పరిపూర్ణతను సాధించాలనే మనస్తత్త్వాన్ని ఎందుకు అధిగమించాలి?
పరిపూర్ణతను సాధించాలనే మనస్తత్త్వాన్ని ఎందుకు అధిగమించాలి?
మీరు ఏ పని చేసినా ఏ లోపమూ లేకుండా పరిపూర్ణంగా చేయడానికి మీ శాయశక్తులా శ్రమిస్తారా? అలాగైతే చాలా మంచిది. అలా చేయడం మీకూ మీతోనున్న వారికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, కొంతమంది తాము చేసే పని పరిపూర్ణంగా ఉండాలన్న అమిత తాపత్రయంతో అహర్నిశలూ తమ శక్తికిమించి శ్రమిస్తారు. ఆ విధంగా వాళ్ళు తమకు తెలియకుండానే పరిపూర్ణతావాదులుగా తయారయ్యారు. పరిపూర్ణతావాదులుగా తయారవ్వడంలో ఏమి ఇమిడి ఉంది?
“పరిపూర్ణతావాదం” అనే పదానికి “ఎంత చిన్న లోపమున్నా, దోషమున్నా, ఏ మాత్రం తక్కువైనా భరించలేని మనస్తత్త్వం” అనే అర్థం ఉంది. ఈ మనస్తత్త్వం గల వ్యక్తులు మీకు కూడా తారసపడే ఉంటారు. వాళ్ళు ఇతరుల నుండి అతిగా కోరడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని, వాతావరణమంతా అసంతృప్తికరంగా, నిరుత్సాహకరంగా మారగలదని మీరు అర్థం చేసుకోగలరు. పరిపూర్ణతావాదం అనే మాటకు, జీవితంలోని అన్ని రంగాల్లోను అమిత స్థాయిని కోరుకోవడం అనే అర్థం కూడా ఉంది. అలా కోరుకోవడం మంచిది కాదని సమతుల్యతగల చాలా మంది ప్రజలు గుర్తిస్తారు. నిజమే, అన్నింటిలోనూ పరిపూర్ణంగా ఉండాలని కోరుకునే మనస్తత్త్వాన్ని అధిగమించవలసిందే. అయితే, ఒక సమస్య ఏమిటంటే, తమది కూడా పరిపూర్ణతను అతిగా కోరుకునే మనస్తత్త్వమేనన్న విషయాన్ని ఎవరికివాళ్ళు గుర్తించడం చాలా కష్టం. అలాంటప్పుడు దాన్ని అధిగమించడం అంత కన్నా కష్టమౌతుంది.
నెల్సన్ అనే వ్యక్తికి ఉద్యోగసంబంధంగా అనేక బాధ్యతలు ఉన్నాయి. వాటికి తోడు పరిష్కరించవలసిన సమస్యలు కూడా ఉన్నాయి. తాను చేయవలసిన పనులను గురించీ తాను పరిష్కరించవలసిన సమస్యలను గురించీ ఆయన ఎల్లప్పుడూ విశ్లేషిస్తుంటారు. కంపెనీ ఉత్పాదనే ఆయనకు ముఖ్యం. నేడు ఉద్యోగ రంగంలో పోటీలు బాగా ఉన్నాయి కనుక ఉద్యోగంలో సఫలీకృతులవ్వాలంటే, లోపాలు లేకుండా పరిపూర్ణంగా చేయడం అవసరమని తను తరచూ అనుకుంటాడు. తన సామర్థ్యాన్ని గురించి అనేకులు మెచ్చుకుంటున్నప్పటికీ, తాను చేసే ఏ పనైనా పరిపూర్ణంగా ఉండాలన్న అమిత తాపత్రయం ఆయనకు ఉండడం వల్ల తలనొప్పి, నిస్సత్తువ వంటి ఆరోగ్య సమస్యలు ఆయనకు వస్తుంటాయి. మీలో కూడా ఆయనకున్నటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయా?
