కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వినయం—శాంతిని నెలకొల్పే ఒక లక్షణం

వినయం—శాంతిని నెలకొల్పే ఒక లక్షణం

వినయంశాంతిని నెలకొల్పే ఒక లక్షణం

ప్రతి ఒక్కరూ వినయాన్ని కనబరిస్తే, లోకం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యక్తులు ఎక్కువ డిమాండ్‌ చేయకుండా, కుటుంబ సభ్యులు పోట్లాడుకోకుండా, కార్పొరేషన్‌లు పోటీపడకుండా, దేశాలు యుద్ధాలను చేయకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో జీవించడానికి మీరు ఇష్టపడతారా?

సార్వత్రికంగా అందరూ వినయాన్ని ఒక బలహీనతగా కాక, బలంగా, మంచిగా ఎంచేటువంటి యెహోవా వాగ్దానం చేసిన క్రొత్త లోకం కోసం యెహోవా దేవుని నిజమైన సేవకులు సిద్ధపడుతున్నారు. (2 పేతురు 3:13) వాస్తవానికి, వాళ్ళు ఇప్పుడు కూడా వినయమనే లక్షణాన్ని పెంపొందించుకుంటున్నారు. ఎందుకని? ముఖ్యంగా యెహోవా వారి నుండి కోరుతున్నది అదే. “మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి [“వినయముగా ఉండి,” NW] నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు” అని ఆయన ప్రవక్తయైన మీకా వ్రాశాడు.—మీకా 6:8.

వినయం అనే మాటకు స్వాతిశయం లేకపోవడం, అహంభావం లేకపోవడం, తన సొంత సామర్థ్యాలను గురించి తాను సాధించిన వాటిని గురించి తన ఆస్తులను గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడకపోవడం వంటి అనేక అర్థాలు ఉన్నాయి. ఒక రెఫరెన్స్‌ పుస్తకం ప్రకారం, వినయం అంటే, “సొంత పరిధుల్లో ఉండడం” అనే అర్థం కూడా ఉంది. వినయస్థుడు మంచి మర్యాదల హద్దుల్లో ప్రవర్తిస్తాడు. తను చేసి తీరాల్సిన కార్యాలకూ, తాను చేయగల కార్యాలకూ పరిధులు ఉన్నాయని కూడా ఆయనకు తెలుసు. తనకు చెందని విషయాలు ఉన్నాయని కూడా ఆయనకు తెలుసు. వినయస్థులైన వారికి మనం నిశ్చయంగా దగ్గరౌతాం. “వినయం కన్నా ప్రీతికరమైనది మరేమీ లేదు” అని ఇంగ్లీష్‌ కవియైన జోసఫ్‌ అడిసన్‌ వ్రాశాడు.

వినయం అపరిపూర్ణ మానవులకుండే సహజ లక్షణం కాదు. మనం ఈ లక్షణాన్ని పెంపొందించుకునేందుకు తప్పనిసరిగా కృషి చేయాలి. మనల్ని ప్రోత్సహించేందుకుగాను, వినయాన్ని వివిధ రూపాల్లో సోదాహరణగా తెలియజేసే అనేక సంఘటనలను గురించి బైబిలు మనకు తెలియజేస్తుంది.

వినయస్థులైన ఇద్దరు రాజులు

యెహోవాకు అత్యంత నమ్మకంగా ఉన్న రాజుల్లో ఒకరు దావీదు. ఆయన యౌవనస్థుడుగా ఉన్నప్పుడే ఇశ్రాయేలు భావి రాజుగా అభిషేకించబడ్డాడు. ఆ తర్వాత, ఆయనను చంపడానికి ప్రయత్నిస్తూ, ఆయన పలాయితుడుగా జీవించాల్సిన పరిస్థితులను సృష్టిస్తూ అధికారంలో ఉన్న రాజైన సౌలు ఆయనను అనేక ఒత్తిళ్ళ పాలు చేశాడు.—1 సమూయేలు 16:1, 11-13; 19:9, 10; 26:2, 3.

