కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రవచించినట్లుగా సమస్తమూ నూతనమైనవిగా చేయటం

ప్రవచించినట్లుగా సమస్తమూ నూతనమైనవిగా చేయటం

ప్రవచించినట్లుగా సమస్తమూ నూతనమైనవిగా చేయటం

“సింహాసనాసీనుడైయున్నవాడు—ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు —ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి . . . [అని] చెప్పుచున్నాడు.”ప్రకటన 21:5.

1, 2. భవిష్యత్తు ఎలా ఉంటుందనే దాన్ని పరిశీలించడం గురించి అనేకమంది ఎందుకని సరిగ్గానే సంశయిస్తుంటారు?

‘రే పేమి జరుగుతుందో ఎవరికి తెలుసు?’ అని మీరు ఎప్పుడైనా అన్నారా లేక అనుకున్నారా? భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఊహించటానికీ—లేదా భవిష్యత్తును ఇప్పుడే చెప్తామని గర్వంగా చెప్పుకునే వాళ్లని నమ్మటానికీ ప్రజలు ఎందుకు సంశయిస్తారో మీరు అర్థం చేసుకోవచ్చు. రానున్న నెలల్లో లేక సంవత్సరాల్లో జరగబోయే దాని గురించి ఖచ్చితంగా చెప్పగలిగే సామర్థ్యం మానవులకు అసలు లేదు.

2ఫోర్బ్స్‌ ఎఎస్‌ఎపి పత్రిక, తన సంచికనొకదాన్ని కాలము అనే అంశానికే అంకితం చేసింది. అందులో ప్రఖ్యాత టీవీ డాక్యుమెంటరీ ప్రయోక్త రాబర్ట్‌ క్రిన్జ్‌లే ఇలా వ్రాశాడు: “కాలం చివరకు మనల్నందర్నీ చిన్నబుచ్చుతుంది, కానీ కాలం చేతుల్లో భవిష్యకారులు అనుభవించినంత అవమానాన్ని మరెవ్వరూ అనుభవించరు. భవిష్యత్తును ఊహించడానికి ప్రయత్నించడమనేది ఒక ఆట, దాంట్లో మనం దాదాపు ఎప్పుడూ ఓడిపోతాం. . . . అయినా, నిపుణులమని చెప్పుకునేవాళ్లు భవిష్యత్తు గురించి అంచనాలు వేస్తూనే ఉంటారు.”

3, 4. (ఎ) నూతన సహస్రాబ్ది గురించి కొందరు ఏ ఆశాభావాన్ని కలిగివున్నారు? (బి) భవిష్యత్తు గురించి ఇతరులకు ఏ వాస్తవమైన ఊహలున్నాయి?

3 నూతన సహస్రాబ్దిపై ఇంత అవధానం చూపిస్తుండటం మూలంగా, చాలామంది ప్రజలు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని అనిపించవచ్చు. క్రితం సంవత్సరం ప్రారంభంలో, మెక్‌లీన్స్‌ పత్రిక ఇలా చెప్పింది: “అనేకమంది కెనడా దేశస్థులకు 2000వ సంవత్సరమనేది బహుశా కేలండర్లోని మరో సంవత్సరం మాత్రమే అయ్యుండొచ్చు, కాని అదీ, నిజమైన ఓ నూతన ఆరంభమూ ఒకేసారి జరగవచ్చు.” యార్క్‌ యూనివర్శిటీలోని ప్రొఫెసర్‌ క్రిస్‌ డ్విడ్నీ, ఆశావాదానికి ఒక కారణాన్ని ఇచ్చాడు: “సహస్రాబ్ది అంటే నిజంగా భయంకరమైన ఒక శతాబ్దం విషయంలో మన చేతుల్ని కడుక్కోవటమనే.”

