ఆత్మ ఖడ్గముతో అవినీతిని ఎదుర్కోవడం
ఆత్మ ఖడ్గముతో అవినీతిని ఎదుర్కోవడం
“నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.”
ఉచ్ఛ స్థాయిలో ఉన్నప్పటి రోమా సామ్రాజ్యం, ప్రపంచం ఇంతవరకూ చూసిన మానవ ప్రభుత్వ యంత్రాంగాలలో అత్యంత గొప్పది. రోమా శాసన నిర్మాణం ఎంత ప్రభావవంతంగా ఉండేదంటే, ఇప్పటికీ అది అనేక దేశాల శాసన నియమావళికి ఆధారంగా ఉంది. అయితే రోము ఎన్ని సాఫల్యాలను సాధించినప్పటికీ, దాని సైన్యాలు ఒక్క మోసకరమైన శత్రువును మాత్రం జయించలేకపోయాయి, అదే అవినీతి. చివరికి, అవినీతే రోమా సామ్రాజ్యపు పతన హేతువైంది.
అవినీతిపరులైన రోమా అధికారుల చేతుల్లో బాధలు పడినవారిలో అపొస్తలుడైన పౌలు ఒకరు. ఆయనను విచారణ చేసిన రోమా గవర్నరైన ఫేలిక్సు, పౌలు నిర్దోషిత్వాన్ని గుర్తించాడని స్పష్టమౌతుంది. కానీ, ఆ కాలంనాటి ఘోరమైన అవినీతిపరులలో ఒకరైన ఫేలిక్సు, విడుదల పొందడానికిగానూ పౌలు తనకు డబ్బు ముట్టజెప్తాడేమోనని ఎదురుచూస్తూ విచారణను వాయిదా వేస్తూ వచ్చాడు.—అపొస్తలుల కార్యములు 24:22-26.
ఫేలిక్సుకు లంచమిచ్చే బదులు, పౌలు ఆయనతో “నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు” నిర్మొహమాటంగా మాట్లాడాడు. ఫేలిక్సు తన నడతలు మార్చుకోలేదు, లంచమిచ్చి చట్టాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించే బదులు పౌలు చెరసాలలోనే ఉండిపోయాడు. ఆయన సత్యం గురించీ, నిజాయితీ గురించీ ప్రకటించాడు, దానికి అనుగుణ్యంగానే జీవించాడు. “మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాము” హెబ్రీయులు 13:18.
అని ఆయన యూదా క్రైస్తవులకు వ్రాశాడు.—అలాంటి ప్రవర్తన ఆ కాలంనాటి నైతిక ప్రమాణాలకు పూర్తి భిన్నంగా కన్పిస్తుంది. ఫేలిక్సు సహోదరుడైన పల్లాస్ ప్రాచీన ప్రపంచంలోని సంపన్నులలో ఒకడు, ఆయన ఆస్తి మొత్తం 4 కోట్ల 50 లక్షల మిలియన్ల అమెరికా డాలర్లు ఉంటుందని అంచనా వేయబడుతుంది, అయితే దాదాపు అదంతా ఆయన లంచం తీసుకోవడం ద్వారా, డబ్బు గుంజడం ద్వారా సంపాదించాడు. అయితే, 20వ శతాబ్దపు అవినీతిపరులైన పాలకులు రహస్య బ్యాంకు అక్కౌంట్లలో దాచుకున్న బిలియన్ల డాలర్లతో పోలిస్తే ఆయన ధనసంపద అల్పమైనదే. స్పష్టంగా, నేటి ప్రభుత్వాలు అవినీతిపై విజయం సాధించాయంటే అమాయకులే నమ్మాలి.
అవినీతి ఇంతకాలం నుండి లోతుగా పాతుకుని ఉంది గనుక, అది కేవలం మానవ నైజమని మనం అనుకోవాలా? లేక అవినీతిని అరికట్టడానికి ఏమైనా చేసే అవకాశం ఉందా?
అవినీతిని ఎలా అరికట్టవచ్చు?
అవినీతిని అరికట్టడంలో మొదటి మెట్టు అది నాశనకరమైనదీ, తప్పూ అని గుర్తించడమే, ఎందుకంటే అది ఇతరులకు హాని కల్గిస్తూ, అనీతిమంతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. నిస్సందేహంగా అలా గుర్తించే విషయంలో కొంత అభివృద్ధి సాధించడం జరిగింది. అమెరికా డిప్యూటి సెక్రెటరీ ఆఫ్ స్టేట్ అయిన జేమ్స్ ఫోలీ ఇలా అన్నాడు: “లంచం మూలంగా చెల్లించే మూల్యం చాలా ఎక్కువని మనమందరం గుర్తిస్తాము. లంచాలు మంచి పరిపాలనను బలహీనపర్చి, ఆర్థిక సామర్థ్యానికీ అభివృద్ధికీ హాని కలిగించి, వాణిజ్యాన్ని వక్రీకరించి, ప్రపంచవ్యాప్త పౌరులకు నష్టం వాటిల్లజేస్తాయి.” చాలామంది ఆయనతో ఏకీభవించవచ్చు. “విశ్వవ్యాప్తంగా జరుగుతున్న అవినీతి వ్యతిరేక పోరాటానికి గట్టి ప్రభావాన్ని చేకూర్చటానికి” రూపొందించబడిన “లంచం ఒప్పందం” మీద, 1997 డిసెంబరు 17న, 34 ప్రముఖ దేశాలు సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ప్రకారం, “అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలను సంపాదించుకునేందుకు లేక వాటిని కాపాడుకునేందుకు విదేశీ ప్రజాధికారికి లంచం ఇవ్వజూపడం, ఇస్తానని వాగ్దానం చేయడం లేక ఇవ్వడం నేరం.”
అయితే, విదేశాల్లో వ్యాపార లావాదేవీలు సంపాదించుకోవడానికి ఇవ్వబడే లంచాలు తక్కువే ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిపుచ్చుకునే లంచాలు పెనుభూతంలా ఉన్నాయి. అన్ని స్థాయిల్లోనూ అవినీతిని అరికట్టేందుకు, రెండవ, మరింత కష్టతరమైన చర్య అవసరం: హృదయంలో మార్పు, లేదా అనేక హృదయాల్లో మార్పు. ఎక్కడెక్కడా ఉన్న ప్రజలంతా లంచాన్ని, అవినీతిని ద్వేషించడం నేర్చుకోవాలి. అప్పుడే ఆ అక్రమ లాభార్జన అంతర్థానమౌతుంది. దాన్ని సాధించేందుకు, ప్రభుత్వాలు “సాధారణ పౌర నీతిని” ప్రోత్సహించాలని కొంతమంది భావిస్తున్నట్లు న్యూస్‌వీక్ పత్రిక తెలియజేసింది. అలాగే, తమ మద్దతుదారులు పనిస్థలంలో “‘నిజాయితీ బీజాన్ని’ ప్రవేశపెట్టాలని” అవినీతి వ్యతిరేక బృందమైన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సిఫారసు చేస్తుంది.
అవినీతికి వ్యతిరేకంగా చేసే పోరాటం నైతికపరమైనది, దాన్ని కేవలం శాసనం ద్వారానో లేక చట్టబద్ధమైన దండనా “ఖడ్గము”తోనో జయించడం సాధ్యం కాదు. (రోమీయులు 13:3-5) మంచి, యథార్థతల బీజాలు ప్రజల హృదయాల్లో నాటబడాలి. దీన్ని, అపొస్తలుడైన పౌలు “ఆత్మ ఖడ్గము” అని వర్ణించిన దేవుని వాక్యమైన బైబిలును ఉపయోగించడం ద్వారా చక్కగా సాధించవచ్చు.—ఎఫెసీయులు 6:17.
బైబిలు అవినీతిని ఖండిస్తుంది
పౌలు అవినీతికి పాల్పడటానికి ఎందుకు నిరాకరించాడు? ఎందుకంటే, “నరులముఖమును లక్ష్యపెట్టని . . . లంచము పుచ్చుకొనని” దేవుని చిత్తాన్ని చేయాలని ఆయన కోరుకున్నాడు. (ద్వితీయోపదేశకాండము 10:17) అంతేగాక, “నీవు . . . పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును” అని మోషే ధర్మశాస్త్రంలో ఉన్న నిర్దిష్టమైన సూచనను పౌలు జ్ఞాపకం ఉంచుకున్నాడు అనటంలో సందేహం లేదు. (ద్వితీయోపదేశకాండము 16:19) అలాగే రాజైన దావీదు, యెహోవా అవినీతిని ద్వేషిస్తాడని అర్థం చేసుకున్నాడు, “కుడిచెయ్య లంచములతో నిండియున్న” పాపులతో తనను లెక్కించవద్దని ఆయన దేవునికి విజ్ఞప్తి చేశాడు.—కీర్తన 26:10.
దేవుణ్ని యథార్థంగా ఆరాధించేవారు అవినీతిని నిరాకరించడానికి వారికి అదనపు కారణాలున్నాయి. సొలొమోను ఇలా వ్రాశాడు: “న్యాయము జరిగించుటవలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడుచేయును.” (సామెతలు 29:4) ఉన్నతాధికారి నుండీ చిన్న ఉద్యోగి వరకూ ప్రతి ఒక్కరూ న్యాయాన్ని పాటించడం క్షేమాన్ని తెస్తుంది, అయితే అవినీతి దేశాన్ని హరించి వేస్తుంది. ఆసక్తికరంగా, న్యూస్‌వీక్ పత్రిక ఇలా పేర్కొంది: “లంచంలో తనకూ ఒక వంతు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకునే విధానంలో, దాన్ని ఎలా పొందాలో తెలిసిన ప్రజలున్న విధానంలో, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతుందంతే.”
కీర్తన 73:3, 13) అయితే మరి మనకు స్వతఃసిద్ధంగా న్యాయాన్ని గూర్చిన తలంపునిచ్చిన సృష్టికర్త ఎలా భావిస్తాడు? ఆయన దృష్టిలో కూడా అది తప్పే. అందుకే గతంలో కూడా అవినీతి పెచ్చుపెరిగినప్పుడు ఆయన చూస్తూ ఊరుకోలేదు. ఆయన జోక్యం చేసుకుని దాన్ని నిర్మూలించాడు. ఉదాహరణకు, యెరూషలేము నివాసులను తాను వారి శత్రువుల చేతికి ఎందుకు అప్పగిస్తున్నాడో ఆయన వారికి కరకుగా తెలియజేశాడు.
అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థలు సంపూర్ణంగా కూలిపోకపోయినా న్యాయాన్ని ప్రేమించేవారు వ్యధ చెందుతారు. (తన ప్రవక్తయైన మీకా ద్వారా దేవుడు ఇలా చెప్పాడు: “యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; . . . కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును.” శతాబ్దాల తర్వాత అవినీతి రోమును నాశనం చేసినట్లుగానే, ఇశ్రాయేలు సమాజాన్ని కూడా నాశనం చేసింది. దేవుడు హెచ్చరించినట్లుగానే, మీకా ఆ మాటలు వ్రాసిన దాదాపు శతాబ్దం తర్వాత, యెరూషలేము నాశనం చేయబడి విడిచిపెట్టబడింది.—మీకా 3:9, 11, 12.
అయితే, ఏ మనిషీ లేక దేశమూ అవినీతికి పాల్పడనవసరం లేదు. తమ జీవిత విధానాన్నీ, తమ ఆలోచనా విధానాన్నీ మార్చుకోమని దేవుడు దుష్టులను ప్రోత్సహిస్తున్నాడు. (యెషయా 55:7) మనలో ప్రతి ఒక్కరమూ దురాశ స్థానే నిస్వార్థాన్ని, అవినీతి స్థానే నీతిని అలవర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. “దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు” అని యెహోవా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.—సామెతలు 14:31.
బైబిలు సత్యంతో అవినీతిపై విజయం సాధించడం
అలాంటి మార్పు చేసుకోవడానికి ఒక వ్యక్తిని ఏది కదిలించగలదు? యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన అనుచరునిగా తయారయ్యేందుకు పరిసయ్యునిగా తన జీవితాన్ని పరిత్యజించిన పౌలును కదిలించిన శక్తే ప్రతి ఒక్కరినీ కదిలించగలదు. “దేవుని వాక్యము సజీవమై బలముగలదై” ఉందని ఆయన వ్రాశాడు. (హెబ్రీయులు 4:12) నేడు, అవినీతిలో లోతుగా కూరుకుపోయిన వారిలో కూడా లేఖనాధార సత్యం ఇప్పటికీ నిజాయితీని పెంపొందింపజేస్తుంది. ఒక ఉదాహరణను పరిశీలించండి.
తూర్పు యూరపుకు చెందిన అలెగ్జాండర్ తన సైనిక సేవను ముగించి ఎంతోకాలం గడవక ముందే, మోసం, దోపిడీ, లంచగొండితనం వంటివాటికి పాల్పడే గుంపులో చేరాడు. * ఆయనిలా వివరిస్తున్నాడు: “సంపన్నులైన వ్యాపారస్థుల నుండి డబ్బు గుంజడం నా పని. ఒకసారి నేను ఒక వ్యాపారస్థుని నమ్మకాన్ని చూరగొన్న తర్వాత, మా గుంపులోని ఇతరులు అతడిపై దౌర్జన్యం చేసి అతడిని బెదిరించారు. పెద్ద మొత్తం ముట్టజెప్పితే నేను విషయాన్ని చక్కబెడతానన్నాను. తమ సమస్యలతో వ్యవహరించడానికి తమకు సహాయం చేసినందుకు నా ‘క్లయింట్స్’ నాకు కృతజ్ఞతలు తెలియజేశారు, నిజానికి వాళ్ల సమస్యలకు కారణం నేనే. ఎంతో విచిత్రంగా అనిపించినప్పటికీ, నేను నా పనిలో ఎక్కువగా ఇష్టపడింది ఈ అంశాన్నే.
“ఈ జీవన విధానం తీసుకువచ్చే డబ్బును, ఉల్లాసాన్ని కూడా నేను అనుభవించాను. నేను ఖరీదైన కారు నడిపించే వాడిని, చక్కటి బంగళాలో నివసించే వాడిని, నాకు ఏమి కావాలంటే అది కొనుక్కునేందుకు డబ్బు ఉండేది. ప్రజలు నేనంటే భయపడేవారు, అది నాకు ఒక విధమైన బలాన్నిచ్చేది. నన్నెవరూ తాకలేరనీ, నేను చట్టానికి అతీతుడననీ నేననుకున్నాను. పోలీసులతో వచ్చే ఏ సమస్యలనైనా, న్యాయ విధానాన్ని ఉల్లంఘించి పరిస్థితిని సరిచేయడంలో నిపుణుడైన న్యాయవాది సహాయంతో లేక సరైన వ్యక్తికి లంచం ఇవ్వడం ద్వారా నేను పరిష్కరించుకునే వాడిని.
“అయితే, అవినీతే జీవనోపాధిగా ఉన్నవారి మధ్య నమ్మకం చాలా అరుదుగా ఉంటుంది. మా బృందంలో ఒక వ్యక్తి నన్ను అయిష్టపడ్డాడు, ఇక అందరూ నన్ను అయిష్టపడటం మొదలు పెట్టారు. హఠాత్తుగా నేను నా విలాసవంతమైన కారును, డబ్బును, నా ఖరీదైన స్నేహితురాలిని కోల్పోయాను. నన్ను బాగా కొట్టారు కూడా. పరిస్థితుల్లో వచ్చిన ఈ మార్పు నేను జీవిత సంకల్పం గురించి గంభీరంగా ఆలోచించేలా చేసింది.
“కొన్ని నెలల క్రితం మా అమ్మ యెహోవాసాక్షి అయ్యింది, నేను వాళ్ల సాహిత్యం చదవడం మొదలు పెట్టాను. ‘భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము’ అని చెప్తున్న సామెతలు 4:14, 15 నిజంగా నేను ఆలోచించేలా చేసింది. నేర జీవితాన్ని గడిపే వారికి నిజమైన భవిష్యత్తంటూ ఏమీ లేదని ఇలాంటి వచనాలు నన్ను ఒప్పించాయి. నేను యెహోవాకు ప్రార్థించడం మొదలుపెట్టి, నన్ను సరైన మార్గంలో నడిపించమని వేడుకున్నాను. నేను యెహోవా సాక్షులతో బైబిలు పఠించి, చివరికి నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. ఇక అప్పటి నుండి నేను నిజాయితీగా జీవిస్తున్నాను.
“నిజాయితీ ప్రమాణాలకు అనుగుణంగా జీవించడం వల్ల ఎక్కువ డబ్బు సంపాదించలేకపోయేవాడిని. కాని నాకొక భవిష్యత్తు ఉందనీ, నా జీవితానికి నిజమైన అర్థం ఉందనీ నేనిప్పుడు భావిస్తున్నాను. ఎన్నో ఖరీదైన విలాసాలున్న మునుపటి జీవన విధానం ఏ క్షణంలోనైనా కూలిపోడానికి సిద్ధంగా ఉన్న పేకమేడ లాంటిదని నేను గ్రహించాను. మునుపు, నా మనస్సాక్షి స్తబ్దుగా ఉండేది. ఇప్పుడు, బైబిలు పఠనం మూలంగా, నేను చిన్న విషయాల్లో నిజాయితీ కనబర్చకపోయినా అది నన్ను గద్దిస్తుంది. ‘యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుచు దేశమందు నివసించి సత్యము ననుసరించుము’ అని చెప్తున్న కీర్తన 37:3 అనుసారంగా జీవించటానికి నేను ప్రయత్నిస్తున్నాను.”
“లంచము నసహ్యించుకొనువాడు బ్రదుకును”
అలెగ్జాండర్ కనుగొన్నట్లుగా, బైబిలు సత్యం ఒక వ్యక్తి అవినీతిని జయించేలా కదిలించగలదు. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన తన పత్రికలో చెప్పినదానికి అనుగుణంగా ఆయన మార్పులు చేసుకున్నాడు: “కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశలవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి; దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.” (ఎఫెసీయులు 4:22-28) మానవజాతి భవిష్యత్తే అలాంటి మార్పుల మీద అధారపడి ఉంది.
గమనించి చూసుకోకపోతే, దురాశ, అవినీతి రోమా సామ్రాజ్య పతనానికి దోహదపడినట్లుగానే, భూమిని నాశనం చేయగలవు. అయితే సంతోషకరంగా, మానవజాతి సృష్టికర్త అలాంటి విషయాలను పట్టించుకోకుండా వదిలేయాలనుకోవడం లేదు. ఆయన “భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకు” నిశ్చయించుకున్నాడు. (ప్రకటన 11:18) త్వరలోనే “క్రొత్త ఆకాశము . . . క్రొత్త భూమి” వస్తాయనీ, వాటిలో “నీతి నివసించును” అనీ అవినీతిలేని లోకం కోసం పరితపించే వారికి యెహోవా వాగ్దానం చేస్తున్నాడు.—2 పేతురు 3:13.
నిజమే, నేడు నిజాయితీ ప్రమాణాలకు అనుగుణ్యంగా జీవించడం అంత సులభమేమీ కాదు. అయినప్పటికీ, కాలం గడుస్తుండగా, “లోభి తన యింటివారిని బాధపెట్టును, లంచము నసహ్యించుకొనువాడు బ్రదుకును” అని యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు. * (సామెతలు 15:27) ఇప్పుడు మనం అవినీతికి పాల్పడకుండా ఉండటం ద్వారా, “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,” అని దేవునికి ప్రార్థించినప్పుడు మనం మన యథార్థతను చూపిస్తాము.—మత్తయి 6:9.
ఆ రాజ్యం చర్య తీసుకోవాలని మనం ఎదురు చూస్తుండగా, మనలో ప్రతి ఒక్కరం అవినీతిని చూసీ చూడనట్లు ఉండటానికి నిరాకరించగలం, లేక అవినీతికి పాల్పడకుండా ఉండగలం. అలా చేస్తే మనం, ‘నీతి ఫలించునట్లు విత్తనము” వేస్తున్నట్లు అర్థం. (హోషేయ 10:12) మనమలా చేస్తే, మన జీవితాలు కూడా దేవుని ప్రేరేపిత వాక్య శక్తికి నిదర్శనంగా ఉంటాయి. ఆత్మ ఖడ్గము అవినీతిని జయించగలదు.
[అధస్సూచీలు]
^ పేరా 21 ఆయన పేరు మార్చబడింది.
^ పేరా 29 అయితే, లంచానికి, కానుకకు మధ్య తేడా ఉంది. న్యాయాన్ని తప్పుదోవ పట్టించడానికి లేదా ఇతర అవినీతికరమైన ఉద్దేశాల కోసం లంచం ఇవ్వబడితే, కానుక అన్నది అందజేయబడిన సేవలపట్ల మెప్పును వ్యక్తపరుస్తూ ఇవ్వబడుతుంది. ఈ విషయం, కావలికోట (ఆంగ్లం) 1986 అక్టోబరు 1, సంచికలోని “పాఠకుల ప్రశ్నలు”లో వివరించబడింది.
[7వ పేజీలోని చిత్రం]
బైబిలు సహాయంతో, మనం “నూతన స్వభావమును” ధరించుకొని, అవినీతిని విడనాడవచ్చు