కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ “రక్షణనిరీక్షణ”ను ఉజ్వలంగా ఉంచుకోండి!

మీ “రక్షణనిరీక్షణ”ను ఉజ్వలంగా ఉంచుకోండి!

మీ “రక్షణనిరీక్షణ”ను ఉజ్వలంగా ఉంచుకోండి!

“రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.”—1 థెస్సలొనీకయులు 5:8.

1. సహనంతో ఉండడానికి “రక్షణనిరీక్షణ” ఎలా సహాయం చేస్తుంది?

రక్షించబడతానన్న నిరీక్షణ, ఒక వ్యక్తి ఎంత ఘోరమైన పరిస్థితుల్నైనా తట్టుకోవటానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకు, ఓడ బద్దలై ఒక చిన్న పడవలో ప్రయాణిస్తున్న వ్యక్తి, తనకు సహాయం అందుబాటులోనే ఉందని తెలుసుకుంటే ఎంతెక్కువ సమయమైనా సరే అలాంటి స్థితిలో సహనంతో ఉండగల్గుతాడు. అలాగే ‘యెహోవా రక్షణ కలుగజేస్తాడన్న’ నిరీక్షణ, విశ్వాసంగల స్త్రీ పురుషులను వారి కష్టసమయాల్లో వేల సంవత్సరాలుగా బలపర్చింది, ఈ నిరీక్షణ ఎన్నడూ నిరాశకు దారితీయలేదు. (నిర్గమకాండము 14:13; కీర్తన 3:8; రోమీయులు 5:5; 9:33) అపొస్తలుడైన పౌలు “రక్షణనిరీక్షణ”ను క్రైస్తవ ఆధ్యాత్మిక కవచంలోని “శిరస్త్రాణము”తో పోల్చాడు. (1 థెస్సలొనీకయులు 5:8; ఎఫెసీయులు 6:17) అవును, దేవుడు మనల్ని రక్షిస్తాడన్న నమ్మకం మన ఆలోచనా విధానాన్ని కాపాడి, విపత్తు, వ్యతిరేకత, శోధనల్లో మనం జాగరూకులమై ఉండటానికి సహాయం చేస్తుంది.

2. “రక్షణనిరీక్షణ” ఏ యే విధాలుగా సత్యారాధనకు ప్రాథమికమై ఉంది?

2 మొదటి శతాబ్దపు క్రైస్తవుల చుట్టూ ఉన్న ప్రపంచమైన “అన్యమత లోకంలో భవిష్యత్తును గురించిన నిరీక్షణకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు” అని ది ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా పేర్కొంటుంది. (ఎఫెసీయులు 2:12; 1 థెస్సలొనీకయులు 4:13) అయినప్పటికీ, “రక్షణనిరీక్షణ” సత్యారాధనకు మూలాంశంగా ఉంది. అదెలా? మొదటిగా, యెహోవా సేవకుల రక్షణ, ఆయన స్వంత నామముతో ముడిపెట్టబడి ఉంది. కీర్తనల గ్రంథకర్తయైన ఆసాపు ఇలా ప్రార్థించాడు: “మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయము చేయుము, . . . మమ్మును రక్షింపుము.” (కీర్తన 79:9; యెహెజ్కేలు 20:9) యెహోవాతో మంచి సంబంధం కల్గివుండాలంటే, ఆయన వాగ్దానం చేసిన ఆశీర్వాదాల్లో నమ్మకం కల్గివుండటం ఎంతో ప్రాముఖ్యం. పౌలు దాన్నిలా చెప్పాడు: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” (హెబ్రీయులు 11:6) అంతేగాక యేసు భూమి మీదికి రావడానికిగల ఒక ముఖ్య కారణం, పశ్చాత్తాపపడేవారిని రక్షించాలన్నదేనని పౌలు వివరించాడు. ఆయనిలా ప్రకటించాడు: “పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది.” (1 తిమోతి 1:15) రక్షణ, ‘మన విశ్వాసానికి ఫలము’ అని అపొస్తలుడైన పేతురు పేర్కొన్నాడు. (1 పేతురు 1:8) కాబట్టి రక్షణ కోసం నిరీక్షించడం సరైనదని స్పష్టమౌతుంది. కానీ, నిజానికి రక్షణ అంటే ఏమిటి? దాన్ని పొందడానికి ఏమవసరం?

