కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలులో కోడ్‌ ఏమైనా దాగి ఉందా?

బైబిలులో కోడ్‌ ఏమైనా దాగి ఉందా?

బైబిలులో కోడ్‌ ఏమైనా దాగి ఉందా?

ఇజ్రాయిల్‌ ప్రధాన మంత్రియైన ఇషాక్‌ రాబిన్‌ 1995 లో హత్య చేయబడిన సంఘటనను గురించిన ప్రవచనం బైబిలు యొక్క హెబ్రీ మూలపాఠంలో ఉన్న ఒక కోడ్‌లో దాగివుండడాన్ని కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కనుగొన్నానని, ఆ సంఘటన జరిగి దాదాపు రెండు సంవత్సరాలైన తర్వాత పత్రికా విలేఖరియైన మైఖెల్‌ డ్రోస్‌నిన్‌ చెప్పుకున్నాడు. హత్య జరగడానికి ఒక సంవత్సరం ముందే తాను ప్రధానమంత్రిని హెచ్చరించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆ విలేఖరి వ్రాశాడు.

దాగివున్న ఈ కోడ్‌, బైబిలు దైవప్రేరేపితమైనదనేందుకు తిరుగులేని నిదర్శనాన్ని ఇస్తుందని చెబుతున్న పుస్తకాలూ శీర్షికలూ ఇప్పుడు ప్రచురించబడుతున్నాయి. నిజానికి అలాంటి కోడ్‌ ఏమైనా ఉందా? బైబిలు దైవ ప్రేరేపితమైనదని నమ్మడానికి ఏదో దాగివున్న కోడ్‌ ఉండడమే ఆధారమా?

ఇదొక క్రొత్త తలంపా?

బైబిలు మూలపాఠంలో ఒక కోడ్‌ దాగి ఉందన్న తలంపు క్రొత్తదేమీ కాదు. కాబాలా అని పిలువబడే పారంపర్య యూదామత గుప్తవాదంలోని కేంద్ర సిద్ధాంతమది. బైబిలు వచనాల్లో మనకు సరళంగా ఏమి అర్థమౌతుందో అది మాత్రమే అసలు అర్థం కాదని కాబాలిస్టు బోధకుల అభిప్రాయం. దేవుడు బైబిలులోని హెబ్రీ లేఖనాల్లో ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క ప్రతీకగా ఉపయోగించాడనీ, వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు గొప్ప సత్యాలు వెల్లడి అవుతాయని వారు నమ్ముతారు. బైబిలులోని ఒక్కొక్క హెబ్రీ అక్షరాన్నీ, వాటి స్థానాన్నీ దేవుడే ఒక ప్రత్యేక ఉద్దేశంతో నిర్ణయించిపెట్టాడని వాళ్ళ అభిప్రాయం.

ఆదికాండములోని సృష్టి వృత్తాంతాన్ని వర్ణించటానికి ఉపయోగించబడిన హెబ్రీ అక్షరాలకు నమ్మశక్యం కానంత మార్మిక శక్తి ఉన్నదని ఈ యూదా గుప్తవాదులు నమ్ముతారన్నది బైబిలు కోడ్‌ పరిశోధకుడైన జెఫ్రీ సాటినోవర్‌ అభిప్రాయం. “క్లుప్తంగా చెప్పాలంటే, ఆదికాండము కేవలమొక వర్ణన కాదు; అది సృష్టి కార్యంలో ఉపయోగించబడిన ఒక ఉపకరణం. అది భౌతిక రూపం దాల్చిన బ్లూప్రింట్‌, దేవుని మనస్సులోని బ్లూప్రింట్‌” అని ఆయన వ్రాస్తున్నాడు.

స్పెయిన్‌లోని సరగాసాకు చెందిన, 13వ శతాబ్దపు కాబలిస్ట్‌ రబ్బీ అయిన బాక్యా ఆషర్‌ బెన్‌ ఆషర్‌, ఆదికాండములోని ఒక భాగంలో ప్రతి 42వ అక్షరాన్ని కలుపుకుని చదవడం ద్వారా వెలికి వచ్చిన సమాచారాన్ని గురించి వ్రాశాడు. దాగివున్న సందేశాలను కనుగొనేందుకు ఒక ప్రత్యేక క్రమం చొప్పున కొన్ని అక్షరాలను వదిలిపెడుతూ చదివే ఈ పద్ధతి ఆధునిక బైబిలు కోడ్‌ తలంపుకు పునాది అయ్యింది.

