కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నాజీ అణచివేత క్రింద నమ్మకంగాను నిర్భయంగాను

నాజీ అణచివేత క్రింద నమ్మకంగాను నిర్భయంగాను

నాజీ అణచివేత క్రింద నమ్మకంగాను నిర్భయంగాను

నెదర్లాండ్స్‌ రాణి విల్హెల్మీనా 1946 జూన్‌ 17న ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఒక యెహోవాసాక్షుల కుటుంబానికి సంతాప సందేశాన్ని పంపించింది. ఆ కుటుంబానికి చెందిన యాకోప్‌ వన్‌ బెనెకోమ్‌ను నాజీలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హత్యచేశారు, ఆయనపట్ల తనకుగల ప్రగాఢమైన గౌరవాన్ని తెలుపుతూ ఆమె ఆ సందేశాన్ని పంపింది. కొన్ని సంవత్సరాల క్రితం, నెదర్లాండ్స్‌ పశ్చిమ ప్రాంతంలో ఉన్న పట్టణమైన డూటిఖమ్‌ నగర కౌన్సిల్‌ బెర్నార్ట్‌ పోల్‌మన్‌ అనే వ్యక్తి పేరు మీదుగా ఒక వీధికి పేరు పెట్టారు, ఆయన కూడా యుద్ధ సమయంలో హత్యచేయబడిన యెహోవాసాక్షులలో ఒకరు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు నెదర్లాండ్స్‌లోని యాకోప్‌ను, బెర్నార్ట్‌ను, ఇతర యెహోవాసాక్షులను ఎందుకు వ్యతిరేకించారు? సంవత్సరాలపాటు హింసను సహించి తుదకు తమ దేశ పౌరుల గౌరవాన్నీ, రాణి మెప్పునూ సంపాదించుకోవడానికి ఈ సాక్షులకు ఏమి సహాయం చేసింది? ఆ విషయం తెలుసుకోవడానికి, చిన్న గుంపుగావున్న యెహోవాసాక్షులకు, అతి భీకరమైన నాజీ రాజకీయ సైనిక సంస్థకు మధ్య జరిగిన దావీదు-గొల్యాతు వంటి పోరాటానికి దారితీసిన కొన్ని సంఘటనలను మనం పునఃపరిశీలిద్దాము.

నిషేధించబడినా మునుపటికన్నా చురుగ్గా ఉండడం

1940 మే 10న నాజీ సైన్యం నెదర్లాండ్స్‌పైకి హఠాత్తుగా దండెత్తి వచ్చింది. యెహోవాసాక్షులు పంచిపెట్టే సాహిత్యం నాజీ పాలనలోని దుష్టచర్యలను బహిర్గతం చేసి దేవుని రాజ్యాన్ని సమర్థించేవి గనుక, నాజీలు సాక్షుల కార్యకలాపాలను అరికట్టడంలో ఏమాత్రం జాప్యం చేయలేదు. నాజీలు నెదర్లాండ్స్‌ను ఆక్రమించిన మూడు వారాలకన్నా తక్కువ సమయంలోనే, వాళ్లు యెహోవాసాక్షులను నిషేధిస్తూ రహస్య శాసనాన్ని జారీ చేశారు. సాక్షులు, “దేశానికి చెందిన సంస్థలన్నిటికీ, చర్చీకి చెందిన సంస్థలన్నిటికీ వ్యతిరేకంగా” ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ 1941 మార్చి 10న ఒక ప్రెస్‌ రిపోర్టు ఆ నిషేధాన్ని ప్రజలకు వెల్లడి చేసింది. ఫలితంగా సాక్షుల కోసం గాలింపు ఉద్ధృతమైంది.

ఆసక్తికరంగా, అపకీర్తిపాలైన గెస్టపో లేదా రహస్య పోలీసు దళం చర్చీలన్నింటినీ నిఘా క్రింద పెట్టినప్పటికీ, అది కేవలం ఒక్క క్రైస్తవ సంస్థనే తీవ్రంగా హింసించింది. “మరణించేంతగా హింసించబడింది కేవలం ఒక్క మత గుంపువారే, వారే యెహోవాసాక్షులు” అని డచ్‌ చరిత్రకారుడైన డా. లూయీ డె యాంగ్‌ చెప్తున్నాడు.—హెట్‌ కోనిన్‌క్రిక్‌ డెర్‌ నెడెర్‌లాండెన్‌ ఇన్‌ డె ట్వీడె వెరెల్డూర్‌లాగ్‌ (రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నెదర్లాండ్స్‌ రాజ్యం)

