కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సిద్ధపడిన హృదయంతో యెహోవా కోసం వెదకడం

సిద్ధపడిన హృదయంతో యెహోవా కోసం వెదకడం

సిద్ధపడిన హృదయంతో యెహోవా కోసం వెదకడం

ఎజ్రా ప్రాచీన ఇశ్రాయేలీయుల యాజకుడు, ప్రధాన ధర్మశాస్త్ర పండితుడు, ధర్మశాస్త్ర పరిశోధకుడు, ధర్మశాస్త్రపు నకలు వ్రాతగాడు, ధర్మశాస్త్ర బోధకుడు. పూర్ణాత్మతో యెహోవాకు సేవ చేసే విషయంలో ఆయన నేటి క్రైస్తవులకు ఒక మంచి మాదిరిగా కూడా ఉన్నాడు. ఏ విధంగా మాదిరిగా ఉన్నాడు? ఆయన, అబద్ధ దేవుళ్ళతోను దయ్యముల ఆరాధనతోను నిండివున్న బబులోను పట్టణంలో నివసించినప్పటికీ, సంపూర్ణభక్తితో యెహోవాకు సేవ చేయడంలో నమ్మకంగా కొనసాగాడు. ఆ విధంగా మనకు మాదిరిగా ఉన్నాడు.

ఆయనకు యెహోవా మీద సంపూర్ణభక్తి దానంతటదే కలగలేదు. ఆయన దాని కోసం ఎంతో కృషి చేశాడు. నిజానికి, ఎజ్రా ‘యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దానిచొప్పున నడచుకొనుటకు దృఢనిశ్చయము చేసుకొన్నాడు.’ ఇక్కడ, దృఢ నిశ్చయము చేసుకొన్నాడు అన్నమాట హెబ్రీభాషలో హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు అనే మాట నుండి అనువదించబడింది.—ఎజ్రా 7:10.

నేడు యెహోవా ప్రజలు సత్యారాధనకు శత్రువుగా ఉన్న లోకంలో జీవిస్తున్నప్పటికీ ఎజ్రాలాగే యెహోవా చేయమని చెప్పినవాటన్నింటినీ చేయాలని కోరుకుంటారు. యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దానిచొప్పున నడచుకోవడానికి తలంపులూ దృక్పథాలూ కోరికలూ ప్రేరణలూ ఇమిడివుండే అంతర్గత వ్యక్తినీ, హృదయాన్నీ ఎలా సిద్ధం చేసుకోవచ్చో మనం చూద్దాం.

మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడం

“సిద్ధం చేసుకోవడం” అంటే, “ఒక ఉద్దేశం కోసం ముందుగా తయారు కావడం. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం లేదా ఒక ఉపయోగం కోసం లేదా ఒక క్రమం కోసం అవసరమైన వాటిని సంసిద్ధం చేసుకోవడం” అని అర్థం. అవును, మీరు దేవుని వాక్యాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించి, యెహోవాకు మీ జీవితాన్ని సమర్పించుకున్నట్లైతే, నిశ్చయంగా మీ హృదయం సిద్ధపడినదై ఉండి, యేసు చెప్పిన విత్తువాడి ఉపమానంలోని “మంచినేలను” పోలి ఉంటుంది.—మత్తయి 13:18-23.

అయినప్పటికీ, హృదయానికి ఎడతెగని అవధానాన్నిస్తూ, శుద్ధీకరణ చేసుకుంటూ ఉండడం అవసరం. ఎందుకని? రెండు కారణాలు ఉన్నాయి. తోటలో ఉండే కలుపు మొక్కల్లాంటి హానికరమైన వైఖరులు మనలో త్వరగా వేరుపారగలవు అన్నదే మొదటి కారణం. ముఖ్యంగా, ఈ అంత్య దినాల్లో, సాతాను విధానపు ‘వాయుమండలము’ మునుపెన్నటికన్నా ఎక్కువగా లోక తలంపులనే హానికరమైన విత్తనాలతో నిండి ఉంది కనుక హానికరమైన వైఖరులు చాలా త్వరగా వేరుపారగలవు. (2 తిమోతి 3:1-5; ఎఫెసీయులు 2:2) రెండవ కారణం నేలకు సంబంధించినది. నేలకు అవధానమివ్వకపోతే, అతి త్వరగా ఎండిపోయి, గట్టిపడి ఫలించనిదిగా మారుతుంది. లేదా చాలా మంది ప్రజలు అటు ఇటు అశ్రద్ధగా నడిచి మట్టంతా త్రొక్కబడి గట్టిపడి ఫలించనిదిగా మారుతుంది. అలాగే మన హృదయమనే అలంకారిక నేలను నిర్లక్ష్యం చేసినా లేదా మన ఆధ్యాత్మిక క్షేమం విషయమై ఏ మాత్రం ఆసక్తి లేనివాళ్ళు అటు ఇటు నడిచి ఈ ఆలంకారిక నేలను త్రొక్కివేసినా అది ఫలించనిదిగా మారవచ్చు.

