కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆత్మ చెప్తున్నదాన్ని వినండి

ఆత్మ చెప్తున్నదాన్ని వినండి

ఆత్మ చెప్తున్నదాన్ని వినండి

“మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను —‘ఇదే త్రోవ దీనిలో నడువుడి’ అని నీ వెనుకనుండియొక శబ్దము నీ చెవులకు వినబడును.”—యెషయా 30:21.

1, 2. చరిత్రంతటిలోనూ యెహోవా మానవులతో ఎలా సంభాషించాడు?

ప్యూర్టో రికో ద్వీపంలో, ప్రపంచలోకెల్లా అత్యంత పెద్దదీ, ఎంతో సునిశితమైనదీ అయిన సింగిల్‌డిష్‌ రేడియో టెలిస్కోప్‌ ఉంది. ఈ భారీ ఉపకరణాన్ని ఉపయోగించి, గ్రహాంతర జీవనం నుండి సందేశాలను అందుకోవాలని శాస్త్రజ్ఞులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకూ అలాంటి సందేశాలేవీ అందలేదు. అయితే, అలాంటి అత్యాధునికమైన ఉపకరణాలను ఉపయోగించకుండానే, మనలో ఎవరమైనా ఎప్పుడైనా అందుకోగల, మానవ పరిధికి వెలుపలి నుండి వస్తున్న సుస్పష్టమైన సందేశాలు ఉన్నాయి. ఇవి, ఏ ఊహాజనిత గ్రహాంతరం కంటే కూడా ఎంతో ఉన్నతమైన మూలం నుండే వస్తున్నాయి. అలాంటి సందేశాలకు మూలమెవరు, వాటిని ఎవరు అందుకుంటున్నారు? ఆ సందేశాలు ఏమి చెప్తున్నాయి?

2 దైవిక మూలం నుండి వచ్చిన సందేశాలు మానవ చెవులకు వినిపించిన సందర్భాల అనేక వృత్తాంతాలు బైబిలులో ఉన్నాయి. కొన్నిసార్లు ఈ సందేశాలు దేవుని దూతలుగా పనిచేస్తున్న ఆత్మ ప్రాణుల ద్వారా అందజేయబడ్డాయి. (ఆదికాండము 22:11, 15; జెకర్యా 4:4, 5; లూకా 1:26-28) మూడు సందర్భాల్లో, స్వయంగా యెహోవా స్వరం వినిపించింది. (మత్తయి 3:17; 17:5; యోహాను 12:28, 29) దేవుడు మానవ ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడాడు, వారిలో చాలామంది తాము చెప్పడానికి ప్రేరేపించబడిన వాటిని వ్రాసిపెట్టారు. నేడు, మనకు బైబిలుంది, దానిలో ఈ సంభాషణల్లో నుండి వ్రాసిపెట్టినవి కూడా ఉన్నాయి, అలాగే వాటిలో యేసు మరియు ఆయన శిష్యులు చేసిన బోధలు కూడా ఉన్నాయి. (హెబ్రీయులు 1:1, 2) యెహోవా నిజంగానే తన మానవ ప్రాణులకు సమాచారాన్ని అందజేస్తున్నాడు.

3. దేవుని సందేశాల సంకల్పమేమిటి, మన నుండి ఏమి అపేక్షించబడుతుంది?

3 దేవుని నుండి వచ్చిన ఈ ప్రేరేపిత సందేశాలన్నీ భౌతిక విశ్వం గురించి చాలా తక్కువ తెలియజేస్తాయి. అవి, ఇప్పుడూ భవిష్యత్తులోనూ మన జీవితాలపై ప్రభావాన్ని చూపే, మరింత ప్రాముఖ్యమైన విషయాలపై కేంద్రీకరించబడి ఉన్నాయి. (కీర్తన 19:7-11; 1 తిమోతి 4:8) యెహోవా ఆ ప్రేరేపిత సందేశాల్ని తన చిత్తాన్ని తెలియజేయటానికీ, తన నడిపింపును అందజేయటానికీ ఉపయోగిస్తాడు. ఒక విధంగా అవి ప్రవక్తయైన యెషయా పలికిన ఈ మాటల్ని నెరవేరుస్తున్నాయి: “మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండియొక శబ్దము నీ చెవులకు వినబడును.” (యెషయా 30:21) తన “శబ్దము”ను వినమని యెహోవా మనల్ని బలవంత పెట్టడు. దేవుని నిర్దేశాన్ని అనుసరిస్తూ, ఆయన మార్గంలో నడుస్తామా లేదా అన్నది మన ఇష్టమే. ఆ కారణాన్ని బట్టే లేఖనాలు యెహోవా నుండి వస్తున్న సందేశాలను వినమని మనకు ఉపదేశిస్తున్నాయి. ప్రకటన గ్రంథంలో, “ఆత్మ చెప్పుచున్న మాట” వినమన్న ప్రోత్సాహం ఏడుసార్లు కనిపిస్తుంది.—ప్రకటన 2:7, 11, 17, 29; 3:6, 13, 22.

4. మన కాలంలో దేవుడు పరలోకం నుండి సూటిగా మనతో సంభాషించాలని కోరుకోవడం సహేతుకమైనదేనా?

4 నేడు, యెహోవా పరలోకం నుండి మనతో సూటిగా మాట్లాడడు. బైబిలు కాలాల్లో సహితం, ఈ మానవాతీత సంభాషణలు చాలా అరుదుగా జరిగే సంఘటనలు, కొన్నిసార్లు శతాబ్దాల తర్వాత ఒకసారి అలా జరిగేవి. చరిత్రంతటిలోనూ, యెహోవా చాలా తరచుగా తన ప్రజలతో పరోక్ష మార్గాల్లోనే సంభాషించాడు. మన దినాల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. నేడు యెహోవా మనతో సంభాషిస్తున్న మూడు మార్గాలను పరిశీలిద్దాము.

“దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము”

5. నేడు యెహోవా మనతో సంభాషించే ప్రాథమికమైన ఉపకరణం ఏది, దాని నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

5 మానవులకు దేవునికి మధ్య సంభాషణకు ప్రధాన ఉపకరణం బైబిలు. అది దేవునిచే ప్రేరేపించబడింది, దానిలో ఉన్నదంతా మనకు ప్రయోజనకరమైనదిగా నిరూపించబడగలదు. (2 తిమోతి 3:16) యెహోవా స్వరం వినాలా వద్దా అనేది నిర్ణయించుకోవడంలో తమ స్వేచ్ఛా చిత్తాన్ని ఉపయోగించుకున్న నిజమైన వ్యక్తుల ఉదాహరణలు బైబిలులో కోకొల్లలుగా ఉన్నాయి. దేవుని ఆత్మ చెప్తున్నది వినడం ఎందుకు ప్రాముఖ్యమో అలాంటి ఉదాహరణలు మనకు గుర్తు చేస్తాయి. (1 కొరింథీయులు 10:11) మనం జీవితంలో నిర్ణయాలు తీసుకోవలసిన సమయాల కోసం బైబిలు మనకు ఉపదేశాన్నిస్తుంది, దానిలో ఆచరణాత్మకమైన జ్ఞానం కూడా ఉంది. దేవుడు మన వెనుక ఉండి, “ఇదే త్రోవ దీనిలో నడువుడి” అని మన చెవుల్లో చెప్తున్నట్లుంది.

6. ఇతర వ్రాతలన్నిటికన్నా బైబిలు ఎందుకు ఎంతో ఉన్నతమైనది?

6 బైబిలు పుటల ద్వారా ఆత్మ చెప్తున్నది వినాలంటే, మనం దాన్ని క్రమంగా చదవాలి. బైబిలు కేవలం నేడు అందుబాటులో ఉన్న అనేకానేక పుస్తకాల్లో ఒకటైన చక్కగా వ్రాయబడిన, ప్రఖ్యాత పుస్తకమేమీ కాదు. బైబిలు ఆత్మ ప్రేరేపిత పుస్తకం, దానిలో దేవుని తలంపులు ఉన్నాయి. హెబ్రీయులు 4:12 ఇలా చెప్తుంది: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” మనం బైబిలును చదువుతుండగా, దానిలోని విషయాలు మన అంతర్గత తలంపుల్లోకి, ప్రేరణల్లోకి ఖడ్గంలా చొచ్చుకొనిపోయి, మన జీవితాలు దేవుని చిత్తంతో ఎంత మేరకు పొందిక కల్గివున్నాయో బయల్పరుస్తాయి.

7. బైబిలు చదవడం ఎందుకు ప్రాముఖ్యం, మనం దాన్ని ఎంత తరచుగా చదవాలని ప్రోత్సహించబడుతున్నాము?

7 కాలం గడుస్తుండగా, జీవితంలో మనం ఎదుర్కుంటున్న ఆహ్లాదకరమైన, కష్టతరమైన అనుభవాలచే మనం ప్రభావితమౌతుండగా ‘హృదయముయొక్క తలంపులు ఆలోచనలు’ మారవచ్చు. మనం దేవుని వాక్యాన్ని విడువక అధ్యయనం చేయకపోతే, మన తలంపులు, దృక్పథాలు, భావోద్రేకాలు ఇక ఎంత మాత్రం దైవిక సూత్రాలకు అనుగుణ్యంగా ఉండవు. గనుక, బైబిలు మనకిలా ఉపదేశిస్తుంది: “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి.” (2 కొరింథీయులు 13:5) ఆత్మ చెప్పేది మనం వింటూనే ఉండాలంటే, దేవుని వాక్యాన్ని అనుదినం చదవమని ఇవ్వబడుతున్న ఉపదేశాన్ని గైకొనాలి.—కీర్తన 1:2.

8. బైబిలు చదవటానికి సంబంధించి మనల్ని మనం పరిశీలించుకోవడానికి, అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఏ మాటలు మనకు సహాయం చేస్తాయి?

8 బైబిలు పాఠకులకు ఒక ప్రాముఖ్యమైన జ్ఞాపిక: మీరు చదివేదాన్ని జీర్ణించుకునేందుకు తగినంత సమయాన్ని తీసుకోండి ! బైబిలును అనుదినం చదవాలన్న ఉపదేశాన్ని అనుసరించాలన్న ప్రయత్నంలో, మనం చదువుతున్న దాని భావాన్ని గ్రహించకుండా గబగబా అనేక అధ్యాయాలు చదివేయకూడదు. బైబిలును క్రమంగా చదవటం ప్రాముఖ్యమే అయినప్పటికీ, మన ఉద్దేశం కేవలం పఠన పట్టికను పాటించాలన్నదే అయ్యుండకూడదు; యెహోవా గురించి ఆయన సంకల్పాల గురించి తెలుసుకోవాలన్న నిజమైన కోరిక మనకుండాలి. ఈ విషయంలో, ఆత్మపరిశీలన కోసం అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఈ మాటలను ఉపయోగించుకోవచ్చు. తోటి క్రైస్తవులకు వ్రాస్తూ, ఆయనిలా అన్నాడు: “తండ్రియెదుట నేను మోకాళ్లూని . . . క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వర్యముచొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతోకూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.”—ఎఫెసీయులు 3:14-19.

9. యెహోవా నుండి నేర్చుకోవాలన్న కోరికను మనం ఎలా పెంచుకుని, దాన్ని ప్రగాఢం చేసుకోవచ్చు?

9 నిజమే, మనలో కొందరం స్వతహాగా చదవటాన్ని అంతగా ఇష్టపడని వారమైతే, మరికొందరు మంచి చదువరులై ఉండవచ్చు. అయితే వ్యక్తిగతంగా మన వైఖరి ఏదైనప్పటికీ, యెహోవా నుండి నేర్చుకోవాలన్న కోరికను మనం పెంచుకుని, దాన్ని ప్రగాఢం చేసుకోవచ్చు. బైబిలు జ్ఞానాన్ని మనం అపేక్షించాలని అపొస్తలుడైన పేతురు వివరించాడు, అలాంటి అపేక్షను అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఉంటుందని ఆయన గుర్తించాడు. ఆయనిలా వ్రాశాడు: “క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.” (ఇటాలిక్కులు మావి.) (1 పేతురు 2:1) మనం బైబిలు అధ్యయనం పట్ల ‘అపేక్షను’ పెంచుకోవాలంటే మనకు స్వయం-క్రమశిక్షణ అవసరం. మనం అంతకు ముందు రుచిచూడని ఒక కొత్త ఆహారాన్ని చాలాసార్లు రుచిచూసిన తర్వాత ఎలాగైతే దానిపట్ల ఇష్టాన్ని ఏర్పరచుకోవచ్చో అలాగే, మనం ఒక క్రమమైన ప్రణాళికను కల్గివుండేలా మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకుంటే చదవడం పట్ల అధ్యయనం చేయడం పట్ల మన దృక్పథం మెరుగుపడగలదు.

“తగినవేళ అన్నము”

10. ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు’ ఎవరిచే రూపొందించబడ్డాడు, యెహోవా వారిని నేడు ఎలా ఉపయోగించుకుంటున్నాడు?

10 నేడు మనతో మాట్లాడటానికి యెహోవా ఉపయోగించుకునే మరో మాధ్యమాన్ని మత్తయి 24:45-47 నందు యేసు గుర్తించాడు. అక్కడాయన ఆత్మాభిషిక్త క్రైస్తవ సంఘం గురించి అంటే, “తగినవేళ” ఆధ్యాత్మిక “అన్నము” పెట్టడానికి నియమించబడిన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ గురించి మాట్లాడాడు. వ్యక్తులుగా, ఈ తరగతిలోని సభ్యులు యేసు ‘ఇంటివారు.’ ‘వేరే గొర్రెలకు’ చెందిన “గొప్పసమూహము”తోపాటు వీరు ప్రోత్సాహాన్నీ, నడిపింపును పొందుతారు. (ప్రకటన 7:9; యోహాను 10:16) తగినవేళ పెట్టబడే ఈ అన్నములో అధికభాగం కావలికోట, తేజరిల్లు!, మరితర ముద్రిత ప్రచురణల రూపంలో లభిస్తుంది. అదనపు ఆధ్యాత్మిక ఆహారం సమావేశాల్లోనూ సంఘ కూటాల్లోనూ ఇవ్వబడే ప్రసంగాలు, ప్రదర్శనల రూపంలో అందించబడుతుంది.

11. ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా ఆత్మ చెప్తున్నదాన్ని వింటున్నామని మనం ఎలా నిరూపించుకుంటాము?

11 ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేసే సమాచారం మన విశ్వాసాన్ని బలపర్చటానికీ, మన జ్ఞానేంద్రియాలకు తర్ఫీదునివ్వటానికీ రూపొందించబడ్డాయి. (హెబ్రీయులు 5:14) ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అన్వయించుకో గలిగేలా అలాంటి ఉపదేశం సాధారణంగా అందరికీ వర్తించేదై ఉంటుంది. అప్పుడప్పుడు, మనం మన ప్రవర్తనకు సంబంధించిన నిర్దిష్టమైన అంశాలతో వ్యవహరించే ఉపదేశాన్ని కూడా పొందుతాము. దాసుని తరగతి ద్వారా ఆత్మ చెబుతున్నది మనం నిజంగా వింటుంటే మనం ఎలాంటి దృక్పథాన్ని కల్గివుండాలి? అపొస్తలుడైన పౌలు దానికిలా సమాధానమిస్తున్నాడు: “మీపైని నాయకులుగా ఉన్న . . . వారి మాట విని, వారికి లోబడియుండుడి.” (హెబ్రీయులు 13:17) నిజమే ఈ ఏర్పాటులో ఇమిడివున్న వారందరూ అపరిపూర్ణ మానవులే. అయినప్పటికీ, ఈ అంత్య కాలంలో మనకు నడిపింపునిచ్చేందుకు అపరిపూర్ణులైనప్పటికీ తన మానవ సేవకులను ఉపయోగించుకోవడంలో యెహోవా ఆనందాన్ని పొందుతున్నాడు.

మన మనస్సాక్షి ఇచ్చే నడిపింపు

12, 13. (ఎ) యెహోవా మన నడిపింపు కోసం ఏ ఇతర మూలాన్ని ఇచ్చాడు? (బి) దేవుని వాక్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానం లేని వారిపై కూడా మనస్సాక్షి ఎలాంటి అనుకూల ప్రభావాన్ని చూపించగలదు?

12 యెహోవా మనకు నడిపింపుకోసం మరో మూలాన్ని ఇచ్చాడు, అదే మన మనస్సాక్షి. ఆయన తప్పొప్పులను గ్రహించే అంతర్గత శక్తితో మానవుడిని సృష్టించాడు. అది మన ప్రవృత్తిలో ఒక భాగం. రోమీయులకు వ్రాసిన తన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.”—రోమీయులు 2:14, 15.

13 యెహోవా గురించి తెలియని అనేకులు, కొంతమేరకు, తప్పొప్పుల విషయంలో దైవిక సూత్రాలకు అనుగుణ్యంగా తమ తలంపులను, చర్యలను మలచుకోగల్గుతారు. బలహీనమైన అంతర్గత స్వరమేదో వారిని సరైన మార్గంలో నడవమని చెప్పడాన్ని వారు వింటున్నట్లుగా ఉంది. దేవుని వాక్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానం లేని వారి విషయంలోనే ఇది నిజం కాగల్గితే, నిజ క్రైస్తవుల విషయంలో ఆ అంతర్గత స్వరం ఇంకెంత ఎక్కువగా మాట్లాడాలి ! దేవుని వాక్యపు కచ్చితమైన జ్ఞానంతో శుద్ధీకరించబడి, యెహోవా పరిశుద్ధాత్మకు అనుగుణ్యంగా పనిచేసే క్రైస్తవ మనస్సాక్షి నమ్మదగిన నడిపింపును ఇవ్వగలదు.—రోమీయులు 9:2.

14. బైబిలు తర్ఫీదు పొందిన మనస్సాక్షి, యెహోవా ఆత్మ ఇస్తున్న నడిపింపును అనుసరించడానికి మనకెలా సహాయం చేయగలదు?

14 బైబిలు తర్ఫీదు పొందిన మంచి మనస్సాక్షి, మనం ఏ మార్గంలో నడవాలని ఆత్మ కోరుతుందో మనకు గుర్తు చేయగలదు. లేఖనాలుగానీ, బైబిలు ఆధారిత ప్రచురణలుగానీ నిర్దుష్టంగా వ్యాఖ్యానించని ఒకానొక పరిస్థితిని మనం ఎదుర్కునే సమయం రావచ్చు. అప్పుడు కూడా మన మనస్సాక్షి హానికరం కాగల మార్గాన్ని గురించి హెచ్చరికనిస్తూ, మనల్ని అప్రమత్తులను చేయగలదు. అలాంటి సందర్భాల్లో, మన మనస్సాక్షి ఇస్తున్న హెచ్చరికలను అలక్ష్యం చేయడం, ఒక విధంగా యెహోవా ఆత్మ చెప్తున్నదాన్ని అలక్ష్యం చేయడమే. మరో వైపున, తర్ఫీదు పొందిన మన క్రైస్తవ మనస్సాక్షిపై ఆధారపడటాన్ని నేర్చుకోవడం ద్వారా, వ్రాత రూపంలో నిర్దిష్టమైన నడిపింపు లేకపోయినా మనం జ్ఞానవంతమైన ఎంపికలు చేసుకోగల్గుతాము. అయితే, దైవికంగా ఇవ్వబడిన సూత్రం, నియమం లేక చట్టం లేనప్పుడు కూడా, మన స్వంత మనస్సాక్షి చేసే నిర్ణయాలను తోటి క్రైస్తవుల వ్యక్తిగత విషయాలపై రుద్దడానికి ప్రయత్నించడం సరైనది కాదని మనస్సులో ఉంచుకోవటం ప్రాముఖ్యం.—రోమీయులు 14:1-4; గలతీయులు 6:5.

15, 16. మన మనస్సాక్షి తప్పుగా ప్రవర్తించడానికి ఏది కారణం కాగలదు, అది జరుగకుండా మనమెలా కాపాడుకోవచ్చు?

15 పరిశుభ్రమైన, బైబిలు తర్ఫీదు పొందిన మనస్సాక్షి దేవుడిచ్చిన చక్కని బహుమానం. (యాకోబు 1:17) నైతిక సురక్షా ఉపకరణంగా అది సరిగ్గా పనిచేయాలంటే మనం ఈ బహుమానాన్ని కలుషితపర్చే ప్రభావాల నుండి కాపాడుకోవాలి. దేవుని ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు, అలవాట్లు వంటి వాటిని అనుసరిస్తే, అవి మన మనస్సాక్షి సరిగా పనిచేయకుండా చేసి, సరైన మార్గంలో మనల్ని నిర్దేశించడంలో విఫలమయ్యేలా చేస్తాయి. మనం విషయాలను సరిగ్గా నిర్ణయించుకోలేకపోవచ్చు, ఒక తప్పు చర్య నిజానికి సరైనదని నమ్మేలా మనల్ని మనం మోసం కూడా చేసుకుంటాము.—పోల్చండి యోహాను 16:2.

16 మన మనస్సాక్షి చేస్తున్న హెచ్చరికలను మనం అలక్ష్యం చేస్తూనే ఉంటే, దాని స్వరం బలహీనమైపోయి చివరికి మనం నైతికపరంగా కఠినంగానో లేక స్తబ్దుగానో తయారైపోతాము. “వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది” అని చెప్పినప్పుడు కీర్తన గ్రంథకర్త అలాంటి వ్యక్తుల గురించే మాట్లాడాడు. (కీర్తన 119:70) తమ మనస్సాక్షి చేస్తున్న హెచ్చరికలను అలక్ష్యం చేసే కొందరు సరైన విధంగా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతారు. వారిక ఎంత మాత్రం దైవిక సూత్రాలచే నిర్దేశించబడరు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అలాంటి పరిస్థితిని నివారించడానికి, చిన్న విషయాలని అనిపించే వాటి విషయంలో కూడా మనం మన క్రైస్తవ మనస్సాక్షి ఇస్తున్న నడిపింపులకు ప్రతిస్పందించాలి.—లూకా 16:10.

విని విధేయులయ్యేవారు ధన్యులు

17. ‘మన వెనుక వినిపించే స్వరాన్ని’ మనం విని, బైబిలు తర్ఫీదు పొందిన మన మనస్సాక్షి చెప్తున్నదాన్ని విన్నప్పుడు, మనం ఎలా ఆశీర్వదించబడతాము?

17 లేఖనాల ద్వారా, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని ద్వారా అందజేయబడుతున్న ‘మన వెనుక నుండి వినిపించే శబ్దమును’ వినడమనే విధానాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు, బైబిలు తర్ఫీదు పొందిన మన మనస్సాక్షి ఇస్తున్న జ్ఞాపికలను విన్నప్పుడు, యెహోవా తన ఆత్మతో మనల్ని ఆశీర్వదిస్తాడు. తత్ఫలితంగా, యెహోవా మనకు చెప్తున్నదాన్ని విని, అర్థం చేసుకునే మన సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ పెంపొందింపజేస్తుంది.

18, 19. మన పరిచర్యలోనూ, మన వ్యక్తిగత జీవితంలోనూ యెహోవా నడిపింపు మనకెలా ప్రయోజనం చేకూర్చగలదు?

18 కష్టతరమైన పరిస్థితుల్ని జ్ఞానంతోనూ, ధైర్యంతోనూ ఎదుర్కోడానికి కూడా యెహోవా ఆత్మ మనకు కావలసిన ధైర్యాన్నిస్తుంది. అపొస్తలుల విషయంలోలాగే, దేవుని ఆత్మ మన మానసిక శక్తులను ప్రేరేపించి, ఎల్లప్పుడూ బైబిలు సూత్రాలకు అనుగుణ్యంగా చర్య తీసుకోవడానికీ, మాట్లాడడానికీ మనకు సహాయం చేస్తుంది. (మత్తయి 10:18-20; యోహాను 14:26; అపొస్తలుల కార్యములు 4:5-8, 13, 31; 15:28) యెహోవా ఆత్మ మరియు మన స్వంత వ్యక్తిగత ప్రయత్నాలు, జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు విజయాన్ని చేకూర్చి, తీసుకున్న నిర్ణయాలను అనుసరించడానికి కావలసిన ధైర్యాన్నిస్తాయి. ఉదాహరణకు, మీరు ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగేలా మీ జీవన విధానాన్ని సరిచేసుకోవాలని మీరు ఆలోచిస్తున్నారనుకోండి. లేక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే, ఉద్యోగావకాశాన్ని తూచి చూసుకునే, లేక ఇల్లు కొనుక్కునే లాంటి, జీవితాన్ని మార్చివేసే ప్రాముఖ్యమైన ఎంపికలను చేసుకోవలసి ఉందనుకోండి. మనం నిర్ణయాలు తీసుకోవడంలో మన మానవ భావోద్వేగాలే ప్రథమస్థానం వహించేందుకు అనుమతించే బదులు, దేవుని ఆత్మ ఏమి చెప్తుందో విని, దాని నడిపింపు అనుసారంగా చర్య తీసుకోవాలి.

19 పెద్దలతోసహా తోటి క్రైస్తవుల నుండి వచ్చే దయాపూర్వకమైన జ్ఞాపికలను, ఉపదేశాన్ని మనం నిజంగా మెచ్చుకుంటాము. అయితే, ఇతరులు విషయాలను మన అవధానానికి తెచ్చేంత వరకూ మనం వేచి ఉండనవసరం లేదు. మనం అనుసరించ వలసిన జ్ఞానవంతమైన మార్గం ఏదో, దేవుణ్ని ప్రీతిపర్చడానికి మనం మన దృక్పథంలోనూ ప్రవర్తనలోనూ ఏ సవరింపులు చేసుకోవలసి ఉందో మనకు తెలిస్తే, మనం అందుకు అనుగుణ్యంగా చర్య తీసుకుందాము. యేసు ఇలా చెప్పాడు: “ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.”—యోహాను 13:17.

20. ‘తమ వెనుక వినిపిస్తున్న శబ్దాన్ని’ వినేవారికి ఏ ఆశీర్వాదాలు లభిస్తాయి?

20 దేవుణ్ని ఎలా ప్రీతిపర్చాలో తెలుసుకునేందుకు, క్రైస్తవులు పరలోకం నుండి అక్షరార్థంగా ఒక స్వరాన్ని విననవసరం లేదు, లేక దేవదూతలు వారిని సందర్శించనూ అవసరం లేదు. వాళ్లు దేవుని లిఖిత వాక్యంతోనూ, భూమిపైనున్న ఆయన అభిషిక్త తరగతి ద్వారా వచ్చే ప్రేమపూర్వక నడిపింపుతోనూ ఆశీర్వదించబడ్డారు. వాళ్లు ‘తమ వెనుక నుండి వినిపిస్తున్న’ ఈ శబ్దాన్ని జాగ్రత్తగా విని, బైబిలు తర్ఫీదు పొందిన తమ మనస్సాక్షి ఇస్తున్న నడిపింపును అనుసరిస్తే, వాళ్లు దేవుని చిత్తాన్ని చేయడంలో విజయవంతులౌతారు. అప్పుడు వాళ్లు, “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని అపొస్తలుడైన యోహాను చేస్తున్న వాగ్దానం నెరవేరడాన్ని కచ్చితంగా చూస్తారు.—1 యోహాను 2:17.

క్లుప్త సమీక్ష

• యెహోవా తన మానవ సృష్టితో ఎందుకు సంభాషిస్తున్నాడు?

• క్రమంగా బైబిలు చదివే కార్యక్రమం నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

• దాసుని తరగతి ఇస్తున్న నిర్దేశనానికి మనమెలా ప్రతిస్పందించాలి?

• బైబిలు తర్ఫీదు పొందిన మనస్సాక్షి ఇస్తున్న హెచ్చరికలను మనం ఎందుకు అలక్ష్యం చేయకూడదు?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

దేవుని నుండి సందేశాలను అందుకోవడానికి మానవునికి అత్యాధునిక ఉపకరణాల అవసరం లేదు

[చిత్రసౌజన్యం]

Courtesy Arecibo Observatory/David Parker/Science Photo Library

[15వ పేజీలోని చిత్రం]

యెహోవా మనతో బైబిలు ద్వారానూ, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారానూ మాట్లాడతాడు