రక్షణ అంటే ఏమిటి?

3. ప్రాచీన కాలాలకు చెందిన యెహోవా సేవకులు ఏ విధమైన రక్షణను అనుభవించారు?

3 హెబ్రీ లేఖనాల్లో, సాధారణంగా “రక్షణ” అంటే, అణచివేత నుండి లేక హింసాత్మకమైన అకాల మరణం నుండి తప్పించుకోవడం లేక విడుదల అని భావం. ఉదాహరణకు, దావీదు యెహోవాను “నా రక్షకుడు” అని పిలుస్తూ ఆయన గురించి ఇలా అన్నాడు: “నా దుర్గము . . . నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱ పెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను.” (2 సమూయేలు 22:2-4) తన నమ్మకమైన సేవకులు సహాయం కోసం మొరపెట్టినప్పుడు యెహోవా వింటాడని దావీదుకు తెలుసు.—కీర్తన 31:22, 23; 145:19.

4. క్రైస్తవపూర్వపు యెహోవా సేవకులు భవిష్యద్‌ జీవితాన్ని గురించి ఎలాంటి నిరీక్షణను కల్గివున్నారు?

4 క్రీస్తుకు పూర్వమున్న యెహోవా సేవకులు కూడా భవిష్యద్‌ జీవితాన్ని గురించి నిరీక్షించారు. (యోబు 14:13-15; యెషయా 25:8; దానియేలు 12:13) నిజానికి, హెబ్రీలేఖనాల్లో కనుగొనబడే రక్షణను గూర్చిన అనేక వాగ్దానాలు అత్యంత గొప్ప రక్షణకు అంటే నిత్యజీవానికి ప్రవచనార్థకంగా ఉన్నాయి. (యెషయా 49:6, 8; అపొస్తలుల కార్యములు 13:47; 2 కొరింథీయులు 6:2) యేసు కాలంలో, చాలామంది యూదులు నిత్యజీవం కోసం నిరీక్షించారు, కానీ తమ నిరీక్షణ సఫలమవ్వటానికి యేసు కీలకమని వారు అంగీకరించలేదు. యేసు తన కాలంలోని మతనాయకులకు ఇలా చెప్పాడు: “లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.”—యోహాను 5:39.

5. అసలైన రక్షణ అంటే ఏమిటి?

5 యేసు ద్వారా దేవుడు రక్షణ యొక్క పూర్తి భావాన్ని బయల్పరిచాడు. దానిలో, పాపపు ఆధిపత్యం నుండీ, అబద్ధమత సంకెళ్ల నుండీ, సాతాను ఆధీనంలో ఉన్న లోకం నుండీ, మానవ భయం నుండీ, చివరికి మరణ భయం నుండి కూడా విడుదల ఇమిడివుంది. (యోహాను 17:16; రోమీయులు 8:2; కొలొస్సయులు 1:13; ప్రకటన 18:2, 4) దేవుని నమ్మకమైన సేవకులకు, ఆయన కలుగజేసే అసలైన రక్షణ అంటే కేవలం అణచివేత, దుఃఖం నుండి విడుదల మాత్రమేగాక, నిత్యజీవం పొందే అవకాశమని కూడా భావం. (యోహాను 6:40; 17:3) ఒక “చిన్న మంద”కు రక్షణ అంటే దాని భావం, రాజ్య పరిపాలనలో క్రీస్తుతోపాటు భాగం వహించేందుకు పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడటమని యేసు బోధించాడు. (లూకా 12:32) మిగతా మానవజాతి అంతటికీ రక్షణ అంటే పరిపూర్ణ జీవితాన్ని తిరిగి పొందడమనీ, ఆదాము హవ్వలు పాపం చేయడానికి ముందు ఏదెను తోటలో దేవునితో వారు కల్గివుండిన సంబంధాన్ని తాము మళ్లీ ఏర్పరచుకోవడమనీ దాని భావం. (అపొస్తలుల కార్యములు 3:21; ఎఫెసీయులు 1:10) అలాంటి పరదైసు పరిస్థితుల్లో మానవజాతి నిరంతరం జీవించాలన్నది మానవజాతి పట్ల దేవునికున్న ఆది సంకల్పం. (ఆదికాండము 1:28; మార్కు 10:30) అయితే, అలాంటి పరిస్థితులను తిరిగి నెలకొల్పటం ఎలా సాధ్యం?

