కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దిద్దుబాటును స్వీకరించిన మాదిరికరమైన వ్యక్తి

దిద్దుబాటును స్వీకరించిన మాదిరికరమైన వ్యక్తి

దిద్దుబాటును స్వీకరించిన మాదిరికరమైన వ్యక్తి

“జాంబియాలోని మొసళ్ళు నెలకు ముప్పై మంది మనుష్యులను తింటాయి” అని కొన్ని సంవత్సరాల క్రితం, ఒక ఆఫ్రికా వార్తాపత్రిక నివేదించింది. అధ్యయనం కోసం ఈ సరీసృపాలను పట్టిన ఒక జంతుశాస్త్రజ్ఞుడి అభిప్రాయం ప్రకారం, “ఒక మొసలిని కదలకుండా పట్టుకుని ఉంచడానికి 12 మంది కావలసి వచ్చింది.” శక్తివంతమైన తోకా, బలమైన దవడలూ ఉండే మొసలి భయంకరమైనదిగా అనిపించగలదు!

సృష్టికర్త, తన సేవకుడైన యోబుకు ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పేందుకు, “గర్వించిన జంతువులన్నిటికి . . . రాజు” అయిన మొసలిని లేదా “మకరము”ను ఉదాహరణగా ఉపయోగిస్తున్నాడు. (యోబు 41:1, 34) దాదాపు 3,500 సంవత్సరాల క్రితం, ఊజు అనే దేశములో ఇది జరిగింది. ఊజు, ఉత్తర అరేబియాలోనే ఉండి ఉంటుంది. మకరాన్ని గురించి మాట్లాడుతూ, “దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు?” అని దేవుడు యోబుతో అన్నాడు. (యోబు 41:10) ఎంత నిజం! మనం మొసలికే భయపడితే, దాన్ని సృష్టించిన వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మరెంత భయపడాలి! ఈ విషయంలో యోబు తన తప్పును ఒప్పుకుంటూ, తనకు నేర్పిన పాఠానికి మెప్పుదల చూపించాడు.—యోబు 42:1-6.

యోబు అని అన్నప్పుడు, శ్రమలను సహించిన నమ్మకస్థుడైన మాదిరికరమైన వ్యక్తి అని మనం గుర్తు చేసుకోవచ్చు. (యాకోబు 5:11) నిజానికి, యోబు విశ్వాసం తీవ్రంగా పరీక్షించబడక ముందే, ఆయనను బట్టి యెహోవా ఆనందించాడు. దేవుని లెక్క ప్రకారం, ఆ కాలంలో, “అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు.” (యోబు 1:8) మనం కూడా దేవుడ్ని ఎలా ప్రీతిపర్చవచ్చో తెలుసుకునేందుకు యోబును గురించిన వృత్తాంతం మనకు సహాయపడుతుంది కనుక యోబు గురించి మనం మరెక్కువగా తెలుసుకునేందుకు కదిలించబడాలి.

దేవునితో గల సంబంధానికే మొదటి స్థానం

యోబు ధనవంతుడు. ఆయనకు ఎంతో బంగారమే కాక, 7,000 గొర్రెలూ, 3,000 ఒంటెలూ, 500 ఆడ గాడిదలూ, 1,000 పశువులూ ఉండేవి, ఎంతో మంది సేవకులూ ఉండేవారు. (యోబు 1:3) కానీ యోబు తన సంపద మీద కాక, యెహోవా మీదే నమ్మకముంచాడు. “సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను -నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను . . . పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును. అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరమగును” అని ఆయన తర్కించాడు. (యోబు 31:24-28) యోబులాగే, మనం కూడా భౌతిక వస్తువుల కన్నా కూడా యెహోవా దేవునితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండడానికే ఎక్కువ విలువ ఇవ్వాలి.

తోటి మానవులతో న్యాయంగా వ్యవహరించాడు

యోబు తన సేవకులతో ఎలా వ్యవహరించాడు? ఆయనను న్యాయంగల వ్యక్తిగా, సమీపించదగిన వ్యక్తిగా వాళ్ళు గుర్తించారని యోబు మాటలు సూచిస్తున్నాయి. “నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యెమాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణచేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?” అని ఆయన అన్నాడు. (యోబు 31:13, 14) యెహోవా కరుణను యోబు విలువైనదిగా ఎంచాడు గనుక, ఆయన కూడా తన సేవకులతో కరుణాపూర్వకంగా వ్యవహరించాడు. ముఖ్యంగా, క్రైస్తవ సంఘంలో పైవిచారణా పదవుల్లో ఉన్నవారికి ఎంత చక్కని మాదిరిగా ఉన్నాడు! వాళ్ళు కూడా తప్పకుండా న్యాయంగల వ్యక్తులుగానూ పక్షపాతంలేని వ్యక్తులుగానూ సమీపించదగ్గ వ్యక్తులుగానూ ఉండాలి.

