుమారుడైన ఇస్సాకునకు భార్యకావటానికి ఇష్టపడుతుంది. జరుగుతున్న సంఘటనల్లో దేవుడు అప్పుడప్పుడు అద్భుతరీతిగా జోక్యం చేసుకుంటున్న ఆ కాలంలో ఎలియాజరు ప్రార్థనకు ఎంత నాటకీయమైన స్పష్టమైన సమాధానం వచ్చింది!

ఎలియాజరు ప్రార్థననుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఆయనకున్న విశిష్టమైన విశ్వాసాన్ని, వినయాన్ని ఇతరుల అవసరాలపట్ల అతనికున్న నిస్వార్థపు శ్రద్ధను అది చూపిస్తోంది. ఇంకా మానవజాతితో దేవుడు వ్యవహరించే విధానం పట్ల ఎలియాజరుకున్న విధేయతను కూడా ఆయన చేసిన ప్రార్థన చూపిస్తోంది. అబ్రాహాముతో దేవునికున్న ప్రత్యేక సంబంధం గురించీ, అలాగే అబ్రాహాము ద్వారా సమస్త మానవజాతికీ భవిష్యత్తులో ఆశీర్వాదాలు వస్తాయన్న దేవుని వాగ్దానం గురించీ ఆయనకు తెలుసన్నదానిలో సందేహం లేదు. (ఆదికాండము 12:3) అందుకే, ఎలియాజరు తన ప్రార్థనను ఈ మాటలతో ప్రారంభించాడు: “నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా.”

విధేయులైన సమస్త మానవులకు ఆశీర్వాదాలను తెచ్చే అబ్రాహాము వంశస్థుడు యేసుక్రీస్తే. (ఆదికాండము 22:18) మనం ఈనాడు మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం కావాలని ఆశిస్తే, దేవుడు తన కుమారుని ద్వారా మానవజాతితో వ్యవహరిస్తున్న విధానాన్ని మనం వినయంగా గుర్తెరగాలి. యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.”—యోహాను 15:7.

యేసు చెప్పిన ఆ మాటలలోని సత్యత్వాన్ని క్రీస్తు అనుచరుడైన అపొస్తలుడైన పౌలు చవి చూశాడు. ప్రార్థనా శక్తిలో ఆయనకున్న నమ్మకం ఎంతమాత్రం నిరర్థకం కాలేదు. తమ చింతలన్నింటినీ ప్రార్థనలో దేవునికి విన్నవించుకోమని ఆయన తోటి క్రైస్తవులను ప్రోత్సహించి, ఇలా రూఢపర్చాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలిప్పీయులు 4:6, 7, 13) దీనర్థం పౌలు ప్రార్థనా పూర్వకంగా దేవుణ్ని అడిగినవన్నీ ఆయన అనుగ్రహించాడనా? చూద్దాం.

అడిగినవన్నీ అనుగ్రహించబడలేదు

పౌలు తన నిస్వార్థమైన పరిచర్యలో, ‘నా శరీరములో ముల్లు’ అని తాను వర్ణించిన దానివల్ల ఎంతో బాధ పడ్డాడు. (2 కొరింథీయులు 12:7) ఇది వ్యతిరేకుల వల్ల, “కపట సహోదరుల” వల్ల కలిగిన మానసిక, భావోద్రేక క్లేశం కావచ్చు. (2 కొరింథీయులు 11:26; గలతీయులు 2:4) లేక అది కంటిజబ్బువంటి ఏదైన శారీరక అసౌకర్యం కావచ్చు. (గలతీయులు 4:15) విషయం ఏదైనప్పటికీ, ‘శరీరములో ముల్లు’ అయిన అది, పౌలును బలహీనపర్చింది. “అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని” అని ఆయన వ్రాశాడు. అయితే, పౌలు అడిగింది ఆయనకు అనుగ్రహించబడలేదు. కష్టాలని సహించే శక్తి లాంటి, ఆయన అప్పటికే దేవునినుంచి అందుకున్న ఆధ్యాత్మిక ప్రయోజనాలు చాలునని పౌలుకు వివరించబడింది. అంతేగాక, దేవుడు ఇలా చెప్పాడు: “బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్న[ది].”—2 కొరింథీయులు 12:8, 9.