సాక్షులను గుర్తించి వారిని అరెస్టు చేయడానికి గెస్టపోకు డచ్‌ పోలీసుల సహకారం ఉండేది. అంతేగాక, భయపడిపోయి మతభ్రష్టునిగా మారిన ఒక ప్రయాణ పైవిచారణకర్త తన మునుపటి సహవిశ్వాసుల గురించిన సమాచారాన్ని నాజీలకు తెలియజేసేశాడు. 1941 ఏప్రిల్‌ చివరికల్లా 113 మంది సాక్షులు నిర్బంధించబడ్డారు. ఈ దాడి ప్రకటనా కార్యకలాపాలను నిలిపివేసిందా?

దానికి సమాధానాన్ని, జర్మన్‌ జిఖెర్‌హైట్స్‌పోలీజీ (సెక్యూరిటీ పోలీస్‌) 1941 ఏప్రిల్‌లో సిద్ధంచేసిన రహస్య పత్రం అయిన మెల్డున్‌జెన్‌ ఏయుస్‌ డెన్‌ నీడెర్‌లాండెన్‌ (నెదర్లాండ్స్‌ నుండి నివేదికలు) అనేదానిలో కనుగొనవచ్చు. ఆ నివేదికలు యెహోవాసాక్షుల గురించి ఇలా చెప్తున్నాయి: “ఈ నిషేధిత తెగ, చట్టవ్యతిరేకమైన కూటాలను జరుపుకుంటూ, ‘దేవుని సాక్షులను హింసించడం నేరం’ మరియు ‘హింసకులను మరెన్నడూ ఉండకుండా నాశనం చేయడం ద్వారా యెహోవా వారిని శిక్షిస్తాడు’ వంటి నినాదాలున్న కరపత్రాలను అంటిస్తూ మొత్తం దేశమంతటిలోనూ శక్తివంతమైన కార్యకలాపాన్ని కొనసాగిస్తోంది.” రెండు వారాల తర్వాత అవే నివేదికలు ఇలా నివేదించాయి: “బైబిలు విద్యార్థుల కార్యకలాపాలకు వ్యతిరేకంగా సెక్యూరిటీ పోలీస్‌ తీవ్రమైన చర్యలు తీసుకున్నప్పటికీ, వారి కార్యకలాపాలు అధికమౌతూనే ఉన్నాయి.” అవును, అరెస్టయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ, సాక్షులు తమ పనిని కొనసాగిస్తూ, కేవలం 1941 లోనే 3,50,000 కంటే ఎక్కువ సాహిత్య ప్రతులను ప్రజలకు పంచిపెట్టారు.

భయంగొల్పే తమ శత్రువుల ఎదుట ధైర్యంగా నిలబడటానికి, చిన్న గుంపుగా ఉండి అంతకంతకూ అధికమౌతూ, వందల సంఖ్యలో ఉన్న సాక్షులకు ఏమి సహాయం చేసింది? ప్రాచీన కాలం నాటి నమ్మకమైన ప్రవక్తయైన యెషయా వలే సాక్షులు మనుష్యులకు కాదుగానీ దేవునికే భయపడ్డారు. ఎందుకు? ఎందుకంటే, “నేను నేనే మిమ్ము నోదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు?” అని యెహోవా అభయమిస్తూ యెషయాకు చెప్పిన మాటలను వారు దృఢంగా విశ్వసించారు.—యెషయా 51:12.

నిర్భయత్వం గౌరవాన్ని తెచ్చిపెడుతుంది

1941 ముగింపుకల్లా, అరెస్టయిన సాక్షుల సంఖ్య 241కు చేరుకుంది. అయితే, కేవలం కొద్దిమంది మాత్రం మనుష్యుల భయానికి లొంగిపోయారు. జర్మను రహస్య పోలీసు దళంలో దుష్టునిగా పేరుపొందిన విల్లీ లేజస్‌ అనే వ్యక్తి, ఇలా అన్నట్లు చెప్పబడుతుంది: “90 శాతం మంది యెహోవాసాక్షులు ఏదైనా వెల్లడిచేయడానికి నిరాకరించారు, అయితే ఇతర గుంపులకు చెందిన కేవలం కొద్ది శాతంమంది మాత్రమే అలా మౌనంగా ఉండగలిగారు.” సాక్షులతోపాటు జైల్లో వేయబడిన డచ్‌ పాదిరీ అయిన జొహన్నస్‌ జె. బస్కస్‌ పేర్కొన్న విషయం లేజస్‌ వ్యాఖ్యానాన్ని ధృవీకరిస్తుంది. 1951 లో బస్కస్‌ ఇలా వ్రాశాడు:

“దేవునియందు వాళ్లకున్న నమ్మకాన్నిబట్టి, వారి విశ్వాస శక్తినిబట్టి గతంలో నేను వాళ్లపట్ల చాలా గౌరవాన్ని ఏర్పరచుకున్నాను. హిట్లర్‌ పతనం గురించి, ఆయన మూడవ రైక్‌ కూలిపోవడం గురించి చెప్పే కరపత్రాలను పంచిపెట్టిన యౌవనస్థుడిని నేను ఎన్నడూ మరిచిపోలేను. ఆయన వయస్సు 19 ఏళ్లకన్నా ఎక్కువ ఉండదు. . . . ఆ కార్యకలాపాలను కొనసాగించనని గనుక ఆయన వాగ్దానం చేస్తే ఆయన ఆరునెలల్లో విడుదల చేయబడేవాడే. కానీ దానికాయన గట్టిగా నిరాకరించాడు, అందుకని జర్మనీలో అనిర్దిష్టమైన కాలంపాటు కార్మికునిగా పని చేసేలా ఆయనకు శిక్ష విధించబడింది. దాని భావమేమిటో మాకు బాగా తెలుసు. మరునాడు ఉదయం ఆయనను తీసుకువెళ్లిపోతున్నప్పుడు మేము ఆయనకు వీడ్కోలు చెప్తూ, మేము ఆయనను గుర్తు చేసుకుంటామనీ, తన కోసం ప్రార్థిస్తామనీ నేను ఆయనకు చెప్పాను. దానికాయన, ‘నా గురించి చింతించకండి. దేవుని రాజ్యం తప్పక వస్తుంది’ అని సమాధానమిచ్చాడు. ఈ యెహోవాసాక్షుల బోధలంటే ఎంత అభ్యంతరం ఉన్నా సరే, అలాంటి విషయాన్ని ఒకరు ఎన్నటికీ మరిచిపోలేరు.”

ఎంత క్రూరమైన హింస చెలరేగుతున్నప్పటికీ, సాక్షుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి కొంత ముందు దాదాపు 300 మంది ఉండగా, 1943 నాటికి ఆ సంఖ్య 1,379కు చేరుకుంది. దుఃఖకరంగా, అదే సంవత్సరం చివరికల్లా, అరెస్టయిన 350 కంటే ఎక్కువమందిలో నుండి 54 మంది వివిధ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో (నిర్బంధ శిబిరాల్లో) మరణించారు. 1944 కల్లా నెదర్లాండ్స్‌ నుండి వచ్చిన 141 మంది యెహోవాసాక్షులు వివిధ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో ఉన్నారు.

నాజీ హింస యొక్క చివరి సంవత్సరం

1944 జూన్‌ 6 తర్వాత, సాక్షులపై జరుగుతున్న హింస ముగియడానికి ఇంకా ఒక్క సంవత్సరం ఉంది. ఆ రోజున అమెరికన్‌, బ్రిటీష్‌ సైన్యాలు ఫ్రాన్స్‌లోని నార్మండిలోకి ప్రవేశించాయి. సైనికపరంగా చూస్తే నాజీలు వారి సహకారులు పరాజయాన్ని పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాజీలు అమాయకులైన క్రైస్తవులను తరమడం మానుకుంటారని ఎవరైనా అనుకుంటారు. అయినప్పటికీ, ఆ సంవత్సరంలో, మరో 48 మంది సాక్షులు అరెస్టు అయ్యారు, నిర్బంధించబడిన వారిలో నుండి మరో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు మునుపు ప్రస్తావించిన యాకోప్‌ వన్‌ బెనెకోమ్‌.