పరిపూర్ణతను సాధించాలనే వైఖరి యౌవనస్థుల్లో కూడా కనిపిస్తుంది. రియో డీ జనైరోలోని రీటా అనే అమ్మాయికి చిన్నప్పటి నుండీ స్కూల్‌కి వెళ్ళడమంటే చాలా ఇష్టం. అందరికన్నా బాగా చదువుకునే విద్యార్థిని అని పేరు సంపాదించుకోవాలన్న కోరిక తనలో ఉన్నా అలా ఉన్నట్లు బయటికి కనిపించకూడదు అని చాలా ప్రయత్నించేది. అయినప్పటికీ తనకు అందరికన్నా ఎక్కువ మార్కులు రాకపోతే చాలా కృంగిపోయేది. “చిన్నప్పటి నుండీ, అనేక పనులను చేయడంతో సతమతమవుతుండేదాన్ని, బాగా నిస్సత్తువగా అనిపించేది. అయితే, నాలాగా అనేక పనులు లేకుండా ఖాళీగా ఉన్న వారితో నన్ను నేను పోల్చుకునేదాన్ని. నాకు ఎల్లప్పుడూ బోలెడన్ని పనులుండేవి కనుక,
విశ్రాంతి తీసుకునేందుకు నాకు సమయమే లేదనిపించేది” అని ఆమె అంటోంది.మారీయ అనే చిన్న అమ్మాయి, తోటి పిల్లలు గీసినంత చక్కగా చిత్రాలను గీయలేకపోతే నిరాశానిస్పృహలకు గురయ్యేది. అంతేకాక, ఆమెకు సంగీతంలో పరిపూర్ణతను సాధించాలనే తాపత్రయం ఉన్నందువల్ల, తాను సంగీతోపకరణాలను వాయించేటప్పుడూ లేదా పాటలు పాడేటప్పుడు అనందించే బదులు విచారంగా ఉండేది, ఆమెను నిస్సత్తువ ఆవరించేది. బ్రెజిల్‌కి చెందిన మరొక అమ్మాయి టాన్యా. తాను వివేచనాపూర్వకంగా ప్రవర్తించాలనీ, పోటీ మనస్తత్వాన్ని నివారించుకోవాలనీ ప్రయత్నించేది. అయితే, తాను ఇంట్లోను, స్కూల్లోను ఎలా ఉండాలనే దానికి నిర్దిష్ట ప్రమాణాలను పెట్టుకునేదనీ, అవి తాను చేరుకోలేనంతటి ఉన్నత ప్రమాణాలు అనీ ఆమె ఒప్పుకుంటుంది. తన పని పరిపూర్ణంగా ఉండకపోతే ప్రజలు తనను అంతగా ఇష్టపడరని ఆమె అనుకుంది. అంతేకాక, ఆమె ఇతరుల నుండి కూడా అతిగా ఎదురు చూసేది. తాను ఎదురుచూసినంతగా వాళ్ళలో కనిపించనప్పుడు ఆమెకు మరింత నిరాశా, విచారమూ కలిగేవి.
తన పనిని చక్కగా చేయగల సామర్థ్యం, చక్కగా చేయాలన్న శ్రద్ధ, తాను చేసిన పనిలో సంతృప్తి అనేవి ప్రాముఖ్యమే. అయితే, చేరుకోలేని లక్ష్యాలను పెట్టుకోవడం మూలంగా, ప్రతికూలమైన భావాలు కలగవచ్చు. విఫలుడనైపోతానేమోనన్న భయం దానికి ఉదాహరణ. యౌవనస్థులు స్కూల్వర్క్లో లేదా క్రీడల్లో పలాని స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని తల్లిదండ్రులు గానీ ఇతరులుగానీ పెట్టవచ్చు. కానీ అది యౌవనస్థులు చేరుకోలేనంతటి స్థాయిలోని లక్ష్యమై ఉండవచ్చు. ఉదాహరణకు, రీకార్డూ అనే అబ్బాయి వాళ్ళ అమ్మ, ఆయన మీద చాలా పెద్ద ఆశలనే పెట్టుకుంది. ఆయన ఒక డాక్టరవ్వాలనీ, పియానో వాయించడం నేర్చుకోవాలనీ, అనేక భాషలను మాట్లాడడం నేర్చుకోవాలనీ కోరుకుంది. ఈ విధంగా అమిత ఆశలను పెట్టుకుంటే, సమస్యలు తలెత్తుతాయనీ, నిరాశకు గురవ్వాల్సి వస్తుందనీ మీరు అర్థం చేసుకోగల్గుతున్నారా?
