“యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును”
“యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును”
“నిర్దోషినని నా చేతులు కడుగుకొందును; యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును.” (కీర్తన 26:6) ఇశ్రాయేలీయుల రాజైన దావీదు యెహోవాపట్ల తనకున్న భక్తిని ఈ మాటల్లో వ్యక్తం చేశాడు. అయితే ఆయనెందుకు యెహోవా “బలిపీఠముచుట్టు ప్రదక్షిణము” చేయాలి, ఏ భావంలో ఆయనలా అన్నాడు?
దావీదు దృష్టిలో యెహోవా ఆరాధనకు కేంద్రం ఏమిటంటే, ఇత్తడిపూతతో కూడిన బలిపీఠం ఉన్న గుడారమే; ఇది ఆయన పరిపాలనా కాలంలో యెరూషలేముకు ఉత్తరాన గిబ్యోనులో ఉండేది. (1 రాజులు 3:4) ఈ బలిపీఠం దాదాపు ఏడు చదరపు అడుగులు మాత్రమే ఉండేది, సొలొమోను కట్టించనైయున్న దేవాలయంలోని ఆవరణంలో స్థాపించబోయే గొప్ప బలిపీఠంతో పోలిస్తే ఇది చాలా చిన్నదే. * అయినా, బలిపీఠం కూడావున్న గుడారం విషయంలో దావీదు ఎంతో సంతృప్తిని కనుగొన్నాడు—అది ఇశ్రాయేలులో స్వచ్ఛారాధనకు కేంద్రం.—కీర్తన 26:8.
బలిపీఠం మీద దహనబలులు, సమాధానబలులు, అపరాధ పరిహారార్థ బలులు అర్పించబడేవి, అంతేగాక వార్షిక ప్రాయశ్చిత్తార్థ దినాన జనాంగమంతటి పక్షాన బలులు అర్పించబడేవి. బలిపీఠం, దానిపై అర్పించబడే బలులు నేటి క్రైస్తవులకు భావాన్ని కలిగివున్నాయి. బలిపీఠం దేవుని చిత్తాన్ని సూచిస్తుందని అపొస్తలుడైన పౌలు వివరించాడు, ఆ చిత్తం ప్రకారం ఆయన మానవజాతి విమోచనకోసం యుక్తమైన బల్యర్పణను స్వీకరించాడు. పౌలు ఇలా అన్నాడు: “యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమునుబట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.”—హెబ్రీయులు 10:5-10.
బలిపీఠం దగ్గర పరిచర్య చేయటానికి ముందు యాజకులు తమను తాము శుద్ధిపర్చుకోవటానికి నీటితో విధిగా తమ చేతుల్ని కడుగుకొనేవారు. అందుకని యుక్తమైన రీతిలోనే రాజైన దావీదు ‘బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయటానికి’ ముందు తన చేతుల్ని ‘నిర్దోషినని కడుగుకొన్నాడు.’ ఆయన ‘యథార్థహృదయుడై నీతిని బట్టి నడుచుకొన్నాడు.’ (1 రాజులు 9:4) ఆయనీ విధంగా చేతులు కడుక్కోనట్లైతే, ఆయన ఆరాధన—ఆయన ‘బలిపీఠం చుట్టు ప్రదక్షిణం చేయటం’—ఆమోదయోగ్యంగా ఉండేది కాదు. అయితే దావీదు లేవీయుడు కాదు, ఆయనకు బలిపీఠం వద్ద యాజక సేవలు చేసే ఆధిక్యత లేదన్న విషయం నిజమే. ఆయన రాజైనప్పటికీ కనీసం గుడారపు ఆవరణలోనికి కూడా ఆయనకు అనుమతి లేదు. అయినప్పటికీ, ఆయనొక విశ్వసనీయుడైన ఇశ్రాయేలీయునిగా మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి, తన అర్పణలను క్రమం తప్పక బలిపీఠం వద్దకు తీసుకువచ్చాడు. ఆ విధంగా, తన జీవితానికి స్వచ్ఛారాధనే కేంద్రంగా పెట్టుకుని జీవించడం ద్వారా ఆయన బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేశాడని చెప్పవచ్చు.
నేడు మనం దావీదు మాదిరిని అనుసరించగలమా? తప్పకుండా. యేసు బలియర్పణపై విశ్వాసం ఉంచినట్లైతే, ‘నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగియున్నట్లైతే,’ యెహోవాకు హృదయపూర్వకంగా సేవచేసినట్లైతే మనం కూడా మన చేతుల్ని నిర్దోషులముగా కడుగుకొని, దేవుని బలిపీఠం చుట్టూ ప్రదక్షిణలు చేయగలము.—కీర్తన 24:4.
[అధస్సూచీలు]
^ పేరా 3 ఆ బలిపీఠం దాదాపు 30 చదరపు అడుగులు ఉంటుంది.
[23వ పేజీలోని చిత్రం]
బలిపీఠము దేవుని చిత్తాన్ని సూచిస్తుంది, ఆ చిత్తాన్నిబట్టే ఆయన మానవజాతి విమోచనకోసం యుక్తమైన బల్యర్పణను స్వీకరిస్తాడు