కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెనెగల్‌లో క్రైస్తవ నిరీక్షణను పంచుకోవటం

సెనెగల్‌లో క్రైస్తవ నిరీక్షణను పంచుకోవటం

మనము విశ్వాసము గలవారము

సెనెగల్‌లో క్రైస్తవ నిరీక్షణను పంచుకోవటం

ప్రాచీనకాలం నుంచి చేప ముఖ్యమైన ఆహారంగా ఉంది. వేల సంవత్సరాలుగా ప్రజలు సముద్రాల్లోనూ, సరస్సుల్లోనూ, నదుల్లోనూ చేపల్ని పడుతున్నారు. యేసుక్రీస్తు శిష్యుల్లో కొందరు గలిలయ సముద్రంలో చేపలు పట్టేవారు. అయితే, యేసు వారికి మరో విధమైన చేపలు పట్టే పనిని పరిచయం చేశాడు. అది జాలరికి మాత్రమే కాదు చేపకు కూడా ప్రయోజనకరంగా ఉండే ఆధ్యాత్మిక చేపలుపట్టే పని.

దీనికి సంబంధించి, జాలరి అయిన పేతురుకు యేసు ఇలా చెప్పాడు: “ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై” ఉంటావు. (లూకా 5:10) ఈ విధమైన చేపలుపట్టే పని ఈనాడు సెనెగల్‌తో సహా 233 కన్నా ఎక్కువ దేశాల్లో జరుగుతూ ఉంది. (మత్తయి 24:14) ఇక్కడ ఆధునిక-దిన “మనుష్యులను పట్టుజాలరు[లు]” తమ క్రైస్తవ నిరీక్షణను ధైర్యంగా ఇతరులతో పంచుకుంటున్నారు.—మత్తయి 4:19.

సెనెగల్‌, ఆఫ్రికాకు పశ్చిమ అంచున ఉంది. అది ఉత్తరాన సహారా ఎడారి అంచుల నుండి దక్షిణానవున్న తేమగా ఉండే కాసామాన్స్‌ అడవుల వరకు వ్యాపించి ఉంది. ఎడారినుంచి వీచే వేడి గాలులు అలాగే అట్లాంటిక్‌ పైనుంచి వీచే చల్లని సేదదీర్చే పవనాలు సెనెగల్‌ దేశాన్ని స్పృశిస్తుంటాయి. ఇక్కడ 90 లక్షలకంటే ఎక్కువమంది ప్రజలు నివసిస్తున్నారు. సెనెగల్‌ వాస్తవ్యులు ఆతిథ్యానికి పేరు పొందారు. అనేకులు క్రైస్తవులమని చెప్పుకోరు. అనేకమంది గొర్రెల కాపరులు కాగా ఇతరులు పశువులు, ఒంటెలు, మేకలను కాస్తుంటారు. అంతేకాక అక్కడ రైతులు వేరుశనగ, ప్రత్తి, వరిని పండిస్తుంటారు. అక్కడ జాలరులు దేశమంతటా ప్రవహిస్తున్న అనేక ఇతర నదుల్లోను అట్లాంటిక్‌ సముద్రంలోను తమ వలలనిండా చేపల్ని పట్టి తెస్తుంటారు. సెనెగల్‌ ఆర్థికరంగంలో మత్స్యపరిశ్రమ ఒక ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది. నిజానికి అక్కడి జాతీయ వంటకం సీబూజిన్‌, అది బియ్యం, చేపలు, కూరగాయలతో చేసే రుచికరమైన వంటకం.

‘మనుష్యులను పట్టు జాలరులు’

సెనెగల్‌లో 863 మంది ఉత్సాహవంతులైన దేవుని రాజ్య ప్రచారకులు ఉన్నారు. ఆధ్యాత్మిక చేపలు పట్టే పని ఇక్కడ 1950ల ప్రారంభంలో మొదలైంది. దాని రాజధాని డాకర్‌లో 1965 లో వాచ్‌ టవర్‌ సొసైటీ బ్రాంచి ఆఫీసు తెరువబడింది. మిషనరీ ‘జాలరులు’ అనేక దూరదేశాలనుంచి రావటం ప్రారంభించారు. చేపలు పట్టే కార్యక్రమం మొదలై, సెనెగల్‌లో క్రైస్తవ నిరీక్షణను పంచుకోవటం ముందుకు సాగుతూ ఉంది. డాకర్‌ నగర శివార్లలోని అల్మాడైస్‌లో కొత్త బ్రాంచి సౌకర్యాలు నిర్మించబడి 1999 జూన్‌లో యెహోవాకు సమర్పించబడ్డాయి. ఎంత సంతోషకరమైన సమయమో గదా!

సత్యాన్ని స్వీకరించే సవాలు

విభిన్నమైన నేపథ్యాలనుంచి వచ్చిన ప్రజలను తరచూ కలవడం మూలంగా కొందరు దేవుని వాక్యంలో ఉన్న నిరీక్షణా సందేశానికి అనుకూలంగా స్పందించారు. అనేకమందికి బైబిలు జ్ఞానం లేకపోయినప్పటికీ, యెహోవా దేవుడు ప్రాచీనకాలంనాటి తన ప్రవక్తలకు చేసిన వాగ్దానాలు త్వరలో నెరవేరతాయని తెలుసుకుని వారెంతో ఆనందిస్తారు.

క్రైస్తవ సూత్రాల కోసం స్థిరంగా నిలబడటానికి తరచూ ధైర్యం అవసరం, ప్రత్యేకించి కుటుంబ సాంప్రదాయాలూ, ఆచారాలూ, ఇమిడి ఉన్నప్పుడు. ఉదాహరణకు, బహు భార్యాత్వం [లేక భర్తృత్వం] అనేది సెనెగల్‌లో సర్వసామాన్యం. బైబిలును పఠించటం ప్రారంభించిన, ఇద్దరు భార్యలున్న ఒక వ్యక్తి విషయమే చూడండి. క్రైస్తవ సత్యాన్ని అంగీకరించి, భర్తకు కేవలం ఒకే భార్య ఉండాలనే లేఖనావశ్యకతకు సమ్మతించే ధైర్యం అతనికుందా? (1 తిమోతి 3:2) తన యౌవనకాలంలో తాను మొదట పెళ్లాడిన స్త్రీని తనతో ఉంచుకుంటాడా? ఆయన అదే చేశాడు, ఇప్పుడు ఆయన డాకర్‌ ప్రాంతంలోని పెద్ద సంఘాల్లో ఒకదానిలో ఉత్సాహవంతుడైన పెద్దగా సేవ చేస్తున్నాడు. ఆయన మొదటి భార్యకు పుట్టిన 10 మంది, మాజీ రెండవ భార్యకు పుట్టిన ఇద్దరు, అంటే ఆయనకున్న మొత్తం 12 మంది పిల్లలతో పాటు ఆయన మొదటి భార్యకూడా సత్యాన్ని స్వీకరించింది.

క్రైస్తవ నిరీక్షణను స్వీకరించటానికి మరొక అవాంతరం నిరక్షరాస్యత. అంటే దీనర్థం నిరక్షరాస్యులు సత్యాన్ని అంగీకరించి అనుసరించలేరనా? కానే కాదు. ఎనిమిది మంది పిల్లలున్న మారి అనే కష్టపడి పనిచేసే స్త్రీ ఉదాహరణనే చూడండి. ప్రతిరోజూ తాను పనికీ, తన పిల్లలు స్కూలుకూ వెళ్లబోయే ముందు బైబిలు లేఖనాన్ని వారితో చర్చించవలసిన ప్రాముఖ్యాన్ని ఆమె త్వరలోనే గ్రహించింది. కానీ చదవటం రాని ఆమె దీన్ని ఎలా చేయగలదు? ప్రతిరోజూ ఉదయాన్నే, ప్రతిదినము లేఖనములను పరిశీలించుట అనే బుక్‌లెట్‌ను తీసుకుని తన ఇంటిముందున్న మట్టిరోడ్డుపై నిలబడుతుంది. ఆ దారిన వెళ్తున్న వారిని చదవటం వచ్చేమో అడుగుతుంది. చదువుకున్న వారు కనబడినప్పుడు ఆ బుక్‌లెట్‌ వారి చేతికి ఇచ్చి “నాకు చదవటం రాదు, ఈ రోజు భాగం కాస్త చదివిపెట్టమని” అడుగుతుంది. వారు చదువుతుండగా ఆమె శ్రద్ధగా వింటుంది. తర్వాత వారికి ధన్యవాదాలు చెప్పి వెంటనే ఇంట్లోకి వచ్చి తన పిల్లలతో ఆ వచనంపై చక్కని చర్చ చేసి వారిని స్కూలుకు పంపిస్తుంది!

అన్నిరకాల ప్రజలు ప్రతిస్పందించటం

సెనెగల్‌లో, ప్రజలు వీధుల్లో కూర్చుని చేపలు, కూరగాయలు అమ్ముతూ లేదా మార్కెట్లో పండ్లు అమ్ముతూ లేదా పెద్ద పెద్ద బావ్‌బాబ్‌ వృక్షాల క్రింద కూర్చుని టీ కషాయంలా కాస్త చేదుగా ఉండే అటాయా అనే పానీయాన్ని తాగుతూ కనిపిస్తారు. తాము కలుసుకున్న ప్రతివారితో మాట్లాడాలని నిర్ణయించుకున్న ఇద్దరు సహోదరులు వీధిలో భిక్షమెత్తుకుంటున్న ఒక వికలాంగుడైన వ్యక్తితో మాట్లాడారు. ఆయన్ని పలకరించిన తర్వాత వారిలా అన్నారు: “ఎంతోమంది డబ్బులైతే ఇస్తారు గానీ నీతో మాట్లాడటానికి మాత్రం ఆగరు. మేము నీ భవిష్యత్తుకు సంబంధించిన ఎంతో ముఖ్యమైన విషయం నీతో మాట్లాడటానికి వచ్చాము.” ఆ భిక్షగాడు ఆశ్చర్యపోయాడు. “మేము నిన్నో ప్రశ్న అడుగుతాము” అని అంటూ సహోదరులు ఇలా అడిగారు. “ఈ లోకంలో ఎంతో బాధ ఉండటానికి కారణమేమై ఉంటుందంటావు?” ఆ భిక్షగాడు ఇలా సమాధానమిచ్చాడు: “అది దైవేచ్ఛ.”

