కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి వ్యతిరేకంగా పోరాడేవారు విజయం పొందరు!

దేవునికి వ్యతిరేకంగా పోరాడేవారు విజయం పొందరు!

దేవునికి వ్యతిరేకంగా పోరాడేవారు విజయం పొందరు!

“వారు నీతో యుద్ధముచేతురు గాని . . . నీపైని విజయము పొందజాలరు.”యిర్మీయా 1:19.

1. యిర్మీయా ఏ నియామకాన్ని పొందాడు, ఆయన పని ఎంతకాలం కొనసాగింది?

యెహోవా యౌవనస్థుడైన యిర్మీయాను జనాంగాలకు ప్రవక్తగా నియమించాడు. (యిర్మీయా 1:4-5) యూదా యొక్క మంచి రాజైన యోషీయా పరిపాలనలో ఇది జరిగింది. బబులోను యెరూషలేముపై విజయం సాధించి దేవుని ప్రజలను చెరపట్టుకొనిపోయిన అల్లకల్లోలమైన కాలానికి ముందు నుంచి యిర్మీయా ప్రవచనార్థక పరిచర్య కొనసాగింది.—యిర్మీయా 1:1-3.

2. యెహోవా యిర్మీయాను ఎలా ఉత్తేజితం చేశాడు, ఆ ప్రవక్తకు వ్యతిరేకంగా పోరాడడమంటే దాని భావమేమిటి?

2 యిర్మీయా ప్రకటించనున్న తీర్పు సందేశాలు తప్పక వ్యతిరేకతను రేకెత్తిస్తాయి. కాబట్టి, జరుగనైయున్న దాని కోసం దేవుడు ఆయనను బలపర్చాడు. (యిర్మీయా 1:8-10) ఉదాహరణకు, “వారు నీతో యుద్ధముచేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు” అన్న మాటలతో ప్రవక్త ఆత్మ ఉత్తేజితం చేయబడింది. (యిర్మీయా 1:19) యిర్మీయాకు వ్యతిరేకంగా పోరాడడమంటే దేవునికి వ్యతిరేకంగా పోరాడడమే అవుతుంది. యిర్మీయా చేసిన పనిని పోలిన పని కల్గివున్న ప్రవక్తవంటి సేవకుల గుంపు నేడు యెహోవాకు ఉంది. ఆయనవలే వాళ్లు దేవుని ప్రవచనార్థక వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తారు. ఈ సందేశం వారి వారి ప్రతిస్పందన ఆధారంగా వారికి మేలైనా కీడైనా జరిగేలా వారిపై ప్రభావం చూపిస్తుంది. యిర్మీయా కాలంలోలాగే ఇప్పుడు కూడా, దేవుని సేవకులనూ, వారి దైవనియమిత కార్యకలాపాలనూ వ్యతిరేకించడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా పోరాడేవారున్నారు.

యెహోవా సేవకులపై దాడి జరుగుతోంది

3. యెహోవా సేవకులు ఎందుకు దాడికి గురౌతున్నారు?

3 యెహోవా ప్రజలపై 20వ శతాబ్ద తొలికాలం నుండి దాడి జరుగుతోంది. అనేక దేశాల్లో, దురుద్దేశంగల ప్రజలు దేవుని రాజ్య సువార్త ప్రకటనను అడ్డగించడానికీ, దాన్ని మొత్తానికే అణిచివేయడానికీ ప్రయత్నించారు. “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగు”తున్న మన ప్రధాన శత్రువైన అపవాది వాళ్లను పురికొల్పాడు. (1 పేతురు 5:8) 1914 లో “అన్యజనముల కాలములు” ముగిసిన తర్వాత, దేవుడు తన కుమారుడ్ని ఈ భూమికి క్రొత్త రాజుగా నియమించి, “నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము” అని ఆయనకు ఆజ్ఞాపించాడు. (లూకా 21:24; కీర్తన 110:2) క్రీస్తు తన అధికారాన్ని ఉపయోగిస్తూ సాతానును పరలోకం నుండి భూమిపైకి పడద్రోసి, అతడు మళ్లీ భూపరిధిని దాటి పరలోకంలోకి ప్రవేశించే వీలులేకుండా చేశాడు. అపవాది తనకు సమయం కొంచెమే ఉందని తెలుసుకుని అభిషిక్త క్రైస్తవులపై, వారి సహచరులపై తన ఆగ్రహాన్ని వెళ్లగ్రక్కుతున్నాడు. (ప్రకటన 12:9, 17) దేవునికి వ్యతిరేకంగా పోరాడే వీరు పదే పదే చేస్తున్న దాడుల ఫలితాలు ఎలా ఉన్నాయి?

4. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యెహోవా ప్రజలు ఏ శ్రమలను ఎదుర్కున్నారు, కానీ 1919 లోనూ, 1922 లోనూ ఏమి జరిగింది?

4 యెహోవా అభిషిక్త సేవకులు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనేక విశ్వాస పరీక్షలను ఎదుర్కొన్నారు. వారిని ఎగతాళి చేశారు, నిందించారు, అల్లరిమూకలు వారిని తరిమారు, కొట్టారు. యేసు ముందే చెప్పినట్లుగా, వారు “సకల జనములచేత ద్వేషింప”బడుతున్నారు. (మత్తయి 24:9) యుద్ధోన్మాదం మధ్యన, దేవుని రాజ్య శత్రువులు, యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా ఉపయోగించిన కుతంత్రాన్నే మళ్లీ ఉపయోగించారు. వాళ్లు, యెహోవా ప్రజలు తిరుగుబాటుదారులని వారిపై అపనిందలు వేశారు, దేవుని దృశ్య సంస్థ కేంద్రబిందువుపైనే వాళ్లు దెబ్బవేశారు. వాచ్‌ టవర్‌ సంస్థ అధ్యక్షుడైన జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ను, ఆయన సన్నిహిత సహచరులైన ఏడుగురినీ నిర్బంధించడానికి 1918 మే నెలలో ఆజ్ఞలు జారీ అయ్యాయి. ఈ ఎనిమిది మందికీ కఠిన కారాగార శిక్ష విధించి అమెరికాలోని జార్జియానందలి అట్లాంటాలో ఉన్న ఫెడరల్‌ కారాగారానికి పంపించారు. తొమ్మిది నెలల తర్వాత వారిని విడుదల చేశారు. ప్రతివాదులకు నిష్పక్షపాత విచారణ లభించలేదని సర్క్యూట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ 1919 మే నెలలో నిర్ణయించడంతో, తీర్పు తిరిగి మార్చి చెప్పడం జరిగింది. ఈ కేసు విషయంలో క్రొత్తగా విచారణ జరగాలని ఆజ్ఞ జారీ అయ్యింది, కాని ఆ తర్వాత ప్రభుత్వం తన అభియోగాన్ని వెనక్కు తీసుకోవడంతో, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌, ఆయన సహచరులు పూర్తిగా నిర్దోషులుగా నిరూపించబడ్డారు. వాళ్లు తమ కార్యకలాపాలను పునఃప్రారంభించారు, 1919 లోనూ 1922 లోనూ ఒహాయో నందలి సీడార్‌ పాయింట్‌లో జరిగిన సమావేశాలు రాజ్య ప్రకటన పనికి నూతనోత్తేజాన్ని ఇచ్చాయి.

5. యెహోవాసాక్షులు నాజీ జర్మనీలో ఏమి అనుభవించారు?

5 పంతొమ్మిది వందల ముప్ఫైలలో నియంతృత్వ పాలనలు ప్రారంభమయ్యాయి, అక్షరాజ్య కూటమిని రూపొందించేందుకు ఇటలీ, జపాన్‌, జర్మనీలు ఏకమయ్యాయి. ఆ దశాబ్దం తొలి కాలంలో, ప్రాముఖ్యంగా నాజీ జర్మనీలో, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అమానుష హింస చెలరేగింది. నిషేధాలు విధించారు. ఇళ్లు గాలించారు, వాటి నివాసులను నిర్బంధించారు. తమ విశ్వాసాన్ని వదులుకోవడానికి నిరాకరించినందుకు వేలాదిమందిని కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో వేశారు. ఆ నియంతృత్వ రాజ్యంలో నుండి యెహోవాసాక్షులను నిర్మూలించేందుకు దేవునికి వ్యతిరేకంగా, ఆయన ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. * జర్మనీలో తమ హక్కుల కోసం పోరాడేందుకు సాక్షులు కోర్టులకు వెళ్లినప్పుడు, వాళ్లు విజయం సాధించకుండేలా చూడడానికి రైక్స్‌ మినిస్ట్రీ ఆఫ్‌ జస్టిస్‌ సుదీర్ఘమైన ఒక న్యాయనిర్ణయాన్ని తయారుచేసింది. ఆ న్యాయనిర్ణయం ఇలా ఉంది: “కేవలం చట్టబద్ధమైన లాంఛనాలని స్పష్టమౌతున్న వాటికి సంబంధించి కోర్టులు విఫలం కాకూడదు; అయితే, లాంఛన ప్రాయమైన కష్టాలున్నప్పటికీ, ప్రాముఖ్యమైన తమ విధులను నిర్వర్తించడానికి మార్గాలను వెదికి కనుగొనాలి.” అంటే, న్యాయం పొందడం అసాధ్యమన్నట్లే. యెహోవాసాక్షుల కార్యకలాపాలు వైరీభావంతో చేసేవనీ లేక ప్రతికూలమైనవనీ, అవి ‘నాజీ వ్యవస్థ నిర్మాణాన్ని కలతపరుస్తున్నాయనీ’ నాజీలు భావించారు.

6. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలోనూ, ఆ తర్వాతా మన పనిని ఆపేందుకు ఏ ప్రయత్నాలు జరిగాయి?

6 రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో, ఆఫ్రికాలోనూ, ఆసియాలోనూ, కరీబియన్‌ ద్వీపాల్లోనూ, పసిఫిక్‌ ద్వీపాల్లోనూ, బ్రిటీష్‌ కామన్‌వెల్త్‌ సభ్యదేశాలైన ఆస్ట్రేలియా, కెనడా, మరితర దేశాల్లో దేవుని ప్రజలపై నిషేధాలు, నిర్బంధాలు విధించబడ్డాయి. అమెరికాలో, పలుకుబడిగల శత్రువులు, తప్పు సమాచారం అందుకున్న ప్రజలు ‘కట్టడవలన కీడు కల్పించారు.’ (కీర్తన 94:20) జెండా వందన వివాదాంశాలు, ఇంటింటి పరిచర్యను నిషేధిస్తూ జారీ చేయబడిన సమష్టి ఆదేశాలు, వంటి వాటి గురించి కోర్టుల్లో పోరాడడం జరిగింది, అమెరికాలో అనుకూలంగా ఇవ్వబడిన తీర్పులు ఆరాధనా స్వేచ్ఛకు కోటగోడవంటి మద్దతును నిర్మించాయి. శత్రు ప్రయత్నాలను యెహోవా సఫలం కానివ్వలేదు. యూరప్‌లో యుద్ధం ముగింపుకు వచ్చినప్పుడు నిషేధాలు తొలగిపోయాయి. కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో బంధించబడిన వేలాదిమంది సాక్షులు విడుదలయ్యారు, కాని పోరాటం ముగియలేదు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. తూర్పు ఐరోపా దేశాలు యెహోవా ప్రజలపైకి మరింత ఒత్తిడిని తెచ్చాయి. మన సాక్ష్యపు కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు, దాన్ని ఆపు చేసేందుకు, బైబిలు సాహిత్య ప్రవాహాన్ని అడ్డుకునేందుకు, మన బహిరంగ సమావేశాలను నిలిపివేసేందుకు అధికారిక చర్య తీసుకోవడం జరిగింది. చాలామందిని చెరసాలలో వేశారు లేదా కార్మిక శిబిరాలకు పంపారు.

ప్రకటనా పని పునఃప్రారంభం !

7. ఇటీవలి సంవత్సరాల్లో పోలాండ్‌, రష్యా, మరితర దేశాల్లో యెహోవాసాక్షులు ఏమి అనుభవించారు?

7 అయితే దశాబ్దాలు గడుస్తుండగా రాజ్య ప్రకటన పని పునఃప్రారంభమైంది. పోలాండ్‌ ఇంకా కమ్యూనిస్టు పరిపాలన క్రిందే ఉన్నప్పటికీ, ఆ దేశంలో ఒక దిన సమావేశాలు జరుపుకునేందుకు 1982 లో అనుమతి లభించింది. అక్కడ 1985 లో అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత 1989 లో అతి పెద్ద అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి, రష్యా యుక్రేయిన్‌ల నుండి వేలాదిమంది హాజరయ్యారు. ఆ సంవత్సరం హంగేరీ, పోలాండ్‌ దేశాలు యెహోవాసాక్షులకు చట్టబద్ధమైన గుర్తింపును మంజూరు చేశాయి. 1989 శరదృతువులో బెర్లిన్‌ గోడ కూలిపోయింది. కొన్ని నెలల తర్వాత, తూర్పు జర్మనీలో మనకు చట్టబద్ధమైన గుర్తింపు లభించింది, ఆ తర్వాత కొంతకాలానికే బెర్లిన్‌లో ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఇరవయ్యవ శతాబ్దపు చివరి దశాబ్ద ప్రారంభ సంవత్సరాల్లో, రష్యాలోని సహోదరులను వ్యక్తిగతంగా కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాస్కోలోవున్న కొంతమంది అధికారులను కలవడం జరిగింది, 1991 లో యెహోవాసాక్షులకు చట్టబద్ధమైన గుర్తింపు మంజూరయ్యింది. అప్పటి నుండి రష్యాలోనూ, మునుపటి సోవియట్‌ యూనియన్‌లో భాగంగా ఉన్న రిపబ్లిక్‌లలోనూ పని విస్తృతంగా పెరిగింది.

8. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతి 45 సంవత్సరాల్లో యెహోవా ప్రజలకు ఏమి జరిగింది?

8 కొన్ని ప్రాంతాల్లో హింస ఆగిపోతే, మరి కొన్ని ప్రాంతాల్లో ఉద్ధృతమైంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతి 45 సంవత్సరాల్లో, అనేక దేశాలు యెహోవాసాక్షులకు చట్టబద్ధమైన గుర్తింపును మంజూరు చేయడానికి నిరాకరించాయి. అదనంగా, ఆఫ్రికాలోని 23 దేశాల్లో, ఆసియాలోని 9 దేశాల్లో, యూరపులోని 8 దేశాల్లో, లాటిన్‌ అమెరికాలోని 3 దేశాల్లో, కొన్ని ద్వీప రాజ్యాల్లోని 4 దేశాల్లో మనపై లేక మన కార్యకలాపాలపై నిషేధాలు విధించారు.

9. మలావీలో యెహోవాసాక్షులు ఏమి అనుభవించారు?

