కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఓ దేవా, నీ వెలుగును బయలుదేరజేయుము’

‘ఓ దేవా, నీ వెలుగును బయలుదేరజేయుము’

‘ఓ దేవా, నీ వెలుగును బయలుదేరజేయుము’

“నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము; అవి నాకు త్రోవచూపును.”—కీర్తన 43:3.

1. యెహోవా తన సంకల్పాలను ఎలా బయల్పరుస్తాడు?

యెహోవా తన సేవకులకు తన సంకల్పాలను తెలియజేసే విషయంలో ఎంతో దయ కల్గివున్నాడు. మిరుమిట్లు గొలిపే వెలుగుతో ఒకేసారి తన సత్యాన్ని బయల్పర్చే బదులు ఆయన మనకు క్రమ క్రమంగా జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. జీవనమార్గంపై మన పయనాన్ని, దూరప్రయాణానికి బయలుదేరిన బాటసారి నడకతో పోల్చవచ్చు. అతడు తెల్లవారు జామునే నడక ప్రారంభించినప్పుడు దారి మసకబారి ఉంటుంది. సూర్యుడు తూర్పున నెమ్మదిగా ఉదయిస్తుండగా, బాటసారి తన పరిసరాలను కాస్త గుర్తుపట్టగల్గుతాడు. మిగతావి అతనికి కేవలం రేఖామాత్రంగా కనిపిస్తాయి. సూర్యుడు తన గమనాన్ని కొనసాగిస్తుండగా, అతడు సుదూర తీరాలను కూడా చూడగల్గుతాడు. దేవుడు అనుగ్రహించే ఆధ్యాత్మిక వెలుగు విషయం కూడా అంతే. మనం ఒకసారికి కేవలం కొన్ని విషయాలను గ్రహించడానికే ఆయన అనుమతిస్తాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని అదే విధంగా కలిగించాడు. యెహోవా తన ప్రజలకు ప్రాచీన కాలంలో ఎలా జ్ఞానోదయం కలిగించాడో, నేడు ఎలా కలిగిస్తున్నాడో మనం పరిశీలిద్దాము.

2. క్రైస్తవపూర్వపు కాలాల్లో యెహోవా ఎలా జ్ఞానోదయం కల్గించాడు?

2 నలభై మూడవ కీర్తనను కూర్చినది బహుశా కోరహు కుమారులై ఉండవచ్చు. లేవీయులుగా వారికి, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించే ఆధిక్యత ఉంది. (మలాకీ 2:7) అయితే, యెహోవాయే వారి గొప్ప బోధకుడు, వారు ఆయనను సమస్త బుద్ధికీ మూలాధారంగా పరిగణించేవారు. (యెషయా 30:20) “దేవా, . . . నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము; అవి నాకు త్రోవచూపును” అని కీర్తన గ్రంథకర్త ప్రార్థించాడు. (కీర్తన 43:1, 3) ఇశ్రాయేలీయులు తనకు నమ్మకంగా ఉన్నంత వరకూ యెహోవా వారికి తన మార్గాలను బోధించాడు. శతాబ్దాల తర్వాత, యెహోవా వారికి ఎంతో విశేషమైన వెలుగునూ సత్యాన్నీ అనుగ్రహించాడు. ఆయన తన కుమారుణ్ని భూమిపైకి పంపించడం ద్వారా వాటిని అనుగ్రహించాడు.

3. యేసు బోధ ద్వారా యూదులు ఏవిధంగా పరీక్షించబడ్డారు?

