కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మనల్ని నడిపించే విధానం

యెహోవా మనల్ని నడిపించే విధానం

యెహోవా మనల్ని నడిపించే విధానం

“సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.”—కీర్తన 27:11.

1, 2. (ఎ) యెహోవా నేడు తన ప్రజలను ఎలా నడిపిస్తున్నాడు? (బి) కూటాల నుండి పూర్తి ప్రయోజనం పొందడంలో ఏమి ఇమిడి ఉంది?

మనం గత శీర్షికలో నేర్చుకున్నట్లుగా, యెహోవా వెలుగుకూ సత్యానికీ మూలం. మనం సరాళమైన మార్గంలో పయనిస్తుండగా ఆయన వాక్యం మన మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది. తన మార్గాల్లో మనకు ఉపదేశించడం ద్వారా యెహోవా మనల్ని నడిపిస్తాడు. (కీర్తన 119:105) ప్రాచీన కాలానికి చెందిన కీర్తన గ్రంథకర్తవలే మనం దేవుని నడిపింపునకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిస్పందించి ఇలా ప్రార్థిస్తాము: “యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.”—కీర్తన 27:11.

2 యెహోవా నేడు మనకు క్రైస్తవ కూటాల ద్వారా ఉపదేశాన్ని అందజేస్తున్నాడు. దానికి ప్రతిస్పందనగా మనమేం చేయగలం? (1) క్రమంగా హాజరవటం ద్వారా, (2) కార్యక్రమాన్ని శ్రద్ధగా వినటం ద్వారా, (3) ప్రేక్షకులు పాల్గొనాల్సిన భాగాల్లో ఇష్టపూర్వకంగా పాల్గొనటం ద్వారా మనం ఈ ప్రేమపూర్వక ఏర్పాటు నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందుతున్నామా? అంతేగాక, “సరాళమైన మార్గము”లో నిలిచి ఉండేందుకు సహాయపడే సలహాలను మనం అందుకున్నప్పుడు మనం కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిస్పందిస్తామా?

మీరు కూటాలకు ఎంత క్రమంగా హాజరౌతారు?

3. ఒక పూర్తికాల సేవకురాలు, క్రమంగా కూటాలకు హాజరయ్యే చక్కని అలవాటును ఎలా పెంపొందింపజేసుకుంది?

3 కొంతమంది రాజ్య ప్రచారకులు తమ చిన్నతనం నుండి క్రమంగా కూటాలకు హాజరౌతున్నారు. “1930లలో అంటే మా బాల్యంలో, ఈరోజు మనం కూటానికి వెళ్తున్నామా అని మా అమ్మానాన్నలను అడగవలసిన అవసరమే ఉండేదికాదు. మాకు ఒంట్లో బాగోలేకపోతే తప్ప మేము తప్పకుండా కూటాలకు వెళ్తామని మాకు తెలుసు. మా కుటుంబం ఎప్పుడూ కూటాలకు వెళ్లకుండా ఉండేది కాదు” అని యెహోవాసాక్షుల పూర్తికాల సేవకురాలు ఒకామె జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రవక్త్రిని అయిన అన్నావలే ఈ సహోదరి యెహోవా ఆరాధనా స్థలమును ఎన్నడు “విడువక” ఉంటుంది.—లూకా 2:36, 37.

4-6. (ఎ) కొంతమంది రాజ్య ప్రచారకులు కూటాలకు ఎందుకు సరిగా హాజరు కారు? (బి) కూటాలకు హాజరు కావడం ఎందుకు ఎంతో ఆవశ్యకం?