ఎలియాజరు, పౌలు ఉదాహరణల నుంచి మనం ఏమి నేర్చుకోగలం? యెహోవా దేవుడు తనకు వినయంగా సేవచేయడానికి ప్రయత్నించే వారి ప్రార్థనలను తప్పక ఆలకిస్తాడు. కానీ దీనర్థం వారు అడిగినవన్నీ ఆయన ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడని కాదు, ఎందుకంటే విషయాలపట్ల ఆయనకు ఎంతో దూరదృష్టి ఉంది. మనకు ఉపయుక్తమైనవేమిటో మనకన్నా ఆయనకు ఎంతో బాగా తెలుసు. మరి ముఖ్యంగా, బైబిలులో నమోదు చేయబడినట్లుగా ఆయన తన ప్రకటిత సంకల్పానికి అనుగుణ్యంగానే ఎల్లప్పుడూ ప్రవర్తిస్తాడు.

ఆధ్యాత్మిక స్వస్థతకు సమయం

ఈ భూమిపై తన కుమారుని వెయ్యేండ్ల పరిపాలనలో సమస్త మానవజాతి మానసిక, భౌతిక, భావోద్రేక రుగ్మతలను స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. (ప్రకటన 20:1-3; 21:3-5) యథార్థవంతులైన క్రైస్తవులు వాగ్దానం చేయబడిన ఈ భవిష్యత్తుకోసం ఎంతో ఆకాంక్షతో, దాన్ని వాస్తవంలోకి తేగల దేవుని శక్తినందు నిండైన విశ్వాసంతో నిరీక్షిస్తారు. అయితే ఇప్పుడు అలాంటి అద్భుత స్వస్థతలను ఆశించక, తాము కష్టాలను ఎదుర్కోవటానికి ఆయన ఆదరణను బలాన్ని ఇవ్వమని దేవునికి ప్రార్థిస్తారు. (కీర్తన 55:22) వారు జబ్బుపడినప్పుడు, తమ ఆర్థిక స్థోమతకు అందుబాటులో ఉన్న మంచి వైద్య చికిత్సను పొందేందుకు దైవిక నడిపింపు కోసం కూడా ప్రార్థించవచ్చు.

యేసు అతని అపొస్తలులు అద్భుతంగా చేసిన స్వస్థతలను పేర్కొంటూ, కొన్ని మతాలు జబ్బుపడినవారు స్వస్థత పొందేందుకు ప్రార్థించమని ప్రోత్సహిస్తాయి. కానీ అలాంటి అద్భుతాలు ఒక ప్రత్యేక సంకల్పం కోసం చేయబడ్డాయి. యేసుక్రీస్తు నిజమైన మెస్సీయా అని అవి సాక్ష్యాన్ని అందించాయి, దేవుని అనుగ్రహం యూదా జనాంగం నుంచి, బాల్యదశలో ఉన్న క్రైస్తవ సంఘానికి మార్చబడిందనీ అవి చూపించాయి. కొత్తగా స్థాపించబడిన క్రైస్తవ సంఘ విశ్వాసాన్ని బలపర్చటానికి అప్పుడు, అద్భుత వరాలు అవసరమయ్యాయి. శైశవదశలో ఉన్న సంఘం తన కాళ్లపై నిలబడగలిగి, పరిణతి చెందినప్పుడు అద్భుత వరాలు ‘నిలిచిపోయాయి.’—1 కొరింథీయులు 13:8, 11.

ఈ కష్టకాలంలో, యెహోవా దేవుడు మరింత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక స్వస్థతాపనిలో తన ఆరాధకులకు నడిపింపునిస్తున్నాడు. వారికి ఇంకా సమయం ఉండగానే, వారు ఈ నివేదనకు అవశ్యంగా స్పందించాల్సిన అవసరం ఉంది: “యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను; వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును, వారు తమ దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.”—యెషయా 55:6, 7.

పాపులైన వారు పశ్చాత్తాపపడేలా చేసే ఈ ఆధ్యాత్మిక స్వస్థత దేవుని రాజ్య సువార్త ప్రకటన ద్వారా సాధించబడుతూ ఉంది. (మత్తయి 24:14) ఈ జీవరక్షక పనిని చేపడుతున్న తన సేవకులను బలపర్చడం ద్వారా యెహోవా దేవుడు లక్షలాది మంది తమ పాపాల గురించి పశ్చాత్తాపపడి, ఈ దుష్టవిధానానికి అంతం రాకముందే తనతో ఆమోదసూచకమైన సంబంధాన్ని కలిగివుండేందుకు సహాయం చేస్తున్నాడు. అలాంటి ఆధ్యాత్మిక స్వస్థత పొందేందుకు నిజాయితీగా ప్రార్థించే వారందరూ, అలాంటి స్వస్థత పనిని నిర్వర్తించేందుకు సహాయం కోసం ప్రార్థించే వారందరూ తమ ప్రార్థనలకు నిజంగా జవాబులను పొందుతున్నారు.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

Eliezer and Rebekah/The Doré Bible Illustrations/Dover Publications