కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషకరమైన కుటుంబ జీవితం ఇతరులను దేవునివైపుకు ఆకర్షిస్తుంది

సంతోషకరమైన కుటుంబ జీవితం ఇతరులను దేవునివైపుకు ఆకర్షిస్తుంది

రాజ్య ప్రచారకుల నివేదిక

సంతోషకరమైన కుటుంబ జీవితం ఇతరులను దేవునివైపుకు ఆకర్షిస్తుంది

యెహోవా యోసేపును గొప్ప జ్ఞానముతోనూ, వివేచనతోనూ ఆశీర్వదించాడు. (అపొస్తలుల కార్యములు 7:10) ఫలితంగా, యోసేపు కున్న అంతర్దృష్టి, “ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను.”—ఆదికాండము 41:37.

అలాగే ఈనాడు, యెహోవా తన ప్రజలకు వారి బైబిలు అధ్యయనం ద్వారా వారికి అంతర్దృష్టిని వివేచననూ అనుగ్రహిస్తున్నాడు. (2 తిమోతి 3:16, 17) బైబిలు ఆధారిత ఉపదేశాన్ని అన్వయించుకుంటుండగా ఈ జ్ఞానము, వివేచన మంచి ఫలితాలను తీసుకువస్తాయి. జింబాబ్వే నుండి వచ్చిన ఈ క్రింద ఇవ్వబడిన ఉదాహరణలు వివరిస్తున్నట్లుగా, తరచూ వారి మంచి ప్రవర్తన ‘వారిని గమనించే వారి దృష్టికి యుక్తంగా ఉంటుంది.’

• ఒక స్త్రీ పొరుగింటిలో యెహోవాసాక్షులు ఉండేవారు. ఆమెకు సాక్షులంటే ఇష్టంలేకపోయినప్పటికీ, ఆమె వారి ప్రవర్తనను ప్రాముఖ్యంగా వారి గృహ జీవితాన్ని ఎంతో మెచ్చుకునేది. ఆ భార్యభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు, వారి పిల్లలు వారికి విధేయులైవున్నట్లు ఆమె గమనించింది. ముఖ్యంగా ఆమె భర్త ఆమె పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నట్లు కూడా ఆమె గమనించింది.

ఒక భర్త, తన భార్యను ప్రేమిస్తున్నట్లయితే ఆ భార్య తన భర్తను ‘వశపర్చుకునేందుకు’ ఏదో మంత్రం వేసివుంటుందని ఆఫ్రికాలోని కొన్ని సంస్కృతుల్లో సాధారణంగా నమ్ముతారు. కాబట్టి ఆ స్త్రీ, సాక్షియైన ఆ భార్య దగ్గరకెళ్లి ఇలా అడిగింది: “మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే నా భర్త నన్ను ప్రేమించేలా మీ భర్తపై మీరు ఉపయోగించిన మంత్రాన్ని నాకు చెప్తారా?” దానికా సాక్షి “ఆ, తప్పకుండా రేపు మధ్యాహ్నం చెప్తాను” అని జవాబిచ్చింది.

మర్నాడు ఆ సహోదరి ఆ “మంత్రం”తో తన పొరుగామె వద్దకు వెళ్ళింది. అదేమిటి? అది బైబిలు, దానితో పాటు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం. జ్ఞానము పుస్తకంలోనుండి “దేవున్ని ఘనపర్చే కుటుంబాన్ని కట్టుట” అనే విషయంపై ఉన్న సమాచారాన్ని పరిశీలించాక ఆమె ఆ స్త్రీతో ఇలా అంది: “ఈ మంత్రాన్నే నేనూ నా భర్త ఒకరినొకరం వశపరచుకొనేందుకు ఉపయోగించుకుంటాము, అందుకే మేము ఒకరినొకరం అంతగా ప్రేమించుకుంటాము.” బైబిలు పఠనం ప్రారంభమైంది, యెహోవాకు తాను చేసుకున్న సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించేంతగా ఆమె శీఘ్రంగా అభివృద్ధి సాధించింది.

• జింబాబ్వే మొజాంబిక్‌ల మధ్య ఉన్న ఒక చిన్న సంఘానికి ఇద్దరు ప్రత్యేక పయినీర్లు నియమించబడ్డారు, కాని వారు రెండు వారాలు ఇంటింటి పరిచర్యకు వెళ్ళలేదు. ఎందుకని? ఎందుకంటే, వాళ్ళు ఏమి చెప్తారో వినడానికి ప్రజలు వారి వద్దకే వస్తున్నారు. అదెలా జరిగిందో ఒక పయినీరు ఇలా చెప్తున్నాడు: “ఆసక్తిగల ఒక వ్యక్తితో గృహ బైబిలు పఠనాన్ని నిర్వహించేందుకు మేము ప్రతి వారం 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళం. ఆ ప్రాంతానికి వెళ్ళడం అంత సులభంకాదు. మేము బురదలో నడిచివెళ్ళాలి, మెడ లోతు నీళ్లుండే ఏరులను మేము దాటాలి. మా బట్టలు, మా బూట్లూ తలపై పెట్టుకుని అవి పడిపోకుండా జాగ్రత్తగా, నీళ్లల్లోంచి నడిచి అవతల ఒడ్డుకు వెళ్లి, బట్టలు వేసుకొని తయారవుతాము.

“ఆసక్తిగల ఆ వ్యక్తి ఇరుగుపొరుగు వారు మా ఉత్సాహాన్ని చూసి చాలా ప్రభావితమయ్యారు. అలా ప్రభావితమైన వారిలో స్థానిక మత సంస్థ నాయకుడు కూడా ఉన్నాడు. ఆయన తన అనుచరులతో ఇలా అన్నాడు: ‘మీరు కూడా యెహోవా సాక్షులైన ఆ ఇద్దరు యౌవనులవలే ఉండాలని కోరుకోరా?’ ఆ తర్వాత రోజు అతని అనుచరులు అనేకమంది, మేము ఎందుకంత పట్టుదలతో పనిచేస్తున్నామో తెలుసుకోవడానికి మా ఇంటికి వచ్చారు. అంతేకాక తర్వాత రెండు వారాల్లో ఇంకా చాలామంది మా ఇంటికి వచ్చారు, కనీసం మాకు వంట చేసుకోవడానికి కూడా సమయం దొరకలేదు!”

ఈ రెండు వారాల్లో ఆ పయినీర్ల ఇంటికి వచ్చిన వ్యక్తుల్లో మతనాయకుడు కూడా ఉన్నాడు. అతడు బైబిలు పఠనానికి అంగీకరించినప్పుడు ఆ పయినీర్లకు కలిగిన ఆనందాన్ని ఉహించండి!