కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా బలాన్ని బట్టి ఓదార్పును పొందండి

యెహోవా బలాన్ని బట్టి ఓదార్పును పొందండి

యెహోవా బలాన్ని బట్టి ఓదార్పును పొందండి

“నేను విచారములలో చిక్కుకొనినచో నీవు నన్ను ఓదార్చి సంతోషచిత్తుని చేయుదువు.”కీర్తన 94:19, క్యాతలిక్‌ అనువాదము.

ఉపశమనం కోసం పరితపించే వారందరినీ ఓదార్చగల మాటలు బైబిలులో ఉన్నాయి. “సంక్షోభభరితంగాను సందిగ్ధంగాను ఉన్న ఈ కాలంలో, లెక్కలేనంత మంది ప్రజలు ఓదార్పు కోసం, నిరీక్షణ కోసం, మార్గదర్శనం కోసం బైబిలు వైపుకు మళ్ళారు” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతుంది. ఎందుకని?

ఎందుకంటే, బైబిలును ప్రేరేపించింది “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు”ను మన ‘శ్రమ అంతటిలో మనలను ఆదరించువాడును’ అయిన మన ప్రేమపూర్వక సృష్టికర్తే. (2 కొరింథీయులు 1:3, 4) “ఆదరణకును కర్తయగు దేవుడు” ఆయనే. (రోమీయులు 15:5) మనకందరికీ ఉపశమనాన్నిచ్చే మాధ్యమాన్ని ఏర్పాటు చేయడంలో యెహోవా మాదిరినుంచాడు. మనకు నిరీక్షణనూ, ఓదార్పునూ ఇచ్చేందుకు ఆయన తన ఏకైక పుత్రుడైన క్రీస్తుయేసును ఈ భూమి మీదకు పంపించాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని యేసు బోధించాడు. (యోహాను 3:16) యెహోవా, ‘అనుదినము మన భారము భరించుచున్న, మన రక్షణకర్త’ అని బైబిలు వర్ణిస్తుంది. (కీర్తన 68:19) “సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను” అని దైవభయంగల మానవులు నమ్మకంగా చెప్పగలరు.—కీర్తన 16:8.

యెహోవా దేవునికి మానవులమైన మనపై ఎంత లోతైన ప్రేమ ఉందన్నది అలాంటి వాక్యభాగాలు చూపిస్తున్నాయి. విపత్కర కాలాల్లో మనకు కావలసినంత ఓదార్పునివ్వాలని, మనలను బాధ నుండి విముక్తులను చేయాలని ఆయన హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడనీ, అలా చేసే శక్తి ఆయనకు ఉందనీ స్పష్టమౌతుంది. “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.” (యెషయా 40:29) అయితే, యెహోవా బలాన్ని బట్టి మనమెలా ఓదార్పును పొందగలం?

యెహోవా శ్రద్ధ చూపడం వల్ల కలిగే ఉపశమనం

“నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు” అని కీర్తన రచయిత వ్రాశాడు. (కీర్తన 55:22) మానవ కుటుంబం మీద యెహోవా దేవునికి శ్రద్ధ ఉంది. “ఆయన [దేవుడు] మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు” అని అపొస్తలుడైన పేతురు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు హామీ ఇచ్చాడు. (1 పేతురు 5:7) “అయదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయనను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?” అని అంటూ, మానవులకు దేవుడు ఎంత విలువ ఇస్తాడన్న దాన్ని యేసుక్రీస్తు నొక్కి చెప్పాడు. (లూకా 12:6, 7) దేవుడు మనలను ఎంతో విలువైనవారిగా ఎంచుతున్నాడు గనుకనే, మనకు సంబంధించిన అల్ప విషయాలను కూడా ఆయన గమనిస్తున్నాడు. ఆయనకు మన మీద చాలా శ్రద్ధ ఉంది కనుక, మనలను గురించి మనకు తెలియని విషయాలు కూడా ఆయనకు తెలుసు.

ముందటి శీర్షికలో పేర్కొనబడిన, వ్యభిచారిణిగా మారిన స్వెట్లానా అనే అమ్మాయి యెహోవా వ్యక్తిగతంగా చూపే ఈ శ్రద్ధను గ్రహించి చాలా ఓదార్పు పొందింది. ఆత్మహత్య చేసుకోబోతుండగా యెహోవాసాక్షులు ఆమెను కలిశారు. తర్వాత ఆమె బైబిలు పఠనానికి అంగీకరించింది. తన క్షేమంలో నిజంగా ఆసక్తిగల నిజమైన వ్యక్తిగా యెహోవాను తెలుసుకునేందుకు అది ఆమెకు సహాయపడింది. ఆమె అలా తెలుసుకున్నప్పుడు, తన జీవన శైలిని మార్చుకుని, తనను తాను దేవునికి సమర్పించుకునేందుకు ఆమె హృదయం కదిలించబడింది. తనకు సమస్యలున్నప్పటికీ, పట్టుదలగా ముందుకు పోయేందుకు జీవితాన్ని గురించి అనుకూల దృక్కోణాన్ని కలిగివుండేందుకు కావలసిన ఆత్మగౌరవాన్ని అది ఆమెకు ఇచ్చింది. “యెహోవా నన్నెన్నడూ ఎడబాయడని నాకు నమ్మకముంది. 1 పేతురు 5:7 లో వ్రాయబడిన మాటలు నిజమని నేను కనుగొన్నాను. ‘ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు యెహోవా మీద వేయుడి’ అని ఆ వాక్యం చెబుతుంది” అని ఆమె ఇప్పుడు అంటోంది.

బైబిలు ఆధారిత నిరీక్షణ ఓదార్పునిస్తుంది

దేవుడు మనకు ఇచ్చిన తన లిఖిత వాక్యం, ఆయన ఓదార్పునిచ్చే ఒక విశిష్ట మార్గం. అందులో భవిష్యత్తును గురించిన అద్భుతమైన నిరీక్షణ ఉంది. “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 15:4) “మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, మీ హృదయములను ఆదరించి, ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక” అని వ్రాసినప్పుడు పౌలు, నిజమైన నిరీక్షణకూ ఓదార్పుకూ మధ్యనున్న సంబంధాన్ని స్పష్టం చేశాడు. (2 థెస్సలొనీకయులు 2:16, 17) ఈ “శుభ నిరీక్షణ”లో పరదైసు భూమిపై పరిపూర్ణమైన, సంతోషకరమైన జీవితాన్ని అనంతకాలం గడపగలమనే ఉత్తరాపేక్ష ఇమిడి ఉంది.—2 పేతురు 3:13.

అలాంటి అభయం గల ఉజ్జ్వలమైన నిరీక్షణ, ముందటి శీర్షికలో పేర్కొన్న త్రాగుడు మొదలెట్టిన పక్షవాతం వచ్చిన లైమానిస్‌ను ఎంతో ప్రోత్సాహపరచింది. బైబిలు ఆధారిత యెహోవాసాక్షుల సాహిత్యాన్ని చదవడం ద్వారా, తన ఆరోగ్యం పరిపూర్ణంగా బాగుపడగల దేవుని రాజ్యం క్రిందనున్న నూతన లోకం గురించి తెలుసుకుని చాలా ఆనందించాడు. “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులువేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును” అని చెబుతున్న బైబిలులోని ఉజ్జ్వలమైన వాగ్దానాన్ని, అంటే అద్భుతంగా స్వస్థపర్చబడతారన్న వాగ్దానాన్ని ఆయన చదివాడు. (యెషయా 35:5, 6) లైమానిస్‌, ఆ పరదైసులో నివసించేందుకు తాను యోగ్యుడనవ్వాలని, తన జీవితంలో పెద్ద మార్పులను చేసుకున్నాడు. ఆయన త్రాగుడు మానుకున్నాడు. ఆయన వ్యక్తిత్వంలో వచ్చిన మార్పును ఆయన పొరుగువాళ్ళూ పరిచయస్థులూ గమనించారు. ఆయన ఇప్పుడు అనేక బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నాడు, బైబిలు ఆధారిత నిరీక్షణ ఇచ్చే ఓదార్పును గురించి ఇతరులకు తెలియజేస్తున్నాడు.

ప్రార్థన పాత్ర

ఏదైన ఒక కారణం చేత మనం బాధతో ఉన్నట్లయితే, యెహోవాకు ప్రార్థన చేయడం ద్వారా మనం ఓదార్పును పొందగల్గుతాము. అది మన భారాన్ని తగ్గించేస్తుంది. మనం విజ్ఞాపనలు చేసుకునేటప్పుడు, దేవుని వాక్యంలో చెప్పబడిన విషయాలను గుర్తుచేసుకోవడం ద్వారా మనం ఓదార్పును పొందవచ్చు. బైబిలులో ఉన్న అత్యంత పెద్ద కీర్తన చక్కని ప్రార్థనలా ఉంది. “యెహోవా, పూర్వకాలమునుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసికొని నేను ఓదార్పు నొందితిని” అని ఆ కీర్తనను కూర్చిన వ్యక్తి పాడాడు. (కీర్తన 119:52) ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన సమస్యల్లో ఉన్నప్పుడు, తరచూ దానికి సూటైన ఏకైక సమాధానం ఏమీ ఉండదు. మన సొంత బలంతో, మనం ఎటువైపుకు తిరగాలో మనకు తెలియకపోవచ్చు. మానవరీత్యా మన యథాశక్తి చేసిన తర్వాత, ప్రార్థనలో దేవునివైపుకు మరలినప్పుడు ఎంతో ఓదార్పును పొందినట్లు, కొన్నిసార్లు అనుకోని పరిష్కారాలు లభించినట్లు అనేకులు కనుగొన్నారు.—1 కొరింథీయులు 10:13.

ప్యాట్‌ను ఎమర్జెన్సీ రూమ్‌కి తీసుకెళ్లాక, అక్కడ ఆమె ప్రార్థన ద్వారా ఓదార్పును పొందింది. “నేను యెహోవాకు ప్రార్థించాను, నా ప్రాణాన్ని యెహోవా చేతిలో పెట్టి, ఆయనకు ఏది చిత్తమైతే అది చేసేందుకు వదిలేయాలని తెలుసుకున్నాను. ఆ సమయమంతటిలోను నేను ప్రశాంతంగా ఉన్నాను; ఫిలిప్పీయులు 4:6, 7 లో పేర్కొనబడిన దేవుని సమాధానాన్ని అనుభవించాను” అని ఆమె అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత అంది. మనందరికీ ఈ వచనాలు ఎంత ఓదార్పునిచ్చేవిగా ఉన్నాయి! ఈ వచనాల్లో, “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” అని పౌలు మనకు బోధిస్తున్నాడు.

పరిశుద్ధాత్మ ఓదార్పునిస్తుంది

యేసు తాను చనిపోవడానికి ఒక రాత్రి ముందు, తాను త్వరలోనే వారిని విడిచి వెళ్తానని తన అపొస్తలులకు చెప్పాడు. ఆ మాట వాళ్ళను ఎంతగానో కలవరపరచింది, వాళ్ళకు ఎంతో దుఃఖం కలిగించింది. (యోహాను 13:33, 36; 14:27-31) వాళ్ళకు ఓదార్పు అవసరముందని యేసు గ్రహించి, “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును” అని వాగ్దానం చేశాడు. (యోహాను 14:16) యేసు ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. అపొస్తలులు పరీక్షల్లో ఉన్నప్పుడు ఇతర విషయాలతో పాటు, దేవుని ఆత్మ వాళ్ళను ఓదార్చింది, వాళ్ళు దేవుని చిత్తాన్ని చేయడంలో కొనసాగేందుకు వారిని బలపరచింది.—అపొస్తలుల కార్యములు 4:31.

తన భర్త, చాలా తీవ్రమైన ప్రమాదానికి గురైన తర్వాత, ఆయన మరణం సమీపించినప్పుడు, ఏంజీ తనకు కలిగిన మానసిక సంక్షోభాన్నీ, ఆ పరిస్థితిలో కలిగిన మనో వేదననూ తట్టుకోగలిగింది. ఆమెకు ఏమి సహాయపడింది? “యెహోవా పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే, మాకు సంభవించినవాటిని మేము తట్టుకుని, బలంగా నిలబడలేకపోయేవాళ్ళం. మేము బలహీనంగా ఉన్నప్పుడు, యెహోవా బలం నిజంగా బయలుపరచబడింది, విపత్కర సమయంలో ఆయన మాకు బలమైన కోటగా ఉన్నానని నిరూపించుకున్నాడు” అని ఆమె చెబుతుంది.

ఓదార్పునిచ్చే సహోదరత్వం

ఒక వ్యక్తి జీవితంలో పరిస్థితి ఏదైనప్పటికీ, ఎంత వేదనకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ, యెహోవా సంఘంలో ఉన్న సహోదరత్వాన్ని బట్టి ఓదార్పును పొందగల్గాలి. ఈ సహోదరత్వం సహవాసులకు ఆధ్యాత్మిక ఆలంబననూ సహాయాన్నీ ఇస్తుంది. ప్రేమగల, తనను గురించిన చింతగల, ఓదార్పునిచ్చే స్నేహితుల బృందాన్ని, విపత్కర సమయాల్లో ఇతరులకు సహాయాన్నందించేందుకూ, సాంత్వననిచ్చేందుకూ సిద్ధంగా ఉండే సుముఖత చూపే వారిని అక్కడ చూడవచ్చు.—2 కొరింథీయులు 7:5-7.

“మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము” అని క్రైస్తవ సంఘ సభ్యులకు బోధించబడుతుంది. (గలతీయులు 6:10) వాళ్ళు పొందే బైబిలు ఆధార విద్య, ఒకరి మీద ఒకరు సహోదర ప్రేమను కనబరచుకునేందుకూ, ఆప్యాయతానురాగాలను చూపించుకునేందుకూ వాళ్ళను కదిలిస్తుంది. (రోమీయులు 12:10; 1 పేతురు 3:8) సంఘంలో ఉన్న ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు దయగలవారిగాను, ఓదార్చేవారిగాను, ఆర్ద్రతా సహానుభూతీ గలవారిగాను ఉండేందుకు కదిలించబడతారు.—ఎఫెసీయులు 4:32.

జో, రిబెకాల కుమారుడు చాలా దారుణమైన మరణానికి గురయ్యాడు. వాళ్ళు క్రైస్తవ సంఘ సభ్యుల నుండి ఓదార్పుకరమైన ఆలంబనను అనుభవించారు. “మేము క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు, యెహోవా, ఆయన ప్రేమపూర్వక సంఘ సభ్యులూ మాకు సహాయం చేశారు. వందలాది కార్డులూ, ఉత్తరాలూ, ఫోన్‌ కాల్సూ అందాయి. మన సహోదరత్వం ఎంత ప్రశస్తమైనదన్న విషయాన్ని గ్రహించేందుకు ఇది మాకు సహాయపడింది. ఆ దుర్ఘటన వల్ల మేము ఎంతో ఆఘాతానికి గురై ఉండగా, అనేక స్థానిక సంఘాలవారు మాకు భోజనం వండి పెడుతూ, మా ఇంటిని శుభ్రం చేస్తూ మాకు సహాయం చేశారు” అని వాళ్ళు అంటున్నారు.

ఓదార్పును పొందండి

ప్రతికూలత అనే పెనుగాలి వీచినప్పుడు, కరుణారాహిత్యమనే వర్షం కుండపోతగా కురిసినప్పుడు, విపత్తు అనే వడగండ్లు పడుతూ ఉన్నప్పుడు, మనకు ఓదార్పుకరమైన కాపుదలనిచ్చేందుకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. “ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును” అని అంటూ ఆయన ఓదార్పుకరమైన ఆశ్రయాన్నిచ్చేవాడని కీర్తనలలో ఒకటి ఆయనను వర్ణిస్తుంది. (కీర్తన 91:4) ఈ వివరణ గద్దను సూచిస్తుండవచ్చు. ఇది ప్రమాదాన్ని పసిగట్టి, తన పిల్లల మీదకు తన రెక్కలను చాచి సంరక్షించే పక్షిని చిత్రీకరిస్తుంది. విస్తృతార్థంలో చెప్పాలంటే, తన దగ్గర ఆశ్రయాన్ని పొందేవారందరికీ యెహోవాయే నిజమైన రక్షకుడు.—కీర్తన 7:1.

దేవుడ్ని గురించీ, ఆయన వ్యక్తిత్వాన్ని గురించీ, ఆయన ఉద్దేశాల గురించీ, ఓదార్పునిచ్చేందుకు ఆయనకు గల సామర్థ్యాన్ని గురించీ మీరు మరెక్కువగా తెలుసుకోవాలనుకుంటే, మీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆ ప్రయత్నంలో మీకు సహాయపడేందుకు యెహోవాసాక్షులు సంతోషిస్తారు. అవును, యెహోవా బలాన్ని బట్టి మీరు కూడా ఓదార్పును పొందగలరు !

[7వ పేజీలోని చిత్రాలు]

భవిష్యత్తును గురించిన బైబిలు ఆధార నిరీక్షణ ఓదార్పునివ్వగలదు