కంప్యూటర్‌లు ఆ కోడ్‌ను “బయల్పరుస్తున్నాయి”

కంప్యూటర్‌ యుగం ప్రారంభం కాకముందు, ఈ పద్ధతిలో బైబిలును పరిశీలించే శక్తికి పరిమితి ఉండేది. అయితే, 1994 ఆగస్టులో, స్టాటిస్టికల్‌ సైన్స్‌ అనే పత్రిక ప్రచురించిన ఒక శీర్షికలో, జెరూసలేమ్స్‌ హీబ్రూ యూనివర్సిటీకి చెందిన ఎలీయాహూ రిప్స్‌, ఆయన తోటి పరిశోధకులూ ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలను కనుగొన్నట్లు చెప్పుకున్నారు. ఆదికాండములో, అక్షరాల మధ్య ఉండే ఖాళీలన్నింటినీ తీసివేసి, నిర్దిష్ట సంఖ్యలోని అక్షరాలను విడిచిపెడుతూ చదువుకుంటూ వెళ్ళడం ద్వారా, తాము 34 మంది ప్రఖ్యాత రబ్బీల పేర్లనూ, ఆ పేర్లకు దగ్గర్లోనే వాళ్ళ జనన మరణ తేదీలూ మొదలైన మరి కొంత సమాచారాన్నీ కనుగొన్నామని వివరించారు. * ఆదికాండములో ఈ సమాచారం కనిపించడం కాకతాళీయం కాదని, ఈ దైవప్రేరేపిత సమాచారం వేలాది సంవత్సరాల క్రితం కావాలనే కోడ్‌ రూపంలో దాచి ఉంచబడింది అనేదానికి ఇది నిదర్శనంగా ఉందన్న తమ నిర్ధారణను పరిశోధకులు అనేకసార్లు పరీక్షించి చూసిన తర్వాత ప్రచురించారు.

పత్రికా విలేఖరియైన డ్రోస్‌నిన్‌, హెబ్రీ భాష బైబిలులోని మొదటి ఐదు పుస్తకాల్లో దాచి ఉంచబడిన సమాచారాన్ని అన్వేషించేందుకు ఈ పద్ధతిని ఆధారంగా తీసుకుంటూ పరీక్షలు జరిపాడు. డ్రోస్‌నిన్‌ అభిప్రాయం ప్రకారం, బైబిలు యొక్క హెబ్రీ మూలపాఠాన్ని ఒక్కో వరుసలో 4,772 అక్షరాలుగా పేర్చుకుని చదువుకుంటూ పోతే ఇషాక్‌ రాబిన్‌ అనే పేరు కనిపిస్తుంది. అలా ఒక్కో వరుసలో 4,772 అక్షరాలు వచ్చేలా చేసుకుని చదివినప్పుడు రాబిన్‌ పేరు నిలువుగా కనిపిస్తుంది. ఈ పేరు ద్వితీయోపదేశకాండము 4:42వ వచనాన్ని తాకుతూ వెళ్తుంది. ఈ వచనాన్ని “హంతకుడు చంపుతాడు” అని డ్రోన్‌సిన్‌ అనువదించాడు.

నిజానికి కావాలని కాక, పొరపాటున చంపినవాడ్ని గురించే ద్వితీయోపదేశకాండము 4:42 మాట్లాడుతుంది. కనుక, డ్రోస్‌నిన్‌ తనకు ఇష్టం వచ్చిన పద్ధతిని ఉపయోగించడాన్ని అనేకులు విమర్శిస్తూ, ఏ పుస్తకంలోనైనా ఇలాంటి వాటిని కనుగొనేందుకు శాస్త్రీయం కానీ డ్రోస్‌నిన్‌ పద్ధతులను ఉపయోగించవచ్చు అని అన్నారు. “మోబీ డిక్‌ [అనే నవల]లో ఏదైన ఒక ప్రధాన మంత్రి హత్యను గురించిన ప్రవచనం కోడ్‌ రూపంలో దాగివున్నట్లు నన్ను విమర్శించినవాళ్ళు కనుగొంటే నేనా విషయాన్ని నమ్ముతాను” అని సవాలు చేస్తూ డ్రోస్‌నిన్‌ తన అభిప్రాయం మీద స్థిరంగా నిలబడ్డాడు.

బైబిలు దైవప్రేరేపితమైనదనేందుకు ఇది రుజువా?

ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో పని చేసే ప్రొఫెసర్‌ బ్రెన్‌డన్‌ మెక్‌కే, డ్రోస్‌నిన్‌ సవాలుకు అంగీకరించి, కంప్యూటర్‌లో మోబీ డిక్‌ నవలను విస్తృతంగా పరిశోధించాడు. * డ్రోస్‌నిన్‌ చెప్పిన అదే పద్ధతిని ఉపయోగించి, తాను ఇందిరా గాంధి, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌, జాన్‌ ఎఫ్‌. కెనడీ, అబ్రహాం లింకన్‌, మరితరుల హత్యలను గురించిన “భవిష్యవాణులను” కనుగొన్నానని చెప్పాడు. ఆ విధంగా చూస్తే, ఇషాక్‌ రాబిన్‌ హత్య గురించి మోబీ డిక్‌ కూడా “ప్రవచించింది” అని మెక్‌కే అభిప్రాయం.

ప్రొఫెసర్‌ మెక్‌కే మరియు ఆయన సహవాసులు ఆదికాండములోని హెబ్రీ మూలపాఠానికి మళ్ళుతూ, రిప్స్‌, ఆయన సహవాసులు చేసిన ప్రయోగ ఫలితాలను ప్రశ్నించారు. వాళ్ళు కనుగొన్న విషయాలకు దైవప్రేరేపిత సందేశంతో ఏ మాత్రం సంబంధం లేదనీ, వాళ్ళు అవలంబించిన పద్ధతితోనే సంబంధముందనీ, పరిశోధకులు తమకు ఇష్టంవచ్చినట్లు సమాచారాన్ని కల్పించి చెప్పారనీ ఆరోపించబడింది. ఈ విషయంపై పండితుల మధ్య ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి.

“ప్రామాణిక” లేదా “మూల” హెబ్రీ పాఠంలో సందేశాలు ఉద్దేశపూర్వకంగానే కోడ్‌ రూపంలో దాచి ఉంచబడ్డాయి అని అన్నప్పుడు మరొక వివాదం తలెత్తుతుంది. “ప్రామాణికమైన, సాధారణంగా అంగీకరించబడే ఆదికాండము యొక్క మూలపాఠం”లోనే తాము పరిశోధనను చేసినట్లు రిప్స్‌, ఆయన తోటి పరిశోధకులు చెబుతారు. “ఇప్పుడు ఉన్న ఆదిమ హెబ్రీ భాషలోని బైబిళ్ళన్నింటిలోను అక్షరాలు ఒకేవిధంగా ఉన్నాయి” అని డ్రోస్‌నిన్‌ వ్రాస్తున్నాడు. కానీ అది నిజమా? బైబిళ్ళన్నీ “ప్రామాణికం”గా ఒకే విధంగా లేవు. నేడు వివిధ ప్రాచీన వ్రాతప్రతుల ఆధారంగా చేసిన అనేక హెబ్రీ బైబిలు సంపుటులు ఉపయోగించబడుతున్నాయి. బైబిలు సందేశం అన్ని వ్రాతప్రతుల్లోను ఒకేలా ఉన్నప్పటికీ, అక్షరాలు మాత్రం ఒకేలా లేవు.

నేడు ఉన్న అనేక అనువాదాలు లెనిన్‌గ్రాడ్‌ కోడెక్స్‌పై ఆధారపడి ఉన్నాయి. ఈ కోడెక్స్‌ సంపూర్ణ హెబ్రీ మసోరటిక్‌ వ్రాతప్రతులన్నింటిలోకెల్లా పాతది. ఇది, దాదాపు సా.శ. 1000వ సంవత్సరంలో నకలు చేయబడింది. అయితే రిప్స్‌, డ్రోస్‌నిన్‌లు కొరన్‌ అనే వేరే వ్రాతప్రతిని ఉపయోగించారు. లెనిన్‌గ్రాడ్‌ కోడెక్స్‌నీ “కొరన్‌ వ్రాతప్రతినీ పోల్చి చూస్తే, కేవలం ద్వితీయోపదేశకాండములోనే 41 అక్షరాల తేడా ఉంది” అని ఆర్థడాక్స్‌ రబ్బీ, హార్వార్డ్‌ యూనివర్సిటీలో మ్యాథమెటీషియనూ అయిన ష్లోమో స్టర్న్‌బర్గ్‌ వివరించాడు. మృత సముద్ర చుట్టల్లో 2,000 సంవత్సరాల కన్నా పూర్వమే నకలు చేయబడిన బైబిలు భాగాలు ఉన్నాయి. ఈ చుట్టల్లోని అక్షరాలకూ, తర్వాతి మసోరటిక్‌ వ్రాతప్రతుల్లోని అక్షరాలకు చాలా తేడా ఉంది. అచ్చు స్వరాలను చూపించే చిహ్నాలు అప్పటికీ రూపొందలేదు కాబట్టి, కొన్ని మృత సముద్ర చుట్టల్లో కొన్ని అక్షరాలకు అచ్చుస్వరాలను సూచించే అక్షరాలు చేర్చబడ్డాయి. మరికొన్ని చుట్టల్లో చాలా తక్కువ అక్షరాలు ఉపయోగించబడ్డాయి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న బైబిలు వ్రాతప్రతులనన్నింటినీ పోల్చి చూస్తే, వాటిలో అర్థం ఒకేలా ఉంది కానీ, అక్షరాలూ అక్షరాల సంఖ్యా భిన్నంగా ఉన్నాయి.

