పరిపూర్ణ జీవితం కేవలమొక కల కాదు!
పరిపూర్ణ జీవితం కేవలమొక కల కాదు!
పరిపూర్ణమైన లోకం అంటే ఏమిటి? అంటే, నేరము, మత్తుమందుల దుర్వినియోగం, కరువు, పేదరికం, అన్యాయం మొదలైనవి ఏమీ లేని మానవ సమాజం, భావోద్వేగపరంగాను శారీరకంగాను అందరూ ఆరోగ్యంగా ఉండే సమాజం. అక్కడ ఇక మరణం కూడా ఉండదు, కనుక అక్కడ విచారం కానీ దుఃఖం కానీ ఉండవు. అలాంటి లోకాన్ని ఊహించుకోండి. అలాంటి లోకం కావాలని కోరుకోవడానికి ఆధారమేమైనా ఉందంటారా?
చాలా మంది, విజ్ఞానశాస్త్ర రంగంలోను సాంకేతికశాస్త్ర రంగంలోను కలిగిన అభివృద్ధులను గుర్తిస్తున్నప్పటికీ, ప్రజలందరు శాంతిగా సంతోషంగా జీవించగల పరిపూర్ణమైన లోకం మానవ మేథావిత్వం ద్వారా లేదా జ్ఞానం ద్వారా వస్తుందని నమ్మరు. మరొకవైపు, కార్యాలను మెరుగుపరచాలని, లోపాలను సరిచేయాలని కోరుకోవడమే మానవ నైజమన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఊరికే కలలను కన్నంత మాత్రాన, నిరాశ్రయులను, బీదవాళ్ళను ఆదుకోవడమనేది జరుగదు, అశక్తులు, రోగగ్రస్థులు తమ కష్టాల నుండి విముక్తిని పొందడమూ జరుగదు. పరిపూర్ణతగల లోకం మానవుల ద్వారా ఉనికిలోకి ఎన్నడూ రాదు. ప్రస్తుతం, పరిస్థితులు ఎంతో హృదయ విదారకంగా ఉన్నప్పటికీ, అణచివేత జరుగుతున్నప్పటికీ, పరిపూర్ణమైనది అని మీరు అనగల లోకం దగ్గరపడిందని నమ్మేందుకు కారణాలున్నాయి.
పరిపూర్ణ జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు, యేసు క్రీస్తు జీవితం మీకు జ్ఞాపకం రావచ్చు. భూమిమీద పరిపూర్ణ మానవుడుగా జీవించినది యేసు మాత్రమే కాదు. దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఆదాము హవ్వలు పరదైసులో పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు. అయినప్పటికీ, వాళ్ళు తమ పరలోక తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మూలంగా, ఆ మంచి స్థితిని కోల్పోయారు. (ఆదికాండము 3:1-6) అయితే, సదాకాలం జీవించాలన్న ఆశను నరుల హృదయంలో సృష్టికర్త ఉంచాడు. “దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును [“అనంత కాలాన్ని,” NW] నరుల హృదయమందుంచి యున్నాడు గాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు” అని ప్రసంగి 3:11 సాక్ష్యమిస్తుంది.
పాపము, అపరిపూర్ణత, మానవులను “వ్యర్థ” జీవితానికి నడిపి, ‘నాశనమునకు లోనయిన దాస్యములోకి’ పంపింది. కానీ, “దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా రోమీయులు 8:19-21) మానవ జీవితాన్ని తిరిగి పరిపూర్ణం చేసేందుకు, యేసు క్రీస్తు ద్వారా దేవుడు ఏర్పాట్లు చేశాడని బైబిలు స్పష్టం చేస్తుంది.—యోహాను 3:16; 17:3.
వ్యర్థపరచబడెను” అని అపొస్తలుడైన పౌలు చెప్పిన ఓదార్పుకరమైన మాటలను గమనించండి. (భవిష్యత్తు కొరకైన ఈ అద్భుతమైన నిరీక్షణకు తోడు, ఆధ్యాత్మికంగా అభివృద్ధిని కనబరుస్తూ ముందుకు సాగిపోగల సామర్థ్యం మనకందరికీ ఇప్పుడూ ఉంది.
