‘మిమ్మల్నీ, మీ బోధ వినేవారినీ రక్షించుకోండి’
‘మిమ్మల్నీ, మీ బోధ వినేవారినీ రక్షించుకోండి’
“నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము . . . నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.”—1 తిమోతి 4:16.
1, 2. జీవాన్ని రక్షించే తమ పనిలో కొనసాగడానికి నిజ క్రైస్తవులను ఏది పురికొల్పుతుంది?
ఉత్తర థాయ్‌లాండ్‌లోని ఒక మారుమూల గ్రామంలో, యెహోవాసాక్షులైన ఒక వివాహిత జంట ఒక కొండ ప్రాంతపు తెగవారి భాషయైన లాహు భాష నేర్చుకున్నారు. ఆ గ్రామస్థులతో దేవుని రాజ్య సువార్తను పంచుకోవాలన్న కోరికతోనే వారలా నేర్చుకున్నారు.
2 “ఆసక్తికరమైన ఈ ప్రజల మధ్య పని చేస్తూ మేము పొందుతున్న ఆనందాన్నీ, సంతృప్తినీ మాటల్లో వర్ణించలేము. నిజంగా మేము ‘ప్రతి జనమునకును ప్రతి వంశమునకును [“తెగకును,” NW] ఆ యా భాషలు మాటలాడువారికిని’ నిత్య సువార్తను ప్రకటిస్తూ, ప్రకటన 14: 6, 7 నెరవేర్పులో నిమగ్నమై ఉన్నట్లు భావిస్తున్నాము. ఇప్పటికింకా సువార్త చేరుకోని ప్రాంతాలు చాలా తక్కువే ఉన్నాయి, వాటిలో ఈ ప్రాంతం ఒకటి. మేము నిర్వహించలేనన్ని బైబిలు పఠనాలు మాకు లభిస్తున్నాయి” అని ఆ భర్త తెలియజేస్తున్నాడు. ఈ మిషనరీలు తమను తామే గాక తాము చెప్పేది వినేవారిని కూడా రక్షించుకోవాలని కోరుకుంటున్నారని స్పష్టమౌతుంది. క్రైస్తవులముగా మన ఆశ కూడా అదే కాదా?
“నిన్నుగూర్చి . . . జాగ్రత్త కలిగియుండుము”
3. ఇతరులను రక్షించడానికి, మనం మొదట ఏమి చేయాలి?
3 “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము” అని అపొస్తలుడైన పౌలు తిమోతికిచ్చిన ఉపదేశం క్రైస్తవులందరికీ వర్తిస్తుంది. (1 తిమోతి 4:16) నిజానికి ఇతరులు రక్షణ పొందేందుకు వారికి సహాయం చేయడానికి, ముందు మనల్ని గురించి మనం జాగ్రత్త కల్గివుండాలి. ఇది, మనమెలా చేయగలం? ఒక విషయం ఏమిటంటే, మనం నేడున్న కాలాల గురించి అప్రమత్తంగా ఉండాలి. తన అనుచరులు “యుగసమాప్తి” ఎప్పుడు వస్తుందనేది తెలుసుకోగలిగేలా యేసు ఒక సంయుక్త సూచననిచ్చాడు. అయినప్పటికీ, అంతం కచ్చితంగా ఎప్పుడు వస్తుందనేది మనకు తెలియదని కూడా యేసు చెప్పాడు. (మత్తయి 24:3, 36) ఆ వాస్తవానికి మనమెలా ప్రతిస్పందించాలి?
4. (ఎ) ఈ విధానంలో మిగిలివున్న సమయం పట్ల మనం ఎలాంటి దృక్పథాన్ని అలవర్చుకోవాలి? (బి) మనం ఏ దృక్పథాన్ని నివారించాలి?
