కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు హింసకులను దేవుడు దృష్టిస్తున్నట్లే దృష్టిస్తారా?

మీరు హింసకులను దేవుడు దృష్టిస్తున్నట్లే దృష్టిస్తారా?

మీరు హింసకులను దేవుడు దృష్టిస్తున్నట్లే దృష్టిస్తారా?

గొప్ప శారీరక దారుఢ్యాన్నీ, ధైర్యాన్నీ ప్రదర్శించే బలాఢ్యులను ప్రజలు ఎంతో కాలంగా ప్రశంసిస్తూనే ఉన్నారు. ప్రాచీన గ్రీస్‌ దేశపు పురాణగాథలోని నాయకుడైన హెరాక్లిస్‌ అలాంటి వారిలో ఒకరు. రోమన్‌లు అతడ్ని హెర్క్యులిస్‌ అంటారు.

హెరాక్లిస్‌, చాలా పేరు ప్రఖ్యాతులు గల నాయకుడు. యోధులందరిలోకెల్లా బలవంతుడు. పురాణకథ ప్రకారం, ఆయన దైవాంశసంభూతుడు. గ్రీకు దేవుడైన జీయూస్‌ ఆయనకు తండ్రి. ఆయన తల్లి ఆల్కెమీన్‌. ఆమె మానవురాలు. ఉయ్యాలలో ఉన్నప్పుడే హెరాక్లిస్‌ సాహసకృత్యాలు చేయడం మొదలుపెట్టాడు. ఆయన మీది అసూయతో ఆయనను చంపడానికి ఒక దేవత రెండు పెద్ద పాములను పంపినప్పుడు, ఆయన వాటి గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఆయన తన జీవితంలో అనేక పోరాటాలను సాగించాడు. అనేక భయంకర జీవులపై విజయాన్ని సాధించాడు. తన స్నేహితురాలిని కాపాడేందుకు మృత్యువుతో పోరాడాడు. అలాగే ఆయన నగరాలను ధ్వంసం చేశాడు. స్త్రీలను మానభంగం చేశాడు, ఒక అబ్బాయిని గోపురం మీది నుండి విసిరి కొట్టాడు, తన భార్యాపిల్లలను చంపేశాడు.

పురాణగాథలోని హెరాక్లిస్‌, వాస్తవంగా ఉనికిలో ఉన్న మనిషి కాకపోయినప్పటికీ, గ్రీసు దేశాల్లోని వారికి ఎంతోకాలంగా ఆయన బాగా తెలుసు. రోమన్‌లు ఆయనను ఒక దేవుడిగా ఆరాధించారు; వ్యాపారస్థులూ ప్రయాణికులూ సిరిసంపదలనివ్వమనీ, అపాయాలు కలగకుండా కాపాడమనీ ఆయనకు ప్రార్థించేవారు. ఆయన చేసిన సాహస కృత్యాలను గురించిన గాథలకు, వేలాది సంవత్సరాలుగా ప్రజలు ఆకర్షితులయ్యారు.

ఈ పురాణ కథ యొక్క ఉద్భవం

హెరాక్లిస్‌ మొదలైనవారిని గురించిన పురాణగాథలకు నిజానికి ఒక ఆధారముందా? ఒక విధంగా ఉందని చెప్పవచ్చు. మానవుల చరిత్రలోని తొలి కాలాన్ని గురించి, “దేవుళ్ళు” “దైవాంశసంభూతులు” మొదలైనవారు భూమి మీద నిజంగానే నడిచిన కాలాన్ని గురించి బైబిలు చెబుతుంది.

ఆ యుగాన్ని గురించి వర్ణిస్తూ, మోషే ఈ విధంగా వ్రాశాడు: “నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.”—ఆదికాండము 6:1, 2.

సత్య “దేవుని కుమారులు” మానవులు కారు; వారు దేవుని దూతలనబడే కుమారులు. (పోల్చండి యోబు 1:6; 2:1; 38:4, 7.) కొందరు దూతలు “తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచి[రి]” అని బైబిలు రచయితైన యూదా చెబుతున్నాడు. (యూదా 6) మరో మాటలో చెప్పాలంటే, వాళ్ళు భూమి మీది అందమైన స్త్రీలతో జీవించడానికే ఎక్కువగా ఇష్టపడుతూ, దేవుని పరలోక సంస్థలో తమకు నియమించబడిన స్థానాన్ని వదిలిపెట్టారు. ఈ తిరుగుబాటుదారులైన దూతలు, “వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైన” సొదొమ గొమొర్రాల్లోని ప్రజల్లాగా ఉండేవారని కూడా యూదా తెలియజేస్తున్నాడు.—యూదా 7.

అవిధేయత చూపించిన ఈ దూతలు చేసిన కార్యాలన్నింటిని గురించి బైబిలు వివరంగా చెప్పడం లేదు. అయినప్పటికీ, అనేక దేవుళ్ళు దేవతలు మానవుల మధ్య దృశ్యంగానో అదృశ్యంగానో జీవించినట్లు గ్రీసులోని, అలాగే ఇతర దేశాల్లోని పురాణ గాథలు వర్ణిస్తున్నాయి. వాళ్ళు మానవ రూపాన్ని ధరించినప్పుడు చాలా అందంగా ఉండేవారు. వాళ్ళు తినేవారు, త్రాగేవారు, నిద్రపోయేవారు, వారు ఒకరితోనొకరు, అలాగే మానవులతోను లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు. వాళ్ళు పరిశుద్ధులు, అమర్త్యులు అని తలంచబడినప్పటికీ, వాళ్లు అబద్ధాలు చెప్పేవారు, మోసం చేసేవారు, దెబ్బలాడేవారు, పోట్లాడేవారు, వంచించేవారు, మానభంగం చేసేవారు. అలాంటి పురాణగాథలు మార్పులు చేర్పులు చేసి అందంగా చెప్పబడుతున్నప్పటికీ, జలప్రళయానికి ముందటి పరిస్థితులు వాస్తవానికి ఎలా ఉండేవో బైబిలులోని ఆదికాండము అనే గ్రంథం చెబుతుంది.

ప్రాచీన కాలపు బలాఢ్యులు, పేరు ప్రఖ్యాతులు గలవారు

మానవ రూపం దాల్చిన అవిధేయులైన దూతలు స్త్రీలతో సంపర్కం చేశారు. ఆ స్త్రీలు పిల్లలను కన్నారు. ఆ పిల్లలు మామూలు పిల్లలు కారు. వాళ్ళు నెఫీలులు. అంటే అర్థ మానవులూ, అర్థ దేవదూతలూ. “ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే” అని బైబిలు వృత్తాంతం చెబుతుంది.—ఆదికాండము 6:4.

“నెఫీలులు” అనే హెబ్రీ పదానికి, అక్షరార్థంగా “బలాత్కారులు” అనే భావం ఉంది, అంటే ఇతరుల మీద పడి, హింసాత్మక చర్యలతో వారిని నేలకొరిగించేవారు. అందుకనే “భూలోకము బలాత్కారముతో నిండియుండెను” అని బైబిలు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. (ఆదికాండము 6:11) పురాణగాథల్లోని హెరాక్లిస్‌, బబులోను కథానాయకుడైన గిల్గమేష్‌ వంటి దైవాంశసంభూతులు నెఫీలులకు చాలా సాదృశ్యంగా ఉన్నారు.

నెఫీలులు “పేరు పొందిన శూరులు”గా చెప్పబడ్డారని గమనించండి. నెఫీలులు, అదే కాలంలో జీవించిన నీతిమంతుడైన నోవహులా యెహోవా పేరును ప్రసిద్ధం చేయడంలో ఆసక్తి చూపించలేదు. వాళ్ళు తమ సొంత పేరు, మహిమ, కీర్తి మొదలైనవాటిపైనే ఆసక్తి చూపించారు. హింసా, రక్తపాతమూ ఇమిడి ఉన్న వీరశూర కృత్యాలను చేయడం ద్వారా వాళ్ళు తమ చుట్టూ ఉన్న దైవభక్తిలేని లోకంలో తాము కావాలని వాంఛించిన పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. వాళ్ళు ఆ కాలం నాటి మహాగొప్ప నాయకులు. ప్రజలు వాళ్ళకు భయపడేవారు, గౌరవం చూపించేవారు, వాళ్ళు ప్రజలకు అజేయులుగా కనిపించేవారు.

నెఫీలులూ, నీచస్థాయికి దిగజారిన వారి తండ్రులైన దూతలూ తమ సమకాలీనుల దృష్టిలో మంచి పేరును సంపాదించుకున్నప్పటికీ, దేవుడి దృష్టిలో మంచి పేరును సంపాదించుకోలేదన్నది నిశ్చయం. వాళ్ళ జీవన విధానం ఎంతో అసహ్యకరమైనది. కనుకనే, తప్పుదారిని ఎంచుకున్న ఆ దూతలకు వ్యతిరేకంగా దేవుడు చర్య తీసుకున్నాడు. “దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు.—2 పేతురు 2:4, 5.

భూవ్యాప్త జలప్రళయంలో, తిరుగుబాటుదారులైన దూతలు భౌతిక రూపాలను విడిచిపెట్టి, అవమాన భారంతో ఆత్మ సామ్రాజ్యానికి తిరిగివెళ్ళారు. వాళ్ళు మళ్ళీ మానవ శరీరాలను ధరించడాన్ని నిషేధిస్తూ దేవుడు వారిని శిక్షించాడు. అవిధేయులైన దూతల మానవాతీత సంతానమైన నెఫీలులందరూ నిర్మూలమయ్యారు. కేవలం, నోవహూ, ఆయన చిన్న కుటుంబమూ మాత్రమే జలప్రళయాన్ని తప్పించుకున్నారు.

నేటి ప్రఖ్యాత పురుషులు

నేడు దేవుళ్ళూ, దైవాంశసంభూతులూ భూమి మీద లేరు. అయినప్పటికీ, హింస చెలరేగుతోంది. నేటి ప్రఖ్యాత పురుషులు పుస్తకాల్లోను, సినిమాల్లోను, టీవీల్లోనూ, సంగీతంలోను ఘనతకెక్కుతున్నారు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించాలని గానీ, శత్రువులను ప్రేమించాలని గానీ, శాంతి కోసం ప్రయత్నించాలని గానీ, క్షమించాలని గానీ, హింసకు దూరంగా ఉండాలని గానీ వాళ్ళెప్పుడూ అనుకోరు. (మత్తయి 5:39, 44; రోమీయులు 12:17; ఎఫెసీయులు 4:32; 1 పేతురు 3:11) బదులుగా, ఆధునిక దిన శక్తిమంతులు, వాళ్ళ బలాన్ని బట్టి, పోరాడేందుకూ పగతీర్చుకునేందుకూ వారికి గల శక్తిని బట్టి, హింసించబడినప్పుడు దానికి ప్రతీకారంగా రెట్టింపు ఉద్ధృతతో హింసించగల్గుతున్నదాన్ని బట్టి ప్రశంసించబడుతున్నారు. *

నోవహు కాలం నుండి అలాంటి వ్యక్తులను గురించిన దేవుడి వీక్షణం ఇంతవరకూ మారలేదు. యెహోవా హింసాప్రేమికులను మెచ్చడు, వాళ్ళ వీరశూర కృత్యాలను బట్టి వినోదించడు. “యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు” అని కీర్తన రచయిత పాడాడు.—కీర్తన 11:5.

మరొక రకమైన బలం

జీవించినవారందరిలోకెల్లా అత్యధిక ఖ్యాతి గాంచిన శాంతి పురుషుడైన యేసుక్రీస్తు, హింసాత్మక స్వభావం గల బలవంతులకు పూర్తి భిన్నంగా ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, “దౌర్జన్యం చేయలేదు.” (యెషయా 53:9, పరిశుద్ధ బైబల్‌) ఆయన శత్రువులు గెత్సెమనే తోటలో ఆయనను బంధించడానికి వచ్చినప్పుడు, ఆయన అనుచరుల దగ్గర కొన్ని కత్తులు ఉన్నాయి. (లూకా 22:38, 47-51) ఆయన యూదులకు అప్పగించబడకుండా, వాళ్ళు ఒక సాయుధ దళంగా రూపొందగల్గేవారే.—యోహాను 18:36.

వాస్తవానికి, యేసును రక్షించేందుకు అపొస్తలుడైన పేతురు కత్తి దూశాడు. కానీ, “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు” అని యేసు ఆయనకు చెప్పాడు. (మత్తయి 26:51, 52) అవును, మానవ చరిత్ర మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నట్లు, హింస హింసను రేకెత్తిస్తుంది. ఆయుధాలతో తనను తానే రక్షించుకునే అవకాశమే కాక, తనను రక్షించుకోగల మరొక మార్గం కూడా యేసుకు ఉండింది. “ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువమంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?” అని యేసు పేతురుతో అన్నాడు.—మత్తయి 26:53.

హింసకు పాల్పడే బదులు, దూతల సంరక్షణను తీసుకునే బదులు, తనను చంపేవారు తనను పట్టుకునేందుకు యేసు తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకని? ఒక కారణమేమిటంటే, భూమి మీద జరుగుతున్న తప్పిదాలను తన పరలోక తండ్రి అంతం చేసే సమయం ఇంకా రాలేదని ఆయనకు తెలుసు. విషయాలను తన చేతుల్లోకి తీసుకునే బదులు, ఆయన యెహోవాపై నమ్మకం ఉంచాడు.

అలా ఆధారపడడం బలహీనత కాదు, అది చాలా గొప్ప అంతర్గత బలమే. యెహోవా తన సరైన సమయంలో తనదైన పద్ధతిలో కార్యాలను సరిదిద్దుతాడు అన్న బలమైన విశ్వాసాన్ని యేసు ప్రదర్శించాడు. యేసు తాను చూపించిన విధేయత వల్ల, యెహోవా తర్వాతి మహిమాన్విత స్థానానికి హెచ్చించబడ్డాడు. యేసు గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.”—ఫిలిప్పీయులు 2:8-11.

హింసను అంతం చేస్తానన్న దేవుని వాగ్దానం

నిజ క్రైస్తవులు, యేసు మాదిరికీ బోధలకూ అనుసారంగా తమ జీవితాన్ని మలచుకుంటారు. లోకరీత్యా ప్రఖ్యాతిగాంచిన దౌర్జన్యకారులను వాళ్ళు ప్రశంసించరు లేక అనుకరించరు. నోవహు కాలంలోని దుష్టులకు జరిగినట్లుగానే, అలాంటి వాళ్ళు, దేవుని సరైన సమయంలో శాశ్వతంగా తుడిచివేయబడతారు అని నిజక్రైస్తవులకు తెలుసు.

దేవుడే భూమినీ మానవజాతినీ సృష్టించినవాడు. సర్వోన్నతాధికారిగా ఉండే సంపూర్ణ హక్కు ఆయనకుంది. (ప్రకటన 4:10) మానవ జడ్జికి న్యాయనిర్ణయాలను తీసుకునే చట్టబద్ధమైన అధికారం ఉంటే, దేవుడికి అంతకన్నా ఎక్కువ అధికారం ఉంది. తన నీతిమంతమైన సూత్రాలంటే తనకున్న గౌరవాన్ని బట్టి, అలాగే, తనను ప్రేమించే వారి మీద తనకున్న ప్రేమను బట్టి, దుష్టత్వాన్నంతటినీ దుష్టులనందరినీ అంతంచేయకుండా ఆయన ఉండలేడు.—మత్తయి 13:41, 42; లూకా 17:26-30.

భూమి మీద నీతి న్యాయములనే పునాదిపై శాంతి కలకాలం నిలిచేందుకు అది దారితీస్తుంది. యేసుక్రీస్తు గురించి అందరికీ తెలిసిన ప్రవచనంలో అది చక్కగా చెప్పబడింది: “మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను; ఆయన భుజముమీద రాజ్యభారముండును. అశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.”—యెషయా 9:6, 7.

“బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయ గోరవద్దు. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును” అని సంవత్సరాల క్రితం ఇవ్వబడిన దైవప్రేరేపిత ఉపదేశాన్ని క్రైస్తవులు అనుసరించడానికి మంచి కారణమే ఉంది.—సామెతలు 3:31, 32.

[అధస్సూచి]

^ పేరా 17 ఈ దుష్ట హింసాత్మక వ్యక్తిత్వాలను అనేక వీడియో గేమ్‌లలోని, విజ్ఞానశాస్త్ర సంబంధ సినిమాల్లోని హింసాత్మక పాత్రలు మరింత ఉద్ధృతంగా ప్రతిబింబిస్తున్నాయి.

[29వ పేజీలోని బ్లర్బ్‌]

ఆధునిక కాలంలోని శక్తిమంతులు వాళ్ళ బలాన్ని బట్టి, హింసకు రెట్టింపుగా హింసించే సామర్థ్యాన్ని బట్టి ప్రశంసించబడతారు

[26వ పేజీలోని చిత్రం]

Alinari/Art Resource, NY