కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సువార్తలు—చరిత్ర వృత్తాంతాలా కల్పిత కథనాలా?

సువార్తలు—చరిత్ర వృత్తాంతాలా కల్పిత కథనాలా?

సువార్తలు—చరిత్ర వృత్తాంతాలా కల్పిత కథనాలా?

ప్రపంచవ్యాప్తంగా, మానవ చరిత్ర గతినే మార్చివేసిన యువకుడైన నజరేయుడైన యేసు కథ సమాజంలో బాగా అల్లుకుపోయింది. ఎంతగా అల్లుకుపోయిందంటే, ఆయన కథ నియత అనియత విద్యాభ్యాసంలో భాగమైపోయింది. “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను” వంటి కాలాతీతమైన సత్యాలకు, లోకోక్తులకు సువార్తలు ఆధారమని అనేకులు పరిగణిస్తారు. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 5:37) మీ తల్లిదండ్రులు క్రైస్తవులైనా కాకపోయినా, వారు మీకు నేర్పిన పాఠాలకు సువార్త వృత్తాంతాలే ఆధారమై ఉండవచ్చు కూడా.

సువార్తలు, క్రీస్తు కోసం కష్టాలను అనుభవించేందుకు మరణించేందుకు కూడా సుముఖంగా ఉన్న లక్షల కొలది యథార్థ క్రీస్తు అనుచరులకు క్రీస్తును గురించిన వివరణను ఇస్తున్నాయి. వాళ్ళు, ధైర్యంగా, సహనశీలులుగా, విశ్వాసంతో, నిరీక్షణతో ఉండగల ఆధారాన్ని చూపుతున్నాయి, అలా ఉండేందుకు పురికొల్పునిస్తున్నాయి. అలాంటప్పుడు వీటిని కేవలం కల్పిత కథనాలని కొట్టిపారేసేందుకు తిరుగులేని రుజువులు అవసరమని మీరు అంగీకరించరా? మానవుల తలంపులపై, ప్రవర్తనపై సువార్త వృత్తాంతాలు చూపించిన గొప్ప ప్రభావాన్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు, ఎవరైనా సువార్తల విశ్వసనీయతపై అనుమానాలను రేకెత్తించాలనుకుంటే ఒప్పింపజేసే రుజువులను ఇవ్వమని మీరు అడగరా?

సువార్తలను గురించి ఆలోచింపజేసే కొన్ని ప్రశ్నలను పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సువార్తల విద్యార్థులు, తాము క్రైస్తవులమని చెప్పుకోనివారు సహితం, ఈ వివాదాలను గురించి ఏమనుకుంటున్నారో మీ అంతట మీరే చూడండి. తర్వాత, విషయాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మీ అంతట మీరే ఒక నిర్ధారణకు రావచ్చు.

పరిగణించవలసిన ప్రశ్నలు

సువార్తలు నేర్పుతో కూడిన ఊహాకల్పితాలై ఉండవచ్చా?

“మత్తయి, మార్కు, లూకా, యోహానులు, యేసు మరణం తర్వాత పరిణమించిన క్రైస్తవ సిద్ధాంతానికి అనుగుణ్యమైన ‘మెస్సీయాను చిత్రీకరించారు’” అని జీసస్‌ సెమినార్‌ స్థాపకుడైన రాబర్ట్‌ ఫంక్‌ అంటున్నారు. అయితే, యేసు చెప్పిన మాటలను వినిన, ఆయన చేసిన కార్యములను గమనించిన, ఆయన పునరుత్థానం చేయబడిన తర్వాత ఆయనను చూసిన వారు సువార్తలు వ్రాయబడుతున్న సమయంలో బ్రతికే ఉన్నారు. సువార్త రచయితలు ఏదో కుయుక్తిని ఉపయోగిస్తున్నట్లు వాళ్ళలో ఎవరూ ఆరోపించలేదు.

క్రీస్తు మరణ పునరుత్థానాల విషయమే తీసుకుందాం. యేసు మరణ పునరుత్థానాలను గురించిన నమ్మదగిన వృత్తాంతాలు సువార్తల్లోనే కాక, ప్రాచీన కొరింథులోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు వ్రాసిన, బైబిలు సంబంధిత మొదటి పత్రికలో కూడా ఉన్నాయి. “నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచి యున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలుల కందరికిని కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను” అని ఆయన వ్రాశాడు. (1 కొరింథీయులు 15:3-8) యేసు జీవితాన్ని గురించిన చారిత్రక వాస్తవాలను తర్వాతి తరాల వారికి అందజేయవలసిన బాధ్యత ఆ ప్రత్యక్ష సాక్షులకు ఉండింది.