4 మనలో ప్రతి ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘ఈ విధానానికి మిగిలివున్న సమయాన్ని, నన్ను నేనూ, అలాగే నేను చెప్పేది వినేవారినీ రక్షించుకోవడానికి వెచ్చిస్తున్నానా? లేక, “అంతం ఎప్పుడు వస్తుందో మనకు కచ్చితంగా తెలియదు కాబట్టి, నేను దాని గురించి శ్రద్ధ కల్గివుండను” అనుకుంటున్నానా?’ ఇలాంటి దృక్పథం చాలా ప్రమాదకరమైనది. అది, “మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి” అని యేసు ఇచ్చిన ఉద్బోధకు పూర్తి వ్యతిరేకమైనది. (మత్తయి 24:44) యెహోవా సేవలో మనకున్న ఉత్సాహాన్ని కోల్పోవడానికీ లేదా భద్రత కోసం లేక సంతృప్తి కోసం లోకం వైపు చూడటానికీ ఇది సమయం కాదు.—లూకా 21:34-36.
5. యెహోవా క్రైస్తవపూర్వ సాక్షులు ఏ మాదిరిని ఉంచారు?
5 మన గురించి మనం జాగ్రత్త కల్గివున్నామని చూపించడానికి మరో మార్గం, క్రైస్తవులముగా మనం నమ్మకంగా సహిస్తూ ఉండడమే. గతంలో దేవుని సేవకులు వెంటనే విడుదల లభిస్తుందని ఎదురు చూసినా, అలా ఎదురు చూడకపోయినా సహిస్తూనే ఉన్నారు. హేబెలు, హనోకు, నోవహు, అబ్రాహాము, శారా వంటి క్రైస్తవ పూర్వపు సాక్షుల ఉదాహరణలను హెబ్రీ. 11:13; 12:1.
ప్రస్తావించిన తర్వాత పౌలు ఇలా పేర్కొన్నాడు: ‘వారు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొన్నారు.’ విశ్రాంతికరమైన జీవితాన్ని గడపాలన్న కోరికకు, లేదా తమ చుట్టూ ఉన్న అనైతిక వత్తిడులకు వారు లొంగిపోలేదు “వాగ్దానముల ఫలము” అనుభవించాలని ఆకాంక్షతో ఎదురు చూశారు.—6. రక్షణ గురించి మొదటి శతాబ్దపు క్రైస్తవులకున్న దృక్పథం వారి జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేసింది?
6 మొదటి శతాబ్దపు క్రైస్తవులు, తాము కూడా ఈ లోకంలో “పరదేశుల”మని పరిగణించుకున్నారు. (1 పేతురు 2:11) సా.శ. 70 లో యెరూషలేము నాశనం నుండి రక్షించబడిన తర్వాత కూడా, నిజ క్రైస్తవులు ప్రకటించడం కొనసాగించారు. ఈ లోక సంబంధమైన జీవన విధానంలో పడిపోలేదు. నమ్మకంగా ఉన్న వారి కోసం గొప్ప రక్షణ వేచివుందని వారికి తెలుసు. వాస్తవానికి, సా.శ. 98 లో కూడా అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:17, 28.
7. ఆధునిక కాలాల్లో యెహోవా సాక్షులు సహనాన్ని ఎలా కనబర్చారు?
7 ఆధునిక కాలాల్లో యెహోవాసాక్షులు కూడా, తీవ్రమైన హింసను ఎదుర్కున్నప్పటికీ క్రైస్తవ పనిలో పట్టుదలతో కొనసాగారు. వారు చూపించిన సహనం వ్యర్థమయ్యిందా? ఎంతమాత్రం వ్యర్థం కాలేదు, ఎందుకంటే యేసు మనకిలా అభయమిచ్చాడు: “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.” ఆ అంతము ఈ పాత విధానపు అంతమైనా కావచ్చు లేదా మన ప్రస్తుత జీవితపు అంతమైనా కావచ్చు. మరణించిన తన నమ్మకమైన సేవకులనందరినీ యెహోవా పునరుత్థానం చేసి, వారికి తగిన ప్రతిఫలమిస్తాడు.—మత్తయి 24:13; హెబ్రీయులు 6:10.
