కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను ఘనపర్చే ఆనందకరమైన వివాహాలు

యెహోవాను ఘనపర్చే ఆనందకరమైన వివాహాలు

యెహోవాను ఘనపర్చే ఆనందకరమైన వివాహాలు

వెల్ష్‌, ఎల్తియా దక్షిణాఫ్రికాలోని సొవేతోలో 1985 లో వివాహం చేసుకున్నారు. అప్పుడప్పుడు వారు తమ కుమార్తె జింజీతో తమ వివాహ ఆల్బమ్‌ను చూస్తూ ఆ ఆనందకరమైన దినాన్ని మననం చేసుకుంటారు. ఆ చిత్రాల్లోని వివాహ ఆహూతులను గుర్తుపట్టడం ఆమెకు చాలా ఇష్టం, ప్రత్యేకించి సొగసైన దుస్తుల్లో ఎంతో అందంగా ఉన్న అమ్మని జింజీ ఆనందంగా చూస్తుంది.

ఆవివాహం, సొవేతోలోని కమ్యూనిటీ హాల్లో, వివాహ ప్రసంగంతో మొదలైంది. తర్వాత క్రైస్తవ యువత బృందగానంతో దేవుణ్ని స్తుతించారు. ఆ తర్వాత, మంద్రస్థాయిలో వినిపిస్తున్న రాజ్యగీతాల సంగీత నేపథ్యంలో ఆహూతులు భోజనాన్ని ఆస్వాదించారు. అక్కడ మద్యం లేదు, దద్దరిల్లే సంగీతం గానీ డాన్స్‌ గానీ లేదు. బదులుగా, ఆహూతులు పరస్పర సహవాసంలో ఆనందిస్తూ నూత్న దంపతులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమమంతా మూడు గంటలసేపు నడిచింది. “ఆ వివాహం నా మనస్సులో ఎన్నో మధుర స్మృతుల్ని మిగిల్చింది” అని క్రైస్తవ పెద్దయైన రేమండ్‌ గుర్తుచేసుకుంటున్నాడు.

వారి వివాహమప్పుడు వెల్ష్‌, ఎల్తియా వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ దక్షిణాఫ్రికా బ్రాంచిలో స్వచ్ఛంద సేవకులుగా ఉన్నారు. పెద్ద ఆడంబరాలతో కూడిన వివాహం వారి తాహతుకు మించింది. కొందరు క్రైస్తవులు విస్తృతమైన తమ వివాహ ఏర్పాట్లకైన ఖర్చుల నిమిత్తం లౌకిక ఉద్యోగాల్లో చేరేందుకు పూర్తికాల సేవను విడిచిపెట్టారు. అయితే, వెల్ష్‌, ఎల్తియాలు తమ వివాహం నిరాడంబరంగా జరిగినందుకు విచారించలేదు, ఎందుకంటే అది వాళ్లు పూర్తికాలం దేవుని సేవ చేసేందుకు అవకాశం ఇచ్చింది, జింజీ జన్మించేంత వరకు.

మరైతే, తమ పెళ్లిలో లౌకికమైన సంగీతం నృత్యం ఉండాలని దంపతులు ఎంపిక చేసుకుంటే అప్పుడేమిటి? వారు వైన్‌ లేక ఇతర మద్య పానీయాలు అందించాలని నిర్ణయించుకుంటే? భారీయెత్తున తమ వివాహాన్ని జరుపుకునే తాహతు వారికుంటే? అది దేవుని ఆరాధకులకు తగినట్లుగా ఆ సందర్భం ఆనందకరమైనదిగా ఉండేలా వాళ్లెలా నిశ్చయపర్చుకోగలరు? అలాంటి ప్రశ్నల్ని గురించి జాగ్రత్తగా యోచన చేయవలసిన అవసరం ఉంది, ఎందుకంటే బైబిలు ఇలా ఆజ్ఞాపిస్తుంది: “కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”—1 కొరింథీయులు 10:31.

