యెజ్రెయేలులో వాళ్ళేమి కనుగొన్నారు?
యెజ్రెయేలులో వాళ్ళేమి కనుగొన్నారు?
యెజ్రెయేలు అనే ప్రాచీన నగరం శతాబ్దాలుగా నిర్మానుష్యంగా ఉంది. బైబిలు చరిత్రలో ఒకప్పుడు అది ఎంతో ప్రబలంగా ఉండేది. ఇప్పుడు, దాని మునుపటి మహాత్మ్యమంతా పోయి, భూ పొరలతో కప్పబడి, కేవలం ఒక గుట్టగా మట్టి దిబ్బగా మిగిలిపోయింది. ఇటీవలి సంవత్సరాల్లో, పురావస్తు శాస్త్రజ్ఞులు యెజ్రెయేలులోని శిథిలాలను పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ శిథిలాలు బైబిలు వృత్తాంతాలను గురించి ఏమి తెలియజేస్తున్నాయి?
బైబిలు చెబుతున్న యెజ్రెయేలు
యెజ్రెయేలు నగరం యెజ్రెయేలు లోయకు తూర్పు భాగమున ఉంది. అది ప్రాచీన ఇశ్రాయేలు దేశంలో అత్యంత సారవంతమైన ప్రాంతాల్లో ఒకటి. యెజ్రెయేలు లోయకు అభిముఖంగా ఉత్తర దిశలో మోరె కొండ ఉంది. న్యాయాధిపతియైన గిద్యోను మీదా, ఆయన దండు మీదా దాడి చేసేందుకు మిద్యానీయులు పాళెము వేసుకున్నది ఈ కొండ దగ్గరే. యెజ్రెయేలుకు తూర్పు వైపున గిల్బోవ కొండ * ఉంది, దానికి దిగువన హరోదు బావి ఉంది. యెహోవా దేవుడు, శక్తిమంతమైన సైనిక బలం అవసరం లేకుండానే, తన ప్రజలను విడిపించగలనని చూపించేందుకుగాను, వేలాది మందిగా ఉన్న గిద్యోను సైనికులను 300గా తగ్గించింది ఈ గిల్బోవ కొండ దగ్గరే. (న్యాయాధిపతులు 7:1-25; జెకర్యా 4:6) అకస్మాత్తుగా జరిగిన యుద్ధంలో, ఇశ్రాయేలీయుల మొదటి రాజైన సౌలు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయిందీ, ఆత్మహత్య చేసుకున్నదీ, యోనాతానూ సౌలు యొక్క మిగతా ఇద్దరు కుమారులూ చంపబడిందీ ఈ గిల్బోవ కొండ దగ్గరే.—1 సమూయేలు 31:1-5.
ప్రాచీన యెజ్రెయేలు నగరంలో జరిగిన పరస్పర విరుద్ధమైన విషయాలను గురించి బైబిలు చెబుతుంది. అధికారం దుర్వినియోగం చేయబడినదాన్ని గురించీ, ఇశ్రాయేలీయుల పరిపాలకుల మతభ్రష్టత్వం గురించీ, కొందరు యెహోవా సేవకుల నమ్మకత్వాన్ని గురించీ, అత్యంతాసక్తిని గురించీ బైబిలు చెబుతుంది. ఉత్తరాన ఉన్న ఇశ్రాయేలీయుల పది గోత్రాల రాజ్యానికి ఆధికారిక రాజధాని సమరయ అయినప్పటికీ, ఆ రాజ్యానికి పరిపాలకుడైన అహాబు రాజు సా.శ.పూ. పదవ శతాబ్దపు రెండవ భాగంలో రాజ నగరును నిర్మించుకున్నది యెజ్రెయేలులోనే. (1 రాజులు 21:1) నిజమైన దేవుడు ఎవరో నిరూపించే పరీక్ష కర్మెలు పర్వతం మీద జరిగిన తర్వాత, బయలు ప్రవక్తలను ఏలీయా నిర్భయంగా వధింపజేయడంతో అహాబు యొక్క విదేశీ భార్యయైన యెజెబెలుకు ఏలీయా మీద కోపమొచ్చి, చనిపోతావని ప్రవక్తయైన ఏలీయాను బెదిరించింది యెజ్రెయేలులో నుండే.—1 రాజులు 18:36-19:2.
