కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“బైబిలు గురించి మీకు బాగా తెలుసు”

“బైబిలు గురించి మీకు బాగా తెలుసు”

రాజ్య ప్రచారకుల నివేదిక

“బైబిలు గురించి మీకు బాగా తెలుసు”

యేసు తన పన్నెండేళ్లప్రాయంలో యెరూషలేము దేవాలయంలో ధైర్యంగా మతనాయకులతో మాట్లాడినప్పుడు “ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి” అని బైబిలు చెబుతుంది. (లూకా 2:47) అలాగే ఈనాడూ, అనేకమంది యౌవనులైన యెహోవా సేవకులు ధైర్యం తెచ్చుకుని దేవుని గురించి, బైబిలు గురించి తమ టీచర్లతోనూ, స్కూల్లోని విద్యార్థులతోనూ మాట్లాడినప్పుడు తరచూ వారు సంతోషకరమైన ఫలితాలనే పొందుతున్నారు.

14 ఏండ్ల టిఫానీ వాళ్ల క్లాసులో ఒకసారి దానియేలు 9:24-27 వచనాల్లోని 70 వారపు సంవత్సరాల వృత్తాంతం చర్చకొచ్చింది. ఉపాధ్యాయుడు ఆ వచనాల్ని గురించి కొన్ని వాస్తవాల్ని మాత్రం పేర్కొని వెంటనే విషయాన్ని మార్చేశాడు.

మొదట, టిఫానీ తన చెయ్యెత్తటానికి సంకోచించింది. “ఆ లేఖనాలను పూర్తిగా వివరించలేదని ఎందుకో నాకనిపించింది. అనుకోకుండా నా చెయ్యి పైకి లేచింది” అని ఆమె చెబుతుంది. అనేకమందికి అది అర్థం చేసుకోవటానికి క్లిష్టంగా ఉంది కాబట్టి, ఆ విషయంపై ఎవరో మాట్లాడాలని అనుకుంటున్నారని ఆ ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు.

ఆ ప్రవచనాన్ని వివరించే అవకాశం ఇచ్చినప్పుడు, టిఫానీ వెంటనే లేచి నిలబడి అప్పటికప్పుడు దాన్ని వివరించింది. ఆమె ముగించేటప్పటికి, క్లాసు రూమ్‌లో చీమ చిటుక్కుమంటే వినబడేంత నిశ్శబ్దం. టిఫానీ కాస్త గాబరాపడింది. మరుక్షణం హర్షధ్వానాలతో క్లాస్‌ దద్దరిల్లింది.

“అమోఘంగా ఉంది టిఫానీ, ఎంతో అద్భుతంగా ఉంది” అని ఉపాధ్యాయుడు మళ్ళీ మళ్ళీ అన్నాడు. ఆ వచనాలకు ఎంతో అర్థం ఉండివుంటుందని తనకు తెలుసునని ఆయన ఒప్పుకున్నాడు. కానీ వాటిని అంత వివరంగా చెప్పినవారిలో మొదటి వ్యక్తి టిఫానీనే. క్లాసు అయిపోయిన తర్వాత, బైబిలు గురించి నీకు అంత బాగా ఎలా తెలుసు అని టిఫానీని ఆయన అడిగాడు.

“ఎందుకంటే నేనొక యెహోవాసాక్షిని” అంటూ ఆమె ఇలా చెప్పింది: “అది నాకర్థమయ్యేంతవరకూ మా అమ్మానాన్నలు ఎన్నోసార్లు నాకు వివరించి చెప్పారు.”

క్లాస్‌మేట్లు కూడా ఆమెకున్న బైబిలు జ్ఞానానికి ఆశ్చర్యపోయారు. ఒక స్టూడెంట్‌ టిఫానీతో ఇలా అంది, “యెహోవాసాక్షులైన మీరు ఇంటింటికి ఎందుకు వెళ్తారో నాకిప్పుడు తెలిసింది; బైబిలు గురించి మీకు బాగా తెలుసు గనుకే.” వేరేవాళ్లు కూడా ఆమెకున్న నమ్మకాలను బట్టి ఆమెను ఇంకెప్పుడూ పరిహసించమని చెప్పారు.

టిఫానీ తన అనుభవాన్ని తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు, వాళ్లు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని ఉపాధ్యాయుడికి ఇమ్మని చెప్పారు. ఆమె అలా చేసి, దానియేలు ప్రవచనాన్ని వివరించే భాగాన్ని చూపించినప్పుడు అతను వెంటనే దాన్ని తీసుకుని అందుకు ధన్యవాదాలు చెప్పాడు.

నిజంగా, బైబిలుకూ దేవునికీ సంబంధించి తమ తల్లిదండ్రులు బోధించిన వాటిని గురించి క్రైస్తవ యౌవనస్థులు ధైర్యంగా మాట్లాడినప్పుడే వారు యెహోవాకు స్తుతినీ, ఘనతనూ ఇంకా తమకు ఆశీర్వాదాలను తెచ్చుకున్నవారౌతారు.—మత్తయి 21:15, 16.