4 అయితే అది, కేవలమొక ఆశాపూరిత ఆలోచనలా మాత్రమే అన్పిస్తుందా? కెనడాలో జరిపిన ఒక సర్వేలో కేవలం 22 శాతం మంది మాత్రమే “2000వ సంవత్సరం లోకానికొక నూతన ఆరంభాన్ని తీసుకువస్తుందని నమ్ముతున్నా”మని తెలియజేశారు. నిజానికి, అందులో దాదాపు సగంమంది 50 ఏళ్లలోగా “మరో ప్రపంచవ్యాప్త పోరాటం”—ప్రపంచ యుద్ధం జరుగుతుందని “ఊహిస్తున్నారు.” ఒక కొత్త సహస్రాబ్దం మన సమస్యలను తొలగించి, సమస్తాన్ని నూతనమైనవిగా చేయలేదని అనేకమంది స్పష్టంగా గ్రహించారు. బ్రిటన్‌లోని రాయల్‌ సొసైటీ మాజీ అధ్యక్షుడైన మిఖాయేల్‌ అటీయ ఇలా వ్రాశాడు: “త్వరితగతిని జరుగుతున్న మార్పు మూలంగా . . . 21వ శతాబ్దం, మన యావత్‌ నాగరికతకు క్లిష్టమైన సవాళ్లను తెస్తుంది. జనాభా పెరుగుదలా, పరిమిత వనరులూ, పర్యావరణ కాలుష్యం, విస్తృతమైన పేదరికం వంటి సమస్యలు ఇప్పటికే మనమీద వచ్చి పడ్డాయి, వాటిని అవశ్యం తొలగించాలి.”

5. భవిష్యత్తులో సంభవించనైయున్న దాని గురించి మనం ఎక్కడ సరైన సమాచారాన్ని తెలుసుకోగలము?

5 మీరు ఇలా భావించవచ్చు: ‘భవిష్యత్తులో ఏం జరగనైవుందో మానవులు ముందుగా చెప్పలేరు గనుక, భవిష్యత్తును ఉపేక్షిస్తే సరిపోదా?’ సరిపోదు అన్నదే దానికి జవాబు ! నిజమే, భవిష్యత్తులో ఏం జరగనైవుందో మానవులు ఖచ్చితంగా చెప్పలేరు, అంతమాత్రం చేత ఎవ్వరూ చెప్పలేరని మనం అనుకోకూడదు. మరి, ఎవరు చెప్పగలరు, దాని విషయంలో మనం ఎందుకు ఆశావాదంతో ఉండాలి? నాలుగు నిర్దిష్టమైన ప్రవచనాల్లో మీకు సంతృప్తికరమైన సమాధానాలు దొరుకుతాయి. అవి అనేకుల దగ్గరున్న, అనేకులు చదివే, అలాగే ఎంతో అపార్థంచేసుకోబడిన, ఎంతో అలక్ష్యానికి గురైన గ్రంథంలో అంటే బైబిల్లోనే నమోదు చేయబడి ఉన్నాయి. బైబిలు గురించి మీరేమనుకున్నా, దానితో మీకు ఎంతో పరిచయమున్నా, ఆ నాలుగు ప్రాథమిక వచనాలనూ మీరు పరిశీలించడం మీకే ప్రయోజనకరం. నిజానికి అవి ఎంతో తేజోవంతమైన భవిష్యత్తు గురించి ప్రవచిస్తున్నాయి. అంతేగాక, మీ భవిష్యత్తూ, మీరు ప్రేమించేవారి భవిష్యత్తూ ఏమైవుండగలదో ఆ నాలుగు కీలక ప్రవచనాలు క్లుప్తంగా తెలియజేస్తాయి.

6, 7. యెషయా ఎప్పుడు ప్రవచించాడు, ఆయన ప్రవచనాలు ఎలాంటి అబ్బురమైన నెరవేర్పును కలిగివున్నాయి?

6 మొదటిది యెషయా 65వ అధ్యాయంలో ఉంది. దాన్ని చదివే ముందు, ఆ సమాచారం ఎప్పుడు వ్రాయబడింది, అది ఏ పరిస్థితితో వ్యవహరించింది అన్న విషయాలను మనస్సులో స్పష్టంగా ఉంచుకోండి. ఆ మాటలను వ్రాసిన దేవుని ప్రవక్తయైన యెషయా యూదా రాజ్యం అంతంకావటానికి ఒక శతాబ్దం ముందు జీవించాడు. బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసి, దాని నివాసులను చెరపట్టుకొని పోయేందుకు అనుమతించడం ద్వారా యెహోవా అవిశ్వాసులైన యూదులపైనుండి తన కాపుదలను తీసివేసినప్పుడు అంతం వచ్చింది. యెషయా దాన్ని ప్రవచించిన నూరేళ్ల తర్వాత అది జరిగింది.—2 దినవృత్తాంతములు 36:15-21.

7 నెరవేర్పు యొక్క చారిత్రక నేపథ్యంగా, బబులోనును కూలద్రోయబోయే పారశీకుని పేరు అంటే, అప్పటికింకా జన్మించనివాని పేరు కోరెషు అని, దేవుని నిర్దేశనంతో యెషయా ప్రవచించాడని గుర్తు తెచ్చుకోండి. (యెషయా 45:1) యూదులు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళేందుకు కోరెషు సా.శ.పూ. 537 లో రంగాన్ని సిద్ధంచేశాడు. ఆశ్చర్యకరంగా, ఆ పునరుద్ధరణను గురించి 65వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా యెషయా ప్రవచించాడు. ఇశ్రాయేలీయులు తమ స్వదేశంలో ఆనందించబోయే పరిస్థితిపైనే ఆయన కేంద్రీకరించాడు.

8. ఏ సంతోషకరమైన భవిష్యత్తును యెషయా ప్రవచించాడు, ఏ వ్యక్తీకరణ ప్రత్యేకించి ఆసక్తికరమైనది?

8 మనం దాన్ని యెషయా 65:17-19 వచనాల్లో ఇలా చదువుతాము: “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను; రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు.” నిస్సందేహంగా, బబులోనులో యూదులకు తెలిసిన పరిస్థితులకన్నా ఎంతో శ్రేష్ఠమైనవిగా ఉండబోయే పరిస్థితులను గురించి యెషయా వర్ణించాడు. ఆయన ఆనందకరమైన, ఉల్లాసకరమైన దాన్ని గురించి ప్రవచించాడు. ఇప్పుడు, ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ అన్న వ్యక్తీకరణను చూడండి. బైబిల్లో ఈ పదబంధం కనిపించే నాలుగు సార్లలో ఇది మొదటిది, ఆ నాలుగు ప్రకరణాలు మన భవిష్యత్తుతో ప్రత్యక్ష సంబంధాన్ని కల్గివున్నాయి, దాన్ని ప్రవచిస్తున్నాయి కూడా.

9. యెషయా 65:17-19 నెరవేర్పులో ప్రాచీన యూదులు ఎలా ఇమిడి ఉన్నారు?

9యెషయా 65:17-19 వచనాల తొలి నెరవేర్పులో, యెషయా ఖచ్చితంగా ప్రవచించినట్లుగా, తమ స్వదేశానికి తిరిగివచ్చి, అక్కడ స్వచ్ఛారాధనను పునరుద్ధరించిన ప్రాచీన యూదులు చేరివున్నారు. (ఎజ్రా 1:1-4; 3:1-4) నిజమే, వాళ్లు విశ్వంలో మరెక్కడో కాక వాళ్లు నివసిస్తున్న ఇదే గ్రహంపైనున్న తమ స్వదేశానికి తిరిగి వచ్చారన్న విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఆ గ్రహింపు ద్వారా, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అంటే యెషయా భావమేంటో తెలుసుకోగలము. నోస్ట్రడామస్‌ లేక ఇతర మానవ భవిష్యకారులు ప్రవచించిన అస్పష్టమైన ప్రవచనాల గురించి కొంతమంది చేస్తున్నట్టుగా మనం ఊహాగానాలు చేయవలసిన అవసరం లేదు. యెషయా భావమేంటో బైబిలే స్పష్టపరుస్తోంది.

10. యెషయా ప్రవచించిన క్రొత్త “భూమి”ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?

10 బైబిల్లో “భూమి” అనే పదం ఎల్లప్పుడూ మన భూగోళాన్నే సూచించదు. ఉదాహరణకు, కీర్తన 96:1, NW అక్షరార్థంగా ఇలా చెబుతుంది: ‘సర్వభూమీ, యెహోవామీద కీర్తన పాడు.’ విశాల సముద్రాలతో శిలలతో కూడిన మన గ్రహం పాడలేదని మనకు తెలుసు. ప్రజలే పాడగలరు. అవును, కీర్తన 96:1వ వచనం భూజనులను సూచిస్తోంది. * అయితే యెషయా 65:17 “క్రొత్త ఆకాశమును” కూడా ప్రస్తావించింది. “భూమి,” తమ స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రజల క్రొత్త సమాజాన్ని సూచిస్తున్నట్లైతే, “క్రొత్త ఆకాశము” సంగతేంటి?

11. ‘క్రొత్త ఆకాశము’ అనే పదబంధం ఏ విషయాన్ని చూపిస్తున్నాయి?

11 మెక్‌క్లింటాక్‌, స్ట్రాంగ్‌లు రచించిన సైక్లోపీడియా ఆఫ్‌ బిబ్లికల్‌, థియోలాజికల్‌, అండ్‌ ఎక్లిసియాస్టికల్‌ లిటరేచర్‌ ఇలా చెబుతుంది: “సహజ ఆకాశం భూమికి పైగా ఉండి భూమిని ఎలాగైతే పరిపాలిస్తుందో అలాగే . . . ప్రవచనాత్మక దర్శన దృశ్యం ఎక్కడ వర్ణించబడినప్పటికీ, అందులోని ఆకాశం . . . పరిపాలించే శక్తులను సూచిస్తుంది.” తర్వాత “ఆకాశము, భూమి” అనే పదబంధాన్ని గురించి మాట్లాడుతూ, ‘ప్రవచనాత్మక భాషలో ఆ పదబంధం వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తుల రాజకీయ స్థితిని సూచిస్తుంది. ఆకాశం సర్వాధిపత్యాన్నీ; భూమి సామాన్యప్రజను అంటే అధికారులచే పరిపాలించబడే ప్రజల్నీ సూచిస్తుంది’ అని ఆ సైక్లోపీడియా వివరిస్తుంది.

12. ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని’ ప్రాచీన యూదులు ఎలా చవిచూశారు?

12 యూదులు తమ స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, ఒక క్రొత్త వ్యవస్థ అని పిలువగలదాన్ని వాళ్లు పొందారు. అప్పుడు క్రొత్త పరిపాలనా యంత్రాంగం వెలసింది. రాజైన దావీదు వంశస్థుడైన జెరుబ్బాబెలు అధికారిగా, యెహోషువ ప్రధాన యాజకునిగా అయ్యారు. (హగ్గయి 1:1, 12; 2:21; జెకర్యా 6:11) వీరు “క్రొత్త ఆకాశము”గా ఏర్పడ్డారు. ఎవరిపై? యెరూషలేమునూ, దానిలోని దేవాలయాన్నీ యెహోవా ఆరాధన నిమిత్తం పునర్నిర్మించటానికి తమ స్వదేశానికి తిరిగి వచ్చిన పరిశుభ్రపర్చబడిన ప్రజల సమాజమైన “క్రొత్త భూమి”పై ఈ “క్రొత్త ఆకాశము” ఏర్పడింది. అందుకని, సరిగ్గా ఈ భావంలోనే, ఆ కాలంలోని యూదులు ఇమిడివున్న నెరవేర్పులో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉన్నాయి.

13, 14. (ఎ) ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ అనే పదబంధం ఉన్న మరో ఏ సందర్భాన్ని మనం పరిశీలించాలి? (బి) పేతురు ప్రవచనం ఈ సమయంలో ఎందుకు ప్రత్యేకించి ఆసక్తికరమైనది?

13 అసలు విషయాన్ని మర్చిపోకండి. మనం ఇక్కడ చర్చిస్తున్నది కేవలం ఏదో బైబిలు వచనాల అర్థమో లేదా ప్రాచీన చరిత్రనో కాదు. ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ అనే పదబంధం కనబడే మరోచోటుకు వెళ్ళటం ద్వారా మీరు దాన్ని గ్రహించగలరు. 2 పేతురు 3వ అధ్యాయంలో ఈ పదబంధాన్ని అలాగే మన భవిష్యత్తు అందులో ఇమిడివుండటాన్ని మీరు చూస్తారు.

