కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు

దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు

దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు

ఇశ్రాయేల్‌ దేశంలో ఒక చెట్టుంది. ఆ చెట్టు చనిపోదనే చెప్పవచ్చు. ఎందుకంటే దాన్ని కొట్టేసినా దాని మొదలు త్వరలోనే మళ్ళీ చిగురిస్తుంది. ఒలీవ పండ్లు పరిపక్వమైనప్పుడు బోలెడంత నూనెను ఇస్తాయి. ఆ నూనెను వంటకూ, దీపాలను వెలిగించడానికీ, పారిశుద్ధ్యానికీ, సౌందర్య వర్ధనకూ ఉపయోగించవచ్చు.

బైబిలు పుస్తకమైన న్యాయాధిపతుల్లో వ్రాయబడిన ఒక ప్రాచీన ఉపమానం ప్రకారం, ‘చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనని మనస్సుకలిగి బయలుదేరాయి.’ అవి అడవిలోని ఏ చెట్టును ఎన్నుకోవాలని మొదట అనుకున్నాయి? మరే చెట్టునో కాదు, గట్టిగా ఉండే, పుష్కలంగా కాపు కాసే ఒలీవ చెట్టునే.—న్యాయాధిపతులు 9:8, 9.

3,500 సంవత్సరాల కన్నా పూర్వం, “ఒలీవనూనెయు తేనెయు గల దేశము” అని ఇశ్రాయేలును గురించి ప్రవక్తయైన మోషే వర్ణించాడు. (ద్వితీయోపదేశకాండము 8:7, 8) నేటికీ, ఉత్తరాన హెర్మోను పర్వతం దిగువ నుండి దక్షిణాన బెయేర్షెబా పొలిమేరల వరకు చుక్కలు పెట్టినట్లుగా ఒలీవ చెట్లు కనిపిస్తాయి. అవి, ఇప్పటికీ షారోను తీరప్రాంతాన్నీ, రాళ్ళతో నిండివుండే సమరయ కొండచరియలనూ సారవంతమైన గలిలయ లోయలనూ ఆకర్షణీయంగా చేస్తాయి.

బైబిలు లేఖికులు, ఒలీవ చెట్టును తరచూ అలంకారిక అర్థంలో ఉపయోగించారు. దేవుని కరుణ గురించి, పునరుత్థాన వాగ్దానం గురించి, సంతోషకరమైన కుటుంబ జీవితం గురించి వివరించడానికి ఈ వృక్షానికున్న ప్రత్యేకతలను ఉదాహరణలుగా ఉపయోగించారు. సృష్టికర్తను ప్రస్తుతించడంలో మిగతా సృష్టితోపాటు చేరే ఈ అనుపమానమైన ఒలీవ చెట్టును సునిశితంగా పరిశీలించడం ద్వారా, ఒలీవ చెట్టును గురించి ప్రస్తావిస్తున్న లేఖనాలను అర్థం చేసుకోవచ్చు, అలాగే ఒలీవ చెట్టు మీద మనకున్న మెప్పుదలను పెంచుకోవచ్చు.—కీర్తన 148:7, 9.

కరుకుగా ఉండే ఒలీవచెట్టు

ఒలీవచెట్టు మొదటి చూపులో అంత ఆకట్టుకోదు. లెబానోనులో వైభవోపేతంగా కనిపించే దేవదారు వృక్షాల్లా ఎత్తుగా పెరగదు. సరళ వృక్షపు కలపకున్నంత విలువ దీని కలపకు ఉండదు. దీని పువ్వులు బాదం చెట్టు పువ్వులంత కనువిందుగా ఉండవు. (పరమగీతము 1:17; ఆమోసు 2:9) ఒలీవ చెట్టు యొక్క అత్యంత ప్రాముఖ్యమైన భాగం పైకి కనిపించదు. అది నేలలో ఉంటుంది. అదేంటంటే దాని వ్రేళ్ళే. ఒలీవ చెట్టు వ్రేళ్ళు విస్తృతంగా వ్యాపిస్తాయి. భూమ్యుపరితలానికి క్రింద అడ్డంగా పెరుగుతాయి. అవి ఆరు మీటర్ల వరకూ వ్యాపించవచ్చు. ఈ వ్రేళ్ళు, చెట్టు కాపు కాయడానికీ, చెట్టు మనుగడకీ చాలా ముఖ్యం.

