కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భారతదేశంలో బైబిలు పఠనం ద్వారా విశ్వాసాన్ని నిర్మించడం

భారతదేశంలో బైబిలు పఠనం ద్వారా విశ్వాసాన్ని నిర్మించడం

మనము విశ్వాసము గలవారము

భారతదేశంలో బైబిలు పఠనం ద్వారా విశ్వాసాన్ని నిర్మించడం

ఉత్తరాన మంచుతో కప్పబడి ఠీవిగా కనబడే హిమాలయ పర్వతాలు మొదలుకొని, దక్షిణాన హిందూ మహాసముద్ర తీరాన వేడిగాను తేమగాను ఉన్న ప్రాంతాల వరకూ భారతదేశం భౌగోళికంగాను మతపరంగాను వైవిధ్యభరితంగా ఉంది. దీని జనాభా వంద కోట్ల కన్నా ఎక్కువగా ఉంది. దాదాపు 83 శాతం మంది హిందువులు, 11 శాతం మంది ముస్లిమ్‌లు. మిగతావాళ్ళు ముఖ్యంగా నామమాత్రపు క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధమతస్థులు, జైనమతస్థులు. అందరికీ ఆరాధనా స్వాతంత్ర్యం ఉంది. “భారతదేశపు జీవన శైలిలో మతం ముఖ్య పాత్ర వహిస్తుంది” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా అంటోంది.

భారతదేశంలో యెహోవాసాక్షులు 21,200 కన్నా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు తమ క్రైస్తవ విశ్వాసానుసారంగా జీవిస్తారు. ప్రపంచంలోని ఇతర భూభాగాల్లో ఉన్న తమ ఆధ్యాత్మిక సహచరుల్లాగే, భారతదేశంలోని సాక్షులు కూడా దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలులో బలమైన విశ్వాసాన్ని నిర్మించుకునేందుకు తమ పొరుగువారికి సహాయపడడం తమ ఆధిక్యతగా భావిస్తారు. (2 తిమోతి 3:16, 17) దక్షిణ భారతదేశంలోని చెన్నైలో ఉన్న ఒక కుటుంబం బైబిలు సత్యాన్ని గురించిన జ్ఞానాన్ని ఎలా తెలుసుకుందో పరిశీలించి చూడండి.

ఈ కుటుంబం యెహోవాసాక్షులను కలవకముందు, క్యాథలిక్‌ కరిస్మాటిక్‌ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. దర్శనాలను చూశామని, అన్యభాషల్లో మాట్లాడుతామని, రోగులను స్వస్థపరుస్తామని ఈ కుటుంబ సభ్యులు చెప్పుకునేవారు. వాళ్ళు చర్చిలోను, ఆ సమాజంలోను ప్రముఖులుగా ఉండేవారు. ప్రజలు ఈ కుటుంబంలోని కొందరు వ్యక్తులను “స్వామీ” అని పిలిచేవారు. ఒకరోజు, ఒక సాక్షి ఆ కుటుంబాన్ని సందర్శించి, యేసు, దేవుని కుమారుడనీ సాధారణంగా నమ్మబడుతున్నట్లు సర్వశక్తిమంతుడైన దేవుడు కాడనీ బైబిలులో నుండి చూపించారు. దేవుని పేరు యెహోవా అని, భూమిని గురించి యెహోవా ఉద్దేశం, దాన్ని అందమైన పరదైసుగా మార్చాలన్నదే అని ఆ సాక్షి చూపించారు.—కీర్తన 83:18; లూకా 23:43; యోహాను 3:16.

ఈ కుటుంబ సభ్యులు దేవుని వాక్యానికి గౌరవమిచ్చారు కనుకా, తాము విన్నది వారికి నచ్చింది కనుకా, యెహోవాసాక్షులతో క్రమంగా బైబిలు అధ్యయనం చేసేందుకు ఒప్పుకున్నారు. అందువల్ల, చర్చిలోని మునుపటి పరిచయస్థుల అపహాస్యానికి వాళ్ళు గురి కావలసి వచ్చింది. అయినప్పటికీ, ఈ కుటుంబం బైబిలు అధ్యయనాన్ని చేయడంలో కృతనిశ్చయతతో కొనసాగింది. వాళ్ళకు బైబిలు జ్ఞానం పెరుగుతున్న కొలది, వాళ్ళ విశ్వాసం మరింత బలపడుతున్న కొలది, వాళ్ళు అబద్ధ మతాచారాలను విడనాడడం ప్రారంభించారు. ప్రస్తుతం, ఈ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు బాప్తిస్మం పొంది, ఎంతో ఉత్సాహమూ పట్టుదలా గల సాక్షులుగా ఉన్నారు. తల్లి సాధ్యమైనప్పుడెల్లా సహాయ పయినీరింగ్‌ చేస్తుంది.

వైకల్యాలను అధిగమించే విశ్వాసం

పంజాబ్‌లోని ఒక గ్రామంలో సుందర్‌ లాల్‌ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఇతరులతో దేవుని రాజ్య సువార్తను పంచుకోవడానికి ఆయనకు చాలా గొప్ప విశ్వాసమూ, ధైర్యమూ అవసరమయ్యాయి. (మత్తయి 24:14) అందుకు ఒక కారణం, ఆయన, సత్యదేవుడైన యెహోవాను ఆరాధించేందుకని తన కుటుంబ సభ్యులూ, ఆయన గ్రామస్థులూ నమ్ముకునే అనేక దేవుళ్ళపై గల నమ్మకాలను ఆయన త్యజించడమే. మరొక కారణం, ఆయనకు కాళ్ళు లేకపోవడమే.

1992 వరకూ, సుందర్‌ లాల్‌ జీవితం మామూలుగానే సాగేది. ఆయన ఒక డాక్టర్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. తాము ఎన్నుకున్న గురువుగారి మార్గదర్శనం ప్రకారం, అనేక దేవుళ్ళను ఆరాధించడంలో తన సొంత కుటుంబ సభ్యులతో పాటు ఆయన కూడా చేరాడు. ఒక రోజు రాత్రి, ఆయన రైల్వే ట్రాక్‌ దాటుతుండగా క్రిందపడిపోయాడు. ఒక రైలు ఆయన మీదుగా వెళ్ళింది, తొడ వరకూ ఆయన రెండు కాళ్ళూ తెగిపోయాయి. ఆయన బ్రతికే ఉన్నప్పటికీ ఆయన జీవితం ఛిన్నాభిన్నమైపోయింది. సుందర్‌ లాల్‌ చాలా క్రుంగిపోయి, ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించాడన్నది అర్థం చేసుకోగల విషయమే. ఆయన కుటుంబం ఆయనకు ఆలంబననిచ్చినప్పటికీ ఆయనకు మాత్రం భవిష్యత్తు నిరాశాజనకంగా కనిపించింది.

అలా ఉండగా, యెహోవాసాక్షుల్లో ఒకరు సుందర్‌ లాల్‌ని సందర్శించాడు. భూమిని ఆహ్లాదకరమైన పరదైసుగా మార్చుతాననీ తనను ప్రేమించి, భయపడేవారికందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాననీ దేవుడు వాగ్దానం చేశాడు అని బైబిలు నుండి ఆయన చూపించాడు. ఆయన బైబిలు అధ్యయనానికి అంగీకరించాడు. ఒక సంవత్సరం ఆసక్తిగా అధ్యయనం చేశాడు. ఆయన క్రైస్తవ కూటాలకు ఆహ్వానించబడ్డాడు. చివరికి ఆయన తన స్నేహితుని సైకిలు వెనక కూర్చొని కూటానికి వెళ్ళాడు. అలా వెళ్ళడం ఆయనకు ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ, ఆయనకు దొరికిన ప్రతిఫలం మాత్రం చాలా గొప్పది. దేవుని వాక్యపు వాగ్దానాలను నిజంగా నమ్ముతూ, బైబిలు బోధలకు అనుగుణ్యంగా నడుచుకునే ఇతరులను కలుసుకున్నప్పుడు, తాను వ్యక్తిగతంగా బైబిలు అధ్యయనంలో నేర్చుకున్న విషయాలు నిజమని ఆయనకు మరింత రూఢి అయ్యింది.

సుందర్‌ లాల్‌, తన పొరుగువారితో సువార్తను పంచుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత 1995 లో బాప్తిస్మం పొందాడు. మొదటిసారి, ఆయన తన గ్రామంలో ఇంటింటా ఈడ్చుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆయనకు ఏదైనా అవసరమైతే అలాగే వెళ్ళాలి. కానీ ఇప్పుడు, ఆధ్యాత్మిక సహోదరులు ఆయనకు బహుమతిగా ఇచ్చిన ఒక ట్రైసికిల్‌ ఉంది. చేతితో “త్రిప్పేలా” ప్రత్యేకంగా తయారు చేయబడిన మూడు చక్రాల సైకిలు అది. ఆ ట్రైసికిల్‌ మూలంగా, ఆయన ఇప్పుడు ఇదివరకటంత ఎక్కువగా ఇతరులపై ఆధారపడడంలేదు. సంఘ కూటాలకు తనంతట తానే 12 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళ్ళగలుగుతున్నాడు. వర్షాకాలంలో కొన్నిసార్లు భారీ వర్షాలు పడుతున్నప్పుడు కూడా; ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా ఎక్కువగా ఉండే మిగతా సమయాల్లో కూడా తనంతట తానే ట్రైసికిల్‌ మీద కూటాలకు వెళ్తాడు.

ఆయన, కూటాలకు హాజరు కావడమే కాక, సత్య దేవుడైన యెహోవా మీద బలమైన విశ్వాసాన్ని నిర్మించుకునేందుకు సహాయం కావాలని కోరుకునే అనేకులతో బైబిలు అధ్యయనాలను కూడా నిర్వహిస్తున్నాడు. వాస్తవానికి, తన మునుపటి బైబిలు విద్యార్థుల్లో ఏడుగురు ఇప్పుడు బాప్తిస్మం పొందారు. తాను కలిసిన మరో ముగ్గురు వ్యక్తులతో తన తోటి సాక్షులు బైబిలు అధ్యయనం చేశారు. ఆ విద్యార్థులు కూడా బాప్తిస్మం పొందారు.

బైబిలు చెబుతున్నట్లు, “విశ్వాసము అందరికి లేదు.” (2 థెస్సలొనీకయులు 3:2) ‘నిత్యజీవమునకు నిర్ణయంపబడేవారు,’ బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి క్రమమైన దేవుని వాక్య అధ్యయనం సహాయపడగలదు. (అపొస్తలుల కార్యములు 13:48) అలాంటి అధ్యయనం ద్వారా అద్భుతమైన భవిష్యత్తును గురించిన నిరీక్షణ కలుగుతుంది. అలాంటి నిరీక్షణలో విశ్వాసముంచుతున్నవారి సంఖ్య భారతదేశంలో పెరుగుతోంది.

[30వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఆఫ్ఘనిస్తాన్‌

పాకిస్తాన్‌

నేపాల్‌

భూటాన్‌

చైనా

బంగ్లాదేశ్‌

మ్యాన్మార్‌

లావోస్‌

థాయ్‌లాండ్‌

వియాత్నాం

కంబోడియా

శ్రీలంక

భారతదేశం

[చిత్రసౌజన్యం]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.