కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పవిత్ర సేవను చెల్లించుమని గిలియడ్‌ యొక్క 108వ తరగతికి ఉద్బోధ

పవిత్ర సేవను చెల్లించుమని గిలియడ్‌ యొక్క 108వ తరగతికి ఉద్బోధ

పవిత్ర సేవను చెల్లించుమని గిలియడ్‌ యొక్క 108వ తరగతికి ఉద్బోధ

బైబిలులో దేవుని ఆరాధనను సూచించేటప్పుడు, తరచు “పవిత్ర సేవ” అన్న మాటను ఉపయోగించడం జరిగింది. దేవునికి చెల్లించే సేవను గురించి సూచిస్తున్నప్పుడు వాడబడిన ఒక గ్రీకు పదం నుండి ఈ మాట వచ్చింది. (రోమీయులు 9:4, NW) యెహోవా దేవునికి అంగీకారయుక్తమైన ఈ పవిత్ర సేవను ఎలా చేయవచ్చనే విషయంలో ఆచరణయుక్తమైన సలహాలను, వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 108వ తరగతి స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగీకులు అందిస్తుండగా దానికి హాజరైన 5,562 మంది విన్నారు. *

యెహోవాసాక్షుల పరిపాలక సభలోని సభ్యుడైన థియోడోర్‌ జారజ్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఈ కార్యక్రమం “మన తండ్రి నామం” అనే పేరుగల 52వ గీతంతో ప్రారంభమైంది. ఆ గీతంలోని రెండవ చరణం ఇలా సాగుతుంది: “నీ అనుపమానమైన నామాన్ని పవిత్రపర్చటానికైన మార్గాల్ని మేము అన్వేషిస్తుంటాము.” పట్టభద్రుల హృదయపూర్వకమైన అభిలాష ఈ గీతంలో చక్కగా వ్యక్తం చేయబడింది. 10 దేశాల నుండి వచ్చిన ఈ విద్యార్థులు తాము పొందిన శిక్షణను తమ తమ మిషనరీ నియామకాల్లో ఉపయోగించాలని ఎంతో కోరికతో ఉన్నారు. వీరు 17 వేర్వేరు దేశాలకు పంపించబడనైయున్నారు.

తన తొలి పలుకుల్లో సహోదరుడు జారజ్‌, విద్యార్థులు ఐదు నెలలపాటు బైబిలులో పొందిన లోతైన శిక్షణపై దృష్టి నిలిపారు. దీనితో విదేశీ క్షేత్రాల్లో సేవచేసేందుకు వారు సంసిద్ధులయ్యారు. అంతేకాదు, వారు “సమస్తమును పరిశీలించి,” అంటే తాము మునుపు నేర్చుకున్నవాటిని దేవుని వాక్య వెలుగులో నిశితంగా పరీక్షించి, ‘మేలైనదానిని చేపట్టేందుకు’ వారికి సహాయం అందింది. (1 థెస్సలొనీకయులు 5:21) వారు యెహోవాకు, ఆయన వాక్యానికి, తాము ఏ నియామకాల కోసమైతే శిక్షణ పొందారో, వాటికి విశ్వసనీయంగా అంటిపెట్టుకుని ఉండాలని సహోదరుడు జారజ్‌ ప్రోత్సహించారు. ఇవన్నీ చేస్తుండగా వారికి ఏమి సహాయపడుతుంది?

పవిత్ర సేవను చేయటానికి ఆచరణయుక్తమైన సలహాలు

బేతేలు కార్యవ్యవహారాల కమిటీ సభ్యుడైన లాన్‌ షిల్లింగ్‌ “మీరు సహేతుకతా పరీక్షలో సఫలులౌతారా?” అనే అంశంపై ప్రసంగించారు. ఆయన దైవిక బుద్ధిని ప్రతిబింబించే లక్షణమైన సహేతుకతను ప్రదర్శించాల్సిన అవసరాన్ని ఉన్నతపర్చారు. (యాకోబు 3:17, NW) సహేతుకంగా ఉండడంలో అవతలి వ్యక్తి చెప్పినదానికి సమ్మతించడం, నిష్పాక్షికంగా మితంగా ఉండడం, ఇతరులపట్ల పరిగణనతో సహనంతో ఉండడం ఇమిడివుంది. “సహేతుకంగా ఉండేవారు తాము ఇతరులతో వ్యవహరించేటప్పుడు సమతుల్యంగా ఉంటారు. వారు అతిగా పోరు” అని సహోదరుడు షిల్లింగ్‌ అన్నారు. ఒక మిషనరీ సహేతుకంగా ఉండటానికి ఏమి సహాయపడుతుంది? తనను గురించి తాను ఎక్కువగా ఊహించుకోకుండా ఇతరులు చెప్పేది వినటానికీ వారి నుండి నేర్చుకోవటానికీ సుముఖత చూపించడం, అలాగే దైవిక సూత్రాలతో రాజీపడనంత మేరకు ఇతరుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడం వంటివి సహాయపడగలవు.—1 కొరింథీయులు 9:19-23.