రక్షణకు ఆధారం—విమోచన క్రయధనం

6, 7. మన రక్షణలో యేసు ఏ పాత్రను కల్గివున్నాడు?

6 నిత్య రక్షణ అన్నది కేవలం క్రీస్తు విమోచన క్రయధన బలి ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకని? ఎందుకంటే, ఆదాము పాపం చేసినప్పుడు ఆయన తననూ, తన భవిష్యద్‌ సంతానాన్నీ—ఇందులో మనమూ ఉన్నాము—పాపానికి ‘అమ్మివేసి,’ తద్వారా మానవజాతికి ఏ నిరీక్షణా లేకుండా చేశాడనీ, అయితే మానవజాతికి ఏదైనా ఒక తగిన నిరీక్షణ ఉండాలంటే దానికి విమోచన క్రయధనం అవసరమనీ బైబిలు వివరిస్తుంది. (రోమీయులు 5:14, 15; 7:14) దేవుడు మానవజాతి అంతటి కోసం విమోచనా క్రయధనాన్ని ఏర్పాటు చేస్తాడన్న విషయానికి, మోషే ధర్మశాస్త్రం క్రింద అర్పించబడిన జంతు బలులు ముంగుర్తుగా ఉన్నాయి. (హెబ్రీయులు 10:1-10; 1 యోహాను 2:2) యేసు అర్పించిన బలే ఆ ప్రవచనాత్మక సూచనల నెరవేర్పు. యేసు జననానికి ముందు, “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును” అని యెహోవా దూత ప్రకటించాడు.—మత్తయి 1:21; హెబ్రీయులు 2:10.

7 యేసు కన్య మరియకు అద్భుతరీతిగా జన్మించాడు, అంతేగాక దేవుని కుమారునిగా ఆయన ఆదాము నుండి మరణాన్ని వారసత్వంగా పొందలేదు. ఈ వాస్తవమూ, అలాగే ఆయన చూపించిన సంపూర్ణ యథార్థతా, మానవజాతిని పాప మరణాల నుండి తిరిగి కొనడానికి అవసరమైన విలువను ఆయన జీవానికిచ్చింది. (యోహాను 8:36; 1 కొరింథీయులు 15:22) ఇతర మానవుల్లా, యేసు పాపం మూలంగా మరణించవలసిన అవసరం లేదు. ఆయన “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు” భూమిమీదికి ఉద్దేశపూర్వకంగానే వచ్చాడు. (మత్తయి 20:28) యేసు అలా చేశాడు గనుకనే, ఆయన ఇప్పుడు పునరుత్థానం చేయబడి సింహాసనాసీనుడై, దేవుడు కోరేవాటికి అనుగుణంగా జీవించేవారందరికీ రక్షణను దయచేసే స్థానంలో ఉన్నాడు.—ప్రకటన 12:10.

రక్షణ పొందటానికి ఏమి అవసరం?