తన ఇంటివారు కానివారి మీద కూడా యోబు ఆసక్తిని కనబరచాడు. ఇతరుల గురించి తన చింతను వ్యక్తం చేస్తూ, ఆయన, “బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసినయెడలను . . . గుమ్మములో నాకు సహాయము దొరకునని [వచ్చే] తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.” (యోబు 31:16-22) సంఘంలో, కష్టాల్లో ఉన్నారని మనకు తెలిసినవారిని పరిగణించేవారముగా మనముందాము.

తోటి మానవుల మీద నిస్వార్థమైన ఆసక్తి ఉన్నందువల్లే, యోబు పరిచయం లేనివాళ్ళకు కూడా ఆతిథ్యాన్నిచ్చాడు. కనుకనే, “పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా” అని ఆయన చెప్పగల్గాడు. (యోబు 31:32) నేడు దేవుని సేవకులకు ఆయన ఎంత చక్కని మాదిరిగా ఉన్నాడు! బైబిలు సత్యం మీద క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్న వ్యక్తులు రాజ్య మందిరానికి వచ్చినప్పుడు ఆతిథ్యపూర్వకంగా మనం వాళ్ళను స్వీకరించడం, వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది. నిజమే, ప్రయాణ పైవిచారణకర్తలకూ, మిగతా తోటి క్రైస్తవులకూ కూడా మన ప్రేమపూర్వక ఆతిథ్యం అవసరం.—1 పేతురు 4:9; 3 యోహాను 5-8.

తన శత్రువుల విషయంలో కూడా యోబుకు సరైన దృక్పథమే ఉంది. తనను ద్వేషించినవారికి విపత్తు కలగడాన్ని చూసి ఆయన ఆనందించలేదు. (యోబు 31:29, 30) అలాంటి వారికి కూడా మంచి చేయడానికి ఆయన సుముఖత చూపించేవాడన్న విషయం, ముగ్గురు అబద్ధపు ఆదరణకర్తల కోసం ప్రార్థన చేయడానికి ఆయన వెంటనే సిద్ధమవ్వడంలో స్పష్టమైంది.—యోబు 16:2; 42:8, 9; పోల్చండి మత్తయి 5:43-48.

లైంగిక విషయంలో పవిత్రంగా ఉన్నాడు

యోబు తన వివాహ జత పట్ల నమ్మకంగా ఉన్నాడు. మరే ఇతర స్త్రీతోను అనుచితమైన ఆత్మీయత పెంచుకోవడానికి అతడు తన హృదయాన్ని అనుమతించలేదు. “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును? నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక. అది దుష్కామ కార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము” అని యోబు అన్నాడు.—యోబు 31:1, 9-11.

అనైతిక కోరికలు తన హృదయాన్ని చెరచడానికి యోబు అనుమతించలేదు. ఆయన నైతిక జీవన శైలిని అవలంబించాడు. అనైతిక ఆకర్షణలకు వ్యతిరేకంగా పోరాడిన ఈ నమ్మకస్థుడైన మనిషిని బట్టి యెహోవా ఆనందించాడనడంలో ఆశ్చర్యమేమీ లేదు!—మత్తయి 5:27-30.

కుటుంబ ఆధ్యాత్మికతను గురించిన చింత

కొన్నిసార్లు, యోబు కుమారులు చేసే విందులకు, ఆయన కుమారులూ కుమార్తెలూ అందరూ ఉండేవారు. ఈ విందు రోజుల్లో, పిల్లలు యెహోవాకు వ్యతిరేకంగా ఏ విధంగానైనా పాపం చేశారేమోన్న చింత యోబుకు ఉండేది. కాబట్టి ఆయన చర్య గైకొనేవాడు. “వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను” అని ఆయనను గురించి బైబిలు వృత్తాంతం చెబుతుంది. (యోబు 1:4, 5) తన పిల్లలకు యెహోవా అంటే భక్తిపూర్వకమైన భయం ఉండాలి, తన పిల్లలు యెహోవా మార్గాల్లో నడవాలి అని యోబుకున్న చింత ఆయన కుటుంబ సభ్యులపై చెరగని ముద్ర వేసి ఉండవచ్చు!

నేడు, క్రైస్తవ కుటుంబ శిరస్సులు దేవుని వాక్యమైన బైబిలు నుండి తమ కుటుంబాలకు నిర్దేశాలనివ్వవలసిన అవసరముంది. (1 తిమోతి 5:8) కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించడం నిశ్చయంగా తగినదే.—రోమీయులు 12:12.