“ఆహారం మర్చిపోవద్దు !” అనేది కార్యక్రమంలోని తర్వాతి అంశం, దీన్ని పరిపాలక సభలోని మరో సభ్యుడు సామ్యుల్‌ హెర్డ్‌ అందించారు. పవిత్ర సేవను చేసే స్థితిలో ఉండేందుకు గాను ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా తీసుకోవటంలోని విలువను ఆయన నొక్కిచెప్పారు. “మీ ప్రకటనా బోధనా నియామకంలోకి దూకిన వెంటనే మీ ఆధ్యాత్మిక కార్యకలాపాలు త్వరితగతిన పెరుగుతాయి” అని సహోదరుడు హెర్డ్‌ అన్నారు. “అందుకని, మీ నైపుణ్యాలను సమతూకపర్చటానికీ సమన్వయపర్చటానికీ మీరు మరింత ఎక్కువగా ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవలసిన అవసరం ఉంది” అని అన్నారాయన. ఒక మిషనరీ ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమబద్ధంగా తీసుకుంటూ ఉంటే అప్పుడు, ఆధ్యాత్మిక కృంగుదలనూ ఇంటిమీద బెంగనూ నివారించగలడు. అది, తన పవిత్ర సేవా నియామకానికి కట్టుబడి ఉండాలన్న తీర్మానానికీ అందులోని ఆనందానికీ దోహదపడుతుంది.—ఫిలిప్పీయులు 4:13.

“మూలమెక్కడ ఉందో అక్కడికే మరలండి” అని పట్టభద్రులౌతున్న విద్యార్థులను గిలియడ్‌ తరగతిలోని ఒక ఉపదేశకుడైన లారెన్స్‌ బౌవెన్‌ ప్రోత్సహించారు. ఆయన ఉద్దేశం ఏమిటి? ప్రేక్షకులందర్నీ తమ బైబిళ్ళను సామెతలు 1:7కి తిప్పమని ఆయన అడిగారు, అక్కడిలా ఉంది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము.” అప్పుడు ఆయనిలా వివరించారు: “యెహోవా ఉన్నాడన్న ప్రాథమిక వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోవటానికి తిరస్కరించే ఏ మూలమైనా అసలైన జ్ఞానము కాలేదు, అసలైన తెలివి కాలేదు.” సహోదరుడు బౌవెన్‌, ఎన్నెన్నో వివరణలున్న దేవుని వాక్యమైన బైబిలును, ముక్కలు ముక్కలుగా ఉన్న ఒక చిత్రంతో పోల్చారు. ముక్కలన్నింటినీ ఒక్కచోట సరిగ్గా పేర్చినప్పుడు చిత్రం ఏర్పడుతుంది. ఎన్ని ముక్కల్ని దగ్గర చేరిస్తే, చిత్రం అంత పెద్దగా, స్పష్టంగా మారుతుంది, అలాగే దాన్ని చూస్తున్న వ్యక్తిలో అంతగా మెప్పుదలా ఏర్పడుతుంది. ఇది దేవునికి పవిత్ర సేవను చేసేందుకు అందరికీ సహాయపడుతుంది.