3 యేసుక్రీస్తు అనే పేరుగల మానవుడైన, దేవుని కుమారుడు “లోకమునకు వెలుగు”గా ఉన్నాడు. (యోహాను 8:12) “ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు” అంటే, క్రొత్త సంగతులు ప్రజలకు బోధించాడు. (మార్కు 4:2) ఆయన పొంతి పిలాతుకు ఇలా చెప్పాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు.” (యోహాను 18:36) ఒక రోమా పౌరునికి, మరి ముఖ్యంగా జాతీయవాద యూదునికి అది క్రొత్త తలంపే, ఎందుకంటే మెస్సీయ రోమా సామ్రాజ్యాన్ని కూలదోసి ఇశ్రాయేలుకు మునుపున్న వైభవాన్ని తిరిగిరప్పిస్తాడని వాళ్లు తలంచారు. యేసు యెహోవా నుండి వెలుగును ప్రతిఫలింపజేస్తున్నాడు, కానీ ఆయన మాటలు, “దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించి”న యూదా పరిపాలకులకు రుచించలేదు. (యోహాను 12:42, 43) అనేకులు దేవుని నుండి వస్తున్న ఆధ్యాత్మిక వెలుగును, సత్యాన్ని అంగీకరించే బదులు మానవ సంప్రదాయాన్నే అంటిపెట్టుకుని ఉండడానికి ఎంపిక చేసుకున్నారు.—కీర్తన 43:3; మత్తయి 13:13-15.

4. యేసు శిష్యులు అర్థం చేసుకోవడంలో ఎదుగుతారని మనకెలా తెలుసు?

4 అయితే, యథార్థ హృదయులైన కొంతమంది స్త్రీపురుషులు మాత్రం యేసు బోధించిన సత్యాన్ని ఆనందంగా హత్తుకున్నారు. దేవుని సంకల్పాలను అర్థం చేసుకోవడంలో వాళ్లు క్రమంగా అభివృద్ధి సాధించారు. కానీ తమ బోధకుని భూజీవితం ముగింపుకు వస్తుండగా, వాళ్లు నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉంది. యేసు వారికిలా చెప్పాడు: “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు.” (యోహాను 16:12) అవును, దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవడంలో శిష్యులు ఎదుగుతూనే ఉండాలి.

వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది

5. మొదటి శతాబ్దంలో ఏ ప్రశ్న తలెత్తింది, దాన్ని పరిష్కరించే బాధ్యత ఎవరికి ఉంది?

5 యేసు మరణ పునరుత్థానాల తర్వాత, దేవుని నుండి వెలుగు మునుపెన్నటికన్నా తేజోవంతంగా ప్రకాశించింది. పేతురుకు ఇవ్వబడిన ఒక దర్శనంలో, సున్నతి పొందని అన్యులు ఇక మీదట క్రీస్తు అనుచరులు కావచ్చునని యెహోవా బయల్పరిచాడు. (అపొస్తలుల కార్యములు 10:9-17) అది ఒక గొప్ప ప్రకటన! అయితే ఆ తర్వాత ఒక ప్రశ్న తలెత్తింది: అలాంటి అన్యులు క్రైస్తవులుగా మారిన తర్వాత సున్నతి పొందాలని యెహోవా కోరుతున్నాడా? ఆ ప్రశ్నకు సమాధానం దర్శనంలో ఇవ్వబడలేదు, తర్వాత అది క్రైస్తవుల మధ్య తీవ్రమైన వాగ్వివాదాంశమైంది. అది పరిష్కరించబడాలి లేకపోతే వారి మధ్యనున్న అమూల్యమైన ఐక్యత నాశనమౌతుంది. కాబట్టి, యెరూషలేములో, “అపొస్తలులును పెద్దలును ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి.”—అపొస్తలుల కార్యములు 15:1, 2, 6.

6. సున్నతిని గురించిన ప్రశ్నను పరిశీలించేటప్పుడు అపొస్తలులు, పెద్దలు ఏ పద్ధతిని అనుసరించారు?

