కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తను నమ్మిన సూత్రానికి ఆయన ప్రాణాలర్పించాడు

తను నమ్మిన సూత్రానికి ఆయన ప్రాణాలర్పించాడు

తను నమ్మిన సూత్రానికి ఆయన ప్రాణాలర్పించాడు

“యెహోవాసాక్షుల్లో ఒకరైన ఆగస్ట్‌ డిక్‌మాన్‌ను (జననం 1910), మేము స్మరిస్తాము.” సాక్షన్‌హవుసెన్‌లోని కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులో, ఇటీవల ఆవిష్కరించబడిన ఒక ఫలకంపై (ఇక్కడ చూపించబడింది) చెక్కిన మాటలు అలా ప్రారంభమయ్యాయి. ఒక యెహోవాసాక్షి అటువంటి ఫలకంతో ఎలా గౌరవించబడ్డాడు? చెక్కిన మాటల్లో తర్వాతి భాగం దాన్ని వివరిస్తుంది: “మనస్సాక్షి అనుమతించనందున యుద్ధంలో పాల్గొననందుకు SS గార్డులు [ఆయన్ను] 1939, సెప్టెంబరు 15న బహిరంగంగా కాల్చిచంపారు.”

ఆగస్ట్‌ డిక్‌మాన్‌ 1937 లో సాక్షన్‌హవుసెన్‌ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులో నిర్బంధించబడ్డాడు. రెండవ ప్రపంచ యుద్ధం 1939 లో ప్రారంభమైన మూడు రోజుల తర్వాత, బలవంతంగా మిలటరీలోకి చేరమని చెప్పే స్లిప్‌పైన సంతకం చేయమని ఆయనకు ఆజ్ఞలందాయి. ఆయన నిరాకరించినప్పుడు క్యాంపు కమాండరు SSకి (షుట్స్‌ష్టాఫెల్‌, హిట్లర్‌కి చెందిన ప్రఖ్యాత గార్డు) అధినాయకుడైన హైన్‌రిఖ్‌ హిమ్లర్‌ను సంప్రదించి, మిగతా ఖైదీలందరి ఎదుటా డిక్‌మాన్‌కు మరణశిక్ష విధించటానికి అనుమతిని అడిగాడు. 1939, సెప్టెంబరు 17న జర్మనీ నుండి ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఇలా నివేదించింది: “29 ఏండ్ల ఆగస్ట్‌ డిక్‌మాన్‌ను . . . ఒక ఫైరింగ్‌ స్క్వాడ్‌ కాల్చిచంపింది.” మనస్సాక్షి అనుమతించనందున ఆ యుద్ధంలో చేరటానికి నిరాకరించిన మొట్టమొదటి జర్మన్‌ దేశస్థుడాయన అని ఆ వార్తాపత్రిక చెప్పింది.

అరవై సంవత్సరాల తర్వాత, 1999, సెప్టెంబరు 18న బ్రాండెన్‌బర్గ్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంది, ఆ జ్ఞాపకార్థ ఫలకం ఇప్పుడు ఆయన ధైర్యాన్నీ ఆయన బలమైన విశ్వాసాన్నీ సందర్శకులకు జ్ఞాపకం చేస్తుంది. కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుగా ఉన్న ఈ క్యాంపు గోడల బయట ఉన్న ఒక రెండవ ఫలకం, తమ విశ్వాసాల మూలంగా సాక్షన్‌హవుసెన్‌లో యాతనల్ని అనుభవించిన 900 యెహోవాసాక్షుల్లో డిక్‌మాన్‌ కేవలం ఒక్కడు మాత్రమేనని సందర్శకులకు జ్ఞాపకం చేస్తుంది. అనేకమంది వేరే క్యాంపుల్లో బాధల్ని అనుభవించారు. అవును, కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లోని భయంకరమైన పరిస్థితుల్లో సహితం అనేకమంది దేవుని సూత్రాలకు విశ్వసనీయంగా అంటిపెట్టుకున్నారు.

“పై అధికారులకు [ప్రభుత్వాధికారులకు] లోబడియుండ వలెను” అనేది యెహోవాసాక్షులకు ఒక క్రైస్తవ విధి. (రోమీయులు 13:1) అయితే, దేవుని నియమాల్ని అధిగమించమని ప్రభుత్వాలు బలవంతం చేయటానికి ప్రయత్నిస్తే వారు క్రీస్తు అపొస్తలుల మాదిరిని అనుకరిస్తారు, వారిలా అన్నారు: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.” (అపొస్తలుల కార్యములు 5:29) దాని ఫలితంగా, తెగలమధ్య శత్రుత్వాలు, జాతి విద్వేషాలు ఈ లోకంలో ఎన్నో విభ్రాంతికరమైన అకృత్యాలకు దారితీశాయి. అయినా యెహోవాసాక్షులు ఇదే లోకంలో ఎక్కడ ఉన్నా ఆగస్ట్‌ డిక్‌మాన్‌లా శాంతిని వెంబడిస్తారు. వారీ బైబిలు ఉద్బోధను అనుసరిస్తారు: “కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.”—రోమీయులు 12:21.