9 మలావీలోని యెహోవాసాక్షులు 1967 మొదలుకొని క్రూరంగా హింసించబడ్డారు. అక్కడున్న మన తోటి విశ్వాసులు నిజ క్రైస్తవులుగా తమ తటస్థ స్థానాన్ని బట్టి రాజకీయ పార్టీ కార్డులు కొనుక్కోలేదు. (యోహాను 17:16) మలావీ కాంగ్రెస్‌ పార్టీలో 1972 లో ఒక మీటింగ్‌ జరిగిన తర్వాత, క్రూరమైన హింస తిరిగి చెలరేగింది. సహోదరులను ఇళ్ల నుండి వెళ్లగొట్టి, ఉద్యోగాలివ్వడానికి నిరాకరించారు. చావును తప్పించుకునేందుకు వేలాదిమంది దేశం వదిలి పారిపోయారు. దేవునికి, ఆయన ప్రజలకు వ్యతిరేకంగా పోరాడేవారు విజయం సాధించారా? ఎంతమాత్రం సాధించలేకపోయారు ! పరిస్థితుల్లో మార్పు రావడంతో, మలావీలో 1999 లో 43,767 మంది రాజ్య ప్రచారకులు ప్రాంతీయ పరిచర్య రిపోర్టు ఇచ్చారు, అది శిఖరాగ్ర సంఖ్య. అక్కడ జరిగిన జిల్లా సమావేశాలకు 1,20,000 కంటే ఎక్కువమంది హాజరయ్యారు. రాజధాని నగరంలో క్రొత్త బ్రాంచి కార్యాలయం నిర్మించడం జరిగింది.

వాళ్లు నింద మోపాలని చూస్తారు

10. దానియేలు విషయంలోలాగే, దేవుని ప్రజల వ్యతిరేకులు ఆధునిక కాలాల్లో ఏమి చేస్తున్నారు?

10 మతభ్రష్టులు, మతనాయకులు, ఇతరులు దేవుని వాక్యం నుండి మనం అందజేసే సందేశాన్ని సహించలేరు. క్రైస్తవ మతసామ్రాజ్యానికి చెందిన మతనాయకుల ఒత్తిడి మూలంగా, మనకు వ్యతిరేకంగా తాము చేసే పోరాటాన్ని సమర్థించుకునేందుకు వ్యతిరేకులు నామకార్థపు చట్టబద్ధమైన మార్గం కోసం చూస్తారు. కొన్నిసార్లు ఎలాంటి కుతంత్రాలు ఉపయోగించబడ్డాయి? దానియేలు ప్రవక్తపై దాడి చేసేందుకు కుట్రదారులు ఏమి చేశారు? దానియేలు 6:4, 5 నందు మనమిలా చదువుతాము: “అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరిగాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయినను లోపమైనను కనుగొనలేకపోయరి. అందుకా మనుష్యులు—అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమను కొనిరి.” అలాగే నేడు వ్యతిరేకులు నింద మోపాలని చూస్తారు. వాళ్లు “ప్రమాదకరమైన తెగల” గురించి నినాదాలు చేస్తూ, యెహోవాసాక్షులకు ఆ పేరు ఆపాదించాలని చూస్తారు. తప్పు ప్రాతినిధ్యం వహించడం ద్వారా, అన్యాపదేశాల ద్వారా, అబద్ధాల ద్వారా, వాళ్లు మన ఆరాధనపై, దైవిక సూత్రాలకు మనం అంటిపెట్టుకుని ఉండడంపై దాడి చేస్తారు.

11. యెహోవాసాక్షులను వ్యతిరేకించే కొంతమంది ఏ ఆరోపణలు చేశారు?