సహేతుకంగా ఉండడానికి ప్రయత్నించండి
పరిపూర్ణత చాలా ముఖ్యమైనదని యేసు ఎంచాడు కనుకనే, “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మీరూ అలాగే ఉండండి” అని తన ప్రేక్షకులకు చెప్పాడు. (మత్తయి 5:48, పరిశుద్ధ బైబిల్) ప్రస్తుత దుష్ట విధానంలోను మనలో ఏ లోపమూ ఉండకూడదని యేసు కోరుతున్నాడా? అలాగని కాదు. కానీ, ఔదార్యము, తోటి మానవుల మీద దయ, ప్రేమ అనే లక్షణాలను అలవరచుకోవడానికి మనం తప్పకుండా ప్రయత్నించాలి. అయినప్పటికీ, సరైనది చేయడంలో తరచూ విఫలులమౌతుంటాము. “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు” అని యేసు అపొస్తలులలో ఒకరు అన్నారు.—1 యోహాను 1:9, 10.
అయినప్పటికీ, మనల్ని మనం దృష్టించుకునే తీరునూ, ఇతరులతో వ్యవహరించే తీరునూ మెరుగుపరచుకోవచ్చు. మనం మరీ అమితంగా కోరుకోకుండా ఉండవచ్చు. సమతుల్యమైన, సహేతుకమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు దేవుని వాక్యమైన బైబిలులో ఇవ్వబడిన నిర్దేశాల కన్నా మేలైన నిర్దేశాలను ఎవరు ఇవ్వగలరు? ఆనందం, మితత్వం మొదలైన లక్షణాలను అలవరచుకుంటే, మనం ఇతరులతో సర్దుకుపోవడానికి, వైవాహిక జీవితంలో ఒకరితోనొకరు సర్దుకుపోవడానికి, మన తల్లిదండ్రులతో గానీ పిల్లలతోగానీ సరైన విధంగా వ్యవహరించడానికి వీలవుతుంది. “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి” అని అపొస్తలుడైన పౌలు బోధించాడు.—ఫిలిప్పీయులు 4:4, 5.
సహేతుకంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు
మీరు వేటినైనా అమితంగా ఎదురు చూడనప్పుడు, మిమ్మల్ని మీరు వేధించుకునేలా మిమ్మల్ని మీరు కించపరచుకునేలా చేసే పరిపూర్ణతావాదాన్ని అధిగమించినప్పుడు మీకూ, ఇతరులకూ ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి మీకున్న సామర్థ్యమేమిటో తెలుసుకొని ఉండడమంటే, మీరు వాస్తవిక దృష్టిని కలిగి ఉండడమనీ, మీరు చేయాలనుకునే పనుల గురించి మీరు సమతుల్యమైన దృక్పథం కలిగివుండడమనీ భావం. దేవుడు మనలను సృష్టించినది మనం భూమి మీద జీవిస్తూ, మనకూ ఇతరులకూ ప్రయోజనకరంగా ఉండే అర్థవంతమైన పనుల్లో మనం సంతృప్తిని పొందేందుకేనని గుర్తుంచుకోండి.—ఆదికాండము 2:7-9.
మీ నుండి మీరు అతిగా కోరుకుంటున్నట్లయితే, దాని విషయమై ఎందుకు యెహోవా వైపుకు మరలి ప్రార్థన చేయకూడదు? మీరు దైవ ప్రీతిని సంపాదించుకున్నప్పుడు మీకు ఎంతో ఊరట కలుగుతుంది. మనం ఎలా రూపొందామన్నదీ ఆయనకు తెలుసు, మన అపరిపూర్ణ పరిస్థితీ ఆయనకు తెలుసు. ఆయన సహేతుకత లేనివాడూ కాడు, మనం ఆయనను ప్రీతిపరచలేమనీ కాదు. “తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు” అని కీర్తన రచయిత మనకు హామీ ఇస్తున్నాడు. (కీర్తన 103:13, 14) దేవుడు మానవులతో అంత కరుణాపూర్వకంగా వ్యవహరిస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమై ఉండాలి ! ఆయనకు మన పరిమితులు తెలిసినప్పటికీ, మనం ఆయన దృష్టిలో ప్రియమైన పిల్లలంత అమూల్యమైనవాళ్ళమే.
ప్రతీదీ పరిపూర్ణంగా ఉండాలని అమితంగా ప్రయత్నించే బదులు, ఆధ్యాత్మిక వివేచననూ, సమతుల్యమైన దృష్టినీ పెంపొందించుకోవడం ఎంత వివేకం ! అంతేకాక, దేవుని రాజ్యం క్రింద మానవజాతిని పరిపూర్ణతకు తీసుకురావాలన్న తన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో యెహోవాను ఎవరూ ఆపలేరని మనం నమ్మకం కలిగి ఉండవచ్చు. అయితే, మానవ పరిపూర్ణత అంటే ఏమిటి?
పరిపూర్ణ జీవితం పరిపూర్ణతను సాధించవచ్చనే మనస్తత్త్వానికన్నా మిన్నయైనది
పరిపూర్ణత అంటే, పరిపూర్ణతావాదిగా ఉండడమని కాదు. కాబట్టి, దేవుని రాజ్యం క్రింద పరదైసు భూమిపై జీవించే ఆధిక్యతను పొందే ప్రజలు, తమ నుండి గానీ ఇతరుల నుండి గానీ అతిగా కోరుకోరు, స్వనీతిమంతులైన వ్యక్తులుగా ఉండరు. అపొస్తలుడైన యోహాను వర్ణించిన అంతర్జాతీయ సమూహము, “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని” వ్యక్తీకరించినట్లుగా, విమోచన క్రయధనం విషయమై హృదయపూర్వక మెప్పుదల కలిగి ఉండడం మహాశ్రమలను దాటేందుకు ఆవశ్యకము. (ప్రకటన 7:9, 10, 14) రానున్న మహాశ్రమలను దాటేవారందరూ, క్రీస్తు తమ కోసం, ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని జీవితంలో అన్వయించుకునేవారందరి కోసం ఇష్టపూర్వకంగా చనిపోయినందుకు కృతజ్ఞులై ఉంటారు. మనం మన అపరిపూర్ణతల నుండి బలహీనతల నుండి శాశ్వతంగా విముక్తులమయ్యేందుకు ఆధారం ఆయన ప్రేమపూర్వకంగా అర్పించిన బలే.—యోహాను 3:16; రోమీయులు 8:21, 22.
పరిపూర్ణ జీవితం అంటే ఎలా ఉంటుంది? పోటీ మనోభావానికీ, ప్రసిద్ధిగాంచాలన్న స్వార్థ కోరికలకు బదులు, మానవుల మధ్య ఉండే ప్రేమా, దయా జీవితాన్ని జీవించదగినదిగా చేస్తాయి. అవి, చింతనూ ఆత్మన్యూనతా భావాన్నీ తీసివేస్తాయి. అయితే, పరిపూర్ణ జీవితం విసుగు పుట్టించేదిగా గానీ, యాంత్రికంగా గానీ ఉండదు. పరదైసును గురించిన అన్ని వివరాలను బైబిలు ఇవ్వడం లేదు గానీ, మనం అక్కడ ఎలాంటి జీవితాన్ని ఎదురు చూడవచ్చన్నది తెలుపుతుంది. “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు ఆపాయము నొందుటకై పిల్లలను కనరు” అని అది చెబుతుంది.—యెషయా 65:21-23.
ఎలాంటి వినోదాలను, షాపింగ్ సౌకర్యాలను, సాంకేతిక లేదా రవాణ సౌకర్యాలను దేవుని రాజ్యం ఇస్తుందని ఆలోచించే బదులు, “తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు” అన్న ప్రవచనం నెరవేరే కాలంలో మీరు జీవితాన్ని ఎలా అనుభవిస్తారన్నదాన్ని ఊహించుకోండి. (యెషయా 65:25) పరిపూర్ణ జీవితం, నేటి జీవితానికి ఎంత భిన్నంగా ఉంటుంది ! ఆ కాలంలో, జీవించడానికి యోగ్యులుగా ఎంచబడే వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ప్రేమగల మీ పరలోక తండ్రి మీ మీదా మీ కుటుంబం మీదా ఆసక్తి చూపిస్తాడని మీరు నమ్మడానికి మీకు కారణముంటుంది. “యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.”—కీర్తన 37:4.
పరిపూర్ణ జీవితం కేవలమొక కల కాదు. మానవజాతిని గురించిన యెహోవా యొక్క ప్రేమపూర్వకమైన ఉద్దేశం పూర్తిగా నెరవేరుతుంది. దేవుని క్రొత్త లోకంలో మానవులు పరిపూర్ణతను చేరుకుని, సదాకాలం జీవిస్తారు. అలాంటివారిలో మీరూ మీ కుటుంబ సభ్యులూ ఉండవచ్చు. “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అని బైబిలు ప్రవచిస్తోంది.—కీర్తన 37:29.
[6వ పేజీలోని చిత్రం]
పరిపూర్ణతను సాధించాలనే మనస్తత్త్వాన్ని లేదా చిన్న పొరపాటుకైనా చికాకుపడే స్వభావాన్ని వదిలిపెట్టి, మనం మనల్నీ ఇతరుల్నీ దృష్టించే విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చు
[7వ పేజీలోని చిత్రం]
పరదైసులో ప్రశాంతంగా నీతియుక్తంగా ఉండే పరిస్థితుల్లో మీరు ఇప్పుడే జీవిస్తున్నట్లు ఎందుకు ఊహించి చూడకూడదు?