దాగివున్న సందేశం కోసం చేసే అన్వేషణ, బైబిలులోని అక్షరాలు మాటలు ఏ మాత్రం మారకుండా ఉంటేనే సాధ్యమవుతుంది. ఒక్క అక్షరం మారినా, క్రమమంతా మారిపోతుంది, ఏదైనా సందేశమంటూ అసలు ఉంటే అది కూడా మారిపోతుంది. దేవుడు బైబిలు ద్వారా తన సందేశాన్ని భద్రపరిచి ఉంచాడు. కానీ అక్షరాలు మారడం వంటి అంత ప్రాముఖ్యంకాని విషయాలను కూడా అంత పట్టించుకునే వ్యక్తిలాగా ప్రతి అక్షరాన్ని భద్రపరచలేదు. బైబిలులో ఏదైన సందేశాన్ని ఆయన దాచి ఉంచలేదని ఇది సూచించడం లేదా?—యెషయా 40:8; 1 పేతురు 1:24, 25.

బైబిలులో ఏదైనా కోడ్‌ దాగి ఉండవలసిన అవసరముందా?

“దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” అని అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా వ్రాశాడు. (2 తిమోతి 3:16, 17) బైబిలులో స్పష్టంగాను సూటిగాను ఉన్న సందేశం అర్థం చేసుకోవడం గానీ, ఆచరణలో పెట్టుకోవడం గానీ కష్టమేమీ కాదు. కాకపోతే చాలా మంది ప్రజలు దాన్ని నిర్లక్ష్యం చేయడానికే ఎన్నుకుంటారు. (ద్వితీయోపదేశకాండము 30:11-14) బైబిలులో బహిరంగంగా సమర్పించబడిన ప్రవచనాలు, అది దైవప్రేరేపితమైనదనేందుకు గట్టి ఆధారాన్నిస్తున్నాయి. * బైబిలు ప్రవచనాలు, దాగివుండే కోడ్‌లాగా వ్యక్తుల మేధాశక్తిని బట్టి నిర్ణయించగల్గేవి కావు. ప్రవచనములు ‘మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలిగేవి కావు.’—2 పేతురు 1:19-21.

‘మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మేము మీకు తెలుపలేదు’ అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు. (2 పేతురు 1:16) బైబిల్‌ కోడ్‌ అనే తలంపు యొక్క మూలం యూదుల గుప్తవాదంలో ఉంది. యూదుల గుప్తవాదం, ప్రేరేపిత బైబిలు వాక్యం యొక్క సరళమైన అర్థాన్ని అస్పష్టంగాను అర్థరహితంగాను మార్చే ‘చమత్కారపు కల్పిత కథలను’ ఉపయోగిస్తుంది. నిజానికి, హెబ్రీ లేఖనాలు అలాంటి గుప్తవాదాన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాయి.—ద్వితీయోపదేశకాండము 13:1-5; 18:9-13.

మనం దేవుడ్ని తెలుసుకునేందుకు మనకు సహాయపడే స్పష్టమైన బైబిలు సందేశమూ నిర్దేశమూ మనకు ఉన్నందువల్ల మనమెంత ధన్యులం! మన సృష్టికర్తను గురించి నేర్చుకునేందుకుగాను, సొంత వ్యాఖ్యానాల వల్ల లేదా కంప్యూటర్‌ కల్పితాల వల్ల ఉత్పన్నమైన కోడ్‌ అన్వేషించడం కన్నా బైబిలు సందేశాన్నీ నిర్దేశాన్నీ సంప్రదించడం ఎంత మేలు.—మత్తయి 7:24, 25.

[అధస్సూచీలు]

^ పేరా 9 హెబ్రీలోని అక్షరాలు అంకెల విలువలను కూడా సూచించవచ్చు. కనుక, హెబ్రీలో అంకెల ద్వారా కాక అక్షరాల ద్వారానే తేదీలను నిర్ణయించబడేవి.

^ పేరా 13 హెబ్రీ భాషలో అచ్చులు లేవు. చదువరులు, సందర్భాన్ని బట్టి అచ్చు స్వరాలను కలుపుకుని చదువుకునేవారు. సందర్భాన్ని పట్టించుకోకుండా వేర్వేరు అచ్చు స్వరాలను కలుపుకుని చదివితే మాటల అర్థం పూర్తిగా మారిపోగలదు. ఇంగ్లీష్‌లో అచ్చులు ఉన్నాయి కనుక, ఇంగ్లీష్‌ పుస్తకంలో మాటలకోసం ఆ విధంగా అన్వేషించడం మరింత క్లిష్టమైనదిగాను పరిమితిగలదిగాను ఉంటుంది.

^ పేరా 19 బైబిలు దైవప్రేరేపితమైనదని రూఢిపరిచే సమాచారం కోసం, దాని ప్రవచనాల గురించిన మరింత సమాచారం కోసం, వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషూర్‌ను చూడవచ్చు.