కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సువార్తలను గురించిన—చర్చ కొనసాగుతోంది

సువార్తలను గురించిన—చర్చ కొనసాగుతోంది

సువార్తలను గురించిన—చర్చ కొనసాగుతోంది

యేసుక్రీస్తు జననాన్ని గురించి సువార్తలు చెబుతున్న వృత్తాంతాలు సత్యమేనా?

కొండమీది ప్రసంగం యేసు చేసినదేనా?

యేసు నిజంగానే పునరుత్థానం చేయబడ్డాడా?

“నేనే మార్గమును, సత్యమును, జీవమును” అని ఆయనసలు అన్నాడా?—యోహాను 14:6.

ఇలాంటి విషయాలను, జీసస్‌ సెమినార్‌లో దాదాపు 80 మంది పండితులు చర్చిస్తున్నారు. జీసస్‌ సెమినార్‌, 1985వ సంవత్సరం మొదలుకొని సంవత్సరానికి రెండు సార్లు జరుగుతోంది. ఈ పండితుల గుంపు ఇలాంటి ప్రశ్నలకు అసాధారణమైన పద్ధతిలో జవాబులనిచ్చింది. ఈ సెమినార్‌లో పాల్గొన్నవాళ్ళు, యేసు చెప్పాడని సువార్తలు చెబుతున్న ఒక్కో విషయాన్ని గురించిన తమ అభిప్రాయాన్ని బ్యాలెట్‌ పేపరు ద్వారా వ్యక్తీకరించారు. నిజంగా యేసు చెప్పినవేనన్న అభిప్రాయాన్ని ఎరుపు రంగు బ్యాలెట్‌ పేపరు సూచిస్తుంది. సరిగ్గా ఈ మాటలనే కాదు కానీ, ఈ మాటలకు సాదృశ్యమైన మాటలనే యేసు చెప్పి ఉండవచ్చునన్న అభిప్రాయాన్ని లేత ఎరుపు రంగు బ్యాలెట్‌ పేపరు సూచిస్తుంది. యేసు ఆశయాలకు సాదృశ్యంగా ఉండవచ్చేమో గానీ యేసు చెప్పినది మాత్రం కాదన్న అభిప్రాయాన్ని బూడిద రంగు బ్యాలెట్‌ పేపరు సూచిస్తుంది. పూర్తిగా ప్రతికూల అభిప్రాయాన్ని, అంటే తర్వాత ఆ నోట ఈ నోట చెప్పుకున్న విషయాలు చేర్చబడ్డాయి అన్న అభిప్రాయాన్ని నల్ల రంగు బ్యాలెట్‌ పేపరు సూచిస్తుంది.

ఈ శీర్షిక ఆరంభంలో ప్రశ్నల రూపంలో లేవదీయబడిన నాలుగు వివాదవిషయాలను జీసస్‌ సెమినార్‌లో పాల్గొన్నవాళ్ళు పై పద్ధతిలో కొట్టిపారేశారు. వాస్తవానికి, యేసు చెప్పాడని సువార్తలు తెలియజేస్తున్న విషయాల్లో 82 శాతానికి వాళ్ళు నల్లని బ్యాలెట్‌ పేపరు వేశారు. సువార్తల్లోను మరితర లేఖనాల్లోను యేసును గురించి చెప్పిన సంఘటనల్లో కేవలం 16 శాతం మాత్రమే విశ్వసనీయమైనవని వాళ్ళ అభిప్రాయం.

సువార్తలను అలా విమర్శించడం క్రొత్తేమీ కాదు. జర్మనీలోని, హంబర్గ్‌లో ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌ ప్రొఫెసర్‌ అయిన హెర్మాన్‌ రైమారూస్‌ వ్రాసిన 1,400 పేజీల వ్రాతప్రతిని ఆయన చనిపోయిన తర్వాత 1774 లో ప్రచురించినప్పుడు సువార్తలపై దాడి జరిగింది. రైమారూస్‌, సువార్తల చారిత్రకతపై తన బలమైన అనుమానాలను ఆ వ్రాతప్రతిలో వ్యక్తీకరించాడు. భాషా విశ్లేషణనూ, యేసు జీవితాన్ని గురించిన నాలుగు సువార్తల్లో వైరుద్ధ్యాలుగా కనిపించే విషయాలనూ ఆధారంగా చేసుకుని ఆయన ఆ నిర్ధారణకు వచ్చాడు. అప్పటి నుండి విమర్శకులు, సువార్తల విశ్వసనీయతను గురించిన అనుమానాలను తరచూ వ్యక్తం చేస్తూ వచ్చారు. వాళ్ళు అలా అనుమానాన్ని వ్యక్తం చేయడం వల్ల, ఈ సువార్తలపై ప్రజలకున్న నమ్మకం కొంత మేరకు తగ్గిపోయింది.

అలాంటి పండితులకు ఉన్న ఉమ్మడి అభిప్రాయం ప్రకారం, సువార్తలు, వివిధ వ్యక్తుల ద్వారా చేరవేయబడిన మతసంబంధ కల్పితాలు మాత్రమే. సువార్తలను అనుమానించే పండితులు సాధారణంగా అడిగే ప్రశ్నలు ఏమిటంటే: ఆ నాలుగు సువార్తల రచయితలు వాస్తవాన్ని మరింత గొప్పగా చేసి వ్రాసేందుకు వాళ్ళ నమ్మకాలు కారణమై ఉండవచ్చా? యేసును గురించి కట్టుకథలు వ్రాసేందుకు లేదా యేసు జీవిత చరిత్రకు కల్పితాలను చేర్చేందుకు తొలి క్రైస్తవ సమాజపు రాజకీయాలు కారణమై ఉంటాయా? ఈ సువార్తల్లోని ఏ భాగాలు కల్పితాలు లేని నిష్పాక్షిక నివేదికలై ఉండవచ్చు?

నాస్తిక నేపథ్యంలో లేదా మతేతర సమాజంలో పెరిగిన ప్రజలు, సువార్తలతో సహా బైబిలు పూర్తిగా కల్పిత కథలతోను మిథ్యతోను నిండివుందని నమ్ముతారు. రక్తపాతం, అణచివేత, అనైక్యం, దైవభక్తిరహితమైన ప్రవర్తనలతో నిండివున్న క్రైస్తవమత సామ్రాజ్యపు చరిత్రను బట్టి మరి కొందరు దిగ్భ్రమ చెందుతున్నారు. క్రైస్తవమత సామ్రాజ్యంలో పవిత్రంగా ఎంచబడుతున్న ఏ లేఖనాలకైనా శ్రద్ధనివ్వవలసిన అవసరం లేదని అలాంటి వ్యక్తులు అనుకుంటారు. వేషధారణతో కూడిన మతానికి జన్మనిచ్చిన రచనలు నిరుపయోగమైన కట్టుకథలకంటే ఎక్కువేమీ కాదని వాళ్ళు అనుకుంటారు.

మీరు ఏమనుకుంటున్నారు? కొంతమంది పండితులు సువార్తల చారిత్రకతను ప్రశ్నిస్తున్నంత మాత్రాన మీరు కూడా వాటిని అనుమానిస్తున్నారా? సువార్త రచయితలు కల్పితకథలను వ్రాశారనడాన్ని విన్నప్పుడు, ఈ వృత్తాంతాలపై మీకున్న నమ్మకం కూడా సడలిపోతుందా? క్రైస్తవమత సామ్రాజ్యపు దైవభక్తిలేని చరిత్రను బట్టి సువార్తల నమ్మకత్వాన్ని మీరు శంకిస్తున్నారా? కొన్ని వాస్తవాలను పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

[4వ పేజీలోని చిత్రం]

సువార్తల్లో ఉన్నవి కట్టుకథలా లేక వాస్తవాలా?

[చిత్రసౌజన్యం]

సముద్రంపై నడుస్తున్న యేసు/The Doré Bible Illustrations/Dover Publications

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

3-5, 8 పేజీల్లో ఉన్న భ్యాక్‌గ్రౌండ్‌: Courtesy of the Freer Gallery of Art, Smithsonian Institution, Washington, D.C.