1941 లో యెహోవాసాక్షులుగా బాప్తిస్మం తీసుకున్న 580 మందిలో పద్దెనిమిదేళ్ల యాకోప్‌ ఒకరు. తర్వాత త్వరలోనే, ఆయన తన క్రైస్తవ తటస్థతతో రాజీపడాల్సి వస్తుండటంతో తాను చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆయన వార్తాహరునిగా ఉద్యోగం ప్రారంభించి, పూర్తికాల పరిచర్య కూడా మొదలుపెట్టాడు. బైబిలు సాహిత్యాన్ని చేరవేస్తుండగా పట్టుబడి, అరెస్టయ్యాడు. 1944 ఆగస్టులో, రోటర్‌డామ్‌ నగరంలోని ఒక చెరసాలలో నుండి, 21 ఏళ్ల యాకోప్‌ తన కుటుంబానికి ఒక ఉత్తరం వ్రాశాడు:

“నేను చాలా బాగున్నాను, సంతోషంగా ఉన్నాను. . . . నన్నిప్పటికి నాలుగుసార్లు విచారణ చేశారు. మొదటి రెండుసార్లు చాలా తీవ్రంగా జరిగింది, నన్ను బాగా కొట్టారు, కాని ప్రభువు ఇచ్చిన బలం, ఆయన కృప మూలంగా నేను ఇప్పటి వరకూ ఏదీ వెల్లడి చేయకుండా ఉండగలిగాను. . . . నేను ఇప్పటికే ఇక్కడ ప్రసంగాలు ఇవ్వగల్గుతున్నాను, ఆరు ప్రసంగాలిచ్చాను, మొత్తం 102 మంది విన్నారు. వీరిలో కొంతమంది మంచి ఆసక్తి చూపిస్తున్నారు, తాము విడుదల చేయబడిన వెంటనే ఈ విశ్వాసంలో కొనసాగుతామని వాళ్లు వాగ్దానం చేశారు.”

1944 సెప్టెంబరు 14న యాకోప్‌ను డచ్‌ నగరమైన ఆమర్జ్‌ఫూర్ట్‌ నగరంలోని కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుకు తీసుకువెళ్లారు. అక్కడ కూడా ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎలా? ఒక తోటి ఖైదీ ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “గార్డులు పారవేసే సిగరెట్‌ ముక్కలను ఖైదీలు ఏరుకుని, దానిలోని పదార్థాన్ని ఉపయోగించి సిగరెట్లు తయారు చేసుకోవడానికి బైబిల్లోని కాగితాలను ఉపయోగించేవారు. వాళ్లు అలా తయారు చేసుకునే ముందు ఆ కాగితాలను తీసుకుని వాటిలోనుండి కొన్ని పదాలను యాకోప్‌ కొన్నిసార్లు చదివేవాడు. వెంటనే ఆయన ఆ పదాలను ఆధారంగా తీసుకుని మాకు ప్రకటించడం మొదలుపెట్టేవాడు. త్వరలోనే మేము ఆయనకు ‘బైబిలు మనిషి’ అని పేరుపెట్టాము.”

1944 అక్టోబరులో, యుద్ధ టాంకులను చిక్కించుకునేందుకు కందకాలను త్రవ్వే పని అప్పగించబడిన పెద్ద గుంపులో యాకోప్‌ కూడా ఉన్నాడు. యుద్ధ ప్రయత్నాలకు మద్దతునిచ్చేందుకు తన మనస్సాక్షి ఒప్పుకోదు గనుక యాకోప్‌ ఆ పని చేయడానికి నిరాకరించాడు. గార్డులు పదే పదే బెదిరించినా ఆయన లొంగలేదు. అక్టోబర్‌ 13న ఒక ఆఫీసరు ఆయనను ఏకాంత నిర్బంధం నుండి మళ్లీ పని స్థలానికి తీసుకువెళ్లాడు. మళ్లీ, యాకోప్‌ స్థిరంగా నిలబడ్డాడు. చివరికి యాకోప్‌కు తన స్వంత సమాధిని తవ్వుకోమని ఆజ్ఞాపించి, ఆయనను కాల్చి చంపేశారు.

సాక్షుల కోసం గాలింపు కొనసాగడం

యాకోప్‌, మరితరులు తమ విశ్వాసం కోసం ధైర్యంగా నిలబడటం నాజీలకు ఆగ్రహం తెప్పించి, సాక్షుల కోసం మరింతగా గాలించేలా చేసింది. వారి ఆగ్రహానికి గురైనవారిలో 18 ఏళ్ల ఎవర్ట్‌ కెటలారే ఒకరు. మొదట్లో, ఎవర్ట్‌ తప్పించుకుని దాక్కోగలిగాడు, కానీ తర్వాత ఆయనను అరెస్ట్‌ చేసి, ఇతర సాక్షులను గురించిన సమాచారాన్ని చెప్పమని బాగా కొట్టారు. దానికాయన నిరాకరించడంతో నిర్బంధ కార్మిక సేవ కోసం జర్మనీకి పంపించారు.