పరిపూర్ణతను సాధించాలనే మనస్తత్త్వాన్ని ఎందుకు వదిలిపెట్టాలి?
ఖచ్చితమైన శ్రేష్ఠమైన ప్రమాణాలతో మంచి నాణ్యత గల పనిని చేసేవారికి ఉద్యోగ రంగంలో చాలా డిమాండ్ ఉంది. కనుక ప్రజలు తప్పనిసరిగా పోటీ మనస్తత్వంతో పని చేయవలసిందే. జీవనాధారాన్ని కోల్పోతానేమోనన్న భయమే, అనేకులు మరింత గట్టిగా కృషి చేయడానికి మరొక కారణం. క్రొత్త రికార్డును సంపాదించుకునేందుకు అమిత త్యాగాలు చేసే అథ్లెట్లలాగా ఉంటారు కొంత మంది కార్మికులు. మరింత పోటీ ఎదురైనప్పడు, తాము మరింత తర్ఫీదును పొందేందుకు బలవంతపెట్టబడుతున్నట్లు భావిస్తారు. స్టెరోయిడ్ వంటి రసాయనిక పదార్థాలను ఉపయోగించి తమ సామర్థ్యాలను మెరుగుపరచుకుని గెలుపును సాధించవచ్చని ఆశిస్తారు. ప్రజలు, సాధ్యమైనంత మంచిగా చేయాలని ప్రయత్నించే బదులు, పరిపూర్ణంగా చేయాలన్న అమిత తాపత్రయంతో, “విఫలులమైపోతామేమోనన్న భయంతో” లేదా “నంబర్ ఒన్‌గా మారాలన్న తపనతో” పనిచేస్తున్నారు.—ద ఫీలింగ్ గుడ్ హ్యాండ్‌బుక్.
తాము పాల్గొంటున్న కళా రంగంలో, లేదా క్రీడల్లో తమ సామర్థ్యాలను ఇంకా మెరుగుపరచుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుందని కొందరు భావిస్తారన్నది ఒప్పుకోవలసిందే. అయితే, “పరిపూర్ణతను సాధించవచ్చన్న తలంపు ఎన్నటికీ నెరవేరని నిరీక్షణే” అని డా. రాబర్ట్ ఎస్. ఎలియట్ అభిప్రాయం. “అందులో, అపరాధ భావమూ, తనను తాను రక్షించుకోవాలన్న భావనా, ఎగతాళి చేయబడుతానేమోనన్న భయమూ మిళితమై ఉన్నాయి” అని కూడా ఆయన అంటున్నారు. “కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నది” అని వివేకియైన సొలొమోను రాజు అన్న మాటలు ఎంత నిజమైనవి.—ప్రసంగి 4:4.
మీలో పరిపూర్ణతావాదం కనిపిస్తున్నట్లయితే, మీరు ఏమి చేయగలరు? మీరు అన్ని విషయాల్లోను పరిపూర్ణంగా ఉండాలని ప్రయత్నిస్తున్న కొలది, మీకు మరింత నిరాశ కలుగుతోందా? మీరు పరిపూర్ణతను అమితంగా కోరుకోక, కాస్త నెమ్మదితో ఉండాలని కోరుకుంటున్నారా? మీరు ఒకవైపు పరిపూర్ణతావాదాన్ని వదిలిపెడుతూ, మరొకవైపు, మీ శాయశక్తులా ప్రయత్నించాలని కోరుకోరా? అసలు, పరిపూర్ణంగా ఉండడమంటే ఏమిటి? అపరిపూర్ణులైన మానవులు ఈ అపరిపూర్ణ పరిస్థితుల్లో సహితం, దేవుడు తమకిచ్చిన సామర్థ్యాలను ఉపయోగించి, ఇతరులకు ప్రయోజనం కలిగించేవాటిని కనుగొనగలిగితే, పరిపూర్ణమైన పరిస్థితుల్లో, దైవిక మార్గదర్శనాన్ని అనుసరిస్తూ, ఇంకా ఎంత గొప్ప కార్యాలను సాధించగలరన్నది ఒక్కసారి ఊహించండి !
[4వ పేజీలోని చిత్రం]
తల్లిదండ్రులుగానీ, ఇతరులు గానీ పిల్లలను కోరుతున్నది వాళ్ళు సాధించలేనిదై ఉండవచ్చు