పరీక్షల్లో ఉన్నప్పుడు నమ్మకంగా సహించాడు

యోబు మీదికి వచ్చిన తీవ్ర పరీక్షలను గురించి బైబిలును పఠించే దాదాపు అందరికీ బాగా తెలుసు. విషమకరమైన పరిస్థితుల్లో, యోబు దేవుడ్ని శపిస్తాడని సాతాను ఎంతో నమ్మకంగా అన్నాడు. యెహోవా ఈ సవాలును అంగీకరించాడు. సాతాను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యోబు మీదకు విపత్తులను తీసుకువచ్చాడు. ఆయన తన పశుసంపదను కోల్పోయాడు. అంత కన్నా దారుణంగా, ఆయన పిల్లలందరూ చనిపోయారు. ఆ తర్వాత, యోబుకు నఖశిఖ పర్యంతం బాధాకరమైన కురుపులను రప్పిస్తూ సాతాను యోబును మొత్తాడు.—యోబు 1, 2 అధ్యాయాలు.

చివరికి ఏమి జరిగింది? దేవుడ్ని శపించి చనిపొమ్మని ఆయన భార్య ఆయనకు చెప్పినప్పుడు, “మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా” అని అన్నాడు. “ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటిమాటతోనైనను పాపము చేయలేదు” అని కూడా బైబిలు అంటుంది. (యోబు 2:10) అవును యోబు నమ్మకంగా సహించాడు. ఆ విధంగా అపవాది అబద్ధికుడు అని నిరూపించాడు. అలాగే మనం కూడా యెహోవా మీద మనకున్న స్వచ్ఛమైన ప్రేమ చేత పురికొల్పబడినందువల్లే యెహోవాకు సేవ చేస్తున్నామని తీవ్రమైన పరీక్షలను సహిస్తూ నిరూపించుదాం.—మత్తయి 22:36-38.

అణకువతో దిద్దుబాటును అంగీకరించాడు

యోబు అనేక విధాల్లో మాదిరికరంగా ఉన్నప్పటికీ, ఆయన పరిపూర్ణుడు కాడు. “పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? ఆలాగున ఎవడును పుట్ట నేరడు” అని స్వయంగా యోబే అన్నాడు. (యోబు 14:4; రోమీయులు 5:12) యథార్థవర్తనుడు అని దేవుడు యోబు గురించి అన్నాడంటే, దేవుడు, అపరిపూర్ణులైన పాపభరితులైన మానవ సేవకుల నుండి ఏ స్థాయిని నిరీక్షిస్తాడో ఆ స్థాయి మేరకు యోబు జీవించాడన్న అర్థంలో యథార్థవర్తనుడై ఉన్నాడు. ఇది ఎంత ప్రోత్సాహకరమైన విషయమో కదా!

యోబు శ్రమలను సహించాడు. అయితే ఆయనలోని ఒక లోపం బయటపడింది. ఆయనకు వచ్చిన కష్టాలను గురించి విని, సాంత్వనపరచడానికి అన్నట్లు ముగ్గురు వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చారు. (యోబు 2:11-13) ఆయన ఘోర పాపాలను చేసినందుకే దేవుడు ఆయనను శిక్షిస్తున్నాడని వాళ్ళు ఆరోపించారు. వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణలకు సహజంగానే ఆయనకు బాధ కలిగింది. ఆయన తనను తాను సమర్థించుకునేందుకు బాగా ప్రయత్నించాడు. అయితే తనను తాను సమర్థించుకోవడంలో ఆయన సమతుల్యతను కోల్పోయాడు. అంతెందుకు, తాను దేవుని కన్నా నీతిమంతుడనన్నట్లుగా మాట్లాడాడు!—యోబు 35:2, 3.

యోబు అలా మాట్లాడినప్పటికీ, దేవుడికి యోబు మీద ప్రేమ ఉంది కనుక, అతని తప్పును చూపించడానికి ఒక యువకుడ్ని ఉపయోగించాడు. “ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతనిమీద బహుగా కోపగించెను” అని ఆ వృత్తాంతం చెబుతుంది. “నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను” అని యోబు అన్నాడు అని ఎలీహు గమనించాడు. (యోబు 32:2; 34:5) అయినప్పటికీ, యోబు చేసిన పాపాలకే యోబును దేవుడు శిక్షిస్తున్నాడని ఆ ముగ్గురు ‘ఆదరణ కర్తలు’ చేసిన అబద్ధారోపణలో ఎలీహు చేరలేదు. అయితే, యోబు యొక్క నమ్మకత్వంలో ఆయన తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేసి, “వ్యాజ్యెము ఆయన [యెహోవా] యెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను” అని యోబుకు సలహా ఇచ్చాడు. నిజంగానే, యోబు తనను తాను సమర్థించుకునే ప్రయత్నంలో తొందరపాటుతో మాట్లాడే బదులు యెహోవా కోసం కనిపెట్టి ఉండవలసింది. “న్యాయమును నీతిని ఆయన [యెహోవా] ఏమాత్రమును చెరుపడు” అని ఎలీహు ఆయనకు హామీ ఇచ్చాడు.—యోబు 35:14; 37:23.

