కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ప్రవచన వాక్యంపై విశ్వాసం ఉంచండి!

దేవుని ప్రవచన వాక్యంపై విశ్వాసం ఉంచండి!

దేవుని ప్రవచన వాక్యంపై విశ్వాసం ఉంచండి!

“ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది.”2 పేతురు 1:19.

1, 2. నమోదు చేయబడిన మొట్టమొదటి ప్రవచనం ఏమిటి, అది రేకెత్తించే ప్రశ్నల్లో ఒకటేమిటి?

నమోదు చేయబడిన మొట్టమొదటి ప్రవచనం యెహోవా నుండి వచ్చింది. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు సర్పంతో ఇలా అన్నాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదు[వు].” (ఆదికాండము 3:1-7, 14, 15) ఆ ప్రవచన మాటలు సంపూర్ణంగా అర్థం చేసుకోవటానికి అప్పటికి శతాబ్దాల కాలం గడవాల్సివుంది.

2 ఆ తొలి ప్రవచనం పాపభరిత మానవజాతికి నిజమైన నిరీక్షణను అందిస్తుంది. లేఖనాలు ఆ తర్వాత, అపవాది అయిన సాతానును ‘ఆది సర్పము’ అని గుర్తించాయి. (ప్రకటన 12:9) కానీ దేవుని వాగ్దాన సంతానం ఎవరై ఉంటారు?

సంతానం కోసం శోధించటం

3. తొలి ప్రవచనంపై హేబెలు ఎలా విశ్వాసాన్ని చూపించాడు?

3 తన తండ్రిలా కాక, భక్తిపరుడైన హేబెలు తొలి ప్రవచనంపై విశ్వాసాన్ని చూపించాడు. పాపాన్ని కప్పివేయాలంటే రక్తాన్ని చిందించాల్సిన అవసరం ఉందని హేబెలు స్పష్టంగా గ్రహించాడు. కాబట్టి దేవునికి అంగీకారయుక్తమైన జంతుబలిని అర్పించటానికి విశ్వాసం ఆయన్ని కదిలించింది. (ఆదికాండము 4:2-4) అయితే వాగ్దాన సంతానపు గుర్తింపు మాత్రం మర్మంగానే ఉండిపోయింది.

4. దేవుడు అబ్రాహాముకు ఏ వాగ్దానం చేశాడు, వాగ్దాన సంతానానికి సంబంధించి అది ఏమి సూచించింది?

4 హేబెలు కాలానికి దాదాపు 2,000 ఏళ్ల తర్వాత యెహోవా, పితరుడైన అబ్రాహాముకు ఈ ప్రవచనాత్మక వాగ్దానం చేశాడు: “నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలె . . . నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; . . . భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” (ఆదికాండము 22:17, 18) ఈ మాటలు, తొలి ప్రవచనపు నెరవేర్పును అబ్రాహాముతో అనుసంధానం చేస్తున్నాయి. సాతాను క్రియలను లయము చేసే సంతానం అబ్రాహాము వంశంలో కనిపిస్తాడని అవి సూచిస్తున్నాయి. (1 యోహాను 3:8) “అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి [అబ్రాహాము] సందేహింప”లేదు, అలాగే క్రీస్తుకు పూర్వం యెహోవాకు సాక్షులుగా ఉన్నవారు కూడా “వాగ్దానఫలము అనుభవింపలేదు.” (రోమీయులు 4:20, 21; హెబ్రీయులు 11:39) బదులుగా, వారు దేవుని ప్రవచన వాక్యంపై విశ్వాసముంచారు.

5. దేవుని వాగ్దాన సంతానం ఎవరియందు నెరవేరింది, అలా అని ఎందుకు చెప్పగలరు?

5 పౌలు ఇలా వ్రాసినప్పుడు దేవుని వాగ్దాన సంతానాన్ని గుర్తించాడు: “అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టు—సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే—నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు.” (గలతీయులు 3:16) జనములు ఆశీర్వదించబడే ఆ సంతానంలో అబ్రాహాముకు పుట్టిన వారందరూ చేరి లేరు. ఆయన కుమారుడైన ఇష్మాయేలు సంతతివారు గానీ, కెతూరా ద్వారా పుట్టిన కుమారులు గానీ మానవజాతిని ఆశీర్వదించటానికి ఉపయోగించబడలేదు. ఆ ఆశీర్వాదపు సంతానం ఆయన కుమారుడైన ఇస్సాకు ద్వారా ఆయన మనుమడైన యాకోబు ద్వారా వచ్చింది. (ఆదికాండము 21:12; 25:23, 31-34; 27:18-29, 37; 28:14) యూదా గోత్రంలోని షిలోహుకు “ప్రజలు” విధేయత చూపిస్తారని యాకోబు చెప్పాడు. కానీ తర్వాత సంతానం యూదా గోత్రంలోని దావీదు వంశానికి పరిమితం చేయబడింది. (ఆదికాండము 49:10; 2 సమూయేలు 7:12-16) మొదటి శతాబ్దంలోని యూదులు మెస్సీయాగా లేక క్రీస్తుగా ఒక వ్యక్తి వస్తాడని ఎదురు చూశారు. (యోహాను 7:41, 42) సంతానాన్ని గూర్చిన దేవుని ప్రవచనం ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు నెరవేరింది.

మెస్సీయా అవతరణ !

6. (ఎ) 70 వారముల ప్రవచనం మనం ఎలా అర్థం చేసుకోవాలి? (బి) ఎప్పుడు, ఎలా యేసు ‘పాపమును నివారణ’ చేశాడు?

6 దానియేలు ప్రవక్త మెస్సీయాను గూర్చి ఒక ప్రాముఖ్యమైన ప్రవచనాన్ని నమోదు చేశాడు. మాదీయుడైన దర్యావేషు పాలన మొదటి సంవత్సరంలో, యెరూషలేము పాడుగా ఉండాల్సిన 70 సంవత్సరాల గడువు పూర్తికావచ్చిందని ఆయన గ్రహించాడు. (యిర్మీయా 29:10; దానియేలు 9:1-4) దానియేలు ప్రార్థన చేస్తుండగా గబ్రియేలు దూత వచ్చి, ‘పాపమును నివారణ చేయుటకు, డెబ్బదివారములు విధింపబడెను’ అని బయల్పరిచాడు. 70వ వారం మధ్యభాగంలో మెస్సీయా నిర్మూలించబడతాడు. పారసీక దేశపు రాజైన అర్తహషస్త I సా.శ.పూ. 455 లో ‘యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ ఇచ్చినప్పుడు’ ఈ “డెబ్బది వారముల సంవత్సరాలు” ప్రారంభమైనాయి. (దానియేలు 9:20-27; మొఫత్‌; నెహెమ్యా 2:1-8) ఏడు వారాలు, దానికి 62 వారాలు కలిపిన తర్వాత అంటే 69 వారాల తర్వాత మెస్సీయా వస్తాడు. ఈ 483 సంవత్సరాలు, సా.శ.పూ. 455 నుంచి ప్రారంభమై, సా.శ. 29 వరకు గడిచాయి, ఆ సంవత్సరంలో యేసు బాప్తిస్మ సమయంలో దేవుడు ఆయన్ని మెస్సీయాగా లేక క్రీస్తుగా అభిషేకించాడు. (లూకా 3:21, 22) యేసు తన జీవితాన్ని సా.శ. 33 లో విమోచన క్రయధనంగా అర్పించి ‘పాపమును నివారణ’ చేశాడు. (మార్కు 10:45) దేవుని ప్రవచన వాక్యంపై విశ్వాసముంచటానికి ఎంత చక్కని కారణాలున్నాయో గదా ! *

7. లేఖనాలను ఉపయోగిస్తూ, మెస్సీయా ప్రవచనాల్ని యేసు ఎలా నెరవేర్చాడో చెప్పండి.

7 దేవుని ప్రవచన వాక్యంపై విశ్వాసముంచటం మెస్సీయాను గుర్తించటానికి మనకు సాధ్యంచేస్తుంది. హెబ్రీ లేఖనాల్లో వ్రాయబడిన మెస్సీయా ప్రవచనాల్లో ఎన్నింటినో క్రైస్తవ గ్రీకు లేఖన రచయితలు సూటిగా యేసుకు అన్వయించారు. ఉదాహరణకు: యేసు బేత్లెహేములో ఒక కన్యకకు జన్మించాడు. (యెషయా 7:14; మీకా 5:2; మత్తయి 1:18-23; లూకా 2:4-11) ఆయన ఐగుప్తునుండి పిలువబడ్డాడు, ఆయన పుట్టిన తర్వాత పిల్లలు చంపబడ్డారు. (యిర్మీయా 31:15; హోషేయ 11:1; మత్తయి 2:13-18) యేసు మన రోగాలను భరించాడు. (యెషయా 53:4; మత్తయి 8:16, 17) ముందుగా చెప్పబడినట్లుగానే ఆయన గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోకి ప్రవేశించాడు. (జెకర్యా 9:9; యోహాను 12:12-15) యేసును కొరత వేసిన తర్వాత సైనికులు ఆయన వస్త్రాలు తమలో పంచుకుని ఆయన అంగీ కోసం చీట్లు వేసుకున్నప్పుడు కీర్తనకర్త మాటలు నెరవేరాయి. (కీర్తన 22:18; యోహాను 19:23, 24) యేసు ఎముకలలో ఏదీ విరువబడలేదు, ఆయనను ఈటెతో పొడిచారన్న వాస్తవాలు కూడా నెరవేరిన ప్రవచనాలే. (కీర్తన 34:20; జెకర్యా 12:10; యోహాను 19:33-37) దైవికంగా ప్రేరేపించబడిన బైబిలు రచయితలు యేసుకు అన్వయించిన మెస్సీయా ప్రవచనాల్లో ఇవి కొన్ని మాత్రమే. *

మెస్సీయా రాజుకు జయం !

8. మహా వృద్ధుడు ఎవరు, దానియేలు 7:9-14 లో నమోదు చేయబడిన ప్రవచనం ఎలా నెరవేరింది?

8 బబులోను రాజైన బెల్షస్సరు ఏలుబడి మొదటి సంవత్సరంలో, యెహోవా దానియేలు ప్రవక్తకు ఒక కలను, విశిష్టమైన దర్శనాలను అనుగ్రహించాడు. మొదట ప్రవక్త నాలుగు మిక్కిలి గొప్ప జంతువులను చూశాడు. దేవుని దూత వాటిని ‘నలుగురు రాజులు’ అని గుర్తించిన అవి, అలా పరంపరగా వచ్చే ప్రపంచ శక్తులను సూచించాయి. (దానియేలు 7:1-8, 17) తర్వాత దానియేలు, మహిమాన్వితమైన సింహాసనమందు ఆసీనుడైన ‘మహావృద్ధుడైన’ యెహోవాను చూశాడు. ఆ జంతువులకు ప్రతికూలంగా తీర్పు తీరుస్తూ, ఆయన వాటినుంచి పరిపాలనాధిపత్యాన్ని తీసివేసి, నాలుగవ జంతువును నాశనం చేస్తాడు. ‘సకల జనులపై రాష్ట్రములపై ఆ యా భాషలు మాటలాడువారిపై’ శాశ్వత పరిపాలనాధిపత్యం ‘మనుష్య కుమారుని పోలినవాని’ పరం చేయబడుతుంది. (దానియేలు 7:9-14) 1914 లో ‘మనుష్యకుమారుడైన’ యేసుక్రీస్తు పరలోకంలో సింహాసనాసీనుడవటం గూర్చి ఎంత గొప్ప ప్రవచనమో గదా !—మత్తయి 16:13.

9, 10. (ఎ) కలలోని ప్రతిమకున్న వేర్వేరు భాగాలు వేటిని సూచిస్తున్నాయి? (బి) దానియేలు 2:44 నెరవేర్పును మీరెలా వివరిస్తారు?

9 దేవుడు “రాజులను త్రోసివేయుచు నియమించుచు” ఉన్నవాడు అని దానియేలుకు తెలుసు. (దానియేలు 2:21) “మర్మములను బయలుపర”చే యెహోవాపై విశ్వాసంతో, ప్రవక్త బబులోను రాజైన నెబుకద్నెజరు కలలోని బ్రహ్మాండమైన ప్రతిమ యొక్క భావాన్ని విప్పిచెప్పాడు. దాని వేర్వేరు భాగాలు బబులోను, మాదీయ-పారశీకులు, గ్రీకు, రోము వంటి ప్రపంచశక్తుల ఉత్థాన పతనాలను సూచించాయి. కానీ దేవుడు మనకాలం వరకు ఆపైన వరకూ జరిగే ప్రపంచ సంఘటనలను స్థూలంగా చెప్పటానికి దానియేలును ఉపయోగించాడు.—దానియేలు 2:24-30.

10 “ఆ రాజుల కాలములలో” అంటూ ప్రవచనం ఇలా చెప్తుంది, “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:44) “అన్యజనముల కాలములు” 1914 లో అంతమైనప్పుడు, క్రీస్తు ఆధ్వర్యంలో దేవుడు పరలోక రాజ్యాన్ని స్థాపించాడు. (లూకా 21:24; ప్రకటన 12:1-5) దేవుని విశ్వ సర్వాధిపత్యం అనే “పర్వతము”నుంచి దైవికశక్తితో మెస్సీయా రాజ్యమనే “రాయి” తీయబడుతుంది. ఆ రాయి అర్మగిద్దోనులో ప్రతిమను పగులగొట్టి పొడి చేస్తుంది. పర్వతంలా “సర్వభూతలమంత” వ్యాపించిన మెస్సీయా రాజ్య ప్రభుత్వం, నిరంతరమూ నిలుస్తుంది.—దానియేలు 2:35, 45; ప్రకటన 16:14, 16. *

11. యేసు రూపాంతరం దేన్ని గూర్చిన పూర్వదర్శనమైవుంది, పేతురుపై ఆ దర్శన ప్రభావం ఎలా ఉంది?

11 తన రాజ్యపరిపాలన మనస్సునందుంచుకుని యేసు తన అపొస్తలులతో ఇలా అన్నాడు: “ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడ[రు].” (మత్తయి 16:28) ఆరు రోజుల తర్వాత, యేసు ఒక ఉన్నతమైన పర్వతంపైకి పేతురును, యాకోబును, యోహానును తీసుకెళ్లి అక్కడ రూపాంతరం పొందాడు. ఒక ప్రకాశవంతమైన మేఘము అపొస్తలులను ఆవరించగా, దేవుడు ఇలా ప్రకటించాడు: “ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట విను[డి].” (మత్తయి 17:1-9; మార్కు 9:1-9) క్రీస్తు రాజ్యమహిమను చూపే ఎంత గొప్ప దర్శనమో గదా ! “ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది” అని పేతురు సంభ్రమాశ్చర్యాలను కల్గించిన ఆ దర్శనాన్ని సూచించాడంటే అందులో ఆశ్చర్యంలేదు.—2 పేతురు 1:16-19. *

12. దేవుని ప్రవచన వాక్యంపై విశ్వాసాన్ని ప్రదర్శించటానికి ప్రత్యేకించి ఇది ఎందుకు సమయం?

12 “ప్రవచన వాక్యము”లో కేవలం మెస్సీయాను గూర్చి ప్రవచిస్తున్న హెబ్రీలేఖనాలు మాత్రమే గాక “ప్రభావముతోను మహా మహిమతోను” రానున్న యేసు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. (మత్తయి 24:30) తన రాజ్యాధికారంతో కూడిన క్రీస్తు మహిమాన్విత ఆగమనాన్ని గూర్చి చెప్పిన ప్రవచన వాక్యాన్ని ఆ రూపాంతరం ధ్రువపర్చింది. ఇక త్వరలోనే, ఆయన తన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసంలేని వారికి నాశనం, విశ్వాసం గలవారికి ఆశీర్వాదాలు రానైయున్నాయి. (1 థెస్సలొనీకయులు 1:6-10) నెరవేరిన బైబిలు ప్రవచనాలు ఇవి ‘అంత్యదినాలు’ అని నిరూపిస్తున్నాయి. (2 తిమోతి 3:1-5, 16, 17; మత్తయి 24:3-14) యెహోవా యొక్క ముఖ్య సంహారకుడిగా, యేసుక్రీస్తు అయిన మిఖాయేలు, ఈ దుష్టవిధానానికి ‘మహా శ్రమలో’ అంతం తీసుకురావటానికి సిద్ధంగా నిల్చుని ఉన్నాడు. (మత్తయి 24:21; దానియేలు 12:1) నిశ్చయంగా, ఇది మనకు దేవుని ప్రవచన వాక్యంపై విశ్వాసం ఉందని ప్రదర్శించే సమయం.

దేవుని ప్రవచన వాక్యంపై విశ్వాసాన్ని నిలుపుకోండి

13. దేవునిపట్ల మన ప్రేమను నిలుపుకోవటానికీ, ఆయన వాక్యంపై మన విశ్వాసాన్ని సజీవంగా ఉంచుకోవటానికీ మనకు ఏది సహాయపడవచ్చు?

13 దేవుని ప్రవచన వాక్యపు నెరవేర్పులను గూర్చి తొలిసారి తెలుసుకున్నప్పుడు నిశ్చయంగా మనం ఉత్తేజితులయ్యాము. కానీ అప్పట్నుంచి మన విశ్వాసం తగ్గిందా, మన ప్రేమ చల్లబడిపోయిందా? ‘మొదట ఉన్న ప్రేమను వదిలిపెట్టిన’ ఎఫెసులోని క్రైస్తవుల్లా మనమెన్నడూ మారకుందుము గాక. (ప్రకటన 2:1-4) మనం ఎంతకాలంగా యెహోవాను సేవిస్తున్నామన్నదాంతో నిమిత్తం లేకుండా, పరలోకంలో ధనాన్ని కూర్చుకునేందుకుగాను మనం ‘దేవుని రాజ్యాన్నీ నీతిని మొదట వెదకకపోతే’ మనం వారిలా ప్రేమను వదిలిపెట్టగలం. (మత్తయి 6:19-21, 31-33) బైబిలును నిష్ఠగా చదవటం, క్రైస్తవ కూటాల్లో క్రమంగా భాగం వహించటం, ఉత్సాహవంతమైన ప్రకటనా కార్యకలాపం వంటివి యెహోవాపట్లా, ఆయన కుమారునిపట్లా, లేఖనాలపట్లా మన ప్రేమను నిలుపుకునేందుకు దోహదపడతాయి. (కీర్తన 119:105; మార్కు 13:10; హెబ్రీయులు 10:24, 25) ప్రతిఫలంగా, ఇది దేవుని వాక్యంపై మన విశ్వాసాన్ని సజీవంగా ఉంచుతుంది.—కీర్తన 106:12.

14. యెహోవా ప్రవచన వాక్యంపై వారి విశ్వాసానికి, అభిషిక్త క్రైస్తవులకు ఎలాంటి ప్రతిఫలం దక్కింది?

14 దేవుని ప్రవచన వాక్యం గతంలో నెరవేరిన దానిబట్టి, అది భవిష్యత్తు గురించి చెప్తున్న దానిపై మనం విశ్వాసం ఉంచవచ్చు. ఉదాహరణకు, రాజ్య మహిమయందు క్రీస్తు ప్రత్యక్షత ఇప్పుడొక వాస్తవం, తమ మరణం వరకూ విశ్వాసంగా ఉన్న అభిషిక్త క్రైస్తవులు ఈ ప్రవచనాత్మక వాగ్దాన నెరవేర్పును అనుభవించారు: “జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును.” (ప్రకటన 2:7, 10; 1 థెస్సలొనీకయులు 4:14-17) విజయులైన వీరికి యేసు, దేవుని పరలోక ‘పరదైసునందు జీవవృక్ష ఫలాల్ని’ తినే ఆధిక్యతను అనుగ్రహిస్తాడు. వారి పునరుత్థానంలో యేసుక్రీస్తు ద్వారా, “అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ” దేవుడైన యెహోవా అనుగ్రహించిన అమర్త్యత, అక్షయతలో పాలుపొందుతారు. (1 తిమోతి 1:17; 1 కొరింథీయులు 15:50-54; 2 తిమోతి 1:10) దేవునిపట్ల వారికున్న అజరామరమైన ప్రేమకూ, ఆయన ప్రవచన వాక్యంపై అచంచలమైన విశ్వాసానికీ ఎంత గొప్ప ప్రతిఫలమో గదా !

15. “క్రొత్త భూమి” పునాదికి ఎవరు ప్రారంభం, వారి సహవాసులెవరు?

15 విశ్వాసులుగా చనిపోయిన అభిషిక్తులు పరలోకంలోని “దేవుని పరదైసు”లోకి పునరుత్థానమైన కొంత సమయం తర్వాతే, ఆధ్యాత్మిక ఇశ్రాయేలు శేషము ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యమైన “మహా బబులోను” నుంచి స్వతంత్రులయ్యింది. (ప్రకటన 14:8; గలతీయులు 6:16) “క్రొత్త భూమి”కి పునాది వారి నుండే ప్రారంభం. (ప్రకటన 21:1) అలా “ఒక దేశము” జన్మించి, ఈనాడు పుడమి అంతా పరిఢవిల్లుతున్న ఆధ్యాత్మిక పరదైసుగా అది రూపుదిద్దుకుంది. (యెషయా 66:8 NW) ఇప్పుడు ‘అంత్యదినాల్లో’ గొర్రెల్లాంటివారు గుంపులు గుంపులుగా ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులతో సహవసించటానికి ప్రవాహంవలె వస్తున్నారు.—యెషయా 2:2-4; జెకర్యా 8:23; యోహాను 10:16; ప్రకటన 7:9.

మానవజాతి భవిష్యత్తు దేవుని ప్రవచన వాక్యంలో ప్రవచించబడింది

16. అభిషిక్తులకు నమ్మకంగా మద్దతునిస్తున్న వారికి గల ఉత్తరాపేక్షలు ఏమిటి?

16 అభిషిక్తులకు నమ్మకంగా మద్దతునిస్తున్న వారికి ఏ ఉత్తరాపేక్షలున్నాయి? వారికి కూడా దేవుని ప్రవచన వాక్యంలో విశ్వాసం ఉంది, భూపరదైసులో ప్రవేశించటమే వారి నిరీక్షణ. (లూకా 23:39-43) అక్కడ వారు “జీవజలముల నది” నీళ్లను పానము చేస్తారు, నదికి ఇరువైపులా ఉన్న ‘చెట్ల ఆకులనుంచి’ స్వస్థత పొందుతారు. (ప్రకటన 22:1, 2) మీకు గాని అలాంటి అద్భుతమైన నిరీక్షణ ఉంటే, యెహోవాపట్ల మీరు గొప్ప ప్రేమను, ఆయన ప్రవచన వాక్యంపై విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉండవచ్చు. భూపరదైసులో నిత్యజీవపు అవధుల్లేని ఆనందాన్ని అనుభవించే వారిలో మీరూ ఒకరిగా ఉండవచ్చు.

17. భూ పరదైసు జీవితంలో ఏ ఆశీర్వాదాలు ఇమిడి ఉంటాయి?

17 రానున్న భూ పరదైసులోని జీవితాన్ని వర్ణించటం అపరిపూర్ణ మానవులకు సాధ్యంకాలేదు, గానీ దేవుని ప్రవచన వాక్యం విధేయ మానవజాతికి కలుగనైయున్న ఆశీర్వాదాల విషయంలో అంతర్దృష్టిని అందిస్తుంది. దేవుని రాజ్యం తిరుగులేని విధంగా పరిపాలనను ప్రారంభించినప్పుడు, ఆయన చిత్తం పరలోకంలో ఉన్నట్లే భూమ్మీదా నెరవేరినప్పుడు, భూమ్మీది సకల జంతువులతోపాటు ఏ దుష్ట మానవుడూ ‘హాని చేయడు, నాశనము చేయడు.’ (యెషయా 11:9; మత్తయి 6:9, 10) దీనులు భూమిపై నివసిస్తారు, “బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:11) ఆకలికి అలమటించే ప్రజలుండరు, ఎందుకంటే “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.” (కీర్తన 72:16) ఇక ఎవరూ విలపిస్తూ అశ్రువులు రాల్చరు. వ్యాధులు ఉండవు, చివరికి మరణం కూడా అంతం అవుతుంది. (యెషయా 33:24; ప్రకటన 21:4) అసలు ఇది మీ ఊహకు అందుతుందా—వైద్యులుండరు, మందులుండవు, ఆసుపత్రులుండవు, మానసిక చికిత్సాలయాలుండవు, అంత్యక్రియలుండవు. ఎంతటి అద్భుతమైన ఉత్తరాపేక్ష !

18. (ఎ) దానియేలుకు ఏ అభయం ఇవ్వబడింది? (బి) దానియేలు “వంతు” ఏమై ఉంటుంది?

18 మృతులు పునరుత్థానమౌతుండగా మానవజాతి సమాధి ఖాళీ అవుతుంది. నీతిమంతుడైన యోబుకు అలాంటి నిరీక్షణే ఉంది. (యోబు 14:14, 15) ప్రవక్తయైన దానియేలుకూ ఉంది, ఎందుకంటే యెహోవా దూత ఆయనకు ఈ ఆదరణకరమైన అభయాన్నిచ్చాడు: “నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినయెడల విశ్రాంతినొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.” (దానియేలు 12:13) తన జీవితపర్యంతం దానియేలు దేవునికి విశ్వాసంగా సేవ చేశాడు. ఇప్పుడు ఆయన మరణమందు విశ్రాంతి తీసుకుంటున్నాడు, కానీ ఆయన క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో “నీతిమంతుల పునరుత్థానమందు” ‘నిలబడతాడు.’ (లూకా 14:14) దానియేలు “వంతు” ఏమిటి? యెహోవా ప్రజలందరికి ఒక స్థలముంటుందనీ న్యాయంగా, క్రమమైన విధంగా భూమి విభాగించబడుతుందనీ యెహెజ్కేలు ప్రవచనం దాని పరదైసు నెరవేర్పులో సూచిస్తుంది. (యెహెజ్కేలు 47:13–48:35) అలా పరదైసులో దానియేలుకు ఒక స్థలముంటుంది, కానీ ఆయన వంతులో కేవలం స్థలం కంటే ఎక్కువే ఇమిడివుంటుంది. అది యెహోవా సంకల్పంలో ఆయన స్థానం కూడా ఇమిడివుంది.

19. భూపరదైసు జీవితానికి అగత్యమైనవేమిటి?

19 మీరు, మీ వంతు విషయం ఏమిటి? దేవుని వాక్యమైన బైబిలుపై మీకు విశ్వాసం ఉంటే, భూపరదైసులో ఒక స్థలంకోసం మీరు ఇచ్ఛయించవచ్చు. దాని అనేక ఆశీర్వాదాలను అనుభవిస్తూ, భూమిపట్ల శ్రద్ధ తీసుకుంటూ, చనిపోయిన వారిని ఆనందంగా ఆహ్వానిస్తూ మీరు అక్కడ ఉన్నట్లు ఊహించుకోవచ్చు. ఎంతైనా మానవజాతి ఉండవలసినది పరదైసులోనే కదా. అలాంటి స్థలంలో జీవించటానికే దేవుడు మొదటి మానవ జతను సృష్టించాడు. (ఆదికాండము 2:7-9) విధేయులైన మానవులు పరదైసులో నిరంతరం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. భూపరదైసులో చివరికి నివసించే కోట్లాదిమందిలో మీరు ఒకరిగా ఉండేందుకు లేఖనాల ప్రకారంగా మీరు ప్రవర్తిస్తారా? మన పరలోక తండ్రియైన యెహోవాపట్ల మీకు నిజమైన ప్రేమ ఉన్నట్లైతే, దేవుని ప్రవచన వాక్యంపై విశ్వాసాన్ని ఉంచినట్లైతే మీరూ అక్కడ ఉండగలరు.

[అధస్సూచీలు]

^ పేరా 6 వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన పే అటెన్షన్‌ టు డానియేల్స్‌ ప్రాఫసీ ! పుస్తకంలో 11వ అధ్యాయాన్ని, ఇన్‌సైట్‌ ఆన్‌ ద స్క్రిప్చర్స్‌లోని “ఏడు వారాలు” అనే శీర్షికను చూడండి.

^ పేరా 7 వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన “ఆల్‌ స్క్రిప్చర్స్‌ ఈజ్‌ ఇన్స్‌పైర్డ్‌ ఆఫ్‌ గాడ్‌ అండ్‌ బెనిఫిషియల్‌”లో 343-4 పేజీలను చూడండి.

^ పేరా 11 ఏప్రిల్‌ 1, 2000 కావలికోటలో “దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి,” అనే శీర్షికను చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• తొలి ప్రవచనం ఏమిటి, వాగ్దాన సంతానం ఎవరు?

• యేసులో నెరవేరిన కొన్ని మెస్సీయా ప్రవచనాలు ఏమిటి?

దానియేలు 2:44, 45 ఎలా నెరవేరుతాయి?

• విధేయులైన మానవజాతికి ఎలాంటి భవిష్యత్తును దేవుని ప్రవచన వాక్యం సూచిస్తోంది?

[అధ్యయన ప్రశ్నలు]

[18వ పేజీలోని చిత్రం]

మీరు భూపరదైసులో జీవించ నిరీక్షిస్తున్నారా?