కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏజియన్‌ సముద్రంలో మనుష్యులను పట్టే జాలరి పని

ఏజియన్‌ సముద్రంలో మనుష్యులను పట్టే జాలరి పని

ఏజియన్‌ సముద్రంలో మనుష్యులను పట్టే జాలరి పని

ఏజియన్‌ సముద్రానికి ఉత్తర పశ్చిమ దిశల్లో గ్రీస్‌, దక్షిణాన క్రీట్‌ (క్రేతు), తూర్పున టర్కీ దేశాలు ఉన్నాయి. అది తూర్పు మధ్యధరాలో చాలా భాగాన్ని ఆక్రమిస్తుంది. ఏజియన్‌ సముద్రప్రాంతం ఎన్నో గొప్ప ప్రాచీన నాగరికతలకు పుట్టినిల్లు. ఎన్నో చిన్న దీవులు ద్వీపసముదాయాలు ఈ సముద్రంలో చుక్కలు చుక్కలుగా కన్పిస్తాయి. ఈ దీవులపైనున్న ఇళ్ళు సూర్యకాంతిలో తెల్లగా మెరుస్తూ అక్కడక్కడ అలా విసిరేసినట్లుగా ఉంటాయి. ఈ దీవుల వైవిధ్యమైన ఆకృతుల్ని చూసి ఒక కవి ప్రేరణ పొంది ఇవి “ఎగసిపడే జూలుగల రాతి అశ్వాలు” అని వ్రాశాడు.

ఈ దీవులు ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కిన పర్యాటక స్థలాలుగా మారాయి అంటే అందులో ఆశ్చర్యమేముంది! వాటి ప్రకృతి సౌందర్యాన్ని అక్కడ నివసించే, పనిచేసే ప్రజల ఉదాత్తమైన లక్షణాలు ఇనుమడింపజేశాయి. వారు ముక్కుసూటియైనవారు, అతిథి ప్రియులు, అయినా స్వతంత్ర భావాలు గలవారు. ఈ ప్రాంతానికున్న వైశిష్ట్యానికి వీరు కూడా దోహదపడతారు.

ఈ ద్వీపాల్లో నివసించే చాలామందికి ఏజియన్‌ సముద్రంలో చేపలు పట్టడమే జీవనోపాధి. అయితే మరో ప్రాముఖ్యమైన “చేపలు పట్టే పని” ఇక్కడ గొప్ప ఫలితాల్ని తెస్తుంది. దేవుని రాజ్య సువార్తను ప్రకటించే సువార్తికులైన ‘మనుష్యులను పట్టుజాలరులు,’ ఏజియన్‌ దీవుల్లో సంచరిస్తూ క్రీస్తుకు శిష్యుల్ని తయారుచేస్తున్నారు.—మత్తయి 4:18, 19; లూకా 5:10.

దాదాపు 19 శతాబ్దాల క్రితం ఏజియన్‌లోని ద్వీపాలను క్రైస్తవ సువార్తికులు సందర్శించారు. దాదాపు సా.శ. 56 లో అపొస్తలుడైన పౌలు తన మూడవ మిషనరీ యాత్ర నుండి తిరిగివస్తూ లెజ్‌వోసు, కీయోసు, సమోసు, కోసు, రొదు (రోడ్స్‌) దీవుల్లో కొంతకాలంపాటు ఆగాడు. ప్రకటనా పనిలో నిత్యము అత్యంతాసక్తిని ప్రదర్శించిన పౌలు ఈ ద్వీపవాసుల్లో కొందరికి ప్రకటించే ఉంటాడు. (అపొస్తలుల కార్యములు 20:14, 15, 24; 21:1, 2) రోములో రెండు సంవత్సరాలు ఖైదులో ఉన్న తర్వాత ఆయన క్రేతును సందర్శించి అక్కడ క్రైస్తవ కార్యకలాపాల్లో భాగం వహించివుంటాడు. మొదటి శతాబ్దం చివర్లో అపొస్తలుడైన యోహాను “దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును” పత్మాసు ద్వీపంలో పరవాసిగా బహిష్కరించబడ్డాడు. (ప్రకటన 1:9) మరి ఆధునిక దిన సువార్త ప్రచారకులు ఈ దీవుల్లో తమ ప్రకటనా పనిని ఎలా నిర్వర్తిస్తున్నారు?

ప్రతిఫలదాయకమైన ప్రకటనా పనులు

ఈ ద్వీపసముదాయాల్లో ప్రకటించడం చాలా కష్టంతో కూడినది, సవాలుదాయకమైనది. అందుకు గొప్ప కృషీ, స్వయంత్యాగ స్ఫూర్తీ అవసరం. కొన్ని ద్వీపాలైతే ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి. సముద్రమార్గాన లేదా విమానంలో ప్రయాణించడం కొన్ని ద్వీపాలకైతే అప్పుడప్పుడు మాత్రమే సాధ్యమౌతుంది. కొన్ని ద్వీపాల్లోనైతే అసలు రవాణాసౌకర్యాలే ఉండవు, ప్రాముఖ్యంగా శీతాకాలంలో. సముద్రయానం కొన్నిసార్లు చాలా ప్రయాసతో కూడినది, మెల్టెమ్యా అనే పేరుగల ఉత్తర పవనాలు వీస్తున్నప్పుడైతే చెప్పనక్కర్లేదు. అంతేగాక అనేక ద్వీపాల్లోని గ్రామాలు దూరదూరంగా ఉంటాయి. రోడ్లు లేకపోవడం మూలంగా దుమ్ముతో కొట్టుకుపోయి ఉండడంతో వాటిని చేరుకోవడం చాలా కష్టం. కొన్ని గ్రామాల్ని చేరుకోవడానికైతే పడవే శరణ్యం.

ఉదాహరణకు ఈకారియా ద్వీపాన్నే తీసుకోండి. అక్కడున్న చిన్న సంఘంలోని 11 మంది రాజ్య సువార్త ప్రచారకులు ఆ ద్వీపంలో ఉన్న ప్రతి గ్రామాన్నీ దగ్గర్లో ఉన్న చిన్న చిన్న దీవుల్నీ కవర్‌ చేయలేరు. అందుకని సమోస్‌లోని క్రైస్తవ సహోదర సహోదరీలు ఈకారియాలోని, అలాగే ఫోర్నోయ్ని, పత్మాసు, లిప్సాసు దీవుల్లోని ప్రజలకు సహాయం చేయడానికి వస్తారు. ఇటీవల రెండు రోజుల ప్రత్యేక ప్రకటనా కార్యకలాపాలు జరిగిన సమయంలో సాక్షులు బైబిలు అంశాలను చర్చించే 650 పత్రికలను, 99 బ్రోషూర్లను, 25 పుస్తకాలను అందించగల్గారు! యెహోవా అంటే ఏమాత్రం తెలియని ప్రజల్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. వారు తమతోపాటు ఉండమనీ, బైబిల్ను గురించి ఇంకా తమకు బోధించమనీ సాక్షుల్ని ప్రాధేయపడ్డారు. ఒక స్త్రీ ఒక సాక్షితో ఇలా అంది: “చూడండి, ఇప్పుడు మీరు వెళ్లిపోతున్నారు. మరి నాకు బైబిల్ని గురించి ఇంకా చాలా ప్రశ్నలున్నాయే. నాకెవరు సహాయం చేస్తారు?” ఆ క్రైస్తవ సహోదరి ఫోను ద్వారా ఆమెతో చర్చిస్తానని వాగ్దానం చేసింది. ఆ విధంగా ఆ సహోదరి ఒక బైబిలు పఠనాన్ని ప్రారంభించింది.

ఒక ప్రాంతీయ పైవిచారణకర్త ఈకారియాను సందర్శించినప్పుడు ఒక్క వారాంతంలో ఆ ప్రాంతాన్నంతటినీ కవర్‌ చేయటానికి ఏర్పాట్లు చేశాడు. సమోసు నుండి దాదాపు 30 మంది రాజ్య ప్రచారకులు వస్తారని ఆయన వ్రాసుకున్నాడు. అలా వస్తున్న సహోదరులు ఒక హోటల్‌లో రెండు రాత్రులు బసచేయటానికీ, కార్లను వేరే వాహనాలను అద్దెకు తీసుకోవడానికీ డబ్బులు చెల్లించారు. రెండు రోజులు కుండపోతగా వర్షం కురిసింది, శని ఆదివారాల్లో వాతావరణం అనుకూలంగా ఉండదని సూచనలు అందాయి. కానీ సహోదరులు వెనుకాడక ప్రసంగి 11:4 లోని “గాలిని గురుతుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు” అనే మాటల్ని గుర్తు చేసుకున్నారు. చివరికి, వాతావరణం కాస్త మెరుగయ్యింది. తమ ప్రాముఖ్యమైన సందేశాన్ని అందిస్తూ పూర్తి ద్వీపాన్ని చుట్టి వచ్చిన తర్వాత సహోదరులు ఆనందంగా, సంతృప్తిగా తమ స్వగృహాలకు మరలివెళ్ళారు.

ఆండ్రోస్‌ ద్వీపంలో నివసిస్తున్న 16 మంది ప్రచారకులు తమ పూర్తి ద్వీపాన్ని కవర్‌ చేయటానికి చాలా కృషిచేశారు. ఇద్దరు సహోదరులు మారుమూలనున్న ఒక గ్రామాన్ని చేరుకుని అక్కడున్న వారందరికీ ప్రకటించాలని నిశ్చయం చేసుకున్నారు. వారు ఇళ్ళల్లోను, వీధుల్లోను, పొలాల్లోను ప్రజల్ని కలిశారు. చివరికి వారు పోలీస్‌ స్టేషన్‌కి కూడా వెళ్ళి అక్కడ కొంత సాహిత్యాన్ని అందించారు. గ్రామస్థులందర్నీ కలిశామన్న నమ్మకంతో వారు బయల్దేరబోయారు. గ్రామ చావడి నుండి కదులుతుండగా ఒక గ్రీకు ఆర్థడాక్స్‌ చర్చి పాదిరి వస్తుండటం కన్పించింది. ఆయనకు సాక్ష్యం ఇవ్వలేదని గుర్తించి వారు ఆయనకు ఒక చిన్న కరపత్రాన్నిచ్చారు, దాన్నాయన ఆనందంగా తీసుకున్నాడు. ఇక తమ ప్రకటనా పని ప్రయత్నాల్లో ఎవరూ తప్పిపోలేదని పూర్తి నమ్మకం కలిగింది!

క్రీట్‌ ద్వీపానికి దగ్గరగా ఉన్న గావ్‌డోస్‌ (లేదా కౌద) అనే చిన్న దీవిలో 38 మందే ప్రజలున్నారు, ఇది యూరప్‌ అంతట్లో పూర్తి దక్షిణాన ఉన్న ప్రాంతంగా పరిగణించబడుతుంది. (అపొస్తలుల కార్యములు 27:16) ఒక ప్రాంతీయ పైవిచారణకర్త, ఆయన భార్య, మరో వివాహిత జంట కలిసి ఇక్కడ ప్రకటిస్తూ మూడు రోజులు గడిపారు. డబ్బును ఆదా చేయడానికి వారు రాత్రిళ్ళు ఒక టెంటులో పడుకున్నారు. అక్కడి నివాసులందరికీ రాజ్య సువార్త అందించబడింది, వారు ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకోనందుకు సహోదరులు సంతోషించారు. వారు యెహోవాసాక్షుల్ని గురించి అటు మంచి గానీ ఇటు చెడు గానీ ఏమీ వినలేదు. అక్కడి పాదిరితో సహా స్థానిక ప్రజలందరు కలిసి 19 పుస్తకాలు, 13 బ్రోషూర్లు తీసుకున్నారు. ఒక చిన్న పడవలో సాక్షులు క్రీట్‌కి తిరిగి వస్తుండగా సముద్రం అల్లకల్లోలమై వారి ప్రాణాలకే ప్రమాదాన్ని కలుగజేసింది. “మేము సురక్షితంగా ఇంటికి చేరుకున్నందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించాము. కానీ యూరప్‌లో పూర్తి దక్షిణాన ఆయన నామాన్ని ఘనపర్చే అవకాశాన్నిచ్చినందుకు ఆయనకు స్తుతులు చెల్లించాము కూడా” అని వారన్నారు.

పత్మాసు ద్వీపంలో అపొస్తలుడైన యోహాను బైబిలులోని చివరి పుస్తకమైన ప్రకటనను వ్రాశాడు. ఇటీవల వరకూ పత్మాసులో యెహోవాసాక్షులెవరూ లేరు. సమోసులోని సహోదరులు ఆ ద్వీపంలో ప్రత్యేక ప్రకటనా పని చేయాలని జాగ్రత్తగా పథకాలు వేశారు. అక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఎదురౌతుందని వారికి తెలుసు, ఎందుకంటే గ్రీక్‌ ఆర్థడాక్స్‌ చర్చికి దానిపై గట్టిపట్టు ఉంది. ఒక స్త్రీ, తనకు సువార్తనందిస్తున్న ఇద్దరు సహోదరీల్ని లోపలికి ఆహ్వానించింది. ఆమె భర్త ఆ సహోదరీలను ఎవరు పంపించారని పదే పదే అడిగాడు. తాము ప్రతి ఇంటినీ సందర్శిస్తున్నామని వివరించినప్పుడు ఆయన, “ఇక్కడ చుట్టు ప్రక్కల ఉన్నవారెవరూ మిమ్మల్ని పంపించలేదు కదా?” అని మళ్ళీ మళ్ళీ అడిగాడు. ఆయన భార్య తాను జైరీలో ఉన్నప్పుడు యెహోవాసాక్షుల్ని గురించి విన్నది, ఆమె అటుతర్వాత ఈ సహోదరీలకు ఆ ఉదయం ఏమైందో వివరించింది. ఆమె ఇలా చెప్పింది: “తన సాక్షుల్ని ఈ ద్వీపానికి పంపించమని నేను రోజూలాగే యెహోవాకు ప్రార్థిస్తున్నాను. నా భర్త నన్ను చూసి నవ్వాడు. నేను మిమ్మల్ని గుమ్మం దగ్గర చూసినప్పుడు ఆశ్చర్యపోయాను, ఆయనా ఆశ్చర్యపోయాడు. అందుకనే మిమ్మల్ని మా ఇంటికెవరు పంపించారని మళ్ళీ మళ్ళీ అడిగాడు.” వెంటనే ఆ స్త్రీతో బైబిలు పఠనం ప్రారంభించబడింది. పదినెలలపాటు ఫోను ద్వారా పఠనం సాగింది, దీని మూలంగా అటు ఆసక్తిని చూపించిన ఆ స్త్రీకి ఇటు సహోదరికీ డబ్బు బాగా ఖర్చయ్యింది. ఆమె బాప్తిస్మం పొందింది, అపొస్తలుడైన యోహాను 1,900 సంవత్సరాల క్రితం ఏకాకిగా ఉన్న ఆ ద్వీపంలో ఇప్పుడు ఆమె ఒక్కర్తే యెహోవాసాక్షి.

నౌకాశ్రయంలో “చేపలు పట్టడం”

ఏజియన్‌ సముద్రపు దీవుల్లోని నౌకాశ్రయాల్లో ప్రతి వేసవికాలంలో అనేక పెద్ద నౌకలు ఆగుతాయి. వేసవి సెలవులు గడపటానికి అనేకమంది పర్యాటకులు వీటిలో వస్తారు. ఆ విధంగా వేర్వేరు జాతులవారిని భాషలవారిని కలిసేందుకు యెహోవాసాక్షులకు చక్కని అవకాశం లభిస్తుంది. సంఘాలు బైబిలు సాహిత్యాన్ని అనేక భాషల్లో స్టాకు ఉంచుతారు. పర్యాటకుల చేతుల్లో ప్రచారకులు వేలాది పత్రికల్ని ఉంచుతారు. కొన్ని పెద్ద నౌకలు వారానికొక్కసారి అదే నౌకాశ్రయానికి వస్తుంటాయి. అలా సహోదరులకు నౌక సిబ్బందితో పునర్దర్శనాలు, బైబిలు పఠనాలు చేయటానికి గొప్ప అవకాశాలు లభిస్తుంటాయి.

1996వ సంవత్సరం వేసవిలో రోడ్స్‌లో పూర్తికాల పరిచారకురాలైన ఒక సహోదరి జమైకాకు చెందిన ఒక యౌవనస్థుడికి సాక్ష్యం ఇచ్చింది. ఆయన ఆ నౌకాశ్రయానికి ప్రతి శుక్రవారం వచ్చే ఒక నౌకలో పనిచేస్తాడు. ఆ తర్వాతి శుక్రవారం అదే ద్వీపంలో జరుగబోయే జిల్లా సమావేశానికి ఆహ్వానించబడ్డాడు. చేతిలో ఇంగ్లీషు బైబిలుతో ఈ పయినీరు సహోదరి, కార్యక్రమంలో అందించబడే బైబిలు సత్యాల్లో కనీసం కొన్నింటిని ఆయన అర్థంచేసుకోవటానికి సహాయం చేసింది. ఆ యౌవనస్థుడు ఆ సమావేశంలో సాక్షులు చూపించిన ప్రేమ, వారి హృదయపూర్వకమైన ఆసక్తినిబట్టి చాలా ప్రభావితుడయ్యాడు. ఆ తర్వాతి శుక్రవారం ఆయన ఇద్దరు పయినీరు సహోదరులను నౌకలోనికి ఆహ్వానించాడు. పయినీర్లు తమతోపాటు ఇంగ్లీషు, స్పానిష్‌ భాషల్లో సాహిత్యాన్ని తీసుకువెళ్ళారు. వారి సాక్ష్యపు బ్యాగులు ఒక గంటలోపలే ఖాళీ అయ్యాయి. ఆ జమైకా యువకుడు వేసవి చివరివరకూ ప్రతి శుక్రవారం బైబిలు పఠనం చేశాడు. తర్వాతి వేసవికి మళ్ళీ తిరిగివచ్చి తన పఠనాన్ని కొనసాగించాడు. అయితే ఈసారి ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో తన ఉద్యోగాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక చివరికి వెనక్కి వెళ్ళిపోయాడు. రోడ్స్‌లోని సహోదరులు, 1998 తొలిభాగంలో ఈ యువకుడు బాప్తిస్మం పొందాడని తెలుసుకుని ఎంతగా సంతోషించారో!

వలస వచ్చే “చేపల”పై వల

ఏజియన్‌ సముద్రంలోకి పెద్ద మొత్తంలో సార్డిన్‌, స్వోర్డ్‌ఫిష్‌ వంటి చేపలు వలసవచ్చి చివరికి అనుభవజ్ఞులైన జాలర్ల వలలో పడతాయి. అదే విధంగా, తూర్పు యూరప్‌ దేశాల నుండి గ్రీస్‌కు వలసవచ్చే అనేకమంది కార్మికులు సహృదయులని రాజ్య సువార్త ప్రచారకులు కనుగొన్నారు.

రెజీ యెహోవాను గురించి, ఆయన సంకల్పాల గురించి కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో మొట్టమొదటిసారిగా చదివినప్పుడు ఆమెకు పది సంవత్సరాలు. అది అల్బేనియాలో. మూడు సంవత్సరాల తర్వాత ఆమె తన కుటుంబంతోపాటు రోడ్స్‌ ద్వీపానికి తరలివచ్చింది. ఒకరోజు రెజీ ఈ క్రొత్త దేశంలో ఆయన ప్రజల్ని కనుగొనడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించింది. తర్వాతి రోజు తనకు సుపరిచితమైన అవే కావలికోట, తేజరిల్లు! పత్రికల్ని ఆమె తండ్రి పట్టుకునివచ్చాడు. రెజీకి సంతోషానందాలు. తన తండ్రికి ఆ పత్రికలనిచ్చిన సహోదరిని రెజీ కలువగల్గింది, త్వరలోనే నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలోనుండి పఠనాన్ని ప్రారంభించింది. కొన్నిసార్లైతే ఒకే రోజున మూడుసార్లు పఠనం చేయాలని ఆమె అడిగేది! రెండు నెలల తర్వాత ఆమె బాప్తిస్మం పొందని ప్రచారకురాలిగా అయ్యింది, చివరికి 1998 మార్చిలో 14 ఏండ్ల వయస్సులో బాప్తిస్మం పొందింది. అదే రోజు ఆమె సహాయ పయినీరు సేవ ప్రారంభించింది, ఆరు నెలలకు క్రమ పయినీరు అంటే పూర్తికాల పరిచారకురాలు అయ్యింది.

కోసు ద్వీపంలోని ఒక సహోదరుడు రష్యా నుండి వచ్చిన కొందరితో బైబిలు పఠనాన్ని చేస్తున్నాడు. బైబిలు పఠించడంలో ఆసక్తివున్న వారెవరైనా మీకు తెలిసినవాళ్ళలో ఉన్నారా అని అడిగినప్పుడు వారాయనను ఒక ఆర్మీనియా దంపతుల దగ్గరికి పంపించారు. ఆయన పేరు లియోనిడాస్‌, భార్య పేరు ఓఫ్లీయా; వీరు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో నివసిస్తారు. సహోదరులు అక్కడికి వెళ్ళి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఆర్మీనియా దంపతుల దగ్గర వాచ్‌ టవర్‌ సొసైటీ ప్రచురించిన సాహిత్యం ఆర్మీనియా భాషలోను, రష్యా భాషలోను ఒక బ్యాగు నిండా ఉంది! తాము యెహోవాసాక్షులతో బైబిలును పఠించామనీ, బాప్తిస్మం పొందని ప్రచారకులయ్యేంతగా అభివృద్ధి సాధించామనీ వారు చెప్పారు. రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో వారు తమ స్వదేశాన్ని విడిచి రావల్సివచ్చింది. వారు కోసు ద్వీపానికి చేరుకోగానే, అప్పటికే అక్కడున్న ఆయన తల్లి చెల్లిలతో బైబిలును పరిశీలించనారంభించారు. ఇప్పుడు సాక్షులకు మూడు బైబిలు పఠనాలు ఒక్కసారే లభించాయి—ఒకటి ఓఫ్లీయాతో, ఒకటి లియోనిడాస్‌తో, మరొకటి ఆయన తల్లి చెల్లిలతో. ఇలా బైబిలు పఠనం చేయటానికి మోటర్‌సైకిలు మీద వారానికి మూడుసార్లు 30 కిలోమీటర్ల దూరం వెళ్ళిరావల్సి వచ్చింది. కొన్ని నెలల తర్వాత లియోనిడాస్‌ దంపతులు బాప్తిస్మం పొందారు. స్థానిక సహోదరుల స్వయంత్యాగ స్ఫూర్తికి ఎంత చక్కని ప్రతిఫలం లభించింది!

యెహోవాయే వృద్ధిని కలుగజేస్తాడు

ఈ ఏజియన్‌ ద్వీపాల్లోని 2,000 మంది రాజ్య ప్రచారకుల అవిశ్రాంత ప్రయత్నాలపై యెహోవా ఆశీర్వాదాలను కుమ్మరించాడన్నది స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు అక్కడ యెహోవాసాక్షుల 44 సంఘాలున్నాయి, 25 గుంపులు ఉన్నాయి. ఈ గుంపుల్లో 17 విదేశీభాషవి, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలె”నన్నదే యెహోవా చిత్తం. (1 తిమోతి 2:4) దానికితోడు, 13 మంది ప్రత్యేక పయినీర్లు మారుమూలనున్న ప్రాంతాల్ని చేరుకోవటానికి యథాశక్తితో కృషిచేస్తున్నారు.

శతాబ్దాలుగా ఏజియన్‌ సముద్ర ప్రాంతం సాంస్కృతిక అభివృద్ధికీ, వాణిజ్యాభివృద్ధికి కేంద్రంగా ఉంది. ఇటీవలి దశాబ్దాల్లో లక్షలాదిమంది పర్యాటకులకు అదొక అభిమాన పర్యటనా ప్రాంతంగా మారింది. కానీ మరి ప్రాముఖ్యంగా, రాజ్య ప్రచారకులైన ‘మనుష్యులను పట్టుజాలరులు’ ఈ ద్వీపాల్లో యెహోవాను స్తుతించాలని ఇష్టపడుతున్న ఎంతోమంది యథార్థహృదయులను కనుగొన్నారు. వారందరూ కలిసి ఈ ప్రవచనాత్మక ఆహ్వానానికి అద్భుతంగా ప్రతిస్పందించారు: “ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక.”—యెషయా 42:12.

[22వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఏజియన్‌ సముద్రం

గ్రీస్‌

లెస్‌వోస్‌

కీయోసు

సమోసు

ఈకారియా

ఫోర్నోయి

పత్మాసు

కోసు

రోడ్స్‌

క్రీట్‌

టర్కీ

[23వ పేజీలోని చిత్రం]

లెస్‌వోస్‌ ద్వీపం

[24వ పేజీలోని చిత్రం]

పత్మాసు ద్వీపం

[24వ పేజీలోని చిత్రం]

క్రీట్‌ ద్వీపం