అదే నెలలో, అంటే 1944 అక్టోబరులో పోలీసులు ఎవర్ట్‌ బావగారైన బెర్నార్డ్‌ లీమెస్‌ కోసం వెదికారు. వాళ్లు ఆయనను కనుగొన్నప్పుడు, ఆన్టోనీ రేమేయర్‌, ఆల్బర్టస్‌ బోజ్‌ అనే మరో ఇద్దరు సాక్షులు ఆయనతోపాటు ఉన్నారు. ఆల్బర్టస్‌ అప్పటికే 14 నెలలు నిర్బంధ శిబిరంలో గడిపాడు. అయినప్పటికీ, ఆయన విడుదలైనప్పుడు, ఉత్సాహంగా మళ్లీ ప్రకటన పనిని ప్రారంభించాడు. నాజీలు మొదట ఆ ముగ్గురినీ కనికరం లేకుండా కొట్టారు, తర్వాత వారిని కాల్చి చంపేశారు. యుద్ధం ముగిసిన తర్వాతనే వాళ్ల శవాలను కనుగొని ఖననం చేయడం జరిగింది. యుద్ధం ముగిసిన తర్వాత, కొన్ని స్థానిక వార్తాపత్రికలు ఈ ఉదంతం గురించి నివేదించాయి. ఒక వార్తా పత్రిక, ఆ ముగ్గురు సాక్షులు దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నాజీలకు ఏ సేవ చేయడానికైనా నిరాకరించారని చెప్తూ, ఇంకా ఇలా అన్నది: “దీని కోసం వాళ్లు తమ ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది.”

ఈ మధ్యలో, 1944, నవంబరు 10న, మునుపు ప్రస్తావించిన బెర్నార్ట్‌ పోల్‌మాన్‌ను అరెస్ట్‌ చేసి, మిలటరీ ప్రాజెక్ట్‌పై పనిచేయడానికి పంపించారు. అలా పని చేయడానికి పంపబడిన వారిలో ఆయనొక్కడే యెహోవాసాక్షి, ఆ పని చేయడానికి నిరాకరించింది కూడా ఆయనొక్కడే. ఆయన రాజీపడేలా చేయడానికి గార్డులు వివిధ కుతంత్రాలు ఉపయోగించారు. ఆయనకు ఆహారం ఇవ్వలేదు. ఆయనను కర్రలతోనూ, పారతోనూ, పిస్తోలు మడిమెతోను క్రూరాతి క్రూరంగా కొట్టారు. అంతేగాక, మోకాళ్ల లోతున్న చల్లని నీటిలో నడిపించి, తేమగా ఉన్న గదిలో, తడిసిన బట్టలతో రాత్రంతా బంధించి ఉంచారు. అయినా బెర్నార్ట్‌ లొంగిపోలేదు.

ఆ సమయంలో, ఆయనను సందర్శించడానికి యెహోవాసాక్షులు కాని బెర్నార్ట్‌ సహోదరీలిద్దరిని అనుమతించారు. మనస్సు మార్చుకోమని వాళ్లు ఆయనను కోరారు, కానీ ఆయన ఎంతమాత్రం లొంగలేదు. ఆయన కోసం తాము ఏమైనా చేయగలమా అని వాళ్లు బెర్నార్ట్‌ను అడిగినప్పుడు, ఇంటికెళ్లి బైబిలు పఠనం చేయమని ఆయన వారికి సూచించాడు. తర్వాత, గర్భవతి అయిన ఆయన భార్య ఆయనను సందర్శించడానికి ఆ హింసకులు అనుమతించారు, కనీసం ఆమె అయినా ఆయన పట్టును సడలిస్తుందని వాళ్లు భావించారు. కాని ఆమె సమక్షం, ఆమె పలికిన ధైర్యవంతమైన మాటలు, దేవునికి నమ్మకంగా ఉండాలన్న బెర్నార్ట్‌ నిశ్చయాన్ని మరింత బలపర్చాయంతే. 1944 నవంబరు 17న, ఇతర ఖైదీలందరూ చూస్తుండగా ఐదుగురు ఆయనను కాల్చి చంపేశారు. బెర్నార్ట్‌ చనిపోయిన తర్వాత, తుపాకీ గుళ్లతో శరీరమంతా తూట్లు పడినప్పటికీ, అక్కడ నియుక్తుడైయున్న ఆఫీసరు ఎంత ఉగ్రుడైపోయాడంటే, అతడు తన తుపాకీ తీసుకుని బెర్నార్ట్‌ రెండు కళ్లలోకి పేల్చాడు.