8, 9. (ఎ) రక్షణ గురించి ప్రశ్నించిన ధనికుడూ యౌవనస్థుడూ అయిన అధికారికి యేసు ఎలా సమాధానమిచ్చాడు? (బి) తన శిష్యులకు బోధించడానికి యేసు ఈ సందర్భాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు?

8 ఒకప్పుడు, ధనికుడూ యౌవనస్థుడూ అయిన ఒక ఇశ్రాయేలు అధికారి, ‘నిత్యజీవానికి వారసుడనయ్యేందుకు నేనేమి చేయాలి?’ అని యేసును అడిగాడు. (మార్కు 10:17) ఆయన వేసిన ప్రశ్న ఆ కాలంలో ప్రబలంగా ఉన్న యూదుల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించి ఉండవచ్చు, అదేమిటంటే మనం కొన్ని మంచి పనులు చేయాలని దేవుడు కోరుతున్నాడనీ, అలాంటి పనులు తగినన్ని చేస్తే ఎవరైనా దేవుని నుండి రక్షణ సంపాదించవచ్చుననీ భావించే ఆలోచనా విధానమే. కానీ అలాంటి నామకార్థ భక్తి, స్వార్థపూరిత లక్ష్యాల నుండి ఉత్పన్నమౌతుంది. అలాంటి మంచి పనులు కచ్చితమైన రక్షణనిరీక్షణను ఇవ్వలేకపోయాయి, ఎందుకంటే ఏ అపరిపూర్ణ మానవుడూ నిజంగా దేవుని ప్రమాణాలకు సరితూగలేడు.

9 ఆ వ్యక్తి వేసిన ప్రశ్నకు సమాధానంగా, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలని యేసు ఆయనకు గుర్తుచేశాడంతే. అయితే యౌవనస్థుడైన ఆ అధికారి తాను బాల్యం నుండే అవన్నీ కచ్చితంగా పాటిస్తున్నానని యేసుకు చెప్పాడు. ఆయనిచ్చిన సమాధానం యేసుకు ఆయనపట్ల ప్రేమ కల్గేలా చేసింది. అప్పుడు యేసు ఆయనతో, “నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని” అన్నాడు. అయితే ఆ యౌవనస్థుడు “మిగుల ఆస్తిగలవాడు గనుక” వ్యసనపడుతూ వెళ్లిపోయాడు. ఈ లోకసంబంధమైన వస్తుసంపదపై ఎక్కువ మక్కువను పెంచుకోవడం రక్షణ పొందడానికి ఆటంకం కాగలదని యేసు ఆ తర్వాత తన శిష్యులకు నొక్కి చెప్పాడు. తమ స్వంత ప్రయత్నాలతో ఎవరూ రక్షణ పొందలేరని కూడా ఆయన చెప్పాడు. అయితే, “ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే” అని యేసు వారికి అభయమిచ్చాడు. (మార్కు 10:18-27; లూకా 18:18-23) అయితే, రక్షణ ఎలా సాధ్యం?

10. రక్షణ పొందడానికి మనం ఏ షరతులకు లోబడాలి?

10 రక్షణ దేవుడిచ్చే బహుమానమేగానీ దానంతటదే వచ్చేదికాదు. (రోమీయులు 6:23) ఆ బహుమానం పొందడానికి అర్హత సంపాదించుకోవాలంటే ప్రతి వ్యక్తీ కొన్ని ప్రాథమిక షరతులకు లోబడాలి. యేసు ఇలా అన్నాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” అపొస్తలుడైన యోహాను ఇంకా ఇలా జతచేశాడు: “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు.” (యోహాను 3:16, 36) నిత్య రక్షణ పొందాలని నిరీక్షించే ప్రతి వ్యక్తీ తన పట్ల విశ్వాస విధేయతలను కల్గివుండాలని దేవుడు కోరుతున్నాడని స్పష్టమౌతుంది. కనుక, ప్రతి ఒక్కరూ విమోచనా క్రయధనాన్ని అంగీకరించి, యేసు అడుగు జాడల్లో నడవాలని నిర్ణయించుకోవాలి.

11. అపరిపూర్ణుడైన ఒక వ్యక్తి యెహోవా ఆమోదాన్ని ఎలా సంపాదించుకోగలడు?

11 మనం అపరిపూర్ణులం గనుక, విధేయత చూపించడం మనకు స్వతహాగా రాదు, అంతేగాక సంపూర్ణ విధేయత చూపించడం మనకు పూర్తిగా అసాధ్యం. అందుకే మన పాపాలను కప్పడానికి యెహోవా, విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు. అయితే, మనం దేవుని మార్గాలకు అనుగుణ్యంగా నడవడానికి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉండాలి. ధనికుడైన ఆ యౌవన అధికారికి యేసు చెప్పినట్లుగా, మనం దేవుని ఆజ్ఞలను పాటించాలి. అలా చేయటం మనకు దేవుని ఆమోదాన్నే గాక గొప్ప సంతోషాన్ని కూడా తెస్తుంది, ఎందుకంటే “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు;” అవి ‘సత్తువను కలుగజేస్తాయి.’ (1 యోహాను 5:3; సామెతలు 3:1, 8) అయినప్పటికీ, రక్షణ నిరీక్షణను అంటిపెట్టుకుని ఉండడం సులభమేమీ కాదు.

‘విశ్వాసం నిమిత్తం పోరాడండి’

12. ఒక క్రైస్తవుడు అనైతికమైన శోధనలను ఎదిరించడానికి రక్షణనిరీక్షణ ఆయనను ఎలా బలపరుస్తుంది?

12 “మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి” తొలి క్రైస్తవులకు వ్రాయాలని శిష్యుడైన యూదా అనుకున్నాడు. అయితే లోకమంతటా ప్రబలి ఉన్న అవినీతికరమైన వాతావరణం, ‘విశ్వాసం నిమిత్తం పోరాడమని’ తన సహోదరులకు ఆయన ఉపదేశించేలా చేసింది. అవును రక్షణ పొందాలంటే, మనం విశ్వాసం కల్గివుండి నిజమైన క్రైస్తవ విశ్వాసాన్ని అంటిపెట్టుకుని, అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు విధేయత చూపించడం మాత్రమే సరిపోదు. యెహోవా పట్ల మనకున్న భక్తి, శోధనలనూ అవినీతికరమైన ప్రభావాలనూ ఎదిరించేందుకు మనకు సహాయం చేసేంత బలంగా ఉండాలి. అయితే, మొదటి శతాబ్దపు సంఘ మానసిక నైతిక స్థితిని చూస్తే, మితిమీరిన లైంగిక విచ్చలవిడితనం, అధికారంపట్ల గౌరవం లేకపోవడం, విభేదాలు, అనుమానాలు సంఘాన్ని కలుషిత పరిచాయి. ఆ సమయంలో అలాంటి దృక్పథాలను ఎదుర్కునేందుకు వారికి సహాయం చేయాలని, “ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని” ఉండడమనే లక్ష్యాన్ని మనస్సులో స్పష్టంగా ఉంచుకోమని యూదా తన తోటి క్రైస్తవులను కోరాడు. (యూదా 3, 4, 8, 19-21) నైతికంగా పరిశుభ్రంగా ఉండాలనే వారి పోరాటంలో, రక్షణ పొందుతామనే నిరీక్షణ వారిని బలపర్చగలదు.

13. దేవుని కృపాబాహుళ్యం యొక్క అసలు ఉద్దేశాన్ని మనం తప్పిపోలేదని ఎలా చూపించగలము?

13 తాను ఎవరికైతే రక్షణను అనుగ్రహిస్తాడో వారు మాదిరికరమైన నైతిక ప్రవర్తన కల్గివుండాలని యెహోవా దేవుడు ఆశిస్తాడు. (1 కొరింథీయులు 6:9, 10) అయితే దేవుని నైతిక ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉండమంటే ఇతరులను విమర్శించేవారిగా తయారవ్వాలని కాదు. మన తోటి మానవుల శాశ్వత భవిష్యత్తును నిర్ణయించవలసింది మనం కాదు. బదులుగా, “తాను నియమించిన మనుష్యునిచేత” అంటే యేసు క్రీస్తు చేత “నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు” అని పౌలు ఏథెన్సులోని గ్రీకువారికి చెప్పినట్లుగా దేవుడు ఆ పనిని చేస్తాడు. (అపొస్తలుల కార్యములు 17:31; యోహాను 5:22, 23) మనం యేసు విమోచనా క్రయధనమందు విశ్వాసంతో జీవిస్తుంటే, రానైయున్న తీర్పు దినాన్ని గురించి మనం భయపడవలసిన అవసరం ఉండదు. (హెబ్రీయులు 10:38, 39) మనమెన్నడూ తప్పుడు ఆలోచనకూ, తప్పుడు ప్రవర్తనకూ లొంగిపోవడం ద్వారా, మనం “పొందిన దేవుని కృపను [విమోచన క్రయధనం ద్వారా ఆయనతో మనం సమాధానపడడాన్ని] వ్యర్థము” చేసుకోకూడదన్నదే ప్రాముఖ్యమైన విషయం. (2 కొరింథీయులు 6:1) అంతేగాక, ఇతరులు రక్షణ పొందేందుకు వారికి సహాయం చేయడం ద్వారా, మనం దేవుడు చూపిన కనికరం యొక్క అసలు ఉద్దేశాన్ని వ్యర్థము చేయలేదని చూపిస్తాము. అయితే, మనం వారికెలా సహాయం చేయగలం?

రక్షణనిరీక్షణను ఇతరులతో పంచుకోవడం

14, 15. రక్షణ సువార్తను ప్రకటించే పనిని యేసు ఎవరికి అప్పగించాడు?

14 యోవేలు ప్రవక్త వ్రాసినదాన్ని ఎత్తి చెప్తూ పౌలు ఇలా వ్రాశాడు: “ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును.” తర్వాత ఆయనింకా ఇలా వ్రాశాడు: “వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” విశ్వాసం దానంతటదే రాదుగానీ, “క్రీస్తును గూర్చిన మాట” “వినుట వలన” విశ్వాసము కలుగుతుందని పౌలు కొన్ని వచనాల తర్వాత తెలియజేస్తున్నాడు.—రోమీయులు 10:13, 14, 17; యోవేలు 2:32.

15 “క్రీస్తును గూర్చిన మాట”ను జనాంగాల వరకు ఎవరు తీసుకువెళ్తారు? యేసు ఆ “వాక్యము”ను గూర్చి, అంటే ఆ మాటను గూర్చి అప్పటికే బోధించబడిన తన శిష్యులకు ఆ పనిని అప్పగించాడు. (మత్తయి 24:14; 28:19, 20; యోహాను 17:20) మనం రాజ్యప్రకటన పనిలోనూ, శిష్యులను చేసే పనిలోనూ పాల్గొంటున్నప్పుడు, “ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి” అని ఈ సారి యెషయా వ్రాసినదాన్ని ఎత్తి చెప్తూ అపొస్తలుడైన పౌలు దేని గురించైతే వ్రాశాడో అదే చేస్తున్నవారమౌతాము. మనం తీసుకువెళ్లే సువార్తను అనేకులు అంగీకరించకపోయినా, యెహోవా దృష్టిలో మాత్రం మన పాదములు “సుందరమైనవి.”—రోమీయులు 10:15; యెషయా 52:7.

16, 17. మన ప్రకటనా పని ఏ రెండు సంకల్పాలను నెరవేరుస్తుంది?

16 ఈ ఆజ్ఞకు విధేయత చూపడం రెండు ముఖ్యమైన సంకల్పాలను నెరవేరుస్తుంది. మొదటిగా, సువార్త ప్రకటించబడటానికి కారణాలేమిటంటే దేవుని నామం మహిమపర్చబడాలి, రక్షణ కావాలనుకునేవారు సహాయం కోసం ఎటు మరలాలో తెలుసుకోవాలి. ఇవ్వబడిన ఆజ్ఞలోని ఈ అంశాన్ని పౌలు అర్థం చేసుకున్నాడు. “నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెనని” ఆయన తెలియజేశాడు. కాబట్టి, క్రీస్తు శిష్యులముగా మనమందరం రక్షణ సందేశాన్ని ప్రజల యొద్దకు తీసుకువెళ్లడంలో భాగం వహించాలి.—అపొస్తలుల కార్యములు 13:47; యెషయా 49:6.

17 రెండవదిగా, సువార్త ప్రకటించబడటం దేవుని నీతియుక్తమైన తీర్పుకు పునాదిని వేస్తుంది. ఆ తీర్పు గురించి యేసు ఇలా చెప్పాడు: “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపర[చును].” తీర్పుతీర్చడం, వేరుచేయడం “తన మహిమతో మనుష్యకుమారుడు” వచ్చినప్పుడు జరిగేదైనప్పటికీ, ప్రకటనా పని నేడు క్రీస్తు ఆధ్యాత్మిక సహోదరులను గుర్తించి, తమ స్వంత రక్షణ కోసం వారికి మద్దతునిస్తూ పనిచేసే అవకాశాన్ని ప్రజలకు ఇస్తుంది.—మత్తయి 25:31-46.

“నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము” కృషిచేయండి

18. మనం “రక్షణనిరీక్షణ”ను ఎలా ఉజ్వలంగా ఉంచుకోగలము?

18 ప్రకటనాపనిలో మనం చురుగ్గా పాల్గొనడం, మన నిరీక్షణను ఉజ్వలంగా ఉంచుకోవటానికి సహాయం చేసే ఒక మాధ్యమం కూడా. పౌలు ఇలా వ్రాశాడు: “మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.” (హెబ్రీయులు 6:11) కాబట్టి మనలో  ప్రతి ఒక్కరం, “మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు” అని గుర్తుంచుకొని, “రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.” (1 థెస్సలొనీకయులు 5:8, 9) పేతురిచ్చిన ఈ ఉద్బోధను కూడా మనం గైకొందాము: “మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, . . . మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.” (1 పేతురు 1:13) అలా చేసేవారందరూ తమ “రక్షణనిరీక్షణ” సంపూర్ణంగా నెరవేరడాన్ని చూస్తారు !

19. తర్వాతి శీర్షికలో మనమేం పరిశీలిస్తాము?

19 ఈ మధ్య కాలంలో, ఈ విధానం కోసం మిగిలివున్న సమయాన్ని గురించి మన దృక్పథం ఏమై ఉండాలి? ఆ సమయాన్ని, మనమూ అలాగే ఇతరులూ రక్షణ పొందటానికి ఎలా ఉపయోగించవచ్చు? మనం ఈ ప్రశ్నల్ని తర్వాతి శీర్షికలో పరిశీలిద్దాము.

మీరు వివరించగలరా?

• మనమెందుకు మన “రక్షణనిరీక్షణ”ను ఉజ్వలంగా ఉంచుకోవాలి?

• రక్షణలో ఏమి ఇమిడివుంది?

• రక్షణ బహుమానాన్ని పొందడానికి మనం ఏమి చేయాలి?

• దేవుని సంకల్పానికి అనుగుణ్యంగా మన ప్రకటనా పని దేనిని నెరవేరుస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రం]

రక్షణ అంటే నాశనం నుండి తప్పించబడటం కంటే ఎక్కువే