కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా—బలాతిశయము గలవాడు

యెహోవా—బలాతిశయము గలవాడు

యెహోవాబలాతిశయము గలవాడు

“తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.”—యెషయా 40:26.

1, 2. (ఎ) మనమందరం ఏ భౌతిక శక్తి మూలంపై ఆధారపడి ఉన్నాము? (బి) తుదకు శక్తి అంతటికీ యెహోవాయే ఎందుకు మూలమైయున్నాడో వివరించండి.

మనలో చాలామందిమి శక్తిని అంతగా పట్టించుకోము. ఉదాహరణకు, మనకు వెలుగును వేడిని ఇచ్చే విద్యుచ్ఛక్తి గురించి లేదా మనకున్న ఏ విద్యుత్‌ ఉపకరణాన్నైనా ఉపయోగించుకునేందుకుగల సౌకర్యాన్ని గురించి మనం అంతగా ఆలోచించము. కానీ అనుకోకుండా విద్యుత్‌ కోత ఏర్పడినప్పుడు, విద్యుచ్ఛక్తి లేకపోతే మానవ నగరాలు దాదాపు మూతబడిపోతాయని మనం గ్రహిస్తాము. మనం ఎంతగానో ఆధారపడే విద్యుచ్ఛక్తిలో అధికభాగం పరోక్షంగా, భూమి యొక్క అత్యంత నమ్మదగిన శక్తికి మూలాధారమైన సూర్యుని నుండి వస్తుంది. * ఈ సౌర రియాక్టర్‌ ప్రతి క్షణానికి ఐదు మిలియను టన్నుల అణు ఇంధనాన్ని ఉపయోగించుకుని, భూమిపై జీవదాయక శక్తిని కుమ్మరిస్తుంది.

2 ఈ సౌరశక్తి అంతా ఎక్కడి నుండి వస్తుంది? ఈ ఖగోళ శక్తి ఉత్పాదక కేంద్రాన్ని ఎవరు నిర్మించారు? యెహోవా దేవుడే. కీర్తన 74:16 ఆయన గురించి ఇలా చెప్తుంది: “సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.” అవును, ఆయన జీవానికి మూలం అయినట్లుగానే శక్తి అంతటికీ కూడా మూలం ఆయనే. (కీర్తన 36:9) ఆయన శక్తిని మనమెన్నడూ తక్కువ అంచనా వేయకూడదు. సూర్యుడు, నక్షత్రాలు వంటి అంతరిక్ష దేహాలవైపు చూసి, అవి ఎలా ఉనికిలోకి వచ్చాయో ధ్యానించమని యెషయా ప్రవక్త ద్వారా యెహోవా మనల్ని పురికొల్పుతున్నాడు. “మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.”—యెషయా 40:26; యిర్మీయా 32:17.

3. యెహోవా శక్తి ప్రదర్శనల నుండి మనమెలా ప్రయోజనం పొందుతాము?

3 యెహోవా మహా శక్తిసంపన్నుడు గనుక, మన జీవితాలకు ఆధారమైన వెలుగును వేడిని సూర్యుడు ఇస్తూనే ఉంటాడని మనం నిశ్చయత కల్గివుండవచ్చు. అయితే, మనం దేవుని శక్తిపై ఆధారపడేది కేవలం ప్రాథమిక భౌతికావసరాల కోసమే కాదు. పాపమరణాల నుండి మన విమోచన, భవిష్యత్తు కోసమైన మన నిరీక్షణ, యెహోవా యందలి మన దృఢవిశ్వాసం, ఇవన్నీ ఆయన తన శక్తిని ఉపయోగించటంతో విడదీయరాని విధంగా జతచేయబడి ఉన్నాయి. (కీర్తన 28:6-9; యెషయా 50:2) సృష్టించేందుకూ, విమోచించేందుకూ, తన ప్రజలను రక్షించేందుకూ, తన శత్రువులను నిర్మూలించేందుకూ యెహోవాకున్న శక్తికి నిదర్శనాలు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నాయి.

దేవుని శక్తి సృష్టిలో విశదమౌతుంది

4. (ఎ) రాత్రిపూట వినువీధిని చూసి దావీదు ఎలా ప్రభావితుడయ్యాడు? (బి) దైవిక శక్తి గురించి అంతరిక్ష దేహాలు ఏమి తెలియజేస్తున్నాయి?

4 మన సృష్టికర్త ‘సృష్టించిన వస్తువులను ఆలోచించుటవలన ఆయన నిత్యశక్తి తేటపడుచున్నదని’ అపొస్తలుడైన పౌలు వివరించాడు. (రోమీయులు 1:20) శతాబ్దాల క్రితం, కీర్తన రచయితైన దావీదు విశ్వ వైభవాన్నీ, దాని సృజకుడి శక్తినీ గ్రహించాడు, గొఱ్ఱెల కాపరిగా ఆయన రాత్రిపూట వినువీధిలోకి తరచూ చూసే ఉంటాడు. ఆయనిలా వ్రాశాడు: “నీ చేతిపనియైన నీ ఆకాశమును, నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?” (కీర్తన 8:3, 4) అంతరిక్ష దేహాల గురించి దావీదుకు పరిమితమైన జ్ఞానమే ఉన్నప్పటికీ, మన సువిశాల విశ్వ సృష్టికర్తతో పోలిస్తే తాను ఎంతో అల్పప్రాణినని ఆయన అర్థం చేసుకున్నాడు. నేడు ఖగోళ శాస్త్రజ్ఞులకు, విశ్వ విస్తృతి గురించి, దాన్ని నిలిపి ఉంచుతున్న శక్తి గురించి దావీదుకన్నా ఎంతో ఎక్కువ తెలుసు. ఉదాహరణకు, 1,00,000 మిలియన్‌ మెగాటన్నుల టిఎన్‌టి విస్ఫోటనం చెందినప్పుడు ఎంత శక్తి విడుదలవుతుందో మన సూర్యుని నుండి ప్రతి క్షణానికి అంత శక్తి వెలువడుతుందని వాళ్లు చెప్తారు. * ఆ శక్తిలోని అతిస్వల్పభాగం మాత్రం భూమిని చేరుతుంది; అయినా మన గ్రహంపైనున్న జీవజాలాన్నంతటినీ పోషించడానికి అది సరిపోతుంది. అయితే, ఆకాశంలోని అత్యంత శక్తివంతమైన నక్షత్రం మన సూర్యుడేమీ కాదు. సూర్యుడు ఒక రోజంతటిలో వెలువరించేటంత శక్తిని కొన్ని నక్షత్రాలు కేవలం ఒక్క క్షణంలోనే వెలువరిస్తాయి. కాబట్టి, అలాంటి అంతరిక్ష దేహాలను సృష్టించిన ఆయనకున్న శక్తిని గురించి ఒక్కసారి ఊహించండి! ఎలీహు సరిగ్గానే ఇలా అన్నాడు: “సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు.”—యోబు 37:23.

5. యెహోవా శక్తిని గూర్చిన ఏ నిదర్శనాన్ని మనం ఆయన కార్యాల్లో కనుగొంటాము?

5 దావీదులా మనం ‘దేవుని క్రియల కోసం విచారణ’ చేస్తే, ఆయనకున్న శక్తికి నిదర్శనాన్ని మనం సర్వత్రా చూడగల్గుతాము—గాలిలోనూ తరంగాల్లోనూ, ఉరుముల్లోనూ మెరుపుల్లోనూ, సువిశాలమైన నదుల్లోనూ సమున్నతమైన పర్వతాల్లోనూ చూడగల్గుతాము. (కీర్తన 111:2; యోబు 26:12-14) అంతేగాక, యెహోవా యోబుకు వివరించినట్లుగా, జంతువులు ఆయనకున్న శక్తికి నిదర్శనంగా ఉన్నాయి. వాటిలో ఒకటి నీటి గుఱ్ఱం. యెహోవా యోబుతో ఇలా చెప్పాడు: “దాని శక్తి దాని నడుములో ఉన్నది . . . దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి.” (యోబు 40:15-18) బైబిలు కాలాల్లో గురుపోతులు తమకున్న భయంకరమైన శక్తికి పేరుగాంచాయి, తనను “సింహపు నోటనుండి . . . గురుపోతుల కొమ్ముల నుండి” రక్షించమని దావీదు ప్రార్థించాడు.—కీర్తన 22:21; యోబు 39:9-11.

6. లేఖనాల్లో ఎద్దు దేనిని సూచిస్తుంది, ఎందుకు? (పాదవచనం చూడండి.)

6 ఎద్దుకున్న బలాన్ని బట్టి అది బైబిల్లో, యెహోవా శక్తిని సూచించడానికి ఉపయోగించబడింది. * యెహోవా సింహాసనం గురించి అపొస్తలుడైన యోహానుకు ఇవ్వబడిన దర్శనం నాలుగు జీవులను వర్ణిస్తుంది, వాటిలో ఒకటి ఎద్దు ముఖము వంటిది. (ప్రకటన 4:6, 7, NW) ఈ కెరూబులు యెహోవాకున్న నాలుగు ప్రాథమిక గుణాలను సూచిస్తున్నాయి, వాటిలో ఒకటి శక్తి అని స్పష్టమౌతుంది. మిగతావి ప్రేమ, జ్ఞానము, న్యాయము. శక్తి అన్నది దేవుని వ్యక్తిత్వంలో అతి ప్రాముఖ్యమైన కోణం గనుక, ఆయనకున్న శక్తిని గురించీ ఆయన దాన్ని ఎలా ఉపయోగిస్తాడన్నదాని గురించీ స్పష్టమైన అవగాహన కల్గివుండడం మనల్ని ఆయనకు సన్నిహితుల్ని చేస్తుంది, అలాగే మనకున్న ఏ శక్తినైనా చక్కగా ఉపయోగించుకోవడం ద్వారా ఆయన మాదిరిని అనుసరించడానికి సహాయం చేస్తుంది.—ఎఫెసీయులు 5:1.

“బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా”

7. మంచి, చెడును జయిస్తుందని మనమెందుకు నిశ్చయత కలిగివుండవచ్చు?

7 లేఖనాల్లో, యెహోవా ‘సర్వశక్తిగల దేవుడని’ పిలువబడ్డాడు, మనం ఆయనకున్న శక్తిని ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదని లేదా తన శత్రువులను అంతమొందించడానికి ఆయనకున్న సామర్థ్యాన్ని ఎన్నడూ శంకించకూడదని ఆ పేరు మనకు జ్ఞాపకం చేస్తుంది. (ఆదికాండము 17:1; నిర్గమకాండము 6:3) సాతాను దుష్ట విధానం ఎంతో సుస్థిరంగా ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ యెహోవా దృష్టిలో “జనములు చేదనుండి జారు బిందువులవంటివి, జనులు త్రాసుమీది ధూళివంటివారు.” (యెషయా 40:15) అలాంటి దైవిక శక్తి మూలంగా, మంచి చెడును జయిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దుష్టత్వం విస్తృతంగా ఉన్న సమయంలో, “ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా” దుష్టత్వాన్ని శాశ్వతంగా నిర్మూలిస్తాడని తెలుసుకుని మనం ఓదార్పు పొందవచ్చు.—యెషయా 1:24; కీర్తన 37:9, 10.

8. ఏ పరలోక సైన్యాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి, వారి శక్తిని గూర్చిన ఏ సూచన మనకుంది?

8 లేఖనాల్లో 285 సార్లు కనిపించే “సైన్యములకధిపతియగు యెహోవా” అనే పదాలు, దేవుని శక్తికి మరో జ్ఞాపికగా ఉన్నాయి. ఇక్కడ ‘సైన్యములు’ అని చెప్పబడినవి యెహోవా ఆధీనంలో ఉన్న ఆత్మ ప్రాణుల సమూహాలు. (కీర్తన 103:20, 21; 148:2) ఈ దూతలలో ఒకరు, యెరూషలేమును భయపెడ్తున్న 1,85,000 మంది అష్షూరు సైనికులను కేవలం ఒక్క రాత్రిలోనే చంపేశాడు. (2 రాజులు 19:35) మనం యెహోవా పరలోక సైన్యాల శక్తిని గుర్తిస్తే, వ్యతిరేకులను చూసి అంత సులభంగా భయపడిపోము. తనను పట్టుకోవడానికి సైన్యమంతా చుట్టుముట్టినప్పుడు ప్రవక్తయైన ఎలీషా ఎంతమాత్రం పట్టించుకోలేదు, ఎందుకంటే ఆయన తనకు మద్దతునిస్తున్న పరలోక సైన్యాల విస్తృతమైన సమూహాన్ని తన విశ్వాసపు కళ్లతో చూడగలిగాడు, అయితే ఆయన సేవకుడు మాత్రం అలా చూడలేకపోయాడు.—2 రాజులు 6:15-17.

9. యేసు వలే మనకు దైవిక కాపుదలయందు ఎందుకు నమ్మకం ఉండాలి?

9 అలాగే గెత్సేమనే తోటలో కత్తులు గుదియలు పట్టుకునివచ్చిన గుంపు తనను చుట్టుముట్టినప్పుడు, తనకు దేవదూతల మద్దతు ఉందని యేసుకు తెలుసు. కత్తిని దాని వరలో తిరిగి పెట్టుకోమని పేతురుకు చెప్పిన తర్వాత, అవసరమైతే తాను “పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువమంది దూతలను” పంపమని తన తండ్రిని వేడుకోగలనని యేసు ఆయనకు చెప్పాడు. (మత్తయి 26:47, 52, 53) దేవుని ఆధీనంలో ఉన్న పరలోక సైన్యాలపట్ల మనకు కూడా అలాంటి మెప్పుదలే ఉంటే, మనం కూడా దైవిక మద్దతును సంపూర్ణంగా విశ్వసిస్తాము. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?”—రోమీయులు 8:31.

10. యెహోవా ఎవరి పక్షాన తన శక్తిని ఉపయోగిస్తాడు?

10 కాబట్టి యెహోవా కాపుదలయందు విశ్వాసముంచడానికి మనకు ప్రతి కారణం ఉంది. ఆయన ఎప్పుడూ తన శక్తిని మంచి కోసమే ఉపయోగిస్తాడు, అదీ ఆయన తన ఇతర లక్షణాలైన న్యాయము, జ్ఞానము, ప్రేమలకు అనుగుణ్యంగానే దాన్ని ఉపయోగిస్తాడు. (యోబు 37:23; యిర్మీయా 10:12) అధికారం ఉన్నవాళ్లు తరచూ స్వార్థ ప్రయోజనాల కోసం పేదవారిని, దీనమనస్కులను అణిచి వేస్తుండగా, యెహోవా ‘నేలనుండి దరిద్రులను లేవనెత్తుతాడు’ అంతేగాక ఆయన ‘రక్షించగల బలాఢ్యుడు.’ (కీర్తన 113:5-8; యెషయా 63:1) వినయమనస్కురాలు, నిగర్వి అయిన యేసు తల్లియైన మరియ అర్థం చేసుకున్నట్లుగా, “సర్వశక్తిమంతుడు” తనకు భయపడేవారి పట్ల తన శక్తిని నిస్వార్థంగా ఉపయోగించి, గర్విష్ఠులను అణిచివేసి, దీనులను ఉన్నతపరుస్తాడు.—లూకా 1:46-53.

యెహోవా తన సేవకులకు తన శక్తిని బయల్పరుస్తాడు

11. సా.శ.పూ. 1513వ సంవత్సరంలో ఇశ్రాయేలీయులు దేవుని శక్తికి ఏ నిదర్శనాన్ని చూశారు?

11 అనేక సందర్భాల్లో, యెహోవా తన శక్తిని తన సేవకులకు చూపించాడు. అలాంటి ఒక సందర్భం సా.శ.పూ. 1513 లో సీనాయి పర్వతం వద్ద జరిగినది. ఆ సంవత్సరంలోనే ఇశ్రాయేలీయులు అప్పటికే దేవుని శక్తికి ప్రగాఢమైన నిదర్శనాన్ని చూశారు. నాశనకరమైన పది తెగుళ్లు యెహోవా బలమైన బాహువును, ఐగుప్తు దేవుళ్ల దుర్భలతను బయల్పరిచాయి. ఆ తర్వాత కొంతకాలానికే, ఎర్ర సముద్రాన్ని అద్భుతరీతిగా దాటడం, ఫరో సైన్యాల నాశనం దైవిక శక్తికి మరింత నిదర్శనాన్నిచ్చాయి. మూడు నెలల తర్వాత, సీనాయి పర్వతపాదం వద్ద, ‘సమస్తదేశ జనులలో తనకు స్వకీయ సంపాద్యముగా’ ఉండమని యెహోవా ఇశ్రాయేలీయులను ఆహ్వానించాడు. వారు తమ వంతుగా ఇలా వాగ్దానం చేశారు: “యెహోవా చెప్పినదంతయు చేసెద[ము].” (నిర్గమకాండము 19:5, 8) అప్పుడు, యెహోవా తన శక్తిని తీక్షణంగా ప్రదర్శించాడు. ఉరుములు మెరుపుల మధ్యన, బూరయొక్క మహాధ్వని మధ్యన సీనాయి పర్వతం ధూమమయమై మిక్కిలి కంపించింది. దూరాన నిలిచివున్న ప్రజలు వణికిపోయారు. కానీ ఈ అనుభవం నుండి వాళ్ళు దైవ భయాన్ని నేర్చుకోవాలని, అంటే తమ సర్వశక్తిమంతుడైన అద్వితీయ సత్య దేవునికి విధేయత చూపించేందుకు వారిని పురికొల్పేటువంటి భయాన్ని వాళ్ళు నేర్చుకోవాలని మోషే వారితో చెప్పాడు.—నిర్గమకాండము 19:16-19; 20:18-20.

12, 13. ఏ పరిస్థితులు ఏలీయా తన నియామకాన్ని విడిచిపెట్టేలా చేశాయి, కానీ యెహోవా ఆయనను ఎలా బలపర్చాడు?

12 కొన్ని శతాబ్దాల తర్వాత, ఏలీయా కాలంలో, సీనాయి పర్వతం దైవిక శక్తి మరోసారి ప్రదర్శించబడటాన్ని చూసింది. ఈ ప్రవక్త అప్పటికే దేవుని శక్తి పని చేస్తుండడాన్ని చూశాడు. ఇశ్రాయేలు జనాంగపు మత భ్రష్టత్వం మూలంగా దేవుడు మూడున్నర సంవత్సరాలపాటు, ‘ఆకాశమును మూసివేశాడు.’ (2 దినవృత్తాంతములు 7:13) తత్ఫలితంగా ఏర్పడిన కరువు సమయంలో, కెరీతు వాగు వద్ద కాకోలములు ఏలీయాకు ఆహారాన్నందించాయి. అటుతర్వాత, ఆయనకు ఆహారం అందజేసేందుకు ఒక విధవరాలి దగ్గర చాలా కొంచెముగా ఉన్న పిండి, నూనె అద్భుతరీతిగా అధికం చేయబడ్డాయి. చివరికి ఆ విధవరాలి కుమారుడ్ని పునరుత్థానం చేయడానికి కూడా యెహోవా ఏలీయాకు శక్తినిచ్చాడు. చివరిగా, కర్మెలు పర్వతంపై జరిగిన దైవత్వాన్ని గూర్చిన నాటకీయమైన పరీక్షలో, పరలోకం నుండి అగ్ని దిగివచ్చి ఏలీయా అర్పించిన బలిని దహించివేసింది. (1 రాజులు 17:4-24; 18:36-40) ఏదేమైనప్పటికీ, ఆ తర్వాత కొంతకాలానికి యెజెబెలు ఏలీయాను చంపుతానని బెదిరించినప్పుడు ఆయన భయపడిపోయి, నిరుత్సాహం చెందాడు. (1 రాజులు 19:1-4) ప్రవక్తగా తన పని అయిపోయిందని భావిస్తూ ఆయన దేశము వదిలి పారిపోయాడు. ఆయనను దృఢపర్చి బలపర్చేందుకు, యెహోవా దయతో ఆయనకు దైవిక శక్తిని వ్యక్తిగతంగా ప్రదర్శించి చూపాడు.

13 ఏలీయా ఒక గుహలో దాక్కున్నప్పుడు, యెహోవా తాను అదుపు చేసే మూడు శక్తులను అంటే, బలంగా వీచే పెనుగాలి, భూకంపం, అగ్ని వంటి శక్తులను భీతిగొల్పే విధంగా ప్రదర్శించి చూపాడు. అయితే, యెహోవా ఏలీయాతో “మిక్కిలి నిమ్మళముగా” మాట్లాడాడు. ఆయన ఏలీయాకు ఇంకా ఎక్కువ పనిని అప్పగించి, తనకు ఇప్పటికీ 7,000 మంది నమ్మకమైన యెహోవా ఆరాధకులు దేశంలో మిగిలి ఉన్నారని తెలియజేశాడు. (1 రాజులు 19:9-18) మనమెప్పుడైనా మన పరిచర్యలో సరైన ఫలితాలు రాక ఏలీయా వలె నిరుత్సాహపడుతుంటే, మనం “బలాధిక్యము” కోసం అంటే, సువార్తను ప్రకటించడంలో విడువక కొనసాగేందుకు మనల్ని బలపర్చే శక్తి కోసం యెహోవాను వేడుకోవచ్చు.—2 కొరింథీయులు 4:7.

యెహోవా శక్తి ఆయన వాగ్దానాల నెరవేర్పుకు హామీ ఇస్తుంది

14. యెహోవా వ్యక్తిగత నామము ఏమి బయల్పరుస్తుంది, ఆయన శక్తి ఆయన నామముతో ఎలా సంబంధం కల్గివుంది?

14 యెహోవా శక్తికి ఆయన నామముతోనూ, ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడంతోనూ సన్నిహిత సంబంధం ఉంది. “తానే కర్త అవుతాడు” అన్నది యెహోవా అనే విశేషమైన నామ భావం, ఆయన తనను తాను వాగ్దానాలను నెరవేర్చేవానిగా చేసుకుంటాడని అది తెలియజేస్తుంది. ఆయన సంకల్పాలు అసంభవమైనవని సంశయవాదులు అన్నప్పటికీ, దేవుడు తన సంకల్పాలను సఫలం చేసుకోకుండా ఏదీ లేక ఎవరూ ఆయన్ను అడ్డగించలేరు. యేసు ఒకసారి తన అపొస్తలులతో అన్నట్లుగా, “దేవునికి సమస్తమును సాధ్య[మే].”—మత్తయి 19:26.

15. యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదని అబ్రాహాము శారాలకు ఎలా జ్ఞాపకం చేయబడింది?

15 ఉదాహరించాలంటే, వారి సంతానాన్ని గొప్ప జనాంగముగా చేస్తానని యెహోవా ఒకసారి అబ్రాహాము శారాలకు వాగ్దానం చేశాడు. అయితే వాళ్లు చాలా సంవత్సరాలపాటు నిస్సంతులుగా ఉండిపోయారు. తాను చేసిన వాగ్దానం నెరవేరబోతుందని యెహోవా వారికి చెప్పే సమయానికి వారిద్దరూ చాలా వృద్ధులు కావడం వల్ల, శారా అది విని నవ్వింది. దానికి సమాధానంగా, దూత ఇలా అన్నాడు: “యెహోవాకు అసాధ్యమైనది ఏదైననున్నదా?” (ఆదికాండము 12:1-3; 17:4-8; 18:10-14) నాలుగు శతాబ్దాల తర్వాత, ఇప్పుడు పెద్ద జనాంగంగా మారిన అబ్రాహాము సంతానాన్ని మోయాబు మైదానంలో మోషే చివరికి సమకూర్చినప్పుడు, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడని ఆయన వారికి గుర్తు చేశాడు. మోషే ఇలా చెప్పాడు: “[యెహోవా] నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటె బలమైన గొప్ప జనములను నీ ముందరనుండి వెళ్లగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగానుండి ఐగుప్తులోనుండి తన మహా బలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను.”—ద్వితీయోపదేశకాండము 4:37, 38.

16. సద్దూకయులు మృతుల పునరుత్థానాన్ని నిరాకరించే పొరపాటులో ఎందుకు పడిపోయారు?

16 శతాబ్దాల తర్వాత, పునరుత్థానాన్ని నమ్మని సద్దూకయులను యేసు మందలించాడు. మృతులను తిరిగి లేపుతానని దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మడానికి వారెందుకు నిరాకరించారు? యేసు వారితో ఇలా అన్నాడు: “లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగ[రు].” (మత్తయి 22:29) ‘సమాధులలో నున్నవారందరు మనుష్య కుమారుని శబ్దము విని బయటికి వస్తారని’ లేఖనాలు మనకు హామీ ఇస్తున్నాయి. (యోహాను 5:27-29) పునరుత్థానం గురించి బైబిలు ఏమి చెప్తుందో మనకు తెలిస్తే, దేవుని శక్తినందున్న మన నమ్మకం, మృతులు తిరిగి లేపబడతారని మనల్ని ఒప్పిస్తుంది. దేవుడు ‘మరెన్నడును ఉండకుండ మరణమును మ్రింగి వేయును. ఈలాగున జరుగునని యెహోవాయే సెలవిచ్చుచున్నాడు.’—యెషయా 25:8.

17. భవిష్యత్తులోని ఏ దినములో యెహోవాయందు నమ్మకం ఉంచటం ప్రత్యేకమైన విధంగా ఆవశ్యకమౌతుంది?

17 సమీప భవిష్యత్తులో, మనలో ప్రతి ఒక్కరం దేవుని రక్షణ శక్తిని ఒక ప్రత్యేకమైన విధానంలో నమ్మవలసిన సమయం వస్తుంది. కాపుదల లేనట్లు కనిపిస్తున్న దేవుని ప్రజలపై అపవాదియగు సాతాను దాడి చేస్తాడు. (యెహెజ్కేలు 38:14-16) అప్పుడు దేవుడు మన పక్షాన తన గొప్ప శక్తిని ప్రదర్శిస్తాడు, అప్పుడిక ప్రతి ఒక్కరూ ఆయనే యెహోవా అని తెలుసుకోవలసి వస్తుంది. (యెహెజ్కేలు 38:21-23) ఆ క్లిష్ట సమయంలో స్థైర్యం కోల్పోకుండేలా సర్వశక్తిమంతుడైన మన దేవునియందు విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందింప చేసుకోవలసిన సమయం ఇదే.

18. (ఎ) యెహోవా శక్తిని గూర్చి ధ్యానించడం ద్వారా మనం ఏ ప్రయోజనాలను పొందుతాము? (బి) తర్వాతి శీర్షికలో ఏ ప్రశ్న పరిశీలించబడుతుంది?

18 యెహోవా శక్తిని గురించి ధ్యానించడానికి అనేకానేక కారణాలున్నాయనడంలో సందేహం లేదు. మనం ఆయన కార్యాలను గూర్చి ధ్యానిస్తుండగా, మన మహోన్నత సృష్టికర్తను వినయంగా స్తుతించేందుకు, ఆయన తన శక్తిని అంత జ్ఞానయుక్తమైన, ప్రేమపూర్వకమైన విధంగా ఉపయోగిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు మనం పురికొల్పబడతాము. మనం సైన్యములకధిపతియగు యెహోవాయందు నమ్మకముంచితే ఎన్నడూ భయపడిపోము. ఆయన వాగ్దానాలందలి మన విశ్వాసం సుస్థిరంగా ఉంటుంది. అయితే, మనం దేవుని స్వరూపమందు సృష్టించబడ్డామని గుర్తుంచుకోండి. కాబట్టి, మనకు కూడా శక్తి ఉంది, అయితే అది పరిమితంగా ఉంది. మనం మన శక్తిని ఉపయోగించే విషయంలో మన సృష్టికర్తను మనమెలా అనుకరించగలము? తర్వాతి శీర్షికలో ఇది చర్చించబడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 1 విద్యుత్‌ ఉత్పాదక కేంద్రాలకు ప్రధాన మూలాధారాలైన చమురు, బొగ్గు వంటి భూగర్భ ఇంధనాలు, తమకవసరమైన శక్తిని సూర్యుని నుండి గ్రహిస్తాయని విస్తృతంగా విశ్వసించబడుతుంది.

^ పేరా 4 దానికి భిన్నంగా, ఇంత వరకు పరీక్షించబడిన అత్యంత శక్తివంతమైన అణు బాంబుకు, 57 మెగాటన్నుల టిఎన్‌టి విస్ఫోటనం చెందినప్పుడు ఎంత శక్తి వెలువడుతుందో అంత శక్తి ఉంది.

^ పేరా 6 బైబిల్లో సూచించబడిన అడవి ఎద్దు బహుశా ఆరోక్స్‌ అయివుండవచ్చు (లాటిన్‌ యూరుస్‌). రెండు వేల సంవత్సరాల క్రితం, ఈ జంతువులు గాల్‌లో (ఇప్పుడు ఫ్రాన్స్‌) ఉండేవి, జూలియస్‌ సీజర్‌ వాటినిలా వర్ణించాడు: “ఈ యూరీ ఏనుగుల కన్నా కాస్త చిన్నగా ఉంటాయి, కానీ వాటి నైజం, రంగు, రూపు ఎద్దుల్లా ఉంటుంది. వాటికున్న బలం, వాటి వేగం గొప్పవి: అవి తమ కంటపడిన మానవులను, మృగాలను ఎంతమాత్రం విడిచిపెట్టవు.”

ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలివ్వగలరా?

యెహోవా శక్తికి సృష్టి ఎలా నిదర్శనాన్నిస్తుంది?

యెహోవా తన ప్రజలకు మద్దతునిచ్చేందుకు ఏ సైన్యములను ఉపయోగించగలడు?

యెహోవా తన శక్తిని ప్రదర్శించిన కొన్ని సందర్భాలు ఏవి?

యెహోవా తన వాగ్దానాలను నెరవేరుస్తాడని మనకే హామీ ఉంది?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రాలు]

“మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను?”

[చిత్రసౌజన్యం]

Photo by Malin, © IAC/RGO 1991

[13వ పేజీలోని చిత్రాలు]

యెహోవా శక్తి యొక్క ప్రదర్శనలను గురించి ధ్యానించడం ఆయన వాగ్దానాలపై మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది