కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు యోగ్యులని నిరూపించుకుంటున్నారా?

మీరు యోగ్యులని నిరూపించుకుంటున్నారా?

మీరు యోగ్యులని నిరూపించుకుంటున్నారా?

‘ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను!’ మీరెప్పుడైనా కోపంతో ఉన్నప్పుడో, నిరాశతో ఉన్నప్పుడో అలా అని ఉండవచ్చు. కానీ ఆ భావోద్రేకం సద్దుమణిగిన తర్వాత, మీరు నిజంగా చింతిస్తుండవచ్చు. ఎందుకని? ఎందుకంటే, ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారన్న విషయాన్ని మనలో దాదాపు అందరమూ పట్టించుకుంటాము.

వాస్తవానికి, మనం ఇతరుల అనుభూతులను కూడా పట్టించుకోవలసిన అవసరముంది. ప్రత్యేకించి క్రైస్తవులముగా, యెహోవా దేవుని నియత పరిచారకులముగా, ఇతరులు మనలను ఎలా దృష్టిస్తున్నారు అన్నదాన్ని గురించి ఆరోగ్యకరమైన చింత కలిగివుండటం తప్పనిసరి. ఎంత కాదన్నా, మనం “లోకమునకు . . . వేడుకగా నున్నాము” కదా. (1 కొరింథీయులు 4:9) పరిశుద్ధ గ్రంథం వ్యాఖ్యాన సహితంలో 2 కొరింథీయులు 6:3, 4 లో, “మా సేవకు ఎలాంటి నింద కలగకూడదని ఏ విషయంలోనూ అభ్యంతరమేమీ కలిగించము. మేము దేవుని సేవకులుగా ప్రతి విషయంలోనూ మా యోగ్యతలు కనుపరచుకొంటున్నాం” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. మనం కూడా అదే విధంగా యోగ్యులముగా ఉండాలి.

అయితే మనం యోగ్యులమని ఇతరుల ఎదుట నిరూపించుకోవడం అంటే ఏమిటి? మన గురించి మనం గొప్పగా చెప్పుకోవాలనా? లేక మన వైపుకూ, మన సామర్థ్యాల వైపుకూ అనవసరంగా ఇతరుల అవధానాన్ని మళ్ళించాలనా? కానేకాదు. “అన్యజనులు . . . మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను” అని 1 పేతురు 2:12 లో కనిపిస్తున్న మాటలను మనం అన్వర్తించుకోవాలి. క్రైస్తవులు, నోటి మాటల ద్వారా కాక, తమ మంచి ప్రవర్తన ద్వారా తాము యోగ్యులమని నిరూపించుకుంటారు ! అలా అది, మనకు కాదు గానీ, దేవుడికే ప్రశంసలను తీసుకువస్తుంది. మనం యోగ్యులమని ఇతరుల ఎదుట నిరూపించుకోవడం ద్వారా, మనకు వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీరు యోగ్యులని నిరూపించుకోవడం మూలంగా మీరు వ్యక్తిగతంగా ప్రయోజనాలను పొందగల మూడు రంగాలను పరిశీలించుదాం.

భావి వివాహ భాగస్వామి

ఉదాహరణకు, వివాహం విషయమే తీసుకుందాం. “పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి” అయిన యెహోవా దేవుడు ఇచ్చిన బహుమానం వివాహ ఏర్పాటు. (ఎఫెసీయులు 3:14) ఏదైన ఒక రోజు వివాహం చేసుకోవాలన్నదే బహుశా మీ కోరికై ఉండవచ్చు. అలాగైతే, భావి వివాహ భాగస్వామిగా మీరు యోగ్యులని మీరు ఎంత మేరకు నిరూపించుకుంటున్నారు? అవును, పెండ్లి కాని క్రైస్తవ స్త్రీగా లేదా పురుషుడిగా మీకు ఎలాంటి పేరుంది?

కొన్ని దేశాల్లో, కుటుంబాలు ఈ విషయాన్ని బాగా పట్టించుకుంటాయి. ఉదాహరణకు, ఘానాలో, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు పెళ్ళి చేసుకోవాలనుకున్నట్లయితే, వాళ్ళు సాంప్రదాయం ప్రకారం తమ తమ తల్లిదండ్రులకు తెలియజేస్తారు. తల్లిదండ్రులు మిగతా కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం, ఆ అమ్మాయికి వాళ్ళ ఇరుగుపొరుగున ఎలాంటి పేరుంది అన్నది తెలుసుకోవడానికి వాకబు చేయడం మొదలుపెడుతుంది. ఆ అమ్మాయి తగిన వధువన్న నమ్మకం తల్లిదండ్రులకు కలిగినప్పుడు, మా అబ్బాయి మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు అని ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి తెలుపుతారు. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం, పెండ్లికి ఒప్పుకునే ముందు, ఆ అబ్బాయికి వాళ్ళ ఇరుగుపొరుగున ఎలాంటి పేరుంది అన్నది వాకబు చేసి తెలుసుకుంటుంది. “మీరు పెండ్లి చేసుకునే ముందు చేసుకోబోయే వ్యక్తిని గురించి తెలిసినవాళ్ళను వాకబు చేసి తెలుసుకోండి” అని ఒక ఘానా సామెత అంటోంది.

తమకు ఇష్టమైన వ్యక్తిని పెండ్లి చేసుకునే స్వాతంత్ర్యమున్న పాశ్చాత్య దేశాల్లోవారి విషయమేమిటి? అలాంటి దేశాల్లో కూడా, పరిపక్వత గల క్రైస్తవుడు/క్రైస్తవురాలు చేసుకోబోతున్న వ్యక్తిని గురించి తెలిసినవారి నుండి, తల్లిదండ్రులు, స్నేహితులు మొదలైనవారి నుండి నిష్పాక్షికమైన సూచనలను తీసుకోవడం వివేకం. కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకం ప్రకారం, ఒక యువతి ఇలా ప్రశ్నించుకోవచ్చు, “‘ఈ వ్యక్తికి ఎలాంటి ప్రతిష్ఠ ఉంది? ఆయన స్నేహితులెవరు? ఆయన ఆశానిగ్రహాన్ని కనపరుస్తాడా? పెద్దవయస్సుగల వారితో ఆయన ఎలా వ్యవహరిస్తాడు? ఆయనది ఎలాంటి కుటుంబం? ఆయన వారితో ఎలా వ్యవహరిస్తాడు? డబ్బు ఎడల ఆయన దృక్పథమేంటి? ఆయన మద్యం అతిగా సేవిస్తాడా? ఆయన విసుగు చెందుతాడా, దౌర్జన్యపూరితంగా కూడా ప్రవర్తిస్తాడా? ఆయనకు ఎలాంటి సంఘ బాధ్యతలున్నాయి, ఆయన వాటినెలా నిర్వహిస్తాడు? నేను ఆయనను ప్రగాఢంగా గౌరవించగలనా?’—లేవీయకాండము 19:32; సామెతలు 22:29; 31:23; ఎఫెసీయులు 5:3-5, 33; 1 తిమోతి 5:8; 6:10; తీతు 2:6, 7.” *

తను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న స్త్రీని గురించి ఒక పురుషుడు కూడా అలాగే వాకబు చేయాలనుకుంటాడు. బైబిలు ప్రకారం, బోయజు రూతును పెళ్ళి చేసుకోక ముందు ఆమె మీద అలాంటి ఆసక్తిని చూపించాడు. “ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో” అని రూతు ఆయనను అడిగినప్పుడు, “నీవు చేసినదంతయు నాకు తెలియబడెను” అని బోయజు చెప్పాడు. (రూతు 2:10-12) రూతు నమ్మకమైన వ్యక్తి, అంకిత భావం గల వ్యక్తి, కష్టించి పనిచేసే వ్యక్తి అని బోయజు స్వయంగా గమనించడమే కాక, ఇతరుల నుండి కూడా ఆమె గురించిన సదభిప్రాయాలను విన్నాడు.

అలాగే, మీరు పెండ్లి చేసుకోదగిన వ్యక్తి అని మీ గురించి ఇతరులు అనుకుంటారా అన్నది ఎక్కువగా మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. మీరు యోగ్యులన్న విషయాన్ని ఎలా నిరూపించుకుంటున్నారు?

ఉద్యోగస్తుడిగా/ఉద్యోగస్తురాలిగా

మంచి ప్రవర్తన ద్వారా ప్రయోజనం పొందగల మరొక రంగం ఉద్యోగ స్థలం లేదా పని స్థలం. ఉద్యోగాల కోసమైన పోటీ ఉద్ధృతంగా ఉండవచ్చు. చెప్పినట్లు చేయరనీ, అలవాటుగా లేటుగా వస్తారనీ, నిజాయితీ లేనివారనీ పేరు సంపాదించుకున్నవారిని ఉద్యోగం నుండి పంపించేస్తారు. కంపెనీలు ఖర్చు తగ్గించేందుకు అనుభవజ్ఞులను కూడా పంపించేయవచ్చు. ఉద్యోగంలో నుండి అలా పంపించివేయబడినవారు క్రొత్త ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు, ఎంప్లాయర్‌లు వాళ్ళ పని అలవాట్లను గురించీ, వైఖరిని గురించీ, అనుభవాన్ని గురించీ వాళ్ళు మునుపు పనిచేసిన కంపెనీవారిని అడిగి వారి గురించి మదింపు చేస్తారు. చాలా మంది క్రైస్తవులు, గౌరవపూర్వకమైన ప్రవర్తన ద్వారా, తగిన వస్త్రధారణ ద్వారా, ఆహ్లాదకరమైన ప్రవర్తన ద్వారా, విశిష్టమైన క్రైస్తవ లక్షణాల ద్వారా తాము యోగ్యులమని నిరూపించుకోవడంలో సఫలీకృతులయ్యారు.

నిజాయితీ అనేది విశిష్ట క్రైస్తవ లక్షణాల్లో ఒకటి. చాలా మంది ఎంప్లాయర్‌లు ఈ గుణానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. అపొస్తలుడైన పౌలులాగే మనం కూడా, “అన్ని విషయములలోను నిజాయితీగా ప్రవర్తించాలని” కోరుకుంటాం. (హెబ్రీయులు 13:18, NW) ఘానాలోని ఒక మైనింగ్‌ కంపెనీలో, దొంగతనం జరుగుతున్నట్లు తెలియజేయబడింది. లోహములను మెరుగుపరచే ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో మిగతావాళ్ళు ఉద్యోగం కోల్పోగా, సాక్షియైన సూపర్‌వైజర్‌ మాత్రం ఉద్యోగం కోల్పోలేదు. ఎందుకని? ఎందుకంటే, ఆయన నిజాయితీపరుడన్న విషయాన్ని మేనేజ్‌మెంట్‌ అనేక సంవత్సరాలుగా గమనించింది. ఆయన కష్టపడి పనిచేస్తాడనీ, అధికారులంటే ఆయనకు గౌరవం కూడా ఉందనీ అందరికీ తెలుసు. నీతియుక్తమైన ఆయన ప్రవర్తన ఆయన ఉద్యోగాన్ని నిలబెట్టింది !

ఉద్యోగ రంగంలో తాము యోగ్యులమని నిరూపించుకునేందుకు క్రైస్తవులు చేయగల మరి కొన్ని విషయాలు ఏవి? మీకు ఏ పని ఇచ్చినా నిపుణంగా చేయడానికి నేర్చుకోండి. (సామెతలు 22:29) శ్రద్ధగా మనఃపూర్వకంగా పని చేయండి. (సామెతలు 10:4; 13:4) మీ ఎంప్లాయర్‌తోనూ, సూపర్‌వైజర్‌తోను గౌరవపూర్వకంగా వ్యవహరించండి. (ఎఫెసీయులు 6:5) సమయానికి పని స్థలాన్ని/ఉద్యోగ స్థలాన్ని చేరుకోవడం, నిజాయితీగా ఉండడం, సమర్థంగా పనిచేయడం, కష్టపడి పనిచేయడం వంటి లక్షణాలకు ఎంప్లాయర్‌లు చాలా విలువ ఇస్తారు. ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఉద్యోగం సంపాందించేందుకు ఈ లక్షణాలు మీకు సహాయపడతాయి.

సంఘాధిక్యతలు

క్రైస్తవ సంఘంలో నాయకత్వం వహించేందుకు పరిపక్వతగల పురుషుల అవసరం మునుపెన్నటికన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంది. కారణమేమిటి? “నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము నీ త్రాళ్లను పొడుగుచేయుము” అని యెషయా ప్రవచించాడు. (యెషయా 54:2) ఈ ప్రవచన నెరవేర్పులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా సంఘం పెరుగుతూనే ఉంది.

కనుక మీరు క్రైస్తవ పురుషుడైతే, నియుక్త పదవిలో సేవ చేసేందుకు మీరు యోగ్యులని ఎలా నిరూపించుకుంటారు? యువకుడైన తిమోతి విషయమే తీసుకోండి. ఆయన, “లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు” అని లూకా నివేదిస్తున్నాడు. అవును, ఈ యువకుడు, తాను యోగ్యుడనని తన సత్ప్రవర్తన ద్వారా రెండు సంఘాల్లో నిరూపించుకున్నాడు. కనుక ప్రయాణ పరిచర్యలో తనతో కలవమని పౌలు తిమోతిని ఆహ్వానించాడు.—అపొస్తలుల కార్యములు 16:1-4.

‘అధ్యక్ష్యపదవిని ఆశిస్తున్న’ ఒకరు ఆ పదవిని ఎలా చేరుకోగలరు? తనకు ఆ నియామకం లభించేందుకుగాను, ఇతరులకు తనపై సదభిప్రాయం ఏర్పడేలా ప్రయత్నించడం ద్వారా కాక, అలాంటి బాధ్యతలను చేపట్టేందుకు అవసరమైన ఆధ్యాత్మిక లక్షణాలను అలవరచుకోవడం ద్వారా చేరుకుంటారు. (1 తిమోతి 3:1-10, 12, 13; తీతు 1:5-9) ప్రకటనా పనిలోని శిష్యులను తయారు చేసే పనిలో తన శాయశక్తులా భాగం వహించడం ద్వారా కూడా, తను “దొడ్డపనిని అపేక్షించుచున్నాడ”ని చూపించవచ్చు. (మత్తయి 24:14; 28:19, 20) బాధ్యతవహించే క్రైస్తవ పురుషులమని నిరూపించుకునేవారు తమ ఆధ్యాత్మిక సహోదరుల క్షేమం విషయంలో హృదయపూర్వకమైన ఆసక్తిని చూపిస్తారు. “పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి” అన్న అపొస్తలుడైన పౌలు సలహాను వాళ్ళు అనుసరిస్తారు. (రోమీయులు 12:13) అలాంటి క్రియల ద్వారా ఒక క్రైస్తవ పురుషుడు, ‘దేవుని పరిచారకుడుగా తాను యోగ్యుడని’ నిజంగా ‘నిరూపించుకోగలడు.’

అన్ని సమయాల్లోను యోగ్యతను చూపించుకుందాం

యోగ్యులమని నిరూపించుకోవడమంటే, యోగ్యులమన్నట్లు నటించాలని కానీ, ‘మనుష్యులను సంతోషపెట్టేవారిగా’ అవ్వాలని కానీ అర్థం కాదు. (ఎఫెసీయులు 6:6) దానర్థం, మన సృష్టికర్తయైన యెహోవా దేవుని చట్టాలనూ సూత్రాలను మనఃపూర్వకంగా అనుసరించడం ద్వారా మనం యోగ్యులమని ఆయనకు రుజువు చేసుకుంటాం. మీరు ఆధ్యాత్మికతను పెంచుకుని, యెహోవా దేవునితో సంబంధాన్ని బలపరచుకుంటే, మీ కుటుంబ సభ్యులతోను, తోటి పనివారితోను, తోటి క్రైస్తవులతోను మీరు ప్రవర్తించే తీరు మెరుగుపడడాన్ని ఇతరులు గ్రహిస్తారు. మీ స్థిరతను, మీ సమతుల్యతను, విషయాలను సరైన విధంగా తూచి చూసి సరైన నిర్ణయానికి వచ్చే మీ గుణాన్నీ, బాధ్యతగా వ్యవహరించే మీ సామర్థ్యాన్నీ, మీ అణకువనూ కూడా వాళ్ళు గమనిస్తారు. మీరు అలా ఉండడం వల్ల, వాళ్ళు మిమ్మల్ని మరెక్కువగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అంతకన్నా ముఖ్యంగా, మీరు యోగ్యులని ఇతరులకు రుజువు చేయడం ద్వారా మీరు యెహోవా దేవుని ఆమోదాన్ని పొందుతారు !

[అధస్సూచీలు]

^ పేరా 8 వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

[19వ పేజీలోని చిత్రం]

తమ కూతురు లేదా కొడుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తికి ఎలాంటి పేరుంది అని చాలా మంది తల్లిదండ్రులు జ్ఞానయుక్తంగా వాకబు చేస్తారు

[20వ పేజీలోని చిత్రం]

ఒక సహోదరుడు ఇతరుల క్షేమాన్ని గురించి పరిగణించేవాడిగా ఉండటం ద్వారా సేవాధిక్యతలకు తాను యోగ్యుడనని రుజువు చేసుకుంటాడు