కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనకాలం కోసమైన దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి

మనకాలం కోసమైన దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి

మనకాలం కోసమైన దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి

“నరపుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలిసికొను[ము].”దానియేలు 8:17.

1. సమస్త మానవజాతి మన కాలాన్ని గూర్చి ఏమి తెలుసుకోవాలని యెహోవా కోరుతున్నాడు?

భవిష్య సంఘటనలను గూర్చి యెహోవాకున్న జ్ఞానాన్ని ఆయన తన దగ్గరే ఉంచుకోడు. బదులుగా, ఆయన మర్మాల్ని బయల్పరుస్తాడు. నిజానికి, మనం ‘అంత్యకాలానికి’ అంచున ఉన్నామన్న విషయాన్ని మనమందరమూ తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు భూమిపై జీవిస్తున్న 600 కోట్ల ప్రజలకు అదెంత అవశ్యమైన వార్తో కదా !

2. మానవజాతి భవిష్యత్తు గురించి ప్రజలు ఎందుకు చింతిస్తారు?

2 ఈ లోకం దాని అంతానికి దగ్గర్లో ఉందనడంలో ఆశ్చర్యపోవాల్సినదేమైనా ఉందా? మనిషి చంద్రుడిపై నడవగలుగుతున్నాడు కానీ ఈ భూగ్రహంపై అనేక ప్రాంతాల్లో అతడు వీధుల్లో నిర్భయంగా నడవలేకపోతున్నాడు. ఆధునిక వస్తువులతో తన ఇంటిని అమర్చుకోగలడు కానీ, కుటుంబాలు విస్తృతమైన పరిధిలో విచ్ఛిన్నంకాకుండా ఆపలేకపోతున్నాడు. అతడు సమాచార యుగాన్ని తీసుకురాగలడు కానీ, కలిసిమెలసి శాంతియుతంగా జీవించడమెలాగో ప్రజలకు బోధించలేడు. ఆ వైఫల్యాలు, మనం అంత్యకాలంలో జీవిస్తున్నామని చూపిస్తున్న విస్తృతమైన లేఖనాధార నిదర్శనాలను బలపరుస్తున్నాయి.

3. “అంత్యకాలము” అనే మాటలు భూమిపై మొదటిగా ఎప్పుడు ఉపయోగించబడ్డాయి?

3 “అంత్యకాలము” అన్న ఆ అసాధారణమైన పదం, భూమిపై గబ్రియేలు దూతచే దాదాపు 2,600 ఏళ్ల క్రిందట మొదట ఉపయోగించబడింది. మిక్కిలి భీతి చెందివున్న దేవుని ప్రవక్త, “నరపుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలిసికొనుమ”ని గబ్రియేలు దూత చెబుతుండగా విన్నాడు.—దానియేలు 8:17.

ఇది “అంత్యకాలము” !

4. అంత్యకాలాన్ని గూర్చి బైబిలు ఏ ఇతర విధాల్లో చెబుతుంది?

4 “అంత్యకాలము,” “నిర్ణయించిన అంత్యకాలము” అన్న వ్యక్తీకరణలు దానియేలు గ్రంథంలో ఆరుసార్లు కన్పిస్తాయి. (దానియేలు 8:17, 19; 11:35, 40; 12:4, 9) అపొస్తలుడైన పౌలు ప్రవచించిన ‘అంత్యదినాలకు’ సమానమైనవే అవి. (2 తిమోతి 3:1-5) అదే కాలాన్ని యేసుక్రీస్తు, రాజ్యాధికారంతో కూడిన తన ‘ప్రత్యక్షత’గా సూచించాడు.—మత్తయి 24:37-39, NW.

5, 6. అంత్యకాలంలో ఎవరు ‘నలుదిశలా సంచరించారు,’ ఏమిటి ఫలితం?

5దానియేలు 12:4 ఇలా చెబుతోంది: “దానియేలూ, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును.” దానియేలు వ్రాసిన దాంట్లో అధికభాగం మరుగుచేయబడి, శతాబ్దాలుగా మానవ అవగాహనకు అందకుండా ముద్ర వేయబడింది. మరి నేటి విషయమేంటి?

6 ఈ అంత్యకాలంలో విశ్వాసులైన అనేకమంది క్రైస్తవులు, దేవుని వాక్యమైన బైబిలు పుటల్లో ‘నలుదిశలా సంచరించారు.’ ఫలితం? వారి ప్రయత్నాలపై యెహోవా ఆశీర్వాదంతో, నిజమైన జ్ఞానం నివ్వటిల్లింది. ఉదాహరణకు, యెహోవా దేవుని అభిషిక్త సాక్షులు, 1914వ సంవత్సరంలో యేసుక్రీస్తు పరలోకంలో రాజయ్యాడని అవగాహన చేసుకోగలిగే అంతర్దృష్టితో ఆశీర్వదించబడ్డారు. 2 పేతురు 1:19-21 వచనాల్లో వ్రాయబడిన అపొస్తలుని మాటలకు పొందికగా, అలాంటి అభిషిక్తులూ వారి నమ్మకమైన సహవాసులూ, ‘ప్రవచన వాక్యంపై లక్ష్యం ఉంచి,’ ఇదే అంత్యకాలము అని దృఢంగా నమ్మారు.

7. ఏ కొన్ని వృత్తాంతాలు దానియేలు గ్రంథాన్ని అనన్యమైనదిగా చేశాయి?

7 దానియేలు గ్రంథం ఇతర విధాలుగా కూడా అనన్యమైనదే. దాని పుటల్లో, ఒక రాజు తన జ్ఞానులను చంపుతానని బెదిరిస్తాడు; ఎందుకంటే వాళ్లు, ఆయనకు వచ్చిన మర్మగర్భమైన కలను చెప్పి, దాని భావాన్ని వివరించలేకపోతారు, కానీ దేవుని ప్రవక్త ఆ మర్మాన్ని చెబుతాడు. ఎత్తైన ఒక ప్రతిమకు ఆరాధన చేయమని తిరస్కరించిన ముగ్గురు యౌవనులు తీక్షణమైన అగ్నిగుండంలో పడవేయబడినప్పటికీ, అగ్ని సెగ లేశమూ అంటకుండా రక్షించబడతారు. ఒక పండుగ జరుగుతున్నప్పుడు వందలాదిమంది చూస్తుండగా ఒక హస్తం కన్పించి రాజనగరు గోడపై మర్మపు మాటలను వ్రాస్తుంది. దుష్టులైన కుట్రదారులు ఒక వృద్ధుడ్ని సింహాల గుహలో వేస్తారుగానీ, నిరపాయంగా అతడు బయటికి వస్తాడు. ఒక దర్శనంలో నాలుగు మృగాలు కన్పిస్తాయి, వాటికి అంత్యకాలం వరకూ సాగే ప్రవచన ప్రాముఖ్యం ఉంటుంది.

8, 9. ప్రత్యేకించి ఇప్పుడు, అంత్యకాలంలో ఉన్న మనకు దానియేలు గ్రంథం ఎలా ప్రయోజనకారి?

8 స్పష్టంగా, దానియేలు గ్రంథం, రెండు భిన్నమైన అంశాలను కల్గివుంది. ఒకటి కథనం, మరొకటి ప్రవచనం. రెండూ మన విశ్వాసాన్ని ప్రోది చేయగలవు. తన పట్ల యథార్థంగా ఉండేవారిని యెహోవా దేవుడు ఆశీర్వదిస్తాడని కథనం చూపిస్తుంది. శతాబ్దాల ముందే, సహస్రాబ్దాల ముందే చరిత్ర గతిని గురించి యెహోవాకు తెలుసునని చూపించడం ద్వారా ప్రవచన భాగాలు విశ్వాసాన్ని ప్రోదిచేస్తాయి.

9 దానియేలు నమోదు చేసిన వేర్వేరు ప్రవచనాలు, దేవుని రాజ్యంవైపు దృష్టిని మళ్లిస్తాయి. అలాంటి ప్రవచనాల నెరవేర్పును మనం గమనిస్తుండగా, అంత్యకాలంలో జీవిస్తున్నామన్న మన ఒప్పుదలతో పాటు మన విశ్వాసం కూడా బలపర్చబడుతుంది. కానీ కొంతమంది విమర్శకులు దానియేలు పేరున ఉన్న గ్రంథంలోని ప్రవచనాలు, వాటిని నెరవేర్చిన సంఘటనలు జరిగిన తర్వాతనే నిజంగా వ్రాయబడ్డాయని చెబుతూ దానియేలుపై దాడి చేస్తారు. అలాంటి ఆరోపణలే గనుక నిజమైతే, అంత్యకాలాన్ని గురించి దానియేలు గ్రంథం ప్రవచించిన వాటి విషయంలో గంభీరమైన ప్రశ్నలు తలెత్తుతాయి. సంశయవాదులు, దానియేలు గ్రంథంలోని కథనాన్ని కూడా ప్రశ్నిస్తారు. కాబట్టి మనం పరిశీలిద్దాం.

న్యాయ విచారణలో !

10. దానియేలు గ్రంథం ఏ భావంలో ఆక్షేపణలను ఎదుర్కొంటుంది?

10 మీరొక న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యారని ఊహించుకోండి. అభియోగం నడిపే న్యాయవాది, ప్రతివాది బూటకుడని నొక్కి చెబుతాడు. సా.శ.పూ. ఆరు, ఏడు శతాబ్దాల్లో జీవించిన ఒక హెబ్రీ ప్రవక్త రచించిన ఒక ప్రామాణిక గ్రంథంగా దానియేలు గ్రంథం ప్రకటించుకుంటుంది. కానీ ఆ గ్రంథం బూటకమైనదని విమర్శకులు బల్లగుద్ది చెబుతున్నారు. కాబట్టి ముందుగా, ఆ గ్రంథంలోని కథనం చారిత్రక వాస్తవంతో పొందికగా ఉందో లేదో చూద్దాం.

11, 12. బెల్షస్సరు కేవలం కల్పనా వ్యక్తి అన్న ఆరోపణ ఏమైంది?

11 ఉదాహరణకు మనమొక కేసును పరిశీలిద్దాము; దాన్ని తప్పిపోయిన రాజు కేసు అని అనవచ్చు. సా.శ.పూ. 539 లో బబులోను నగరం కూలద్రోయబడినప్పుడు దాని రాజు బెల్షస్సరని దానియేలు 5వ అధ్యాయం చూపిస్తోంది. బెల్షస్సరు అన్న పేరు బైబిల్లో తప్ప మరెక్కడా కన్పించనందున విమర్శకులు దాన్ని సవాలు చేశారు. బదులుగా, బబులోను చివరి రాజు నెబోనైడస్‌ అని ప్రాచీన చరిత్రకారులు గుర్తించారు.

12 అయితే, 1854 లో ప్రస్తుత ఇరాక్‌లో ఉన్న ప్రాచీన బబులోను నగరమైన ఊరు శిథిలాల్లో కొన్ని చిన్న స్తూపాకార మట్టి దిమ్మలను త్రవ్వి తీశారు. కీలలిపిలో ఉన్న వీటిపైని వ్రాతల్లో “బెల్‌-సార్‌-ఉస్సురూ, నా జ్యేష్ఠ కుమారుడా” అని సంబోధిస్తూ రాజైన నెబోనైడస్‌ చేసిన ఒక విజ్ఞాపన ఉంది. దానియేలు గ్రంథంలోని బెల్షస్సరు అతడేనని విమర్శకులు కూడా అంగీకరించాల్సి వచ్చింది. కాబట్టి రాజు నిజంగా తప్పిపోలేదు, అప్పటి వరకూ ఉన్న లౌకిక మూలాల్లో అప్పటికింకా తెలియరాలేదు అంతే. అది, దానియేలు రచనలు నిజంగా ప్రామాణికమైనవని రుజువు చేసే అనేకమైన వాటిల్లో కేవలం ఒకటి మాత్రమే. దానియేలు గ్రంథం దేవుని వాక్యంలో ఖచ్చితంగా భాగమైవుందనీ, ఇప్పుడు ఈ అంత్యకాలంలో మనం శ్రద్ధాపూర్వకంగా లక్ష్యముంచాల్సిన అవసరం ఉందనీ అటువంటి సాక్ష్యాధారాలు చూపిస్తాయి.

13, 14. నెబుకద్నెజరు ఎవరు, ప్రత్యేకించి ఏ అబద్ధ దేవునికి ఆయన తన ఆరాధనను చెల్లించాడు?

13 మారుతున్న ప్రపంచ శక్తులూ, వాటి పాలకుల్లో కొందరి కార్యకలాపాలూ చేరివున్న ప్రవచనాలు, దానియేలు గ్రంథంలో ఒకదానితో ఒకటి అల్లుకుని ఉన్నాయి. ఆ పాలకుల్లో ఒకర్ని, మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన యోధుడని పిలువవచ్చు. బబులోను యువరాజుగా, అతడూ, అతని సైన్యాలూ కర్కెమీషు దగ్గర ఐగుప్తు ఫరో అయిన నెకో సైన్యాలను నిర్మూలం చేశారు. శత్రుశేష నిర్మూలనా పనిని తన సైన్యాధికారులకు విడిచిపెట్టి విజేతయైన ఆ అధిపతి ఒక సందేశం మూలంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. తన తండ్రి నెబోపొలస్సార్‌ మరణించాడని తెలుసుకుని, నెబుకద్నెజరు అనే పేరుగల ఈ యువకుడు సా.శ.పూ. 624 లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. తన 43 ఏళ్ల పాలనా కాలంలో, అతడు ఒకప్పటి అష్షూరీయుల ఆక్రమిత ప్రాంతాన్ని కలుపుకొని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి, దాన్ని సిరియా, పాలస్తీనాలతోపాటు ఐగుప్తు సరిహద్దు వరకూ విస్తరింపచేశాడు.

14 నెబుకద్నెజరు మతపరమైన భక్తి, ముఖ్యంగా బబులోను ప్రధాన దేవుడైన మార్దుక్‌కే చెందింది. రాజు తన విజయాల ఘనతను మార్దుక్‌కే చెల్లించాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు మార్దుక్‌కూ, అనేక ఇతర బబులోను దేవతలకూ ఆలయాల్ని కట్టించి, అలంకరించాడు. దానియేలు 3వ అధ్యాయంలో పేర్కొనబడినట్టుగా దూరా మైదానంలో ఆ బబులోను రాజు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ, బహుశా మార్దుక్‌కు అంకితం చేయబడినదై ఉండవచ్చు. (దానియేలు 3:1, 2) నెబుకద్నెజరు తన సైనిక దాడుల వ్యూహరచనలో భవిష్యవాణులపైనే ఎక్కువగా ఆధారపడినట్టు కన్పిస్తోంది.

15, 16. బబులోను కోసం నెబుకద్నెజరు ఏమి చేశాడు, దాని గొప్పదనాన్ని బట్టి ఆయన అతిశయించినప్పుడు ఏమి జరిగింది?

15 తన తండ్రి చేపట్టిన బబులోను రాజ్యపు రెండు వరుసల భారీ గోడల నిర్మాణాన్ని తాను పూర్తిచేయడం ద్వారా, నెబుకద్నెజరు ఆ రాజధానిని దుర్భేద్యమైనదిగా చేశాడు. తన స్వదేశంలోని కొండల కోసం, కోనల కోసం పరితపించిపోతున్న మాదీయురాలైన తన రాణిని తృప్తిపర్చేందుకు, నెబుకద్నెజరు ప్రాచీన లోకంలోని ఏడు అద్భుతాల్లో ఒకటైన వ్రేలాడే ఉద్యానవనాల్ని కట్టించాడు. అతడు బబులోనును ఆ కాలంలో అత్యంత పెద్దవైన గోడలుగల నగరంగా తీర్చిదిద్దాడు. అబద్ధ ఆరాధనకు పీఠమైన దాన్ని బట్టి ఆయన ఎంత అహంకరించాడు !

16 ‘ఈ బబులోను మహా విశాలపట్టణము నేను కట్టించినది కాదా?’ అని ఒకరోజు నెబుకద్నెజరు అతిశయించాడు. అయితే, దానియేలు 4:30-36 వచనాల ప్రకారంగా, “రాజు నోట ఈ మాట యుండగా”నే అతనికి మతి స్థిమితం తప్పింది. దానియేలు ముందుగా చెప్పినట్లుగా ఏడు సంవత్సరాలపాటు పరిపాలనకు అనర్హుడై, గడ్డి మేశాడు. ఆ తర్వాత అతని రాజ్యం అతనికి ఇవ్వబడింది. దాని ప్రవచన ప్రాధాన్యం గురించి మీకు తెలుసా? దాని ప్రధాన నెరవేర్పు మనల్ని ఈ అంత్యకాలం వరకూ ఎలా తీసుకొస్తుందో మీరు వివరించగలరా?

ప్రవచన పార్శ్వాల పరిశీలన

17. ప్రపంచ పాలకుడిగా తన పరిపాలన రెండవ సంవత్సరంలో నెబుకద్నెజరుకు దేవుడు కలుగజేసిన ప్రవచనాత్మక కలను మీరు ఎలా వర్ణిస్తారు?

17 దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనంలోని కొన్ని పార్శ్వాలను పరిశీలిద్దాం. బైబిలు ప్రవచిస్తున్న రీతిలో ప్రపంచ పాలకునిగా నెబుకద్నెజరు పరిపాలన రెండవ సంవత్సర కాలంలో (సా.శ.పూ. 606/605), అతడు ఒక భయంకరమైన కలను కనేలా దేవుడు చేశాడు. దానియేలు 2వ అధ్యాయం ప్రకారంగా, అతడు కనిన కలలో శిరస్సు సువర్ణమయం, రొమ్ము భుజాలు వెండివీ, ఉదరం తొడలు ఇత్తడివీ, మోకాళ్లు ఇనుపవీ, పాదాలు ఇనుమూ మట్టీ కలిసినవైన ఒక బ్రహ్మాండమైన ప్రతిమ చేరివుంది. ఆ ప్రతిమలోని వేర్వేరు భాగాలు వేటికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి?

18. కలలోని ప్రతిమకున్న సువర్ణమయమైన శిరస్సు, వెండివైన రొమ్ము భుజాలు, ఇత్తడివైన ఉదరం తొడలు దేనికి ప్రాతినిధ్యం వహించాయి?

18 దేవుని ప్రవక్త నెబుకద్నెజరుతో ఇలా అన్నాడు: “రాజా, . . . తామే ఆ బంగారపు శిరస్సు.” (దానియేలు 2:37, 38) బబులోను సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశానికి శిరస్సు నెబుకద్నెజరు. ఆ వంశావళి, ఆ ప్రతిమలోని వెండివైన రొమ్ము భుజాలకు ప్రాతినిధ్యం వహించిన మాదీయ-పారశీకులచే కూలద్రోయబడింది. ఆ తర్వాత, ఇత్తడివైన ఉదరం తొడలచే సూచించబడిన గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. ఆ ప్రపంచ శక్తి ఎలా ఆరంభమైంది?

19, 20. అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ ఎవరు, గ్రీసును ప్రపంచ శక్తిగా చేయటంలో ఆయన ఏ పాత్రను వహించాడు?

19 సా.శ.పూ. నాల్గవ శతాబ్దంలో, ఆ దానియేలు ప్రవచనపు నెరవేర్పులో ఒక యౌవనుడు ప్రాముఖ్యమైన పాత్రను పోషించాడు. అతడు సా.శ.పూ. 356 లో జన్మించాడు, ప్రపంచం అతడ్ని అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ అని పిలిచింది. సా.శ.పూ. 336 లో తన తండ్రి ఫిలిప్పు హత్యచేయబడటంతో, 20 ఏళ్ల వాడైన అలెగ్జాండర్‌ మాసిదోనియ సింహాసనాన్ని వారసత్వంగా పొందాడు.

20 సా.శ.పూ. 334 మే తొలిభాగంలో అలెగ్జాండర్‌ తన జైత్రయాత్రను ప్రారంభించాడు. అతనికి చిన్నదైనా సమర్థవంతమైన సైన్యం ఉంది. అందులో 30,000 పదాతి దళం, 5,000 అశ్వికదళం ఉన్నాయి. సా.శ.పూ. 334 లో వాయవ్య ఆసియా మైనరులో (ఇప్పటి టర్కీలో) గ్రానికస్‌ నది దగ్గర అలెగ్జాండర్‌ పర్షియన్లపై చేసిన తన మొదటి యుద్ధంలో విజయాన్ని సాధించాడు. సా.శ.పూ. 326 నాటికి, అలుపెరుగని ఈ విజేత పర్షియన్లను లోబర్చుకొని, తూర్పు దిశగా ఆధునిక కాల పాకిస్తాన్‌లో ఉన్న సింధూ నది వరకూ అప్రతిహతంగా దూసుకుపోయాడు. అయితే బబులోనులో ఉండగా అలెగ్జాండర్‌ తన చివరి యుద్ధంలో ఓడిపోయాడు. సా.శ.పూ. 323 జూన్‌ 13న, కేవలం 32 సంవత్సరాల 8 నెలల వయసులో, అలెగ్జాండర్‌ అత్యంత భయంకరమైన శత్రువగు మరణం చేతికి చిక్కాడు. (1 కొరింథీయులు 15:55) అయితే అతను సాధించిన విజయాల ద్వారా, దానియేలు గ్రంథంలో ప్రవచించినట్లుగానే గ్రీసు ఒక ప్రపంచ శక్తిగా మారింది.

21. కలలోని ప్రతిమకున్న ఇనుప మోకాళ్లు రోమా సామ్రాజ్యానికి తోడు ఏ ఇతర ప్రపంచ శక్తిని చిత్రీకరిస్తున్నాయి?

21 బ్రహ్మాండమైన ఆ ప్రతిమకున్న ఇనుప మోకాళ్లు దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి? అది, గ్రీకు సామ్రాజ్యాన్ని నలగగొట్టి, తుత్తునియలుగా చేసిన ఇనుములాంటి రోమునే. యేసుక్రీస్తు ద్వారా ప్రకటించబడిన దేవుని రాజ్యం పట్ల ఏవిధమైన గౌరవాన్నీ చూపించకుండా రోము, సా.శ. 33 లో యేసును హింసాకొయ్యపై వ్రేలాడదీసి చంపింది. నిజ క్రైస్తవత్వాన్ని నిర్మూలించే ప్రయత్నంలో రోము, యేసు శిష్యుల్ని హింసించింది. అయినా, నెబుకద్నెజరు కలలోని ప్రతిమకున్న ఇనుప మోకాళ్లు, రోమా సామ్రాజ్యానికి మాత్రమేగాక దాన్లోనుండి కలిగిన రాజకీయ పురోభివృద్ధికి—ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచ శక్తికి కూడా చిత్రీకరణగా ఉంది.

22. మనం అంత్యకాలపు అంచున ఉన్నామని కలలోని ప్రతిమ మనకెలా చూపిస్తోంది?

22 జాగ్రత్తతో కూడిన అధ్యయనం మనం అంతానికి అంచున ఉన్నామని నిరూపిస్తోంది, మనం కలలోని ప్రతిమ యొక్క ఇనుము మట్టి కలిసిన పాదాలకు చేరుకున్నాము. ఈనాటి కొన్ని ప్రభుత్వాలు ఇనుములా బలంగా లేక నియంతృత్వంగా ఉంటే మరికొన్ని మట్టిలా ఉన్నాయి. “మనుష్య జాతులు” మెత్తని మట్టితో తయారుచేయబడినప్పటికీ, ఇనుములాంటి ప్రభుత్వాలు ఆ సామాన్య మనుష్యుల మాట వినవలసివచ్చింది. (దానియేలు 2:43; యోబు 10:9) నిజమే, నియంతృత్వపాలనా, సామాన్య ప్రజలూ కలిసిమెలిసి ఉండటం ఇనుము బురదతో కలిసినప్పటి కంటే గొప్పగా ఏమీ లేదు. కానీ ఈ రాజకీయ అస్తవ్యస్త లోకానికి దేవుని రాజ్యం త్వరలోనే అంతాన్ని తెస్తుంది.—దానియేలు 2:44.

23. బెల్షస్సరు పాలనలోని మొదటి సంవత్సరంలో దానియేలుకు వచ్చిన కల, దర్శనాలను మీరెలా వర్ణిస్తారు?

23 దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలోని ఉగ్గగట్టించే ప్రవచనం, మనల్ని అంత్యకాలంలోకి తీసుకొస్తుంది కూడా. ఇది బబులోను రాజైన బెల్షస్సరు పాలన మొదటి సంవత్సరంలోని ఒక సంఘటనను తెలియజేస్తుంది. అప్పటికి దానియేలు తన 70వ పడిలో, ‘తన పడకమీద పరుండి యొక కలనూ, దర్శనాల్నీ చూస్తున్నాడు.’ ఆ దర్శనాలు ఆయన్ని ఎంతగానో కలవరపెట్టాయి ! ఆయన “తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రముమీద గాలి విసరుట నాకు కనబడెను. అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములోనుండి పై కెక్కెను.” (దానియేలు 7:1-8, 15) ఎంత గమనార్హమైన జంతువులో గదా ! మొదటిది రెక్కలుగల సింహము, రెండవది ఎలుగుబంటిని పోలి ఉంది. ఆ తర్వాత నాలుగు రెక్కలు నాలుగు తలలు ఉన్న చిరుతపులి వస్తుంది ! అసామాన్యమైన బలంగల నాలుగవ మృగానికి పెద్ద ఇనుప దంతాలూ, పది కొమ్ములూ ఉన్నాయి. ఆ పది కొమ్ముల్లో నుంచి పుట్టుకొచ్చిన ఒక “చిన్న కొమ్ము”కు “మానవుల కన్నులవంటి కన్నులు,” “గర్వముగా మాటలాడు నోరు” ఉన్నాయి. ఎంత వికృతమైన మృగాలో కదా !

24. దానియేలు 7:9-14 ప్రకారంగా, దానియేలు పరలోకంలో దేన్ని చూశాడు, ఆ దర్శనం ఏమని సూచిస్తోంది?

24 దానియేలు దర్శనాలు తర్వాత పరలోకంవైపుకు మరలుతాయి. (దానియేలు 7:9-14) “మహావృద్ధు”డైన యెహోవా దేవుడు, పరలోక న్యాయస్థానంలో న్యాయాధిపతిగా మహిమాన్విత సింహాసనంపై కూర్చొని ఉండటం కనబడుతుంది. ‘వేవేలకొలది మంది ఆయనకు పరిచారం చేస్తున్నారు, కోట్లకొలది మంది ఆయన ఎదుట నిల్చొని ఉన్నారు.’ ఆ జంతువులకు కఠినమైన తీర్పును తీరుస్తూ, దేవుడు వాటి నుంచి పరిపాలనాధిపత్యాన్ని తీసుకొని, ఆ నాలుగవ మృగాన్ని నాశనం చేస్తాడు. “సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువా[రిపై]” శాశ్వత పరిపాలనాధిపత్యం, “మనుష్యకుమారుని పోలిన యొక[నికి]” ఇవ్వబడుతుంది. ఇది, అంత్యకాలాన్నీ 1914 లో మనుష్యకుమారుడైన యేసుక్రీస్తు సింహాసనంపై ఆసీనుడవ్వడాన్నీ సూచిస్తోంది.

25, 26. దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు ఏ ప్రశ్నలు వస్తాయి, ఏ ప్రచురణ వాటికి జవాబులనిస్తుంది?

25 దానియేలు గ్రంథ పాఠకులకు నిశ్చయంగా ప్రశ్నలుంటాయి. ఉదాహరణకు, దానియేలు 7వ అధ్యాయంలోని నాలుగు మృగాలు వేటికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి? దానియేలు 9:24-27 వచనాల్లోని ప్రవచనాత్మక “డెబ్బదివారముల”ను గూర్చిన వివరణ ఏమిటి? దానియేలు 11వ అధ్యాయంలోని “ఉత్తరదేశపు రాజు,” “దక్షిణదేశపు రాజు”ల ప్రవచనాత్మక పోరు విషయమేమిటి? ఇప్పుడు ఈ అంత్యకాలంలో ఆ రాజుల నుంచి మనమేం ఎదురు చూడగలం?

26దానియేలు 7:18 లో “మహోన్నతుని పరిశుద్ధులు” అని పిలువబడిన భూమిపై ఉన్న తన అభిషిక్త సేవకులకు, యెహోవా అలాంటి విషయాల్లో అంతర్దృష్టిని అనుగ్రహించాడు. అంతేగాక, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ దానియేలు ప్రవక్త ప్రేరేపిత రచనలపై మనం మరింత అంతర్దృష్టిని పొందేందుకు ఏర్పాటు చేశాడు. (మత్తయి 24:45) ఈ అంతర్దృష్టి ఇటీవల విడుదలైన పే అటెన్షన్‌ టు డానియేల్స్‌ ప్రాఫసీ ! అన్న ప్రచురణలో లభ్యమౌతుంది. చక్కని చిత్రాలతో ఉన్న ఈ 320 పేజీల ప్రచురణ, దానియేలు గ్రంథంలోని ప్రతీ భాగాన్నీ చర్చిస్తుంది. ప్రియతమ ప్రవక్తయైన దానియేలు నమోదు చేసినటువంటి విశ్వాసాన్ని బలపర్చే ప్రతీ ప్రవచనంతోనూ, ప్రతీ కథనంతోనూ ఇది వ్యవహరిస్తుంది.

మన కాలానికి నిజమైన అర్థం

27, 28. (ఎ) దానియేలు గ్రంథంలోని ప్రవచనాల నెరవేర్పుల విషయమై నిజమేమిటి? (బి) మనం ఏ కాలంలో జీవిస్తున్నాము, మనం ఏమి చేయాలి?

27 ఈ ప్రాధాన్యమైన విషయాన్ని పరిశీలించండి: కొన్ని వివరణల విషయంలో తప్ప, దానియేలు గ్రంథంలోని ప్రవచనాలన్నీ నెరవేరాయి. ఉదాహరణకు, దానియేలు 2వ అధ్యాయంలోని స్వప్న ప్రతిమ యొక్క పాదాలచే చిత్రీకరించబడిన లోక పరిస్థితిని మనం ఇప్పటికే చూస్తున్నాం. దానియేలు 4వ అధ్యాయంలోని చెట్టు బంధనాలు 1914 లో మెస్సీయా రాజైన యేసుక్రీస్తు సింహాసనాసీనుడవటం ద్వారా విప్పబడ్డాయి. అవును, దానియేలు 7వ అధ్యాయంలో ప్రవచించబడినట్టుగానే, మహా వృద్ధుడగువాడు పరిపాలనాధిపత్యాన్ని మనుష్యకుమారుని పోలిన వానికి ఇచ్చాడు.—దానియేలు 7:13, 14; మత్తయి 16:27–17:9.

28 దానియేలు 8వ అధ్యాయంలోని 2,300 దినములు, అలాగే 12వ అధ్యాయంలోని 1,290 దినములు, 1,335 దినములు మన వెనుక కాలప్రవాహంలో గడిచిపోయాయి. దానియేలు 11వ అధ్యాయాన్ని పఠించడం, “ఉత్తరదేశపు రాజు”కూ, “దక్షిణదేశపు రాజు”కూ మధ్య జరిగిన పోరు పతాక స్థాయికి చేరుకుందని చూపిస్తుంది. ఇవన్నీ, మనం ఇప్పుడు అంత్యకాలానికి అంచున ఉన్నామన్న దానికి లేఖనాధార నిదర్శనాలను జోడిస్తున్నాయి. కాల ప్రవాహంలో మన సమున్నత స్థానాన్ని పరిశీలిస్తూ, మనం ఏమి చేయటానికి నిశ్చయించుకోవాలి? నిశ్శంకగా యెహోవా దేవుని ప్రవచన వాక్యాన్ని మనం లక్ష్యపెట్టాలి.

మీరెలా జవాబిస్తారు?

• సమస్త మానవజాతి మన కాలాన్ని గూర్చి ఏమి తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు?

• మన విశ్వాసాన్ని దానియేలు గ్రంథం ఎలా ప్రోది చేయగలదు?

• నెబుకద్నెజరు కలలోని ప్రతిమ ఏ అంశాలను కల్గివుంది, అవి దేన్ని సూచిస్తున్నాయి?

• దానియేలు గ్రంథంలోని ప్రవచనాల నెరవేర్పుల విషయమై ఏది గమనించదగింది?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]