ఎందుకింత అవినీతి?
ఎందుకింత అవినీతి?
“లంచము తీసికొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును.”
మూడు వేల ఐదువందల సంవత్సరాల క్రితం, మోషే ధర్మశాస్త్రం లంచగొండితనాన్ని ఖండించింది. అప్పటి నుండీ శతాబ్దాల కాలంలో, అవినీతిని వ్యతిరేకించే చట్టాలు ఎన్నో ఉనికిలోకి వచ్చాయి. అయినప్పటికీ, శాసనాలు అవినీతిని రూపుమాపలేకపోయాయి. ప్రతిరోజు కోట్ల రూపాయల లంచం చేతులు మారుతుంది, కోట్లాదిమంది దాని పర్యవసానాలను అనుభవిస్తుంటారు.
అవినీతి ఎంతగా విస్తరించి, పెడదారి పట్టిందంటే అది సమ సమాజ పునాదులనే కూకటి వేళ్లతో పెకిలించి వేసేలా ఉంది. కొన్ని దేశాల్లో చేతులు తడపకపోతే అసలు ఏ పనీ జరగదు. సరైన వ్యక్తికి లంచమివ్వడం పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చేస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి పెడుతుంది, ఒక కాంట్రాక్టు హస్తగతమయ్యేలా చేస్తుంది, లేదా ఓ కోర్టు వివాదంలో గెలుపు సాధించి పెడుతుంది. “అవినీతి ప్రజల దృక్పథాన్ని నీరసపర్చి, వారిపై పెద్ద భారంలా తయారౌతుంది” అని పారిస్‌లోని న్యాయవాది అయిన అర్నో మోన్టెబర్గ్ వాపోతున్నాడు.
ప్రాముఖ్యంగా వాణిజ్య ప్రపంచంలో లంచగొండితనం విశృంఖలంగా ఉంది. కొన్ని కంపెనీలు, తమకు వచ్చే లాభాలన్నిటిలో మూడోవంతును అవినీతిపరులైన ప్రభుత్వాధికారులకు లంచాలు ఇవ్వడానికే కేటాయిస్తాయి. బ్రిటీష్ పత్రిక అయిన ది ఎకానమిస్ట్ ప్రకారం, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఆయుధాల వ్యాపారంపై వెచ్చించబడుతున్న 2 వేల 500 కోట్ల అమెరికా డాలర్లలో 10 శాతం, భావి కొనుగోలుదారులకు లంచం ఇవ్వడానికే ఉపయోగించబడుతుంది. ఈ అవినీతి రేటు పెరిగిపోతుండగా, దాని పర్యవసానాలు వినాశకరంగా తయారయ్యాయి. గత దశాబ్దంలో, “బంధుజన ప్రీతి” పెట్టుబడిదారీ విధానం, అంటే మంచి స్థితిలో ఉన్న కొద్దిమందికే ప్రయోజనం చేకూర్చే వ్యాపార లావాదేవీలు, మొత్తం దేశాల ఆర్థిక వ్యవస్థలనే కూలదోసినట్టు చెప్పబడుతుంది.
అవినీతి మూలంగానూ అది తీసుకువచ్చే ఆర్థిక విధ్వంసం మూలంగానూ ఎక్కువగా బాధపడాల్సి వచ్చేది, ఎవరికీ లంచమివ్వలేని కడుపేదవారే. ది ఎకానమిస్ట్ సంగ్రహంగా చెప్తున్నట్లుగా, “అవినీతి ఒక విధమైన అణచివేత వంటిదే.” ఈ విధమైన అణచివేతను నిర్మూలించడం సాధ్యమేనా, లేక అవినీతిని అరికట్టే మార్గమేలేదా? ఆ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు, మనం మొదట అవినీతికి ప్రధాన కారకాలైన కొన్నింటిని గుర్తించాలి.
అవినీతికి కారకాలేమిటి?
ప్రజలు నిజాయితీగా ఉండటం కంటే అవీనితికి పాల్పడటానికే ఎందుకు ఎంచుకుంటారు? కొంతమందికి, తాము ఆశించినదాన్ని పొందటానికి అతి సులభమైన మార్గం అవినీతికి పాల్పడడమే, లేదా అదే వాళ్లకు ఏకైక మార్గం. కొన్నిసార్లు, లంచమివ్వడం సుళువుగా శిక్ష తప్పించుకునేలా చేయగలదు. రాజకీయ నాయకులు, పోలీసులు, న్యాయమూర్తులు అవినీతిని అలక్ష్యం చేస్తున్నట్లు, లేదా వాళ్లే స్వయంగా అవినీతికి పాల్పడుతున్నట్లు గమనించిన చాలామంది గ్రుడ్డిగా వాళ్ల మాదిరిని అనుసరిస్తారు.
అవినీతి విశృంఖలంగా విస్తరిస్తుతుండగా, అది అంగీకారయోగ్యమైనదిగా తయారై చివరికి అదే జీవన విధానం ప్రసంగి 8:11.
అయిపోతుంది. చాలా తక్కువ వేతనాలు అందుకుంటున్న ప్రజలు ఇక తమకు మరో మార్గమేదీ లేదని భావిస్తారు. సంతృప్తికరమైన జీవనం సాగించాలంటే వాళ్లు లంచాలు ముట్టచెప్పమని అడగాల్సిందే. అనుచితమైన ప్రయోజనాన్ని పొందడానికి లంచాలు గుంజేవాళ్లు, వాటిని ఇచ్చేవాళ్లు శిక్షించబడనప్పుడు, చాలా తక్కువమందే ఎదురీదడానికి సిద్ధపడతారు. “దుష్‌క్రియకు తగినశిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు” అని రాజైన సొలొమోను అన్నాడు.—అవినీతి అనే అగ్నికి ఆజ్యం పోసే రెండు బలమైన శక్తులు స్వార్థం, దురాశ. స్వార్థం మూలంగా, అవినీతిపరులైన ప్రజలు తమ అవినీతి వలన ఇతరులకు కల్గుతున్న బాధను పట్టించుకోరు, తమకు దాని నుండి ప్రయోజనం ఉంది గనుకే వాళ్లు తమ లంచగొండితనాన్ని సమర్థించుకుంటారు. ఆ అవినీతిపరులు ఎన్ని ఆస్తులను సమకూర్చుకుంటే, అంత దురాశపరులుగా తయారౌతారు. సొలొమోను ఇలా పేర్కొన్నాడు: “ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు.” (ప్రసంగి 5:10) నిజమే, డబ్బు సంపాదించుకోవడానికి దురాశ చక్కని మార్గంగానే కన్పించవచ్చు, కానీ దాని మూలంగా అవినీతి, అన్యాయాలు అనివార్యంగా జరిగిపోతుంటాయి.
మర్చిపోకూడని మరో కారకం ఏమిటంటే, అదృశ్యంగా ఉన్న ఈ లోకాధిపతి వహిస్తున్న పాత్ర, బైబిలు అతడిని అపవాదియైన సాతాను అని గుర్తిస్తుంది. (1 యోహాను 5:19; ప్రకటన 12:9) సాతాను అవినీతిని చురుగ్గా పెంపొందింపజేస్తాడు. ఇంతవరకు ఇవ్వజూపిన అతి పెద్ద లంచం, సాతాను క్రీస్తుకు ఇస్తానన్నదే. ‘నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల యీ లోకరాజ్యములన్నిటినీ నీకిస్తాను.’—మత్తయి 4:8, 9.
అయితే యేసు అవినీతిపరుడు కాదు, తనలాగే అవినీతికి లొంగవద్దని ఆయన తన అనుచరులకు బోధించాడు. నేడు అవినీతితో పోరాడటానికి క్రీస్తు బోధలు ప్రభావవంతమైన ఉపకరణంగా ఉండగలవా? తర్వాతి శీర్షిక ఈ ప్రశ్నను విశ్లేషిస్తుంది.