కనుక, “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అన్న బైబిలు బోధను అన్వయించుకోవడం మనందరికీ ఎంతో ప్రాముఖ్యం.—సామెతలు 4:23.

మన హృదయమనే “నేల”ను మరింత సారవంతంగా చేసే కారకాలు

హృదయమనే “నేల”ను సారవంతం చేస్తూ, అది ఆరోగ్యంగా పెరిగేందుకు తోడ్పడే కొన్ని కారకాలను, లేదా గుణాలను పరిశీలించుదాం. మన హృదయాన్ని మెరుగుపరచే అనేక విషయాలున్నాయన్నది నిజమే. కాని మనమిప్పుడు ఆరు కారకాలను పరిశీలించుదాం. అవేంటంటే, మన ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించడం, అణకువ, నిజాయితీ, దైవిక భయం, విశ్వాసం, ప్రేమ.

“ఆత్మవిషయమై దీనులైనవారు [“తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గురించి స్పృహగలవారు,” NW] ధన్యులు” అని యేసు అన్నాడు. (మత్తయి 5:3) ఆకలి మనం తినవలసిన అవసరముందని మనకు గుర్తు చేస్తున్నట్లే, ఆధ్యాత్మిక ఆకలి లేదా మన ఆధ్యాత్మిక అవసరాన్ని గురించిన మన స్పృహ, మనం ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవలసిన అవసరముందని మనకు గుర్తు చేస్తుంది. ఆధ్యాత్మిక ఆహారం మన జీవితానికి అర్థాన్నీ ఉద్దేశాన్నీ ఇస్తుంది గనుక, సహజంగానే, మానవులకు ఆధ్యాత్మిక ఆహారంపై తృష్ణ ఉంటుంది. సాతాను విధానం నుండి వచ్చే ఒత్తిళ్ళ వల్ల లేదా పఠించే విషయంలో బద్దకం వల్ల, అధ్యాత్మిక అవసరాన్ని గురించిన మన స్పృహ సన్నగిల్లిపోవచ్చు. అయినప్పటికీ, “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడి”యున్నదని యేసు అన్నాడు.—మత్తయి 4:4.

పోషకాహారాన్ని సమతుల్యంగా క్రమంగా తీసుకుంటుంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం, వేళకు ఆకలి అవుతుంది. ఆధ్యాత్మిక విషయంలో కూడా అది నిజం. బహుశా, మిమ్మల్ని మీరు శ్రద్ధగల విద్యార్థిగా ఎంచుకోకపోవచ్చు, కానీ, మీరు దేవుని వాక్యాన్ని ప్రతి రోజూ క్రమంగా చదవడం అలవాటు చేసుకున్నట్లైతే, బైబిలు ఆధారమైన ప్రచురణలను క్రమంగా అధ్యయనం చేస్తున్నట్లైతే, మీ ఆధ్యాత్మిక ఆకలి పెరుగుతున్నట్లు మీరు కనుగొంటారు. వాస్తవానికి, మీరు అలా చేయడం మొదలుపెట్టినట్లైతే, మీరు బైబిలు అధ్యయనాన్ని చేసే సమయం కోసం ఎంతో ఆతురతతో ఎదురు చూడడం మొదలుపెడతారు. కనుక, ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా తీసుకోవడం అలవాటు చేసుకునేందుకు మీరు చేసే ప్రయత్నాన్ని అలా వెంటనే విరమించుకోకండి, ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక ఆకలిని పెంచుకోవడానికి గట్టిగా కృషి చేయండి.

అణకువ, హృదయాన్ని మెత్తపరుస్తుంది

అణకువ మనలను బోధించబడగలవారిగా చేస్తుంది, ప్రేమపూర్వకమైన ఉపదేశాన్నీ దిద్దుబాటునూ మరింత వెంటనే స్వీకరించేందుకు మనకు సహాయం చేస్తుంది. కనుక, సిద్ధపడిన హృదయాన్ని కలిగివుండేందుకు అణకువ చాలా ప్రాముఖ్యం. యోషీయా ఉంచిన చక్కని మాదిరిని పరిగణనలోకి తీసుకోండి. మోషే ద్వారా ఇవ్వబడిన దేవుని ధర్మశాస్త్రమున్న పత్రం ఆయన పరిపాలనా కాలంలో లభించింది. ఆయన ధర్మశాస్త్రంలోని మాటలను విన్నప్పుడు, తన పూర్వికులు సత్యారాధన నుండి ఎంత దూరంగా వెళ్ళిపోయారో గ్రహించి, తన వస్త్రములను చింపుకుని, యెహోవా ఎదుట కన్నీళ్ళు కార్చాడు. దేవుని వాక్యం ఆ రాజు హృదయాన్ని అంత లోతున ఎందుకు స్పర్శించిందంటారు? ఆయన హృదయం “మెత్త”గా ఉన్నందువల్ల, ఆయన యెహోవా మాటలను విన్నప్పుడు తనను తాను తగ్గించుకున్నాడు అని ఆ వృత్తాంతం చెబుతుంది. ఆయనకు అణకువ గల, సరైనది చెబితే స్వీకరించే సుముఖత గల హృదయం ఉందని యెహోవా గమనించి, దానికి తగినట్లుగా ఆయనను ఆశీర్వదించాడు.—2 రాజులు 22:11, 18-20.

“లోకరీతి”గా మాత్రమే ‘జ్ఞానులును వివేకులును’ అయిన వారు ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించలేకపోయారు. కానీ, “విద్యలేని పామరుల”యిన యేసు శిష్యులు వాటిని గ్రహించి అన్వయించుకున్నారు. అలా చేయడానికి వాళ్ళకు సహాయపడింది అణకువే. (లూకా 10:21; 1 కొరింథీయులు 1:26; అపొస్తలుల కార్యములు 4:13) లోకరీత్యా జ్ఞానులైనవారి హృదయాలు అహంకారం చేత కఠినమయ్యాయి కనుక, యెహోవా మాటను అంగీకరించేందుకు సిద్ధపడలేదు. యెహోవా అహంకారాన్ని ద్వేషిస్తాడనడంలో ఆశ్చర్యపడవలసినదేమైనా ఉందా?—సామెతలు 8:13; దానియేలు 5:20.

నిజాయితీ, దైవిక భయమూ

“హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” అని ప్రవక్తయైన యిర్మీయా వ్రాశాడు. (యిర్మీయా 17:9) మోసకరమైన మన హృదయం వివిధ రూపాల్లో బయటపడుతుంది. ఉదాహరణకు, మనం చేసిన తప్పులకు సాకులు చెప్పినప్పుడూ, గంభీరమైన వ్యక్తిగతమైన తప్పిదాలను సమర్థించుకునేందుకు తర్కించినప్పుడూ మోసకరమైన మన హృదయం బయటపడుతుంది. అయితే, మోసపూరితమైన హృదయంపై గెలుపును సాధించుకునేందుకు నిజాయితీ మనకు సహాయపడుతుంది. వాస్తవానికి మనమెవరము ఎలాంటివారము అన్నది తెలుసుకుని, ఆ వాస్తవాన్ని ఎదుర్కుని, మనలను మనం మెరుగుపరచుకునేందుకు తోడ్పాటునిస్తూ నిజాయితీ మనకు సహాయపడుతుంది. కీర్తన రచయిత, “యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము” అని ప్రార్థించినప్పుడు అలాంటి నిజాయితీని కనబర్చాడు. యెహోవా తనను శుద్ధీకరించడానికీ, పరీక్షించడానికీ ఒప్పుకునేందుకు ఈ కీర్తన రచయిత తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు. అలా పరీక్షకు సిద్ధమవ్వడమంటే, లోహములను కరిగించినప్పుడు వచ్చే మడ్డిని పోలిన లక్షణాలు తనకు ఉన్నాయని ఒప్పుకుంటున్నట్లు అర్థం. అయినప్పటికీ, ఆయన అలా పరీక్షించబడడానికి తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు గనుక, మడ్డిని పోలిన తన లక్షణాలను అధిగమించగల్గాడు.—కీర్తన 17:3; 26:2.