6 ఆ కూటమిలో సమకూడిన వారంతా, విశ్వసిస్తున్న అన్యులపట్ల దేవుని చిత్తమేమై ఉందో ఎలా నిశ్చయిస్తారు? ఆ చర్చలకు అధ్యక్షత వహించడానికి యెహోవా, దేవదూతను పంపనూలేదు, లేదా అక్కడున్న వారికి ఆయన దర్శనమూ అనుగ్రహించలేదు. అలాగని, అపొస్తలులు, పెద్దలు ఏ నడిపింపూ లేకుండా పూర్తిగా విడిచిపెట్టబడలేదు. వాళ్లు, సున్నతి పొందని అన్యులపై దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించి వారితో ఎలా వ్యవహరించడం మొదలుపెట్టాడో చూసిన కొంతమంది యూదా క్రైస్తవుల సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వాళ్లు నిర్దేశనం కోసం లేఖనాలను కూడా వెదికారు. ఫలితంగా, జ్ఞానోదయం కలుగజేసే ఒక లేఖనం ఆధారంగా, శిష్యుడైన యాకోబు ఒక ప్రతిపాదన చేశాడు. వాళ్లు నిదర్శనాల్ని గురించి ఆలోచిస్తుండగా, దేవుని చిత్తం స్పష్టమైంది. యెహోవా అనుగ్రహం పొందేందుకు అన్య జనాంగాల వారు సున్నతి పొందనవసరం లేదు. తోటి క్రైస్తవులు నడిపింపును పొందగలిగేలా ఆ నిర్ణయాన్ని వ్రాతరూపంలో పెట్టడానికి అపొస్తలులు, పెద్దలు ఎంతమాత్రం జాప్యం చేయలేదు.—అపొస్తలుల కార్యములు 15:12-29; 16:4.

7. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏ విధంగా పురోభివృద్ధికరంగా ఉన్నారు?

7 తమ పితరుల పారంపర్యాచారాలను అంటిపెట్టుకుని ఉన్న యూదా మతనాయకుల్లా కాకుండా చాలామంది యూదా క్రైస్తవులు, అన్యజనాంగాలకు సంబంధించిన దేవుని సంకల్పాన్ని గురించిన ఈ విశేషమైన క్రొత్త అవగాహనను అందుకున్నప్పుడు, దాన్ని అంగీకరిస్తే అన్యులను గూర్చిన తమ సాధారణ దృక్కోణంలో మార్పుచేసుకోవలసిన అవసరం ఉన్నప్పటికీ, ఎంతో ఆనందించారు. యెహోవా నమ్రతతో కూడిన వారి దృక్పథాన్ని ఆశీర్వదించాడు, “సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.”—అపొస్తలుల కార్యములు 15:31; 16:5.

8. (ఎ) మొదటి శతాబ్దం ముగింపుకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ వెలుగు ప్రసరిస్తుందని ఎదురుచూడవచ్చునని మనకెలా తెలుసు? (బి) ఏ యుక్తమైన ప్రశ్నలను మనం పరిశీలిస్తాము?

8 ఆధ్యాత్మిక వెలుగు మొదటి శతాబ్దమంతటిలోనూ ప్రసరిస్తూనే ఉంది. అయితే యెహోవా తన సంకల్పాలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ తొలి క్రైస్తవులకు బయల్పర్చలేదు. మొదటి శతాబ్దపు తోటి విశ్వాసులకు అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “ఇప్పుడు [“లోహపు,” NW] అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము.” (1 కొరింథీయులు 13:12) అలాంటి అద్దానికి చక్కగా ప్రతిఫలించే సామర్థ్యం ఉండదు. అలాగే, మొదట్లో ఆధ్యాత్మిక వెలుగును గూర్చిన అవగాహన పరిమితంగా ఉంది. అపొస్తలుల మరణం తర్వాత, కొంతకాలంపాటు వెలుగు మసకబారింది, కాని ఇటీవలి కాలాల్లో లేఖన జ్ఞానం అభివృద్ధి చెందింది. (దానియేలు 12:4) నేడు యెహోవా తన ప్రజలకు ఎలా జ్ఞానోదయం కల్గిస్తున్నాడు? లేఖనాలను గూర్చిన మన అవగాహనను ఆయన విస్తృతపర్చినప్పుడు మనమెలా ప్రతిస్పందించాలి?

వెలుగు క్రమంగా ప్రకాశవంతమౌతుంది

9. తొలి బైబిలు విద్యార్థులు ఏ విశేషమైన, ప్రభావవంతమైన బైబిలు పఠన విధానాన్ని ఉపయోగించారు?

9 కొంతమంది క్రైస్తవ స్త్రీపురుషులు 19వ శతాబ్దపు చివరి భాగంలో లేఖనాలను శ్రద్ధతో పఠించడం ప్రారంభించినప్పుడు ఈ ఆధునిక కాలంలో మొదటి వెలుగు రేఖ ప్రసరించనారంభించింది. వాళ్లు బైబిలు పఠనం కోసం ఒక ఆచరణాత్మక విధానాన్ని వృద్ధి చేశారు. అలా బైబిలు పఠనం చేసేటప్పుడు ఎవరైనా ఒక ప్రశ్న లేవనెత్తేవారు; ఇక ఆ గుంపు తత్సంబంధిత బైబిలు వచనాలన్నింటినీ విశ్లేషిస్తుంది. ఒక బైబిలు వచనం మరో వచనంతో పొందిక కల్గిలేనట్లు అనిపిస్తే, యథార్థవంతులైన ఈ క్రైస్తవులు ఆ రెండింటినీ పొందుపర్చేందుకు కృషి చేసేవారు. ఆ కాలంనాటి మతనాయకుల్లా కాకుండా, ఈ బైబిలు విద్యార్థులు (అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలువబడేవారు) పారంపర్యాచారమో లేక మానవ నిర్మిత సిద్ధాంతమో కాక పరిశుద్ధ లేఖనాలు తమకు నడిపింపు నిచ్చేందుకు అనుమతించాలని దృఢనిశ్చయం చేసుకున్నారు. అందుబాటులో ఉన్న లేఖన సాక్ష్యాధారమంతటినీ పరిశీలించిన తర్వాత వాళ్లు తమ ముగింపులను వ్రాసి పెట్టుకునేవారు. ఆ విధంగా, అనేక ప్రాథమిక బైబిలు సిద్ధాంతాలను గూర్చిన వారి అవగాహన స్పష్టమైంది.

10. చార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ ఏ సహాయకరమైన బైబిలు పఠన సహాయకాలను వ్రాశాడు?

10 బైబిలు విద్యార్థుల్లో చార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ చాలా విశేషమైనవాడు. ఆయన స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ అనే పేరుతో ఆరు బైబిలు పఠన సహాయకాల పరంపరను వ్రాశాడు. బైబిలు పుస్తకాలైన యెహెజ్కేలు ప్రకటన గ్రంథాలను వివరించే ఏడవ సంపుటి వ్రాయాలని సహోదరుడు రస్సెల్‌ సంకల్పించాడు. “నేను కీలకాన్ని ఎప్పుడు కనుగొంటే అప్పుడు ఏడవ సంపుటి వ్రాస్తాను” అని ఆయన అన్నాడు. అయితే ఆయనిలా కూడా జతచేశాడు: “ప్రభువు ఆ కీలకాన్ని మరెవరికైనా ఇస్తే, అతడు దాన్ని వ్రాయవచ్చు.”

11. కాలానికీ, దేవుని సంకల్పాలను మనం అర్థం చేసుకోవడానికీ ఏ సంబంధం ఉంది?

11 సి. టి. రస్సెల్‌ చేసిన ఆ పై వ్యాఖ్యానం, కొన్ని బైబిలు వృత్తాంతాలను అర్థం చేసుకోవడంలో మనకున్న సామర్థ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశాన్ని ఉదహరిస్తుంది, అదేమిటంటే కాలం. వ్యాకులతగల బాటసారి ఎలాగైతే నిర్ణీతకాలం కంటే ముందు సూర్యుడు ఉదయించేలా ఒత్తిడి చేయలేడో అలాగే తాను ప్రకటన గ్రంథంపై బలవంతంగా వెలుగును ప్రకాశింపజేయలేనని సహోదరుడు రస్సెల్‌కు తెలుసు.

బయల్పర్చబడ్డాయి—దేవుని నిర్ణీత సమయంలోనే

12. (ఎ) బైబిలు ప్రవచనం ఎప్పుడు చక్కగా అర్థమౌతుంది? (బి) బైబిలు ప్రవచనాన్ని మనం అర్థం చేసుకునే సామర్థ్యం దేవుని కాలనియమ పట్టికపై ఆధారపడి ఉంటుందని ఏ ఉదాహరణ చూపిస్తుంది? (పాదవచనం చూడండి.)

12 అపొస్తలులు మెస్సీయను గూర్చిన అనేక ప్రవచనాలను యేసు మరణ పునరుత్థానాల తర్వాత అర్థం చేసుకున్నట్లుగానే, క్రైస్తవులు నేడు బైబిలు ప్రవచనపు పూర్తి వివరాలను, అవి నెరవేరిన తర్వాతనే అర్థం చేసుకుంటారు. (లూకా 24:15, 27; అపొస్తలుల కార్యములు 1:15-21; 4:26, 27) ప్రకటన గ్రంథం ఒక ప్రవచనార్థక పుస్తకం, కాబట్టి అది వర్ణిస్తున్న సంఘటనలు నెరవేరుతున్నప్పుడే మనం దాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలమని ఎదురు చూడాలి. ఉదాహరణకు, ప్రకటన 17:9-11 నందు ప్రస్తావించబడిన సూచనార్థకమైన ఎఱ్ఱని క్రూరమృగము యొక్క భావాన్ని సి. టి. రస్సెల్‌ సరిగ్గా అర్థం చేసుకుని ఉండగలిగేవాడు కాదు ఎందుకంటే ఆ క్రూరమృగం ఏ సంస్థలకైతే ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ సంస్థలు, అంటే నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి, ఇవి రెండూ ఆయన మరణం వరకూ ఉనికిలోకే రాలేదు. *

13. ఏదైనా ఒక బైబిలు అంశంపై వెలుగు ప్రసరించబడినప్పుడు కొన్నిసార్లు ఏమి జరుగుతుంది?

13 సున్నతి పొందని అన్యులు తమ తోటి విశ్వాసులు కాగలరని తొలి క్రైస్తవులు తెలుసుకున్నారు. ఆ మార్పు, అన్య జనాంగాలు సున్నతి పొందవలసిన అవసరానికి సంబంధించి క్రొత్త ప్రశ్నను లేవనెత్తింది. సున్నతికి సంబంధించిన పూర్తి వివాదాంశాన్ని పునఃపరిశీలించేలా ఇది అపొస్తలులను పెద్దలను పురికొల్పింది. అదే విధానం నేడు కూడా కొనసాగుతుంది. ఒక బైబిలు అంశంపై ప్రకాశమానమైన వెలుగు ప్రసరించడం కొన్నిసార్లు, దేవుని అభిషిక్త సేవకులు, అంటే ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ తత్సంబంధిత అంశాలను పునఃపరిశీలించేలా చేస్తుంది. ఈ క్రింద ఇవ్వబడిన ఇటీవలి ఉదాహరణ ఆ విషయాన్ని ఉదహరిస్తుంది.—మత్తయి 24:45.

14-16. ఆధ్యాత్మిక ఆలయాన్ని గూర్చిన మన దృక్కోణంలో ఒక సవరింపు, యెహెజ్కేలు 40 నుండి 48 అధ్యాయాలను మనం అర్థం చేసుకోవడాన్ని ఎలా ప్రభావితం చేసింది?

14నేను యెహోవానైయున్నానని జనాంగాలు తెలుసుకుంటాయి”—ఎలా? (ఆంగ్లం) అనే పుస్తకంలో యెహెజ్కేలు ప్రవచనాన్ని గూర్చిన వివరణ ప్రచురించబడింది. 1971 లో ముద్రించబడిన ఆ పుస్తకంలోని ఒక అధ్యాయం, ఆలయాన్ని గురించిన యెహెజ్కేలు దర్శనాన్ని క్లుప్తంగా చర్చించింది. (యెహెజ్కేలు, 40-48 అధ్యాయాలు) ఆ సమయంలో, యెహెజ్కేలు ఆలయ దర్శనం నూతన లోకంలో ఎలా నెరవేరుతుందా అన్నదానిపైనే దృష్టి కేంద్రీకరించబడి ఉండేది.—2 పేతురు 3:13.

15 అయితే, డిసెంబరు 1, 1972 కావలికోట (ఆంగ్లం) పత్రికలో ప్రచురించబడిన రెండు శీర్షికలు యెహెజ్కేలు దర్శనాన్ని గూర్చిన మన అవగాహనను ప్రభావితం చేశాయి. అవి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు వర్ణించిన గొప్ప ఆధ్యాత్మిక ఆలయాన్ని గురించి చర్చించాయి. ఆధ్యాత్మిక ఆలయంలోని పరిశుద్ధ స్థలం, లోపలి ఆవరణ అభిషిక్తులు భూమిపైనున్నప్పటి వారి స్థితిని సూచిస్తాయని కావలికోట వివరించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత యెహెజ్కేలు 40 నుండి 48 అధ్యాయాలు పునఃపరిశీలించబడినప్పుడు, నేడు ఆధ్యాత్మిక ఆలయం కార్యనిర్వహణలో ఉన్నట్లుగానే, యెహెజ్కేలు తన దర్శనంలో చూసిన ఆలయం కూడా నేడు కార్యనిర్వహణలో ఉండి ఉండాలని గ్రహించడం జరిగింది. అదెలా?

16 యెహెజ్కేలు దర్శనంలో, యాజకులు, యాజకులుకాని గోత్రాలకు సేవచేస్తూ ఆలయ ఆవరణలో అటూ ఇటూ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ యాజకులు “రాజులైన యాజకసమూహము”కు, అంటే యెహోవా అభిషిక్త సేవకులకు స్పష్టంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (1 పేతురు 2:9) అయితే, వాళ్లు క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలమంతటిలోనూ ఆలయం యొక్క భూ ఆవరణలోనే సేవచేస్తూ ఉండరు. (ప్రకటన 20:4) అభిషిక్తులు ఆ కాలమంతటిలోనూ కాకపోయినా దానిలోని చాలా భాగంపాటు ఆధ్యాత్మిక ఆలయపు అతిపరిశుద్ధ స్థలంలో అంటే “పరలోకమందే” దేవుని సేవ చేస్తారు. (హెబ్రీయులు 9:24) యెహెజ్కేలు ఆలయపు ఆవరణల్లో యాజకులు అటూ ఇటూ తిరుగుతున్నట్లు కనిపించింది గనుక, ఆ దర్శనం నేడే అంటే అభిషిక్తులలో కొందరు ఇంకా భూమి మీద ఉండగానే నెరవేరుతుందని చెప్పవచ్చు. దానికి అనుగుణ్యంగానే ఈ పత్రిక యొక్క 1999 మార్చి 1 సంచిక ఈ అంశంపై సవరించబడిన దృక్కోణాన్ని అందజేసింది. అలా, 20వ శతాబ్దాంతం వరకు, యెహెజ్కేలు ప్రవచనంపై వెలుగు ప్రసరించబడింది.

మీ దృక్కోణాన్ని సవరించుకోవడానికి సుముఖంగా ఉండండి

17. సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందిన తర్వాత మీరు మీ వ్యక్తిగత దృక్కోణంలో ఎటువంటి సవరింపులు చేసుకున్నారు, అవి మీకెలా ప్రయోజనం చేకూర్చాయి?

17 సత్యపు జ్ఞానాన్ని పొందాలని కోరుకునేవారెవరైనా సరే తమలోని “ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి” ఉంచడానికి సుముఖత కల్గివుండాలి. (2 కొరింథీయులు 10:5-6) అది ఎల్లప్పుడూ సులభం కాదు, ప్రాముఖ్యంగా దృక్కోణాలు బలంగా నాటుకుని ఉన్నప్పుడు అది సులభం కాదు. ఉదాహరణకు, దేవుని సత్యాన్ని నేర్చుకోకముందు, మీరు మీ కుటుంబంతో కలిసి కొన్ని మతసంబంధమైన వేడుకలను ఆచరిస్తూ ఉండవచ్చు. మీరు బైబిలు పఠించడం మొదలుపెట్టిన తర్వాత, ఈ వేడుకలు నిజానికి అన్యమత మూలాలనుండి వచ్చాయని మీరు గుర్తించారు. మొదట్లో, మీరు నేర్చుకుంటున్నవాటిని ఆచరణలో పెట్టేందుకు మీరు కాస్త వెనుకాడి ఉండవచ్చు. అయితే చివరికి, దేవుని పట్ల ప్రేమ మతనమ్మకాలకంటే బలంగా ఉన్నట్లు నిరూపించబడడంతో, మీరు దేవునికి అప్రీతికరంగా ఉండే వేడుకల్లో పాల్గొనడం మానుకున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని యెహోవా ఆశీర్వదించలేదా?—పోల్చండి హెబ్రీయులు 11:24-25.

18. బైబిలు సత్యాన్ని గూర్చిన మన అవగాహన స్పష్టమైనప్పుడు మనమెలా ప్రతిస్పందించాలి?

18 దేవుని పద్ధతిలో పనులు చేయడం ద్వారా మనం ఎప్పుడూ ప్రయోజనం పొందుతాము. (యెషయా 48:17, 18) కాబట్టి ఒక బైబిలులోని కొన్ని వచనాలను గూర్చిన మన దృక్కోణం స్పష్టమైనప్పుడు, పురోభివృద్ధికరమైన సత్యాన్ని బట్టి మనం ఆనందిద్దాము ! నిజంగా, జ్ఞానోదయం పొందడంలో కొనసాగడం మనం సరైన మార్గంపైనున్నామన్న విషయాన్ని ధృవీకరిస్తుంది. అది ‘పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు అంతకంతకు తేజరిల్లే’ “నీతిమంతుల మార్గము.” (సామెతలు 4:18) నిజమే, ప్రస్తుతం మనం దేవుని సంకల్పంలోని కొన్ని అంశాలను “సూచనగా” చూస్తాము. కానీ దేవుని నిర్ణీత సమయం వచ్చినప్పుడు, మనం సత్యం శోభిల్లుతుండగా చూస్తాము, అదీ ఒకవేళ మన పాదాలు “మార్గము”పై స్థిరంగా పాదుకుని ఉంటేనే. అయితే అంతవరకూ, యెహోవా స్పష్టపర్చిన సత్యాలను బట్టి మనం ఆనందిస్తూ, ఇప్పటికింకా స్పష్టంగా అర్థం కాని వాటిని గూర్చిన జ్ఞానోదయం కోసం వేచి ఉందాము.

19. మనం సత్యాన్ని ప్రేమిస్తున్నామని చూపించడానికి ఒక మార్గం ఏమిటి?

19 వెలుగుపట్ల మనకున్న ప్రేమను మనం చర్యల్లో ఏ విధంగా ప్రదర్శించగలము? ఒక మార్గం ఏమిటంటే దేవుని వాక్యాన్ని క్రమంగా, వీలైతే ప్రతి రోజూ చదవడం ద్వారా చూపించవచ్చు. మీరు ఒక క్రమమైన బైబిలు పఠన కార్యక్రమాన్ని అనుసరిస్తున్నారా? కావలికోట, తేజరిల్లు! పత్రికలు కూడా మనం ఆనందించడానికి శ్రేష్ఠమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని పుష్కలంగా అందజేస్తాయి. మన ప్రయోజనం నిమిత్తం సిద్ధం చేయబడిన పుస్తకాలను, బ్రోషూర్లను, ఇతర ప్రచురణలను కూడా పరిశీలించండి. యెహోవాసాక్షుల వార్షిక పుస్తకంలో ప్రచురించబడే రాజ్య ప్రకటనా కార్యకలాపాలను గూర్చిన ప్రోత్సాహకరమైన నివేదికల మాటేమిటి?