తర్వాత సహోదరులు ఆయనకు లేఖనాల నుంచి సహేతుకంగా తెలియజేసి, ప్రకటన 21:4ని వివరించారు. ఆ నిరీక్షణా సందేశమూ, తన దగ్గరికి వచ్చి బైబిలు గురించి తనతో మాట్లాడటానికి వాళ్లకున్న ఆసక్తి ఆ వ్యక్తిని ఎంతో ఆకట్టుకున్నాయి. ఆయన కళ్లు చెమర్చాయి. డబ్బులు అడిగే బదులు ఆయన తన భిక్షపాత్రలో ఉన్న నాణేల్ని తీసుకోమని సహోదరుల్ని బలవంతం చేశాడు! ఆయన ఎంతగా పట్టుబట్టాడంటే, ఆ విషయం ఆ దారిన వెళ్తున్న వారందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ డబ్బులు ఆయనతోనే ఉంచుకునేందుకు ఎంతో కష్టం మీద సహోదరులు ఆయన్ని ఒప్పించారు. చివరికి మళ్లీ తనను కలవాలనే ఒప్పందం మీద ఆయన అంగీకరించాడు.

డాకర్‌లోని పెద్ద విశ్వవిద్యాలయం కూడా ఆధ్యాత్మిక వలకు చేపలను చేరుస్తుంది. అక్కడ జీన్‌-లూయిస్‌ అనే మెడికల్‌ స్టూడెంట్‌ బైబిలు పఠించటం ప్రారంభించాడు. శీఘ్రకాలంలోనే సత్యాన్ని స్వీకరించి, యెహోవాకు తన జీవితాన్ని సమర్పించుకుని బాప్తిస్మం పొందాడు. దేవునికి పూర్తికాల పయినీరు సేవ చేయాలన్నదే అతని కోరికైనప్పటికీ తన మెడిసిన్‌ చదువును కూడా ఎంతో ఇష్టపడ్డాడు. తన దేశంతో చేసుకున్న ఒప్పందం మూలంగా తన చదువును పూర్తి చేసే బాధ్యత ఆయనపై ఉంది. అయితే, అదే సమయంలో ఆయన సహాయ పయినీరు సేవను ప్రారంభించాడు. పట్టభద్రుడైన డాక్టరుగా డిప్లొమా అందుకున్న కొంతకాలానికే ఆయన ఆఫ్రికాలోని పెద్ద బేతేలు గృహంలో కుటుంబ డాక్టరుగా సేవ చేయడానికి ఆహ్వానం అందుకున్నాడు. డాకర్‌ విశ్వవిద్యాలయంలోనే కలిసిన మరో యువకుడు కూడా ఇప్పుడు తన స్వదేశంలోని బేతేలు కుటుంబంలో సేవ చేస్తున్నాడు.

సెనెగల్‌లోని ఆధ్యాత్మిక చేపలను పట్టేపని కచ్చితంగా ప్రతిఫలదాయకమైనదే. యెహోవాసాక్షుల బైబిలు సాహిత్యం ఎంతగానో ప్రశంసించబడుతోంది, ఇప్పుడు స్థానిక భాష అయిన ఉలోఫ్‌లో కూడా ప్రచురించబడుతోంది. సువార్తను తమ సొంత భాషలో వినటం అనేకమంది యథార్థ హృదయులు కృతజ్ఞతా పూర్వకంగా ప్రతిస్పందించేలా ప్రోత్సహించింది. సెనెగల్‌లోని ఉత్సాహవంతులైన “మనుష్యులను పట్టు జాలరు[లు]” తమ క్రైస్తవ నిరీక్షణను విశ్వాసంగాను ధైర్యంగాను పంచుకుంటూ ఉండగా, యెహోవా ఆశీర్వాదంతో ఇంకా అనేక సూచనార్థక చేపలు పట్టబడతాయనటంలో సందేహం లేదు.

[31వ పేజీలోని మ్యాపు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

సెనెగల్‌

[చిత్రం]

సెనెగల్‌లో క్రైస్తవ నిరీక్షణను పంచుకోవటం

[చిత్రసౌజన్యం]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.