దీని గురించి విన్న సాక్షులు ఈ క్రూరమైన హింసను బట్టి దిగ్భ్రాంతికి గురైనప్పటికీ, వాళ్లు నమ్మకంగా నిర్భయంగా ఉండి, తమ క్రైస్తవ కార్యకలాపాన్ని కొనసాగించారు. బెర్నార్ట్‌ చంపబడిన ప్రాంతానికి దగ్గరలో ఉన్న యెహోవాసాక్షుల ఒక చిన్న సంఘం, ఆయనకు విధించబడిన శిక్ష అమలుచేయబడిన తర్వాత ఇలా నివేదించింది: “ఈ నెలలో వాతావరణం ఎంత దుర్భరంగా ఉన్నప్పటికీ, సాతాను మా మార్గంలో ఎన్నో అడ్డంకులు తెచ్చిపెట్టినప్పటికీ, మేము మా కార్యకలాపాలను ఎంతో ఉద్ధృతం చేయగలిగాము. ప్రాంతీయ పరిచర్యలో గడిపిన గంటలు 429 నుండి 765కు చేరుకున్నాయి. . . . పరిచర్య చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు ఒక వ్యక్తిని కలిసి, మంచి సాక్ష్యం ఇవ్వగలిగాడు. కాల్చి చంపబడిన వ్యక్తి విశ్వాసమూ మీరు చెప్పేదీ ఒకటేనా అని ఆ వ్యక్తి అడిగాడు. అదేనని తెలుసుకుని, ఆ వ్యక్తి ఇలా అన్నాడు: ‘ఏం మనిషి, ఏం విశ్వాసం ! ఆయన విశ్వాసం విషయంలో వీరుడు అని నేను అంటాను !’”

యెహోవా గుర్తుంచుకున్నాడు

1945 మే నెలలో, నాజీలు ఓడిపోయి నెదర్లాండ్స్‌ నుండి తరిమివేయబడ్డారు. యుద్ధ కాలంలో ఎడతెగని హింసను ఎదుర్కున్నప్పటికీ, యెహోవాసాక్షుల సంఖ్య కొన్ని వందల నుండి 2,000 కంటే ఎక్కువకు చేరుకుంది. యుద్ధ కాలంలోని ఆ సాక్షుల గురించి మాట్లాడుతూ, చరిత్రకారుడైన డా. డె జోంగ్‌ ఇలా అంగీకరిస్తున్నాడు: “ఎన్ని బెదరింపులు, హింస ఎదురైనప్పటికీ వారిలో అనేకులు తమ విశ్వాసాన్ని వదులుకోవడానికి నిరాకరించారు.”

కాబట్టి నాజీ పరిపాలన సమయంలో యెహోవాసాక్షులు వహించిన ధైర్యవంతమైన స్థానాన్ని బట్టి లౌకిక అధికారులు వారిని గుర్తుంచుకుంటారంటే అది ఎంతో సహేతుకమైనదే. అయితే, మరింత ప్రాముఖ్యంగా, యుద్ధకాలంలోని ఈ సాక్షుల ఉత్కృష్టమైన రికార్డును యెహోవా, యేసు జ్ఞాపకముంచుకుంటారు. (హెబ్రీయులు 6:10) రానైయున్న యేసుక్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా సమయంలో, దేవుని సేవలో తమ ప్రాణాలను అర్పించిన ఈ నమ్మకమైన నిర్భయులైన సాక్షులు పరదైసు భూమిపై నిరంతరం జీవించే ఉత్తరాపేక్షతో సమాధులలో నుండి లేపబడతారు !—యోహాను 5:28, 29.

[24వ పేజీలోని చిత్రం]

యాకోప్‌ వన్‌ బెనెకోమ్‌

[26వ పేజీలోని చిత్రం]

వార్తాపత్రికలో ప్రచురించబడిన, యెహోవాసాక్షులను నిషేధిస్తూ జారీ చేయబడిన శాసనం

[27వ పేజీలోని చిత్రాలు]

కుడి: బెర్నార్డ్‌ లీమెస్‌; క్రింద: ఆల్బర్టస్‌ బోజ్‌ (ఎడమవైపు), ఆన్టోనీ రేమేయర్‌; క్రింద: హామ్‌స్టీడ్‌లోని సంస్థ కార్యాలయం