20. యెహోవా నుండి వచ్చే వెలుగు సత్యాలకూ, మనం క్రైస్తవ కూటాలకు హాజరుకావడానికీ ఏ సంబంధం ఉంది?

20 అవును, కీర్తన 43:3 నందు వ్యక్తపర్చబడిన ప్రార్థనకు యెహోవా అద్భుతరీతిగా సమాధానమిచ్చాడు. ఆ వచనం చివరలో, మనమిలా చదువుతాము: “[నీ వెలుగును నీ సత్యమును] నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును.” ఒక పెద్ద సమూహముతో కలిసి యెహోవాను ఆరాధించాలని మీరు ఎదురు చూస్తున్నారా? అటువంటి పెద్ద సమూహాలు ఉండే మన కూటాల్లో అందజేయబడే ఆధ్యాత్మిక ఉపదేశం అనే ఒక ప్రాముఖ్యమైన విధానం ద్వారా నేడు యెహోవా జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాడు. క్రైస్తవ కూటాలపట్ల మన మెప్పును పెంపొందింపజేసుకోవడానికి మనం ఏమి చేయవచ్చు? తర్వాతి శీర్షికలో ఈ అంశాన్ని ప్రార్థనాపూర్వకంగా పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

[అధస్సూచీలు]

^ పేరా 12 సి. టి. రస్సెల్‌ మరణం తర్వాత, యెహెజ్కేలు ప్రకటన గ్రంథాలపై వివరణను అందజేయాలనే ఉద్దేశంతో స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ యొక్క ఏడవ సంపుటిగా వ్యవహరించబడిన ప్రచురణ సిద్ధం చేయబడింది. ఆ సంపుటి కొంతమేరకు, ఆ బైబిలు పుస్తకాలపై రస్సెల్‌ చేసిన వ్యాఖ్యానాల ఆధారంగా తయారు చేయబడింది. అయితే, ఆ ప్రవచనాల భావాన్ని బయల్పరిచే సమయం అప్పటికింకా రాలేదు, అంతేగాక స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ అనే ఆ సంపుటిలో అందజేయబడిన వివరణ అంత స్పష్టంగా లేదు. తర్వాతి సంవత్సరాల్లో, యెహోవా కృపాబాహుళ్యము, ప్రపంచ సంఘటనల్లో జరిగిన అభివృద్ధులు ఆ ప్రవచన పుస్తకాల భావాన్ని క్రైస్తవులు మరింత కచ్చితంగా గ్రహించేలా చేశాయి.

మీరు సమాధానమివ్వగలరా?

• యెహోవా తన సంకల్పాలను పురోభివృద్ధికరంగా ఎందుకు బయల్పరుస్తాడు?

• సున్నతిని గూర్చిన అంశాన్ని యెరూషలేములోని అపొస్తలులు, పెద్దలు ఎలా పరిష్కరించారు?

• తొలి బైబిలు విద్యార్థులు ఎలాంటి బైబిలు పఠన విధానాన్ని అనుసరించేవారు, అది ఎందుకు విశేషమైనది?

• దేవుని నిర్ణీత కాలంలో ఆధ్యాత్మిక వెలుగు ఎలా బయల్పర్చబడిందో ఉదహరించండి.

[అధ్యయన ప్రశ్నలు]

[12వ పేజీలోని చిత్రం]

దేవుని నిర్ణీత కాలంలో ప్రకటన గ్రంథంపై వెలుగు ప్రసరించబడుతుందని చార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌కు తెలుసు