కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారి విశ్వాసానికి ప్రతిఫలం లభించింది

వారి విశ్వాసానికి ప్రతిఫలం లభించింది

రాజ్య ప్రచారకుల నివేదిక

వారి విశ్వాసానికి ప్రతిఫలం లభించింది

అపొస్తలుడైన పౌలు విశిష్టమైన విశ్వాసంగలవాడు, తన సహవిశ్వాసులను అలాంటి విశ్వాసాన్నే పెంపొందించుకోమని ప్రోత్సహించాడు. ఆయనిలా అన్నాడు: “దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” (హెబ్రీయులు 11:6) మొజాంబిక్‌ నుంచి వచ్చిన ఈ క్రింది అనుభవాలు యెహోవా ఎలా బలమైన విశ్వాసానికీ, పట్టుదలతో చేసే ప్రార్థనలకీ ప్రతిఫలాన్నిస్తున్నాడో ప్రదర్శిస్తున్నాయి.

• న్యాసా ఉత్తర మండలంలో ఉన్న విధవరాలైన ఒక సహోదరి తన ఆరుగురి పిల్లలతో “దేవుని జీవిత మార్గము” అనే జిల్లా సమావేశానికి ఎలా హాజరవ్వాలా అని ఆలోచించింది. ఆమెకు వచ్చే ఆదాయమంతా స్థానిక మార్కెట్లో సరుకులను అమ్మటం ద్వారా మాత్రమే. అయితే సమావేశం దగ్గరపడినప్పుడు ఆమె, ఆమె కుటుంబం వెళ్లటానికి మాత్రమే సరిపోను డబ్బులున్నాయి. అయినప్పటికీ, యెహోవా ఏర్పాట్లపై నమ్మకం ఉంచి, అనుకున్నట్లుగా సమావేశానికి హాజరయ్యేందుకే తీర్మానించుకుంది.

ఆమె తన ఆరుగురు పిల్లలతో ట్రైను ఎక్కింది. ఆ ప్రయాణంలో టికెట్‌ కలెక్టర్‌ టిక్కట్టు అడగటానికి వచ్చాడు. ఆమె ధరించిన లేపల్‌ కార్డును చూసి, అది దేనికి సంబంధించిన గుర్తింపు కార్డని అడిగాడు. అది యెహోవాసాక్షుల జిల్లా సమావేశ ప్రతినిధి గుర్తింపు కార్డని ఆ సహోదరి చెప్పింది. “ఆ సమావేశం ఎక్కడ జరుగుతుంది?” అని ఆ టికెట్‌ కలెక్టర్‌ అడిగాడు. ఆ సమావేశం అక్కడికి 200 మైళ్ల దూరంలో జరుగుతుందని తెలుసుకున్న తర్వాత అనూహ్యంగా ఆయన టిక్కెట్టుపై సగం ధర మాత్రమే వేశాడు! అప్పుడు ఆ మిగిలిన సగం డబ్బులతో తిరుగు టిక్కెట్లను ఇచ్చాడు. యెహోవాపై నమ్మకం ఉంచినందుకు ఆమె ఎంత సంతోషించి ఉంటుంది!—కీర్తన 121:1, 2.

• మతనిష్ఠగల ఒకామె ఆరాధించే సరైన మార్గాన్ని తనకు చూపించమని దాదాపు 25 ఏళ్లపాటు దేవునికి ప్రార్థించింది. తాను హాజరయ్యే చర్చిలో మతాచారాలు సాంప్రదాయిక ఆచారాలు కలిసిపోయి ఉండేవి. ఇటువంటి ఆరాధనా విధానం దేవునికి ఆమోదయోగ్యంగా లేదని ఆమె సందేహించింది.

ఆమె ఇలా అంటుంది: “‘అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును’ అని మత్తయి 7:7, 8 లో ఉన్న యేసు మాటల్ని నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఈ లేఖనాన్ని మనస్సులో ఉంచుకుని, సత్యానికి నన్ను నడిపించమని దేవునికి ప్రార్థన చేస్తుండేదాన్ని. ఒకరోజు మా చర్చి పాస్టరు చర్చిలోని వారినుద్దేశించి, స్థానిక మార్కెట్లో పనిచేసేవారందరూ కొంత డబ్బూ, దాంతోపాటు కొన్ని వస్తువులు తెస్తే తాను వాటిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆయన అలా అడగటం లేఖనరహితమైనదిగా నాకనిపించింది, అందుకని నేనేమీ పట్టుకెళ్ళలేదు. నేను ‘అర్పణ’ ఏమీ తీసుకురాకపోవటం చూసి ఆ పాస్టరు చర్చి సభ్యులందరి ముందూ నన్ను అవమానపర్చటం మొదలెట్టాడు. ఆ రోజు దేవుణ్ని ఆరాధించే మార్గం ఇది కాదని నేను తెలుసుకుని, ఆ చర్చిని విడిచిపెట్టేశాను. ఈలోగా, సత్యాన్ని తెలుసుకోవటానికి పట్టుదలగా ప్రార్థించసాగాను.

“చివరికి, నేను ధైర్యాన్ని కూడగట్టుకుని యెహోవాసాక్షియైన మా బంధువుని కలిశాను. ఆయన నాకొక కరపత్రాన్ని ఇచ్చాడు, దాన్ని నేను చదువుతుండగానే దేవుడు నా ప్రార్థనలకు జవాబిచ్చాడని తెలుసుకున్నాను. ఈలోగా, నా సహవాసి కూడా బైబిలు సత్యాన్ని మెచ్చుకోవటం మొదలుపెట్టాడు, మేము మా వివాహాన్ని చట్టబద్ధం చేసుకున్నాము. అయితే, తర్వాత మా ఆయన చాలా జబ్బుపడ్డాడు. కాని అప్పట్నుంచి ఆయన మరణం వరకూ, సత్యమార్గాన్ని విడువకుండా ఉండేందుకు నన్ను ప్రోత్సహించాడు, అలాగైతే మళ్లీ పరదైసులో కలుసుకోవచ్చని చెప్పాడు.

“నా ప్రార్థనలకు జవాబిచ్చినందుకు, ఆయన్ని ఆరాధించే సరైన మార్గాన్ని నాకు చూపినందుకు నేను యెహోవాకు సర్వదా కృతజ్ఞురాలిని. అంతేకాక, నా పిల్లలు ఎనిమిది మందీ యెహోవాకు సమర్పించుకోవటం ద్వారా కూడా యెహోవా నా ప్రార్థనలకు జవాబిచ్చాడు.”