4 క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరయ్యేవారిలో మీరూ ఒకరా, లేక ఈ విషయంలో మీరు మందకొడిగా తయారయ్యారా? తాము బాగానే ఉన్నామని భావించిన కొంతమంది క్రైస్తవులు ఆ విషయాన్ని దృఢపర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నివారాలపాటు, తాము కూటానికి హాజరైన ప్రతిసారి వాళ్లు ఒక గుర్తు పెట్టుకున్నారు. నిర్ణీతకాల గడువు తీరిన తర్వాత వాళ్లు తాము వ్రాసి ఉంచుకున్న నివేదికను పరిశీలించినప్పుడు, తాము హాజరుకాని కూటాల సంఖ్యను చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు.

5 ‘అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. ప్రజలు ఈనాడు ఎంత ఒత్తిడి నెదుర్కుంటున్నారంటే, కూటాలకు క్రమంగా హాజరు కావడం అంత సులభమేమీ కాదు’ అని ఒకరనవచ్చు. మనం ఒత్తిడితో కూడిన కాలాల్లో జీవిస్తున్నామన్నది కచ్చితంగా నిజమే. ఇంకా చెప్పాలంటే ఒత్తిడి నిస్సందేహంగా అంతకంతకూ మరింత అధికమౌతుంది. (2 తిమోతి 3:13) కానీ, కూటాలకు క్రమంగా హాజరు కావడాన్ని అది మరింత అత్యావశ్యకం చేయదా? మనల్ని బలపర్చే ఆరోగ్యదాయకమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా తీసుకోనవసరం లేకుండా, ఈ విధానం మనపైకి తీసుకువచ్చే ఒత్తిడిని తట్టుకోగలమని మనం అనుకోలేము. అంతెందుకు, క్రమమైన సహవాసం లేకపోతే “నీతిమంతుల మార్గము”ను మొత్తానికే విడనాడేలా మనం శోధింపబడవచ్చు ! (సామెతలు 4:18) నిజమే, మనం బాగా అలిసిపోయి ఇంటికి వచ్చినప్పుడు, కూటానికి వెళ్లాలన్న సుముఖత అంతగా ఉండకపోవచ్చు. మనం ఎంత అలసిపోయి ఉన్నప్పటికీ మనం గనుక హాజరైతే మనకు మనం ప్రయోజనం చేకూర్చుకుంటాము, రాజ్యమందిరంలో ఉన్న మన తోటి క్రైస్తవులను ప్రోత్సహిస్తాము.

6 మనం కూటాలకు క్రమంగా హాజరు కావడానికి గల మరో ప్రాముఖ్యమైన కారణాన్ని హెబ్రీయులు 10:24-25 సూచిస్తుంది. ‘ఆ దినము సమీపించుట చూచిన కొలది మరియెక్కువగా’ కలిసి సమకూడమని అక్కడ అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు ఉద్బోధిస్తున్నాడు. అవును, “దేవుని దినపు” రాకడ సమీపిస్తుందన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. (2 పేతురు 3:11-12) ఈ విధానాంతం చాలా దూరంలో ఉందన్న ముగింపుకు మనం వస్తే, కూటాలకు హాజరుకావడం వంటి అవసరమైన ఆధ్యాత్మిక కార్యకలాపాల స్థానాన్ని వ్యక్తిగత ప్రయాసలు ఆక్రమించేందుకు అనుమతిస్తాము. అప్పుడు, యేసు హెచ్చరించినట్లుగా, ‘ఆ దినము అకస్మాత్తుగా మన మీదికి ఉరివచ్చినట్టు వస్తుంది.’—లూకా 21:34.

మంచి శ్రోతగా ఉండండి

7. పిల్లలు కూటాల్లో అవధానం నిలపడం ఎందుకు ప్రాముఖ్యం?