తర్వాత, యెజ్రెయేలులో ఒక నేరం జరిగింది. యెజ్రెయేలువాడైన నాబోతు హత్యచేయబడ్డాడు. అదెలాగంటే, రాజైన అహాబు నాబోతు ద్రాక్షతోటను ఆశించాడు. తనకు ఆ భూమి కావాలని రాజు కోరినప్పుడు, “నా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని” నాబోతు బదులిచ్చాడు. ధర్మశాస్త్ర సూత్రాల ఆధారంగా నాబోతు ఇచ్చిన జవాబు ఏ మాత్రం నచ్చక అహాబు ముఖం ముడుచుకున్నాడు. అహాబు ముఖం ముడుచుకుని ఉండడం చూసిన యెజెబెలు రాణి, నాబోతు దేవదూషణ చేశాడనే అబద్ధ ఆరోపణ చేయించి, బూటకపు విచారణను జరిపే ఏర్పాట్లను చేసింది. ఆ విధంగా, నిరపరాధియైన నాబోతును దోషిగా ముద్రించి, రాళ్ళతో కొట్టి చంపారు. ఆ తర్వాత, అహాబు ఆయన ద్రాక్షతోటను తన సొంతం చేసుకున్నాడు.—1 రాజులు 21:1-16.
ఈ దుష్ట క్రియను చేసినందువల్ల, “యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును” అని ప్రవక్తయైన ఏలీయా ప్రవచించాడు. “పట్టణమందు చచ్చు అహాబు 1 రాజులు 21:23-29) ఏలీయా తరువాతి ప్రవక్తయైన ఎలీషా కాలంలో, ఇశ్రాయేలీయుల రాజుగా యెహూ అభిషేకించబడ్డాడని కూడా బైబిలు చెబుతుంది. ఆయన యెజ్రెయేలులోకి రథం మీద వచ్చాడు. యెజెబెలును ఆమె ఉన్న కోటలోని కిటికీ గుండా త్రోసివేయమని ఆజ్ఞాపించాడు. అక్కడ ఉన్న పరిచారకులు ఆమెను పడద్రోసిన తర్వాత, గుర్రాల చేత యెహూ ఆమెను తొక్కించాడు. ఊర కుక్కలు ఆమె మాంసమును తినివేయగా, ఆమె కపాలమూ, పాదములూ, అరచేతులూ మాత్రమే మిగిలాయి. (2 రాజులు 9:30-37) యెహూ, అహాబు యొక్క 70 మంది కుమారులను వధింపజేసి, వాళ్ళ శిరస్సులను యెజ్రెయేలు నగర ద్వారం దగ్గర రెండు కుప్పలుగా వేయించాడు. ఆ తర్వాత, అహాబు యొక్క మతభ్రష్టత్వపు పరిపాలనకు మద్దతునిచ్చిన ప్రముఖులనూ, యాజకులనూ యెహూ హతమార్చాడు—యెజ్రెయేలుతో నేరుగా సంబంధమున్న చివరి బైబిలు వృత్తాంతం ఇదే.—2 రాజులు 10:6-11.
సంబంధికులను కుక్కలు తినివేయును; . . . తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్నుతాను అమ్ముకొనిన అహాబువంటి వాడు ఎవ్వడును లేడు” అని కూడా ఏలీయా ఉద్ఘాటించాడు. ఏలీయా, యెహోవా తీర్పును ప్రకటించినప్పుడు, అహాబు తనను తాను తగ్గించుకున్నందువల్ల, అహాబు జీవించి ఉన్న కాలంలో శిక్షను అమలు చేయనని యెహోవా ఉద్ఘాటించాడు. (పురావస్తుశాస్త్రజ్ఞులు ఏమి కనుగొన్నారు?