11 కొన్ని దేశాల్లో, మనం “దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి”ని అనుసరిస్తున్నామని గుర్తించడానికి మత, రాజకీయ శక్తులు నిరాకరిస్తాయి. (యాకోబు 1:27) మన క్రైస్తవ కార్యకలాపాలు 234 దేశాల్లో కొనసాగుతున్నప్పటికీ, వ్యతిరేకులు మనది “అందరికి తెలిసిన మతం” కాదంటారు. అయితే మానవ హక్కుల యూరోపియన్‌ కోర్టు అందుకు భిన్నమైన విధంగా తీర్పు చెప్పింది. అయినప్పటికీ, 1998 లో ఒక అంతర్జాతీయ సమావేశం జరగడానికి కేవలం కొంత సమయం ముందు, గ్రీకు ఆర్థడాక్స్‌ పాదిరి, “[యెహోవా సాక్షులది] ‘అందరికి తెలిసిన మతం’ కాదు” అని అన్నట్లు ఏథెన్స్‌ వార్తాపత్రిక పేర్కొన్నది. కొన్ని రోజుల తర్వాత, అదే నగరంలోని మరో వార్తా పత్రిక ఒక చర్చీ ప్రతినిధి ఇలా అన్నట్లు పేర్కొంది: “[యెహోవా సాక్షులది] ‘నిజమైన క్రైస్తవ మతం’ అని అనలేము, ఎందుకంటే వాళ్లు యేసు క్రీస్తును విశ్వసించరు.” ఇలా అనటం చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఎందుకంటే యేసును అనుకరించే విషయానికి, యెహోవాసాక్షుల కన్నా మరే మతగుంపు ఎక్కువ ప్రాముఖ్యత నివ్వదు !

12. మనం ఆధ్యాత్మిక యుద్ధాన్ని చేసేటప్పుడు ఏమి చేయాలి?

12 మనం చట్టబద్ధమైన మాధ్యమాల ద్వారా సువార్తను పరిరక్షించి, స్థిరపర్చడానికి కృషి చేస్తాము. (ఫిలిప్పీయులు 1:7) అంతేగాక, నీతియుక్తమైన దేవుని ప్రమాణాలకు స్థిరంగా అంటిపెట్టుకుని ఉండడం విషయంలో మనం రాజీపడము లేక దాన్ని నీరుకార్చము. (తీతు 2:9, 12) యిర్మీయా వలె మనం ‘నడుము కట్టుకుని యెహోవా మనకు ఆజ్ఞాపించినదంతా మాట్లాడతాము,’ దేవునికి వ్యతిరేకంగా పోరాడేవారు మనల్ని భయవిహ్వలులను చేసేందుకు మనం అనుమతించము. (యిర్మీయా 1:17, 18) యెహోవా పరిశుద్ధ వాక్యం మనం అనుసరించవలసిన సరైన మార్గాన్ని స్పష్టంగా నిర్దేశించింది. బలహీనమైన ‘మాంససంబంధమైన బాహువు’ పై ఆధారపడాలని, లేదా ‘ఐగుప్తునీడన’ అంటే ఈ ప్రపంచ నీడన ‘శరణు పొందాలని’ మనం ఎన్నడూ కోరుకోకూడదు. (2 దినవృత్తాంతములు 32:8; యెషయా 30:3; 31:1-3) ఆధ్యాత్మిక యుద్ధాన్ని చేయడంలో, మనం యెహోవాపై పూర్ణ హృదయంతో నమ్మకముంచడంలో కొనసాగాలి, ఆయన మన అడుగులను నిర్దేశించడానికి అనుమతించాలి, మన స్వంత అవగాహనపై ఆధారపడకూడదు. (సామెతలు 3:5-7) మనకు యెహోవా సహాయం లేనిదే, ఆయన మనల్ని కాపాడనిదే, మన పని అంతా “వ్యర్థమే.”—కీర్తన 127:1.

హింసింపబడినా రాజీపడేదిలేదు

13. యేసుపై సాతాను చేసిన దాడి విఫలమైందని ఎందుకు చెప్పవచ్చు?

13 యెహోవాకు రాజీపడని భక్తిని చూపించిన వారిలో అతిగొప్ప ఉదాహరణ యేసు, తిరుగుబాటు చేస్తున్నాడనీ, సుస్థాపిత వ్యవస్థను పాడు చేస్తున్నాడనీ ఆయనపై అపనిందలు వేశారు. యేసును విచారణ చేసిన తర్వాత, పిలాతు ఆయనను విడుదల చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే మతనాయకులచే పురికొల్పబడిన జనసమూహాలు, యేసు నిరపరాధి అయినప్పటికీ, ఆయనను సిలువ వేయమని కేకలు వేశారు. ఆయనకు బదులుగా, తిరుగుబాటు, హత్యానేరాలపై చెరసాలలో ఉన్న బరబ్బాను విడుదల చేయమని వారు కోరారు ! నిర్హేతుకమైన వ్యతిరేకులను ఒప్పించడానికి పిలాతు మరోసారి ప్రయత్నించాడు, కానీ చివరికి ఆయన ప్రజల కేకలకే తలవంచాడు. (లూకా 23:2, 5, 14, 18-25) యేసు మ్రానుపై మరణించినప్పటికీ, నిరపరాధియైన దేవుని కుమారునిపై దాడి చేయడానికి సాతాను చేసిన దారుణమైన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది, ఎందుకంటే యెహోవా యేసును పునరుత్థానం చేసి, ఆయనను తన కుడిపార్శ్వాన కూర్చుండబెట్టుకునేంతగా హెచ్చించాడు. మహిమపర్చబడిన యేసు ద్వారా, సా.శ. 33 పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడి, “నూతన సృష్టి” అయిన క్రైస్తవ సంఘం స్థాపించబడింది.—2 కొరింథీయులు 5:17; అపొస్తలుల కార్యములు 2:1-4.

14. యూదా మతవర్గాలు యేసు అనుచరులకు వ్యతిరేకంగా చర్య తీసుకున్నప్పుడు ఏమి జరిగింది?

14 ఆ తర్వాత కొంతకాలానికి మతవర్గాలు అపొస్తలులను బెదిరించారు, కానీ ఆ క్రీస్తు అనుచరులు తాము కన్నవాటి గురించి విన్నవాటి గురించి మాటలాడడం మానుకోలేదు. యేసు శిష్యులు ఇలా ప్రార్థించారు: “ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి, . . . నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.” (అపొస్తలుల కార్యములు 4:29, 30) వారిని పరిశుద్ధాత్మతో నింపడం ద్వారా, నిర్భయంగా ప్రకటించడంలో కొనసాగేందుకు వారిని బలపర్చడం ద్వారా, యెహోవా వారి విన్నపాలకు సమాధానమిచ్చాడు. త్వరలోనే మళ్లీ ప్రకటనా పనిని నిలిపివేయమని అపొస్తలులకు ఆజ్ఞాపించారు, కానీ పేతురు ఇతర అపొస్తలులు ఇలా సమాధానమిచ్చారు: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.” (అపొస్తలుల కార్యములు 5:29) బెదరింపులు, నిర్బంధాలు, కొరడా దెబ్బలు తమ రాజ్య కార్యకలాపాన్ని విస్తరించకుండా వారిని నిరోధించలేకపోయాయి.

15. గమలీయేలు ఎవరు, యేసు అనుచరులను వ్యతిరేకించిన మతవ్యతిరేకులకు ఆయన ఏ సలహా ఇచ్చాడు?

15 మత పరిపాలకులు ఎలా ప్రతిస్పందించారు? “అత్యాగ్రహము తెచ్చుకొని [అపొస్తలులను] చంప నుద్దేశిం[చారు].” అయితే ప్రజలందరి మన్ననలూ పొందిన పరిసయ్యుడైన గమలీయేలు అనే పేరుగల ధర్మశాస్త్ర బోధకుడు అక్కడ ఉన్నాడు. అపొస్తలులను కొద్దిసేపు యూదుల న్యాయసభ వెలుపలికి పంపించి, ఆ మత వ్యతిరేకులకు ఆయనిలా సలహా ఇచ్చాడు: “ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్త సుమండి. . . . నేను మీతో చెప్పునదేమనగా—ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.”—అపొస్తలుల కార్యములు 5:33-39.

మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్థిల్లదు

16. యెహోవా తన ప్రజలకిచ్చే హామీని మీరు మీ స్వంత మాటల్లో ఎలా వ్యక్తపరుస్తారు?

16 గమలీయేలు ఇచ్చిన ఉపదేశం జ్ఞానవంతమైనది, ఎవరైనా మన పక్షాన మాట్లాడితే మనం దాన్ని మెచ్చుకుంటాము. పక్షపాతంలేని న్యాయాధిపతులు ఇచ్చిన కోర్టు నిర్ణయాల ద్వారా ఆరాధనా స్వేచ్ఛ ఉన్నతపర్చబడిందని మనం కూడా అంగీకరిస్తాము. అయితే, మనం దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉండడం క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులకు, ప్రపంచ అబద్ధ మతసామ్రాజ్యమైన మహాబబులోనుకు చెందిన ఇతర నాయకులకు ఇష్టంలేదు. (ప్రకటన 18:1-3) వాళ్లూ, వాళ్లచే ప్రభావితమైనవారూ మనకు వ్యతిరేకంగా పోరాడినప్పటికీ, మనకు ఈ హామీ ఉంది: “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్థిల్లదు, న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.”—యెషయా 54:17.

17. వ్యతిరేకులు మనకు వ్యతిరేకంగా పోరాడినా, మనం ఎందుకు ధైర్యంగా ఉంటాము?

17 మన శత్రువులు నిర్హేతుకంగా మనతో పోరాడుతారు, కానీ మనం ధైర్యాన్ని కోల్పోము. (కీర్తన 109:1-3) మన బైబిలు సందేశాన్ని ద్వేషించేవారు, మనం మన విశ్వాసం విషయంలో రాజీపడేలా మనల్ని అధైర్యపర్చేందుకు మనమెన్నడూ అనుమతించము. మన ఆధ్యాత్మిక పోరాటం ఉద్ధృతమౌతుందని మనం నిరీక్షించినప్పటికీ, ఫలితమేమై ఉంటుందో మనకు తెలుసు. యిర్మీయావలే మనం ఈ ప్రవచనార్థక మాటల నెరవేర్పును అనుభవిస్తాము: “వారు నీతో యుద్ధముచేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొందజాలరు; ఇదే యెహోవా వాక్కు.” (యిర్మీయా 1:19) అవును, దేవునికి వ్యతిరేకంగా పోరాడేవారు విజయం పొందలేరని మనకు తెలుసు !

[అధస్సూచీలు]

^ పేరా 5 ఇదే సంచికలో 24-8 పేజీల్లో ఉన్న, “నాజీ అణచివేత క్రింద నమ్మకంగాను నిర్భయంగాను” అనే శీర్షికను చూడండి.

మీరెలా ప్రత్యుత్తరమిస్తారు?

• యెహోవా సేవకులు ఎందుకు దాడికి గురౌతున్నారు?

• వ్యతిరేకులు యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా ఏ యే విధాలుగా పోరాడారు?

• దేవునికి వ్యతిరేకంగా పోరాడేవారు విజయం సాధించలేరని మనం ఎందుకు నిశ్చయత కల్గివుండవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

[17వ పేజీలోని చిత్రం]

యెహోవా తనతో ఉంటాడని యిర్మీయాకు హామీ ఇవ్వబడింది

[18వ పేజీలోని చిత్రం]

కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో వేయబడి, బ్రతికి బయటపడ్డవారు

[18వ పేజీలోని చిత్రం]

యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా అల్లరిమూక దౌర్జన్యం

[18వ పేజీలోని చిత్రం]

జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌, ఆయన సహచరులు

[21వ పేజీలోని చిత్రం]

యేసు విషయంలో, దేవునికి వ్యతిరేకంగా పోరాడేవారు విజయం సాధించలేకపోయారు