కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ప్రకారం, అపొస్తలుడైన పౌలు రోమీయులు 12:19 నందు, “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకోవద్దు గానీ, ఉగ్రతకు చోటివ్వండి” అని ఉపదేశించాడు. వివిధ భాషానువాదాల్లో ఇదే విధమైన పదజాలం ఉంది గనుక, పౌలు సూచిస్తున్నది క్రైస్తవులు ఉగ్రులు కావచ్చుననా?

ఖచ్చితంగా చెప్పాలంటే, ఆయన సూచిస్తున్నది అది కాదు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్నది దేవుని ఉగ్రత గురించి. అయితే, దానర్థం క్రైస్తవులు ఉగ్రులైనా తప్పులేదని కాదు. ఉగ్రులు కాకూడదని బైబిలు మనకు స్పష్టంగా ఉపదేశిస్తుంది. దైవిక ఉపదేశం యొక్క కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.

“కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము; వ్యసనపడకుము అది కీడుకే కారణము.” (కీర్తన 37:8) “తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును.” (మత్తయి 5:22) “శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు.” (గలతీయులు 5:19, 20) “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (ఎఫెసీయులు 4:31) “ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.” (యాకోబు 1:19) అంతేగాక, ఆగ్రహం తెచ్చుకోవద్దనీ, చిన్న చిన్న తప్పులకే మానవ సహజమైన పొరపాట్లకే కోపగించుకోవద్దనీ సామెతల గ్రంథం పదే పదే ఉపదేశిస్తుంది.—సామెతలు 12:16; 14:17, 29; 15:1; 16:32; 17:14; 19:11, 19; 22:24; 25:28; 29:22.

రోమీయులు 12:19 యొక్క సందర్భం, ఆ ఉపదేశానికి అనుగుణంగా ఉంది. మన ప్రేమ వేషధారణ లేనిదై ఉండాలనీ, మనల్ని హింసిస్తున్న వారిని మనం దీవించాలనీ, ఇతరుల గురించి మంచిగానే తలంచడానికి మనం ప్రయత్నించాలనీ, కీడుకు ప్రతిగా కీడు ఎవరికీ చేయవద్దనీ, అందరితోనూ సమాధానంగా ఉండడానికి కృషి చేయాలనీ పౌలు సిఫారసు చేశాడు. తర్వాత ఆయనిలా ఉద్బోధించాడు: “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకోవద్దు గానీ, ఉగ్రతకు చోటివ్వండి—పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని యెహోవా చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.”—రోమీయులు 12:9, 14, 16-19, NW.

అవును, ఆగ్రహం మనం ప్రతీకార చర్యలు తీసుకునేలా మనల్ని పురికొల్పేందుకు మనం అనుమతించకూడదు. పరిస్థితుల గురించి మనకున్న అవగాహన, న్యాయాన్ని గురించి మనకున్న గ్రాహ్యం అపరిపూర్ణమైనవి. ఆగ్రహం మనం ప్రతీకార చర్య తీసుకునేందుకు మనల్ని పురికొల్పేలా మనం అనుమతిస్తే, తరచూ మనం తప్పే చేస్తాము. దేవుని శత్రువైన అపవాది సంకల్పాలను అది నెరవేరుస్తుంది. మరోచోట పౌలు ఇలా వ్రాశాడు: “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి.”—ఎఫెసీయులు 4:26, 27.

శ్రేష్ఠమైన, జ్ఞానయుక్తమైన మార్గం ఏమిటంటే, ఎవరికి ప్రతీకారం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది దేవుడే నిర్ణయించడానికి అనుమతించడం. ఆయన, వాస్తవాలను గూర్చిన పూర్తి జ్ఞానంతో ఆ పని చేయగలడు, ఆయన ఇచ్చే ఏ ప్రతిఫలమైనా ఆయన పరిపూర్ణ న్యాయాన్ని ప్రతిబింబిస్తుంది. “పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే” అని ఉన్న ద్వితీయోపదేశకాండము 32:35, 41 వచనాలను ఆయన సూచించడాన్ని మనం గమనించినప్పుడు, రోమీయులు 12:19 నందు పౌలు చెప్తున్నది అదేనని మనం గ్రహించగల్గుతాము. (హెబ్రీయులు 10:30 పోల్చండి.) గ్రీకు మూలపాఠంలో “దేవుని” అనే పదం లేకపోయినప్పటికీ, రోమీయులు 12:19 నందు అనేక ఆధునిక అనువాదాలు ఆ పదాన్ని చేర్చాయి. ఆ వచనం వివిధ అనువాదాలలో ఇలా ఉంది: “దేవుని ఉగ్రతకు చోటియ్యుడి” (పరిశుద్ధ గ్రంథము); “ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి” (పరిశుద్ధ బైబల్‌); “దేవుని కోపానికి అవకాశమివ్వండి” (పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం); “దేవుని ఆగ్రహమునకే దానిని వదిలివేయుడు” (పవిత్ర గ్రంథము క్యాతలిక్‌ అనువాదము).

సత్యాన్ని వ్యతిరేకించేవారు దుర్భాషలాడినా, హింసించినా కూడా, మనం యెహోవా దేవుని గురించి మోషే వినిన ఈ వర్ణనలో నమ్మకం కల్గివుండవచ్చు: ‘యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు.’ (ఇటాలిక్కులు మావి.)నిర్గమకాండము 34:6, 7.