ఆధునిక విమర్శకులు, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉన్నాయని ఆరోపిస్తున్న కల్పితాలు వాటిలో కనిపించడం లేదు. అవి సా. శ. రెండవ శతాబ్దపు దస్తావేజుల్లో మాత్రమే కనిపిస్తాయి. అంటే, అపొస్తలత్వ సంఘం నుండి వేరైపోయిన సమాజాల్లో నిజ క్రైస్తవ విశ్వాసం భ్రష్టుపట్టిపోయినప్పుడు క్రీస్తును గురించిన లేఖనాధారం లేని కొన్ని వృత్తాంతాలు లిఖించబడ్డాయన్నమాట.—అపొస్తలుల కార్యములు 20:28-30.

సువార్తలు కల్పిత కథలై ఉండవచ్చా?

రచయితా విమర్శకుడూ అయిన సి. ఎస్‌. లూయిస్‌, సువార్తలను కేవలం కల్పిత కథలుగా దృష్టించలేకపోయాడు. “సువార్తలు ఏమైనా కావచ్చు గానీ కల్పితకథలు మాత్రం కావు అని సాహిత్య చరిత్రకారునిగా నేను పూర్తిగా నమ్ముతున్నాను. కల్పిత కథలని చెప్పేంతటి ఊహానైపుణ్యమేమీ వాటి రచనల్లో కనిపించడం లేదు. . . . యేసు జీవిత చరిత్రలో చాలా భాగం మనకు తెలియదు. కల్పితకథలను సృష్టించేవారు ఆ విధంగా తెలపకుండా ఉండరు” అని ఆయన వ్రాశారు. ప్రముఖ చరిత్రకారుడైన హెచ్‌. జి. వెల్స్‌ తాను క్రైస్తవుడనని చెప్పుకోకపోయినప్పటికీ, “[సువార్తల రచయితలు] నలుగురూ నిర్దిష్టంగా ఒకే రకమైన వ్యక్తిత్వాన్ని చిత్రీకరిస్తున్నారు; ఆయన నిజమైన వ్యక్తి అన్న నమ్మకాన్ని . . . అవి కలిగించగలవు” అని ఒప్పుకోవడం మరో ఆసక్తికరమైన విషయం.

పునరుత్థానుడైన యేసు తన శిష్యులకు కనిపించిన ఒక సందర్భాన్నే తీసుకోండి. కల్పిత కథలు వ్రాయడంలో సిద్ధహస్తుడైన వ్యక్తి, యేసు ఎంతో ఆర్భాటంగా వచ్చినట్లు ఎంతో ప్రాముఖ్యమైన ప్రసంగాన్ని ఇచ్చినట్లు, లేదా దేదీప్యమానంగా కనిపించినట్లు వ్రాసి ఉండేవాడు. సువార్త రచయితలు అలా వ్రాసే బదులు, ఆయన తన శిష్యుల ఎదుటకు వచ్చి నిలబడ్డాడనీ, ఆ తర్వాత, “పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా?” అని అడిగాడనీ మాత్రమే వ్రాశారు. (యోహాను 21:5) పండితుడైన గ్రెగ్‌ ఈస్టర్‌బ్రూక్‌, “ఈ విధమైన వివరణలు నిజమైన వృత్తాంతాన్ని సూచిస్తాయే కానీ, కల్పిత కథలను కాదు” అనే నిర్ధారణకు వచ్చాడు.

సువార్తలు కల్పితకథనాలు కావు అనేందుకు మరొక కారణముంది. సువార్తలు వ్రాయబడిన కాలంలో, విషయాలను కంఠతాపట్టి నేర్చుకునే పద్ధతి ప్రాబల్యంలో ఉండేది. కంఠతాపట్టి నేర్చుకోవాలని రబ్బీలు పట్టుపట్టేవారు. విద్యార్థులు మరల మరల వల్లించడం ద్వారా విషయాలను జ్ఞాపకముంచుకునేవారు. ఈ విధంగా కంఠతాపట్టడం, యేసు చెప్పిన మాటలనూ, పనులనూ ఖచ్చితంగా జాగ్రత్తగా వ్రాయడానికి సహాయపడింది. ఈ విధంగా కంఠతాపట్టి వ్రాసే పద్ధతి, ఆకర్షణీయంగా కల్పిత కథలను వ్రాసే పద్ధతికి పూర్తిగా భిన్నమైనది.

సువార్తలు కల్పితకథలైతే, యేసు మరణించి ఎంతో కాలం కాకముందే, వాటిని సృష్టించి ఉంటారంటారా?

అందుబాటులో ఉన్న రుజువుల ప్రకారం, సువార్తలు సా.శ. 41కీ 98కీ మధ్యకాలంలో వ్రాయబడ్డాయి. యేసు సా.శ. 33 లో మరణించాడు. అంటే, యేసు జీవితాన్ని గురించిన వృత్తాంతాలు, ఆయన తన పరిచర్యను పూర్తి చేసిన కొంతకాలానికే సంపుటీకరించబడి ఉండవచ్చు. సువార్త వృత్తాంతాలు కేవలం కల్పిత కథనాలు అన్న వాదనకు ఈ వాస్తవం పెద్ద సవాలుగా ఉంది. కల్పితకథనాలను వృద్ధిచేసేందుకు చాలా సమయం కావాలి. ఉదాహరణకు, ప్రాచీన గ్రీకు కవియైన హామర్‌ వ్రాసిన లైయడ్‌, ఒడిస్సీ అనే కావ్యాలనే తీసుకోండి. ఈ కావ్యాలు పురాణ కావ్యాలుగా మారేందుకు, ఆ విధంగా సుస్థిరతను సంపాదించుకునేందుకు, వందలాది సంవత్సరాలకన్నా ఎక్కువకాలమే పట్టింది. మరి సువార్తల విషయం ఏమిటి?

సీసర్‌ అండ్‌ క్రైస్ట్‌ అనే తన పుస్తకంలో, చరిత్రకారుడైన విల్‌ డ్యూరంట్‌, “సువార్తలలో వ్రాయబడివున్న ఏ అద్భుతాలనైనా నమ్మవచ్చు గానీ, ఎంతో శక్తివంతమైన ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్నీ, ఎంతో ఉన్నతమైన నైతిక సూత్రావళినీ, మానవ సౌభ్రాతృత్వం అనే ఎంతో ప్రేరణాత్మకమైన దర్శనాన్నీ . . . సామాన్యులైన కొందరు మానవులే ఊహించి వ్రాశారంటే మాత్రం ఏ మాత్రం నమ్మలేము. రెండు శతాబ్దాలపాటు సువార్తలు విమర్శించబడినప్పటికీ, వాటిలో కనిపిస్తున్న, క్రీస్తు జీవితాన్నీ, స్వభావాన్నీ, బోధలనూ గురించిన ఆ సంక్షిప్త వివరణలు ఇప్పటికీ కావలసినంత స్పష్టంగా ఉన్నాయి, అవి పాశ్చాత్య మానవుని చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన విషయాలుగా మారాయి” అని వ్రాశారు.

సువార్తలు, తొలి క్రైస్తవ సమాజపు అవసరాలకు సరిపోయే విధంగా మలచబడ్డాయా?

సువార్త రచయితలు యేసు చరిత్రను వ్రాయడానికి లేదా దానికి కల్పితాలు చేర్చడానికి ఆదిమ క్రైస్తవ సమాజపు రాజకీయాలే కారణమని కొందరు విమర్శకులు వాదిస్తారు. అలాంటి కట్టుకథలేమీ చేర్చబడలేదని సువార్తలపై చేసిన నిశిత అధ్యయనాలు చూపిస్తున్నాయి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు, యేసును గురించిన సువార్త వృత్తాంతాలను మార్చివేసినట్లైతే, యూదులను గురించిన, అన్యులను గురించిన ప్రతికూలమైన మాటలు లేఖనాల్లో ఇప్పటికీ ఎందుకు కనిపిస్తున్నాయి?

ఉదాహరణకు, మత్తయి 6:5-7 లో, “మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారులవలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థనచేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను” అని యేసు చెప్పినట్లు వ్రాయబడింది. స్పష్టంగా, ఆ మాటలు యూదా మత నాయకులను ఖండిస్తున్నాయి. “మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు” అని కూడా యేసు అంటున్నాడు. ఈ విధంగా యేసు చెప్పిన మాటలను సువార్త రచయితలు వ్రాసి పెట్టింది, ప్రజలను క్రైస్తవత్వంలోనికి తీసుకురావాలన్న ప్రయత్నంతో కాదు. నిజంగానే యేసుక్రీస్తు చెప్పిన మాటలను వాళ్ళు అలా వ్రాసిపెట్టారంతే.