8. గతకాలంలోని క్రైస్తవుల సహనాన్ని మనం ప్రశంసిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?
8 అంతేగాక, గతకాలంలోని నమ్మకమైన క్రైస్తవులు కేవలం తమ స్వంత రక్షణ గురించి మాత్రమే శ్రద్ధకల్గివుండనందుకు మనం సంతోషిస్తున్నాము. వారి ప్రయత్నాల ద్వారానే దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకోగలిగిన మనం, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపటంలో వారు సహనంతో కొనసాగినందుకు ఎంతో కృతజ్ఞులం. (మత్తయి 28:19, 20) మనకు అవకాశం ఉన్నంత వరకూ, ఇప్పటికింకా సువార్త వినని వారికి ప్రకటించడం ద్వారా మనం మన కృతజ్ఞతను తెలియజేయవచ్చు. అయితే ప్రకటించడమన్నది శిష్యులను చేసే పనిలో కేవలం మొదటి చర్య మాత్రమే.
‘మీ బోధను గూర్చి జాగ్రత్త కల్గివుండండి’
9. బైబిలు పఠనాలను ప్రారంభించటానికి అనుకూల దృక్పథం మనకెలా సహాయం చేయగలదు?
9 మనకివ్వబడిన పనిలో ప్రకటించడమే కాదు బోధించడం కూడా ఇమిడివుంది. తాను ఆజ్ఞాపించిన వాటన్నింటినీ అనుసరించేలా ప్రజలకు బోధించమని యేసు ఆజ్ఞ ఇచ్చాడు. నిజమే కొన్ని ప్రాంతాల్లో, యెహోవా గురించి తెలుసుకోవాలని చాలా తక్కువ మంది కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ మనం పని చేయవలసిన ప్రాంతాన్ని గురించి ప్రతికూల దృక్పథం కల్గివుండడం, బైబిలు పఠనాలు ప్రారంభించాలన్న మన ప్రయత్నాలను నీరుకారుస్తుంది. కొందరు నిష్ఫలమైన ప్రాంతం అని భావిస్తున్న ప్రాంతంలో పయినీరుగా సేవ చేస్తున్న ఇవెట్, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అలాంటి ప్రతికూల దృక్పథం లేని సాక్షులు గృహ బైబిలు పఠనాలు ప్రారంభించగల్గినట్లు గమనించింది. ఇవెట్ మరింత అనుకూల దృక్పథాన్ని ఏర్పరచుకున్న తర్వాత, బైబిలు పఠనాల కోసం అడిగే ప్రజలను తాను కూడా కనుగొనగల్గింది.
10. బైబిలు బోధకులుగా మన ప్రాథమిక పాత్ర ఏమిటి?
10 ఆసక్తిగల వారితో బైబిలు పఠనాలు నిర్వహించడానికి కొందరు క్రైస్తవులు సంకోచిస్తారు, ఎందుకంటే తాము పఠనాన్ని నిర్వహించగలమని వారు భావించరు. నిజమే మనకందరికీ సామర్థ్యం వివిధ స్థాయిలలో ఉంటుంది. అయితే మనం దేవుని వాక్య బోధకులుగా విజయవంతంగా ఉండటానికి గొప్ప నిపుణులమై ఉండవలసిన అవసరం లేదు. బైబిలులోని స్వచ్ఛమైన సందేశం శక్తివంతమైనది, గొఱ్ఱెలవంటివారు నిజమైన గొఱ్ఱెలకాపరి స్వరాన్ని విన్నప్పుడు దాన్ని గుర్తిస్తారని యేసు చెప్పాడు. కాబట్టి మంచి గొఱ్ఱెలకాపరియైన యేసు సందేశాన్ని సాధ్యమైనంత స్పష్టంగా మనం వినిపింపజేయడమే మన పని.—యోహాను 10:4, 14.
11. బైబిలు విద్యార్థికి సహాయం చేయడంలో మీరు మరింత ప్రభావవంతంగా ఎలా ఉండగలరు?