అల్లరితోకూడిన ఆటపాటలు నివారించడం

ఆనందంలేని వివాహాలను ఊహించటమే కష్టం. అయితే మరోవైపు అంతకన్నా ప్రమాదకరమైనది అవధులులేని అల్లరితోకూడిన ఆటపాటలు. సాక్షులుకానివారి అనేక వివాహాల్లో, దేవుని అగౌరవపర్చే సంగతులు జరుగుతాయి. ఉదాహరణకు, ఒళ్ళు తెలియని స్థితికొచ్చేంత వరకు మద్యపానం చేయడం సర్వసాధారణం. కొన్ని క్రైస్తవ వివాహాల్లో కూడా ఇలాంటివి జరగటం విచార్యం.

“మద్యము అల్లరి పుట్టించును” అని బైబిలు హెచ్చరిస్తుంది. (సామెతలు 20:1) “అల్లరి” అని అనువదించబడిన హెబ్రీ పదానికి “పెద్దగా గోల చేయటం” అని అర్థం. మద్యం ఒక వ్యక్తిని గోల చేసేవాడిగా చేస్తే, పెద్ద సంఖ్యలో గుంపు కూడి ఉన్న జనం అతిగా తాగితే ఎలా ఉంటుందో ఊహించండి ! ఖచ్చితంగా, అలాంటి సందర్భాలు బైబిలు ‘శరీర కార్యాలు’ అని చెప్తున్న “మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి” జరగటానికి తేలిగ్గా నడిపించగలవు. పశ్చాత్తాపపడకుండా అలాంటివి చేస్తూనే ఉండే వారు దేవుని రాజ్యపరిపాలన క్రింద నిత్యజీవాన్ని పొందటానికి పాత్రులు కారు.—గలతీయులు 5:19-21.

“అల్లరితోకూడిన ఆటపాటలు” అనే మాటకుగల గ్రీకు పదం, తాగి పాడుకుంటూ, గంతులువేస్తూ, వాద్యాల హోరుతో వీధిలో ఊరేగింపుగా వెళ్తున్న కుర్రకారును వర్ణిస్తూ ఉపయోగించబడింది. వివాహమహోత్సవంలో మద్యాన్ని మంచినీళ్ళలా ఖర్చుచేస్తే, హోరున సంగీతం పెట్టి వశంతప్పి నృత్యం చేస్తే, ఆ సందర్భం అల్లరితోకూడిన ఆటపాటలుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి వాతావరణంలో బలహీన మనస్కులు సులభంగా శోధనలో పడిపోయి ఇతర శరీర కార్యములైన “జారత్వము, అపవిత్రత, కాముకత్వము, [లేదా] క్రోధము” వంటివాటిలో పడిపోగలరు. క్రైస్తవ వివాహంలోని ఆనందాన్ని హరించివేసే ఇటువంటి శరీర కార్యములు జరుగకుండా ఎలా నివారించవచ్చు? ఆ ప్రశ్నకు జవాబివ్వటానికి ఒకానొక వివాహం గురించి బైబిలు ఏమి చెబుతుందో పరిశీలిద్దాము.

యేసు హాజరైన ఒక వివాహవేడుక

యేసుకు ఆయన శిష్యులకు ఒక పెండ్లి పిలుపువచ్చింది, పెళ్ళి గలిలయలోని కానాలో. వారా ఆహ్వానాన్ని స్వీకరించారు, అంతేకాదు యేసు ఆ వేడుకలోని సంతోషానందాలకు దోహదపడ్డాడు కూడా. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన మంచి నాణ్యమైన ద్రాక్షారసాన్ని అద్భుతరీతిన సృష్టించాడు. వివాహం తర్వాత మిగిలిపోయినదంతా పెండ్లికుమారునికీ ఆయన కుటుంబానికీ కొంతకాలంపాటు అవసరాల్ని తీర్చిందనటంలో సందేహంలేదు.—యోహాను 2:3-11.

యేసు హాజరైన వివాహం నుండి మనం అనేక పాఠాల్ని నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా, యేసు ఆయన శిష్యులు వివాహ విందుకు అనాహూతులుగా వెళ్ళలేదు. వారు ఆహ్వానించబడ్డారని బైబిలు స్పష్టంగా చెబుతుంది. (యోహాను 2:1, 2) అదే విధంగా, వివాహ విందుల గురించిన రెండు దృష్టాంతాల్లో, వచ్చినవారు ఆహూతులని యేసు మళ్ళీ మళ్ళీ చెప్పాడు.—మత్తయి 22:2-4, 8, 9; లూకా 14:8-10.

కొన్ని దేశాల్లో, పెండ్లి పిలుపు వచ్చినా రాకున్నా పెళ్ళిభోజనాలకు మాత్రం వెళ్ళిపోవచ్చనుకోవటం ఆచారం. అయితే, దీని మూలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. అంత ధనవంతులు కాని దంపతులు, పరిమితి అంటూలేని గుంపుకి ఆహారపానీయాలు అందించడానికి ప్రయత్నిస్తే అప్పుల్లో కూరుకుపోవచ్చు. అందుకని, క్రైస్తవ దంపతులు పెద్ద ఆడంబరాలకు పోకుండా నిర్దిష్ట సంఖ్యలో అతిథుల్ని విందుకు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లైతే, ఆహ్వానించబడని తోటి క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకుని, గౌరవించాలి. దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్‌లో పెండ్లి చేసుకున్న ఒక వ్యక్తి తన పెళ్ళికి 200 మందిని ఆహ్వానించినట్లు గుర్తుచేసుకుంటున్నాడు. అయితే 600 మంది విందుకు వచ్చారు, భోజనం చాలా త్వరగా అయిపోయింది. అనాహూతుల్లో పెళ్ళిరోజున, కేప్‌ టౌన్‌ని చూడటానికి ఒక బస్సునిండా వచ్చిన సందర్శకులున్నారు. ఈ బస్సు కండక్టరు వధువుకి దూరపు బంధువు, అతడు వధువును గానీ వరుణ్ణి గానీ సంప్రదించకుండానే తానూ తనతోపాటు ఆ గుంపునూ తీసుకువచ్చేయటం తన హక్కు అనుకున్నాడు !

వేడుకకు అందరూ రావచ్చని చెప్పనంతవరకు, యేసును నిజంగా అనుసరించేవారు ఆహ్వానం లేకుండానే పెళ్ళిభోజనాలకు హాజరుకారు. ఆహ్వానం లేకుండానే హాజరుకావాలని బుద్ధిపుట్టినవారు తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి, ‘నేనిలా పెళ్ళిభోజనాలకు హాజరుకావటం కొత్తగా పెళ్ళిచేసుకుంటున్న వారిపట్ల ప్రేమరాహిత్యాన్ని చూపదా? నేనీ వేడుకల్లోని సంతోషానందాలకు అడ్డంకి కానా?’ అర్థం చేసుకునే మనస్సుగల క్రైస్తవుడు తనకు పిలుపునివ్వనందుకు కోపగించుకోవటానికి బదులుగా ప్రేమపూర్వకంగా ఆ నూతన దంపతులకు అభినందనల్ని తెలుపుతూ సందేశాన్ని పంపి, వారిపై యెహోవా ఆశీస్సులను ఆశిస్తున్నట్లు చెబుతాడు. అంతేగాక, ఆ దంపతుల పెళ్ళిరోజు ఆనందాన్ని అధికంచేస్తూ ఒక కానుకను పంపించి సహాయపడాలని కూడా అనుకోవచ్చు.—ప్రసంగి 7:9; ఎఫెసీయులు 4:28.

ఎవరు బాధ్యులు?

ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పెద్దవయసులో ఉన్న బంధువులు పెండ్లి ఏర్పాట్లను చేయటం ఆచారం. ఇందుకు కొత్త దంపతులు కృతజ్ఞతాభావాలు కలిగివుంటారు, ఎందుకంటే ఇలా వారికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అంతేగాక ఏమి జరిగినా అందుకు తాము బాధ్యులం కామన్న భావనలు కూడా వారిలో కలిగించవచ్చు. అయితే మంచి ఉద్దేశాలేగల బంధువుల నుండి ఏ రకమైన సహాయాన్నైనా స్వీకరించటానికి ముందు దంపతులు తమ వ్యక్తిగత అభిలాషలు కూడా గౌరవించబడేలా నిశ్చయపర్చుకోవాలి.

యేసు “పరలోకమునుండి దిగివచ్చిన” దేవుని కుమారుడైనప్పటికీ ఆయన కానాలోని వివాహవేడుకలో సమస్తాన్ని అదుపుచేయటానికి ప్రయత్నించినట్లు ఎటువంటి సూచనలూ లేవు. (యోహాను 6:41) అందుకు బదులుగా, “విందు ప్రధాని”గా పనిచేయటానికి వేరొకరు నియమించబడ్డారని బైబిలు చెబుతుంది. (యోహాను 2:8) ఈ వ్యక్తి మళ్ళీ, కొత్తగా కుటుంబ శిరస్సు అయిన పెండ్లి కుమారునికి జవాబుదారిగా ఉంటాడు.—యోహాను 2:9, 10.

క్రైస్తవ బంధువులు కొత్త కుటుంబపు దైవనియుక్తమైన శిరస్సును గౌరవించాలి. (కొలొస్సయులు 3:18-20) తన వివాహంలో ఏమి జరుగుతుందన్నదానికి బాధ్యత వహించవలసినది ఆయనే. సహజంగానే, పెండ్లికుమారుడు సహేతుకమైన వ్యక్తిగా ఉండాలి, సాధ్యమైనట్లైతే తన వధువు, తన తల్లిదండ్రులు, అత్తామామలందరి అభీష్టాల్నీ నెరవేర్చాలి. అయినప్పటికీ బంధువులు గనుక దంపతుల అభీష్టాలకు విరుద్ధంగా ఏర్పాట్లను చేయాలని పట్టుబట్టినట్లైతే, అప్పుడు నూతన దంపతులు వారి సహాయాన్ని మర్యాదగా నిరాకరించవలసి రావచ్చు, తామే నిరాడంబరమైన వివాహ ఖర్చుల్ని భరించవలసి రావచ్చు. ఈ విధంగా నూత్న దంపతులకు ఎటువంటి చేదు అనుభవాలూ కలుగకుండా ఉంటాయి. లేకపోతే ఉదాహరణకు ఇలా జరుగవచ్చు, ఆఫ్రికాలోని ఒక క్రైస్తవ వివాహంలో అవిశ్వాసి అయిన ఒక బంధువు పెత్తనం తనపై వేసుకుని, గ్లాసు పైకెత్తి ‘చనిపోయిన తాతముత్తాతల జ్ఞాపకార్థం’ అని అన్నాడు !

కొన్నిసార్లు వివాహిత దంపతులు పెళ్ళి సంబరాలు ముగియక ముందే హనీమూన్‌కి ప్రయాణమౌతారు. అలాంటి సందర్భాల్లో, బైబిలు ప్రమాణాల్ని పాటించటానికీ, వేడుకలు మరీ రాత్రవకముందే ముగిసేటట్లు చూసుకోవటానికీ పెండ్లికుమారుడు బాధ్యతగల ఒక వ్యక్తిని ఏర్పాటు చేయాలి.

జాగ్రత్తగా ప్రణాళిక వేసి, సమతుల్యంగా ఉండాలి

స్పష్టంగా యేసు హాజరైన వివాహంలో చక్కని ఆహారం సమృద్ధిగా ఉంది, ఎందుకంటే బైబిలు దాన్ని వివాహ విందు అని పిలుస్తుంది. ముందే గమనించినట్లుగా అక్కడ ద్రాక్షారసం కూడా సమృద్ధిగా ఉంది. అక్కడ యుక్తమైన సంగీతం, మర్యాదకరమైన నృత్యం కూడా ఉండేవుంటాయి, ఎందుకంటే యూదుల సామాజిక జీవనంలో ఇవి సాధారణమైన విషయాలు. తప్పిపోయిన కుమారుని గూర్చిన తన ప్రఖ్యాత దృష్టాంతంలో యేసు దీన్ని గురించి వర్ణించాడు. ఆ కథలోని ధనవంతుడైన తండ్రి, పశ్చాత్తప్తుడైన తన కుమారుడు తిరిగివచ్చినందుకు ఎంతగా ఆనందించాడంటే, ఆయనిలా అన్నాడు: “మనము తిని సంతోషపడుదము.” ఈ సంబరాల్లో “వాద్యములును నాట్యమును” ఉన్నాయని యేసు వర్ణించాడు.—లూకా 15:23, 25.

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కానాలోని వివాహంలో సంగీతం నృత్యం ఉన్నాయని బైబిలు నిర్దుష్టంగా చెప్పటంలేదు. నిజానికి వివాహాన్ని గురించిన ఏ బైబిలు వృత్తాంతంలోను నృత్యాన్ని గురించిన ప్రస్తావన లేదు. బైబిలు కాలాల్లోని దేవుని విశ్వసనీయ సేవకుల మధ్య వివాహ సందర్భాల్లో నృత్యమనేది యాదృచ్ఛికంగా జరిగేదే గాని అదొక ప్రాముఖ్యమైన అంశం కాదన్పిస్తోంది. మనం దీన్నుండి ఏమైనా నేర్చుకోగలమా?

ఆఫ్రికాలోని కొన్ని క్రైస్తవ వివాహాల్లో చెవులు చిల్లులుపడేలా సంగీతం పెట్టడం జరిగింది. సంగీతం ఎంత పెద్దగా ఉంటుందంటే ఆహూతులు మామూలుగా మాట్లాడుకోవటం సాధ్యంకాదు. కొన్నిసార్లు భోజనమైతే తక్కువవ్వటం కన్పించేది గాని నృత్యం విషయానికొస్తే ఎప్పుడూ లోపం ఉండేదికాదు, అదుపుకూడా తప్పేది. అదొక వివాహ విందుగా ఉండటానికి బదులుగా ఒక డ్యాన్స్‌ పార్టీగా మారిపోవటానికి సాకుగా ఉండేది. అంతేగాక, సంగీతం పెద్దగా పెట్టడం, తరచు సమస్యల్ని తీసుకువచ్చే అనాహూతుల్ని ఆకర్షిస్తుంది.

వివాహాల్ని గురించిన బైబిలు వృత్తాంతాలు సంగీతాన్ని నృత్యాన్ని నొక్కిచెప్పటం లేదు గనుక ఇది, నూతన దంపతులు యెహోవాను ఘనపర్చే విధంగా ప్రణాళికలు వేసుకునేందుకు నడిపించవద్దా? ఆఫ్రికా ఖండంలోని దక్షిణ దేశాల్లో ఇటీవల జరిగిన అనేక వివాహాల్లో, పెండ్లికూతురి వైపునున్న బృందాలుగా ఏర్పడిన క్రైస్తవ యౌవనస్థులు క్లిష్టమైన డ్యాన్స్‌ స్టెప్పుల్ని ప్రాక్టీసు చేయటానికి ఎన్నో గంటల్ని వెచ్చించారు. ఈ విధంగా కొన్ని నెలలపాటు వారి విలువైన సమయం ఎంతో వ్యర్థమైంది. కానీ క్రైస్తవులు “సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు” “శ్రేష్ఠమైన కార్యముల” నిమిత్తం, అంటే సువార్త ప్రకటనా పని, వ్యక్తిగత పఠనం, క్రైస్తవ కూటాలకు హాజరు కావటం వంటివాటి నిమిత్తం సమయాన్ని ఉపయోగించాలి.—ఎఫెసీయులు 5:15-16; ఫిలిప్పీయులు 1:9-10.

యేసు ద్రాక్షారసాన్ని అంత పెద్దమొత్తంలో అద్భుతంగా సృష్టించిన దృష్ట్యా కానాలోని వివాహవేడుక చాలా పెద్దదేనని అన్పిస్తుంది. అయినా, ఆ సందర్భం కొన్ని యూదా వివాహాల విషయంలో జరుగుతున్నట్లు అల్లరితో కూడినది కాదనీ, ఆహూతులు మద్యాన్ని అదుపుతప్పి తాగలేదని నిశ్చయంగా ఉండవచ్చు. (యోహాను 2:10) అదెలా? ఎందుకంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు హాజరైవున్నాడు. వేరెవ్వరికన్నా ఎక్కువగా యేసు, చెడు సహవాసాన్ని గురించి ఇవ్వబడిన, “ద్రాక్షారసము త్రాగువారితో . . . సహవాసము చేయకుము” అనే దేవుని ఆజ్ఞను పాటించటానికి అత్యంత జాగ్రత్త వహించివుంటాడు.—సామెతలు 23:20.

అందుకని, కొత్త దంపతులు తమ వివాహంలో ద్రాక్షారసాన్ని గాని మరితర మద్యపానీయాల్ని గాని అందించాలని నిర్ణయించుకుంటే దీన్ని వారు బాధ్యతగల వ్యక్తుల పూర్తి నియంత్రణలో ఉంచాలి. వారు సంగీతం పెట్టాలని నిర్ణయించుకుంటే, వారు యుక్తమైన శ్రావ్యమైన సంగీతాన్ని ఎంపిక చేసుకుని బాధ్యతగల వ్యక్తి వాల్యూమును చూసుకునేట్లు చూడాలి. ఆహూతులు దాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, ప్రశ్నించదగ్గ సంగీతాన్ని పెద్ద వాల్యూములో పెట్టేందుకు వారిని అనుమతించకూడదు. నృత్యం గనుక ఉండాలనుకుంటే దాన్ని మర్యాదపూర్వకంగా నియంత్రణలో ఉండేట్లు ప్రవేశపెట్టాలి. అవిశ్వాసులైన బంధువులు గాని, పరిణతి లేని క్రైస్తవులు గాని అసభ్యకరమైన లేదా భావోద్రేకాల్ని రేపే నృత్యాన్ని చేస్తున్నట్లైతే, పెండ్లికుమారుడు ఆ సంగీతాన్ని మార్చేయవలసి రావచ్చు లేదా యుక్తిగా నృత్యాన్ని ఆపేయమని కోరవచ్చు. లేనట్లైతే, ఆ వివాహంలో అల్లకల్లోలం ఏర్పడి అభ్యంతరాల్ని కలిగించవచ్చు.—రోమీయులు 14:21.

కొన్ని రకాలైన నేటి నృత్యాలు, పెద్ద సౌండులో సంగీతం, మద్యాన్ని విపరీతంగా సరఫరా చేయటం వంటివాటిలో అపాయాలున్నందున అనేకమంది క్రైస్తవ పెండ్లికుమారులు వీటిని తమ వివాహాల్లో చేర్చకూడదని నిర్ణయించుకున్నారు. ఇలా చేసినందుకు కొందరు విమర్శించబడ్డారు, కానీ దేవుని పరిశుద్ధ నామంపై కళంకాన్ని తీసుకురాగల దేన్నైనా నివారించాలని వారు కోరుకుంటున్నందున వాస్తవంగా వారిని మెచ్చుకోవాలి. అలాకాక, యుక్తమైన సంగీతం, నృత్యం చేయటానికి కొంత సమయం, మితంగా మద్యం వంటివాటిని కొందరు పెండ్లికుమారులు ఏర్పాటు చేస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ తాను తన వివాహంలో ఏమి జరగటానికి అనుమతించినా దానికి పెండ్లికుమారుడే బాధ్యతవహించాలి.

ఆఫ్రికాలో కొందరు పరిణతి లేనివారు మర్యాదకరమైన క్రైస్తవ వివాహాల్ని నిరసిస్తూ, వాటికి హాజరు కావటం అంత్యక్రియలకు హాజరుకావటంగా ఉందని అంటారు. అయితే అది సమతుల్యంతో కూడిన దృక్కోణం కాదు. శారీరకమైన పాపపు కార్యములు తాత్కాలికమైన ఉత్తేజాన్ని తీసుకురావచ్చు, కానీ వాటి మూలంగా క్రైస్తవుల మనస్సాక్షి కలతచెందవచ్చు, దేవుని నామంపై కళంకం పడవచ్చు. (రోమీయులు 2:24) మరోవైపు చూస్తే దేవుని పరిశుద్ధాత్మ నిజమైన సంతోషాన్ని తీసుకువస్తుంది. (గలతీయులు 5:22) అనేకమంది క్రైస్తవ దంపతులు తమ పెళ్ళిరోజు నాటి స్మృతులను ఆనందంగా నెమరువేసుకుంటారు, తమ వివాహం “అభ్యంతరమేమియు కలుగజేయక” సంతోషాన్ని తీసుకువచ్చిందని వారికి తెలుసు.—2 కొరింథీయులు 6:3.

వెల్ష్‌ ఎల్తియాలు తమ వివాహానికి హాజరైన అవిశ్వాసులైన బంధువులు చేసిన మంచి వ్యాఖ్యానాల్ని ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటుంటారు. ఒకాయన ఇలా అన్నాడు: “ఈ రోజుల్లో పెళ్ళిళ్లలో జరిగే అల్లరిని చూసి మాకు విసుగొచ్చేస్తుంది. మర్యాదకరమైన మీ పెళ్ళికి హాజరవ్వటం చక్కని మార్పుగా ఉంది.”

అతి ప్రాముఖ్యంగా, ఆనందకరమైన, గౌరవప్రదమైన క్రైస్తవ వివాహాలు వివాహ ఆరంభకుడైన యెహోవా దేవుణ్ని ఘనపరుస్తాయి.

[22వ పేజీలోని బాక్సు/చిత్రం]

వివాహ వేడుక కోసం గమనించాల్సినవి

• మాట్లాడమని అవిశ్వాసియైన బంధువును గానీ మీరు పిలుస్తుంటే, ఆ వ్యక్తి క్రైస్తవం కాని ఆచారాలను పాటించమని చెప్పడని మీకు నమ్మకం ఉందా?

• సంగీతం గానీ పెట్టినట్లైతే, తగిన పాటల్నే మీరు ఎంపిక చేసుకున్నారా?

• సంగీతం పెట్టినట్లైతే యుక్తమైనంత శబ్దమే పెడతారా?

• నృత్యంగానీ అనుమతిస్తే, గౌరవప్రదంగానే ఉంటుందా?

• మద్యం గానీ ఉంటే, మితంగానే అందిస్తారా?

• దాన్ని బాధ్యతగలవాళ్లే పంపిణీ చేస్తారా?

• వివాహ వేడుకను యుక్తమైన సమయంలోనే ముగించటానికి సమయం నిర్ణయించారా?

• క్రమంగా ముగిసేంత వరకూ బాధ్యత గలవాళ్లు ఉంటారు కదా?