యోబు తన ఆలోచనా విధానాన్ని సరిదిద్దుకోవలసిన అవసరం ఉండింది. కనుక, తన మహాత్మ్యముతో పోల్చితే మానవుడు ఎంత అల్పుడన్న దాని నుండి ఒక పాఠాన్ని యెహోవా యోబుకు నేర్పించాడు. భూమి, సముద్రం, నక్షత్రాలతో నిండివున్న ఆకాశం, జంతువులు, సృష్టిలోని మరనేక అద్భుతాలు మొదలైన వాటిని గురించి ఆలోచించమని యెహోవా సూచించాడు. చివరికి ఆయన మకరము లేదా మొసలి గురించి మాట్లాడాడు. యోబు అణకువతో దిద్దుబాటును స్వీకరించాడు. అలా కూడా ఆయన మాదిరిని ఉంచాడు.

మనం యెహోవా సేవను బాగా చేస్తున్నప్పటికీ తప్పులు చేస్తాం. మనం చేసిన తప్పు గంభీరమైనదైతే, ఏదో ఒక మార్గంలో యెహోవా మనలను సరిదిద్దుతాడు. (సామెతలు 3:11, 12) మన మనస్సాక్షిని సూటిగా ప్రశ్నించే ఒక లేఖనం మన మనస్సులోకి రావచ్చు. లేదా కావలికోట గానీ, వాచ్‌ టవర్‌ సొసైటీ ప్రచురించే మరేదైనా ప్రచురణ గానీ మన తప్పును గురించి మనకు తెలియజేసే దేన్నైనా చెప్తుండవచ్చు. లేదా మనం ఒక బైబిలు సూత్రాన్ని అన్వయించుకోవడంలో విఫలులమయ్యామని మన తోటి క్రైస్తవులు ఎవరైనా దయాపూర్వకంగా తెలియజేయవచ్చు. అలాంటి దిద్దుబాటుకు మనమెలా ప్రతిస్పందిస్తాం? యోబైతే, “నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను” అని అంటూ పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చాడు.—యోబు 42:6.

యెహోవా ప్రతిఫలమిచ్చాడు

తన సేవకుడైన యోబు మరో 140 సంవత్సరాలు జీవించేందుకు అనుమతినిస్తూ యెహోవా ఆయనకు ప్రతిఫలమిచ్చాడు. అప్పుడు ఆయన, తను కోల్పోయిన దాని కన్నా చాలా ఎక్కువ తిరిగి పొందాడు. ఆయన చివరికి మరణించినప్పటికీ, దేవుని క్రొత్త లోకంలో తప్పకుండా పునరుత్థానం పొందుతాడు.—యోబు 42:12-17; యెహెజ్కేలు 14:14; యోహాను 5:28, 29; 2 పేతురు 3:13.

మనం దేవునికి నమ్మకంగా సేవ చేస్తూ, బైబిలు ఆధారమైన దిద్దుబాటులనన్నింటినీ అంగీకరిస్తే, మనకు కూడా దేవుని అంగీకారం ఉంటుందన్న నమ్మకం కలిగి ఉండగలం. దాని ఫలితంగా, దేవుని క్రొత్త విధానంలో జీవించే నిశ్చయమైన నిరీక్షణను మనం కలిగి ఉండగలం. దాని కన్నా ముఖ్యంగా మనం యెహోవాను ఘనపరచినవారమౌతాం. మనం నమ్మకమైన ప్రవర్తన ద్వారా ప్రతిఫలాన్ని పొందుతాము, అలాగే, దేవుని ప్రజలు స్వార్థపూరిత కారణాల వల్ల కాక, హృదయపూర్వక ప్రేమతోనే ఆయనకు సేవ చేస్తారని ఇప్పటికే ఉన్న రుజువులకు తోడు మరొక రుజువునిచ్చినవారమౌతాం. నమ్మకస్థుడైన యోబులా, అణకువతో దిద్దుబాటును అంగీకరిస్తూ యెహోవా హృదయానికి ఆనందాన్ని కలిగించే ఆధిక్యత మనకూ ఉంది!—సామెతలు 27:11.

[26వ పేజీలోని చిత్రాలు]

అనాథలకూ, విధవరాండ్రకూ, ఇతరులకూ యోబు ప్రేమపూర్వక శ్రద్ధను చూపించాడు

[28వ పేజీలోని చిత్రాలు]

యోబు అణకువతో దిద్దుబాటును అంగీకరించినందుకు సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు