దైవిక బోధకు స్థిరంగా మద్దతునివ్వండి
దైవిక బోధకు స్థిరంగా మద్దతునివ్వండి
“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”—సామెతలు 3:5, 6.
1. మునుపెన్నడూ లేనంతగా మనం మానవ జ్ఞానానికి ఎలా గురౌతున్నాము?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9,000 దినపత్రికలు ప్రచురించబడుతున్నాయి. ఒక్క అమెరికాలోనే ప్రతి సంవత్సరం దాదాపు 2,00,000 కొత్త పుస్తకాలు ప్రచురించబడుతున్నాయి. ఒక అంచనా ప్రకారం, 1998 మార్చి నాటికి ఇంటర్‌నెట్ మీద సుమారు 27.5 కోట్ల వెబ్ పేజీలున్నాయి. ఈ సంఖ్య, నెలకు రెండు కోట్ల పేజీల చొప్పున పెరుగుతోందని అంటారు. మునుపెన్నడూ లేనివిధంగా, ప్రజలకు దాదాపు ప్రతి విషయం మీద సమాచారం అందుబాటులో ఉంది. ఈ పరిస్థితికి దాని అనుకూల కోణాలు ఉన్నప్పటికీ, అలాంటి సమాచార సమృద్ధి సమస్యలను ఉత్పన్నం చేసింది.
2. సమాచారం సమృద్ధిగా అందుబాటులో ఉంటే ఏ సమస్యలు తలెత్తవచ్చు?
2 కొంతమంది, అవశ్యమైన వాటిని అలక్ష్యం చేస్తూ తీరని తృష్ణతో ఎప్పుడూ తాజా సమాచారాన్ని పొందాలని ఉబలాటపడుతూ సమాచార పిపాసులుగా తయారయ్యారు. మరితరులు సంక్లిష్ట రంగాలకు సంబంధించిన అసంపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకుని, తమను తాము అందులో నిపుణులమన్నట్లు భావించుకుంటుంటారు. అరకొర అవగాహనపై ఆధారపడి, వారు తమకు లేక ఇతరులకు హాని చేయగల విషమమైన నిర్ణయాలను తీసుకోవచ్చు. అసమగ్ర లేక అబద్ధ సమాచారాన్ని అందుకునే ప్రమాదం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఈ సమాచార వెల్లువ సరియైనదీ సమన్వయం గలదీ అవునో కాదో తెలుసుకోవటానికి తరచూ నమ్మదగిన ఆధారం ఉండదు.
3. బైబిల్లో, మానవ జ్ఞానాన్వేషణ గురించి ఏ హెచ్చరికలు ఉన్నాయి?
3 కుతూహలం అనేది ఎప్పటినుండో మానవుల విశిష్ట లక్షణమై ఉంది. నిరుపయోగమైన లేక చివరికి హానికరమైన సమాచారాన్ని పొందడానికి ఎంతో సమయాన్ని వృధా చేయటమనే ప్రమాదాలు, పూర్వం రాజైన సొలొమోను కాలంలోనే గుర్తించబడ్డాయి. ఆయనిలా అన్నాడు: “హితోపదేశములు వినుము; పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు; విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము.” (ప్రసంగి 12:12) శతాబ్దాల తర్వాత అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇలా వ్రాశాడు: “నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయరి.” (1 తిమోతి 6:20, 21) అవును, క్రైస్తవులు నేడు హానికరమైన తలంపులకు అనవసరంగా గురి కావడాన్ని నివారించాల్సిన అవసరం ఉంది.
4. యెహోవాపై ఆయన బోధలపై మనకున్న నమ్మకాన్ని చూపించగల ఒక మార్గం ఏది?
4 యెహోవా ప్రజలు సామెతలు 3:5, 6 లోని మాటలను లక్ష్యపెట్టడం కూడా మంచిది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” యెహోవాయందు నమ్మకముంచటంలో దేవుని వాక్యంతో విబేధించే ఏ తలంపునైనా తిరస్కరించటం ఇమిడివుంది, అది మన సొంత తర్కం నుండి ఉద్భుదమైనా లేక మన తోటివారినుండి వచ్చినదైనా సరే. మన ఆధ్యాత్మికతను కాపాడుకోవటానికి, మనం హానికరమైన సమాచారాన్ని గుర్తించి దాన్ని తప్పించుకోగలిగేలా మన జ్ఞానేంద్రియాలకు తర్ఫీదునివ్వటం అవశ్యం. (హెబ్రీయులు 5:14) అలాంటి సమాచారపు కొన్ని మూలాలను మనం చర్చిద్దాము.
సాతాను స్వాధీనంలో ఉన్న లోకం
5. హానికరమైన తలంపులకు ఒక మూలం ఏమిటి, దాని వెనుక ఎవరున్నారు?
5 ఈ లౌకిక జగత్తు హానికరమైన తలంపులకు పుట్టినిల్లు. (1 కొరింథీయులు 3:19) యేసుక్రీస్తు తన శిష్యుల విషయమై దేవునికిలా ప్రార్థించాడు: “నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను.” (యోహాను 17:15) తన శిష్యులను “దుష్టుని నుండి” కాపాడమని యేసు చేసిన విజ్ఞప్తి, ఈ లోకంపై సాతానుకున్న ప్రభావాన్ని గుర్తిస్తుంది. మనం క్రైస్తవులమై ఉండటం, ఈ లోక దుష్ట ప్రభావాల నుండి మనకు దానంతటదే కాపుదలనేమి ఇవ్వదు. అందుకే, యోహాను ఇలా వ్రాశాడు: “మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.” (1 యోహాను 5:19) ప్రత్యేకించి అంత్యదినాల ఈ చివరిభాగంలో, సాతాను అతని దయ్యాలు లోకాన్ని హానికరమైన సమాచారంతో నింపుతారన్నది ఎదురు చూడవలసినదే.
6. వినోద ప్రపంచం నైతిక విషయాల్లో స్తబ్దతను ఎలా కలిగించగలదు?
6 ఆ హానికరమైన సమాచారంలో కొంత హానిరహితమైనదిగా కనిపించవచ్చని కూడా ఎదురు చూడవలసిందే. (2 కొరింథీయులు 11:14) ఉదాహరణకు, టీవీ కార్యక్రమాలు, సినిమాలు, సంగీతం, ముద్రిత పుటలతో కూడిన వినోద ప్రపంచాన్ని పరిశీలించండి. అనేకానేక సందర్భాల్లో, కొన్ని రకాలైన వినోద కార్యకలాపాలు అనైతికత, హింస, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి హీనమైన అభ్యాసాలను ప్రోత్సహిస్తున్నాయని అనేకులు అంగీకరిస్తారు. హీనస్థితికి దిగజారిపోయిన ఒక రకమైన వినోదాన్ని మొదటిసారి చూసినప్పుడు ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురికావచ్చు. కానీ పదే పదే అలాంటివాటిని చూడటం ద్వారా ఒకరు అలాంటివాటి విషయంలో స్తబ్దుగా తయారు కావచ్చు. హానికరమైన తలంపులను ప్రోత్సహించే వినోదాన్ని మనం ఎన్నడూ అంగీకారయుక్తమైనదిగా లేక హానిరహితమైనదిగా దృష్టించకుందాము !—కీర్తన 119:37.
7. ఏ విధమైన మానవ జ్ఞానం బైబిలుపై మనకున్న నమ్మకాన్ని నాశనం చేయగలదు?
7 ప్రమాదకరమైనదైన సమాచారానికి మరో మూలాన్ని పరిశీలించండి, అది బైబిలు ప్రామాణికత్వాన్ని ప్రశ్నించే శాస్త్రవేత్తలూ విద్యావేత్తలైన కొందరు ప్రచురించే తలంపుల వెల్లువ. (పోల్చండి యాకోబు 3:15.) అలాంటి సమాచారం తరచూ పేరొందిన పత్రికల్లో, ప్రఖ్యాత పుస్తకాల్లో కనిపిస్తుంటుంది, అది బైబిలుపై నమ్మకాన్ని హరింపజేయగలదు. అనంతమైన ఊహాగానాలతో దేవుని వాక్య అధికారాన్ని బలహీనపర్చడాన్ని కొంతమంది ఘనకార్యమన్నట్లు భావిస్తారు. అపొస్తలుల కాలంలోనూ అలాంటి ప్రమాదమే ఉండేది, అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఈ మాటల్లో ఆ విషయం స్పష్టమౌతుంది: “[క్రీస్తు]ను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.”—కొలొస్సయులు 2:8.
సత్య శత్రువులు
8, 9. నేడు మతభ్రష్టత్వం ఎలా బయల్పడుతోంది?
8 మతభ్రష్టులు మన ఆధ్యాత్మికతకు మరొక ప్రమాదాన్ని తీసుకురాగలరు. క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారి మధ్య మతభ్రష్టత్వం తలెత్తుతుందని అపొస్తలుడైన పౌలు ముందే చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 20:29, 30; 2 థెస్సలొనీకయులు 2:3) ఆయన మాటల నెరవేర్పుగా, అపొస్తలుల మరణం తర్వాత, గొప్ప మతభ్రష్టత్వం క్రైస్తవమత సామ్రాజ్య అభివృద్ధికి దారితీసింది. నేడు, దేవుని ప్రజల మధ్య గొప్ప మతభ్రష్టత్వమేమీ జరగడం లేదు. అయినా, కొంతమంది వ్యక్తులు మన నుండి తొలగిపోయారు, వారిలో కొందరు అబద్ధాలనూ తప్పుడు సమాచారాన్నీ ప్రచారం చేస్తూ యెహోవాసాక్షులను అప్రతిష్ఠపాలు చేయాలని నిశ్చయించుకున్నారు. మరితరులు స్వచ్ఛారాధనను వ్యతిరేకిస్తూ ఇతర వర్గాలతో సంస్థీకృతంగా పనిచేస్తున్నారు. అలా చేస్తూ, వారు ఆది మతభ్రష్టుడైన సాతాను పక్షాన ఉంటున్నారు.
9 కొందరు మతభ్రష్టులు, యెహోవాసాక్షుల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటానికి ఇంటర్‌నెట్‌తో సహా వివిధ రకాలైన సమాచార మాధ్యమాలను అత్యధికంగా వాడుకుంటున్నారు. తత్ఫలితంగా, మన నమ్మకాల గురించి తెలుసుకోవడానికి నిజాయితీపరులైన వ్యక్తులు పరిశోధన చేసినప్పుడు, వారు మతభ్రష్ట ప్రచారాల బారిన పడవచ్చు. కొంతమంది సాక్షులు కూడా అనుకోకుండా ఈ హానికరమైన సమాచారానికి గురయ్యారు. అంతేగాక, మతభ్రష్టులు అప్పుడప్పుడూ టీవీ లేక రేడియో కార్యక్రమాల్లో భాగం వహిస్తారు. దీని దృష్ట్యా, ఏ చర్య తీసుకోవడం వివేకవంతమైనదై ఉంటుంది?
10. మతభ్రష్ట కార్యకలాపాలకు ఏ విధంగా ప్రతిస్పందించడం జ్ఞానయుక్తమైనది?
10 మతభ్రష్టులను తమ ఇళ్లలోకి రానీయవద్దని అపొస్తలుడైన యోహాను క్రైస్తవులకు నిర్దేశించాడు. ఆయనిలా వ్రాశాడు: “ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.” (2 యోహాను 10, 11) ఆ వ్యతిరేకులతో అన్ని రకాలైన సంబంధాలనూ తెంచుకోవడం, వారి భ్రష్టమైన ఆలోచనా సరళినుంచి మనల్ని కాపాడుతుంది. వివిధ ఆధునిక సమాచార మాధ్యమాల ద్వారా వస్తున్న మతభ్రష్ట బోధలకు గురి కావడం, మతభ్రష్టుడిని స్వయంగా మన ఇళ్లలోకి ఆహ్వానించడమంత హానికరమైనదే. కుతూహలం మనల్ని అలాంటి ఉపద్రవంలో పడవేసేలా మనం ఎన్నడూ అనుమతించకూడదు.—సామెతలు 22:3.
సంఘ పరిధిలో
11, 12. (ఎ) మొదటి శతాబ్దపు సంఘంలో హానికరమైన తలంపులకు ఏది మూలంగా ఉండేది? (బి) దైవిక బోధలకు స్థిరంగా మద్దతునివ్వడంలో కొంతమంది క్రైస్తవులు ఎలా విఫలులయ్యారు?
11 హానికరమైన తలంపులకు మూలం కాగల మరొకదాన్ని పరిశీలించండి. అబద్ధాల్ని బోధించాలన్న ఉద్దేశ్యం లేకుండానే ఒక సమర్పిత క్రైస్తవుడు అనాలోచితంగా మాట్లాడే అలవాటును వృద్ధి చేసుకోవచ్చు. (సామెతలు 12:18) మన అపరిపూర్ణ ప్రవృత్తి మూలంగా, మనమందరం అప్పుడప్పుడూ మన నాలుకతో దోషం చేస్తాము. (సామెతలు 10:19; యాకోబు 3:8) అపొస్తలుడైన పౌలు కాలంలో, తమ నాలుకను అదుపు చేసుకోవడంలో విఫలులై పదాల గురించిన వాదోపవాదాల్లో నిమగ్నమైపోయినవారు సంఘంలో కొందరుండేవారని స్పష్టమౌతుంది. (1 తిమోతి 2:8) తమ స్వంత అభిప్రాయాలను మరీ ఉన్నతమైనవిగా భావించుకుని, పౌలు అధికారాన్నే సవాలు చేసేంతవరకూ వెళ్లిన వారు కూడా ఉన్నారు. (2 కొరింథీయులు 10:10-12) అలాంటి దృక్పథం అనవసరమైన కలహాలకు దారితీసింది.
12 కొన్నిసార్లు ఈ అభిప్రాయ భేదాలు సంఘ శాంతిని పాడుచేస్తూ, “వ్యర్థవివాదములు”గా పరిణమించేవి. (1 తిమోతి 6:5; గలతీయులు 5:15) ఇలాంటి వాదనలకు కారణమైన వారిని గురించి పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైన బోధ నుపదేశించినయెడల వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును [కలుగుచున్నవి].”—1 తిమోతి 6:3, 4.
13. మొదటి శతాబ్దంలో చాలామంది క్రైస్తవుల ప్రవర్తన ఎలా ఉండేది?
13 సంతోషకరంగా, అపొస్తలుల కాలంలో క్రైస్తవులలో అధికశాతం మంది నమ్మకంగా ఉండి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించే పనిపైనే తమ మనస్సును కేంద్రీకరించారు. వారు “దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో” పరామర్శిస్తూ, పదాల గురించి వ్యర్థమైన వాదోపవాదాలలో తమ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, “ఇహలోకమాలిన్యము తమకంటకుండ” చూసుకున్నారు. (యాకోబు 1:27) వారు తమ ఆధ్యాత్మికతను కాపాడుకునేందుకు, క్రైస్తవ సంఘంలో సహితం ‘దుష్ట సాంగత్యాలకు’ దూరంగా ఉన్నారు.—1 కొరింథీయులు 15:33; 2 తిమోతి 2:20, 21.
14. మనం జాగ్రత్తగా లేకపోతే, సాధారణంగా మన తలంపులను పరస్పరం పంచుకోవడం హానికరమైన వాగ్వివాదాలలోకి ఎలా దారితీయగలదు?
14 అలాగే, 11వ పేరాలో వర్ణించబడిన పరిస్థితులు నేడు యెహోవాసాక్షుల సంఘాల్లో విపరీతంగా ఏమీ లేవు. అయినప్పటికీ, మనం అలాంటి వ్యర్థమైన వాదోపవాదాల ప్రమాదాన్ని గుర్తించడం మంచిది. బైబిలు వృత్తాంతాల గురించి చర్చించడం లేక ఇంకా బయల్పర్చబడని, వాగ్దానం చేయబడిన నూతన లోక అంశాల గురించి ఆలోచించడం సర్వసాధారణమైన విషయమే. మన వస్త్రధారణ, కేశాలంకరణ లేక వినోద కార్యకలాపాలను ఎంపిక చేసుకోవడం వంటి వ్యక్తిగత విషయాల గురించి మన అభిప్రాయాలను ఒకరితో ఒకరం పంచుకోవడం తప్పేమీ కాదు. అయితే, మనం మన తలంపుల గురించి మొండిగా తయారై, ఇతరులు మనతో ఏకీభవించనప్పుడు అభ్యంతరపడిపోతే, చిన్న చిన్న విషయాలపై సంఘం విభాగించబడుతుంది. హానిరహితమైన సంభాషణగా ప్రారంభమైనది నిజానికి హానికరమైనదిగా పరిణమించగలదు.
మనకు అప్పగించబడినదాన్ని కాపాడుకోవడం
15. “దయ్యముల బోధలు” ఆధ్యాత్మికంగా మనకు ఎంత మేరకు హాని చేయగలవు, లేఖనాల్లో ఏ ఉపదేశం ఇవ్వబడింది?
15 అపొస్తలుడైన పౌలు ఇలా హెచ్చరిస్తున్నాడు: “కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.” (1 తిమోతి 4:1) అవును, హానికరమైన తలంపులు నిజంగా ప్రమాదాన్ని తీసుకురాగలవు. అర్థం చేసుకోదగినట్లుగానే, పౌలు తన ప్రియమిత్రుడైన తిమోతిని ఇలా అభ్యర్థించాడు: “ఓ తిమోతీ, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయరి.”—1 తిమోతి 6:20, 21.
16, 17. దేవుడు మనకు ఏమి అప్పగించాడు, మనం దాన్ని ఎలా కాపాడుకోవాలి?
16 ఈ ప్రేమపూర్వకమైన హెచ్చరిక నుండి నేడు మనమెలా ప్రయోజనం పొందవచ్చు? ఆయన శ్రద్ధ తీసుకోవలసిన, కాపాడవలసిన విలువైనదొకటి తిమోతికి అప్పగించబడింది. ఏమిటది? పౌలు ఇలా వివరిస్తున్నాడు: “క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్యప్రమాణమును గైకొనుము; నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుము.” (2 తిమోతి 1:13, 14) అవును, తిమోతికి అప్పగింపబడిన దానిలో ‘హితవాక్యాలు మరియు దైవభక్తికి అనుగుణ్యమైన బోధ’ ఉన్నాయి. (1 తిమోతి 6:3) ఈ మాటలకు అనుగుణ్యంగా, క్రైస్తవులు నేడు తమ విశ్వాసాన్నీ, తమకు అప్పగించబడిన సత్యసంపత్తినీ కాపాడుకోవటానికి నిశ్చయించుకున్నారు.
17 ఆ అప్పగించబడిన దాన్ని కాపాడుకోవటంలో, మంచి బైబిలు పఠన అలవాట్లను అలవర్చుకోవటం, ప్రార్థనలో పట్టుదల కల్గివుండటం, “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు” చేయటం ఇమిడి ఉన్నాయి. (గలతీయులు 6:10; రోమీయులు 12:11-17) పౌలు ఇంకా ఇలా ఆదేశిస్తున్నాడు: “నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.” (1 తిమోతి 6:11, 12) “మంచి పోరాటము పోరాడుము,” “[గట్టిగా] చేపట్టుము” వంటి మాటలను పౌలు ఉపయోగించటం, ఆధ్యాత్మికంగా హానికరమైన ప్రభావాలను మనం చురుగ్గాను, కృతనిశ్చయంతోను ఎదిరించాలని స్పష్టం చేస్తుంది.
వివేచన అవసరం
18. లౌకిక సమాచారం విషయంలో మనకు ఉండవలసిన దృక్పథంలో మనం క్రైస్తవ సమతుల్యాన్ని ఎలా ప్రదర్శించవచ్చు?
18 అయితే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడేందుకు వివేచన అవసరం. (సామెతలు 2:11; ఫిలిప్పీయులు 1:9) ఉదాహరణకు, లౌకిక సమాచారాన్నంతటినీ నమ్మకపోవటమన్నది సహేతుకం కాదు. (ఫిలిప్పీయులు 4:5; యాకోబు 3:17) మానవ తలంపులన్నీ దేవుని వాక్యంతో విభేదించవు. రోగులైన వారు అర్హుడైన వైద్యుని, అంటే వృత్తిపరంగా వైద్యుడైన వానిని సంప్రదించాల్సిన అవసరం ఉందని యేసు సూచించాడు. (లూకా 5:31) యేసు కాలంలో వైద్యవిధానం ఎంతో వెనుకబడి ఉన్నప్పటికీ, వైద్యుని సహాయం నుండి కొంత ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆయన అంగీకరించాడు. క్రైస్తవులు నేడు లౌకిక సమాచారం విషయంలో సమతుల్యాన్ని ప్రదర్శిస్తారు, కానీ తమకు ఆధ్యాత్మికంగా హానికరం కాగల వేటి నుండైనా వారు దూరంగా ఉంటారు.
19, 20. (ఎ) అనాలోచితంగా మాట్లాడే వారికి సహాయం చేసేటప్పుడు పెద్దలు ఎలా వివేచనతో వ్యవహరిస్తారు? (బి) అబద్ధ బోధలను సమర్థిస్తూనే ఉండేవారితో సంఘం ఎలా వ్యవహరిస్తుంది?
19 అవివేకంగా మాట్లాడే వాళ్లకు సహాయం చేయవలసి ఉన్నప్పుడు పెద్దలు కూడా వివేచన కల్గివుండటం ప్రాముఖ్యం. (2 తిమోతి 2:7) కొన్నిసార్లు, సంఘసభ్యులు వ్యర్థమైన, ఊహాజనిత వివాదాలలో చిక్కుకొనవచ్చు. సంఘ ఐక్యతను కాపాడటానికి పెద్దలు అలాంటి సమస్యలను వెంటనే కనిపెట్టగలిగేలా ఉండాలి. అదే సమయంలో, వారు తమ సహోదరులకు తప్పుడు ఉద్దేశాలను ఆపాదించకుండాను, తొందరపడి వారిని మతభ్రష్టులుగా దృష్టించకుండాను జాగ్రత్తపడతారు.
20 ఏ విధమైన స్ఫూర్తితో సహాయాన్ని అందజేయాలనేది పౌలు వివరించాడు. ఆయనిలా అన్నాడు: “సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీ[రు] . . . సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.” (గలతీయులు 6:1) ప్రాముఖ్యంగా సందేహాలతో బాధపడే క్రైస్తవులనుద్దేశించి మాట్లాడుతూ, యూదా ఇలా వ్రాశాడు: “సందేహపడువారిమీద కనికరము చూపుడి. అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి.” (యూదా 22, 23) అయితే, ఎన్నిసార్లు మందలించినప్పటికీ ఎవరైనా అబద్ధ బోధలను సమర్థిస్తూనే ఉంటే, సంఘాన్ని కాపాడటానికి పెద్దలు నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సి ఉంటుంది.—1 తిమోతి 1:20; తీతు 3:10, 11.
యోగ్యమైనవాటితో మన మనస్సులను నింపుకోవటం
21, 22. మనం ఏ విషయంలో సరిగా ఎంపిక చేసుకునే వారమై ఉండాలి, మనం మన మనస్సులను దేనితో నింపుకోవాలి?
21 ‘కొరుకుడుపుండులా పాకే’ హానికరమైన మాటల్ని క్రైస్తవ సంఘం విసర్జిస్తుంది. (2 తిమోతి 2:16, 17; తీతు 3:9) అలాంటి మాటలు మతభ్రష్టుల ప్రచారమైన తప్పుదారి పట్టించే లౌకిక ‘జ్ఞానాన్ని’ ప్రతిబింబించినా, లేక సంఘంలోని ఆలోచనారహితమైన సంభాషణను ప్రతిబింబించినా అలాగే విసర్జిస్తుంది. కొత్తవిషయాలను తెలుసుకోవాలన్న ఆరోగ్యదాయకమైన కోరిక ప్రయోజనకరమైనదే అయినప్పటికీ, అదుపులేని ఆసక్తి మనల్ని హానికరమైన తలంపులకు గురి చేయగలదు. సాతాను కుతంత్రాలు మనకు తెలియనివేమీ కాదు. (2 కొరింథీయులు 2:11) మనం దేవునికి చేసే సేవలో మందగమనులమయ్యేలా మన అవధానాన్ని మళ్లించాలని అతడు ఎంతగానో కృషి చేస్తున్నాడని మనకు తెలుసు.
22 మంచి పరిచారకులముగా, మనం దైవిక బోధకు స్థిరంగా మద్దతునిద్దాము. (1 తిమోతి 4:6) మనం తెలుసుకోవాలనుకునే సమాచారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ద్వారా మనం మన సమయాన్ని వివేకవంతంగా వాడుకుందాము. అప్పుడు మనం సాతాను ప్రేరిత దుష్ప్రచారానికి అంత సులభంగా చలించిపోము. అవును, మనం “యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యానముంచు[దాము].” మనం మన మనస్సులను, హృదయాలను అలాంటి వాటితో నింపుకుంటే, సమాధానకర్తయగు దేవుడు మనకు తోడై ఉంటాడు.—ఫిలిప్పీయులు 4:8, 9.
మనమేమి నేర్చుకున్నాము?
• లౌకిక జ్ఞానం మన ఆధ్యాత్మికతకు ఎలా ప్రమాదాన్ని తీసుకురాగలదు?
• హానికరమైన మతభ్రష్ట సమాచారం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మనమేమి చేయవచ్చు?
• సంఘంలో ఏ విధమైన సంభాషణను నివారించాలి?
• నేడు సమృద్ధిగా ఉన్న సమాచారంతో వ్యవహరించేటప్పుడు క్రైస్తవ సంయమనం ఎలా ప్రదర్శితమౌతుంది?
[అధ్యయన ప్రశ్నలు]
[అధ్యయన ప్రశ్నలు]
[9వ పేజీలోని చిత్రం]
పేరు పొందిన అనేక పత్రికలు, పుస్తకాలు మన క్రైస్తవ విలువలతో పొందిక కల్గివుండవు
[10వ పేజీలోని చిత్రం]
మొండిగా ఉండకుండానే క్రైస్తవులు తమ తలంపులను పరస్పరం ఒకరితో ఒకరు పంచుకోవచ్చు