7 కేవలం కూటాలకు హాజరవ్వడం మాత్రమే సరిపోదు. అక్కడ చెప్పబడుతున్న దానికి అవధానమిస్తూ మనం జాగ్రత్తగా వినాలి. (సామెతలు 7:24) మన పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. ఒక పిల్లవాడు బడికి వెళ్లినప్పుడు, ఏదైనా ఒక అంశం అతనికి ఇష్టం లేకపోయినా లేక అతడు అర్థం చేసుకోలేకపోయినా టీచరు చెప్పేది అతడు జాగ్రత్తగా వినాలని అపేక్షించబడుతుంది. పిల్లవాడు అవధానం నిలపడానికి ప్రయత్నిస్తే, ఆ పాఠం నుండి అతడు కనీసం కొంతైనా ప్రయోజనం పొందుతాడని టీచర్‌కు తెలుసు. కాబట్టి మరి బడికి వెళ్లే వయస్సున్న పిల్లలు, కూటం ప్రారంభమైన వెంటనే నిద్రపోవడానికి అనుమతించబడే బదులు, సంఘ కూటాల్లో ఇవ్వబడే ఉపదేశానికి అవధానమివ్వడం సహేతుకం కాదా? నిజమే, లేఖనాల్లో ఉన్న అమూల్యమైన సత్యాల్లో “కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి.” (2 పేతురు 3:16) కాని పిల్లవాడికుండే నేర్చుకునే సామర్థ్యాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. దేవుడు అలా తక్కువ అంచనా వేయడు. బైబిలు కాలాల్లో, ‘యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు విని నేర్చుకొనుమని’ ఆయన యౌవనస్థులైన తన సేవకులకు ఆజ్ఞాపించాడు, వాటిలో కొన్ని నిస్సందేహంగా పిల్లలు అర్థం చేసుకోవడానికి కష్టమైనవి ఉండే ఉంటాయి. (ద్వితీయోపదేశకాండము 31:12; పోల్చండి లేవీయకాండము 18:1-30.) యెహోవా నేడు పిల్లల నుండి అంతకన్నా తక్కువేమైనా కోరుతున్నాడా?

8. తమ పిల్లలు కూటాల్లో అవధానం నిలపడానికి వారికి సహాయం చేసేందుకు కొంతమంది తల్లిదండ్రులు ఏ చర్యలు తీసుకుంటారు?

8 కూటాల్లో తమ పిల్లలు నేర్చుకునేదాన్ని బట్టి వారి ఆధ్యాత్మిక అవసరాలు కొంతమేరకు తీరుతాయని క్రైస్తవ తల్లిదండ్రులు గుర్తిస్తారు. కాబట్టి, కొంతమంది తల్లిదండ్రులు కూటాలకు వచ్చే ముందు తమ పిల్లలు కాస్త కునుకు తీసేలా చూస్తారు, అలాగైతే వాళ్లు రాజ్యమందిరానికి వచ్చేసరికి చురుగ్గా, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూటాలున్న సాయంకాలాల్లో తమ పిల్లలు టీవీ చూడటాన్ని కచ్చితంగా నియంత్రించడమో లేక జ్ఞానవంతంగా అసలు చూడకుండా ఉండేలా చేయడమో చేస్తారు. (ఎఫెసీయులు 5:15, 16) అలాంటి తల్లిదండ్రులు తమ పిల్లల వయస్సుకూ, సామర్థ్యానికీ అనుగుణ్యంగా వారిని వినమనీ, నేర్చుకోమనీ ప్రోత్సహిస్తూ, వారికి పరధ్యానం కలిగించే వాటిని దూరంగా ఉంచుతారు.—సామెతలు 8:32.

9. మన వినే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ఏది సహాయం చేయగలదు?

9 “మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని” చెప్పినప్పుడు యేసు పెద్దవారితో మాట్లాడుతున్నాడు. (లూకా 8:18) ఈ రోజుల్లో దాన్ని ఆచరణలో పెట్టడం, చెప్పినంత సులభం కాదు. చురుగ్గా వినడమన్నది శ్రమతో కూడిన పని అని ఒప్పుకోవలసిందే, అయితే వినే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు. మీరు ఒక బైబిలు ప్రసంగాన్ని గానీ లేదా కూటంలో భాగాన్ని గానీ వింటున్నప్పుడు ముఖ్యాంశాలను ప్రత్యేకించడానికి ప్రయత్నించండి. ప్రసంగీకుడు తర్వాత ఏమి చెప్పబోతున్నాడా అని ఎదురు చూడండి. మీరు మీ పరచర్యలో ఉపయోగించగల లేదా మీరు మీ జీవితంలో అన్వయించుకోగల విషయాల కోసం చూడండి. పరిశీలించబడుతున్న విషయాలను మనస్సులో పునఃసమీక్షించుకోండి. క్లుప్తంగా నోట్సు వ్రాసుకోండి.

10, 11. తమ పిల్లలు మంచి శ్రోతలుగా తయారు కావడానికి కొంతమంది తల్లిదండ్రులు వారికి ఎలా సహాయం చేశారు, ఏ మార్గాలు సహాయకరంగా ఉన్నట్లు మీరు కనుగొన్నారు?

10 చక్కగా వినే అలవాట్లను తొలి ప్రాయం నుండే అలవర్చుకోవడం మంచిది. ఇంకా స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టని, చదవడం వ్రాయడం ఇంకా నేర్చుకోని పిల్లలను వారి తల్లిదండ్రులు కూటాల్లో “నోట్సు” వ్రాసుకోమని ప్రోత్సహిస్తారు. “యెహోవా,” “యేసు,” లేక “రాజ్యం” వంటి సుపరిచితమైన పదాలు ప్రసంగంలో ఉపయోగించబడినప్పుడు ఆ పిల్లలు ఒక చిన్న కాగితం ముక్క మీద ఒక గుర్తు వేస్తారు. ఆ విధంగా, వేదిక మీది నుండి చెప్పబడుతున్న దానిపై అవధానం నిలపడాన్ని పిల్లలు నేర్చుకుంటారు.

11 అవధానం నిలపమని కొన్నిసార్లు కాస్త పెద్ద పిల్లల్ని కూడా ప్రోత్సహించవలసి ఉంటుంది. ఒక క్రైస్తవ సమావేశంలో తన 11 ఏళ్ల కుమారుడు పగటి కలలు కనడం గమనించిన ఒక కుటుంబ శిరస్సు ఆ అబ్బాయికి ఒక బైబిలు ఇచ్చి, ప్రసంగీకులు లేఖనాలను పేర్కొంటుండగా బైబిలు తెరిచి చూడమని చెప్పాడు. ఆ తండ్రి తాను నోట్సు వ్రాసుకుంటూ, తన కుమారుడు బైబిలు తెరిచి చూసుకోవటాన్ని గమనించాడు. అప్పటి నుండీ ఇక ఆ అబ్బాయి సమావేశ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా విన్నాడు.

మీ స్వరం వినబడనివ్వండి

12, 13. సంఘంతో కలిసి పాడడంలో భాగం వహించడం ఎందుకు ప్రాముఖ్యం?

12 రాజైన దావీదు ఇలా పాడాడు: “యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును.” (కీర్తన 26:6, 7) మన విశ్వాసాన్ని బిగ్గరగా వ్యక్తపర్చడానికి యెహోవాసాక్షుల కూటాలు మనకు చక్కని అవకాశాలనిస్తాయి. అలా మనం చేయగల ఒక విధానమేమిటంటే, సంఘంతో కలిసి పాటలు పాడడంలో భాగం వహించడం. ఇది మన ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన భాగం, కాని దీన్ని అలక్ష్యం చేయడం కూడా సులభమే.

13 ఇంకా చదవడం రాని పిల్లలు, ప్రతి వారం కూటాల్లో ఉపయోగించబడే రాజ్య గీతాల్లోని పదాలను కంఠతాపడతారు. పెద్దవారితో కలిసి పాడగల్గుతున్నందుకు వాళ్లు పులకించిపోతారు. అయితే పిల్లలు కాస్త పెద్దవాళ్లవుతుండగా, ఇతరులతో కలిసి రాజ్యగీతాలను పాడటానికి అంత సుముఖతను చూపకపోవచ్చు. కూటాల్లో పాటలు పాడటానికి కొంతమంది పెద్దవాళ్లు కూడా చాలా సిగ్గుపడతారు. అయినప్పటికీ, క్షేత్ర సేవ ఎలాగైతే మన ఆరాధనలో ఒక భాగమో అలాగే పాడటం కూడా మన ఆరాధనలో ఒక భాగమే. (ఎఫెసీయులు 5:19) క్షేత్ర సేవలో యెహోవాను స్తుతించేందుకు మనం చేయగలిగినదంతా చేస్తాము. మన స్వరం సుమధురంగా ఉన్నా లేకపోయినా స్తుతి గీతాలను హృదయపూర్వకంగా పాడేందుకు మన గొంతు ఎత్తడం ద్వారా కూడా మనం ఆయనను మహిమపర్చలేమా?—హెబ్రీయులు 13:15.

14. మనం సంఘ కూటాల్లో పఠించే సమాచారానికి జాగ్రత్తతో కూడిన సిద్ధపాటు ఎందుకవసరం?

14 కూటాల్లో ప్రేక్షకులు పాల్గొనవలసిన భాగాల్లో ప్రోత్సాహకరమైన వ్యాఖ్యానాలను చేయడం ద్వారా కూడా మనం దేవుణ్ని మహిమపరుస్తాము. దీనికి సిద్ధపాటు అవసరం. దేవుని వాక్యంలోని లోతైన అంశాల గురించి ధ్యానించడానికి సమయం అవసరం. లేఖనాలను ఎంతో శ్రద్ధగా పఠించే విద్యార్థి అయిన అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని గుర్తించాడు. ఆయనిలా వ్రాశాడు: “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము!” (రోమీయులు 11:33) కుటుంబ శిరస్సులారా, లేఖనాల్లో బయల్పర్చబడిన విధంగా దేవుని బుద్ధిని పరిశోధించడానికి కుటుంబంలోని ప్రతి సభ్యునికి మీరు సహాయం చేయడం ఎంతో ప్రాముఖ్యం. కుటుంబ పఠనం చేసేటప్పుడు, కష్టమైన విషయాలను వివరించడానికీ, మీ కుటుంబం కూటాల కోసం సిద్ధపడేందుకు వాళ్లకు సహాయం చేయడానికీ కొంత సమయాన్ని కేటాయించండి.

15. కూటాల్లో వ్యాఖ్యానించడానికి ఏ సలహాలు ఒకరికి సహాయం చేయవచ్చు?

15 కూటాల్లో మీరు మరింత తరచుగా వ్యాఖ్యానించాలనుకుంటే, మీరు చెప్పాలనుకునేదాన్ని ముందుగానే ఎందుకు సిద్ధం చేసుకోకూడదు? చాలా విపులంగా చెప్పాల్సిన అవసరం లేదు. దృఢనమ్మకంతో చదివిన ఒక యుక్తమైన లేఖనం లేదా హృదయంలో నుండి వెలువడే కొన్ని చక్కని పదాలు ఎంతో ప్రశంసార్హమైనవి. కొంతమంది ప్రచారకులు తమ విశ్వాసాన్ని వ్యక్తపర్చే అవకాశాన్ని కోల్పోకుండేలా, ఒక నిర్దిష్టమైన పేరాపై మొదటి వ్యాఖ్యానాన్ని తమనే అడగమని పఠన నిర్వాహకుని విజ్ఞప్తి చేస్తారు.

బుద్ధిహీనులకు జ్ఞానము కలుగుతుంది

16, 17. ఒక పెద్ద ఒక పరిచర్య సేవకునికి ఏ ఉపదేశం ఇచ్చాడు, అది ఎందుకు ప్రభావవంతమైనదైంది?

16 యెహోవాసాక్షుల కూటాల్లో, దేవుని వాక్యాన్ని ప్రతి రోజూ చదవమని మనకు తరచూ జ్ఞాపకం చేయబడుతుంది. అలా చేయడం ఎంతో సేదదీర్పునిస్తుంది. జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికీ, వ్యక్తిత్వ లోపాలను సరిచేసుకోవడానికీ, శోధనలను ఎదుర్కోవడానికీ, తప్పు మార్గంలో అడుగు వేసి ఉంటే మన ఆధ్యాత్మిక సమతూకాన్ని తిరిగి పొందడానికీ కూడా అది మనకు సహాయం చేస్తుంది.—కీర్తన 19:7.

17 మన అవసరాలకు తగిన లేఖనాధార ఉపదేశాన్ని ఇవ్వడానికి అనుభవజ్ఞులైన సంఘ పెద్దలు సంసిద్ధంగా ఉంటారు. మనం చేయవలసిందల్లా వారిచ్చే బైబిలు ఆధారిత ఉపదేశాన్ని “పైకి చేదు”కోవడమే. (సామెతలు 20:5) ఒకరోజు, ఉత్సాహవంతుడైన ఒక పరిచర్య సేవకుడు, సంఘంలో మరింత ఉపయోగకరంగా ఎలా తయారవ్వాలో సలహాలు ఇవ్వమని ఒక పెద్దను అడిగాడు. ఆ యౌవనస్థుని బాగా ఎరిగిన ఆ పెద్ద, అధ్యక్షులైనవారు ‘సహేతుకమైనవారై’ ఉండాలని చెబుతున్న 1 తిమోతి 3:2 NW, వచనానికి తన బైబిలు తెరిచాడు. ఇతరులతో తన వ్యవహారాల్లో ఆ యౌవనస్థుడు సహేతుకతను ప్రదర్శించగల మార్గాలను ఆయన దయతో వివరించాడు. తన కివ్వబడిన సూటియైన ఉపదేశానికి ఆ యౌవనస్థుడైన సహోదరుడు అభ్యంతరపడ్డాడా? ఎంతమాత్రం లేదు. ఆయనిలా వివరిస్తున్నాడు: “ఆ పెద్ద, బైబిలును ఉపయోగించాడు కాబట్టి ఆ ఉపదేశం యెహోవా నుండి వస్తుందని నేను గుర్తించాను.” ఆ పరిచర్య సేవకుడు ఇవ్వబడిన ఉపదేశాన్ని కృతజ్ఞతాపూర్వకంగా అన్వయించుకుని, చక్కని అభివృద్ధి సాధిస్తున్నాడు.

18. (ఎ) పాఠశాలలో శోధనను ఎదుర్కోవడానికి ఒక క్రైస్తవ యౌవనస్థురాలికి ఏది సహాయం చేసింది? (బి) శోధన ఎదురైనప్పుడు మీరు ఏ బైబిలు లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటారు?

18 ‘యౌవనేచ్ఛలనుండి పారిపోవడానికి’ కూడా దేవుని వాక్యం యౌవనస్థులకు సహాయం చేస్తుంది. (2 తిమోతి 2:22) ఈ మధ్యనే హైస్కూలు చదువు ముగించిన ఒక యౌవనసాక్షి కొన్ని బైబిలు లేఖనాలను ధ్యానించడం, వాటిని అన్వయించుకోవడం ద్వారా తన పాఠశాల విద్యా సంవత్సరాలన్నిటిలో శోధనలను ఎదుర్కోగల్గింది. ఆమె తరచూ, “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును” అని చెప్తున్న సామెతలు 13:20 లోని ఉపదేశాన్ని గురించి తలంచేది. దానికి అనుగుణంగానే, లేఖన సూత్రాలను ప్రగాఢంగా గౌరవించే వారితోనే స్నేహాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఆమె జాగ్రత్త వహించింది. ఆమె ఇలా తర్కించింది: “నేను ఇతరులకంటే గొప్పదాన్నేమీ కాదు. నేను చెడ్డ గుంపుతో కలిశానంటే నా స్నేహితులను ప్రీతిపర్చాలని చూస్తాను, దానితో సమస్యలు మొదలవుతాయి.” 2 తిమోతి 1:8 నందు వ్రాయబడివున్న పౌలు ఉపదేశం కూడా ఆమెకు సహాయం చేసింది. ఆయనిలా వ్రాశాడు: “మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి . . . సిగ్గుపడక, . . . సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము.” ఆ ఉపదేశానికి అనుగుణ్యంగా, తగిన ప్రతి సందర్భంలోనూ ఆమె తన తోటి విద్యార్థులతో తన బైబిలు ఆధారిత నమ్మకాలను ధైర్యంగా పంచుకుంది. తరగతిలో ఏదైనా మౌఖిక నివేదికనివ్వమని ఆమెకు అసైన్‌మెంట్‌ ఇవ్వబడినప్పుడల్లా, దేవుని రాజ్యాన్ని గురించి యుక్తిగా సాక్ష్యమిచ్చేందుకు అనుమతించే అంశాలను ఆమె ఎంపిక చేసుకునేది.

19. ఒక యౌవనస్థుడు ఈ లోక ఒత్తిడులను ఎందుకు ఎదిరించలేకపోయాడు, కాని అతనికి ఏది ఆధ్యాత్మిక బలాన్నిచ్చింది?

19 మనం ఒకవేళ “నీతిమంతుల మార్గము” నుండి తప్పిపోతే, మన అడుగులను సరిచేసుకోవడానికి దేవుని వాక్యం మనకు సహాయం చేయగలదు. (సామెతలు 4:18) ఆఫ్రికాలో నివసిస్తున్న ఒక యౌవనస్థుడు దీన్ని స్వయంగా తెలుసుకున్నాడు. యెహోవాసాక్షుల్లో ఒకరు ఆయనను సందర్శించినప్పుడు, అతడు బైబిలు పఠనం చేయడానికి అంగీకరించాడు. అతడు తాను నేర్చుకుంటున్నదాన్ని బట్టి ఆనందించేవాడు, కానీ త్వరలోనే స్కూల్లో చెడు సహవాసంలో పడిపోయాడు. కొంతకాలానికి, అతడు అనైతికమైన జీవన విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. “నా మనస్సాక్షి నన్ను తీవ్రంగా హింసించేది, నేను కూటాలకు రావడం మానుకోవలసి వచ్చింది,” అని ఆయన ఒప్పుకుంటున్నాడు. తర్వాత, ఆయన మళ్లీ కూటాలకు హాజరు కావడం ప్రారంభించాడు. ఆ యౌవనస్థుడు ఈ జ్ఞానవంతమైన వ్యాఖ్యానం చేశాడు: “దీనికంతటికీ ముఖ్య కారణం నేను ఆధ్యాత్మికంగా ఆకలితో అలమటిస్తున్నానని నేను గుర్తించాను. నేను వ్యక్తిగత పఠనం చేసేవాడిని కాదు. అందుకే నేను శోధనను తట్టుకోలేకపోయాను. తర్వాత నేను కావలికోట, తేజరిల్లు! పత్రికలు చదవడం మొదలుపెట్టాను. క్రమంగా, నేను ఆధ్యాత్మిక బలాన్ని తిరిగి పుంజుకుని, నా జీవితాన్ని శుద్ధి చేసుకున్నాను. నేను చేసుకున్న మార్పులను గమనించిన వారికి అది నిజంగా గొప్ప సాక్ష్యమే. నేను బాప్తిస్మం పొంది, ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.” తన శారీరక బలహీనతలను అధిగమించడానికి ఈ యౌవనస్థునికి కావలసిన బలాన్ని ఏది ఇచ్చింది? క్రమమైన, వ్యక్తిగత బైబిలు పఠనం ద్వారానే ఆయన తన ఆధ్యాత్మిక బలాన్ని తిరిగి పుంజుకున్నాడు.