“చెడుతనము నసహ్యించు”కోవడం కూడా చేరి ఉన్న దైవిక భయం శుద్ధీకరణ ప్రక్రియకు శక్తివంతమైన సహాయంగా ఉంటుంది. (సామెతలు 8:13) యెహోవాకు నిజంగా భయపడే వ్యక్తి, యెహోవా యొక్క ప్రేమపూర్వక దయనూ, మంచితనాన్నీ ఒకవైపు గుణగ్రహిస్తూనే, మరొకవైపు, తనకు అవిధేయత చూపేవారిని శిక్షించే అధికారం, మరణశిక్షను సహితం విధించే అధికారం యెహోవా దేవునికి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకుంటాడు. “వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు” అని ఇశ్రాయేలు జనాంగం గురించి యెహోవా అన్నప్పుడు, తనకు భయపడేవారు తనను అనుసరిస్తారు అని చూపించాడు.—ద్వితీయోపదేశకాండము 5:29.

ప్రేమగల తండ్రియైన మన దేవుడు మన క్షేమాన్ని గురించే ఆలోచిస్తాడు అని మనకు తెలుసు. దైవిక భయం ఉండాలన్నదాని ఉద్దేశం, ప్రేమామయుడైన ఆ దేవునికి విధేయత చూపించాలని మనం ప్రేరేపించబడాలనే గానీ, భయంతో లోబడి ఉండాలని కాదు. వాస్తవానికి, అలాంటి దైవిక భయం మనలను పైకి తీసుకువస్తుంది, ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఈ విషయాన్ని యేసుక్రీస్తు స్వయంగా స్పష్టంగా చూపించాడు.—యెషయా 11:3; లూకా 12:5.

సిద్ధపడిన హృదయం విశ్వాసంలో సంపన్నమైనదై ఉంటుంది

యెహోవా తన వాక్యం ద్వారా ఏమైనా అడిగాడంటే, నిర్దేశమేమైనా ఇచ్చాడంటే, అది ఎల్లప్పుడూ సరైనదే అయ్యుంటుంది, మన మంచి కోసమే అయ్యుంటుంది అని బలమైన విశ్వాసం గల హృదయానికి తెలుసు. (యెషయా 48:17, 18) అలాంటి హృదయమున్న వ్యక్తి, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని సామెతలు 3:5, 6 ఇస్తున్న బోధను అన్వయించుకోవడంలో గొప్ప సంతృప్తినీ సంతుష్టినీ పొందుతాడు. అయితే, విశ్వాసం కొరవడిన హృదయం యెహోవా మీద నమ్మకముంచేందుకు మొగ్గు చూపదు, ముఖ్యంగా, రాజ్యాసక్తులపై దృష్టిని కేంద్రీకరించేందుకు గాను, తన జీవితాన్ని నిరాడంబరంగా చేసుకోవడం మొదలైన త్యాగాలు చేయాల్సివచ్చినప్పుడు ఆయనపై నమ్మకాన్ని ఉంచదు. (మత్తయి 6:33) విశ్వాసములేని హృదయాన్ని “దుష్ట” హృదయముగా యెహోవా దృష్టించడానికి సరైన కారణమే ఉంది.—హెబ్రీయులు 3:12.

యెహోవాపై మనకున్న విశ్వాసం అనేక విధాల్లో ప్రతిబింబించబడుతుంది. అది, మనం సొంత ఇంట్లో ఏకాంతంలో చేసే పనుల్లోను స్పష్టమౌతుంది. ఉదాహరణకు, గలతీయులు 6:7 లోని, “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అనే సూత్రాన్నే తీసుకుందాం. ఈ సూత్రంలో మనకున్న విశ్వాసం, మనం ఎలాంటి సినిమాలను చూస్తున్నాం, ఎలాంటి పుస్తకాలను చదువుతున్నాం, బైబిలు అధ్యయనం ఎంత చేస్తున్నాం అనే విషయాల్లోను, మన ప్రార్థనల్లోను ప్రతిబింబించబడుతుంది. అవును, యెహోవా వాక్యాన్ని అంగీకరించేందుకూ, దానికి విధేయత చూపేందుకూ సిద్ధపడిన హృదయాన్ని కలిగి ఉండాలంటే, “ఆత్మనుబట్టి” విత్తడానికి ప్రేరేపించే బలమైన విశ్వాసం ప్రాముఖ్యం.—గలతీయులు 6:8.

ప్రేమ—అతి గొప్ప గుణం

నిజానికి, మరే ఇతర గుణాల కన్నా ఎక్కువగా ప్రేమే, యెహోవా వాక్యానికి మన హృదయమనే నేల ప్రతిస్పందించేలా చేస్తుంది. కనుక విశ్వాసంతో, నిరీక్షణతో పోల్చి చూస్తే, ప్రేమే “శ్రేష్ఠమైన” గుణమని అపొస్తలుడైన పౌలు వర్ణించాడు. (1 కొరింథీయులు 13:13) దేవుని మీద ప్రేమతో నిండివున్న హృదయం, ఆయనకు విధేయత చూపించడంలో అత్యంత ఆనందాన్నీ సంతృప్తినీ పొందుతుంది; అది దేవుడు కోరే విషయాలకు విసుక్కోదు. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని అపొస్తలుడైన యోహాను అన్నాడు. (1 యోహాను 5:3) అలాగే, “ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నామాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును” అని యేసు అన్నాడు. (యోహాను 14:23) అలాంటి ప్రేమ పరస్పరం ఇచ్చిపుచ్చుకునేదని గమనించండి. అవును, ప్రేమతో తనకు దగ్గరయ్యేవారిని యెహోవా చాలా గాఢంగా ప్రేమిస్తాడు.

మనం అపరిపూర్ణులమనీ, మనం తనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉంటామనీ యెహోవాకు తెలుసు. అయినప్పటికీ, ఆయన మనకు దూరంగా ఉండడు. “హృదయపూర్వకముగా” చేస్తున్నారా, “మనఃపూర్వకముగా” ఇష్టపూర్వకముగా తనను సేవించేందుకు వారి హృదయం పురికొల్పుతుందా అన్నదే యెహోవా తన సేవకులలో చూసేది. (1 దినవృత్తాంతములు 28:9) మనం హృదయంలో మంచి గుణాలను నాటుకునేందుకూ, తద్వారా ఆత్మ ఫలాలను ఫలించేందుకూ మనకు సమయం పడుతుందనీ, మనవైపు నుండి ప్రయత్నం అవసరమనీ యెహోవాకు తెలుసు. (గలతీయులు 5:22, 23) “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు.” కనుకనే, ఆయన మన కోసం దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. (కీర్తన 103:14) యేసు, యెహోవా దృక్పథాన్నే ప్రతిబింబిస్తూ, తన శిష్యుల తప్పులను తీవ్రంగా విమర్శించక, ఓపికగా వాళ్ళకు సహాయం చేశాడు, వాళ్ళను ప్రోత్సహించాడు. యెహోవా, యేసూ చూపించే అలాంటి ప్రేమా కరుణా ఓపికా మీరు వాళ్ళను మరెక్కువగా ప్రేమించడానికి పురికొల్పడం లేదా?—లూకా 7:47; 2 పేతురు 3:9.

లోతుగా నాటుకు పోయిన కలుపుమొక్కల్లాంటి అలవాట్లను మార్చుకోవడమూ, బాగా గట్టిగా పేరుకుపోయిన మట్టిగడ్డల్లాంటి లక్షణాలను తొలగించుకోవడమూ కష్టంగా ఉన్నట్లు కొన్నిసార్లు మీరు కనుగొంటున్నట్లయితే, నిరుత్సాహపడకండి, దిగులుపడిపోకండి. “ప్రార్థనయందు పట్టుదల కలిగి”యుండి, యెహోవా ఆత్మ కోసం ఎడతెగక విజ్ఞాపనలు చేయడం ద్వారా మీరు మెరుగుపడడానికి కృషి చేస్తూనే ఉండండి. (రోమీయులు 12:12) యెహోవా ఇష్టపూర్వకంగా చేసే సహాయంతో, ఎజ్రాలాగే మీరు కూడా “యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దానిచొప్పున నడచుకొనుటకు” పూర్తిగా సిద్ధపడిన హృదయాన్ని కలిగి ఉండడంలో సఫలీకృతులౌతారు.

[31వ పేజీలోని చిత్రం]

ఎజ్రా బబులోనులో నివసించినప్పటికీ, దైవిక భక్తిని కాపాడుకున్నాడు

[29వ పేజీలోని చిత్రసౌజన్యం]

Garo Nalbandian