అలాంటి పరిస్థితుల్లో కూడా, తాను తన ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నంలో తనకు పరిధులు ఉన్నాయని దావీదు గుర్తించాడు. ఒక సందర్భంలో, అరణ్యంలో నిద్రపోతున్న సౌలును అంతమొందించేందుకు తనకు అనుమతినివ్వమని అబీషై అడిగినప్పుడు దావీదు అందుకు నిరాకరిస్తూ, “యెహోవా దృక్కోణంలో నుండి ఆలోచిస్తే, యెహోవా చేత అభిషేకము నొందినవాని మీద చెయ్యి చేసుకోవడాన్ని గురించి నేను ఊహించనైనా ఊహించలేను” అని అన్నాడు. (1 సమూయేలు 26:8-11, NW) సౌలును రాజ్యాధికారం నుండి తొలగించే పని తనది కాదు అని దావీదుకు తెలుసు. ఈ సందర్భంలో, సముచితమైన ప్రవర్తనా పరిధుల్లో ఉంటూ దావీదు వినయాన్ని చూపించాడు. అలాగే, ప్రస్తుత దిన దేవుని సేవకులు కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా “యెహోవా దృక్కోణంలో నుండి ఆలోచిస్తే” తాము చేయకూడని కార్యాలున్నాయని వారికి తెలుసు.—అపొస్తలుల కార్యములు 15:28, 29; 21:25.

కొంచెం వ్యత్యస్తంగా అయినప్పటికీ, దావీదు రాజు కుమారుడైన సొలొమోను కూడా యౌవనస్థుడుగా వినయాన్ని ప్రదర్శించాడు. సొలొమోను సింహాసనాసీనుడు అయినప్పుడు, రాజులకుండే బరువైన బాధ్యతను నిర్వహించే శక్తి తనకు లేదని భావించాడు. “నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధిచాలదు” అని ఆయన ప్రార్థించాడు. తనకు సామర్థ్యమూ లేదని అనుభవమూ లేదని సొలొమోనుకు తెలుసు అన్నది స్పష్టం. అప్పుడు ఆయన స్వాతిశయాన్ని గానీ, అహంభావాన్ని గానీ చూపించక వినయస్థుడుగా ఉన్నాడు. తనకు వివేచననివ్వమని సొలొమోను యెహోవాను అడిగాడు. ఆయనకు అది ఇవ్వబడింది.—1 రాజులు 3:4-12.

మెస్సీయా మరియు ఆయన కన్నా ముందు వచ్చినవాడు

సొలొమోను అనంతరం, 1,000 కన్నా ఎక్కువ సంత్సరాలు గడిచిపోయాయి. బాప్తిస్మమిచ్చే యోహాను, మెస్సీయ కోసం మార్గాన్ని సిద్ధం చేసే పనిని చేశాడు. అభిషిక్తుడ్ని తెలియజేసే వ్యక్తిగా యోహాను బైబిలు ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఆయన తన ఆధిక్యతను గురించి గొప్ప చెప్పుకోగల్గేవాడే. ఆయన మెస్సీయకు బంధువు గనుక, తను ఘనతనొందేందుకు ప్రయత్నించగల్గేవాడే. కానీ ఆయన అలా చేయక, తాను యేసు చెప్పులను విప్పుటకైనను యోగ్యుడు కాడని ఇతరులకు చెప్పాడు. తనకు బాప్తిస్మమివ్వమని, యొర్దాను నది దగ్గర యోహానును యేసు అడిగినప్పుడు, “నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా?” అని యోహాను అన్నాడు. యోహాను గొప్పలు చెప్పుకునేవాడు కాడనీ, ఆయన చాలా వినయస్థుడనీ ఇది సూచిస్తుంది.—మత్తయి 3:14; మలాకీ 4:5, 6; లూకా 1:13-17; యోహాను 1:26, 27.

యేసు బాప్తిస్మం పొందిన తర్వాత, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ, పూర్తికాల పరిచర్యను మొదలుపెట్టాడు. యేసు పరిపూర్ణ మానవుడైనప్పటికీ, “నా అంతట నేనే ఏమియు చేయలేను; . . . నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయ గోరుదును గాని నా యిష్టప్రకారము చేయగోరను” అని అన్నాడు. అంతేకాక, మానవుల నుండి ఘనతను పొందాలని ఆయన కోరుకోలేదు. కానీ తాను చేసిన ప్రతి దానికీ యెహోవాకే మహిమ ఇచ్చాడు. (యోహాను 5:30, 41-44) ఎంత వినయం!

యెహోవా యొక్క నమ్మకమైన సేవకులైన దావీదు, సొలొమోను, బాప్తిస్మమిచ్చే యోహాను, పరిపూర్ణ మానవుడైన యేసు మొదలైనవారు వినయాన్ని ప్రదర్శించారన్నది స్పష్టం. వాళ్ళు గొప్పలు చెప్పుకోలేదు, అహంభావం చూపలేదు, స్వాతిశయపడనూ లేదు, వాళ్ళు తమ పరిధుల్లో ఉన్నారు. ఆధునిక యెహోవా సేవకులు వినయాన్ని పెంపొందించుకునేందుకు వినయాన్ని చూపించేందుకూ వాళ్ళ మాదిరులు కావలసినన్ని కారణాలను ఇస్తున్నాయి. వినయాన్ని పెంపొందించుకునేందుకు ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి.

మానవ చరిత్రంతటిలోనూ మరింత సంక్షోభ భరితంగా ఉన్న ఈ కాలంలో, నిజ క్రైస్తవులకు వినయం చాలా ప్రాముఖ్యమైన లక్షణం. అది ఒకరు యెహోవా దేవునితోను, తోటి మానవులతోను శాంతిగా ఉండేందుకూ, తనలో తాను శాంతిగా ఉండేందుకూ సహాయపడుతుంది.

యెహోవా దేవునితో శాంతియుతంగా ఉండడం

సత్యారాధన విషయంలో యెహోవా ఉంచిన హద్దుల్లో మనం ఉంటేనే యెహోవాతో శాంతియుతంగా ఉండడం సాధ్యమౌతుంది. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు దేవుడు ఉంచిన పరిధులను దాటి, వినయాన్ని కోల్పోయిన మొదటి మానవులు అయ్యారు. వాళ్ళు యెహోవా ఎదుట తమకున్న మంచి స్థానాన్నీ, అలాగే తమ గృహాన్నీ, తమ భవిష్యత్తునూ, తమ జీవితాలనూ కోల్పోయారు. (ఆదికాండము 3:1-5, 16-19) వాళ్ళు ఎంత ఎక్కువ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది!

మనం ఎలా ప్రవర్తించాలనేదానిపై సత్యారాధన పరిధులను ఉంచుతుంది కనుక, ఆదాము హవ్వల వైఫల్యం నుండి పాఠాన్ని నేర్చుకుందాం. ఉదాహరణకు, “మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు” అని బైబిలు చెబుతుంది. (1 కొరింథీయులు 6:9, 10) యెహోవా, మన మంచి కోసమే జ్ఞానయుక్తంగా ఈ పరిధులను పెట్టాడు. మనం ఆ పరిధుల్లో ఉండడం ద్వారా జ్ఞానాన్ని కనబరుచుతాం. (యెషయా 48:17, 18) “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది” అని సామెతలు 11:2 మనకు చెబుతుంది.

మనం ఈ పరిధులను దాటుతూనే, దేవునితో సమాధానంగా ఉండగలమని ఏదైనా మత సంస్థ మనకు చెబుతున్నట్లైతే అప్పుడేమిటి? ఆ సంస్థ మనలను తప్పుదారి పట్టించాలని చూస్తుందన్నమాట. మనం పరిధులను దాటకుండా ఉంటూ యెహోవా దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకునేందుకు మనకు వినయం సహాయపడుతుంది.

తోటి మానవులతో శాంతిగా ఉండడం

ఇతరులతో శాంతియుతమైన సంబంధాలను పెంచుకునేందుకు కూడా వినయం సహాయపడుతుంది. ఉదాహరణకు, తల్లిదండ్రులు, తమకున్న అత్యవసర వస్తువులతో సంతుష్టిగా ఉండడంలోను ఆధ్యాత్మిక విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడంలోను మంచి మాదిరినుంచినప్పుడు, వాళ్ళ పిల్లలు కూడా అదే దృక్పథాన్ని అలవరచుకునే సాధ్యత చాలా ఉంది. చిన్న పిల్లలు కూడా, తాము కోరుకునేవాటినీ అన్నివేళలా పొందకపోయినప్పటికీ ఉన్నదానితో సంతుష్టిగా ఉండడం సులభమని కనుగొంటారు. పెద్ద ఆడంబరాలేమీ లేకుండా జీవించడానికి అది వాళ్ళకు సహాయపడుతుంది. కుటుంబ జీవితం మరింత శాంతియుతంగా ఉంటుంది.

పైవిచారణా పదవిలో ఉన్నవారు, వినయంగా ఉంటూ, అధికారాన్ని దుర్వినియోగపరచకుండా ఉండేందుకుగాను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరముంది. ఉదాహరణకు, “లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని” క్రైస్తవులకు నిర్దేశించబడింది. (1 కొరింథీయులు 4:6) తమ సొంత అభిలాషలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించకుండా ఉండడం తప్పనిసరి అని సంఘ పెద్దలు గ్రహించాలి. బదులుగా, మంచి మర్యాదలతో కూడిన ప్రవర్తన, వస్త్రధారణ, కేశాలంకరణ, లేదా సరదా పనులు మొదలైన వాటిలో సరైన విధంగా ఉండేలా ప్రోత్సహించేందుకు దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తారు. (2 తిమోతి 3:14-17) పెద్దలు లేఖనాల పరిధుల్లో ఉంటున్నారని సంఘ సభ్యులు గ్రహించినప్పుడు, ఈ పెద్దలపై గౌరవం పెరుగుతుంది, సంఘంలో, ఆప్యాయతా ప్రేమా శాంతీ నెలకొంటాయి.

ప్రశాంతంగా ఉండడం

వినయంగా ఉండేవాళ్ళు మనశ్శాంతితో ఉంటారు. వినయస్థుడు ప్రముఖ స్థానాన్ని కోరుకోడు. దానర్థం అతనికి వ్యక్తిగతంగా లక్ష్యాలేమీ ఉండవని కాదు. ఉదాహరణకు, అదనపు సేవాధిక్యతలను కోరుకోవచ్చు. కానీ యెహోవా కోసం ఎదురు చూస్తాడు, తనకు క్రైస్తవ సేవాధిక్యతలేమైనా లభిస్తే దానికి యెహోవానే ఘనపరుస్తాడు. వాటిని వ్యక్తిగతంగా సాధించిన ఘనకార్యాలుగా ఎంచడు. “సమాధానకర్తయగు దేవుడు” అయిన యెహోవాకు మరింత సన్నిహితులయ్యేందుకు వినయస్థులకు వినయం తోడ్పడుతుంది.—ఫిలిప్పీయులు 4:9.

ఉదాహరణకు, ఇతరులు మనలను నిర్లక్ష్యం చేస్తున్నట్లు మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు. కానీ, వినయంలేకుండా మనం ఇతరుల అవధానాన్ని మళ్ళించుకోవడానికి ప్రయత్నించడం కన్నా వినయంగా ఉండి ఇతరుల చేత నిర్లక్ష్యం చేయబడడమే మేలు కదా? వినయంగల వ్యక్తులు గొంతెమ్మ కోరికలను పెట్టుకుని వాటి కోసం తహతహలాడరు. కనుక వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అది భావోద్వేగ, శారీరక క్షేమానికి ఎంత ప్రయోజనకరం.

వినయాన్ని పెంపొందించుకుని కాపాడుకోవడం

ఆదాము హవ్వలు వినయాన్ని కోల్పోయారు, తమ సంతానానికి కూడా వినయలేమి అనే లక్షణాన్ని సంక్రమింపజేశారు. మన మొదటి తల్లిదండ్రులు చేసిన అదే తప్పును చేయకుండా ఉండడానికి మనకేది సహాయపడగలదు? వినయము అనే చక్కని లక్షణాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు?

మొదటిగా, విశ్వ సృష్టికర్తయైన యెహోవాతో పోలిస్తే మనమేపాటివారమన్న దాన్ని గురించి ఖచ్చితమైన అవగాహన ఉండడం మనకు సహాయపడుతుంది. మనం సాధించిన ఏ కార్యాలను దేవుడు సాధించిన కార్యాలతో పోల్చవచ్చు? “నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము” అని తన నమ్మకమైన సేవకుడైన యోబును యెహోవా అడిగాడు. (యోబు 38:4) యోబు జవాబివ్వలేకపోయాడు. మనకు కూడా యోబులాగే జ్ఞానంలోనూ, సామర్థ్యంలోనూ, అనుభవంలోనూ పరిధులు లేవా? మనం మన పరిధులను గుర్తించడం మనకు ప్రయోజనకరం కాదా?

“భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే” అనీ, “అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు” ఆయనవే అని బైబిలు మనకు చెబుతుంది. “వెండి నాది, బంగారు నాది” అని కూడా యెహోవా అనగలడు. (కీర్తన 24:1; 50:10; హగ్గయి 2:8) యెహోవాకున్న ఆస్తులతో పోల్చదగ్గ ఆస్తులు మనకు ఏమి ఉన్నాయి? అంతెందుకు, యెహోవాతో పోల్చుకుంటే, అందరికన్నా ధనవంతుడైన మానవుడు సహితం గొప్పలు చెప్పుకోదగ్గ కారణం ఏమీ ఉండదు ! కనుక, “తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొన[వద్దు] . . . నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను” అని రోములోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ప్రేరేపిత ఉపదేశాన్ని అనుసరించడం వివేకం.—రోమీయులు 12:3.

దేవుని సేవకులుగా, వినయాన్ని అలవరచుకోవాలి అని కోరుకునే మనం ఆత్మ ఫలాలైన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆత్మనిగ్రహం వంటి వాటి కోసం ప్రార్థించాలి. (లూకా 11:13; గలతీయులు 5:22, 23) ఎందుకని? ఎందుకంటే ఈ గుణాల్లోని ప్రతి ఒక్కటీ మనం వినయస్థులముగా ఉండడాన్ని సులభతరం చేస్తుంది. ఉదాహరణకు, గొప్పలు చెప్పుకునే వైఖరికీ, అహంభావాన్ని చూపే వైఖరికీ వ్యతిరేకంగా పోరాడేందుకు తోటి మానవుల మీద ఉండే ప్రేమ సహాయపడుతుంది. మనం వినయం లేకుండా ప్రవర్తించక, ఒక్క క్షణం ఆగి ఆలోచించి ప్రవర్తించేందుకు ఆత్మనిగ్రహం సహాయపడుతుంది.

వినయం లేకపోతే కలగగల ప్రమాదాలను గురించి మనం ఎడతెగక అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం! పైన పేర్కొన్న ఇద్దరు రాజులు అన్ని సందర్భాల్లోను వినయంగా ఉండలేకపోయారు. దావీదు, హెచ్చరికను పట్టించుకోకుండా ఇశ్రాయేలులో జనాభాను లెక్కించాడు. అది యెహోవా చిత్తానికి వ్యతిరేకమైనది. రాజైన సొలొమోను అబద్ధ ఆరాధనలో పాల్గొనేంతగా వినయాన్ని కోల్పోయాడు.—2 సమూయేలు 24:1-10; 1 రాజులు 11:1-13.

దైవభక్తిలేని ఈ విధానం ఉన్నంత కాలం, వినయాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడం అవసరం. వినయంగా ఉండాలని చేసే ప్రయత్నం తగినదే. దేవుని క్రొత్త విధానంలో, మానవ సమాజం వినయస్థులతో మాత్రమే రూపొందినదై ఉంటుంది. వాళ్ళు వినయాన్ని ఒక బలంగా దృష్టిస్తారే తప్ప, బలహీనతగా దృష్టించరు. వినయం మూలంగా ప్రతి వ్యక్తీ, ప్రతి కుటుంబమూ శాంతిని అనుభవించగల్గడం ఎంత అద్భుతంగా ఉంటుంది !

[23వ పేజీలోని చిత్రం]

యేసు, తాను చేసిన ప్రతిదానికి వినయంగా యెహోవాకే ఘనతనిచ్చాడు