11 యేసు సందేశాన్ని మీరు మరింత ప్రభావవంతంగా ఎలా అందజేయగలరు? పరిశీలిస్తున్న అంశాన్ని గురించి బైబిలు ఏమి చెప్తుందో ముందు మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు ఒక విషయాన్ని ఇతరులకు బోధించే ముందు, మొదట మీరు దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అంతేగాక, పఠన సమయంలో గౌరవప్రదమైన వాతావరణాన్ని ఏర్పరచడమే గాక, స్నేహపూర్వకంగా కూడా ఉండండి. చిన్నపిల్లలతో సహా, విద్యార్థులెవరైనా సరే ప్రశాంతంగా ఉన్నప్పుడూ, బోధకుడు తమ పట్ల సామెతలు 16:21.
గౌరవాన్నీ దయనూ కనపర్చినప్పుడూ చక్కగా నేర్చుకుంటారు.—12. మీరు బోధిస్తున్నది మీ విద్యార్థికి అర్థమౌతోందని మీరెలా నిశ్చయపర్చుకోవచ్చు?
12 మీ విద్యార్థి కంఠస్థం చేసి చెప్పేలా అతనికి కేవలం వాస్తవాలను అందజేస్తే సరిపోతుందని ఒక బోధకునిగా మీరు అనుకోరు. అతడు తాను నేర్చుకుంటున్నదాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఒక విద్యార్థి విద్యా, జీవితానుభవం, బైబిలుతో అతనికున్న పరిచయం మీరు చెప్తున్నదాన్ని గ్రహించే అతని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోవచ్చు, ‘పఠన సమాచారంలో ఇవ్వబడిన లేఖనాల ప్రాముఖ్యతను అతడు గ్రహిస్తున్నాడా?’ కేవలం అవును, కాదు అని మాత్రం సమాధానం చెబితే సరిపోని, సమాధానాన్ని వివరించవలసిన అవసరమున్న ప్రశ్నలను వేయడం ద్వారా ఆయన మనస్సులో ఉన్న విషయాన్ని రాబట్టవచ్చు. (లూకా 9:18-20) మరో వైపున, కొంతమంది విద్యార్థులు బోధకుడ్ని ప్రశ్నలడగటానికి సంకోచిస్తారు. అలా వారు తమకు బోధించబడుతున్న విషయాన్ని పూర్తిగా గ్రహించకుండానే ఉండిపోతారు. ప్రశ్నలడగమనీ, ఏదైనా ఒక విషయం తనకు అర్థం కానప్పుడు చెప్పమనీ విద్యార్థిని ప్రోత్సహించండి.—మార్కు 4:10; 9:32, 34.
13. మీ బైబిలు విద్యార్థి బైబిలు బోధకుడయ్యేందుకు మీరెలా సహాయం చేయవచ్చు?
13 బైబిలు పఠనం నిర్వహించడంలోని ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, విద్యార్థి తాను కూడా ఒక బోధకుడయ్యేందుకు సహాయం చేయడమే. (గలతీయులు 6:6) దాని కోసం, మీ పఠన పునఃసమీక్షగా, ఏదైనా ఒక విషయాన్ని, మొదటిసారి వింటున్న వ్యక్తికి వివరిస్తున్నట్లుగా సులభమైన మాటల్లో చెప్పమని మీరు అడగవచ్చు. తర్వాత, అతడు పరిచర్యలో పాల్గొనేందుకు అర్హుడైనప్పుడు, అతడు మీతో కలిసి పరిచర్యలో పాల్గొనేందుకు మీరు అతడ్ని ఆహ్వానించవచ్చు. అతడు మీతో కలిసి పనిచేసేందుకు మరింత సుముఖంగా ఉండవచ్చు, అతడు తానే స్వయంగా పరిచర్యలో పాల్గొనటానికి సిద్ధమయ్యే వరకు, మీతో కలిసి పనిచేయడం ద్వారా లభించే అనుభవం ఆయన నమ్మకాన్ని పెంచుతుంది.
యెహోవా స్నేహితుడయ్యేందుకు విద్యార్థికి సహాయం చేయండి
14. బోధకునిగా మీ ప్రాథమిక లక్ష్యమేమిటి, దాన్ని సాధించడంలో విజయం పొందటానికి ఏది దోహదపడుతుంది?
14 ప్రతి క్రైస్తవ బోధకుని ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే, విద్యార్థి యెహోవా స్నేహాన్ని సంపాదించుకునేందుకు సహాయం చేయడమే. మీరు దీన్ని కేవలం మీ మాటల ద్వారానే కాదు మీ మాదిరి ద్వారా కూడా సాధించగల్గుతారు. మీ మాదిరి ద్వారా బోధించడం విద్యార్థుల హృదయాలపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. చర్యలు నిజంగా మాటల కన్నా ప్రభావవంతంగా ఉండగలవు, ప్రాముఖ్యంగా విద్యార్థిలో నైతిక లక్షణాలను పెంపొందింపజేసే విషయంలోనూ, వారిలో ఆసక్తిని రేకెత్తించే విషయంలోనూ అది నిజం. మీ మాటలూ చర్యలూ యెహోవాతో మీకున్న మంచి సంబంధం నుండి ఉత్పన్నమౌతున్నాయని అతడు గమనించినప్పుడు, అతడు కూడా యెహోవాతో అలాంటి సంబంధాన్నే ఏర్పరచుకోవటానికి మరింతగా పురికొల్పబడవచ్చు.
15. (ఎ) యెహోవా సేవ చేయడం విషయంలో విద్యార్థి సరైన ప్రేరణను వృద్ధి చేసుకోవటం ఎందుకు ప్రాముఖ్యం? (బి) ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధిస్తూనే ఉండడానికి మీరు మీ విద్యార్థికి ఎలా సహాయం చేయవచ్చు?
15 మీ విద్యార్థి కేవలం అర్మగిద్దోనులో నాశనం కాకుండా ఉండేందుకు మాత్రమే కాదుగానీ అతడు యెహోవాను ప్రేమిస్తున్నందుకు ఆయన సేవ చేయాలని మీరు కోరుకుంటారు. అతడలాంటి స్వచ్ఛమైన దృక్పథాన్ని వృద్ధి చేసుకునేందుకు సహాయం చేయడం ద్వారా, విశ్వాస పరీక్షలను తట్టుకుని నిలిచే అగ్ని నిరోధక వస్తువులతో మీరు నిర్మిస్తారు. (1 కొరింథీయులు 3:10-15) మిమ్మల్ని గానీ మరో వ్యక్తిని గానీ అనుకరించాలన్న కోరిక అతనికి అమితంగా ఉంటే అది సరైన దృక్పథం కాదు, అలాంటి దృక్పథం అతనికుంటే క్రైస్తవ వ్యతిరేక ప్రభావాల్ని ఎదిరించే శక్తిగానీ సరైనది చేసే ధైర్యంగానీ అతనికి ఏర్పడవు. మీరు ఎప్పటికీ అతని బోధకునిగానే ఉండరని గుర్తుంచుకోండి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవడం ద్వారా, దాని గురించి ధ్యానించడం ద్వారా యెహోవాకు సన్నిహితమవ్వమని మీకు అవకాశం ఉన్నప్పుడే అతడిని ప్రోత్సహించండి. అలాగైతేనే అతనితో బైబిలు పఠనం ముగిసిన చాలా కాలం తర్వాత కూడా బైబిలు నుండి, బైబిలు ఆధారిత ప్రచురణల నుండి “హితవాక్యప్రమాణమును” గైకొనడంలో కొనసాగుతాడు.—2 తిమోతి 1:13.
16. హృదయాంతరాళం నుండి ప్రార్థించడానికి మీరు మీ విద్యార్థికి ఎలా నేర్పించవచ్చు?
16 హృదయాంతరాళంలో నుండి ప్రార్థించడాన్ని నేర్పడం ద్వారా కూడా మీ విద్యార్థి యెహోవాకు సన్నిహితమయ్యేందుకు మీరు సహాయం చేయవచ్చు. అది మీరెలా చేయవచ్చు? బహుశా మీరు యేసు నేర్పిన మాదిరి ప్రార్థన వైపుకు అలాగే కీర్తనల్లో ఉన్నటువంటి, బైబిలులో వ్రాయబడివున్న అనేకానేక హృదయపూర్వక ప్రార్థనల వైపుకు అతని అవధానాన్ని మళ్లించవచ్చు. (కీర్తనలు 17, 86, 143; మత్తయి 6:9, 10) అంతేగాక, పఠనాన్ని ప్రారంభించటానికీ ముగించటానికీ ముందు మీరు ప్రార్థించడాన్ని మీ విద్యార్థి విన్నప్పుడు యెహోవాపట్ల మీకున్న భావాలను అతడు గమనిస్తాడు. కాబట్టి, మీ ప్రార్థనలు ఎల్లప్పుడూ యథార్థతను, నిష్కల్మషాన్ని అలాగే అధ్యాత్మిక భావోద్రేక సమతుల్యాన్ని ప్రతిబింబించాలి.
మీ పిల్లల్ని రక్షించడానికి పనిచేయడం
17. తమ పిల్లలు రక్షణ మార్గంలోనే ఉండడానికి తల్లిదండ్రులు వారికెలా సహాయం చేయగలరు?
17 మనం రక్షించాలని కోరుకునే వారిలో తప్పకుండా మన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో చాలామంది యథార్థవంతులు, “విశ్వాసమందు స్థిరులై” ఉన్నారు. అయితే ఇంకా ఇతరుల విషయానికి వస్తే, సత్యం వాళ్ల హృదయాల్లో లోతుగా పాతుకుని ఉండకపోవచ్చు. (1 పేతురు 5:9; ఎఫెసీయులు 3:15-18; కొలొస్సయులు 2:6, 7) ఈ యౌవనస్థుల్లో చాలామంది పెద్దవారౌతుండగా క్రైస్తవ మార్గాన్ని విడిచిపెడతారు. మీరు తల్లిదండ్రులైతే, అలాంటి పర్యవసానాలు ఏర్పడకుండా మీరేమి చేయవచ్చు? మొదటిగా, మీరు మంచి కుటుంబ వాతావరణాన్ని సృష్టించటానికి కృషి చేయవచ్చు. మంచి కుటుంబ జీవనం అధికారాన్ని గురించి ఆరోగ్యకరమైన దృక్పథం కల్గివుండడానికీ, సరైన విలువపట్ల మెప్పు కల్గివుండడానికీ, ఇతరులతో మంచి సంబంధం కల్గివుండడానికీ పునాది వేస్తుంది. (హెబ్రీయులు 12:9) అలా కుటుంబంలో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి, అలాంటి సంబంధాలు, పిల్లవాడికి యెహోవాతో ఉన్న సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. (కీర్తన 22:10) వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించగల సమయాన్ని తల్లిదండ్రులు త్యాగం చేయవలసి వచ్చినప్పటికీ, బలమైన కుటుంబాలు ఒక్కటిగా కలిసి పనులు చేసుకుంటాయి. ఈ విధంగా మీరు మీ మాదిరి ద్వారా, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవటాన్ని మీ పిల్లలకు నేర్పిస్తారు. తల్లిదండ్రులారా, మీ నుండి మీ పిల్లలకు కావలసినది వస్తు సంపదలు కాదు గానీ, మీరే అంటే మీ సమయం, మీ శక్తి, మీ ప్రేమ. మీరు మీ పిల్లలకివిస్తున్నారా?
18. తమ పిల్లలు ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు పొందటానికి తల్లిదండ్రులు సహాయం చేయాలి?
18 తమ పిల్లలు కూడా తమలాగే క్రైస్తవులైపోతారని క్రైస్తవ
తల్లిదండ్రులు ఎన్నడూ అనుకోకూడదు. సంఘ పెద్ద, ఐదుగురు పిల్లల తండ్రి అయిన డానియెల్ ఇలా పేర్కొన్నాడు: “తమ పిల్లలు ఉద్దేశరహితంగా పాఠశాల నుండి ఇతర స్థలాల నుండి తెచ్చుకునే అనుమానాలను తొలగించటానికి తల్లిదండ్రులు సమయం తీసుకోవాలి. ‘మనం నిజంగా అంత్యకాలంలో జీవిస్తున్నామా? నిజంగా కేవలం ఒకే సత్యమైన మతం ఉందా? మంచి వ్యక్తిగానే కనిపించే ఒక తోటి విద్యార్థిది ఎందుకు మంచి సహవాసం కాదు? వివాహానికి ముందే లైంగిక సంబంధం కల్గివుండడం ఎందుకు తప్పు?’ వంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు వాళ్లు సహనంతో తమ పిల్లలకు సహాయం చేయాలి.” తల్లిదండ్రులారా, మీ ప్రయత్నాలను యెహోవా తప్పక ఆశీర్వదిస్తాడని దృఢనిశ్చయం కల్గివుండండి, ఎందుకంటే ఆయన కూడా మీ పిల్లల సంక్షేమంలో ఆసక్తి కల్గివున్నాడు.19. తల్లిదండ్రులే తమ పిల్లలతో పఠించడం ఎందుకు మంచిది?
19 తమ స్వంత పిల్లలతో పఠించవలసిన విషయానికి వచ్చేసరికి కొంతమంది తల్లిదండ్రులు తమకా సామర్థ్యం లేనట్లు భావించవచ్చు. అయితే, మీరలా భావించనవసరం లేదు, ఎందుకంటే మీ పిల్లలకు బోధించడానికి మీకంటే మరెవరూ తగిన స్థానంలో లేరు. (ఎఫెసీయులు 6:4) మీ స్వంత పిల్లలతో పఠించడం, వాళ్ల హృదయాల్లోనూ మనస్సుల్లోనూ ఏముందో మీరే స్వయంగా తెలుసుకోవటానికి అవకాశాన్నిస్తుంది. వాళ్లు వ్యక్తపర్చే వ్యక్తీకరణలు హృదయపూర్వకమైనవా లేక మొక్కుబడిగా చెప్తున్నవా? వాళ్లు తాము నేర్చుకుంటున్నదాన్ని నిజంగా నమ్ముతున్నారా? యెహోవా వారికి వాస్తవమై ఉన్నాడా? మీరు మీ పిల్లలతో వ్యక్తిగతంగా పఠిస్తేనే వీటికీ మరితర ప్రాముఖ్యమైన ప్రశ్నలకూ సమాధానాలను కనుగొనగల్గుతారు.—2 తిమోతి 1:3-5.
20. తల్లిదండ్రులు తమ కుటుంబ పఠనాన్ని ఆనందకరమైనదిగా, ప్రయోజనకరమైనదిగా ఎలా చేయవచ్చు?
20 మీరు ఒకసారి మీ కుటుంబ పఠన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత దాన్నెలా కొనసాగించవచ్చు? యౌవనులైన కుమారుడు, కుమార్తె ఉన్న, ఒక సంఘ పెద్దయైన జోసెఫ్ ఇలా చెప్తున్నాడు: “అన్ని బైబిలు పఠనాల్లాగే, కుటుంబ పఠనం కూడా ఆనందించదగ్గదై ఉండాలి, అందరూ దాని కోసం ఎదురు చూసేదై ఉండాలి. మా కుటుంబంలో కూడా దాన్ని సాధించేందుకు, సమయం విషయంలో మరీ కఠినంగా ఉండలేము. మా పఠనం ఒక గంట పాటు సాగుతుంది, కానీ ఒక్కోసారి మాకు పది నిమిషాలే ఉన్నా మేము పఠనం చేసుకుంటాము. మా పఠనాన్ని ఆ వారమంతటిలోనూ పిల్లలకు ఉన్నతాంశంగా చేసే ఒక విషయం ఏమిటంటే, మేము నా బైబిలు కథల పుస్తకం నుండి సన్నివేశాలను నటిస్తాము. * ఎన్ని పేరాలు చదువుతున్నామనే దానికన్నా చదివినదాన్ని ఎంత మేరకు గ్రహించగల్గుతున్నామూ, అది ఎంత మేరకు ప్రభావం చూపిస్తోంది అన్నవే చాలా ప్రాముఖ్యమైన విషయాలు.”
21. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడు ఉపదేశించవచ్చు?
21 అయితే మీ పిల్లలకు బోధించడమన్నది కేవలం పఠన సమయాలకే పరిమితం కాదు. (ద్వితీయోపదేశకాండము 6:5-7) శీర్షికారంభంలో ప్రస్తావించబడిన థాయ్‌లాండ్‌లోని సాక్షి ఇలా తెలియజేస్తున్నాడు: “మా సంఘానికి కేటాయించబడిన ప్రాంతంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రకటించడానికి కూడా నాన్నగారు నన్ను సైకిలు మీద ఎలా తీసుకువెళ్లేవారో నాకింకా స్పష్టంగా జ్ఞాపకముంది. పూర్తికాల సేవను ప్రారంభించాలని మేము నిర్ణయించుకోవడానికి, మా తల్లిదండ్రుల చక్కని మాదిరి, అన్ని పరిస్థితుల్లోనూ మాకు వారు చేసిన బోధ కచ్చితంగా సహాయం చేశాయి. వాళ్లు నేర్పించిన పాఠాలు మనస్సులో ముద్రపడిపోయాయి. నేనిప్పటికీ మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్నాను!”
22. మీరు ‘మిమ్మల్ని గురించి, మీ బోధ వినేవారి గురించి జాగ్రత్తగా ఉండటం’ యొక్క ఫలితం ఏమై ఉంటుంది?
22 త్వరలోనే ఒక రోజు, సరిగ్గా సరైన సమయంలో, ఈ విధానంపై దేవుని తీర్పును తీర్చడానికి యేసు వస్తాడు. ఆ గొప్ప కార్యక్రమం విశ్వ చరిత్రలో నిక్షిప్తమైపోతుంది, కానీ యెహోవా నమ్మకమైన సేవకులు మాత్రం నిత్య రక్షణను దృష్టిలో ఉంచుకుని ఆయన సేవ చేస్తూనే ఉంటారు. మీరు మీ పిల్లలతోపాటు, బైబిలు విద్యార్థులతోపాటు వారి మధ్య ఉండాలని కోరుకుంటున్నారా? అయితే గుర్తుంచుకోండి: “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.”—1 తిమోతి 4:16.
[అధస్సూచీలు]
^ పేరా 20 వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించింది.
మీరు వివరించగలరా?
• దేవుని తీర్పు యొక్క కచ్చితమైన సమయం మనకు తెలియదు గనుక మన దృక్పథం ఏమై ఉండాలి?
• మనం ఏ యే విధాలుగా ‘మన బోధ గురించి జాగ్రత్తగా’ ఉండగలం?
• యెహోవా స్నేహితుడయ్యేందుకు మీరు మీ విద్యార్థికి ఎలా సహాయం చేయవచ్చు?
• తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించడానికి సమయం తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
[అధ్యయన ప్రశ్నలు]
[అధ్యయన ప్రశ్నలు]
[15వ పేజీలోని చిత్రం]
గౌరవప్రదమైన వాతావరణాన్ని ఏర్పరచడమే గాక, స్నేహపూర్వకంగా కూడా ఉండటం నేర్చుకోవడానికి దోహదపడుతుంది
[18వ పేజీలోని చిత్రం]
సొలొమోను ఇద్దరు వేశ్యలకు తీర్పు తీర్చడం వంటి బైబిలు కథలను నటించడం కుటుంబ పఠనాన్ని ఆనందకరమైనదిగా చేస్తుంది