కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సేవ చేసేందుకు జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోవడం

యెహోవా సేవ చేసేందుకు జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోవడం

జీవిత కథ

యెహోవా సేవ చేసేందుకు జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోవడం

క్లార గర్బర్‌ మోయర్‌ చెప్పినది

నాకు 92 ఏండ్లు, అతి కష్టం మీద నడుస్తున్నాను. కానీ మెదడు మాత్రం ఇప్పటికీ బాగానే పనిచేస్తుంది. బాల్యం నుండే యెహోవాకు సేవచేసే ఆధిక్యత లభించినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని! సంక్లిష్టం కాని, నిరాడంబరమైన జీవితాన్ని జీవించడం, ఆధ్యాత్మిక ధనాన్ని కాపాడుకోవడానికి నాకు ఎంతగానో తోడ్పడింది.

నేను 1907 ఆగస్టు 18న అమెరికాలోని, ఒహాయాలోని, అలయన్స్‌లో జన్మించాను. మేము ఐదుగురం పిల్లలం. నేను అందరికన్నా పెద్దదాన్ని. నాకు ఎనిమిదేండ్లున్నప్పుడు, బైబిలు విద్యార్థుల గుంపుకు చెందిన పూర్తికాల పరిచారకుడు మా డైరీ ఫామ్‌ దగ్గరికి సైకిలు మీద వచ్చాడు. అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలువబడేవారు. ఆయన మా అమ్మ లార గర్బర్‌ను తలుపు దగ్గర కలిశాడు. చెడు ఎందుకు అనుమతించబడుతుందో తెలుసా అని అమ్మను అడిగాడు. అమ్మ కూడా దాని గురించే ముందటి నుండీ ఆలోచిస్తూ ఉండేది.

బయట గాదెలో ఉన్న నాన్నను అడిగిన తర్వాత, స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ అనే ఆరు సంపుటాల సెట్టుకు అమ్మ ఆర్డర్‌ చేసింది. అమ్మ వాటిని ఆత్రంగా చదివేసింది, తను తెలుసుకుంటున్న బైబిలు సత్యాలను బట్టి కదిలించబడింది. ఆరవ సంపుటంలో, క్రొత్త సృష్టి గురించి చదివి క్రైస్తవ బాప్తిస్మం నీటిలో మునిగి పొందవలసిన అవసరముందని గ్రహించింది. బైబిలు విద్యార్థులను ఎలా కనుగొనవచ్చో తెలియక, 1916, మార్చి నెలలో, అది చలికాలపు నెలే అయినప్పటికీ, పొలంలోని ఒక చిన్న నదిలో తనకు బాప్తిస్మమివ్వమని నాన్నను అడిగింది.

ఆ తర్వాత ఎంతో కాలం గడవక ముందే, అలయన్స్‌లోని డాటర్స్‌ ఆఫ్‌ వెటరన్స్‌ హాల్‌లో ఇవ్వబోయే ఒక ప్రసంగాన్ని గురించిన ప్రకటనను వార్తాపత్రికలో అమ్మ చూసింది. “యుగాలను గురించిన దైవిక ప్రణాళిక” అన్నదే ఆ ప్రసంగాంశం. స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ మొదటి సంపుటిలోని ప్రసంగం పేరు కూడా అదే కనుక, ఆమె వెంటనే ప్రతిస్పందించింది. మేము గుర్రానికి బండిని తగిలించి, దాన్నెక్కి కుటుంబమంతా కలిసి మొదటిసారి కూటానికి వెళ్ళాం. అప్పటి నుండి, ఆదివారమూ, బుధవారం సాయంకాలమూ సహోదరుల ఇండ్లలో జరిగే కూటాలకు మేము హాజరు కావడం మొదలుపెట్టాం. ఆ తర్వాత కొద్దికాలానికి, ఒక క్రైస్తవ సంఘ ప్రతినిధి చేత అమ్మ మళ్ళీ బాప్తిస్మం పొందింది. ఎల్లప్పుడూ వ్యవసాయ పనిలో బిజీగా ఉండే నాన్న కూడా చివరికి బైబిలు అధ్యయనంలో ఆసక్తిని చూపించారు, కొన్ని సంవత్సరాల తర్వాత బాప్తిస్మం పొందారు.