వర్షాభావం ఉన్నప్పుడు లోయలోని ఇతర చెట్లు నీళ్ళు లేక చనిపోయినప్పటికీ, రాళ్ళతో ఉన్న కొండప్రాంతాల్లో ఉన్న ఒలీవ చెట్లు మాత్రం వాటి వ్రేళ్ళ ప్రత్యేకత మూలంగా మనుగడ సాగిస్తాయి. పాత ఒలీవ కాండాన్ని చూస్తే నిప్పు రాజేయడానికి కట్టెలుగా మాత్రమే ఉపయోగపడుతుంది అని అనిపించినా, అది శతాబ్దాల వరకూ ఫలాలనిచ్చేలా దాని వ్రేళ్ళు దోహదపడతాయి. కరుకుగా ఉండే ఈ చెట్టుకు కావల్సిందల్లా—పెరగడానికి కావల్సినంత స్థలమూ, అది గాలిని పీల్చుకోగల్గేలా నేలలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ప్రవేశించే వీలుండడమూ, హానికరమైన కీటకాల నివాసస్థలాలుగా ఉండే కలుపు మొక్కలు లేదా మరితర మొక్కలు లేకుండా చేయడమూనే. అలాంటి పరిస్థితుల్లో, ఒక చెట్టు సంవత్సరానికి 57 లీటర్ల నూనెను ఇస్తుంది.

ఒలీవ నూనె ఎంతో విలువైనది కనుకనే ఇశ్రాయేలీయులకు ఒలీవ చెట్టు అంటే చాలా మక్కువవుండేది అనడంలో సందేహమే లేదు. ఒత్తుల దీపాలు ఒలీవ నూనెతో ఇండ్లకు వెలుగునిచ్చేవి. (లేవీయకాండము 24:2) ఒలీవ నూనె వాళ్ళ వంటకు చాలా ప్రధానమైనది. అంతేకాక, ఈ నూనె చర్మాన్ని సూర్యరశ్మి నుండి కాపాడేది. ఇశ్రాయేలీయులు ఈ నూనెతో స్నానం సబ్బు తయారు చేసుకునేవారు. ధాన్యము, ద్రాక్ష, ఒలీవ ఈ దేశపు ముఖ్య పంటలుగా ఉండేవి. ఒలీవ కాపు కాయకపోతే, ఇశ్రాయేలు కుటుంబాలకు చాలా కష్టంగా ఉండేది.—ద్వితీయోపదేశకాండము 7:13; హబక్కూకు 3:17.

సాధారణంగా, ఒలీవ నూనె సమృద్ధిగా లభించేది. మోషే, వాగ్దత్త దేశాన్ని ‘ఒలీవ నూనె గల దేశము’ అన్నాడు. బహుశా ఆ ప్రాంతంలో ఒలీవనే ఎక్కువగా పండించి ఉండవచ్చు. పంతొమ్మిదవ శతాబ్దపు ప్రకృతిశాస్త్రజ్ఞుడైన హెచ్‌. బి. ట్రిస్ట్రమ్‌ ఒలీవను, “ఆ దేశంలోని విశిష్టమైన వృక్షము” అని అన్నాడు. అంతేకాక, ఒలీవ నూనెకు విలువ ఉంది కనుకా, అది సమృద్ధిగా లభిస్తుంది కనుకా, మధ్యధరా ప్రాంతంలో అంతర్జాతీయ ద్రవ్యంగా కూడా ఉపయోగపడేది. “నూరు మణుగుల నూనె”గా లెక్కించబడిన ఒక అప్పు గురించి యేసు క్రీస్తు కూడా పేర్కొన్నాడు.—లూకా 16:5, 6.

“ఒలీవ మొక్కలవలె”

ఉపయోగకరమైన ఒలీవ చెట్టు దైవిక ఆశీర్వాదాలను చక్కగా ఉదాహరిస్తుంది. దైవభయం గల వ్యక్తికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తుంది? “నీ లోగిట నీ భార్య ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు” అని కీర్తన రచయిత పాడాడు. (కీర్తన 128:3) ఈ ‘ఒలీవ మొక్కలు’ ఏమి సూచిస్తున్నాయి, కీర్తన రచయిత వాటిని కుమారులతో ఎందుకు పోల్చుతున్నాడు?

ఒలీవ చెట్టు మిగతా చెట్లలా కాదు. దాని మొదలు నుండి మళ్ళీ మళ్ళీ మొలకలు వస్తూనే ఉంటాయి. * ఒలీవ చెట్టు వయసు పెరగడంవల్ల అసలు కాండము మునుపటిలా ఫలించడం మానేసినప్పుడు, దాని చుట్టూ వచ్చే క్రొత్త మొలకలను లేదా పిలకలను వ్యవసాయదారులు పెరగనిస్తారు. ఆ విధంగా అవి ఆ అసలు చెట్టులో భాగమవుతాయి. భోజనపు బల్లచుట్టు కుమారుల్లాగా, కొంత కాలానికి, ఆ మొదటి చెట్టు చుట్టూ మూడు నాలుగు బలమైన మొక్కలు కనిపిస్తాయి. ఈ మొక్కలకు, మొదలు ఒకటే ఉంటుంది. ఆ ఒక్క మొదలు నుండే ఆ మొక్కలు కాపు కాస్తాయి.

ఒలీవ చెట్టుకున్న ఈ ప్రత్యేకత, తల్లిదండ్రులకున్న బలమైన ఆధ్యాత్మిక వ్రేళ్ళ మూలంగా కుమారులూ కుమార్తెలూ విశ్వాసంలో బలంగా ఎలా పెరుగుతారో చక్కగా ఉదాహరిస్తుంది. పిల్లలు పెద్దవారౌతుండగా ఫలించడంలోను, తమ తల్లిదండ్రులకు ఆలంబననివ్వడంలోను పాలుపంచుకుంటారు కూడా. తమ పిల్లలు తమతో పాటు యెహోవాకు సేవ చేయడాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు.—సామెతలు 15:20.

“ఒక చెట్టుకు నిరీక్షణ ఉంది”

యెహోవాకు సేవ చేస్తున్న, వార్ధక్యంలో ఉన్న తండ్రి దైవభక్తి గల తన పిల్లలను బట్టి ఆనందిస్తాడు. కానీ ఈ పిల్లలే, తమ తండ్రి చివరికి ‘లోకులందరు పోవలసిన మార్గమున వెళ్ళి’నప్పుడు ఏడుస్తారు. (1 రాజులు 2:2) అలాంటి కుటుంబ విషాద సంఘటనను అధిగమించడానికి సహాయపడేందుకు, పునరుత్థానం ఉందన్న హామీని బైబిలు మనకు ఇస్తుంది.—యోహాను 5:28, 29; 11:25.

అనేక మంది పిల్లల తండ్రియైన యోబుకు మానవుల అల్పాయుష్షును గురించి బాగా తెలుసు. త్వరగా వాడిపోయే పువ్వుతో ఆయన దాన్ని పోల్చాడు. (యోబు 1:2; 14:1, 2) యోబు, బాధాకరమైన పరిస్థితి నుండి తప్పించుకునే మార్గంగా మరణాన్ని కోరుకున్నాడు. సమాధి తనకు ఒక చాటుగా ఉంటుందని, తర్వాత తాను అక్కడి నుండి తిరిగి రావచ్చు అని ఆయన అనుకున్నాడు. “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?” అని యోబు ప్రశ్నించాడు. “నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును” అని యోబు తనంతట తానే నమ్మకంగా జవాబిచ్చాడు.—యోబు 14:13-15.

దేవుడు తనను సమాధి నుండి పిలుస్తాడన్న నమ్మకాన్ని యోబు ఏ ఉదాహరణతో తెలిపాడు? ఒక చెట్టును ఉదాహరణగా తీసుకున్నాడు. ఆ చెట్టును గురించి ఆయన చేస్తున్న వర్ణనను బట్టి అది ఒలీవ చెట్టే అయ్యుండవచ్చని చెప్పవచ్చు. “ఒక చెట్టుకు నిరీక్షణ ఉంది. దాన్ని నరికివేస్తే మరల పెరుగుతుంది. అది కొత్త కొమ్మలు వేస్తూనే ఉంటుంది” అని యోబు చెప్పాడు. (యోబు 14:7, పరిశుద్ధ బైబల్‌) ఒలీవ చెట్టును కొట్టివేసినా అది నాశనం కాదు. ఈ చెట్టును కూకటి వ్రేళ్లతో పెకిలిస్తే మాత్రమే అది పూర్తిగా నాశనమైపోతుంది. దీని వ్రేళ్ళు దెబ్బ తినకపోతే, ఇది మళ్ళీ చిగురించి నవనవలాడుతూ కనిపిస్తుంది.

ఎంతోకాలంగా తేమ లేనందువల్ల, పాత ఒలీవ చెట్టు బాగా ఎండిపోయినప్పటికీ, దాని మొదలు మళ్ళీ చిగురిస్తుంది. “దాని వేరు భూమిలో పాతదై పోయనను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయనను నీటి వాసనమాత్రముచేత అది చిగుర్చును లేత మొక్కవలె అది కొమ్మలు వేయును.” (యోబు 14:8, 9) తేమలేని, ధూళిమయంగా ఉండే దేశంలో యోబు నివసించాడు. అక్కడ, ఎండిపోయిన నిర్జీవంగా కనిపించిన చాలా పాత ఒలీవ చెట్లను అనేకములను ఆయన గమనించి ఉంటాడు. అయితే, “మంటిలో చీకిపోయిన” అడుగుమొద్దు, వర్షాలు పడినప్పుడు తిరిగి జీవిస్తుంది, దాని వ్రేళ్ళ నుండి “లేత మొక్క”నా అన్నట్లుగా క్రొత్త కాండం వస్తుంది. ఈ చెట్టుకున్న తిరిగి కోలుకునే గమనార్హమైన శక్తిని బట్టి “ఒలీవ చెట్లు అమరములు అని చెప్పవచ్చు” అని టునిసియాకు చెందిన ఒక వృక్షశాస్త్రజ్ఞుడు అన్నాడు.

వాడిపోయిన తన ఒలీవ చెట్లు మళ్ళీ చిగురించాలని ఒక రైతు ఎలాగైతే వాంఛిస్తాడో, యెహోవా కూడా అలాగే, తన నమ్మకస్థులైన సేవకులను పునరుత్థానం చేయాలని కోరుకుంటాడు. అబ్రాహాము, శారాయి, ఇస్సాకు, రిబ్కా వంటి నమ్మకస్థులైన వ్యక్తులు జీవానికి తిరిగి తేబడే సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. (మత్తయి 22:31, 32) మృతులు తిరిగి జీవించినప్పుడు వారికి స్వాగతం పలకడమూ, వారు మరొకసారి సార్థకమైన, ఫలవంతమైన జీవితాలను గడపడాన్ని చూడడమూ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా !

సూచనార్థక ఒలీవ చెట్టు

దేవుని నిష్పక్షపాతంలోను, అలాగే ఆయన చేసిన పునరుత్థాన ఏర్పాటులోను ఆయన కరుణాహృదయం బయల్పరచబడుతుంది. ఏ జాతివారు, ఎలాంటి పుట్టుపూర్వోత్తరాలు గలవారు అన్న తేడా లేకుండా యెహోవా అందరికీ కరుణను ఎలా చూపిస్తున్నాడన్న విషయాన్ని తెలిపేందుకు అపొస్తలుడైన పౌలు ఒలీవ చెట్టును ఉదాహరణగా తీసుకున్నాడు. శతాబ్దాలుగా, తాము దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలము అని, “అబ్రాహాము సంతానము” అని యూదులు గర్వించారు.—యోహాను 8:33; లూకా 3:8.

దేవుని అనుగ్రహాన్ని పొందేందుకు యూదా జనాంగంలో పుట్టడమే అవశ్యము అనేమీ కాదు. అయితే, యేసు తొలి శిష్యులందరూ యూదులే. వాగ్దత్త అబ్రాహాము సంతతిని రూపొందించేందుకు దేవుడు ఎన్నుకున్న మొదటి మానవులనే ఆధిక్యత ఆ శిష్యులకు లభించింది. (ఆదికాండము 22:18; గలతీయులు 3:29) పౌలు యూదా శిష్యులను సూచనార్థక ఒలీవ చెట్టు కొమ్మలతో పోల్చాడు.

సహజ యూదుల్లో అధిక సంఖ్యాకులు యేసును తిరస్కరిస్తూ, తాము ‘చిన్న మంద’లో లేదా “దేవుని ఇశ్రాయేలు”లో భవిష్యత్తు సభ్యులయ్యేందుకు అయోగ్యులమని నిరూపించుకున్నారు. (లూకా 12:32; గలతీయులు 6:16) అలా వాళ్ళు కొట్టివేయబడిన సూచనార్థక ఒలీవ చెట్టు కొమ్మలు అయ్యారు. వారి స్థానానికి ఎవరు వచ్చి ఉంటారు? సా.శ. 36 లో, అబ్రాహాము సంతానంలో భాగమయ్యేందుకు అన్యులు ఎంపిక చేయబడ్డారు. అన్యులు ఆ విధంగా ఎంపికచేయబడడం, యెహోవా అడవి ఒలీవ కొమ్మలను మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టినట్లుగా ఉంది. వాగ్దత్త అబ్రాహాము సంతానంగా రూపొందేవారిలో ఇతర జనాంగాల్లోని ప్రజలు కూడా ఉన్నారు. అన్యులైన క్రైస్తవులు ఇప్పుడు ‘ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో పాలు పొందే’వారవ్వగల్గారు.—రోమీయులు 11:17.

ఒక రైతు, అడవి ఒలీవ కొమ్మను మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టడాన్ని గురించి తలపోయను కూడా లేడు. అది “స్వభావ విరుద్ధము.” (రోమీయులు 11:24) “అరబ్బులు చెబుతున్నట్లు, మంచి ఒలీవ కొమ్మను అడవి ఒలీవ చెట్టుకు అంటుకట్టండి. అది అడవి ఒలీవను జయిస్తుంది. కానీ దానికి వ్యతిరేకంగా చేస్తే మీరు సాఫల్యాన్ని పొందలేరు” అని ద ల్యాండ్‌ అండ్‌ ద బుక్‌ అనే పుస్తకం వివరిస్తుంది. అందుకే, “అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని . . . మొదట కటాక్షిం[చినప్పుడు]” యూదా క్రైస్తవులు ఆశ్చర్యచకితులయ్యారు. (అపొస్తలుల కార్యములు 10:44-48; 15:14) దేవుని ఉద్దేశం నెరవేరడం అనేది ఏదైన ఒక జనాంగంపై ఆధారపడి లేదనేందుకు యెహోవా అన్యజనులపైన చూపిన కటాక్షము స్పష్టమైన సూచనగా ఉంది. అవును, “ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:35.

నమ్మకస్థులు కాని యూదులు అనే ఒలీవ చెట్టు కొమ్మలు కొట్టివేయబడినట్లే, అహంకారం మూలంగా అవిధేయత మూలంగా ఎవరైతే యెహోవా అనుగ్రహాన్ని కాపాడుకోలేరో వాళ్ళకు కూడా అదే జరుగుతుంది అని పౌలు సూచించాడు. (రోమీయులు 11:19, 20) మనకు అర్హత లేకపోయినా మనకు దేవుడు చూపించే కృపను తేలికగా తీసుకోకూడదని ఇది సోదాహరణంగా చెబుతుంది.—2 కొరింథీయులు 6:1.

నూనె రాయడం

లేఖనాలు ఒలీవ నూనె ఉపయోగాన్ని గురించి అలంకారికంగాను, అక్షరార్థ భావంలోను మాట్లాడుతున్నాయి. ప్రాచీన కాలాల్లో, గాయములూ దెబ్బలూ త్వరగా మానేందుకు, ‘తైలముతో మెత్తన చేసేవారు.’ (యెషయా 1:6) యేసు చెప్పిన ఒక ఉపమానంలో, పొరుగువాడైన సమరయుడు యెరికోకు వెళ్ళే మార్గంలో తనకు తారసపడిన మనిషి గాయములపై ఒలీవ నూనెను ద్రాక్షారసమును పోశాడు.—లూకా 10:34.

తలకు ఒలీవ నూనెను పట్టిస్తే చాలా నవోత్తేజంగాను ఉపశమనంగాను ఉంటుంది. (కీర్తన 141:5) క్రైస్తవ పెద్దలు, ఆధ్యాత్మికంగా రోగగ్రస్థుడిగా ఉన్న సభ్యుడితో వ్యవహరించేటప్పుడు ఆయనకు ‘ప్రభువు నామమున నూనె రాయ’వచ్చు. (యాకోబు 5:14) ఆధ్యాత్మికంగా రోగగ్రస్థులుగా ఉన్న తోటి విశ్వాసుల కోసం పెద్దలు ప్రేమపూర్వకంగా ఇచ్చే లేఖనాధార ఉపదేశాన్నీ, వాళ్ళు హృదయపూర్వకంగా చేసే ప్రార్థనలనూ—బాధను తగ్గించే ఒలీవ నూనెతో పోల్చవచ్చు. ఆసక్తికరంగా, కొన్ని హెబ్రీ జాతీయాలు మంచి మనిషిని “స్వచ్ఛమైన ఒలీవ నూనె”లాంటివాడు అని వర్ణిస్తాయి.

“దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు”

ఇప్పటి వరకు చర్చించిన విషయాల దృష్ట్యా, దేవుని సేవకులను ఒలీవ చెట్లతో పోల్చవచ్చన్న విషయంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. దావీదు, “దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు”లా ఉండాలని కోరుకున్నాడు. (కీర్తన 52:8) ఇశ్రాయేలీయుల ఇండ్ల చుట్టూ ఒలీవ చెట్లు ఉన్నట్లుగా, తాను దేవునికి దగ్గరగా ఉండాలనీ, దేవునికి స్తుతులను తెచ్చే విధంగా ఫలించాలనీ దావీదు కోరుకున్నాడు.—కీర్తన 52:9.

రెండు గోత్రముల యూదా రాజ్యము యెహోవాకు నమ్మకంగా ఉంటూ, ‘చక్కని ఫలముగల పచ్చని ఒలీవచెట్టు’లా ఉండేది. (యిర్మీయా 11:15, 16) కానీ తర్వాత, యూదా ప్రజలు ‘యెహోవా మాట విననొల్లక, అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించి’నప్పుడు ఆ రాజ్యము తన ఆధిక్యతను పోగొట్టుకుంది.—యిర్మీయా 11:10.

మనం దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టుగా ఉండాలంటే, మనం తప్పనిసరిగా యెహోవాకు విధేయత చూపాలి, మనం మరిన్ని క్రైస్తవ ఫలాలను ఫలించేందుకుగాను ఆయన మనలోని చెడు లక్షణాలను “త్రుంచివేసేందుకు” ఆయన మనకిచ్చే క్రమశిక్షణను అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. (హెబ్రీయులు 12:5, 6) అంతేకాక, అక్షరార్థ ఒలీవ చెట్టుకు వర్షాభావాన్ని తట్టుకునేందుకు విస్తృతమైన వ్రేళ్ళు అవసరమైనట్లే, మనం శ్రమలనూ, వేధింపులనూ సహించాలంటే మన ఆధ్యాత్మిక వ్రేళ్ళను బలపరచుకోవాలి.—మత్తయి 13:21; కొలొస్సయులు 2:6, 7.

లోకం గుర్తించకపోయినా దేవుని గుర్తింపు ఉన్న నమ్మకస్థుడైన క్రైస్తవుడికి ఒలీవ చెట్టు మంచి ప్రతీకగా ఉంది. అలాంటి వ్యక్తి ఈ విధానంలో చనిపోయినా, క్రొత్త లోకంలో మళ్ళీ జీవిస్తాడు.—2 కొరింథీయులు 6:10; 2 పేతురు 3:13.

మనం అంత త్వరగా నాశనం చేయలేనటువంటి, ప్రతి సంవత్సరమూ ఫలాలను కాసే ఒలీవ చెట్టు దేవుడు చేసిన ఈ వాగ్దానాన్ని మనకు గుర్తు చేస్తుంది: “నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.” (యెషయా 65:22) ఆ ప్రవచనాత్మక వాగ్దానం దేవుని క్రొత్త లోకంలో నెరవేరుతుంది.—2 పేతురు 3:13.

[అధస్సూచి]

^ పేరా 13 అసలు చెట్టుకు బలం తగ్గిపోకుండా ఉండేందుకు ప్రతిసంవత్సరం క్రొత్త మొలకలను త్రుంచేస్తారు.

[25వ పేజీలోని చిత్రం]

స్పెయిన్‌లోని అలికాంటె ప్రొవిన్స్‌లోని జావియాలో కనుగొనబడిన పాత గట్టి ఒలీవ కాండం

[26వ పేజీలోని చిత్రం]

స్పెయిన్‌లోని గ్రనడ ప్రొవిన్స్‌లో ఒలీవ చెట్లు

[26వ పేజీలోని చిత్రం]

యెరూషలేము గోడకు అవతల ప్రాచీన ఒలీవ చెట్టు

[26వ పేజీలోని చిత్రం]

ఒలీవ చెట్టు కొమ్మలకు అంటుకట్టడాన్ని గురించి బైబిలు పేర్కొంటుంది

[26వ పేజీలోని చిత్రం]

ఈ పాత ఒలీవ చెట్టు చుట్టూ చిన్న మొక్కలు