20. ఒక యౌవనస్థుడు సాతాను దాడులను ఎలా ఎదిరించగలడు?

20 క్రైస్తవ యౌవనస్థులారా, మీపై దాడి జరుగుతుంది! మీరు సాతాను దాడులను ఎదుర్కోవాలంటే, ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా తీసుకోవాలి. యౌవనస్థుడే అయిన కీర్తన గ్రంథకర్త ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ‘యౌవనస్థులు తమ నడతను శుద్ధి చేసుకునేలా’ తన వాక్యాన్ని ఇచ్చినందుకు ఆయన యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేశాడు.—కీర్తన 119:9.

దేవుడు నడిపించిన చోటికి నడుస్తాము

21, 22. సత్య మార్గం మరీ కష్టమైనదనే ముగింపుకు మనం ఎందుకు రాకూడదు?

21 యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుండి వాగ్దాన దేశంలోకి నడిపించాడు. మానవ దృక్కోణం నుండి చూస్తే ఆయన ఎంపిక చేసుకున్న మార్గం అనవసరంగా శ్రమతోకూడినదన్నట్లు అనిపించవచ్చు. మధ్యధరా సముద్ర తీరం వెంబడివున్న, బహుశా సులభమైనదీ, మరింత సూటియైనదీ అయిన మార్గంలో తీసుకువెళ్లే బదులు, యెహోవా తన ప్రజలను ఎడారి మార్గం గుండా తీసుకువెళ్లాడు. అయితే, నిజానికిది దేవుని వైపు నుండి దయతో కూడిన చర్య. సముద్ర మార్గం దగ్గరి దారే అయినప్పటికీ, అది ఇశ్రాయేలీయులను వారి శత్రువులైన ఫిలిష్తీయుల దేశం గుండా తీసుకువెళ్లేది. యెహోవా మరో మార్గాన్ని ఎంపిక చేయడం ద్వారా ఫిలిష్తీయులను వెంటనే ఎదుర్కోవడం నుండి తన ప్రజలను కాపాడాడు.

22 అలాగే, నేడు యెహోవా మనల్ని ఏ మార్గం గుండా నడిపిస్తున్నాడో అది కొన్నిసార్లు కష్టమైనదిగా అనిపించవచ్చు. ప్రతివారం మనకు సంఘ కూటాలు, వ్యక్తిగత పఠనం, క్షేత్ర సేవ వంటి వాటితో సహా క్రైస్తవ కార్యకలాపాల పూర్తి షెడ్యూల్‌ ఉంది. ఇతర మార్గాలు సుళువైనవిగా అనిపించవచ్చు. కాని మనం దేవుని నడిపింపును అనుసరిస్తేనే, మనం చేరుకోవడానికి ఇంతగా కష్టపడుతున్న గమ్యాన్ని చేరుకోగల్గుతాము. కాబట్టి, మనం యెహోవా నుండి ప్రాముఖ్యమైన ఉపదేశాన్ని తీసుకుంటూ, “సరాళమైన మార్గము”లో నిరంతరం నిలిచి ఉందాము !—కీర్తన 27:11.

మీరు వివరించగలరా?

క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరు కావలసిన అవసరం ప్రత్యేకంగా ఎందుకు ఉంది?

తమ పిల్లలు కూటాల్లో అవధానం నిలిపేందుకు వారికి సహాయం చేయడానికి తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?

మంచి శ్రోతగా ఉండడంలో ఏమి ఇమిడి ఉంది?

కూటాల్లో వ్యాఖ్యానించడానికి మనకు ఏమి సహాయం చేయగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

[16, 17వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ కూటాలకు హాజరవడం యెహోవా దినాన్ని మనస్సులో ఉంచుకునేలా చేస్తుంది

[18వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవ కూటాల్లో యెహోవాను స్తుతించడానికి అనేక మార్గాలున్నాయి