నాయకత్వం వహిస్తున్నవారిని కలవడం

వాచ్‌ టవర్‌ సొసైటీ అధ్యక్షుడైన జె.ఎఫ్‌. రథర్‌ఫర్డ్‌, 1917, జూన్‌ 10న, అలయన్స్‌ను సందర్శించి, “జనాంగములు ఎందుకు యుద్ధం చేస్తున్నాయి?” అనే అంశంపై కొలంబో థియేటర్‌లో ప్రసంగించారు. నాకు అప్పుడు తొమ్మిదేండ్లు. అక్కడికి నేనూ అమ్మా నాన్నా మా తమ్ముళ్ళు విలీ, చాల్స్‌ వెళ్ళాం. వందకన్నా ఎక్కువ మంది అక్కడ హాజరయ్యారు. అక్కడ హాజరైనవారిలో దాదాపు అందరూ, సహోదరుడు రథర్‌ఫర్డ్‌ ప్రసంగించిన తర్వాత, ఆ థియేటర్‌ వెలుపల నిలబడి ఫోటో దిగారు. ఫోటో దిగడానికి ఆ తర్వాతి వారం, “రానున్న దేవుని రాజ్యం” అనే అంశంపై అదే చోట, ఏ. హెచ్‌. మాక్‌మిలన్‌ ప్రసంగించారు. ఈ సహోదరులు మా చిన్న పట్టణాన్ని సందర్శిచడం మా ఆధిక్యత.

గుర్తుంచుకోదగిన తొలి సమావేశాలు

ఒహాయోలోని, అలయన్స్‌కు కొన్ని మైళ్ల దూరంలో ఉన్న అట్‌వాటర్‌లో 1918 లో నేను మొదటిసారిగా సమావేశానికి హాజరయ్యాను. నాకు బాప్తిస్మం తీసుకునే వయస్సు ఉందా అని అమ్మ సొసైటీ ప్రతినిధులను అడిగింది. యెహోవా చిత్తాన్ని చేస్తానని యెహోవాకు తగిన సమర్పణ చేసుకున్నానని అనుకున్నాను కనుక, సమీపాన ఉన్న పెద్ద ఆపిల్‌ పండ్ల తోటలోని చిన్న నదిలో బాప్తిస్మం పొందడానికి నాకు అనుమతినిచ్చారు. బాప్తిస్మం పొందడానికి దుస్తులు మార్చుకోవడానికని సహోదరులు తయారు చేసిన గుడారంలోకి వెళ్ళి, చాలా మందమైన పాత నైట్‌గౌన్‌ను వేసుకుని బాప్తిస్మం పొందాను.

1919 సెప్టెంబర్‌లో, నా తల్లిదండ్రులూ నేనూ ట్రెయిన్‌ ఎక్కి ఒహాయోలోని లేక్‌ ఎరీ ఒడ్డున ఉన్న సాండస్కీకి వెళ్ళాము. అక్కడ పడవ ఎక్కి, కొద్దిసేపటిలోనే, సీడార్‌ పాయింట్‌కు చేరుకున్నాం. అక్కడే మరపురాని ఒక సమావేశం జరగబోతోంది. మేము పడవ దిగినప్పుడు, ఆ దొరువులో చిన్న బండి మీద మధ్యాహ్న భోజన పదార్థం అమ్మేవారు. నేను హామ్‌బర్గర్‌ తిన్నాను. ఆ రోజుల్లో అది తినడమంటే నాకదొక గొప్ప సంగతి. అది చాలా రుచిగా ఉంది! ఎనిమిది రోజుల సమావేశానికి హాజరైనవారి శిఖరాగ్ర సంఖ్య 7,000. అక్కడ సౌండ్‌ సిస్టమ్‌ లేనందువల్ల, నేను చాలా జాగ్రత్తగా వినవలసి వచ్చింది.

ఈ సమావేశంలో, కావలికోట సహ పత్రికయైన గోల్డెన్‌ ఏజ్‌ (ఇప్పుడు తేజరిల్లు!) విడుదల చేయబడింది. ఆ సమావేశానికి హాజరయ్యేందుకు, నేను మొదటివారం స్కూల్‌కి వెళ్ళలేదు. అలా స్కూల్‌కి వెళ్ళకుండా సమావేశానికి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేకపోలేదు. సీడార్‌ పాయింట్‌ సెలవుల్లో అందరూ సందర్శించే స్థలం. అక్కడ సమావేశానికి వచ్చే వారి కోసం రెస్టారెంట్‌లో వండిపెట్టడానికి వంటవాళ్ళు ఉండేవారు. కానీ ఏదో కారణాన, అక్కడ వంటవాళ్ళూ, వడ్డించేవాళ్ళూ వెళ్ళిపోయారు. కనుక, వంట గురించి అంతో ఇంతో తెలిసిన క్రైస్తవ సహోదరులు నడుం బిగించి, సమావేశానికి వచ్చిన వాళ్ళ కోసం వండిపెట్టారు. ఆ తర్వాతి నుండి అనేక దశాబ్దాల వరకూ, యెహోవా ప్రజలు సమావేశాలు జరుపుకునేటప్పుడు తమంతట తామే వండుకున్నారు.

1922 సెప్టెంబర్‌లో సీడార్‌ పాయింట్‌లో తొమ్మిది రోజుల సమావేశానికి మళ్ళీవెళ్ళే ఆధిక్యత మాకు దొరికింది. హాజరైనవారి శిఖరాగ్ర సంఖ్య 18,000 కన్నా ఎక్కువగా ఉంది. “రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి” అని సహోదరుడు రథర్‌ఫర్డ్‌ ప్రోత్సహించింది ఆ సమావేశంలోనే. అయితే, కొన్ని సంవత్సరాల క్రితమే, కరపత్రములను గోల్డెన్‌ ఏజ్‌ అనే పత్రికలను పంపిణీ చేస్తూ నేను పరిచర్య చేయడం మొదలుపెట్టాను.

పరిచర్య అంటే మెప్పుదల

1918 తొలిభాగంలో, ద ఫాల్‌ ఆఫ్‌ బాబిలోన్‌ అనే కరపత్రాన్ని పొరుగు ప్రాంతంలో పంపిణీ చేయడంలో నేను పాల్గొన్నాను. వాతావరణం చల్లగా ఉంది కనుక, మా కాళ్ళకు వెచ్చదనం కలిగేందుకు ఇంట్లో సోప్‌స్టోన్‌ (ఒక రకం రాయి)ని కట్టెల పొయ్యి మీద వేడిచేసి గుర్రపు బండిలో పెట్టుకుని తీసుకువెళ్ళేవాళ్ళం. మేము చాలా బరువైన కోట్లనూ, టోపీలను ధరించేవాళ్లం. ఎందుకంటే, గుర్రపు బండికి పై కప్పూ, ఇరువైపుల కర్టెన్‌లూ ఉన్నా హీటర్‌ ఏమీ లేదు. అయినా అవి చాలా సంతోషకరమైన సమయాలే.

1920 లో, జెడ్‌జీ (ZG) అని పిలువబడే ద ఫినిష్డ్‌ మిస్ట్రీ అనే ప్రత్యేక సంపుటిని ఒక పత్రికా రూపంలో సిద్ధం చేశారు. * నేనూ నా తల్లిదండ్రులు ఈ ప్రచురణతో అలయన్స్‌ అంతటా తిరిగాం. ఆ రోజుల్లో, ప్రతి ఒక్కరూ ఒంటరిగానే ఇంటింటికి వెళ్ళేవాళ్ళు. కొంత మంది కూర్చున్న వరండాలోకి భయం భయంగా వెళ్ళాను. నేను మాట్లాడిన తర్వాత, “ఈమె చక్కగా ఒక చిన్న ప్రసంగాన్నిచ్చింది కదూ” అని అంటూ, ఒకామె ఆ ప్రచురణను తీసుకుంది. నేను ఆ రోజు 13 జెడ్‌జీలను ప్లేస్‌ చేశాను. నేను ఆరోజు మొదటిసారిగా, ఇంటింటా నియతంగా కొంచెం పెద్ద ప్రసంగం ఇచ్చాను.

నేను తొమ్మిదవ గ్రేడ్‌లో చదువుకుంటున్నప్పుడు, అమ్మకు న్యుమోనియా వచ్చి, ఒక నెల కన్నా ఎక్కువ రోజులు మంచం మీద ఉండిపోయింది, అప్పట్లో మా చిన్న చెల్లెలు హేజల్‌ పసిపాప. కనుక నేను స్కూల్‌ మానుకుని, వ్యవసాయపు పనిలోను, పిల్లలను చూసుకోవడంలోను సహాయపడవలసి వచ్చింది. అయినప్పటికీ, మా కుటుంబం బైబిలు సత్యాన్ని గంభీరంగా తీసుకుంది, మేము అన్ని కూటాలకు క్రమంగా హాజరయ్యేవాళ్ళం.

1928 లో, క్రీస్తు జ్ఞాపకార్థ దినమున, “ఆ తొమ్మండుగురు ఏరి?” (ఆంగ్లం) అనే కరపత్రాన్ని అక్కడ హాజరైనవారికందరికీ పంచిపెట్టారు. లూకా 17:11-19 వచనాలను అది చర్చించింది. అద్భుతంగా స్వస్థతను పొందినందుకు, శుద్ధులైన పది మందిలో ఒకరు మాత్రమే యేసుకు వినయంగా కృతజ్ఞతలు చెప్పారు అని అక్కడ బైబిలు చెబుతుంది. అది నా హృదయాన్ని స్పర్శించింది. “నాకెంత మెప్పుదల ఉంది?” అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

ఇప్పుడు ఇంట్లో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి కనుక, నేను ఆరోగ్యంగా ఉన్నాను కనుక, నాకు ప్రస్తుతం ఏ బాధ్యతలూ లేవు కనుక, నేను ఇల్లు వదిలి పయినీర్‌ సేవ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. పూర్తికాల పరిచర్యను పయినీర్‌ సేవ అంటారు. అందుకు మా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. అలా, నాకూ, నా భాగస్వామి ఆగ్నస్‌ అలిటాకు నియామకం దొరికింది. మేము 1928 ఆగస్టు 28న రాత్రి తొమ్మిది గంటలకు రైలు ఎక్కాము. మాకిద్దరికీ రెండు స్యూట్‌కేసులూ, బైబిలు సాహిత్యాన్ని మోయడానికి చిన్న బ్యాగులూ తప్ప మరేమీ లేవు. రైల్వే స్టేషన్‌లో మా అమ్మానాన్నా, నా చెల్లెళ్ళూ ఏడ్చేశారు. మాకు కూడా ఏడ్పు వచ్చింది. నేను వాళ్ళను మళ్ళీ కలవనేమో అని అనుకున్నాను. ఎందుకంటే, అర్మగిద్దోను చాలా సమీపంలో ఉందని నమ్మేవాళ్ళం మరి. తర్వాతి రోజు ఉదయం, మేము మా నియామకానికి కెంటుకీలోని బ్రూక్స్‌విల్‌కి చేరుకున్నాం.

ఒక లాడ్జ్‌లో ఒక చిన్నగదిని అద్దెకు తీసుకున్నాం. స్పేగటీలను కొనుక్కుని వేడి చేసుకుని తినేవాళ్ళం. సాండ్‌విచ్‌లను కూడా చేసుకునేవాళ్ళం. ఒక్కోరోజు ఒక్కో దిశగా నడిచి వెళ్ళేవాళ్ళం, ఒంటరిగా పరిచర్య చేస్తూ, గృహస్థులకు ఐదు బౌండ్‌ పుస్తకాలను 1.98 అమెరికన్‌ డాలర్లకు ప్రతిపాదించేవాళ్ళం. బైబిలు మీద చాలా ఆసక్తి ఉన్న అనేక మందిని కలుస్తూ, మేము ఆ పట్టణాన్నంతటినీ క్రమంగా పూర్తి చేశాం.

దాదాపు మూడు నెలల్లో, మేము బ్రూక్స్‌విల్‌ని, అలాగే, దాని చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని, అలాగే, ఆగస్టాలోని ప్రతి ఒక్కరినీ సందర్శించాం. కనుక, మేము మేజ్‌విల్‌, పారిస్‌, రిక్‌మండ్‌ అనే పట్టణాల్లో పరిచర్య చేయడానికి తరలివెళ్ళాం. తర్వాతి మూడు సంవత్సరాల్లో, కెంటుకీలోని అనేక మండలాలను పూర్తి చేశాం. అక్కడ సంఘాలు లేవు. తరచూ ఒహాయోలోని స్నేహితులూ, కుటుంబ సభ్యులూ అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చేవారు. వచ్చిన ప్రతిసారీ ఒక వారం లేదా అంతకన్నా ఎక్కువ రోజులు మాతో పాటు పరిచర్య చేస్తూ మాకు సహాయం చేసేవారు.

మరపురాని ఇతర సమావేశాలు

ఒహాయోలోని కొలంబస్‌లో, 1931 జూలై 24-30 వరకు జరిగిన సమావేశం నిజంగానే మరపురాని సమావేశమే. మనం ఇక బైబిలు ఆధారమైన పేరుతో, అంటే యెహోవాసాక్షులు అనే పేరుతో గుర్తించబడతాం అని ప్రకటించబడింది ఆ సమావేశంలోనే. (యెషయా 43:12) అంతకు మునుపు, మీది ఏ మతం అని ప్రజలు అడిగితే, “అంతర్జాతీయ బైబిలు విద్యార్థులం” అని చెప్పేవాళ్ళం. కానీ, నిజానికి అది మనల్ని ఇతరుల నుండి భిన్నమైనవారిగా చూపించడం లేదు. ఇతర మత గుంపులతో సంబంధమున్న మరనేక మంది బైబిలు విద్యార్థులు ఉండేవారు మరి.

నా భాగస్వామి ఆగ్నస్‌ పెళ్ళి చేసుకుంది, ఇక నేను ఒంటరిదానినయ్యాను; కనుక, పయినీర్‌ భాగస్వామి కోసం చూస్తున్నవాళ్ళు నిర్దిష్ట చోటికి రమ్మన్న ప్రకటనను విన్నప్పుడు చాలా పులకరించిపోయాను. బర్తాను, ఎల్‌సీ గార్టీని, బెసీ ఎన్‌స్మింగర్‌ను కలిశాను. వాళ్ళకు రెండు కార్లున్నాయి. తమతో పాటు పని చేసేందుకు వాళ్ళు నాల్గవ పయినీర్‌ సహోదరి కోసం చూస్తున్నారు. మేము మునుపెన్నడూ కలవకపోయినప్పటికీ, సమావేశ స్థలం దగ్గరి నుండి కలిసి బయలుదేరాం.

వేసవిలో, మేము పెన్సిల్వేనియా రాష్ట్రం అంతటా పరిచర్య చేశాం. చలికాలం వచ్చేసరికి, మేము వెచ్చగా ఉండే ఉత్తర కరోలినా, వర్జీనియా, మేరీల్యాండ్‌ దేశాలకు నియామకం మార్చమని కోరుకున్నాం. వసంత ఋతువులో మేము ఉత్తరానికి తిరిగివెళ్ళాం. అప్పట్లో పయినీర్లు అలాగే చేసేవారు. జాన్‌ బూత్‌, రూడాల్ఫ్‌ అబ్బూల్‌ కూడా అలాగే చేసేవారు. వాళ్ళు 1934 లో తమతోపాటు, రాల్ఫ్‌ మోయర్‌నీ, ఆయన తమ్ముడైన విలర్డ్‌నీ కెంటుకీలోని హజర్డ్‌కు తీసుకువచ్చారు.

నేను రాల్ఫ్‌ని అనేక సందర్భాల్లో కలిశాను. 1935, మే 30-జూన్‌ 3 వరకు వాషింగ్‌టన్‌లో జరిగిన పెద్ద సమావేశంలో మేము ఒకరినొకరం బాగా తెలుసుకున్నాం. “గొప్ప సమూహము” అనే అంశంపై ప్రసంగం జరుగుతున్నప్పుడు నేనూ రాల్ఫూ బాల్కనీలో ఒకే దగ్గర కూర్చుని ఉన్నాం. (ప్రకటన 7:9-14) గొప్ప సమూహంలోనివారు, 1,44,000 మంది కన్నా తక్కువ నమ్మకస్థులైన పరలోక తరగతికి చెందిన సభ్యులు అని అప్పటి వరకూ నమ్మేవాళ్ళం. (ప్రకటన 14:1-3) కనుక నేను అలాంటివారిలో ఒకరిగా ఉండకూడదని కోరుకున్నాను!

సహోదరుడు రథర్‌ఫర్డ్‌, గొప్ప సమూహంలోని వారు అర్మగిద్దోనును తప్పించుకునే నమ్మకస్థులైన భూసంబంధ తరగతివారు అని వివరించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. గొప్ప సమూహంలోని వారందరినీ లేచి నిలబడమని ఆయన ఆహ్వానించారు. నేను నిలబడలేదు. కానీ రాల్ఫ్‌ లేచి నిలబడ్డాడు. తర్వాత విషయాలన్ని స్పష్టంగా అర్థమయ్యాయి. క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ప్రతీకాత్మక రొట్టెను ద్రాక్షారసాన్ని నేను ఆఖరిసారిగా తీసుకున్నది 1935 లో. అయితే, అమ్మ, తను చనిపోయే వరకు వాటిని పుచ్చుకుంది. 1957 నవంబరులో అమ్మ చనిపోయింది.

శాశ్వత భాగస్వామి

నేనూ, రాల్ఫ్‌ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకుంటూనే ఉన్నాం. న్యూయార్క్‌లోని లేక్‌ ప్లాసడ్‌లో నేను సేవ చేస్తున్నాను, ఆయనేమో పెన్సిల్వేనియాలో సేవ చేస్తున్నారు. 1936 లో, ఆయన ఒక చిన్న ట్రెయిలర్‌ని నిర్మించారు. దాన్ని తన కారుకు అనుసంధానం చేసి తీసుకువెళ్ళవచ్చు. ఆయన దాన్ని పెన్సిల్వేనియాలోని పాట్స్‌టౌన్‌ నుండి న్యూజెర్సీలోని న్యూవార్క్‌కు తరలించారు. అక్కడే అక్టోబర్‌ 16-18 వరకు సమావేశం జరుగనుంది మరి. సమావేశంలోని ఒక రోజు సమావేశ కార్యక్రమం అయిన తర్వాత, సాయంకాలం, రాల్ఫ్‌ చేసిన ట్రెయిలర్‌ని చూడడానికి మేము పయినీర్లం కొంతమందిమి వెళ్ళాం. ఆ ట్రెయిలర్‌ లోపల వాష్‌బేసిన్‌ దగ్గర, నేనూ ఆయనా నిలబడి ఉన్నాం. “మీకు ఈ ట్రెయిలర్‌ నచ్చిందా?” అని ఆయన అడిగారు.

అవును అన్నట్లుగా తలూపాను. “దీనిలో ఉండాలనుకుంటున్నారా?” అని ఆయన అడిగారు.

“అవును” అని బదులిచ్చాను. వెంటనే ఆయన నన్ను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. నేను ఆ సంఘటనను ఎన్నడూ మర్చిపోలేను. రెండు రోజుల తర్వాత, మేము మ్యారేజ్‌ లైసెన్స్‌ను సంపాదించుకున్నాం. అక్టోబర్‌ 19న, సమావేశం అయిన మరుసటి రోజున మేము బ్రూక్లిన్‌కి వెళ్లి, వాచ్‌ టవర్‌ సొసైటీ ముద్రణాలయాన్ని చూశాము. తర్వాత, మాకు ఒక టెరిటరీని అసైన్‌ చేసి ఇవ్వమని కోరాము. టెరిటరీ ఇన్‌చార్జిలో గ్రాంట్‌ స్యూటర్‌ ఉన్నారు. ఎవరు చేస్తారు అని ఆయన అడిగారు. “మేము పెళ్ళి చేసుకోవచ్చంటే మేము చేస్తాం” అని రాల్ఫ్‌ అన్నారు.

“మీరు సాయంత్రం ఐదు గంటలకు రాగలిగితే, మనం దానికి ఏర్పాట్లు చేయవచ్చు” అని సహోదరుడు స్యూటర్‌ బదులిచ్చారు. అలా ఆ సాయంకాలం బ్రూక్లిన్‌ హైట్స్‌లోని ఒక సాక్షి ఇంట్లో మేము పెళ్ళి చేసుకున్నాం. స్థానిక రెస్టారెంట్‌లో మా స్నేహితులతో కలిసి భోజనం చేశాము, ఆ తర్వాత, న్యూజెర్సీలోని న్యూవార్క్‌లోని రాల్ఫ్‌ ట్రయిలర్‌కు మేము ప్రజా రవాణాలో వెళ్లాం.

తర్వాత ఎంతో కాలం కాకముందే, మేమిద్దరం కలిసి చేయబోతున్న మొదటి పయినీర్‌ నియామకానికి వర్జీనియాలోని హీత్స్‌విల్‌కి వెళ్ళాం. మేము నోర్తమ్‌బర్‌లాండ్‌ కౌంటీలో పరిచర్య చేశాం. తర్వాత పెన్సిల్వేనియాలోని ఫ్లూటన్‌, ఫ్రాంక్లిన్‌ కౌంటీల్లో పనిచేశాం. 1939 లో, రాల్ఫ్‌ని జోన్‌ వర్క్‌కి ఆహ్వానించారు. ఆ నియామకంలో, అనేక సంఘాలను వంతుల వారిగా సందర్శించే పని ఇమిడి ఉంది. టెన్నెసీ రాష్ట్రంలోని సంఘాల్లో మేము సేవ చేశాం. ఆ మరుసటి సంవత్సరం మా కుమారుడు అలన్‌ పుట్టాడు. 1941 లో జోన్‌ వర్క్‌ను ఆపేశారు. తర్వాత మమ్మల్ని వర్జీనియాలోని మారియోన్‌లో ప్రత్యేక పయినీర్లుగా నియమించారు. ఆ రోజుల్లో, ప్రత్యేక పయినీరంటే, పరిచర్యలో నెలకు 200 గంటలు చేయాలి.

సర్దుబాట్లు చేసుకోవడం

1943 లో, ప్రత్యేక పయినీర్‌ పనిని మానుకోవలసిన అవసరముందని కనుగొన్నాను. నెలకు 60 గంటలు మాత్రమే చేయగలను, ఎందుకంటే ఒక చిన్న ట్రెయిలర్‌లో ఉంటున్నాం, ఒకవైపు చిన్న బాబును చూసుకోవాలి, వంట చేయాలి, మేము శుభ్రమైన బట్టలు వేసుకోవాలంటే బట్టలుతకాలి. రాల్ఫ్‌ మాత్రం ప్రత్యేక పయినీర్‌గా కొనసాగారు.

మేము 1945 లో ఒహాయోలోని, అలయన్స్‌కి తిరిగి వెళ్ళాం, తొమ్మిది సంవత్సరాలుగా మా ఇల్లుగా ఉన్న ట్రెయిలర్‌ని అమ్మేసి, నా తల్లిదండ్రులతో పొలంలో ఉన్న ఇంట్లోకి తరలివెళ్ళాం. అక్కడే ముందు వసారాలో మా కూతురు రిబెక్క పుట్టింది. రాల్ఫ్‌, పట్టణంలో పార్ట్‌టైం ఉద్యోగాన్ని చూసుకుని, క్రమ పయినీర్‌గా కొనసాగారు. నేను పొలంలో పని చేశాను, ఆయన పయినీరింగ్‌ కొనసాగించేందుకు మద్దతునివ్వడానికి నాకు సాధ్యమైనదంతా చేశాను. మా పుట్టింటివారు, మాకు ఉచితంగా భూమినీ ఇంటినీ ఇస్తామన్నా, రాల్ఫ్‌ ఒప్పుకోలేదు. మేము రాజ్యాసక్తులను పూర్తిగా వెంబడించేందుకు ఏ అడ్డంకులు ఉండకూడదని ఆయన అనుకున్నారు.

మేము 1950 లో, పెన్సిల్వేనియాలోని పాట్స్‌టౌన్‌లో, నెలకు 25 డాలర్ల అద్దెకు ఒక ఇంటిని తీసుకుని అక్కడికి మకాం మార్చాం. తర్వాతి 30 సంవత్సరాల్లో, అద్దె 75 డాలర్ల వరకు మాత్రమే పెరిగింది. మేము మా జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకునేందుకు యెహోవా సహాయం చేశాడని మేము అనుకున్నాం. (మత్తయి 6:31-33) రాల్ఫ్‌ వారానికి మూడు రోజులు మంగలి పని చేసేవాడు. మేము ప్రతివారం మా ఇద్దరు పిల్లలతో బైబిలు అధ్యయనం చేసేవాళ్ళం, సంఘ కూటాలకు హాజరయ్యేవాళ్ళం, కుటుంబ సమేతంగా రాజ్యసువార్తను ప్రకటించేవాళ్ళం. స్థానిక సంఘంలో రాల్ఫ్‌ సంఘాధ్యక్షుడుగా సేవచేశాడు. మా జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకోవడం ద్వారా, మేము యెహోవా సేవలో చాలా చేయగలిగాం.

నా ప్రియమైన భర్తను కోల్పోయాను

1981 మే 17న, మేము రాజ్య మందిరంలో కూర్చుని బహిరంగ ప్రసంగాన్ని వింటున్నాం. రాల్ఫ్‌కు ఒంట్లో బాగోలేక, రాజ్యమందిరం నుండి ఇంటికి వెళ్ళిపోయారు. తను ఇంటికి వెళ్తున్నట్లు నోటు రాసి, అటెండెంట్‌ చేత నాకు పంపించారు. రాల్ఫ్‌ సాధారణంగా, అలా చేయరు కనుక, నన్ను అప్పుడే కారులో ఇంటికి తీసుకువెళ్ళమని రాజ్యమందిరంలో ఒకరిని అభ్యర్థించాను. ఆ గంటలోనే విపరీతమైన స్ట్రోక్‌ వచ్చి రాల్ఫ్‌ చనిపోయారు. ఆయన చనిపోయారు అని ఆ రోజే కావలికోట పఠనం ముగిసినప్పుడు సంఘంలో ప్రకటించారు.

రాల్ఫ్‌ ఆ నెలలో పరిచర్యలో అప్పటికే 50 కన్నా ఎక్కువ గంటలు చేశారు. 46 కన్నా ఎక్కువ సంవత్సరాలు పయినీర్‌గా ఆయన పూర్తికాల పరిచర్యను చేశారు. ఆయన వంద కన్నా ఎక్కువ మందితో బైబిలు పఠనాలు చేశారు, చివరికి వాళ్ళు బాప్తిస్మం పొంది యెహోవాసాక్షులు అయ్యారు. ఈ కాలమంతటిలోనూ మేము చేసిన త్యాగాలకు తగ్గ ఆశీర్వాదాలను పొందాం.

నా ఆధిక్యతలకు నేను కృతజ్ఞురాలిని

గత 18 సంవత్సరాలుగా, నా కాళ్ళపై నేను నిలబడుతున్నాను, కూటాలకు వెళ్తున్నాను, నా శక్తిమేరకు ఇతరులకు సువార్తను ప్రకటిస్తున్నాను, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నాను. నేను ఇప్పుడు వృద్ధుల కోసమైన రిటైర్‌మెంట్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాను. నాకు సొంతంగా కొంత ఫర్నిచర్‌ను ఉంచుకున్నాను. టీవీ వద్దనుకున్నాను. కానీ నా జీవితం నిండైనది, ఆధ్యాత్మికంగా సుసంపన్నమైనది. నా తల్లితండ్రులూ నా తమ్ముళ్ళిద్దరూ తమ మరణం వరకూ నమ్మకంగా ఉన్నారు, నా చెల్లెళ్ళిద్దరూ సత్యపు మార్గంలో నమ్మకంగా కొనసాగుతున్నారు.

నా కుమారుడు అలన్‌ క్రైస్తవ పెద్దగా సేవచేస్తున్నందుకు ఆనందిస్తున్నాను. అనేక సంవత్సరాలు ఆయన రాజ్య మందిరాల్లోను అసెంబ్లీ హాళ్ళలోను సౌండ్‌ సిస్టమ్‌లను స్థాపించే పనిని చేశాడు, వేసవికాల సమావేశాలకు సౌండ్‌ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్‌ చేసే పనిలో కూడా భాగం వహించాడు. ఆయన భార్య నమ్మకమైన దేవుని సేవకురాలు, వాళ్ళ పిల్లలు ఇద్దరూ పెద్దలుగా సేవ చేస్తున్నారు. నా కూతురు రిబెక్క కరస్‌ 35 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా పూర్తికాల పరిచర్యలో ఉంది, ఆ 35 సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు బ్రూక్లిన్‌లోని యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవ చేసింది. ఆమే, ఆమె భర్తా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో గత 25 సంవత్సరాలు ప్రయాణ పని చేశారు.

రాజ్యము అనేది దాచబడిన కనుగొనగల ధనములాంటిది అని యేసు అన్నాడు. (మత్తయి 13:44) దాచబడిన ఆ ధనమును అనేక సంవత్సరాల క్రితం మా కుటుంబం కనుగొన్నందుకు నేను కృతజ్ఞురాలను. యెహోవాకు సమర్పించుకుని గత 80 సంవత్సరాలు చేసిన సేవను ఏ మాత్రం పశ్చాత్తాపపడవలసిన పని లేకుండా గుర్తు చేసుకోవడం ఎంతటి ఆధిక్యత ! నేను మరొకసారి జీవించగలిగితే, ఇలాగే జీవిస్తాను. ఎందుకంటే, ‘దేవుని కృప జీవము కన్నా ఉత్తమమైనది.’—కీర్తన 63:3.

[అధస్సూచీలు]

^ పేరా 17 ద ఫినిష్డ్‌ మిస్ట్రీ అన్నది స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ సంపుటుల్లో ఏడవది. మొదటి ఆరు సంపుటాలను చాల్స్‌ తేజ్‌ రసల్‌ వ్రాశారు. ఆయన చనిపోయిన తర్వాత ద ఫినిష్డ్‌ మిస్ట్రీ ప్రచురించబడింది.

[23వ పేజీలోని చిత్రం]

1917 లో ఒహాయోలోని అలయన్స్‌లో సహోదరుడు రథర్‌ఫర్డ్‌ ప్రసంగాన్ని విన్నాం

[23వ పేజీలోని చిత్రం]

రాల్ఫ్‌ నిర్మించిన ట్రెయిలర్‌ ముందు, నేనూ రాల్ఫ్‌

[24వ పేజీలోని చిత్రం]

నేను నేడు నా ఇద్దరు పిల్లలతో