యెజ్రెయేలు ఉండిన ప్రాంతాన్ని త్రవ్వడానికి, 1990 లో ఒక సంయుక్త పథకం ప్రారంభమైంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియోలజీ ఆఫ్ టెల్ అవీవ్ యూనివర్సిటీ ప్రతినిధిగా డేవిడ్ ఉసిష్కిన్, జెరుసలేమ్‌లోని బ్రిటీష్ స్కూల్ ఆఫ్ ఆర్కియోలజీ ప్రతినిధిగా జాన్ వుడ్‌హెడ్ ఈ సంయుక్త పథకాన్ని నిర్వహించారు. 1990-96 సంవత్సరాల్లో, (ఒక్కో సారి ఆరు వారాలు చొప్పున) ఏడు సార్లు ఆ ప్రాంతంలో జరిగిన త్రవ్వకం పనిలో 80 నుండి 100 మంది స్వచ్ఛందంగా పనిచేశారు.
ఆధునిక పురావస్తుశాస్త్రజ్ఞులు మరే రెఫరెన్సులను లెక్కలోకి తీసుకోకుండా, ముందుగా అభిప్రాయాలను ఏర్పరచుకోకుండా, పలానిది అయ్యుంటుందని అనుకోకుండా, నిర్దిష్ట ప్రాంతాన్ని త్రవ్వి దానిలో కనిపించే ఋజువులను పరిశీలిస్తారు. కనుక, బైబిలులో పేర్కొనబడిన ప్రాంతాలను అధ్యయనం చేస్తున్న నేటి పురావస్తుశాస్త్రజ్ఞులు, లేఖనాల్లో ఉన్న వృత్తాంతాన్నే ఆధికారికమైనదిగా తీసుకోరు. త్రవ్వకాల్లో కనిపించే అవశేషాలనూ ఆచూకీలనూ జాగ్రత్తగా పరిశీలనగా చూస్తారు. ఆ తర్వాత, ప్రస్తుతం దానికి సంబంధించి లభ్యమయ్యే సమాచారంతో పోల్చి చూస్తారు. అయినప్పటికీ, జాన్ వుడ్‌హెడ్ చెబుతున్నట్లు, బైబిలులోని కొన్ని అధ్యాయాల్లో మినహాయించి, యెజ్రెయేలును గురించిన లిఖిత పూర్వక వృత్తాంతాలు వేరే ఏమీ లేవు. కనుక, యెజ్రెయేలు గురించి పరిశోధనలేమైనా జరిపేటట్లయితే, బైబిలులో ఇవ్వబడిన వృత్తాంతాలను, తేదీలనూ పరిశీలించాలి. పురావస్తుశాస్త్రజ్ఞుల పరిశోధనలు ఏమని వెల్లడి చేస్తున్నాయి? *
అక్కడ త్రవ్వగా వెలికి వచ్చిన దుర్గములూ, గోడలూ, మట్టి పాత్రలూ లోహయుగమని చెప్పబడుతున్న కాలానికి చెందినవనీ, బైబిలులో పేర్కొనబడిన యెజ్రెయేలు నాటివేననీ తేలింది. త్రవ్వకాలు అలా కొనసాగుతున్న కొలదీ, ఆశ్చర్యకరమైన దృశ్యాలు కనిపించాయి. మొదటిగా, ఆ ప్రాంతం యొక్క వైశాల్యం, దానిలో ఉన్న పెద్ద పెద్ద దుర్గములు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇశ్రాయేలీయుల దేశ రాజధాని నగరమైన ప్రాచీన సమరయలో ఉన్న దుర్గములను పోలిన దుర్గములను ఇక్కడ చూడవచ్చని పురావస్తుశాస్త్రజ్ఞులు అనుకున్నారు. అయితే త్రవ్వకం అలా కొనసాగిన కొలది, యెజ్రెయేలు చాలా
పెద్దదన్న విషయం మరింత స్పష్టమయ్యింది. దాని గోడల మధ్య ఉన్న వైశాల్యం 1000/500 అడుగులు. ఆ వైశాల్యం, ఆ నాటి ఇశ్రాయేలీయుల దేశంలోని ఏ నగర గోడల మధ్య ఉన్న వైశాల్యం కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉంది. యెజ్రెయేలు నగరం చుట్టూ ఎండిపోయిన కందకం కనిపిస్తుంది. అది ఆ నగరపు గోడల నుండి 11 మీటర్ల లోతు ఉంది. ప్రొఫెసర్ ఉసిష్కిన్ అభిప్రాయం ప్రకారం, ఇలాంటి కందకం అనేది బైబిలు కాలాలనాటి ఇశ్రాయేలులో మునుపు ఎన్నడూ కనిపించలేదు. “క్రూసేడర్ల కాలం వరకు, ఇశ్రాయేలులో ఇలాంటిదేదీ కనిపించలేదు” అని ఆయన అంటున్నాడు.ఆ నగరం మధ్యలో, పెద్ద పెద్ద కట్టడాలు లేకపోవడం అన్నది ఊహించని మరొక ప్రత్యేకత. ఆ ఖాళీలో ఉన్న నేల ఎత్తును, నగర నిర్మాణ సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున తీసుకువచ్చిన ఎరుపు గోధుమ మిశ్రిత వర్ణంలో ఉండే మట్టితో పెంచారు. దాన్ని ఒక వేదికగా మార్చారు. దాని చుట్టూ గోడ కూడా ఉండేది. యెజ్రెయేలు గుట్టలో రెండవ సారి జరిగిన త్రవ్వకాల్లో తేలిన విషయంపై సెకండ్ ప్రిలిమినరీ రిపోర్ట్, యెజ్రెయేలు కేవలం రాజ నగరు మాత్రమే కాదని ఈ పెద్ద వేదిక చూపిస్తుందని వ్యాఖ్యానిస్తుంది. “ఒమ్రీ రాజులు [ఒమ్రీ, ఆయన వంశమువారు] పరిపాలించిన కాలంలో ఇశ్రాయేలీయుల సైన్యానికి యెజ్రెయేలు కేంద్రంగా ఉండేదనీ, రథం మీద యుద్ధం చేయడానికీ, గుర్రం మీద యుద్ధం చేయడానికీ ఇక్కడ తర్ఫీదునిచ్చేవారనీ చెప్పవచ్చు” అని ఆ రిపోర్ట్ అంటోంది. ఆ కాలంలో మధ్య ప్రాచ్యంలో, అతి పెద్ద రథ దళాన్ని ప్రదర్శించే పరేడ్ గ్రౌండ్‌లు ఇలాగే ఉండి ఉంటాయి అని యెజ్రెయేలులో మట్టితో చేసిన వేదిక పరిమాణాన్ని బట్టీ, దాని చుట్టూ ఉన్న గోడల పరిమాణాన్ని బట్టి వుడ్‌హెడ్ ఊహిస్తున్నారు.
ఇక్కడి త్రవ్వకాల్లో వెలికి వచ్చిన నగర ద్వారపు అవశేషాలు పురావస్తుశాస్త్రజ్ఞులకు చాలా ఆసక్తిని కలిగించాయి. ఆ ద్వారానికి ఇరువైపులా కనీసం రెండేసి కావలిగదులుండేవి అని ఆ అవశేషాలు చూపిస్తున్నాయి. అయినప్పటికీ, ఆ స్థలంలోని అనేక రాళ్ళు అనేక శతాబ్దాలుగా దోపిడి చేయబడుతున్నాయి కనుక, ప్రస్తుతం కనుగొనబడినవాటిని బట్టి ఒక నిర్ధారణకు రావడం చాలా కష్టం. మెగిద్దోలోను, హసోరులోను, గెజరులోను కనిపించే ద్వారాలకు ఇరువైపుల ఉన్న కావలిగదుల్లాగే, ఈ ద్వారానికి ఇరువైపుల మూడేసి గదులున్నట్లు అవశేషాలు చూపిస్తున్నాయని వుడ్‌హెడ్ అభిప్రాయపడుతున్నారు.
సైనిక పరంగాను, భూమిపరంగాను ఎంతో చక్కనిదైన ఈ నగరం చాలా తక్కువ కాలం నిలిచింది అని పురావస్తుశాస్త్ర రుజువులు చెబుతున్నాయి. ఎంతో బలమైన నగరంగా రూపొందించబడిన యెజ్రెయేలు నగరం, ఒక నిర్దిష్ట కాలావధిలో మాత్రమే అంటే కేవలం కొన్ని దశాబ్దాలు మాత్రమే ఉపయోగించబడింది అని వుడ్‌హెడ్ నొక్కిచెబుతున్నారు. దీనికి చాలా భిన్నంగా, మెగిద్దో, హాసోరు, గెజెరు, రాజధాని నగరమైన సమరయ వంటి బైబిలు ప్రాంతాలు మళ్ళీ మళ్ళీ నిర్మించబడ్డాయి, విస్తృతం చేయబడ్డాయి, అనేక కాలఘట్టాల్లో ప్రజలు వాటిలో నివసించారు. ఇంత చక్కని ప్రాంతం అంత త్వరగా నిరుపయోగమైనదిగా ఎందుకు మారింది? అహాబూ ఆయన సంతతివారూ, ఈ నగరపు వనరులను దుర్వ్యయం చేయడం మొదలుపెట్టడం వల్లే ఆ నగరం ఆర్థికంగా దాదాపుగా పడిపోయింది అని వుడ్‌హెడ్ అభిప్రాయపడుతున్నారు. యెజ్రెయేలు యొక్క పరిమాణంలోను, దాని బలంలోను ఈ విషయం ప్రస్ఫుటమౌతుంది. క్రొత్తగా పరిపాలనలోకి వచ్చిన యెహూ, ఆ నగరంలో అహాబు స్మృతులు కూడా ఉండకూడదని తలంచి, ఆ నగరాన్ని మొత్తానికే ఉపేక్షించి ఉంటాడు అని వుడ్‌హెడ్ అంటున్నారు.
లోహయుగంలో, యెజ్రెయేలు ఇశ్రాయేలీయుల పెద్ద కేంద్రంగా ఉండేదని వెలికివచ్చిన ఋజువులన్నీ రూఢిపరుస్తున్నాయి. దాని పరిమాణమూ, దాని దుర్గాలూ, అది అహాబు యెజెబెలుల రాజనగరు అని బైబిలులో చెబుతున్నదానితో ఏకీభవిస్తున్నాయి. ఆ కాలంలో దానిలో నివాసులు చాలా తక్కువగా ఉండేవారు అన్న సూచనలు, ఈ నగరాన్ని గురించి బైబిలు చెప్పే వృత్తాంతంతో ఏకీభవిస్తున్నాయి: అది అహాబు కాలంలో శీఘ్రగతిన ప్రబలమైంది, తర్వాత యెహోవా ఆజ్ఞ మేరకు, ‘యెహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబికులందరిని, అతని సంబంధులగు గొప్పవారినందరిని అతని బంధువుల నందరిని, అతడు నియమించిన యాజకులను హతముచేసి, అతనికి ఒకనినైనను లేకుండా’ చేసినప్పుడు ఆ నగరం అవమానాల పాలైంది.—2 రాజులు 10:11.
యెజ్రెయేలు ఉనికిలో ఉన్న కాలం
“అది ఏ కాలానికి చెందినది అన్నది నిర్ణయించేందుకు పురావస్తుశాస్త్రానికి ఖచ్చితమైన ఆధారం దొరకడం కష్టం” అని జాన్ వుడ్‌హెడ్ ఒప్పుకుంటున్నారు. ఏడు సంవత్సరాలు చేసిన త్రవ్వకాల్లో వెలికి వచ్చిన విషయాలను పరిశీలించి, వాటిని ఇతర ప్రాంతాల్లో తెలిసిన విషయాలతో పోల్చి చూశారు. అది, వాళ్ళు విషయాలను మళ్ళీ మదింపు చేయడానికీ, వివాదం తలెత్తడానికీ దారి తీసింది. ఎందుకని? ఎందుకంటే, ఇశ్రాయేలు పురావస్తుశాస్త్రజ్ఞుడైన యుగల్ యాడీన్, 1960ల నుండి 1970ల తొలి భాగం వరకు, మెగిద్దోలో త్రవ్వకాలు చేసినప్పుడు, ఆయన కనుగొన్న దుర్గాలూ, నగర ద్వారాలూ రాజైన సొలొమోను కాలం నాటివి అని పురావస్తుశాస్త్ర ప్రపంచంలోని అనేకులు నమ్మారు. ఇప్పుడు, యెజ్రెయేలులో కనుగొనబడిన దుర్గములూ, మట్టిపాత్రలూ, ద్వారాలూ, ఆ నిర్ధారణపై సంశయాలను రేపుతున్నాయి.
ఉదాహరణకు, యెజ్రెయేలులో కనుగొన్న మట్టి పాత్రలు, మెగిద్దోలో యాడీన్ కనుగొన్న సొలొమోను ఏలుబడినాటి భూపొరలో కనిపించిన మట్టిపాత్రలకు సారూప్యంగా ఉన్నాయి. ద్వారపు నిర్మాణమూ, ఆ రెండు ప్రాంతాల వైశాల్యమూ సాదృశ్యంగా ఉన్నాయి. అయితే యెజ్రెయేలు సొలొమోను కాలానికి చెందినదైనా అయ్యుంటుంది లేదా ఇతర ప్రాంతాలు [మెగిద్దో, హాసోరు] అహాబు కాలానికి చెందినవైనా అయ్యుంటాయని ఈ ఋజువులన్నీ చెబుతున్నాయి” అని వుడ్‌హెడ్ అంటున్నారు. యెజ్రెయేలు అహాబు కాలానికి చెందినదని బైబిలు స్పష్టంగా చెబుతుంది కనుక, ఈ భూపొర అహాబు కాలానికి చెందినదని చెప్పడమే సబబు అని ఆయన అనుకుంటున్నాడు. “బైబిలు, మెగిద్దోనును సొలొమోను నిర్మించాడని చెబుతుందే గానీ ఆ ద్వారాలను కూడా సొలొమోనే నిర్మించాడని చెప్పడం లేదు” అని డేవిడ్ ఉసిష్కిన్ ఒప్పుకుంటున్నారు.
యెజ్రెయేలు చరిత్ర గురించి తెలుసుకోగలమా?
పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్న విషయాలను బట్టి, ప్రస్తుతమున్న వివాదాలను బట్టి, యెజ్రెయేలు గురించి, లేదా సొలొమోను గురించి బైబిలు చెబుతున్న విషయాలను అనుమానించాలా? నిజానికి, పురావస్తుశాస్త్రజ్ఞుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలకూ, బైబిలు వృత్తాంతానికీ సంబంధమేమీ లేదు. పురావస్తుశాస్త్రం, చరిత్రను పరిశీలిస్తున్నది బైబిలు వృత్తాంతాన్ని ఆధారం చేసుకుని కాదు. అది విభిన్న కోణాల్లో పరిశీలిస్తుంది. విభిన్న విషయాలకు ప్రాధాన్యతనిస్తుంది. బైబిలు విద్యార్థినీ, పురావస్తుశాస్త్రజ్ఞుడ్నీ, దాదాపు సమాంతరంగా ఉన్న దారుల్లో వెళ్తున్న ప్రయాణికులతో పోల్చవచ్చు. ఆ ప్రయాణికుల్లో ఒకరు వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తున్నారు, మరొకరు, ప్రక్కనున్న కాలిబాటలో నడుస్తున్నారు. వాళ్ళు శ్రద్ధ చూపే విషయాలూ, ఆలోచించే విషయాలూ వేర్వేరుగా ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళ దృక్కోణాలు పరస్పర విరుద్ధంగా ఉండక, పరస్పర పూరకాలుగా ఉంటాయి. ఈ ఇరువురు చూసిన విషయాలను పోల్చి చూడడం ద్వారా ఆ ప్రాంతాన్ని గురించి మంచి అవగాహన కలుగుతుంది.
బైబిలులో, ప్రాచీన కాల సంఘటనలను గురించిన, ప్రజలను గురించిన లిఖిత పూర్వక రికార్డు ఉంది; పురావస్తుశాస్త్రం, ఇప్పటికీ భూపొరల్లో ఉన్న అవశేషాల్లో కనిపించే ఆచూకీలను పరిశీలిస్తూ జరిగిన సంఘటనలను గురించి, ప్రజల గురించి సమాచారాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ అవశేషాలు చాలా వరకూ అసంపూర్ణంగా ఉండి, అనేక వ్యాఖ్యానాలకు దారితీస్తాయి. ఈ విషయాన్ని గురించి, ఆర్కియోలజీ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ద బైబిల్—10,000-586 బి.సి.ఇ. అనే తన పుస్తకంలో, అమీహై మాజార్ ఈ విధంగా పేర్కొంటున్నారు: “పురావస్తుశాస్త్ర రంగంలోని పని . . . ఒక పెద్ద కళ. అది తర్ఫీదు మరియు వృత్తిపరమైన నైపుణ్యాల కలయిక. కఠినమైన పద్ధతిని అవలంబించినంత మాత్రాన పురావస్తు శాస్త్రంలో సాఫల్యం కలగాలని లేదు. ఈ రంగంలోని నిర్దేశకులు పరిస్థితులకనుగుణ్యంగా ఆలోచించి చేయడమూ, సృజనాత్మకంగా ఆలోచించడమూ సాఫల్యతకు ప్రాముఖ్యం. పురావస్తు శాస్త్రజ్ఞునికి లభించిన శిక్షణా, సరఫరా చేయబడిన వనరులూ ఎంత ప్రాముఖ్యమో, నమ్మదగిన ఆయన వ్యక్తిత్వము, సహేతుకంగా అలోచించగల్గేందుకు ఆయనకున్న సామర్థ్యమూ కూడా అంతే ప్రాముఖ్యం” అని ఆయన అన్నాడు.
గొప్ప రాజ నగరూ, సైనిక స్థావరమూ అయిన యెజ్రెయేలు స్వల్ప కాలమే ఉనికిలో ఉందని, అహాబు కాలంలోనే ఉనికిలో ఉందని బైబిలు చెబుతుంది, పురావస్తుశాస్త్రం కూడా అదే చెబుతుంది. అయినప్పటికీ, ఇంకా అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటిని రానున్న సంవత్సరాల్లో పురావస్తు శాస్త్రజ్ఞులు అధ్యయనం చేస్తుండవచ్చు. అయితే, దేవుని వాక్యమైన బైబిలు పుటలు, పురావస్తు శాస్త్రజ్ఞులు ఎన్నడూ కనుగొనలేని పూర్తి కథను స్పష్టంగా చెబుతున్నాయి.
[అధస్సూచీలు]
^ పేరా 4 తెలుగు బైబిలులో న్యాయాధిపతులు 7:3 లో, గిలాదు కొండ అని ఉంది.
^ పేరా 10 కావలికోట ఆగస్టు 15, 1988 ఆంగ్ల సంచికలో, “ద మిస్టరీ ఆఫ్ ద గేట్స్” అనే శీర్షికను చూడండి.
[26వ పేజీలోని చిత్రాలు]
యెజ్రెయేలులో పురావస్తు త్రవ్వకాలు
[28వ పేజీలోని చిత్రం]
యెజ్రెయేలులో కనుగొనబడిన కనానీయుల విగ్రహం