14 పేతురు ఈ ఉత్తరాన్ని, యూదులు తమ స్వదేశానికి తిరిగి వచ్చిన 500 ఏండ్ల తర్వాత వ్రాశాడు. యేసు అపొస్తలులలో ఒకనిగా పేతురు, 2 పేతురు 3:2 లో పేర్కొనబడిన “ప్రభువైన” క్రీస్తు అనుచరులకు వ్రాస్తున్నాడు. 4వ వచనం [NW]లో పేతురు మన కాలానికి వర్తించే ‘వాగ్దానం చేయబడిన యేసు ప్రత్యక్షత’ గురించి ప్రస్తావిస్తున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయం నుండి, దేవుని పరలోక రాజ్యానికి పరిపాలనాధికారం గలవానిగా యేసు ప్రత్యక్షత ప్రారంభమైందని సాక్ష్యాధారాలు చూపిస్తున్నాయి. (ప్రకటన 6:1-8; 11:15, 18) పేతురు ఈ అధ్యాయంలో ప్రవచించిన వేరే విషయం దృష్ట్యా ఇది ప్రత్యేక అర్థాన్ని సంతరించుకుంటుంది.

15. ‘క్రొత్త ఆకాశమును’ గూర్చిన పేతురు ప్రవచనం ఎలా నెరవేర్పును కలిగివుంది?

15 మనం 2 పేతురు 3:13 లో ఇలా చదువుతాము: “మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” పరలోకంలో సింహాసనాసీనుడైన యేసు “క్రొత్త ఆకాశము”లో కీలకమైన పరిపాలకునిగా ఉన్నాడని మీరిప్పటికే తెలుసుకుని ఉంటారు. (లూకా 1:32, 33) అయితే, పరిపాలించేది ఆయన ఒక్కడు మాత్రమే కాదని ఇతర బైబిలు వచనాలు సూచిస్తున్నాయి. అపొస్తలులకూ వారిలాంటి మరితరులకూ పరలోకంలో స్థానం ఉంటుందని యేసు వాగ్దానం చేశాడు. హెబ్రీయుల పుస్తకంలో అపొస్తలుడైన పౌలు అటువంటి వారిని “పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందిన” వారు అని వర్ణించాడు. (ఇటాలిక్కులు మావి.) అంతేగాక ఈ గుంపులోనివారు పరలోకంలో తనతోపాటు సింహాసనాలపై కూర్చుంటారని యేసు చెప్పాడు. (హెబ్రీయులు 3:1; మత్తయి 19:28; లూకా 22:28-30; యోహాను 14:2, 3) అసలు విషయం ఏమిటంటే క్రొత్త ఆకాశములో భాగంగా ఇతరులు యేసుతోపాటు పరిపాలిస్తారన్నదే. మరైతే పేతురు పేర్కొంటున్న “క్రొత్త భూమి” ఏమిటి?

16. ఏ ‘క్రొత్త భూమి’ ఇప్పటికే ఉనికిలో ఉంది?

16 ప్రాచీన కాలంలోని నెరవేర్పులాగానే—యూదులు తమ స్వదేశానికి తిరిగిరావటంలాగానే—2 పేతురు 3:13 వచనానికైన నేటి నెరవేర్పులో కూడా ఈ క్రొత్త ఆకాశము యొక్క పరిపాలనకు లోబడే ప్రజలు ఇమిడివున్నారు. నేడు అటువంటి అధికారానికి ఆనందంగా విధేయత చూపిస్తున్న లక్షలాదిమందిని మీరు కనుగొనవచ్చు. వారందరూ దాని విద్యా కార్యక్రమం నుండి ప్రయోజనం పొందుతూ, బైబిల్లో ఉన్న దాని నియమాలను అనుసరించటానికి కృషిచేస్తున్నారు. (యెషయా 54:13) వీరే “క్రొత్త భూమి”కి ఆధారమౌతారు, ఎలాగంటే అన్ని జనాంగాల నుండి, భాషల నుండి, జాతుల నుండి వచ్చిన వీరు ఒక భూసమాజంగా ఏర్పడుతున్నారు, వారు పరిపాలిస్తున్న రాజైన యేసుక్రీస్తుకు లోబడి కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఒక విశేషమైన వాస్తవం ఏమిటంటే మీరు కూడా వీరిలో భాగం కాగలరు !—మీకా 4:1-4.

17, 18. భవిష్యత్తులోకి చూడటానికి 2 పేతురు 3:13 లోని మాటలు ఎందుకు మనకు కారణాన్ని ఇస్తున్నాయి?

17 విషయం ఇంతటితో సమాప్తం అనీ, భవిష్యత్తును గురించి సవివరమైన అంతర్దృష్టి ఏమీ లేదనీ భావించకండి. నిజానికి, 2 పేతురు 3వ అధ్యాయం సందర్భాన్ని పరిశీలిస్తే, మున్ముందు గొప్ప మార్పు వస్తుందన్న దానికి సూచనలను మీరక్కడ చూస్తారు. 5, 6 వచనాల్లో నోవహు కాలంలోని జలప్రళయాన్ని గురించి, అప్పటి దుష్టలోకాన్ని అంతం చేసిన జలప్రళయాన్ని గురించి పేతురు వ్రాస్తున్నాడు. తర్వాత 7వ వచనంలో ఆయన, “ఇప్పుడున్న ఆకాశమును భూమియు”—అంటే అధికారాలూ ప్రజలూ కూడా, “భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు” భద్రముచేయబడి ఉన్నాయని చెబుతున్నాడు. (ఇటాలిక్కులు మావి.) ‘ఆకాశము భూమి’ అన్న పదబంధం మన భూగోళాన్ని కాదుగానీ ప్రజల్నీ వారి పరిపాలకుల్నీ సూచిస్తుందని ఇది స్థిరపరుస్తుంది.

18 ఆ తర్వాత క్రొత్త ఆకాశానికీ, క్రొత్త భూమికీ మార్గాన్ని సిద్ధపరుస్తూ, 13వ వచనంలో ప్రస్తావించబడిన రానైయున్న యెహోవా దినం ఒక గొప్ప పరిశుభ్రపర్చే పనిని తీసుకు వస్తుందని పేతురు వివరిస్తున్నాడు. ఆ వచనం చివర్లో “వాటియందు నీతి నివసించును” అని ఉందని గమనించండి. మంచిని తీసుకువచ్చే గొప్ప మార్పులు జరుగుతాయని ఇది సూచించటం లేదా? నేడు మానవులు జీవితంలో పొందుతున్న దానికన్నా మరింత గొప్ప ఆనందాన్ని పొందే కాలాలు, నిజంగా క్రొత్తవైన విషయాలు వస్తాయని ఇది ఆశల్ని రేకెత్తించటంలేదా? మీరు దీన్ని గ్రహించగల్గితే బైబిలు ఏమి ప్రవచిస్తుందనే దానిగురించి అంతర్దృష్టిని సంపాదించినట్లే, ఈ అంతర్దృష్టి చాలా కొద్దిమందికి మాత్రమే ఉంది.

19. రానైయున్న ‘క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని’ గురించి ప్రకటన గ్రంథం ఏ సందర్భంలో సూచిస్తుంది?

19 కానీ మనం ఇంకా ముందుకు వెళ్దాము. “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి” అన్న పదబంధం కనబడే మొదటి సందర్భాన్ని యెషయా 65వ అధ్యాయంలోను మరొక దాన్ని 2 పేతురు 3వ అధ్యాయంలోను చూశాము. ఇప్పుడు ఈ వ్యక్తీకరణ బైబిల్లో కన్పించే మరో సందర్భం కోసం ప్రకటన 21వ అధ్యాయంవైపుకి త్రిప్పుదాము. మళ్లీ ఇక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోవటం సహాయం చేస్తుంది. రెండు అధ్యాయాల ముందు, ప్రకటన 19వ అధ్యాయంలో వర్ణనాత్మకమైన సూచనలతో కూడిన ఒక యుద్ధాన్ని చూస్తాము—కానీ ఇది రెండు శత్రు దేశాల మధ్య జరిగే యుద్ధం కాదు. ఇందులో ఒక పక్షాన ఉన్నది “దేవుని వాక్యము.” ఈ బిరుదు యేసుక్రీస్తును సూచిస్తుందన్నది మీరు గుర్తిస్తుండవచ్చు. (యోహాను 1:1, 14) ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన పరలోక సైన్యంతోపాటు ఉన్నట్లు ఈ దర్శనం ఆయన్ను చిత్రిస్తుంది. వారు ఎవరిపై యుద్ధం చేస్తున్నారు? ‘రాజులు,’ ‘సహస్రాధిపతులు’ ‘కొద్దివారేమి గొప్పవారేమి’ వివిధ హోదాల్లోని ప్రజలు ఉన్నట్లు ఆ అధ్యాయం పేర్కొంటుంది. ఈ యుద్ధం రానైయున్న యెహోవా దినం గురించినది, దుష్టత్వపు నాశనాన్ని గురించినది. (2 థెస్సలొనీకయులు 1:6-10) తర్వాతి అధ్యాయమైన ప్రకటన 20, ‘అపవాదియు సాతానును అను ఘటసర్పమును’ దారి తొలగించటాన్ని వర్ణించటంతో ప్రారంభమౌతుంది. ఇది ప్రకటన 21వ అధ్యాయాన్ని పరిశీలించటానికి రంగాన్ని సిద్ధం చేస్తుంది.

20. ఏ విశేషమైన మార్పు మన ముందు ఉందని ప్రకటన 21:1 సూచిస్తోంది?

20 అపొస్తలుడైన యోహాను ఉత్కంఠభరితమైన ఈ మాటలతో ప్రారంభిస్తున్నాడు: “అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.” మనం యెషయా 65వ అధ్యాయం, 2 పేతురు 3వ అధ్యాయాలలో చూసిన దాని ఆధారంగా, ఇది కూడా అక్షరార్థ ఆకాశములు, సముద్ర జలాలతో ఉన్న మన భూగ్రహము మార్చబడతాయని అర్థం కాదని మనం నిశ్చయంగా చెప్పగలము. ముందున్న అధ్యాయాలు చూపించినట్లుగానే దుష్టప్రజలు, వారి పరిపాలనలు, వారితోపాటు అదృశ్య పరిపాలకుడైన సాతాను కూడా నిర్మూలించబడతారు. అవును, ఇక్కడ వాగ్దానం చేయబడినది ఈ భూమ్మీదనున్న ప్రజలు ఉండే క్రొత్త విధానమే.

21, 22. ఏ ఆశీర్వాదాల్ని గురించి యోహాను మనకు నిశ్చయతనిస్తున్నాడు, బాష్పబిందువులు తుడిచివేయబడతాయంటే అర్థం ఏమిటి?

21 అద్భుతమైన ఈ ప్రవచనంలో మనం ముందుకు వెళ్తుండగా మనకు ఈ విషయం నిశ్చయమౌతుంది. మూడవ వచనం, దేవుడు మానవులతో కూడా ఉండే సమయాన్ని గురించి చెబుతూ, ఆయన తన చిత్తాన్ని చేసే ప్రజలకు ప్రయోజనాల్ని తీసుకువచ్చేలా తన అవధానాన్ని మళ్ళిస్తాడని చెబుతూ ముగుస్తుంది. (యెహెజ్కేలు 43:7) 4, 5 వచనాల్లో యోహాను ఇలా కొనసాగిస్తున్నాడు: “ఆయన [యెహోవా] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు—ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు—ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.” ఎంతటి ఉత్సాహాన్ని కల్గించే ప్రవచనం !

22 బైబిలు ప్రవచిస్తున్నదాన్ని ఆస్వాదించటానికి కాస్త ఆగండి. ‘దేవుడు వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తాడు.’ అది సున్నితమైన కన్నులను శుభ్రపర్చే సాధారణ కన్నీళ్లను గూర్చి చెప్పటం లేదు, అది ఆనంద బాష్పాల గురించి అయివుండదు. దేవుడు తుడిచివేసే బాష్పబిందువులు బాధలు, దుఃఖం, నైరాశ్యం, గాయపడటం, మానసిక వ్యధ మూలంగా కలిగే బాష్పాలను తుడిచివేస్తాడు. మనం ఎలా నిశ్చయత కల్గివుండగలం? దేవుడు చేసిన ఈ విశేషమైన వాగ్దానం, బాష్పబిందువులను తుడిచివేయడాన్ని ‘మరణం, దుఃఖం, ఏడ్పు, వేదన అనేవి ఇకపై ఉండకపోవటానికి’ జతచేస్తుంది.—యోహాను 11:35.

23. యోహాను ప్రవచనం ఏ పరిస్థితుల ముగింపు గురించి హామీనిస్తుంది?

23 క్యాన్సరు, పక్షవాతము, గుండెపోటులు చివరికి మరణం కూడా తీసివేయబడతాయని ఇది నిరూపించటం లేదా? మనలో ఎవరు తమ ప్రియమైన వ్యక్తిని వ్యాధి మూలంగానో, ఆక్సిడెంట్‌ మూలంగానో, లేదా ఏదైనా విపత్తు మూలంగానో కోల్పోనిది? మరణం ఇక ఉండదని దేవుడిక్కడ వాగ్దానం చేస్తున్నాడు, అంటే బహుశ అప్పుడు పుట్టే పిల్లలు, పెరిగి పెద్దవారై, తరువాత వృద్ధులై, మరణించడం జరగదని అది సూచిస్తుంది. ఇకపై అల్‌జీమర్స్‌ వ్యాధి ఉండదు, ఎముకల వ్యాధులు ఇక ఉండవు, ఫైబ్రాయిడ్‌ ట్యూమర్‌లు ఇక ఉండవు, నేత్ర వ్యాధులు ఇక ఉండవు, చివరికి వృద్ధాప్యంలో ఎంతో సాధారణమైన చత్వారం కూడా ఇక ఉండదు అని కూడా ఆ ప్రవచన భావం.

24. ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ ఆశీర్వాదకరమైనవని ఎలా నిరూపించబడుతుంది, మనం ఇంకా ఏమి పరిశీలించబోతున్నాము?

24 మరణం, వృద్ధాప్యం, వ్యాధులు తీసివేయబడటం మూలంగా దుఃఖమూ వేదనా తక్కువౌతాయని నిస్సందేహంగా మీరు అంగీకరిస్తారు. కానీ, మనల్ని పట్టి పీడించే బీదరికం, పిల్లలపై అత్యాచారం, అణచివేతకు గురిచేసే వర్ణవిచక్షణ వంటివాటి విషయమేమిటి? నేడు ఎంతో సర్వసామాన్యంగా కన్పించే అటువంటివి కొనసాగినట్లైతే దుఃఖమూ వేదనా వంటివి మనల్ని వదిలిపోవు. అందుకని, “క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి”ల క్రింద జీవితం అంటే, ప్రస్తుతం శోకకారణాలైన అటువంటివి నిర్మూలించబడతాయి. ఎంత గొప్ప మార్పు ! అయితే మనం ఇంతవరకు బైబిలు ‘క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి’ అని చెబుతున్న నాలుగు సందర్భాల్లో కేవలం మూడు మాత్రమే చూశాము. మనం పరిశీలించినదానితో ముడిపడి ఉన్నదీ, ‘అన్నిటినీ నూతనమైనవిగా చేస్తానని’ దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని ఎప్పుడు ఎలా నెరవేరుస్తాడనే దాని కోసం మనకున్న కారణాన్ని నొక్కి చెప్పేదీ మరొకటుంది. దీని తర్వాతి శీర్షిక ఆ ప్రవచనాన్ని గూర్చి చెబుతూ మన సంతోషానికి అది ఎలాంటి భావం కలిగి ఉందో చర్చిస్తుంది.

[అధస్సూచీలు]

^ పేరా 10 తెలుగు బైబిలు ఆ వచనాన్ని ఇలా అనువదించింది: “సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి.” ద కంటెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌లో ఆ వచనం ఇలా ఉంది: “ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభువుకు స్తుతులను పాడండి.” ఇది, యెషయా “క్రొత్త భూమి” అని చెప్పటం ద్వారా, తమ స్వదేశంలో ఉన్న దేవుని ప్రజలను సూచిస్తున్నాడనే అవగాహనకు అనుగుణ్యంగా ఉంది.

మీరేమని గుర్తు చేసుకుంటారు?

• ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ అని బైబిలు ప్రవచిస్తున్న మూడు సందర్భాలు ఏవి?

• ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ నెరవేర్పులో ప్రాచీన యూదులు ఎలా ఇమిడి ఉన్నారు?

• పేతురు ప్రస్తావించినట్లుగా ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ గురించి ఏ నెరవేర్పులను అర్థం చేసుకోవడమైనది?

ప్రకటన 21వ అధ్యాయం మనకు తేజోవంతమైన భవిష్యత్తును ఎలా చూపిస్తోంది?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రం]

యెహోవా ప్రవచించినట్లుగానే, సా.శ.పూ. 537 లో యూదులు తమ స్వదేశానికి తిరిగివచ్చేలా కోరెషు రంగం సిద్ధంచేశాడు