గిలియడ్‌ స్కూలు రిజిస్ట్రార్‌ అయిన వాలెస్‌ లివరెన్స్‌ ఈ ప్రసంగాల పరంపరలో చివరిగా మాట్లాడారు. ఆయన అంశం, “దేవునికి మీ కృతజ్ఞతల్ని బలియాగాలుగా అర్పించండి.” యేసు పదిమంది కుష్ఠరోగుల్ని స్వస్థపర్చడం గురించి ఆయన చెప్పారు. (లూకా 17:11-19) వారిలో ఒక్క వ్యక్తి మాత్రమే దేవునికి స్తుతులు చెల్లించటానికీ యేసుకు కృతజ్ఞతలు చెప్పటానికీ తిరిగివచ్చాడు. “మిగతావారు బాగైనందుకు అత్యానందంతో ఉన్నారనడంలో సందేహం లేదు. తాము పరిశుద్ధులైనందుకు ఆనందించారు, కానీ వారిక్కావాల్సిందల్లా యాజకుడు తమను పవిత్రులని నిర్ణయించడమేనని అన్పిస్తుంది” అని సహోదరుడు లివరెన్స్‌ వ్యాఖ్యానించారు. సత్యాన్ని నేర్చుకోవడం వల్ల ఏర్పడిన ఆధ్యాత్మిక పవిత్రతా అలాగే కృతజ్ఞతాభావమూ దేవుని మంచితనం పట్ల ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేందుకు మనల్ని పురికొల్పాలి. దేవునిపట్ల తమకున్న కృతజ్ఞతాభావం తమ సేవలోనూ బలియాగాల్లోనూ ప్రతిబింబించాలంటే వారు దేవుని కార్యాలన్నింటిపైనా ఆయన మంచితనమంతటిపైనా ధ్యానించాలని గిలియడ్‌ యొక్క 108వ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహం అందింది.—కీర్తన 50:14, 23; 116:12, 17.

ఎలా ప్రతిఫలించాలో చూపించటానికి అనుభవాలు, ఇంటర్వ్యూలు

గిలియడ్‌లోని మరో ఉపదేశకుడైన మార్క్‌ న్యూమర్‌ కార్యక్రమంలోని తర్వాతి భాగాన్ని నిర్వహించారు. ఇందులో విద్యార్థులు తమ శిక్షణా కాలంలో పొందిన క్షేత్ర సేవానుభవాలు ఉన్నాయి. ఈ తరగతిలోని విద్యార్థులు గిలియడ్‌కి రాకముందు సగటున 12 సంవత్సరాలు పూర్తికాల సేవలో గడిపారు. స్కూల్లో ఉండగా వారు వేర్వేరు నేపథ్యరంగాలకు చెందిన అనేకమందితో బైబిలు పఠనాలు ప్రారంభించారు, ఇలా ‘అందరికి అన్నివిధముల వారిగా’ ఎలా ఉండాలో తమకు తెలుసునని నిరూపించుకున్నారు.—1 కొరింథీయులు 9:22.

విద్యార్థుల అనుభవాల తరువాత చార్లెస్‌ మాలోహన్‌, విలియమ్‌ సామ్యుల్సన్‌లు గిలియడ్‌కి హాజరైన బేతేలు కుటుంబ సభ్యుల్లోని కొందరినీ ప్రయాణపైవిచారణకర్తల్లో కొందరినీ ఇంటర్వ్యూ చేశారు. వారిలో ఒకరైన రాబర్ట్‌ పెవీ గిలియడ్‌ యొక్క 51వ తరగతి నుండి పట్టభద్రులై ఫిలిప్పీన్స్‌లో సేవచేశారు. ఆయన విద్యార్థులకు ఇలా గుర్తుచేశారు: “ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, దాన్నెలా పరిష్కరించాలో అందరూ సలహాలిస్తారు. కొన్నిసార్లు ఒకరి సలహాను మరొకరి సలహా మించిపోతుంటుంది, మరింత గొప్ప సలహా ఇచ్చేవారు ఎవరో ఒకరు ఎప్పుడూ ఉంటూ ఉంటారు. కానీ మీరు బైబిలులో గనుక వెదికితే, పలాని విషయాన్ని దేవుడు ఎలా దృష్టిస్తున్నాడో తెలుసుకోవటానికి గనుక ప్రయత్నిస్తే అప్పుడు దాన్నెవరూ జయించలేరు. అన్ని సమయాల్లోను అదే సరైన పరిష్కారమౌతుంది.”

ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ముగిస్తూ పరిపాలక సభ సభ్యుడైన జాన్‌ బార్‌ “యెహోవాకు అంగీకారయుక్తమైన పవిత్ర సేవను చెల్లించండి” అనే అంశంపై మాట్లాడారు. దేవుణ్ణి అంగీకారయుక్తంగా ఆరాధించటానికి ప్రజలకు తమ క్షేత్ర సేవ ద్వారా ఎలా సహాయం చేయవచ్చో, అది పవిత్ర సేవ ఎలా అవుతుందో ఆయన చూపించారు. మత్తయి 4:10 లోని యేసు మాటలవైపుకి త్రిప్పి సహోదరుడు బార్‌, “మనం యెహోవాను మాత్రమే ఆరాధించాలంటే, అందుకు అన్ని రకాల విగ్రహారాధనను విసర్జించాలి. అందులో విగ్రహారాధనా లక్షణాలైన లోభత్వం, సొమ్ముల్ని కూడగట్టుకోవాలన్న ఆశ, తనను తాను హెచ్చించుకోవాలన్న కోరిక వంటివి కూడా ఉన్నాయి. ఈ విషయంలో 1940ల నుండీ కూడా అద్భుతమైన చరిత్రను కలిగివున్న మన మిషనరీల గురించి తలపోయడం ఎంత ఆనందదాయకంగా ఉందో కదా ! 108వ తరగతి నుండి పట్టభద్రులైన మీరు కూడా వారి మంచి మాదిరిని అనుకరిస్తారని మా దృఢ నమ్మకం. మీరు యెహోవాకు పవిత్ర సేవను చేయబోతున్నారు, దాన్ని పొందటానికి ఆయన మాత్రమే అర్హుడు.”

ఎంతో క్షేమాభివృద్ధిని కలుగజేసిన కార్యక్రమమంతటినీ ఆ ప్రసంగం మంచి ప్రోత్సాహంతో ముగించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషుల అభినందనలను వినడానికి సమయం అయ్యింది. తర్వాత డిప్లొమాలను అందించడం, విద్యార్థులు తాము పొందిన శిక్షణపట్ల ప్రసంశను వ్యక్తం చేస్తూ వ్రాసిన ఉత్తరాన్ని చదవడం జరిగింది. విద్యార్థులు యెహోవా సేవలో తమ నియామకాల్ని దీక్షతో నిర్వర్తించాలన్న ఉద్బోధ అందించడం జరిగింది. హాజరైన వారందరూ, 25 దేశాల నుండి వచ్చిన అతిథులందరూ చివర్లో పాట పాడిన తర్వాత, ప్రార్థనతో కార్యక్రమం ముగిసింది.

[అధస్సూచి]

^ పేరా 1 ఈ కార్యక్రమం 2000, మార్చి 11న న్యూయార్క్‌లోని ప్యాటర్సన్‌ వద్ద ఉన్న వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో జరిగింది.

[23వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంకాలు

ప్రాతినిధ్యం వహించబడిన దేశాలు: 10

నియమించబడిన దేశాలసంఖ్య: 17

విద్యార్థుల సంఖ్య: 46

సరాసరి వయస్సు: 34

సత్యంలో ఉన్న సగటు సంవత్సరాలు; 16

పూర్తికాల పరిచర్యలో ఉన్న సగటు సంవత్సరాలు: 12

[24వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 108వ తరగతి

ఈ క్రింద ఉన్న లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోని పేర్లు ఎడమ నుండి కుడికి ఉన్నాయి.

(1) ఆమడోరీ, ఇ.; కుక్‌, ఓ.; బర్న్‌, ఎమ్‌.; లీ, ఎ. (2) న్యూసమ్‌, డి.; పెడర్‌ట్సోల్లి, ఎ.; బీగ్రా, హెచ్‌.; కాటో, టి.; గేట్‌వుడ్‌, డి. (3) ఈడ్‌, డి.; ఈడ్‌, జె.; వెల్స్‌, ఎస్‌.; జేమిసన్‌, జె.; గోన్సాలెస్‌, ఎమ్‌.; గోన్సాలెస్‌, జె. (4) కాటో, టి.; లాన్‌, డి.; నిక్లాస్‌, వై.; ప్రైస్‌, ఎస్‌.; ఫోస్టర్‌, పి.; ఈబారా, జె. (5) ఆమడోరి, ఎమ్‌.; మాన్నింగ్‌, ఎమ్‌.; జేమ్స్‌, ఎమ్‌.; బాస్ట్రూమ్‌, ఎ.; గేట్‌వుడ్‌, బి.; న్యూసమ్‌, డి. (6) ఫోస్టర్‌, బి.; జేమిసన్‌, ఆర్‌.; హైఫింగర్‌, ఎ.; కోఫెల్‌, సి.; కోఫెల్‌, టి.; బర్న్‌ జి. (7) హైఫింగర్‌, కె.; మాన్నింగ్‌, సి.; కుక్‌, జె.; బాస్ట్రూమ్‌, జె.; లాన్‌, ఇ.; పెడర్‌ట్సోల్లి, ఎ. (8) జేమ్స్‌. ఎ.; వెల్స్‌, ఎల్‌.; ప్రైస్‌, డి.; నిక్లాస్‌, ఇ.; లీ, ఎమ్‌.; ఈబారా, పి.; బీగ్రా, వై.