యేసు సమాధి దగ్గరికి వెళ్ళి, అది ఖాళీగా ఉండడాన్ని చూసిన స్త్రీలను గురించిన సువార్త వృత్తాంతాలనే తీసుకుందాం. (మార్కు 16:1-8) గ్రెగ్‌ ఈస్టర్‌బ్రూక్‌ అభిప్రాయం ప్రకారం, “ప్రాచీన మధ్యప్రాచ్య ప్రాంతపు సమాజంలో, స్త్రీలు ఇచ్చే సాక్ష్యం నమ్మదగనిదిగా పరిగణించబడేది: ఉదాహరణకు, ఒక స్త్రీ వ్యభిచారం చేసినట్లు నిరూపించడానికి ఇద్దరు మగ సాక్షులుంటే సరిపోయేది. కానీ, స్త్రీ ఇచ్చే సాక్ష్యం ఒక మగవాడ్ని దోషిగా నిరూపించలేకపోయేది.” నిజానికి, యేసు శిష్యులు కూడా స్త్రీలు చెప్పిన దాన్ని నమ్మలేదు. (లూకా 24:11) కనుక అలాంటి ఒక కథను వాళ్ళు కావాలని సృష్టించి ఉండకపోవచ్చు.

పత్రికల్లోను, అపొస్తలుల కార్యములలోను ఉపమానాలు లేకపోవడం, సువార్తల్లో ఉన్న ఉపమానాలు తొలి క్రైస్తవులు చేర్చినవి కాదుగానీ, యేసు చెప్పినవే అనేందుకు గట్టి ఆధారం. అంతేకాక, సువార్తలను, పత్రికలతో జాగ్రత్తగా పోల్చి చూస్తే, పౌలు మాటలను గానీ, గ్రీకు లేఖనాల్లోని ఇతర రచయితల మాటలను గానీ నిపుణంగా మార్చి యేసు చెప్పిన మాటలుగా చెప్పడం జరగలేదని రుజువవుతుంది. తొలి క్రైస్తవ సమాజం అలాంటి పని చేసినట్లైతే, పత్రికల్లోని కనీసం కొంత సమాచారమైనా సువార్త వృత్తాంతాల్లో కనిపించాలి. అలా కనిపించడం లేదు కనుక, సువార్తల్లో ఉన్న సమాచారం నిజంగా వాస్తవమైనదేననీ, అధికృతమైనదేననీ మనం నిర్ధారించవచ్చు.

సువార్తల్లో పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్న వాటి విషయమేమిటి?

సువార్తల్లో పూర్తిగా పరస్పర విరుద్ధమైన వివరణలే ఉన్నాయని విమర్శకులు ఎంతో కాలంగా అంటున్నారు. చరిత్రకారుడైన డ్యూరంట్‌, సువార్త వృత్తాంతాలను చరిత్ర లేఖలు అన్నట్లుగా, పూర్తిగా నిష్పక్షపాతంగా పరిశీలించి చూశారు. వాటిలో కొన్ని వివరణలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు అనిపించినా, “వైరుద్ధ్యాలు ఉన్నది [ఏమంత ప్రాధాన్యం లేని వివరణల్లోనే], ముఖ్యాంశంలో కాదు; ముఖ్య విషయాలకు వస్తే, సారాంశాలను చూస్తే నాలుగు సువార్తలూ ఏకీభవిస్తున్నాయి, క్రీస్తును ఏకరీతిలో చిత్రీకరిస్తున్నాయి” అనే నిర్ధారణకు ఆయన వచ్చాడు.

సువార్త వృత్తాంతాల్లో ఉన్నట్లు కనిపించే వైరుద్ధ్యాలను సులభంగా పరిష్కరించవచ్చు. ఉదాహరణకు: “[యేసు] కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి” తన దాసుడ్ని బాగుచేయమని “వేడుకొనెను” అని మత్తయి 8:5, 6 చెబుతున్నాయి. “శతాధిపతి యేసును గూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను” అని లూకా 7:3 లో చదువుతాం. ఈ శతాధిపతి యూదుల పెద్దలను తన ప్రతినిధులుగా పంపాడు. ఈ పెద్దలు ఆయన ప్రతినిధులుగా ప్రవర్తించారు కనుక, ఆయన వాళ్ళ ద్వారా యేసును వేడుకొన్నప్పటికీ, ఆయనే వేడుకొన్నట్లుగా మత్తయి చెప్పాడు. సువార్తల్లో ఉన్నట్లు ఆరోపించబడుతున్న తేడాలను పరిష్కరించవచ్చునని చూపించే ఉదాహరణల్లో ఇది కేవలం ఒకటి మాత్రమే.

సువార్తలు నిజమైన వృత్తాంతాలు అనేంతటి ప్రమాణం వాటికి లేదని బైబిలు విమర్శకులు చేస్తున్న ఆరోపణల మాటేమిటి? డ్యూరంట్‌ ఇంకా ఇలా అంటున్నారు: “సువార్తల విమర్శకులు ఎంతో ఉత్సాహంగా తాము కనుగొన్న విషయాలను క్రొత్త నిబంధన యొక్క విశ్వసనీయతను పరీక్షించేందుకు అన్వయించారు. ఆ విమర్శలు ఎంత తీవ్రమైనవంటే, అవి వందమంది ప్రాచీన మహానుభావులను—ఉదాహరణకు, హమ్మురబి, డేవిడ్‌, సోక్రటీస్‌ వంటివారిని—సహితం కల్పితకథా పాత్రలుగా మార్చగలవు. సువార్తికులను గురించి ఎంతో దురభిప్రాయమూ దైవశాస్త్రసంబంధంగా నిర్హేతుకమైన తలంపులూ ఉండవచ్చునేమో గానీ, దేవుని రాజ్యంలో ఉన్నత స్థానాల కోసం అపొస్తలులు పోటీపడడం, యేసును బంధీగా చేసిన తర్వాత వాళ్ళు పారిపోవడం, పేతురు తనకు యేసు తెలియదనడం వంటి అనేక విషయాలను సువార్త రచయితలు వ్రాసిపెట్టారు. కల్పించి చెప్పేవారైతే అలాంటి విషయాలను దాచి ఉంచేవారే. అక్కడ కనిపించే యేసు వ్యక్తిత్వం వాస్తవమైనదేనా అన్న అనుమానం ఈ సన్నివేశాలను చదివేవారికెవరికీ రాదు.”

సువార్తల్లో కనిపించే యేసుకు ఆధునిక క్రైస్తవత్వం ప్రాతినిధ్యం వహిస్తోందా?

తాము సువార్తలపై చేస్తున్న పరిశోధన “చర్చి కౌన్సిల్‌ల ఆదేశానికి కట్టుబడి లేదు” అని జీసస్‌ సెమినార్‌ ఉద్ఘాటించింది. సువార్తల్లో తెలియజేయబడిన యేసు బోధలకూ, క్రైస్తవ మత సామ్రాజ్యపు బోధలకూ చాలా అంతరముంది అని చరిత్రకారుడైన వెల్స్‌ గ్రహించారు. “త్రిత్వాన్ని గురించి యేసు అపొస్తలులు ఎప్పుడైనా విన్నట్లు గానీ, అదీ యేసు నోట నుండి విన్నట్లు గానీ నిరూపించే రుజువులేమీ లేవు. . . . పరలోక రాజ్ఞియైన ఐసిస్‌ రూపంలో తన తల్లియైన మరియను ఆరాధించడాన్ని గురించి [యేసు] ఒక్క మాట కూడా మాట్లాడలేదు. క్రైస్తవ మత సామ్రాజ్యపు ముఖ్య బోధలుగా తలంచబడుతున్నవాటిని గురించి ఆయన ప్రస్తావించనే లేదు” అని ఆయన వ్రాశాడు. కనుక, క్రైస్తవ మత సామ్రాజ్యపు బోధల ఆధారంగా ఒకరు సువార్తల విలువను నిర్ణయించలేరు.

మీరు ఏ నిర్ధారణకు వచ్చారు?

ఇప్పటి వరకూ, పేర్కొన్న విషయాలనన్నింటినీ పరిశీలించిన తర్వాత, మీరు ఏమనుకుంటున్నారు? సువార్తలు కేవలం కల్పిత కథనాలు అని నిరూపించగల నిజమైన రుజువులు ఉన్నాయా? సువార్తల విశ్వసనీయతను గురించి లేవదీయబడిన ప్రశ్నలకూ అనుమానాలకూ ఆధారం లేదనీ రుజువులు లేవనీ అనేకులు గ్రహిస్తారు. వ్యక్తిగతంగా ఒక అభిప్రాయానికి రావాలంటే, సువార్తలను విశాల మనస్సుతో చదవవలసిన అవసరం ఉంది. (అపొస్తలుల కార్యములు 17:11) యేసు వ్యక్తిత్వాన్ని తెలియజేయడంలో సువార్తలు చూపించిన స్థిరతనూ, నిజాయితీనీ, ఖచ్చితత్వాన్నీ పరిగణించినప్పుడు, ఈ వృత్తాంతాలు కట్టుకథల సేకరణలు కానేకావని మీరు గ్రహిస్తారు. *

మీరు బైబిలును జాగ్రత్తగా పరిశీలించి, దాని సలహాను పాటించినట్లైతే, అది మీ జీవితాన్ని ఎలా మెరుగుపరచగలదో చూస్తారు. (యోహాను 6:68) సువార్తల్లో లిఖించబడిన యేసు మాటల విషయానికి వస్తే ఇది మరింత నిజం. మరి ముఖ్యంగా, విధేయులైన మానవ జాతికోసం ఉంచబడిన అద్భుతమైన భవిష్యత్తును గురించి మీరు వాటి నుండి తెలుసుకోగలరు.—యోహాను 3:16; 17:3, 17.

[అధస్సూచీలు]

^ పేరా 29 బైబిలు దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకంలోని 5 నుండి 7 అధ్యాయాలను, సమస్త మానవాళి కొరకైన గ్రంథము అనే బ్రోషూర్‌నీ చూడండి. రెండింటినీ వాచ్‌ టవర్‌ సొసైటీయే ప్రచురించింది.

[7వ పేజీలోని బాక్సు]

సువార్తలు నివేదికలు అనేదానికి రుజువు

ఆస్ట్రేలియా లిపిలేఖికుడూ మునుపటి బైబిలు విమర్శకుడూ అయిన ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ఒప్పుకున్నాడు: “నివేదకుని మొదటి విధిని నేను నా జీవితంలో మొదటిసారిగా చేశాను: నా దగ్గర ఉన్న వివరాలను పరిశీలించాను. . . . నేను నిర్ఘాంతపోయాను. ఎందుకంటే, నేను [సువార్త వృత్తాంతాల్లో] చదువుతున్నది కల్పిత కథనాలూ కావు, వాస్తవాలను చేర్చిన కల్పిత కథలూ కావు. అవి నివేదికలే. అసాధారణ సంఘటనల ప్రత్యక్ష సాక్షులూ ఇతరులు చెప్పగా తెలుసుకున్నవారూ వ్రాసిన వృత్తాంతాలవి. నివేదికలను వ్రాయడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత సువార్తల్లో కనిపిస్తుంది.”

అలాగే, అకులాండ్‌ యూనివర్సిటీలో క్లాసిక్స్‌ ప్రొఫెసర్‌ అయిన ఇ. ఎమ్‌. బ్లైక్‌లోక్‌ ఈ విధంగా వాదించారు: “నేను చరిత్రకారుడననే చెప్పుకుంటాను. నేను సాహిత్యాన్ని విశ్లేషించేది కూడా చారిత్రక దృష్టితోనే. క్రీస్తు జీవితము, మరణము, పునరుత్థానాలను గురించిన రుజువులు ప్రాచీన చరిత్రలోని మరే వాస్తవాల కన్నా ఎక్కువగా రూఢిపర్చబడ్డాయని నేను హామీ ఇవ్వగలను.”

[8, 9వ పేజీలోని మ్యాపు/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఫేనికే

గలిలయ

యొర్దాను నది

యూదయ

[చిత్రాలు]

“క్రీస్తు జీవితము, మరణము, పునరుత్థానాలను గురించిన రుజువులు ప్రాచీన చరిత్రలోని మరే వాస్తవాల కన్నా ఎక్కువగా రూఢిపర్చబడ్డాయి.”—ప్రొఫెసర్‌ ఇ. ఎమ్‌. బ్లైక్‌లోక్‌

[చిత్రసౌజన్యం]

భ్యాక్‌గ్రౌండ్‌ మ్యాప్స్‌: Based on a map copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel.